1. నెబుకద్నెసరు రాజు నేనెవె పట్టణమును రాజధానిగా చేసికొని అస్సిరియా రాజ్యమును పరిపాలించుచున్న సమయములో అర్ఫక్షదు రాజు ఎక్బటానా నగరమును రాజధాని గావించుకొని మాదియా దేశమును ఏలుచుండెను.
2. ఇతడు ఎక్బటానా చుట్టును చెక్కిన రాళ్ళతో ప్రాకారమును కట్టించెను. ఒక్కొక్క రాయి నాలుగున్నర అడుగుల మందము, తొమ్మిది అడుగుల పొడవు కలిగియుండెను. ప్రాకా రము ఎత్తు 105 అడుగులు. వెడల్పు 75 అడుగులు.
3. అతడు ప్రాకారద్వారములవద్ద బురుజులు నిర్మించెను. ఒక్కొక్క బురుజు ఎత్తు 150 అడుగులు. ఒక్కొక్కదాని పునాది వెడల్పు 90 అడుగులు.
4. ఒక్కొక్క ద్వారము ఎత్తు 105 అడుగులు, వెడల్పు 60 అడుగులు. ఆ ద్వారములగుండ అతని సైన్యమంత ఒక్కసారిగా దాటి పోగలదు. అతని కాల్బలము కూడ బారులుతీరి సాగి పోగలదు.
5. నెబుకద్నెసరు రాజు తన పరిపాలనా కాలము పండ్రెండవయేట అర్ఫక్షదుతో యుద్ధము ప్రారంభించెను. రాగీసు నగరము ప్రక్కనున్న పెద్దమైదానమున పోరు జరిగెను.
6. ఆ యుద్ధమున చాలజాతులు అర్పక్షదును బలపరచిరి. కొండభూములలో వసించువారు, తిగ్రీసు, యూఫ్రటీసు, హిడాస్పిసు నదీతీరములందు వసించువారు, ఏలాము రాజగు అర్యోకు పరిపాలన క్రింద మైదానములలో వసించువారు అర్ఫక్షదుతో చేరిరి. ఆ రీతిగా ఆ యుద్ధమున చాలజాతులు కల్దీయుల రాజుతో చేతులు కలిపిరి.
7-8. అస్సిరియా రాజు నెబుకద్నెసరు పర్షియా దేశమునకు, పశ్చిమమున నున్న సిలీషియాకును, దమస్కుకును, లెబానోనుకును, ముందటి లెబానోను దేశములకును, సముద్రతీర దేశములకును, కర్మెలు పట్టణమునకును, గిలాదు, ఉత్తరపు గలిలీ దేశములకును, ఎస్ట్రలోను మైదానమునకును దూతలను పంపెను.
9-10. మరియు అతడు సమరియా దేశమునకును, దాని పరిసర నగరములకును, యోర్దాను నదికి పశ్చిమమున నున్న సుదూర నగరములగు యెరూషలేము, బెతని, కేలోసు, కాదేషులకును, ఐగుప్తు నదీ సరిహద్దులకును, ఐగుప్తు నగరములగు గోషేను ప్రాంతాలైన తహపనేసు, రామెసేసు, తనీసు, మెంఫీసులకును, ఇతియోపియా సరిహద్దుల వరకును వ్యాపించియున్న ఐగుప్తు మండలములకును దూతలను పంపెను.
11. కాని ఈ ప్రజలెల్లరు నెబుకద్నెసరు ఆజ్ఞను త్రోసిపుచ్చి అతని పక్షమున పోరాడుటకు నిరాకరించిరి. వారు ఆ రాజు ఒంటరివాడయ్యెనని తలంచి అతనిని లక్ష్య ముచేయరైరి. అతడు పంపిన దూతలు తమ పనిని సాధింపజాలక అవమానములకు గురియై తిరిగి వచ్చిరి.
12. కనుక నెబుకద్నెసరు ఈ రాజ్యముల మీద ఆగ్రహము చెందెను. అతడు ఈ దేశములమీద పగ తీర్చుకొందునని తన రాజ్యము పేరుమీద, తన సింహాసనము పేరుమీద శపథము చేసెను. సిలీషియా, దమస్కు సిరియా, మోవాబు, అమ్మోను, యూదా, ఐగుప్తు, రెండు సముద్రముల తీరము వరకు వ్యాపించియున్న దేశములన్నిటిని కత్తితో హతము చేయుదునని ప్రతిజ్ఞ చేసెను.
13. నెబుకద్నెసరు తన పరిపాలనాకాలము పదునేడవయేట సైన్యముతో పోయి అర్పక్షదును ఎదిరించెను. అతడు శత్రువు రథబలమును, అశ్వబలమును, సైన్యమునంతటిని చెల్లాచెదరుచేసెను.
14. అతని నగరములను ఆక్రమించుకొనెను. ఎక్బటానా నగరమునుకూడ ముట్టడించి దాని బురుజులను వశము చేసికొనెను. నగరములోని అంగళ్ళను కొల్లగొట్టెను. వైభవోపేతముగానున్న ఆ పట్టణమును పాడుచేసెను.
15. అటుతరువాత అర్పక్షదునుకూడ రాగీసు కొండలలో పట్టుకొని ఈటెలతో పొడిచి చంపెను.
16. తదనంతరము కొల్లసొమ్ము ప్రోగుజేసికొని స్వీయసైన్యముతోను, తనతో చేరిన ఇతర సైన్యములతోను నేనెవెకు తిరిగివచ్చెను. అచట నాలుగు నెలలపాటు రాజును, సైనికులును సంతసముతో, విశ్రాంతితో విందులు చేసికొనిరి.
1. నెబుకద్నెసరు తన పరిపాలనాకాలము పదునెనిమిదవ యేట మొదటినెల ఇరువది రెండవదినమున, యుద్ధములో తనకు తోడ్పడని వారందరి మీదను, తాను పూర్వము నిశ్చయించుకొనినట్లే పగ తీర్చుకొనుటకు పూనుకొనెను.
2. అతడు తన సైన్యాధిపతులను, అధికారులను పిలిపించి రహస్యాలోచన జరిపెను. తన ఆజ్ఞను త్రోసిపుచ్చిన వారందరిని శిక్షింప వలెనని చెప్పెను.
3. అతడును, అతని ఉద్యోగులును యుద్ధమున తోడ్పడని వారినందరిని మట్టుపెట్టవలెనని నిశ్చయించుకొనిరి. రాజు యుద్ధమునెట్లు నడపవలెనో సూచించెను.
4. మంత్రాలోచన ముగిసిన పిదప నెబుకద్నెసరు హోలోఫెర్నెసును పిలిపించెను. అతడు రాజు సర్వసైన్యాధిపతి. దేశమునకు రాజు తరువాత రెండవ అధికారి.
5. నెబుకద్నెసరు అతనితో ఇట్లు చెప్పెను: “సర్వ భూలోకాధిపతియైన చక్రవర్తి నీతో ఇట్లనుచున్నాడు. నీవు పోరున కాకలుతీరిన యోధులను ఎన్నుకొనుము. లక్ష ఇరువదివేల కాల్బలమును, పండ్రెండువేల ఆశ్విక దళమును సమకూర్చుకొనుము.
6. ఈ బలముతో పోయినా పిలుపును పెడచెవిని పెట్టిన పశ్చిమ దేశములమీద పడుము.
7. వారు నాకు లొంగిపోయిరి అనుటకు చిహ్నముగా నా దండయాత్రకు సకల సదుపాయములను సిద్ధము చేయవలెనని చెప్పుము. వారు నా కోపమును తప్పక చవిచూతురని, నా సైన్యములు వారి భూమినెల్ల ఆక్రమించి, వారిని దోచుకొనెదరనియు తెలియచేయుము.
8. ఆ దేశములందలిలోయలు వారి క్షతగాత్రులతో నిండిపోవును. అచటి నదులకును, వాగులకును వారి పీనుగులు అడ్డుపడగా అవి అంచులవర పొంగిపారును.
9. యుద్ధమున చావక మిగిలిన వారిని నేను ప్రపంచపు అంచుల వరకును బందీలనుగా కొనిపోవుదును.
10. ఓయి! నీవు వెంటనే పోయి నా పేరు మీదుగా ఈ దేశములనెల్ల జయింపుము. ఆ ప్రజలలో నీకు లొంగినవారిని ప్రాణములతో వదలివేయుము. తరువాత నేను వారిని శిక్షింతును.
11. కాని నిన్నెదిరించువారిని మాత్రము నిర్దయతో మట్టు పెట్టుము. నీ అధికారమునకు అప్పగింపబడిన దేశములనెల్ల కొల్లగొట్టుము.
12. నా ప్రాణముమీదను, నా రాజ్యముమీదను శపథముచేసి చెప్పుచున్నాను వినుము. నేను చెప్పినదంత జరిగించి తీరుదును.
13. నీ మట్టుకు నీవు నీ ప్రభుడనైన నా ఆజ్ఞలలో ఒక్క పొల్లయినను మీరరాదు. ఇక జాగుచేయక నేనాజ్ఞాపించినట్లే సమస్తమును నిర్వహింపుము.”
14. హోలోఫెర్నెసు రాజు సమ్ముఖము నుండి వెడలిపోయి తన సైన్యాధిపతులను, అధికారులను పిలువనంపెను.
15. రాజు ఆజ్ఞాపించినట్లే లక్ష యిరువదివేల కాలిబంటులను, పండ్రెండువేల విలుకాండ్రను ప్రోగుచేసి కొనెను. వారెల్లరు పోరున ఆరితేరినవారు.
16. అతడువారినెల్లరిని బారులు తీర్చెను.
17. మరియు అతడు బరువులు మోయుటకు చాల ఒంటెలను, గాడిదలను, కంచర గాడిదలను ప్రోగుచేసికొనెను. భోజనమునకుగాను చాల మేకలను, పొట్టేళ్ళను, ఎడ్లను చేకూర్చుకొనెను.
18. ప్రతి సైనికునికివలసినంత దారిబత్తెము నిచ్చిరి. రాజు కోశాగారమునుండి వెండి బంగారములు పంచియిచ్చిరి.
19. ఆ రీతిగా హోలోఫెర్నెసు అతని సైన్యములు రాజుకంటె ముందుగా యుద్ధమునకు బయలుదేరెను. వారు రథములతో, రౌతులతో, కాలిబంటులతో పశ్చిమ దేశముల మీద దాడిచేయబోయిరి.
20. వారి వెనుక ఇతరజనులు వెళ్ళిరి. మిడుతల దండువలెను, ఇసుక రేణువులవలెను వారి సైన్యము అసంఖ్యాకముగానుండెను.
21. వారు నీనెవెనుండి బయలుదేరి మూడు నాళ్ళు ప్రయాణముచేసి సిలీషియాకు ఉత్తరముననున్న పర్వతములలోని బేక్టీలెత్తు మైదానమున విడిది చేసిరి.
22. అచటినుండి హోలోఫెర్నెసు తన కాలిబంటులతోను, రౌతులతోను, రథములతోను కొండభూముల లోనికి ప్రయాణముచేసెను.
23. అతడు లిబియా, లూదియా దేశములను నాశనము చేసెను. కెలియోను దేశపు అంచున ఎడారి సరిహద్దులలో వసించు రస్సీయులను, యిష్మాయేలీయులను దోచుకొనెను.
24. అచటినుండి యూఫ్రటీసు నదిని దాటి మెసపొటామియా గుండ ప్రయాణము చేసి అబ్రోను నదీతీరమున సము ద్రము వరకుగల సురక్షిత పట్టణములనెల్ల నాశనము చేసెను.
25. సిలీషియా మండలమును ప్రవేశించి అచట తనను ఎదిరించినవారినందరిని చిత్రవధ చేసెను. అరాబియా చెంతగల యాఫేతు దక్షిణపు పొలిమేరల వరకును దాడి చేసెను.
26. మిద్యానీయులను ముట్టడించి వారి గుడారములను తగులబెట్టి, వారి గొఱ్ఱెల మందలను హతము చేసెను.
27. అటుపిమ్మట అతడు దమస్కు మైదానములలోనికి పోయెను. అది గోధుమపైరునకు పంటకాలము. అతడు అచటి పంట పొలములను తగులబెట్టెను. గొఱ్ఱెల మందలను, పశువుల మందలను పాడుచేసెను. పట్టణములను దోచుకొనెను. పల్లెపట్టులను కొల్లగొట్టెను. యువకులందరిని చంపివేసెను.
28. అతని దాడికి సముద్రతీర వాసులెల్లరు కంపించిరి. తూరు, సీదోను, సూరు, ఓషీనా, యామ్నియా, అష్ణోదు, ఆష్కేలోను నగరములలో వసించు వారెల్లరు తల్లడిల్లిరి.
1. ఆ నగరముల ప్రజలెల్లరు హోలోఫెర్నెసు నొద్దకు దూతలనంపి అతనికి ఈ క్రింది సందేశమును వినిపింపుడని చెప్పిరి.
2. “మేమెల్లరము మహా ప్రభువైన నెబుకద్నెసరుకు దాసులము. మేము నీ ముందు సాగిలపడెదము. మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చును.
