ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గలతీయులకు వ్రాసిన లేఖ

 1. మనుష్యులనుండి కాని, మనుష్యునిద్వారా కాని కాక యేసుక్రీస్తు ద్వారా, ఆయనను మృతులలో నుండి లేవనెత్తిన తండ్రియగు దేవుని ద్వారా, అపోస్తలునిగా పిలుపును పొందిన పౌలు వ్రాయునది.

2. ఇటనున్న సోదరులు అందరును నాతో కలసి గలతీ యలోని క్రైస్తవ సంఘములకు శుభాకాంక్షలను పంపుచున్నారు.

3. మన తండ్రియగు దేవుడును, ప్రభువగు యేసు క్రీస్తును మీకు కృపను సమాధానమును ప్రసాదింతు రుగాక!

4. ఈ ప్రస్తుత దుష్టయుగమునుండి మనకు విముక్తి కలిగించుటకై మన తండ్రియగు దేవుని సంకల్పమును అనుసరించి, మన పాపముల కొరకు క్రీస్తు ఆత్మార్పణము చేసికొనెను.

5. దేవునకు సదా మహిమ కలుగునుగాక! ఆమెన్.

6. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది!  క్రీస్తుయొక్క కృపకు మిమ్ము పిలిచినవానిని ఇంత త్వరగా విడనాడి, మరియొక సువార్తవైపుకు మరలు చున్నారుగదా!

7. నిజమునకు అది మరియొక సువార్త కాదు. కాని కొందరు మిమ్ము కలవరపెట్టి, క్రీస్తు సువార్తను మార్పుచేయ ప్రయత్నించుచున్నారు.

8. మేము కాని, లేక దివినుండి దిగివచ్చిన దేవదూతయే కాని, మేము బోధించిన దానికంటె భిన్నమైన సువార్తను మీకు బోధించినయెడల అతడు శపింపబడునుగాక!

9. ఇది మేము పూర్వమే చెప్పియుంటిమి. కాని ఇప్పుడు మరల చెప్పుచున్నాము. మీరు స్వీకరించిన సువార్తకంటె వేరైన మరియొక సువార్త మీకు ఎవడేని బోధించినచో అతడు శాపగ్రస్తుడగునుగాక!

10. నేను ఇపుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా? లేక దేవుని ఆమోదమునా? లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా? నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడనై ఉండను.

11. సోదరులారా! నేను మీకు తెలియజేయుచున్నాను: నేను బోధించు సువార్త మానవకల్పితము కాదు.

12. నేను దానిని ఏమనుష్యునివద్దనుండి పొందలేదు. ఎవ్వరును దానిని నాకు బోధింపలేదు. యేసు క్రీస్తే దానిని నాకు బయలుపరచెను.

13. పూర్వము నేను యూద మతమునందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగ హింసించి, దానిని నాశనముచేయ ప్రయత్నించితినో మీరు వినియున్నారుగదా!

14. యూదమతమును అవలంబించుటలో నా వయసు గల తోడి యూదులు అనేకులలో నేనే అగ్రగణ్యుడనైయుంటిని. మన పూర్వుల సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగియుండెడివాడను.

15. కాని నా తల్లి గర్భమునందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను.

16. ఆయనను అన్యులకు బోధించుటకుగాను, దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచుటకు ఉద్దేశించినపుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనుష్యుని వద్దకును పోలేదు.

17. నా కంటే ముందు అపోస్తలులైన వారిని చూచుటకు కూడ నేను యెరూషలేమునకు పోలేదు. కాని వెంటనే అరేబియాకు వెళ్ళిపోతిని. దమస్కు పట్టణమునకు తిరిగివచ్చితిని.

18. మూడు సంవత్సరముల తరువాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో పదిహేను రోజులు గడిపితిని.

19. ప్రభువు సహోదరుడైన యాకోబును తప్ప నేను మరి ఏ ఇతర అపోస్తలుని చూడలేదు.

20. నేను మీకు వ్రాయుచున్న విషయములలో అబద్ధమాడుటలేదని దేవుని ఎదుట పలుకుచున్నాను.