3. మా ఇండ్లు, భూములు, గోధుమచేలు, గొఱ్ఱెలమందలు, గొడ్లమందలు, గొఱ్ఱెల దొడ్లు నీ అధీనముననున్నవి. వానిని నీ ఇష్టము వచ్చినట్లు ఉపయోగించవచ్చును.
4. మా పట్టణములు పౌరులు నీ చెప్పు చేతలలో ఉందురు. వారిని నీ చిత్తము చొప్పున వినియోగించుకొనుము."
5. ఆ దూతలు హోలోఫెర్నెసు నొద్దకు వచ్చి తమ సందేశమును విన్పించిరి.
6. అంతట అతడు సైన్యముతో సముద్రతీరమునకు వెళ్ళి, ప్రతి సురక్షిత పట్టణమున సైన్యములను నిలిపెను. ప్రతి పట్టణమునుండి కొందరు వీరులను ఎన్నుకొని తన సైన్యమున చేర్చుకొనెను.
7. ఈ నగర ల పౌరులును, చుట్టుపట్లనున్న పట్టణముల ప్రజలును పూలదండలతో సితారా వాయించుచు నాట్యము చేయుచు ఎదురొచ్చి హోలోఫెర్నెసునకు స్వాగతము చెప్పిరి.
8. అయినను అతడు వారి దేవళములను పడగొట్టించెను. పూజావనములను నరికించెను. స్థానికదైవములనెల్ల రూపుమాపవలెననియు, సకలజాతులును నెబుకద్నెసరునే దేవునిగా అంగీకరించి, పూజింప చేయవలెననియు అతడు ముందుగనే ఆజ్ఞలు పొందియుండెను.
9. పిదప హోలోఫెర్నెసు దోతాను సమీపమున నున్న ఎస్ట్రలోను చేరువకువచ్చెను. ఈ దోతాను యూదయాలోని పెద్ద పర్వతశ్రేణికెదురుగానున్నది.
10. అతడు గెబా, స్కితోపోలిసు నగరముల మధ్య శిబిరము పన్నెను. తన సైన్యమునకు వలసిన వస్తుసంభారములను చేకూర్చు కొనుటకుగాను అచట ఒక నెలకాలము విడిదిచేసెను.
1. యూదయాలో వసించు యిప్రాయేలీయులు, అస్సిరియా రాజు సైన్యాధిపతి హోలోఫెర్నెసు ఇతర జాతుల దేవళములను దోచి, వానిని నాశనము చేసెనని వినిరి.
2. కనుక వారు అతనికి వెరచిరి. అతడు యెరూషలేమునకును, అచటి దేవాలయమునకును ఏమి కీడుచేయునోయని మిగులభయపడిరి.
3. ఆ ప్రజలు కొద్దికాలము క్రితమే ప్రవాసమునుండి యూదయాకు తిరిగివచ్చిరి. శుద్ధిని కోల్పోయిన దేవళమును, అందలి బలిపీఠమును, పాత్రములను తిరుగశుద్ధిచేసియుండిరి.
4. కనుక వారు సమరియా, కోనా, బెత్ హోరోను, బెల్మయిను, యెరికో, కోబా, ఎసోరా, సాలెములోయ మొదలగు ప్రాంతములందెల్ల శత్రువు రాకను గూర్చి హెచ్చరికలు చేయించిరి.
5. ఆ ప్రాంతముల ప్రజలు వెంటనే కొండలమీది ప్రదేశములను ఆక్రమించుకొని అచటి నివాసములను సురక్షితము చేసిరి. యుద్ధము జరుగనున్నది కనుక భోజన పదార్ధములను సేకరించుకొనిరి. వారప్పుడే పొలములో నుండి పంటను ప్రోగు చేసికొని ఉండిరి.
6. ప్రధానయాజకుడు అయిన యోయాకీము యెరూషలేమున వసించుచుండెను. అతడు బెతూలియా, బెతోమెస్తాయిము అను నగరములకు లేఖలు పంపెను. ఈ రెండు పట్టణములును దోతాను మైదానమున కెదురుగా ఎస్ట్రలోను ప్రక్కనున్నవి.
7. అతడు ఆ నగరవాసులను శీఘ్రమే కొండలలోని కనుమలను ఆక్ర మించుకొనుడని చెప్పెను. ఆ కనుమల ద్వారాగాని యూదియా దేశములోనికి ప్రవేశములేదు. అవి యిరుకైనవి. ఒక్కొక్కసారి ఇద్దరిద్దరు మాత్రమే వానిగుండ ప్రయాణము చేయగలరు. కనుక ఆ కనుమలను ఆక్రమించుకొనినచో శత్రువుల రాకను సులభముగా అరికట్టవచ్చును.
8. ఆరీతిగా యెరూషలేములోని ప్రధాన యాజకుడు, అచట సభతీర్చిన పెద్దలు జారీచేసిన ఆజ్ఞను యిస్రాయేలీయులు పాటించిరి.
9. అపుడు యిస్రాయేలీయులు ఎల్లరు వినయముతోను, భక్తితోను దేవునికి ప్రార్థన చేసిరి.
10. యిస్రాయేలు పురుషులు, వారి భార్యాబిడ్డలు, వారి పశువులు వారిచెంత వసించు పరదేసులు, వారి బానిసలు, కూలీలు ఎల్లరును గోనెతాల్చిరి.
11-12. యెరూషలేమున వసించు పురుషులు, స్త్రీలు, పిల్లలెల్లరును దేవాలయము ముందట సాష్టాంగపడిరి. వారు తలమీద బూడిద చల్లుకొని ప్రభువు ఎదుట చేతులెత్తి ప్రార్ధించిరి. బలిపీఠమును గూడ గోనెతో కప్పిరి. ఎల్లరును కలిసి గాఢభక్తితో యిస్రాయేలు దేవునికి మొరపెట్టుకొనిరి. తమ బిడ్డలను చంపింపవలదనియు, తమ భార్యలను బందీలను గావింపవలదనియు, తరతరముల నాటి తమ నగరములను నాశనము చేయింప వలదనియు విన్నపము చేసిరి. తమ దేవళమును స్వాధీ నము చేసికొని, దానిని అమంగళపరచి, ఆనందించు అవకాశమును శత్రువులకు కల్పింపవలదని మనవి చేసిరి.
13. ప్రభువు వారి మొరాలించెను. అతడా ప్రజల దురవస్థను చూచి వారిని కరుణించెను. యూదయాలోని ప్రజలు యెరూషలేము పౌరులు చాలనాళ్ళ పాటు దేవాలయమునెదుట ఉపవాసము చేసిరి.
14. ప్రధానయాజకుడైన యోయాకీము ఇతర యాజకులు, దేవాలయమున పరిచారము చేయు వారందరు గోనెపట్ట కట్టుకొని దైనందిన దహనబలులు అర్పించిరి. ప్రజలు స్వేచ్ఛాబలులు వ్రతపూర్వకమైన బలులు అర్పించినపుడు కూడా వారు గోనె తాల్చిరి.
15. ఇంక వారు తమ తలపాగలపై బూడిద చల్లుకొని ప్రభువు తమ జాతిని కరుణింపవలెనని పూర్ణహృదయముతో విన్నపములు చేసిరి.
1. అస్సిరియా సైన్యాధిపతి హోలోఫెర్నెసు యిస్రాయేలీయులు యుద్ధమునకు సన్నద్దులు అగుచున్నారని వినెను. వారు కొండలలోని కనుమలను మూసివేసిరనియు, పర్వతశిఖరములను సురక్షితము చేసిరనియు, మైదానములలో అడ్డంకులు పెట్టిరనియు విని ఉగ్రుడయ్యెను.
2. అతడు మోవాబు దొరలను, అమ్మోనీయుల సైన్యాధిపతులను, సముద్రతీరమునుండి వచ్చిన సంస్థానాధిపతులను మంత్రాలోచనకు పిలిపించెను.
3. “మీరెల్లరు కనానుమండలమున వసింతురు గదా! బలమునకు కారణమేమి? వారిని పరిపాలించుచు వారి సైన్యములను నడిపించురాజెవడు?
4. ఈ పశ్చిమ జాతులలో వీరు మాత్రమే నన్ను సందర్శింపకుండుటకును, శరణువేడకుండుటకును కారణమేమి?” అని అతడు వారిని ప్రశ్నించెను.
5. అపుడు అమ్మోనీయుల నాయకుడు అకియోరు ఇట్లు చెప్పెను: "అయ్యా! నీ దాసుడు విన్నవించుకొను సంగతులను ఆలింపవేడెదను. నీ శిబిరమునకు చేరువలో వసించు ఈ పర్వతవాసుల గూర్చిన వివరములనెల్ల విన్పించెదను. నీ దాసుడు అబద్దములు చెప్పువాడు కాదు.
6. ఈ ప్రజలు తొలుత కల్దీయులు.
7. వారు తమ పితరుల మార్గమును విడనాడి ఆకాశాధిపతియైన దేవుని సేవింపదొడగిరి.
8. తమ పితరులు కొలిచిన దైవములకు మ్రొక్కరైరి. కనుక కల్దీయులు మెసపొటామియాకు పారిపోయి అచట చాలకాలము వసించిరి.
9. దైవాజ్ఞపై ఆ తావును విడనాడి కనాను మండలమునకు వచ్చి అచట స్థిరపడిరి. అచట వెండి బంగారములను, మందలను సంపాదించుకొని సంపన్నులైరి.
10. అటు తరువాత కనాను మండలమున కరవురాగా ఐగుప్తునకు వలసవెళ్ళి, తిండి దొరికినంత కాలమును అచటనే ఉండిరి. ఆ దేశమున వారు లెక్కలకందని రీతిగా పెరిగిపోయిరి.
11. కాని ఐగుప్తు రాజు వారిని పీడించి పిప్పిచేసెను. వారిని బానిసలుగా చేసివారిచే ఇటుకలు చేయించుకొనెను.
12. ఆ జనులు తమ దేవునికి మొరపెట్టగా అతడు ఐగుప్తును అరిష్టముల పాలుచేసెను. కనుక ఐగుప్తీయులు వారిని తమ దేశమునుండి వెళ్ళగొట్టిరి.
13-14. దేవుడు ఈ ప్రజల కొరకు సముద్రము ఇంకిపోవునట్లు చేసెను. వీరిని సీనాయి, కాదేషు బార్నెయాల మీదుగా నడిపించుకొని వచ్చెను. ఆ ప్రయాణమున వీరు ఎడారిలోని జాతుల నెల్ల జయించిరి.
15. అటు తరువాత అమోరీయుల మండలమును ఆక్రమించుకొనిరి. హెష్బోను ప్రజలను నాశనము చేసిరి. యోర్దానునదిని దాటి ఈ కొండ భూములను స్వాధీనము చేసికొనిరి.
16. ఇచట వసించు చున్న కనానీయులును, పెరిస్సీయులును, యెబూసీయులును, షెకేమీయులును, గిర్గాషీయులను వెడల గొట్టిరి. వీరు ఈ ప్రదేశముననే చాలకాలమునుండి వసించుచున్నారు.
17. ఈ ప్రజలు కొలుచు దేవుడు పాపమును ఎంత మాత్రము సహింపనివాడు. వీరు ఆయన ఆజ్ఞలను మీరి పాపము చేయనంతకాలము తామరతంపరగా వృద్ధిచెందిరి.
18. కాని ఆయనకు అవిధేయులై పాపము కట్టుకొనగనే శిక్షను అనుభవించిరి. కొందరు యుద్ధములలో హతులైరి. మిగిలిన వారు దూరదేశములకు ప్రవాసులుగా వెళ్ళిరి. వారి దేవాలయము నేలమట్టమయ్యెను. శత్రువులు వారి నగరములను స్వాధీనము చేసికొనిరి.
19. కాని వారు మరల తమ దేవుని ఆశ్రయించిరి. కనుక పూర్వము తాము చెల్లా చెదరైయున్న ప్రవాసదేశముల నుండి ఈ ప్రదేశమునకు తిరిగి రాగలిగిరి. తమ దేవళమునకు నిలయమైన యెరూషలేము నగరమును మరల ఆక్రమించుకొనిరి. తాము ప్రవాసమునకు వెళ్ళినప్పటినుండి నిర్మానుష్య ముగా నున్న ఈ కొండనేలలను మరల స్వాధీనము చేసికొనిరి.
20. అయ్యా! ఇప్పుడు ఈ ప్రజలు తమ దేవుని ఆజ్ఞమీరి పాపము కట్టుకొనిరని మనకు రూఢిగా తెలిసెనేని మనము వీరిమీద దాడిచేసి వీరిని జయింపవచ్చును.
21. కాని ఈ జనులట్టి పాపము దేనిని చేసియుండరేని ప్రభువుల వారు వీరిని ఎదిరించుట శ్రేయస్కరము కాదు. వీరు కొలుచు ప్రభువు వీరిని తప్పక రక్షించును. లోకమునెదుట మనము నగుబాట్లు తెచ్చుకొందుము.”