21. తదనంతరము నేను సిరియా, సిలీషియాలలోని ప్రాంతములకు వెళ్ళితిని.

22. అంత వరకును యూదయాలోని క్రీస్తు సంఘముల వారికి నాతో ముఖపరిచయము లేకుండెను.

23. “ఒకప్పుడు మనలను హింసించిన అతడే ఈనాడు తాను నిర్మూలనము చేయనెంచిన విశ్వాసమును బోధించుచున్నాడు” అని మాత్రము వారు వినుచుండిరి.

24. నన్నుగూర్చి వారు దేవుని స్తుతించిరి. 

 1. అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత తీతును కూడ వెంటబెట్టుకొని బర్నబాతో తిరిగి యెరూషలేమునకు వెళ్ళితిని.

2. అటుల పోవలెనని దేవుడు నాకు తెలియజేయుటచేతనే నేను పోయితిని. నేను జరుపునదియు, జరిపినదియు, ఒకవేళ వ్యర్థమై పోవునేమో అని నేను అన్యులమధ్య వివరించుచున్న సువార్తను వారికి మరి ప్రత్యేకముగ పెద్దలని ఎంచబడిన వారికి విశదపరచితిని.

3. గ్రీసు దేశస్తుడేయైనను, నా తోడివాడగు తీతును సహితము సున్నతి పొందవలెనని బలవంత పెట్టలేదు.

4. కాని కొందరు సోదరులవలె నటించి మా గుంపులో చేరి అతడు సున్నతి పొందవలెనని కోరిరి. వారు గూఢచారులుగ రహస్యముగ మాయందు ప్రవేశించిరి. క్రీస్తుయేసుతో ఏకమగుటవలన మనకుగల స్వాతంత్య్రమును వేగుచూచుట వారి ఉద్దేశము. మమ్ము బానిసలుగ చేయవలెనని వారి కోరిక.

5. కాని, సువార్తయందలి సత్యమును మీకు భద్రముగా ఉంచుటకు గాను, ఒక్క కణమైనను మేము వారికి లోబడలేదు.

6. కాని పెద్దలుగా ఎంచబడినవారు క్రొత్త సూచనలు ఏవియు నాకు చేయలేదు. వారు గతమున ఎట్టివారు అనునది నాకు అనవసరము. దేవుడు పక్షపాతము చూపడు.

7. అట్లుకాక, సున్నతి పొందిన వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు పేతురునకు అప్పగించినట్లే, సున్నతి పొందనివారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు నాకు అప్పగించెనని వారు గ్రహించిరి.

8. ఏలయన, సున్నతి పొందినవారికి పేతురును అపోస్తలుడుగా చేసినవాడే నన్నును అన్యులకు అపోస్తలునిగ చేసెను.

9. ఆధారస్తంభములుగ ఎంచబడిన యాకోబు, పేతురు, యోహానులు దేవుడు నాకు ఒసగిన ప్రత్యేక కృపావరమును గుర్తించిరి. మేము అన్యులలోను, వారు సున్నతి పొందిన వారల లోను పనిచేయవలెనని చెప్పి, తమతో భాగస్టుల మనుటకు సూచకముగ వారు నాతోను, బర్నబాతోను కుడిచేతితో కరచాలనము చేసిరి.

10. అచటి పేదలను మేము జ్ఞాపకము ఉంచుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. వాస్తవముగా అట్లు చేయుటకు నేను ఎంతయో ఆశించితిని.

11. పేతురు అంతియోకునకు వచ్చినపుడు స్పష్ట ముగ అతనిదే తప్పు కనుక, ముఖాముఖిగ నేను అతనిని వ్యతిరేకించితిని.

12. ఏలయన, యాకోబుచే పంపబడిన కొందరు అచటకు రాకమునుపు, పేతురు అన్యసోదరులతో కలిసి భుజించుచుండెడివాడు. కాని వీరు వచ్చిన తరువాత, అతడు అటుల చేయుట మానుకొని వారితో తినుటకు వెనుదీసెను. ఏలయన, అన్యులు సున్నతి పొందవలెనని వాదించువారికి అతడు భయపడుచుండెను.

13. మిగిలిన యూదులును అతనితోపాటు అటుల నటించిరి. బర్నబాకూడ వారి నటనకు లోనయ్యెను.

14. వారు సువార్తయందలి సత్యమును అనుసరించి ప్రవర్తించుటలేదు అని నేను గమనించిన తోడనే, వారి అందరి ఎదుట పేతురుతో ఇటంటిని: "యూదుడవైన నీవు, యూదునివలెకాక అన్యునివలె జీవించుచుంటివి. అయినచో అన్యులు యూదులవలె జీవింపవలెనని నీవు ఎట్లు బలవంతము చేయగలవు?"

15. నిజముగా, పుట్టుకచే మనము యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపులముకాము.

16. కాని, ఎవడైనను యేసు క్రీస్తునందలి విశ్వాసముచేత నీతిమంతుడు అగును గాని, ధర్మశాస్త్రమును పాటించుటచే కాదని మనము ఎరుగుదుము. ధర్మశాస్త్రమును పాటించుటచే కాక, క్రీస్తునందలి విశ్వాసముచే మనము నీతిమంతులము అగుటకుగాను మనము కూడ యేసు క్రీస్తును విశ్వసించితిమి. ఏలయన, ధర్మశాస్త్రమును పాటించుటచే ఎవడును నీతిమంతుడుకాడు.

17. అయినచో, క్రీస్తునందు నీతిమంతులు అగుటకు ప్రయత్నించుచు అన్యులవలె మనమును పాపాత్ములముగా కనుగొనబడినచో అప్పుడు క్రీస్తు, పాపమునకు కారకుడేనా? ఎన్నిటికిని కాదు!

18. నేను పడగొట్టిన వానిని తిరిగి నిర్మింప ప్రయత్నించినచో నేను ద్రోహిని అనుటకు అది నిదర్శనముకదా!

19. ధర్మశాస్త్రమునకు సంబంధించినంతవరకు నేను మరణించినవాడనే. దేవుని కొరకు నేను జీవించుటకుగాను ధర్మశాస్త్ర విషయమున చనిపోయితిని. క్రీస్తుతోపాటు నేనును సిలువవేయబడితిని.

20. కనుక ఇక జీవించునది నేను కాదు. క్రిస్తే నాయందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రునియందలి విశ్వాసముచేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును గడుపుచున్నాను.

21. దేవుని కృపను నేను నిరాకరింపను. ఎవడైనను ధర్మశాస్త్రమువలననే నీతిమంతుడు కాగలిగినచో క్రీస్తు మరణము వ్యర్థమే! 

 1. అవివేకులగు గలతీయులారా! మీరు ఎవని మాయకు లోనైతిరి? సిలువపై యేసు క్రీస్తు మరణము మీ కన్నులయెదుట ప్రత్యక్షము చేయబడినదిగదా!

2. ఈ ఒక్క విషయము మీనుండి నేర్చుకొనగోరు చున్నాను. ధర్మశాస్త్రము ఆజ్ఞాపించుదానిని చేయుట వలన మీరు దేవుని ఆత్మను పొందితిరా? లేక విశ్వాసముతో సువార్తను వినుటవలననా?

3. మీరు ఇంతటి మూర్ఖులా! మీరు దేవుని ఆత్మతో ఆరంభించి శరీరముతో ముగించుచున్నారా?

4. నిష్ప్రయోజనము గనే ఇన్ని కష్టములు అనుభవించితిరా? నిశ్చయముగ అవి వ్యర్ధమగునా?

5. దేవుడు మీకు ఆత్మనొసగి, మీ మధ్యలో అద్భుతములుచేయుట మీరు ధర్మశాస్త్ర మును అనుసరించుట చేతనేనా? లేక విశ్వాసముతో వినుటవలననా?