22. అకియోరు తన ఉపన్యాసము ముగింపగనే శిబిరమున గుమిగూడియున్న వారందరు అతనిమీద విరుచుకొనిపడిరి. వయోవృద్ధులైన హోలోఫెర్నెసు సైన్యాధిపతులు, మోవాబీయులు, సముద్రతీరము నుండి వచ్చినవారు అకియోరును ముక్కముక్కలుగా చీల్చివేయవలెను అనిరి.
23. వారు “మనము ఈ యిస్రాయేలీయులకు జంకనేల? వారు దుర్బలులు, మనల నెదిరించుటకు వారికి బలమైన సైన్యముగూడ లేదు.
24. కనుక అయ్యా! మనము పోయి వారిమీద పడుదము. నీ మహాసైన్యము వారిని కబళించివేయును” అని పలికిరి.
1. శిబిరమున గుమిగూడియున్న వారి కలకలము తగ్గిన పిదప, హోలోఫెర్నెసు విదేశ సైనికులు అమ్మోనీయులు వినుచుండగా అకియోరును మందలించెను.
2. “ఓయి! నీవెవరివని అనుకొంటివి? నీ వెంట వచ్చిన ఈ అమ్మోనీయులు వట్టి కూలివారు. నీవు మా యెదుట ఒక ప్రవక్తవలె మాట్లాడుచున్నావు. మేము యిస్రాయేలీయుల మీదికి యుద్ధమునకు పోగూడదనియు వారి దేవుడు వారిని సంరక్షించుననియు నీవు చెప్పుచున్నావు. అసలు నెబుకద్నెసరుగాక మరియొక దేవుడు కలడా? అతడు తన సైన్యములను పంపి ఈ యిస్రాయేలీయులను భూమిమీది నుండి తుడిచివేయును. వారి దేవుడు వారినెంత మాత్రము కాపాడజాలడు.
3. మేము నెబుకద్నెసరు సేవకులము. మేము యిస్రాయేలు సైన్య ములను ఏకనరుని ఓడించినంత తేలికగా ఓడింతుము. వారెక్కడ ? మా అశ్వబలమును ఎదిరించుట ఎక్కడ?
4. మేము వారిని సర్వనాశనము చేయుదుము. వారి కొండలు వారి నెత్తుటిలో తడిసిపోవును. వారి లోయలు వారి పీనుగులతో నిండును. యిస్రాయేలీయులు మమ్ము ఎదిరింపజాలరు. మేము వారిని అడపొడకానరాకుండ తుడిచివేయుదుము. ఇది ప్రపంచాధినేతయైన నెబుకద్నెసరు ఆజ్ఞ అనుకొనుము. ఆ రాజు పలికిన పలుకులు వ్యర్థము కాబోదు.
5. ఓయి అకియోరు! నీవు అమ్మోనీయుల దేశమునుండి వచ్చిన కూలివాడవు, ద్రోహివి. ఐగుపునుండి పారిపోయివచ్చిన ఈ బానిసలను తెగటార్చువరకు నేను నీ మొగము చూడను.
6. నేను వారిని శిక్షించివచ్చిన పిదప నా సైనికులు నిన్ను మట్టుపెట్టుదురు. హతులలో నీవు ఒకడివి అగుదువు.
7. నా సైనికులు ఇప్పుడు నిన్ను కొండలోనికి తీసికొనిపోయి యిస్రాయేలీయుల నగరముచెంత విడనాడుదురు.
8. తరువాత ఆ ప్రజలతో పాటు నీవుకూడ మాచేతికి చిక్కిచత్తువు.
9. యిస్రాయేలీయులు నా కత్తికి బలికారనియే నీవు తలంచెదవేని మరి ఇప్పుడు నీ మొగమింతగా చిన్నపోనేల? నేను నోరు విప్పి మాట్లాడితిని. నేను పలికిన పలుకొక్కటి వ్యర్ధముగాబోదని యెరుగుము” అనెను.
10. అంతట హోలోఫెర్నెసు సేవకులను పిలిచి అకియోరును బెతూలియాకు కొనిపోయి యిస్రాయేలీయులకు అప్పగించిరండని ఆజ్ఞాపించెను.
11. ఆ సేవకులు అతనిని పట్టుకొని శిబిరము వెలుపలికి కొనిపోయిరి. అచటినుండి అతనిని మైదానములగుండ నడిపించు కొనిపోయి కొండలను దాటి బెతూలియా పట్టణము క్రింది భాగమున నున్న చెలమలను చేరుకొనిరి.
12. బెతూలియా నగరవాసులు వారి రాకను గమనించి ఆయుధములు చేపట్టి కొండనెక్కిరి. ఒడిసెలలు కలవారు రాళ్ళు విసరిరి. కనుక హోలోఫెర్నెసు సైనికులు కొండమీదికి ఎకజాలరైరి.
13. వారు కొండ అంచును మరుగుచేసికొని అకియోరును త్రాళ్ళతో బంధించి పర్వతపాదము చెంతనే వదలిపెట్టి వెళ్ళిపోయిరి.
14. యిస్రాయేలీయులు తమ పట్టణము నుండి క్రిందికి దిగివచ్చి అకియోరు బంధములనువిప్పిరి. అతనిని తమ నగరమునకు కొనిపోయి పట్టణాధికారులకు చూపించిరి.
15. ఆ రోజులలో నగరాధికారులు షిమ్యోను తెగకు చెందిన మీకా కుమారుడైన ఉజ్జీయా, గొతోనియేలు కుమారుడైన కాబ్రిసు, మెల్కియేలు కుమారుడైన కార్మిసు.
16. ఆ అధికారులు పట్టణ పెద్దలను పిలిపించిరి. స్త్రీలును, పిల్లలునుగూడ సభకు పరుగెత్తుకొని వచ్చిరి. అకియోరును సభ ఎదుటికి కొనివచ్చిరి. ఉజ్జీయా అతనిని యేమి జరిగినదో చెప్పు మనెను.
17. అకియోరు హోలోఫెర్నెసు మంత్రాలోచన సభలో ఎవరేమి చెప్పినదియు, అస్సిరియా అధికారులెదుట తాను స్వయముగా ఏమి చెప్పినదియు వివరించెను. హోలోఫెర్నెసు యిస్రాయేలీయులను నాశనము చేయుదునని ప్రజలు పలికెననియు తెలియచేసెను.
18. ఆ మాటలు విని యిస్రాయేలీయులు నేలమీద బోరగిలపడి ప్రభువునకు మ్రొక్కిరి.
19. వారు “ఆకాశాధిపతివైన ప్రభూ! ఈ శత్రువులు కన్నుమిన్ను గానక నీ ప్రజలనెట్లు అవమానించుచున్నారో చూడుము. నీవు మమ్ము కరుణతో ఆదరింపుము. నీకు నివేదితులమైన మాకు తోడ్పడుము” అని ప్రార్ధించిరి.
20. వారు అకియోరునకు ధైర్యము చెప్పిరి. అతనిని మెచ్చుకొనిరి.
21. సభ ముగిసిన తరువాత ఉజ్జీయా అకియోరును తన ఇంటికి కొనిపోయెను. అతడు ఊరి పెద్దలకు విందు చేసెను. ఆ రాత్రియంతా వారు యిస్రాయేలు దేవుడైన ప్రభువును తమకు సహాయము చేయుమని మనవి చేసిరి.
1-2. మరునాడు హోలోఫెర్నెసు తన సొంత సైన్యమును, తనతో వచ్చిన అన్యజాతుల సైన్యములను సమావేశపరచెను. అది లక్ష డెబ్బదివేల కాలిబంటులతోను, పండ్రెండువేల రౌతులతోను కూడిన మహా సైన్యము. వీరుగాక సామానులు మోసికొనివచ్చు సామాన్య జనులునుగలరు. అతడా సైన్యములను బెతూలియా మీదికి దాడి చేయవలెననియు, కొండలలోని కనుమలను ఆక్రమించుకోవలెను అనియు, యిస్రాయేలీయులతో పోరు ప్రారంభింపవలెననియు ఆజ్ఞాపించెను.
3. కనుక ఆ సేనలు కదలిపోయి బెతూలియా చెంత గల లోయలోని నీటి బుగ్గలవద్ద గుడారములు పన్నెను. ఆ శిబిరము చాల పెద్దది కనుక దాని వెడల్పు దోతాను నుండి బెల్బాయీము వరకు వ్యాపించియుండెను. దాని పొడవు బెతూలియానుండి ఎస్ట్రలోను ఎదుటనున్న సియామోను వరకు విస్తరించియుండెను.
4. యిస్రాయేలీయులు ఆ మహా సైన్యమును చూచి భయపడిరి. “ఈ సైన్యము ఈ ప్రదేశమునంతటిని ఊడ్చివేయును. ఎత్తయిన శిఖరములు, లోయలు, కొండలన్నిటిని కలిపి నను వీరి బరువును భరింపజాలవు” అని అనుకొనిరి.
5. అట్లు భయపడినప్పటికీ వారెల్లరును తమ ఆయుధములను చేపట్టిరి. తమ బురుజులమీద సంజ్ఞా దీపములను వెలిగించి రేయెల్ల కావలికాసిరి.
6. రెండవనాడు హోలోఫెర్నెసు తన అశ్వబలమును బెతూలియా పౌరులెల్లరు చూచునట్లు ఆ నగరముచెంతకు కొనిపోయెను.
7. అతడు ఆ పట్టణమునకుపోవు దారులను ఆ నగరమునకు నీటిని సరఫరాచేయు జలధారలను పరిశీలించెను. ఆ నిటి ఊటల చెంత తన సైన్యములను కాపు పెట్టి తాను శిబిరమునకు తిరిగివచ్చెను.
8. అప్పుడు ఎదోము నాయకులు, మోవాబు దొరలు, సముద్ర ప్రాంతములవారి సైన్యాధిపతులు హోలోఫెర్నెసు చెంతకొచ్చి అతనితో,
9. "అయ్యా! నీవు మా మాట పాటింతువేని నీ సైన్యములకు ముప్పు తప్పును.
10. యిస్రాయేలీయులు తమ ఆయుధముల మీదకాక తాము వసించు పర్వతముల ఎత్తుమీద ఆధారపడి ఉందురు. ఈ కొండలను ఎక్కుట మనకు సాధ్యముకాదు.
11. కనుక తమరు వారిని ఈ కొండలలో నేరుగా ఎదిరింపరాదు. ఈ నియమమును పాటించిన మన సైన్యమున ఒక్కడును చావడు.
12. ఏలినవారును, మన సైనికులును విడిదిపట్టుననే ఉండవలెను. మన సైనికులు మాత్రము పర్వతపాదమున నున్న జలధారలను ఆక్రమించు కోవలెను.
13. బెతూలియా నగరవాసులకు నీటిని సరఫరా చేయునది ఈ బుగ్గలే. ఆ ప్రజలకు నీరు దొరకదేని దప్పికకు ఓర్వజాలక తమ నగరమును నీ వశము చేయుదురు. ఈ మధ్యలో మేము సైన్యములతో పోయి ఈ చుట్టుపట్లనున్న కొండలమీద డేరాలు పన్ని ఈ జనులు నగరము వీడిపోకుండునట్లు జాగ్రత్త పడెదము.
14. ఈ పట్టణములోని ప్రజలెల్లరు పురుషులు, స్త్రీలు, పిల్లలు ఆకలితో చత్తురు. మన కత్తికి బలికాకపూర్వమే వీరెల్లరు చచ్చి నగరవీధులలో కుప్ప లుగా పడియుందురు.
15. నిన్ను ఆశ్రయింపక, నీకు ఎదురు తిరిగినందుకుగాను వీరు ఈ రీతిగా తగిన శిక్షను అనుభవింతురు” అని చెప్పిరి.
16. హోలోఫెర్నెసుకును, అతని అధికారులకును ఈ పన్నాగము నచ్చెను. కనుక అతడు ఈ సలహా పాటింపనెంచెను.
17. వెంటనే మోవాబీయులు ఐదు వేలమంది, అస్సిరియా సైనికులు లోయలోనికి వెడలి పోయి పట్టణమునకు నీటిని సరఫరాచేయు జలధారలను ఆక్రమించిరి.
18. ఎదోమీయులు, అమ్మోనీయులు కొండలలోనికెళ్ళి దోతాను కెదురుగా శిబిరము పన్నిరి. వారు తమ సైనికులను కొందరిని మొక్కురు వాగు చెంతగల కూసి చేరువలోనున్న అక్రిబాకు పంపిరి. ఈ తావు బెతూలియాకు తూర్పు, దక్షిణ దిశలందు కలదు. మిగిలిన అస్సిరియా సైనికులులోయలోని మైదానముననే శిబిరము పన్ని ఆ ప్రాంతమంతట వ్యాపించిరి. అంతటి మహాసైన్యమునకు కావలసిన గుడారములు ఇతర పరికరములు చాలస్థలమును ఆక్రమించుకొనెను.
19. అపుడు యిస్రాయేలీయులు తమ దేవునికి మొరపెట్టిరి. శత్రువులు చుట్టుముట్టగా తప్పించుకొను మార్గము లేనందున మిగుల నిరుత్సాహము చెందిరి.
20. అస్సిరియా సైన్యము వారి కాలిబంటులతో, రథములతో, అశ్వములతోను బెతూలియాను ముప్పది నాలుగునాళ్ళ వరకు చుట్టుముట్టెను. అంతలో పట్టణ మున నీరు అయిపోయెను.