6. “అతడు దేవుని విశ్వసించెను. ఆ విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను.” అని అబ్రహామును గూర్చి లేఖనము చెప్పుచున్నది.

7. కనుక, విశ్వాసముగలవారే అబ్రహాముయొక్క నిజమైన సంతతియని మీరు గ్రహింపవలెను.

8. విశ్వాసమువలన అన్యజనులను నీతిమంతులుగ దేవుడు చేసికొనునని లేఖనము ముందే చెప్పుచున్నది. కనుకనే అది “భువియందలి ప్రజలందరిని దేవుడు నీ ద్వారా దీవించును” అను శుభసందేశమును ముందే అబ్రహామునకు తెలియజేసినది.

9. అబ్రహాము విశ్వసించెను. కనుకనే దీవింపబడెను. అతనివలెనే విశ్వాసము కలవారు దీవింపబడుదురు.

10. ధర్మశాస్త్రము విధించిన క్రియ లపై అధారపడియుండువారు శాపగ్రస్తులు అగుదురు. ఏలయన, లేఖనము చెప్పుచున్నట్లు, “ధర్మశాస్త్ర గ్రంథమునందు వ్రాయబడిన నియమములన్నిటికి సర్వదా విధేయుడుకాని వ్యక్తి శాపగ్రస్తుడగును”.

11. ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తియైనను నీతిమంతుడు కాజాలడు అనుట ఇపుడు స్పష్టమే కదా! ఏలయన, “విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును”

12. కాని ధర్మశాస్త్రము విశ్వాసముపై ఆధారపడి యుండలేదు. ఏలయన, “ధర్మశాస్త్రము విధించు అన్ని నియమములను పాటించు వ్యక్తి వానివలన జీవించును.”

13. క్రీస్తు, మనకొరకు ఒక శాపమై, ధర్మ శాస్త్రము తెచ్చిపెట్టిన శాపమునుండి మనలను విముక్తులను చేసెను. లేఖనము చెప్పుచున్నట్లు, “చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతివ్యక్తియు శాపగ్రస్తుడు.”

14. దేవుడు అబ్రహామునకు ఒసగిన దీవెన క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అందుటకును, విశ్వాసము ద్వారా మనము దేవునిచే వాగ్దానము ఒనర్పబడిన ఆత్మను పొందుటకును క్రీస్తు అటుల చేసెను.

15. సోదరులారా! నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. మానవునిదైనను ఒక ఒప్పందము ఏర్పడిన పిదప దానిని రద్దుచేయుటగాని, మార్పు చేయుటగాని జరుగదు.

16. వాగ్దానములను దేవుడు అబ్రహామునకును అతని కుమారునకును చేసెను. “అతని కుమారులకు” అని పెక్కుమందిని సూచించుచు బహువచనములో అచట చెప్పబడ లేదు. కాని “కుమారునకు” అని ఒకనిని సూచించుచు ఏకవచన ములో చెప్పబడినది. ఆ కుమారుడు క్రీస్తు,

17. నా భావము ఏమన, వాగ్దానము వ్యర్థమగునట్లు నాలుగు వందల ముప్పది సంవత్సరముల తదుపరి వచ్చిన ధర్మశాస్త్రము దేవునిచే ధ్రువీకరింపబడిన నిబంధనను రద్దుచేయదు.

18. ఏలయన, వారసత్వపు హక్కు ధర్మశాస్త్రముపై ఆధారపడి ఉన్నచో, ఇక ఆయన వాగ్దాన ముపై ఆధారపడి ఉండదు. కాని దేవుడు దానిని అబ్రహామునకు వాగ్దానము చేతనే ప్రసాదించెను.

19. అటులైనచో ధర్మశాస్త్రము ఏల ఒసగబడెను? తప్పు అన ఎట్టిదో చూపుటకు వాగ్దానమును పొందిన కుమారుడు వచ్చువరకే అది చేర్చబడెను. ధర్మ శాస్త్రము, ఒక మధ్యవర్తి ద్వారా దేవదూతలచే నియమింప బడెను.

20. మధ్యవర్తిత్వము అనగా ఒకరికన్నా ఎక్కువగా ఉందురు. కాని దేవుడు ఒక్కడే.

21. అయినచో దేవుని వాగ్దానములకు ధర్మ శాస్త్రము విరుద్ధమా? ఎంత మాత్రమును కాదు!  ఏలయన, మానవులకు ప్రాణము పోయగలిగిన ఏదైన ఒక చట్టము ఒసగబడియున్నచో, అప్పుడు ఆ చట్టముద్వారా దేవుని నీతి లభించియుండును.

22. కాని లేఖనము సమస్తమును పాపమునకు గురి చేసినది. అయితే యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి ఇయ్యబడినది.

23. కాని విశ్వాస సమయము ఆసన్నము కాక పూర్వము, విశ్వాసము ప్రత్యక్షమగువరకు, ధర్మ శాస్త్రము మనలను బందీలనుగా చేసినది.

24. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగ తీర్చబడునట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

25. విశ్వాస సమయము వచ్చినందువలన, ఇక ధర్మశాస్త్రమునకు మనపై ఆధిపత్యములేదు.

26. ఏలయన, క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరు అందరును దేవుని పుత్రులు.

27. ఏలయన, క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరందరు క్రీస్తును ధరించియున్నారు.

28. కావున, యూదుడని, అన్యుడని లేదు. బానిసని, స్వతంత్రుడని లేదు. స్త్రీయని, పురుషుడని లేదు. ఏలయన, క్రీస్తు యేసునందు మీరందరును ఒక్కరే.

29. మీరు క్రీస్తునకు సంబంధించిన వారైనందున అబ్రహాము సంతతికూడ అగుదురు. కనుక దేవుని వాగ్దానమునుబట్టి మీరును వారసులే. 

 1. మరియు నేను చెప్పునది ఏమనగా, వారసుడు అన్నిటికి కర్తయైయున్నను బాలుడై ఉన్నంతకాలము అతనికిని, దాసునికిని భేదము లేదు.

2. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకులయొక్కయు, గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును.

3. అట్లే మనమును బాల్యదశలో ప్రాపంచిక ప్రాథమిక నియమములకు బానిసలమై ఉంటిమి.

4. కాని కాలము పరిపక్వమయినపుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను.

5. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్ర మునకులోబడియున్న వారిని విముక్తులను చేసెను.

6. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ “అబ్బా! తండ్రి!” అని పిలుచు చున్నది.

7. కనుక దేవునివలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక, వారసుడవు కూడ.

8. గతమున మీరు దేవుని ఎరుగనివారై ఉన్నప్పుడు దేవుళ్ళు కానివారికి దాసులై ఉంటిరి.

9. కాని, ఇప్పుడు మీరు దేవుని తెలిసికొనియున్నారు. మరి విశేషముగ చెప్పవలెనన్న, దేవుడే మిమ్ము తెలిసి కొనియున్నాడు. అటువంటి మీరు ఈ బలహీనమైన, హీనమైన ప్రాపంచిక, ప్రాథమిక నియమముల వైపు ఏల మరలుచున్నారు? మరల వానికి మీరు ఏల బానిసలు కావలెనని ఆశించుచున్నారు?

10. కొన్ని ప్రత్యేక దినములను, నెలలను, ఋతువులను, సంవత్సరములను మీరు పాటించుచున్నారు గదా!

11. మిమ్మును గూర్చిన నా కృషి అంతయు నిష్ప్రయోజనమేమోనని భయపడుచున్నాను.

12. సోదరులారా! మిమ్ము ప్రార్థించుచున్నాను. మీరును నావలె ఉండుడు. ఏలయన, నేనును మీవంటి వాడినైతిని గదా! మీరును నాకు ఎట్టికీడును చేయలేదు.

13. నేను సువార్తను మీకు మొదట నా శరీర దౌర్బల్యమున బోధించితిని అని మీరు ఎరుగుదురు.