21. వారి నీటితొట్లు ఖాళీ అయ్యెను. మంచినీళ్ళను కొలిచి ఇచ్చిరి కనుక అవి ఏరోజున ఎవరికినీ సరిపోవయ్యెను.
22. వారి పసికందులు, స్త్రీలు, బాలబాలికలు నీరు చాలక కృశించి పోయిరి. సత్తువలేక వీధులలో,నగరద్వారముల చెంతను సొమ్మసిల్లి పడిపోయిరి.
23. పట్టణములోని ప్రజలెల్లరు-పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉజ్జీయాను పట్టణాధికారులను చుట్టు ముట్టి పెద్దగా అరచిరి. వారు నగర పెద్దలు వినుచుండగా ఇట్లనిరి:
24. “మీరు మాకు ఇట్టిపని చేసినందుకు దేవుడు మిమ్ము తప్పక శిక్షించును. మీరు అస్సిరియనులతో రాజీ కుదుర్చుకొనక మాకు కీడు తెచ్చిపెట్టిరి.
25. ఇప్పుడు మనకు సాయము చేయువారెవరు? దేవుడు మనలను వారి చేతికి అప్ప గించెను. మేమెల్లరము దప్పికచే చచ్చుచున్నాము. ఎక్కడివారము అక్కడే సొమ్మసిల్లి పడిపోవుచున్నాము.
26. మీరు వెంటనే శత్రువులను పిలిపింపుడు. హోలోఫెర్నెసును అతని సైన్యములను ఈ నగరము నాక్రమించుకొననిండు. దోచుకొననిండు.
27. ఈ బాధలను అనుభవించుట కంటె వారి చేతికి చిక్కుట మేలు.వారు మనలను బానిసలను చేయుదురు. అయినను మా బొందిలో ప్రాణములైననిల్చును. మన ఆడువారు, పిల్లలు ప్రాణములు కోల్పోవుటను మనము కన్నులార చూడనక్కరలేదు.
28. ఆకాశము, భూమి మరియు మన ప్రభువుకూడ మీకు వ్యతిరేకముగా సాక్ష్యమిచ్చుచు మీ ఈ చెయిదమును తప్పక ఖండించును. మన పితరులదేవుడైన ప్రభువు పితరుల పాపములకును, మన తప్పిదములకును మనలను ఈ రీతిగా శిక్షించుచున్నాడు. ఆ ప్రభువు నేడు మనలను ఈ ఆపదల నుండి కాపాడవలెనని మాత్రము మేమెల్ల రము ప్రార్ధించుచున్నాము.”
29. అంతట ఆ జనసమూహమంత పెద్దగా ఏడ్చుచు ప్రభువునకు మొరపెట్టెను.
30. అప్పుడు ఉజ్జీయా ప్రజలతో “సోదరులారా! మీరు కొంచెము తాళుడు. ఇంకను ఐదునాళ్ళు వేచియుందము. అప్పటికైనను ప్రభువు మనలను కరుణింపవచ్చును. ఆయన మనలను పూర్తిగా చేయివిడుచువాడు కాదు.
31. ఈ ఐదునాళ్ళ గడువులోను సహాయము లభింపదేని నేను మీరు కోరినట్లే చేయుదును” అని చెప్పెను.
32. తరువాత అతడు ప్రజలను పంపివేయగా మగవారు ప్రాకారములకు, బురుజులకు కావలికాయుటకు వెళ్ళిపోయిరి. స్త్రీలును, పిల్లలును ఇండ్లకుపోయిరి. నగరమంత నిరాశతో నిండి పోయెను.
1. అప్పుడు యూదితు ఉజ్జీయా నిర్ణయములను గూర్చి వినెను. ఆమె తండ్రితాతలు క్రమముగా మెరారి, ఓక్సు, యోసేపు, ఓసీయేలు, ఎల్కియా, అననిసు, గిద్యోను, రఫాయిము, అహిటూబు, ఏలీయా, హిల్కియా, ఎలియాబు, నతనయేలు, సలమియేలు, సరసదాయి, యిస్రాయేలు అనువారు
2. ఆమె భర్త పేరు మనష్షే, అతడు ఆమె వంశమునకు, తెగకు చెందినవాడే. అతడు యవలపంటను కోయుకాలమున మరణించెను.
3.మనష్షే పొలములో కోతకోయించుచు ఎండదెబ్బ తగిలి జబ్బుపడెను. ఆ జబ్బుతో మంచముపట్టి బెతూలియా నగరమున తన యింటనే ప్రాణములు విడిచెను. అతనిని దోతాను, బాలమోను నగరములమధ్యనున్న పొలములో, అతని పితరులచెంతనే పాతి పెట్టిరి.
4. యూదితు అప్పటికి మూడేండ్ల నాలుగు నెలల నుండి వితంతువుగా తన యింటనే వసించుచుండెను.
5. ఆమె తన యింటిమీద ఒక చిన్న కుటీరమును నిర్మించుకొని సంతాప సూచకముగా గోనెను, విధవ వస్త్రములను ధరించెను.
6. వితంతువైనప్పటి నుండి ఆమె ప్రతిరోజు ఉపవాసముండెడిది. విశ్రాంతిదినము, దానికి ముందటిరోజు సాయంకాలము, అమావాస్య, దానికి ముందటిరోజు సాయంకా లము, యిస్రాయేలీయుల ఉత్సవదినములు, సెలవుదినములు అయిన ఈ దినములలో మాత్రము ఆమె ఉపవాసనియమమును పాటింపదయ్యెను.
7. యూదితు మిగుల అందకత్తె. భర్తనుండి ఆమెకు వెండి బంగారములును, దాసదాసీ జనమును, పొలమును, పశులమందలును సంక్రమించెను. ఈ ఆస్తికి అంతటికి ఆమెయే యాజమాన్యము వహించెను.
8. ఎవరును ఎపుడును యూదితును వేలెత్తి చూపియెరుగరు. ఆమె అంత నిష్ఠతో జీవించెడిది.
9. ప్రజలు నీరు దొరకక నిరుత్సాహము చెంది ఉజ్జీయామీద నేరము తెచ్చిరనియు, అతడు పట్టణమును ఐదుదినముల తరువాత అస్సిరియనుల వశము చేయుదునని మాట ఇచ్చెననియు యూదితు వినెను.
10. ఆమె వెంటనే తన ఆస్తిపాస్తులను పర్యవేక్షించు సేవకురాలిని పంపి ఉజ్జీయా, కాబ్రిసు, కార్మిసు అను నగరాధికారులను పిలిపించెను.
11. ఆ అధికారులు తన చెంతకు రాగానే యూదితు వారితో “మీరు ఈ బెతూలియా నగరమునకు పెద్దలు కదా! ఇప్పుడు నా మాట వినుడు. మీరు నేడు మన ప్రజలకు మాటయిచ్చిన తీరు సక్రమముగా లేదు. ప్రభువు మనకిన్ని రోజుల కాలములో సాయపడడేని ఈ నగరమును శత్రువులకు అప్పగింతుమని మీరు దేవుని ఎదుట బాసచేయుట ధర్మము కాదు.
12. అసలు దేవుని పరీక్షించుటకు గాని, మేము దేవునికంటె అధికులము అన్నట్లుగా ప్రవర్తించుటకుగాని మీరెవరు?
13. మీరిపుడు సర్వశక్తిమంతుడైన ప్రభువునే పరీక్షకు గురిచేసితిరి. మీకేమియు తెలియదు, తెలిసికోలేరు కూడ.
14. ఏ నరుని హృదయములో ఏమియున్నదో, ఎవడేమి ఆలోచించుచున్నాడో మీకు తెలియదుకదా! మరి సర్వమును సృజించిన దేవుని హృదయము మీకెట్లు తెలియును? అతని మనసును, ఆలోచనలను మీరెట్లు గుర్తుపట్టుదురు? సోదరులారా! మీరిట్టిపనికి పూనుకోవలదు. ప్రభువు కోపమును రెచ్చగొట్టవలదు.
15. అతడు మనలను ఈ ఐదునాళ్లలోనే రక్షింపక పోవచ్చునుగాక. తనకు ఇష్టము వచ్చినపుడే మనలను కాపాడవచ్చునుగదా! లేదా మనలను శత్రువుచేత నాశనము చేయింప వచ్చునుగూడ.
16. ముందుగా దేవునికి షరతులు పెట్టుట మీ పనికాదు. బుజ్జగించుటకుగాని, బెదరించుటకుగాని ఆయన నరుడాయేమి?
17. మన మట్టుకు మనము దేవునికి సహాయము చేయుమని మనవి చేయుదము, ఓపికతో ఆయన సాయము కొరకు వేచియుందము. ఆ ప్రభువునకు సమ్మతమయ్యెనేని ఆయన మన మొరాలించును.
18. ఇటీవల కాలమునకాని, ప్రస్తుతము కాని మన నగరములలో, గ్రామములలో, మన వంశములలో, తెగలలో ఎవరును విగ్రహములను పూజించుటలేదు. మన పూర్వులు మాత్రము వానికి మ్రొక్కెడివారనివింటిమి.
19. కనుకనే శత్రువులు వారిని సంహరించి కొల్లగొట్టగా వారు సర్వనాశనమైరి.
20. మనమిపుడు ప్రభువును తప్ప మరియొకరిని కొలుచుట లేదు. కనుక ఆయన మనలనుగాని, మన జాతిలో ఎవరినిగాని చేయివిడువడని నమ్మవచ్చును.
21. ఇపుడు శత్రువులు మన నగరమును జయింతురేని యూదయా దేశమంతయు వారికి వశమగును. వారు మన దేవాలయమును గూడ కొల్ల గొట్టుదురు. దేవాలయమును అమంగళము చేయనిచ్చినందులకు దేవుడు మన ప్రాణములను బలిగొనును.
22. మన ప్రజల చావునకు, ప్రవాసమునకు, తరతరముల దాక మనకు భుక్తమైయున్న ఈ దేశమును పాడువడుటకును మనమే కారకులమగుదుము. మనము వివిధ దేశములకు బానిసలముగా వెడలిపోగా, అచటి అన్యజాతి యజమానులు మనలను అసహ్యించుకొని, అవమానము చేయుదురు.
23. మనమిపుడు శత్రువులకు లొంగిపోయినచో వారు మనలను ఆదరముతో చూడరు. అట్లు లొంగిపోయినందుకు గాను దేవుడు మనలను నగుబాట్లపాలుచేయును.
24. సోదరులారా! ఇపుడు మనమెల్లరము తోడి యిస్రాయేలీయులకు మంచి ఆదర్శము చూపవలెను. వారి బ్రతుకులును, దేవాలయపు బలిపీఠ సౌభాగ్యమును గూడ మన మీదనే ఆధారపడియున్నవి.
25. ప్రభువు మన పితరులవలె మనలనుగూడ నేడు పరీక్షకు గురిచేయుచున్నాడు. అయినప్పటికి మనము ఆయనకు వందనములు అర్పింపవలెను.
26. ఆయన అబ్రహామును, ఈసాకును ఎట్లు పరీక్షించెనో జప్తికి తెచ్చుకొనుడు. మెసపొటామియాలో తన మేనమామయగు లాబాను గొఱ్ఱెలను మేపు యాకోబునకు ఏమిజరిగినదో గుర్తు తెచ్చు కొనుడు.
27. ప్రభువు వారిని పరీక్షించినంత కఠినముగా, మనలను పరీక్షించుటలేదు. ఆయన మనలను ఈ ఉపద్రవమునకు గురిచేసినది మనమీద పగతీర్చుకొనుట కుగాదు. తనను కొలుచు మనలను హెచ్చరించుటకే.”
28. అపుడు ఉజ్జీయా ఆమెతో ఇట్లనెను: “అమ్మా! నీవు చెప్పినది సముచితమే, నీ మాట కాదనుటకు వీలులేదు.
29. నీవు వివేకముతో మాట్లాడుట ఇదియే మొదటిసారి కాదు. చిన్ననాటి నుండి నీవు తెలివితేటలతోను, వివేచనముతోను మెలగెడిదానవని మేమెల్లరము ఎరుగుదుము.
30. కానీ ప్రజలు దప్పిక బాధ తట్టుకోజాలక మమ్ము నిర్బంధము చేయగా మేమిట్టికార్యము చేయవలసి వచ్చెను. మేము చేసిన ప్రమాణమునకు తిరుగులేదు.
31. కాని నీవు దేవుని భయము కలదానవు. కనుక దేవునికి ప్రార్ధన చేయుము. వాన కురిపించి మన తొట్లను నింపుమని దేవునికి మనవి చేయుము. అప్పుడు మన బాధలన్ని తీరిపోవును.”
32. ఆ మాటలకు యూదితు “మీరు నా పలుకులు ఆలింపుడు. నేనొకకార్యము చేయనిశ్చయించుకొంటిని. మన ప్రజలు తరతరములదాక దానిని గుర్తుంచుకొందురు.