14. నా శారీరక దౌర్బల్యము మీకు ఒక పరీక్షయైనను మీరు నన్ను తిరస్కరింపలేదు, అసహ్యించుకొనలేదు. దేవుని దూతవలె, క్రీస్తు యేసువలె నన్ను స్వీకరించితిరి.

15. అప్పుడు ఉన్న మీ సంతృప్తి ఇప్పుడు ఏమాయెను? సాధ్యమైనచో మీ కన్నులుకూడ ఊడబెరికి నాకు అప్పుడు ఇచ్చియుందురని మీ తరపున సాక్ష్యము చెప్పుచున్నాను.

16. నిజము చెప్పి నేను ఇప్పుడు మీకు విరోధినైతినా?

17. వారు మిమ్ము మెచ్చుకొనుచున్నారు. కాని వారి ఉద్దేశము మంచిదికాదు. మీరు వారిని పొగడు టకు నానుండి మిమ్ము వేరు చేయుచున్నారు.

18. మంచి విషయములపై శ్రద్ధచూపుట మంచిది. ఇది నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాక, ఎల్లప్పుడు చేయ వలెను.

19. నా బిడ్డలారా! మీయందు క్రీస్తు రూపము ఏర్పడువరకు, స్త్రీ ప్రసవవేదనవలె నేను మరల మిమ్ము గురించి బాధపడుచున్నాను.

20. మిమ్ము గురించి నాకు ఎటూ తోచుటలేదు. నేను ఇపుడు మీ మధ్యకు వచ్చి మరియొక విధముగ మాటలాడిన బాగుండును.

21. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండవలెనని కోరెడి మీరు, నాకు చెప్పుడు. ధర్మశాస్త్రము ఏమి చెప్పుచు న్నదో మీరు వినుటలేదా?

22. అబ్రాహామునకు ఇద్దరు కుమారులుండిరి. దాని వలన ఒక కుమారుడు, స్వతంత్రురాలగు స్త్రీ వలన మరియొక కుమారుడును కలిగిరని అది చెప్పుచున్నది.

23. దాసి వలన పుట్టిన పుత్రుడు శరీర ధర్మము ప్రకారము పుట్టెను. కాని స్వతంత్రురాలి వలన కలిగిన పుత్రుడు దేవుని వాగ్దానఫలముగ జన్మించెను.

24. ఇది అలంకార రూపమున చెప్పవచ్చును. ఈ ఇద్దరు స్త్రీలును రెండు నిబంధనలు. అందు ఒకటి హాగారు. సీనాయి పర్వతమునుండి పుట్టినది. దాని బిడ్డలు పుట్టుకచేతనే బానిసలు.

25. ఏలయన హాగారు అనునది అరేబియాలోని సీనాయి పర్వతమునకు గుర్తు. అది ఈనాటి యెరూషలేమునకు సాదృశ్యము. మరియు యెరూషలేము, దాని బిడ్డలు బానిసలుగ జీవించుచున్నారు.

26. కాని పరలోకపు యెరూషలేము స్వాతంత్య్రము కలది. అది మనకు తల్లి.

27. ఏలయన: “ గొడ్రాలా! సంతోషముగ ఉండుము. ప్రసవ , వేదనపడని నీవు కేరింతలు కొట్టుము. ఏలయన, భర్త కలిగిన స్త్రీ కంటెంట్ విడువబడిన స్త్రీకి పిల్లలు ఎక్కువ.”

28. సోదరులారా! అయితే ఈసాకువలె మీరును వాగ్దాన ఫలమగు బిడ్డలు.

29. కాని ఆ దినములలో శారీరకముగ పుట్టిన కుమారుడు ఆత్మవలన పుట్టిన పుత్రుని హింసించినట్లు ఇప్పుడును జరుగుచున్నది.

30. కాని లేఖనము ఏమని చెప్పుచున్నది? “దాసిని, ఆమె కుమారుని వెలుపలకు గెంటివేయుము. ఏలయన, దాసీ కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో బాటు వారసుడుకాడు” అని అది చెప్పుచున్నది.

31. కనుక సోదరులారా! మనము దాసీ సంతానము కాదు, స్వతంత్రురాలి బిడ్డలము. 