33. ఈ రాత్రి మీరు నగరద్వారము చెంత కావలియుండుడు. నేనును, నా దాసియు ఆ ద్వారము దాటి వెళ్ళిపోవుదుము. మీరు ఈ నగరమును శత్రువులకు అప్పగింతుమనిన దినమునకు ముందే ప్రభువు నా ద్వార మన ప్రజలను రక్షించును.
34. నేను చేయబోవు కార్యమేమిటో మీరు నన్ను ఇప్పుడు అడుగరాదు. ఆ పని ముగిసిన పిదపగాని నేను దానిని మీకెరిగింపను” అనెను.
35. ఉజీయా ఇతర పెద్దలు ఆమెతో “నీవు మా ఆశీస్సులందుకొని పొమ్ము. మన శత్రువులమీద పగతీర్చుకొను మార్గమును దేవుడు నీకు చూపునుగాక!” అనియనిరి.
36. ఇక వారు యూదితు కుటీరము వీడి తమతమ స్థానములకు వెడలిపోయిరి.
1. యూదితు తలమీద బూడిద పోసికొనెను. ఆమె తన వెలుపలి దుస్తులను తొలగింపగా తాను లోపల తాల్చియున్న గోనె కన్పించుచుండెను. ఆ సాధ్వి ప్రార్థన చేయుటకు నేలమీద బోరగిలపడిను. అదే సమయమున యెరూషలేము దేవాలయమున దేవునికి సాయంకాలపు సాంబ్రాణి పొగవేయుచుండిరి. యూదితు బిగ్గరగా ఇట్లు ప్రార్ధించెను:
2. “మా పితరుడగు షిమ్యోను దేవుడవైన ప్రభూ! పూర్వము అన్యజాతివారు దీనా అనుకన్యను వివస్త్రనుచేసి మానభంగముచేసి, అవమానముపాలు చేయగా, నీవు షిమ్యోనును కత్తితో పంపి, అతడు వారిమీద పగతీర్చుకొనునట్లు చేసితివి.
3. వారు నీవు నిషేధించిన కార్యములను చేయబూనిరి కనుక నీవు వారి నాయకులను మట్టుపెట్టించితివి. వారు తప్పు చేసిన పడకమీదనే నీవు వారి ప్రాణములను తీయించితివి. వారి రాజకుమారులను, బానిసలను, ఏలికలను ఎల్లరిని హతము చేయించితివి.
4. వారి భార్యలను, కూతుండ్రను బందీలను గావించితివి. నీ చిత్తమును నెరవేర్చుచు, నీకు ప్రీతిపాత్రులుగా మనుచున్న యిస్రాయేలీయులచే వారి ఆస్తిపాస్తులను కొల్లగొట్టించితివి. ఆ కన్యకు జరిగిన మానభంగమువలన యిస్రాయేలీయులు తమ వంశము సంకరమగునని వెరచి, నీ సహాయము వేడుచు, నీకు మొర పెట్టిరి. కనుక ప్రభూ! ఇప్పుడు నీవు ఈ వితంతువు మొరనాలింపుము.
5. పూర్వము జరిగిన కార్యములకుగాని, అటుతరువాత జరిగినవానికి గాని నీవే కర్తవు. ఇపుడు జరుగు కార్యములకును, ఇక జరుగబోవు వానికిగూడ నీవే కారకుడవు. నీవు సంకల్పించుకొనిన పనులు జరిగితీరును.
6. నీవు చేయగోరిన కార్యములెల్ల వానికాలమున అవి సిద్దించి తీరును. నీ కార్యములెల్ల నీకు ముందుగనే తెలియును. నీ నిర్ణయములను నీవు ముందుగనే గుర్తింతువు.
7. ప్రభూ! ఈ అస్సిరీయనుల బలమును తిలకింపుము. వారు తమ గుఱ్ఱములను రౌతులను, కాలిబంటులను చూచుకొని మిడిసిపడుచున్నారు. తమ డాళ్ళను బల్లెములను, విల్లులను, ఒడిసెలలను చూచి పొంగిపోవుచున్నారు. కాని నీవు యుద్ధములను రూపుమాపువాడవనియు, ఏకైక ప్రభుడవనియు వారికి తెలియదు.
8. నీ శక్తితో వారి బలమును అణగదొక్కుము. నీ అగ్రహముతో వారి సైన్యములను నాశనము చేయుము. వారు నీ సాన్నిధ్యమునకు ఆటపట్టు అయిన దేవాలయమును అమంగళ పరుపగోరుచున్నారు. కత్తులతో నీ బలిపీఠము కొమ్ములను నరుక గోరుచున్నారు.
9. వారి గర్వమును అవలోకింపుము. నీ కోపమును వారిమీద ప్రజ్వలింపజేయుము. కేవలము వితంతువునైన నాకు నీ బలమును దయచేసి, నేను తలపెట్టిన కార్యము సఫలమగునట్లు చేయుము.
10. శత్రువులు తమ యజమానులతోపాటు, బానిసలతో పాటు నా కపటవచనములద్వారా కుప్పకూలునట్లు చేయుము. ఒక ఆడుపడుచుద్వారా వారికి శృంగభంగము కావింపుము.
11. నీవు సైనికుల సంఖ్యపైనగాని, బలాఢ్యుల బలము పైనగాని ఆధారపడువాడవు కావు. నీవు వినయవంతుల దేవుడవు, పీడితులకు సహాయకుడవు, దుర్బలులకు అండగా నుండువాడవు, నిరాశ్రయులకు ఆశ్రయుడవు, నిరాశ చెందినవారికి ఆదరుడవు.
12. మా పితరుడగు షిమ్యోను దేవుడవైన ప్రభూ! యిస్రాయేలు నమ్మినవాడవు, భూమ్యాకాశములకధిపతివి, జలములనెల్ల సృజించిన వాడవు. సృష్టికెల్ల రాజువైన ప్రభూ! దయతో నా మొరను ఆలింపుము.
13. నీ నిబంధనలను నీ దేవాలయమును, నీ సియోను కొండను, నీవు ధారాదత్తము చేసిన భూమిని ధిక్కరించి, ఇట్టి క్రూరకార్యములను తలపెట్టినవారిని నా కపటవచనములు తెగటార్చునట్లు చేయుము.
14. నీవు సర్వశక్తిగల దేవుడవనియు, యిస్రాయేలును సంరక్షించు ఏకైక నాథుడవనియు, నీ ప్రజలు, సకల జాతులుగూడ గుర్తించునట్లు చేయుము.”
1-2. యూదితు పైరీతిగ యిస్రాయేలు దేవునికి ప్రార్ధనచేసి ముగించిన పిదప నేలమీదినుండి లేచి తన దాసిని పిలిపించెను. ఆమె విశ్రాంతి దినములందును, ఉత్సవ దినములందును తాను వాడుకొను గదిలోనికి వెళ్ళెను.
3. అచటతానుతాల్చియున్నగోనెను విధవ వస్త్రములను తొలగించెను. స్నానము చేసి విలువ గల అత్తరులు పూసికొనెను. శిరోజములను చక్కగా దువ్వుకొని ఒక పట్టీతో కట్టుకొనెను. తన భర్త మనష్షే జీవించియున్నపుడు తాను ఉత్సవసమయములలో ధరించు సొగసైన ఉడుపులను తాల్చెను.
4. కాళ్ళకు చెప్పులు తొడుగుకొనెను, దండలు, గాజులు, ఉంగరములు, కమ్మలు మొదలైన సొమ్ములు పెట్టుకొనెను. ఆ అలంకరణముల వలన చూపరులకు మిగుల సుందరముగా కన్పించెను. ఆమెను చూచిన వారికి ఎవరికైన ఆమెమీద మనసుపోకమానదు.
5. యూదితు ద్రాక్షసారాయము పోసిన తోలుతిత్తిని, చమురుతో నింపిన కూజాను దాసిచేతికిచ్చెను. ఇంకను అమె వేయించిన యవధాన్యమును, ఎండిన అత్తిపండ్లతో చేసిన మోదకములను, శుద్ధిని పాటించి తయారుచేసిన రొట్టెలను ఒక సంచిలో పెట్టెను. ఆ వస్తువులనన్నింటిని జాగ్రత్తగా మూటకట్టి దాసిచేతి కిచ్చెను.
6. యూదితు, ఆమె దాసియు తమ ఇంటిని విడిచి నగరద్వారము చెంతకు వచ్చిరి. అచట ఉజ్జీయా మరియు నగరనాయకులగు కాబ్రిసు, కార్మిసు ద్వారమునకు కావలి కాయుచుండిరి.
7. వారు క్రొత్త వస్త్రములు తాల్చి చక్కగ అలంకరించుకొని వచ్చిన యూదితు సౌందర్యమును చూచి ముగ్ధులైరి.
8. వారు ఆమెతో “అమ్మా! మన పితరుల దేవుడైన ప్రభువు నిన్ను దీవించి నీ యత్నమును సఫలము చేయునుగాక! నీవు యిస్రాయేలీయులకు గౌరవమును, యెరూషలేమునకు కీర్తిని చేకూర్చిపెట్టుదువు గాక!” అని అనిరి.
9. ఆ మాటలకు యూదితు శిరమువంచి దేవునికి నమస్కారము చేసెను. ఆమె వారితో 'ద్వారము తెరచి నన్ను బయటికి పోనిండు. నేను మీ కోరికలను సాధించి తిరిగివత్తును" అనెను. ఆ నాయకులు, యువకులను ద్వారము తెరువ ఆజ్ఞాపించిరి.
10. యూదితు, ఆమె దాసియు నగరమును దాటి వెడలిపోయిరి. ఆమె కొండను దిగి లోయను దాటి వెళ్ళిపోవుచుండగా పురజనులు అమెవైపే చూచు చుండిరి. అటు తరువాత యూదితు వారికంటికి కన్పింప దయ్యెను.
11-12. ఆ స్త్రీలు లోయగుండ నడచు చుండగా అచట విడిది చేయుచున్న సైనిక బృందము వారిని ఆవెను. వారు యూదితును “నీవే జాతిదానవు? ఎచటి నుండి వచ్చుచున్నావు? ఎచటికి వెళ్ళుచున్నావు?" అని యడిగిరి. అమె నేను హెబ్రీయుల ఆడుపడుచును. మా ప్రజలు మీ చేతికి చిక్కి నాశనమ గుదురు. కనుక నేను మా జనుల నుండి పారిపోవు చున్నాను.
13. నేను మీ సేనాధిపతి హోలోఫెర్నెసు నొద్దకు వెళ్లి అతనికి విశ్వసనీయమైన సమాచారము కొంత విన్పింపవలయును. అతడు తన సైనికులలో ఒక్కనిని గూడ కోల్పోకుండనే ఈ పర్వత సీమనంతటిని జయించు మార్గమును చూపింతును” అని చెప్పెను.
14. ఆ సైనికులు యూదితు పలుకులాలించుచు ఆమె సౌందర్యమును చూచి విస్మితులైరి.
15. వారు “నీవు స్వయముగ మా సైన్యాధిపతిని చూడవచ్చితివి కనుక నీ ప్రాణములు దక్కినవి. మా సైనికులు కొందరు నిన్ను సైన్యాధిపతి గుడారమునకు తీసికొనిపోవుదురు.
16. నీవు అతనిని చూచి భయపడనక్కరలేదు. నీవు మాతో చెప్పిన విషయములనే అతనికి చెప్పుము. అతడు నిన్ను తప్పక ఆదరించును” అనిరి.
17. అంతటవారు నూరుగురు సైనికులను పిలిచి యూదితును, ఆమె దాసిని హోలోఫెర్నెసు గుడారమునకు తీసికొ నిపొండని ఆజ్ఞాపించిరి.
18. యూదితు వచ్చినదన్న వార్త శిబిరమంతట ప్రాకిపోయెను. అమెను చూచుటకుగాను సైనికులు గుడారములనుండి గబగబవచ్చు చుండిరి. అమె హోలోఫెర్నెసు గుడారము దాపున నిలుచుండి అతని దర్శనము కొరకు వేచియుండెను. అంతలో చాల మంది సైనికులువచ్చి ఆమె చుట్టును మూగిరి.
19. వారామె సౌందర్యమునకు పరవశులై యిస్రాయేలీయులు ఎట్టివారోయని ఆశ్చర్యపడ జొచ్చిరి. “ఇంతటి అందగత్తెలు కల జాతిని మనము అలక్ష్యము చేయుటయెట్లు? మనము వారిలో ఒక్కరిని మిగులనీయక అందరిని మట్టుపెట్టవలెను. లేదేని వారు లోకమంతటిని లొంగదీసికొందురు” అని తమలో తాము గుసగుసలాడుకొనిరి.
20. అంతట హోలోఫెర్నెసు అంగరక్షకులు, సేవకులు వచ్చి యూదితును అతని గుడారమునకు కొనిపోయిరి.
21. అప్పుడు హోలోఫెర్నెసు పాన్పుపై విశ్రమించియుండెను. దానిమీద ఒక తెర వ్రేలాడుచుండెను. ఆ తెరను పట్టుతోను, బంగారు పోగులతోనునేని పచ్చలతోను, విలువ గల రత్నములతోను అలంకరించి యుండిరి.
22. సేవకులు యూదితు వచ్చినదని తెలియజేయగా అతడు పడకమీదినుండి లేచి గుడారము వెలుపలకి వచ్చెను. బంటులు అతని ముందట వెండి దివిటీలు పట్టిరి.
23. యూదితు వారెదుటికి రాగా హోలోఫెర్నెసును, అతని సేవకులును ఆమె సౌందర్యమును చూచి నిశ్చేష్టులైరి. ఆమె సాష్టాంగపడి హోలోఫెర్నెసుకు నమస్కారము చేసెను. అతని బంటులు ఆమెను పైకి లేవనెత్తిరి.
1. హోలోఫెర్నెసు యూదితుతో “ఓ స్త్రీ ధైర్యము వహింపుము. నన్ను చూచి భయపడవలదు. లోకాధిపతియైన నెబుకద్నెసరునకు సేవలు చేయువారినెవరిని నేను ఏనాడును శిక్షించి ఎరుగను.
2. ఇప్పుడైనను కొండలలో వసించు మీ ఈ జాతివారు నన్ను చులకన చేసియుండరేని నేను వారిమీద పోరుతలపెట్టియుండను. వారు తమను కట్టు త్రాళ్ళు తామే తెచ్చుకొనిరి.
3. కాని నీవిప్పుడు వారిని విడనాడి మా యొద్దకేల వచ్చితివి? ఇచటికి వచ్చుట వలన నీ ప్రాణములు దక్కించుకొంటివి. ఇక భయపడకుము. ఈ రాత్రికి మేము నిన్ను కాపాడుదుము. ఇకమీదటను నీకెట్టి హాని కలుగదు.
4. ఇచట నీకెవరును కీడుచేయరు. మా ప్రభువైన నెబుకద్నెసరు దాసులు అందరికి వలె నీకును గౌరవాదరములు లభించును” అనెను.
5. యూదితు అతనితో “ఏలినవారు నేను మాట్లాడుటకు సెలవు దయచేయుడు. తమరీ దాసురాలి పలుకులాలింపుడు. నేనెట్టి అబద్దములను చెప్పను.
6. తమరు ఈ దాసురాలి సలహాను పాటింతురేని దేవుడు మీ ద్వారా ఒక మహత్తర కార్యమును సాధించును. అప్పుడు ప్రభువు తలపెట్టిన పని నెరవేరును.
7. నేను లోకాధిపతియైన నెబుకద్నెసరు రాజు ప్రాణము మీద, బలముమీద ప్రమాణము చేసి చెప్పుచున్నాను. సమస్త ప్రజలను అదుపులోనికి తెచ్చుటకు ఆ ప్రభువు మిమ్ము పంపెను. మీ పరాక్రమమువలన ఒక్క నరులే కాదు, వన్యమృగములును, పెంపుడు జంతువులును, పక్షులును గూడ ఆ రాజుకు విధేయములు అగుచున్నవి. మీ సామర్థ్యము వలన ఆ రాజునకును, అతని సామ్రాజ్యమునకును అభ్యుదయము చేకూరుచున్నది.
8. మేమెల్లరము ఏలినవారి తెలివితేటలగూర్చివింటిమి. అస్సిరియా సైన్యమంతటిలో సామర్ధ్యమునను, అనుభవమునను, చాకచక్యమునను తమరిని మించిన సైన్యాధిపతిలేడని, లోకమంతయు ఎరుగును.
9. బెతూలియా ప్రజలు అకియోరు ప్రాణములు కాపాడిరి. అతడు తాను మీ మంత్రాలోచన సభలో ఏమి చెప్పినది మాకు ఎరిగించెను.
10. అయ్యా! అకియోరు చెప్పినది నిజమే. కనుక తమరతని మాటలను చులకన చేయరాదు. అతని సందేశము నమ్మదగినదే. మా ప్రజలు దేవుని ధిక్కరించి పాపము చేసిననే తప్ప ఎవరు వారిని శిక్షింపజాలరు, జయింపజాలరు.
11. అయినను ఇప్పుడు ఏలినవారికి ఎట్టి ఆటంకము గాని, అపజయముగాని కలుగబోదు. మా ప్రజలకిప్పుడు చావుమూడినది. వారు పాపమునకు లొంగిరి. పాపము చేసినపుడెల్ల వారు ప్రభువు కోపమును రెచ్చగొట్టుదురు.
12. బెతూలియా ప్రజలు సేకరించి ఉంచుకొనిన ఆహారమంతయు అయిపోయినది. వారి నగరమున నీరు కూడ లేదు. ఇపుడా జనులు తమ పశువులమందలను చంపి తిననున్నారు. ఇంకను వారు ధర్మశాస్త్రము నిషేధించిన ఆహారమునుగూడ భుజింపనున్నారు.
13. వారు తమకు పండిన పంట నుండి పదియవ పాలుగా దేవునికర్పించిన గోధుమలను, ద్రాక్ష సారాయమును, ఓలివుతైలమును ఆరగింప నిశ్చయించుకొనిరి. కాని ఇవి పవిత్రమైన భోజన పదార్థములు. యెరూషలేమున దేవునికి అర్చించు యాజకులు మాత్రమే వానిని భుజింపవచ్చును. సామాన్యజనులు వానిని ముట్టనైన ముట్టరాదు.
14. యెరూషలేము పౌరులిట్టి నిషిద్ధవస్తువులను భుజింప మొదలిడిరి. కనుక మా పట్టణము వారును యెరూషలేమునకు దూతలనంపిరి. ఆ దూతలు అచటి మహాసభ సభ్యులనుండి ఈ నిషిద్ధవస్తువులను భుజించుటకు అనుమతిని పొంది వత్తురు.
15. వారు తిరిగిరాగానే మా ప్రజలు ఈ వస్తువులను సేవింతురు. అట్లు సేవింపగానే వారెల్లరు మీ చేతికి చిక్కుదురు.
16. ఈ సంగతి తెలియగానే నేను మా జనుల నుండి పారిపోయివచ్చితిని. ఏలినవారి కొక ముఖ్యమైన పనిని చేసి పెట్టుటకు ప్రభువు నన్నిచటకు పంపెను. అది యేమియో తెలిసి కొనినపుడు లోకము లోని జనులెల్లరును విస్తుపోవుదురు.
17. తమ దాసినైన నేను భక్తురాలను, ఆకాశాధిపతియైన దేవుని రేయింబవళ్ళు సేవించుదానను. నేనిచటనే యేలినవారి శిబిర మున వసింపగోరెదను. నేను ప్రతిదినము రాత్రి వెలుపలిలోయలోనికి పోయి దేవుని ప్రార్ధించివత్తును. మా ప్రజలు పాపము కట్టుకొనగనే దేవుడు నాకు తెలియజేయును.
18. వారు పాపము చేయగనే నేను వచ్చి తమరికి విన్నవింతును. వెంటనే ప్రభువులవారు సర్వసైన్యముతో పోయి వారిమీద పడవచ్చును. అపుడు యిస్రాయేలీయులు మిమ్ము ఎదిరింపజాలరు.
19. నేను ఏలినవారిని యూదయా మండలముగుండ నడిపించుకొనిపోవుదును. మిమ్ము యెరూషలేమునకు కొనిపోయి ఆ నగర మధ్యమున రాజుగా అభిషేకింతును. అప్పుడు ప్రభువులవారు సొంత కాపరిని కోల్పోయిన గొఱ్ఱెలమందనువలె ఆ జనులనెల్లరిని చెల్లాచెదరు చేయవచ్చును. ఇక ఒక్క కుక్క కూడ తమరిని చూచి మొరుగుటకు వీలుండదు. దేవుడు నాకీ సంగతిని ముందుగనే తెలియజేసెను. ఇప్పుడు ప్రభువుల వారికి ఈ సమాచారమును అందించుటకుగాను ఆయన నన్నిటకు పంపెను” అని చెప్పెను.
20-21. హోలోఫెర్నెసు అతని సేవకులు యూదితు పలుకులను మెచ్చుకొనిరి. వారు అమె తెలివితేటలను మెచ్చుకొనుచు ఇంత అందగత్తె, ఇంత మాటకారితనము కల మహిళ ప్రపంచమున ఎందైన గలదా అని ఒకరితో నొకరు చెప్పుకొనిరి.
22. హోలోఫెర్నెసు ఆమెతో “మాకు విజయము చేకూర్చి పెట్టుటకును, మా ప్రభువైన నెబుకద్నెసరును ధిక్కరించినవారిని సర్వనాశనము చేయుటకును దేవుడు నిన్ను ముందుగా మా చెంతకు పంపెను.
23. నీవు అందగత్తెవు, నేర్పుతో మాటలాడగల దానవు కూడ. నీవు చెప్పినట్లే చేయుదువేని నేనును మీ దేవుని పూజింతును. నీ మట్టుకు నీవు నెబుకద్నెసరు రాణి వాసమున వసించుచు జగత్ప్రసిద్ధిని పొందవచ్చును” అనెను.
1. హోలోఫెర్నెసు సేవకులను పిలిచి యూదితును వెండిపాత్రలు అమర్చియున్న తన భోజనపు బల్లయొద్దకు కొనిపోయి తన భోజనమును, ద్రాక్షసారాయమును ఆమెకు వడ్డింపుడని ఆదేశించెను.
2. కాని యూదితు అతనితో “నేను మీ భోజనమును భుజింతునేని మా దేవుని నియమములను మీరినట్ల గును. కనుక నేను తెచ్చుకొనిన ఆహారమునే తిందును” అనెను.
3. సైన్యాధిపతి “నీవు కొనివచ్చిన భోజనము అయిపోయినచో మరల ఎచటినుండి తెచ్చుకొందువు? మా శిబిరమున మీ జాతివారెవరును లేరు” అనెను.
4. యూదితు “దేవరవారి తోడు! నేనీ భోజనపదార్ధములను ముగింపకపూర్వమే మా దేవుడు నా ద్వారా తన కార్యమును ముగించుకొనును” అని చెప్పెను.
5. అంతట సేవకులామెను ఒక గుడారమునకు కొనిపోయిరి. అట యూదితు వేకువజాము వరకు నిద్రించెను.
6. నిద్రనుండి లేచిన పిదప ఆమె హోలోఫెర్నెసు నొద్దకు దూతనంపి వెలుపలికి వెళ్ళి ప్రార్థన చేసికొనుటకు ఈ దాసురాలికి అనుమతి ఇప్పింపుడని అడిగించెను.
7. సైన్యాధిపతి ఆమెను శిబిరమునుండి బయటికి వెళ్ళనిండని తన కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఆ రీతిగా యూదితు మూడు దినముల పాటు శిబిరమున వసించెను. ఆమె ప్రతి రాత్రి వెలుపలికి పోయి బెతూలియా చెంతగల లోయలోని చెలమలో స్నానముచేసి వచ్చెడిది.
8. తిరిగివచ్చునపుడు యిస్రాయేలు ప్రజలను రక్షించు మార్గము తెలియజేయుమని దేవుని ప్రార్థించెడిది.
9. ఆమె స్నానము చేసి శుద్ధినిపొంది శిబిరమునకు తిరిగివచ్చి రాత్రి భోజనము చేయువరకు దాని లోపలనే ఉండెడిది.
10. యూదితు శిబిరమున చేరిన నాలుగవ రోజున హోలోఫెర్నెసు ఒక విందు చేసెను. ఆ విందునకు అతని సేవకులనే గాని సైన్యాధికారులను ఎవరిని ఆహ్వానింపరైరి.
11. హోలోఫెర్నెసు తన వ్యక్తిగత అవసరములను తీర్చు నపుంసక సేవకుడు బగోవాసును పిలిచి “ఆ హెబ్రీయ వనిత నీ ఆధీనమున నున్నదికదా! ఆమె నేడు నాతో ఆహారపానీయములు సేవించుటకు మన గుడారమునకు రావలెను. నీవు ఆమెకు నచ్చ జెప్పుము.
12. ఇట్టి వనితను అనుభవింపక వదలివేయుదుమేని లోకము నెదుటనగుబాట్లు తెచ్చుకొందుము. నేను ఆమెను చెరపక విడుతునేని ఆమె నన్ను చూచి నవ్వును” అనెను.
13. కనుక బగోవాసు యూదితు నొద్దకు పోయి “అమ్మా! నీవు చక్కని చుక్కవు. నేడు మా సైన్యాధిపతి గుడారమునకు వచ్చి అతని సరసన కూర్చుండి హాయిగా ద్రాక్షసారాయమును సేవింపుము. నెబుకద్నెసరు అంతఃపురమున ఆ రాజునకు సేవలు చేయు అస్సిరియా వనితలవలె నీవును నేడు సుఖము అనుభవింపవలెను” అనెను.
14. యూదితు “ఏలినవారి మాట కాదనుటకు నేనేపాటి దానను? అతని కోర్కెను నెరవేర్చుటకు నేను సిద్ధముగనే ఉన్నాను. ఈ సంఘటనను నా జీవితాంతము వరకు జ్ఞప్తియందుంచు కొందును” అని సమాధానము ఇచ్చెను.