 1. స్వతంత్రులుగ జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను. కనుక, దృఢముగ నిలబడుడు. బానిసత్వము అను కాడిని మరల మీపై పడనీయకుడు.

2. వినుడు! పౌలునైన నేను మీకు ఇట్లు విశదమొనర్చుచున్నాను. సున్నతిని మీరు పొందినచో, క్రీస్తు మీకు పూర్తిగ నిరుపయోగమగును.

3. దీనిని మరల నొక్కి వక్కాణించుచున్నాను. సున్నతినిపొందు ప్రతి వ్యక్తియు ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించి తీరవలెను.

4. మీరు ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు కాదలచినచో, క్రీస్తునుండి వేరైనట్లే. మీరు దేవునికృపనుండి తొలగిపోతిరి.

5. విశ్వాసము ద్వారా ఆత్మ వలన మేము నీతిమంతులము అగుటకు నిరీక్షించుచున్నాము.

6. ఏలయన, క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు, సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదము లేదు. కాని ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము.

7. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి! మిమ్ము సత్యమునకు విధేయత చూపకుండ ఆటంకపరచినది ఎవరు?

8. ఈ ప్రేరేపణ మిమ్ము పిలిచిన దేవుని నుండి రాలేదు.

9. పులిసిన పిండి కొంచెమైనను పిండిని అంతటిని పులియజేయును.

10. కాని మీరు ఇతర భావములను తిరస్కరించి నా భావములను మాత్రమే అంగీకరించుదురని మిమ్ము గూర్చి ప్రభువు నందు నాకు నమ్మకము ఉన్నది. మిమ్ము కలవర పెట్టువాడు ఎవడైనను, వాడు దేవునిచే తీర్పుచేయబడును.

11. కాని సోదరులారా! సున్నతి అవసరమే అని నేను ఇంకను బోధించుచున్నచో, ఏల ఇంకను హింసింపబడుచున్నాను? అది నిజమే అయినచో, సిలువ విషయమైన ఆటంకము తీసివేయబడును గదా!

12. మిమ్ము కలవర పెట్టుచున్న వారు తమనుతాము అంగచ్చేదనము చేసికొందురుగాక!

13. సోదరులారా! స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి. కాని ఈ స్వేచ్చ, మీరు శారీరక వ్యామోహములకు లొంగిపోవుటకు మిష కాకుండ చూచుకొనుడు. కాని ఒకరికి ఒకరు ప్రేమతో సేవకు లుగా నుండుడు.

14. ఏలయన, ధర్మశాస్త్రము అంతయు కలసి “నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము” అను ఒక్క మాటలో నెరవేరియున్నది.

15. కాని మీరు ఒకరిని ఒకరు కరచి, దిగమ్రింగినచో, ఒకరిని ఒకరు సర్వనాశనము చేసి కొందురేమో! జాగ్రత్త సుమా!

16. నేను చెప్పునది ఏమన: మీరు ఆత్మయందు నడుచుకొనుడు. శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు.

17. ఏలయన, శరీరము కోరునది, ఆత్మ కోరుదానికి విరుద్ధముగా ఉండును. ఆత్మ కోరునది శరీరము కోరుదానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండిటికిని బద్ధవైరము. అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు.

18. కాని ఆత్మయే మిమ్ము నడిపినచో, మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు.

19. శరీర కార్యములు స్పష్టమే. అవి ఏవన: జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము,

21. మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు వినోదములు మొదలగునవి. పూర్వమువలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇట్టి పనులు చేయు వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు.

22. కాని ఆత్మఫలములు ఏమనగ: ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత,

23. సాత్త్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగ ఎట్టి చట్టమును లేదు.

24. క్రీస్తుయేసునకు చెందినవారు వ్యామోహములతోను, కాంక్షలతోను కూడిన తమ శరీరమును సిలువవేసిరి.

25. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము.

26. మనము గర్వపడరాదు, ఒకరిపై ఒకరు వివాదము లేపరాదు, అసూయాపరులము కారాదు. 