15. ఆమె వెంటనే లేచి మంచి బట్టలు తాల్చి ఆభరణములతో సొగసుగా అలంకరించు కొనెను. ఆమె దాసి ముందుగా వెళ్లి హోలోఫెర్నెసు ముందట గొఱ్ఱెపిల్ల చర్మమును పరచెను. అంతకు ముందే బగోవాసు ఆ చర్మమును యూదితునకు ఇచ్చియుండెను. ఆమె దానిమీద కూర్చుండి భుజించెడిది.
16. యూదితు గుడారములలోనికి వచ్చి ఆ చర్మము మీద గూర్చుండెను. ఆమెను చూడగనే హోలోఫెర్నెసునకు మనసు చలించెను. అతడు ఆమె మీద కోరికపడి మహోద్రేకమునకు గురియయ్యెను. అసలు యూదితును కంటితో చూచిన నాటినుండే హోలోఫెర్నెసు ఆమెను చెఱపగోరి అవకాశమునకై వేచియుండెను.
17. అతడామెతో “నీవు ద్రాక్షసారాయమును సేవించుచు మాతోపాటు ఆనందింపుము” అనెను.
18. ఆమె “నేనీ పానీయమును తప్పక సేవింతును. నా జీవితమున నేటియంత శుభదినము లేదు” అని పలికెను.
19. కాని యూదితు తన దాసి సిద్ధము చేసి ఇచ్చిన ఆహారపానీయములనే అతని ముందట ఆరగించెను.
20.హోలోఫెర్నెసు యూదితును చూచి ఆనందము పట్టజాలక తన జీవితమున ఏనాడును త్రాగనంత ద్రాక్షాసారాయమును త్రాగెను.
1. అంతట రాత్రి ప్రొద్దుపోవగా హోలోఫెర్నెసు బంటులెల్లరు వెళ్ళిపోయిరి. బగోవాసు సైన్యాధిపతి సమక్షమున మిగిలియున్న వారినిగూడ పంపివేసి, వెలుపలి వైపు నుండి గుడారముల తలుపులు మూసివేసెను. విందు ముగియుటకు చాల తడవు పట్టినందున ఎల్లరును అలసిపోయియుండిరి. కావున సేవకులెల్లరు వెంటనే నిద్రింపబూనిరి.
2. గుడారమున యూదితు ఒక్కతెయే మిగిలియుండెను. హోలోఫెర్నెసు తప్ప త్రాగి మత్తెక్కి పడుకమీద తూలియుండెను. యూదితు దాసి తన యజమానురాలి కొరకు బయట వేచి యుండెను.
3. యూదితు తాను రోజు వెళ్ళినట్లే ఆనాడు గూడ ప్రార్ధనము చేసికొనుటకు వెలుపలికి వెళ్ళుదుననియు, తనకొరకు గుడారము పడకగది యొద్ద వేచియుండవలెననియు దాసితో చెప్పెను. వాడుక ప్రకారముగా ప్రార్ధన చేసికొనుటకు వెలుపలికి వెళ్ళుదునని ఆమె బగోవాసునకు గూడ చెప్పెను.
4-5. అప్పటికే ఎల్లరు సర్వసైన్యాధిపతి గుడారము నుండి వెళ్ళిపోయిరి. యూదితు హోలోఫెర్నెసు పడుకచెంత నిలుచుండి మౌనముగా ఇట్లు ప్రార్ధించెను: “సర్వశక్తిమంతుడైన ప్రభూ! యెరూషలేమునకు కీర్తికొనివచ్చుటకుగాను నేను చేయనెంచిన కార్యమును సఫలము చేయుము. నాకు సాయముచేసి, మా మీదికి దండెత్తి వచ్చిన శత్రువులను నాశనము చేసి, నీ వెన్నుకొనిన ప్రజను రక్షించుటకు ఇదియే తరుణము."
6. అంతట ఆమె హోలోఫెర్నెసు తల ప్రక్కనున్న కొయ్యచెంతకు వెళ్ళి దానిమీద వ్రేలాడు ఖడ్గమును తీసికొనెను.
7. మంచము దగ్గరికి వచ్చి అతని తల వెండ్రుకలను గుప్పిట పట్టుకొని “యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! నాకు బలమును దయచేయుము” అని ప్రార్ధించెను.
8. అటుపిమ్మట కత్తి ఎత్తి రెండు మారులు బలముతో హోలోఫెర్నెసు గొంతును నఱుకగా అతని తల తెగిపోయెను.
9. ఆమె అతని మొండెమును పడుక మీదినుండి క్రిందికి దొర్లించెను. మంచపు కలలమీద వ్రేలాడు తెరను లాగితీసికొనెను.
10. పిమ్మట గుడారము వెలుపలికి వచ్చి శిరస్సును దాసి చేతికీయగా ఆమె దానిని ఆహారపదార్దముల సంచిలో దాచెను. అంతట ఆ మహిళలు ఇరువురు ప్రార్ధనము చేసికొనుటకు పోవుచున్నట్లే నటించి శిబిరమును వీడి వెలుపలికొచ్చిరి. పాళెమును దాటి లోయగుండ కొంత దూరము నడచి కొండయెక్కి బెతూలియా నగరద్వారము చేరుకొనిరి.
11. యూదితు దూరము నుండియే ద్వార సంరక్షకులను బిగ్గరగా పిలిచెను. “కవాటము తెరవుడు. ప్రభువు మనలనింకను ఆదుకొనుచునే యున్నాడు. అతడు నేడు తన బలమును ప్రదర్శించి యిస్రాయేలును సంరక్షించెను. తన శక్తిని జూపి మన శత్రువులను హతమార్చెను” అని పలికెను.
12. ఆమె పలుకులాలించి పురజనులు నగరద్వారము చెంతకు పరుగెత్తుకొని వచ్చిరి. వారు పట్టణపు పెద్దలను పిలువనంపిరి.
13. పెద్దలనక, పిల్లలనక నగరములోని ప్రజలెల్లరును ద్వారము చెంతకు పరుగెత్తుకొని వచ్చిరి. యూదితు తిరిగి వచ్చినదని ఎవరు నమ్మజాలరైరి. ప్రజలు ద్వారము తెరచి యూదితును ఆమె దాసిని ఆహ్వానించిరి. పెద్దమంటను వేసి ఆ ఇద్దరి చుట్టు గుమిగూడిరి.
14. అంతట యూదితు గొంతెత్తి “ఎల్లరు ప్రభువును స్తుతింపుడు. ఆయన యిస్రాయేలీయులకు కనికరము చూపుట మానలేదు. ఈ రాత్రి ఆయన నా ద్వారా మన శత్రువులను నాశనము చేసెను” అని పలికెను.
15. అంతట ఆమె సంచిలో నుండి తలను వెలుపలికి తీసి ప్రజలెల్లరికి చూపుచు “ఇది అస్సీరియా సైన్యాధిపతి హోలోఫెర్నెసు శిరస్సు. ఇది అతడు తప్ప త్రాగి తూలిపోయిన పడుకమీది తెర. ప్రభువొక ఆడపడుచు చేత అతనిని మట్టుపెట్టించెను.
16. ప్రభువు నేను తలపెట్టిన కార్యమున నన్ను సురక్షితముగా కాపాడెను. హోలోఫెర్నెసు నా అందమునకు భ్రమసి వినాశనము తెచ్చుకొనెను. మన దేవునితోడు అతడు నన్ను చెఱపను లేదు, నాకు కళంకము ఆపాదింపను లేదు” అని చెప్పెను.
17. ఆ మాటలాలించి పౌరులెల్లరును విస్తు పోయిరి. వారు సాష్టాంగపడి ప్రభువును ఆరాధించి ఏకకంఠముతో "ప్రభూ! నేడు నీవు మా శత్రువులను హతమార్చితివి. కనుక మేము నీకు వందనములు అర్పించుచున్నాము" అని పలికిరి.
18-20. అంతట ఉజ్జీయా యూదితుతో ఇట్లనెను: కుమారీ! సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. భూమ్యాకాశములను సృజించిన మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. ఆ ప్రభువు సహాయముతో నీవు, శత్రునాయకుని తల తెగనరికితివి. కనుక ప్రభువు మాహాత్మ్యమును వచించు జనులు అతనిపట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడును విస్మరింపజాలరు. మన ప్రజలు దురవస్థకు గురియైయున్నపుడు నీవు నీ ప్రాణమును గూడ లెక్కచేయక దైవమార్గమున నడచి మమ్మెల్లరిని కాపాడితివి కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి, నీ కీర్తిని కలకాలము నిల్పునుగాక”. ఆ పలుకులాలించి ప్రజలెల్లరును 'అమెన్' అని బదులుపలికిరి.
1. అంతట యూదితు పురజనులను చూచి “సోదరులారా! నా మాటవినుడు. ఈ శిరస్సును కొనిపోయి నగరప్రాకారముమీద వ్రేలాడదీయుడు.
2. మీరొక నాయకుని ఎన్నుకొనుడు. తెల్లవారగనే మీలో యుద్ధము చేయగలవారందరును ఆయుధములు చేపట్టి పట్టణమునుండి కదలిపొండు. మీరు మన నగరమునకు చేరువలోనున్న అస్సిరియా దండుమీద దాడిచేయుటకు పోయినట్లుగా కన్పింపవలెను. కాని మీరు వారి దగ్గరకు మాత్రముపోరాదు.
3. మిమ్ము చూచి అస్సీరియా సైనికులాయుధములు చేపట్టి శిబిరమునకు పరిగెత్తుకొనిపోయి తమ సైన్యాధిపతులను లేపుదురు. ఆ సేనాపతులు హోలోఫెర్నెసు గుడారములకు పరుగెత్తుదురు. కాని అచట అతడు వారి కంటబడడు. అపుడు వారి సైన్యమంత కలవరపడి పారిపోవును. మీరు వారి వెంటబడవచ్చును.
4. మీరును ఇతర యిస్రాయేలీయులును వారిని వెన్నాడి ముక్కలు ముక్కలు చేయవచ్చును.
5. కాని మీరు మొదట అమ్మోనీయుడయిన అకియోరును ఇచటికి పిలిపింపుడు. హోలోఫెర్నెసు యిప్రాయేలీయులను చులకనచేయుచు మాట్లాడెను.. అకియోరునుగూడ మనతో చంపదలచి అతడిని ముందుగనే యిచటికి పంపెను. అట్టివానిని అకియోరు ఇప్పుడు గుర్తింప గలడేమో చూతము” అనెను. .
6. కనుక వారు ఉజ్జీయా ఇంటి నుండి అకియోరును పిలిపించిరి. అతడు వచ్చి అచట గుమిగూడియున్నవారిలో ఒకనిచేత వ్రేలాడు హోలోఫెర్నెసు శిరస్సును చూచి అక్కడికక్కడే మూర్చపోయి నేలకొరిగెను.
7. జనులు అతనిని పైకి లేవనెత్తిరి. అకియోరు యూదితు పాదముల మీదవ్రాలి ఆమెకు నమస్కారము చేసి: “యూదియాలోని ప్రతి కుటుంబము నిన్ను దీవించునుగాక! నీ పేరు విని ప్రతిజాతియు గడగడ వణకునుగాక!” అని పలికెను.
8. మరియు అతడు ఈ గడచిన దినములలో నీవేమేమి చేసితివో మాకు తెలుపుము అని యూదితునడిగెను. ప్రజలెల్లరును వినుచుండగ యూదితు తాను బెతూలియా నుండి వెడలిపోయిన నాటినుండి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యముల నెల్ల పూసగ్రుచ్చినట్లు వివరించి చెప్పెను.
9. ఆమె తన కథను ముగింపగా ప్రజలెల్లరు హర్ష ధ్వానములు చేసిరి. నగరము వారి ఉత్సాహ ధ్వనులతో మారుమ్రోగెను.
10. అకియోరు యిస్రాయేలు దేవుడు చేసిన మహాకార్యములెల్ల చూచి ఆ ప్రభువును విశ్వసించెను. అతడు సున్నతిని పొంది యిస్రాయేలు సమాజమున చేరెను. అతని వంశజులు నేటికిని యూదులుగనే జీవించుచున్నారు.
11. మరునాటి ఉదయము యిప్రాయేలీయులు హోలోఫెర్నెసు శిరస్సును నగరప్రాకారమునకు వ్రేలాడ గట్టిరి. వారెల్లరు ఆయుధములు చేపట్టి గుంపులు గుంపులుగా క్రింది లోయలోనికి దిగిరి.
12. వారిని చూచి అస్సీరియా సైనికులు తమ నాయకులకు వార్త పంపిరి. ఆ నాయకులు సైన్యాధిపతులకు సమాచార మందజేసిరి.
13. .ఆ సైన్యాధిపతులు హోలోఫెర్నెసు గుడారమునకు వెళ్ళి బగోవాసుతో “దొరను నిద్రలేపుము. ఆ యిస్రాయేలు బానిసలకు కొమ్ములు వచ్చినవి. వారు మనమీదికే దాడి చేసిరి. అసలు వారికి పోగాలమువచ్చినది” అని చెప్పిరి.
14. బగోవాసు గుడారములోని శయనాగారపు తెర ముందట నిలుచుండి చప్పట్లు కొట్టి శబ్దము చేసెను. అతడు హోలోఫెర్నెసు ఇంకను యూదితుతో నిద్రించుచు ఉండెననుకొనెను.
15. కానియెంత సేపటికిని లోపలినుండి జవాబు రాకుండుటచే తెరను ప్రక్కకు లాగి లోపలికి వెళ్ళెను. అచట హోలోఫెర్నెసు మొండెము మంచము క్రింద పాదపీఠముమీద పడియుండెను.
16. ఆ దృశ్యమును చూచి బగోవాసు గావుకేకలు పెట్టెను. దుఃఖముతో వెక్కివెక్కి యేడ్చుచు బట్టలు చించుకొనెను.
17. అతడు యూదితు గుడారముకు వెళ్ళి చూడగా ఆమె కన్పింప దయ్యెను. అంతట అతడు హోలోఫెర్నెసు సైన్యాధిపతులయొద్దకు వచ్చి,
18. “ఆ బానిసతొత్తులు మనలను వంచించిరి. ఒక హీబ్రూ ఆడుది నెబుకద్నెసరు సామ్రాజ్యము అంతటికిని తలవంపులు తెచ్చినది. హోలోఫెర్నెసు మొండెము నేలమీద పడియున్నది. తలలేదు” అని అరచెను.
19. ఆ మాటలు విని సేనాపతులు విచారముతో బట్టలుచించుకొనిరి. వారి శిబిరమున కలవరము పుట్టగా వెట్టియేడ్పులు హాహారావములు విన్పించెను.
1. జరిగిన సంగతి విని అస్పిరియా సైనికులు దిగ్భ్రాంతి చెందిరి.
2. ఆ సైనికులెల్లరు గగ్గోలుపడి చెల్లాచెదరైపోయిరి. కొండలను, లోయలనుబట్టి ఎవరికి కన్పించిన త్రోవలవెంట వారు పారిపోజొచ్చిరి.
3. బెతూలియా చుట్టును కొండలలో శిబిరములు పన్నిన సైనికులును కాలికి బుద్ధి చెప్పిరి. యిస్రాయేలు సైనికులు వారిని వెంబడించి తరిమిరి.
4. ఉజ్జీయా బెతోమెస్తాయిము, బెబాయి, కోబా, కోలా నగరములకును, యిస్రాయేలు మన్యమంతటికిని దూతలను పంపి జరిగిన సంగతులెల్ల అచటి ప్రజలకు చెప్పించెను. అచటి జనులెల్లరును కలిసి వచ్చి శత్రువుల మీదపడి వారిని హతమార్పవలెనని కోరిరి.
5. ఆ సమాచారము అందుకొని యిస్రాయేలీయులెల్లరు ప్రోగైవచ్చి విరోధులను వెన్నాడిరి. కోబా వరకు వారిని తరిమికొట్టి చిక్కిన వారిని చిక్కినట్లు మట్టుబెట్టిరి. యెరూషలేము పౌరులు, మన్యములలోని యితర ప్రజలు అస్సిరియా శిబిరమున జరిగిన సంగతులను దూతలవలన విని శత్రువుల వెంటబడిరి. గిలాదు, గలిలీ నివాసులు పారిపోవు అస్సిరీయులకు అడ్డువచ్చి వారిలో చాల మందిని వధించిరి. వారు దమస్కు పరిసరముల వరకు విరోధులను తరిమికొట్టిరి.
6. బెతూలియా నగరములో మిగిలినవారు అస్సిరియా శిబిరముమీద పడి కొల్లసొమ్మును విస్తారముగా దోచికొని సంపన్నులైరి.
7. శత్రువులను తునుమాడి తిరిగివచ్చు యిస్రాయేలు సైనికులు విరోధి శిబిరమును కొల్లగొట్టిరి. ఆ పాళెమున చాల సొత్తు కలదు కనుక కొండలలోను పట్టణములనుండి, పల్లెలనుండికూడ ప్రజలు వచ్చి కొల్లసొమ్మును దోచుకొనిరి.
8. యెరూషలేమున వసించు ప్రధానాచార్యుడు యోయాకీము, మహాసభ సభ్యులు ప్రభువు నిర్వహించిన మహాకార్యములను కన్నులార చూచుటకును, యూదితును అభినందించుటకును బెతూలియాకు విచ్చేసిరి.
9-10. వారెల్లరు యూదితును పొగడుచు: “నీ వలన యెరూషలేమునకు కీర్తి కల్గినది. నిన్ను చూచి యిస్రాయేలీయులు గర్వింతురు. నీ వలన మనజాతికెనలేని గౌరవము చేకూరినది. నీవు స్వయముగా ఈ కార్యమును సాధించి, యిస్రాయేలీయుల మన్ననను పొందితివి. నీ చెయిదమును దేవుడు మెచ్చుకొనును. నీ జీవితకాలమంతయు ప్రభువు నిన్ను దీవించుగాక!” అని పలికిరి. ఆ పలుకులకు ప్రజలెల్లరు 'ఆమెన్' అనిరి.
11. అస్సిరీయుల శిబిరమును పూర్తిగా దోచుకొనుటకు ఒక మాసము పట్టెను. ప్రజలు హోలోఫెర్నెసు గుడారమునందలి వెండి పాత్రములు, ఆసనములు, పరికరములను యూదితునకు కానుకగా ఇచ్చిరి. ఆమె ఈ వస్తువులనెల్ల తన కంచరగాడిద మీదికి, బండ్ల మీదికెత్తించెను.
12. యిస్రాయేలు స్త్రీలు యూదితును చూచుటకొచ్చిరి. వారామెను కీర్తించుచు గీతములు పాడి, నాట్యముచేసిరి. యూదితు మరియు ఆమెతో పయనము చేయు స్త్రీలు సంతోష సూచకముగా చిన్న కొమ్మలను చేపట్టిరి.
13. తలమీద ఓలివుపత్రముల దండలను ధరించిరి. యూదితు ముందు పోవుచుండగా, ఆ స్త్రీలు ఆమెవెంట నడచుచు నాట్యము చేసిరి.
14. వారి వెనుక ఆయుధములు ధరించి పూలమాలలు తాల్చి గీతములు పాడుచు పురుషులు వచ్చిరి.
1. అప్పుడు యూదితు ప్రజలందరు వినుచుండగా ఈ క్రింది కృతజ్ఞతాగీతము పాడగా ప్రజలా పాటనందుకొని పాడిరి.
2. తంబురతో నా దేవుని కీర్తింపుడు. చిట్టితాళములతో ఆయనను కొనియాడుడు. స్తుతిగీతములతో ఆయనను వినుతింపుడు. ఆ ప్రభువు నామమును సన్నుతింపుడు.
3. మన ప్రభువు యుద్ధములను రూపు మాపువాడు. ఆయన నన్ను శత్రువుల బారినుండి కాపాడి , మరల మన ప్రజల మధ్యకు కొనివచ్చెను.
4. ఉత్తరదేశ పర్వతములనుండి అస్సిరీయులు వచ్చిరి. వేలకొలది సైనికులతో శత్రువులు వచ్చిరి. లోయలలోని నదులు వారి సైన్యములతో నిండిపోయెను. కొండలు వారిగుఱ్ఱములతో క్రిక్కిరిసిపోయెను.
5. శత్రువులు మన దేశమును తగుల బెట్టుదుమని, మన పడుచువారిని వధింతుమని, మన చంటిబిడ్డలను నేలపై విసరికొట్టుదుమని, మన పిల్లలను బందీలనుగా కొనిపోవుదుమని, మన ఆడపడుచులను చెరపట్టుదుమని బెదరించిరి.
6. కాని సర్వోన్నతుడైన ప్రభువు వారికి అడ్డువచ్చి, ఒక ఆడుపడుచు ద్వారా వారి యత్నమును వమ్ముచేసెను.
7. వారి నాయకుడు యువ సైనికులకుగాని మహావీరులకుగాని బలాఢ్యులకుగాని చిక్కి చావలేదు. మెరారి పుత్రిక యూదితు తన సౌందర్యముతో అతనిని మట్టు పెట్టెను.
8. ఆమె యిస్రాయేలు బానిసత్వమును తొలగింపగోరి, వైధవ్య సూచకములైన ఉడుపులను తొలగించి, పరిమళ తైలమును పూసికొని, శిరోజములకు పట్టీని కట్టుకొని, పట్టుబట్టలు తాల్చి శత్రువును మోసగించెను. ఆమె పాదరక్షలను చూచి అతడు భ్రమసిపోయెను.
9. ఆమె అందమును చూచి సమ్మోహితుడయ్యెను. కడన ఆమె కత్తి అతని మెడను తెగనరికెను.
10. పారశీకులు ఆమె ధైర్యమును చూచి వెలవెలబోయిరి. మాదియా దేశీయులామె పరాక్రమమునకు విస్మయము చెందిరి.
11. దీనులైన మన ప్రజలు యుద్ధనాదము చేయగా శత్రువులు భయపడిరి. దుర్బలులైన మన జనులు విజయనాదము చేయగా విరోధులు భయకంపితులై పారిపోయిరి.
12. బానిసల బిడ్డలైన మనవారు విరోధులను, పారిపోవు బానిసలను పొడిచినట్లుగా పొడిచిరి. ప్రభువు సైన్యము వారిని సర్వనాశనము చేసెను.
13. ప్రభువునకు నేనొక క్రొత్తపాట పాడెదను. ప్రభూ! నీవు ఘనుడవు, మహిమాన్వితుడవు, బలాఢ్యుడవు, అజేయుడవు.
14. నీవు కావించిన ఈ సృష్టి అంతయు నిన్ను సేవించుగాక! నీవు ఆ ఈయగా సమస్తమును కలిగినది. నీవు ఊపిరిపోయగా ప్రాణులన్నియు పుట్టినవి. నీ ఆజ్ఞనెవరును జవదాట జాలరు.
15. నిన్ను చూచి పర్వతములు, సముద్రములు కంపించిపోవును. నీయెదుట బండలు మైనమువలె కరిగిపోవును. కాని నీ పట్ల భయభక్తులు చూపువారిని మాత్రము నీవు కరుణతో ఆదరింతువు.
16. కమ్మని వాసనలొలుకు బలికంటె, దహనబలిలో వేల్చిన క్రొవ్వుకంటె, నీ పట్ల భయభక్తులు చూపువారు, నీకు అధిక ప్రీతి కలిగింతురు.
17. నా ప్రజలమీద పోరు తలపెట్టువారు నాశనమయ్యెదరు. న్యాయనిర్ణయము చేయునాడు ప్రభువు వారిని శిక్షించును. ప్రభువు వారి దేహములను అగ్నికి, క్రిములకు ఆహుతి చేయగా వారు సదా బాధతో అలమటింతురు.”
18. అంతట ఆ భక్తులు యెరూషలేము చేరి శుద్ధిచేసికొని ప్రభువును ఆరాధించిరి. దేవునికి దహన బలులు, స్వేచ్చా పూర్వకమైన బలులు, కానుకలు అర్పించిరి.
19. యూదితు ప్రజలు తన పరము చేసిన హోలోఫెర్నెసు సొత్తు నంతటిని దేవాలయమున సమ ర్పించెను. ఆమె స్వయముగా హోలోఫెర్నెసు మంచము మీదినుండి తీసికొని వచ్చిన తెరనుగూడ దేవుని కర్పించి తన వ్రతము తీర్చుకొనెను.
20. ఆ భక్తులెల్లరు మూడునెలల పాటు యెరూషలేముననే ఉండి దేవాలయము ఎదుట ఉత్సవము చేసికొనిరి. యూదితు కూడ అంతకాలము వారితోపాటు అచటనే ఉండెను.
21. యెరూషలేమున ఉత్సవమును ముగించు కొనిన పిదప ఎల్లరును తమతమ ఇండ్లకు వెళ్లిపోయిరి. యూదితు కూడ బెతూలియాలోని తన ఇంటికి వెడలి పోయెను. ఆమె బ్రతికియున్నంతకాలము యిస్రాయేలు దేశమంతట ఆమె పేరు మారుమ్రోగెను.
22. యూదితును పెండ్లి ఆడుటకు చాల మంది వరులు వచ్చిరి. కాని ఆమె తన భర్త మన షేగతించిన తరు వాత మరల పెండ్లియాడదయ్యెను.
23-24. ఆ పుణ్యాంగన తన భర్త ఇంటనే వసించెను. రోజురోజు నకు ఆ ధీరవనిత కీర్తి వృద్ధి చెందెను. ఆమె చనిపోక ముందు తన ఆస్తిని తన దగ్గరి చుట్టములకును తన పెనిమిటి బంధువులకును పంచియిచ్చెను. తన బానిసకు స్వేచ్ఛను ప్రసాదించెను. ఆ పుణ్యాత్మురాలు తననూట ఐదవయేట బెతూలియా నగరముననే పర మపదించెను. ఆమెను తన భర్త మనష్షే సమాధిలోనే పాతి పెట్టిరి. యిస్రాయేలీయులు ఆమె మృతికి ఏడు రోజులపాటు సంతాపము తెలిపిరి.
25. యూదితు జీవించియున్నంతకాలమును, ఆమె చనిపోయిన తరువాత చాలనాళ్ళ వరకును గూడ శత్రువులు ఎవరును యిస్రాయేలీయులను మరల బాధింపలేదు.