 1. సోదరులారా! ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినయెడల, మీలో ఆధ్యాత్మిక శక్తి కలవారు వానిని సరిదిద్దవలెను. కాని ఆ పనిని సాత్వికమైన మనస్సుతో చేయవలెను. అంతేకాక, నీవును శోధింప బడకుండునట్లు నిన్ను గూర్చి జాగ్రత్తపడుము.

2. ఒకరి భారములను మరియొకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్పుడు.

3. ఎవడైనను ఏమియు లేనివాడైయుండి తాను గొప్పవాడనని భావించుకొన్నచో, అట్టివాడు తనను తాను మోసగించు కొనుచున్నాడు.

4. ప్రతివ్యక్తి తన పనిని తనకు తానే పరీక్షించుకొనవలెను. అట్లు చేసినచో ఇతరుల పనితో అవసరము లేకయే, తన పనియందే తాను గర్వపడవచ్చును.

5. ఏలయన, ప్రతి వ్యక్తియు తన భారమును తానే మోయవలెను.

6. దేవుని వాక్యోపదేశమును పొందువాడు, తనకు కలిగిన మేలును అంతటిని తన ఉపదేశకునితో పంచుకొనవలెను.

7. మిమ్ము మీరు మోసగించుకొనకుడు. ఎవ్వడును దేవుని హేళన చేయజాలడు. ఏ వ్యక్తియై నను తాను నాటిన దానినే కోసికొనును.

8. శారీరకమైన కోరికలు అను పొలములో అతడు విత్తనములు చల్లినచో శరీరమునుండి అతనికి లభించు ఫలసాయము క్షయమైనది. ఆత్మ అను పొలములో అతడు విత్తనము నాటినచో ఆత్మనుండి అతడు శాశ్వత జీవితమను ఫలసాయమును పొందును.

9. కనుక, మనము సత్కార్యములు చేయుటయందు విసుగుచెందరాదు. ఏలయన, మనము అటుల చేయుటయందు నిరాశ చెందకున్నచో, మన కృషి ఫలవంతమగు సమయము వచ్చును

10. కనుక అవకాశము దొరికినప్పుడెల్ల మనము అందరకును, అందును విశేషించి, మన విశ్వాసపు కుటుంబమునకు చెందిన వారికిని మంచిని చేయుచుండవలెను.

11. నా స్వహస్తముతో ఎంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడు.

12. శారీరకముగ తమ గొప్పతనమును ప్రదర్శించుకొననెంచు వారు మిమ్ము సున్నతిపొందవలెనని బలవంత పెట్టుచున్నారు. కాని క్రీస్తు సిలువ నిమిత్తము హింసింపబడకుండుటకే వారు అటుల బలవంతము చేయుదురు.

13. సున్నతిని అవలంబించుచున్నవారే చట్టమును అనుసరించుట లేదు. కాని మీ మూలమున గొప్పలు పొందుటకు మీరు సున్నతిని పొందవలెనని వారు కోరుదురు.

14. నేను మరి ఇతరములైన దేనియందును కాక, మన ప్రభువగు యేసు క్రీస్తు సిలువయందు మాత్రమే గొప్పగ చెప్పుకొందును. ఏలయన, ఆయన సిలువ మూలముననే, నాకు ఈ లోకము, నేను ఈ లోకమునకు సిలువవేయబడితిమి.

15. ఎవడైనను సున్నతి పొందెనా లేదా అను విషయము అనవసరము, ముఖ్యమైన విషయము ఏమనగ, అతడు నూతన సృష్టియగుటయే.

16. తమతమ జీవితములలో ఈ సూత్రమును పాటించువారికి సమాధానమును, కనికరము తోడగునుగాక, దేవుని యిస్రాయేలీయులకును అవి లభించునుగాక!

17.ఇక మీదట ఎవ్వడును నన్ను బాధింపకుండునుగాక! ఏలయన, నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించియున్నాను. .

18. సోదరులారా! మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక! ఆమెన్.