ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బారూకు

 1. ఈ గ్రంథమును బారూకు బబులోనియాలో లిఖించెను. అతడు నేరియా కుమారుడు, మహసేయా మనుమడు. సిద్కియా, హసాదియా, హిల్కియా అనువారు క్రమముగా అతని వంశకర్తలు.

2. బబులోనీయులు యెరూషలేమును ముట్టడించి దానిని తగులబెట్టిన పిమ్మట, ఐదవయేడు, ఆ మాసపు ఏడవనాడు బారూకు దీనిని వ్రాసెను.

3. యెహోయాకీము కుమారుడును, యూదా రాజునగు యెహోయాకీను సమక్షమునను, బబులోనియా దేశమున, సూదు నదిచెంత వసించు యూదుల సమక్షమునను బారూకు ఈ గ్రంథమును పెద్దగా చదివెను.

4. ప్రధానులు, రాజవంశజులైన యువకులు, పెద్దలు, అన్ని తరగతులకు చెందిన ప్రజలెల్లరును ఈ గ్రంథములోని వాక్యములు వినిరి.

5. ప్రజలు ఈ పుస్తకములోని సంగతులను విని, ఏడ్చి ఉపవాసముండి ప్రభువునకు ప్రార్థన చేసిరి.

6. అంతట ప్రతి ఒక్కడును తాను చేయగలిగినంత దానము చేసెను.

7. ఆ సొమ్మును యెరూషలేములోని ప్రధానయాజకుడగు యెహోయాకీము, ఇతర యాజకులు, ప్రజలు మొదలగు వారి చెంతకు పంపిరి. ఈ యెహోయాకీము హిల్కియా కుమారుడు, షల్లూము మనుమడు.

8. సీవాను నెల పదియవనాడు, పూర్వము దేవాలయమునుండి కొనివచ్చిన పాత్రములను బారూకు యూదాకు తీసుకొనిపోయెను. యూదా రాజును, యోషీయా కుమారుడైన సిద్కియా ఈ వెండి పాత్రములు చేయించెను.

9. బబులోనియా రాజగు నెబుకద్నెసరు యెహోయాకీనును, పాలకులను, చేతి పనుల వారిని, ప్రధానులను, సామాన్య ప్రజలను యెరూషలేమునుండి బబులోనియాకు బందీలుగా కొనిపోయిన పిదప వానిని తయారుచేయించిరి.

10. ప్రజలిట్లు లేఖ వ్రాసిరి: “మీరు దహనబలులకును, పాపపరిహార బలులకును, బలిపశువులను కొనుటకును, సాంబ్రాణిని ధాన్య బలులలో వాడు ధాన్యమును కొనుటకును మేము పంపిన ఈ సొమ్మును వినియోగింపుడు. మన దేవుడైన ప్రభువు పీఠము మీద ఆ బలులనెల్ల అర్పింపుడు.

11. బబులోనియా రాజగు నెబుకద్నెసరు, అతని కుమారు డగు బెల్షస్సరును ఆకాశమున్నంత కాలము జీవింప వలెనని ప్రార్థింపుడు.

12. అప్పుడు ప్రభువు మనకు బలమొసగి మనలను నడిపించును. నెబుకద్నెసరు, అతని కుమారుడు బెల్టస్సరు మనలను కాపాడుదురు. మన జీవితకాలమంతయు, మనము వారిపట్ల విశ్వసనీయులముగా జీవింతము. వారును మనలను చూచి సంతోషింతురు.

13. మేము ప్రభువునకు ద్రోహముగా పాపము చేసినందున ఆయన మామీద ఇంకను ఆగ్రహము చెందియున్నాడు. కనుక మీరు మా కొరకు మన ప్రభువైన దేవునికి విన్నపము చేయుడు.

14. మేము పంపు ఈ గ్రంథమును మీరు బిగ్గరగా చదువుడు. నియమించబడిన కాలముల లోను, పండుగ దినములలోను ఆలయములో చదివి, మీ విశ్వాసమును ప్రకటించుచు మీరు ఈ విధముగా పలుకవలయును.

15. మా దేవుడైన యావే నీతిమంతుడు. కాని మేమిప్పటకీ సిగ్గుతో వెలవెలబోవుచున్నాము. యూదా ప్రజలు, యెరూషలేము పౌరులు,

16. మా రాజులు, పాలకులు, యాజకులు, ప్రవక్తలు, పెద్దలెల్లరును సిగ్గుచెందిరి.

17. ఏలయన మేము మా ప్రభువైన దేవునికి ద్రోహము చేసితిమి.

18. ఆయన ఆజ్ఞలను మీరితిమి. ఆయన మాటలను పాటింపమైతిమి. ఆయన చట్టములను లెక్కచేయమైతిమి.

19. ప్రభువు మా పితరులను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినప్పటినుండి నేటివరకు మేము ఆయనకు లొంగక ఆయన ఆజ్ఞలను మీరుచుంటిమి.

20. పూర్వము ప్రభువు మా పితరు లను ఐగుప్తునుండి బయటికి నడిపించుకొని వచ్చి వారికి పాలుతేనెలు జాలువారు నేలను ఇత్తునని ప్రమాణము చేసినప్పుడే తన సేవకుడైన మోషే ద్వారా శాపవాక్యము లను గూడ వినిపించెను. ఆ శాపములు నేడు మా మీదికి దిగివచ్చినవి.

21. మా ప్రభువైన దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికిన పలుకులను మేము వినమైతిమి.

22. మాలో ప్రతివాడును, తన దుష్టహృదయము చెప్పినట్లు చేసెను. మేము అన్యదైవములను సేవించి, ప్రభువు మెచ్చని కార్యములు చేసితిమి.

 1. 'ప్రభువు మమ్మును, మా న్యాయాధిపతులను, రాజులను, పాలకులను, యూదా, యిస్రాయేలు ప్రజలను శిక్షింతునని ముందుగనే చెప్పెను. తాను చెప్పినట్లే చేసెను.

2. ధర్మ శాస్త్రమున వ్రాయబడియున్న శిక్షలను ప్రభువు మా మీదికి కొనివచ్చెను. యెరుషలేమునకు జరిగిన ఘోరకార్యములు లోకమున మరియెచ్చటను జరుగవయ్యెను.

3. మేమెల్లరము మా కుమారులను, కుమార్తెలను భుజింపవలసి వచ్చినది.

4. ప్రభువు మమ్ము చెల్లాచెదరు చేసి, మా చుట్టుపట్లనున్న జాతుల చేతికి చిక్కించెను. వారు మమ్మునసహ్యించుకొనిరి. మమ్ము శాపముగా నెంచిరి.

5. మేము మా దేవుడైన ప్రభువునకు ద్రోహము చేసితిమి. ఆయనకు విధేయులము కామైతిమి. కావున మేము యజమానులమగుటకు మారుగా బానిసలమైతిమి.

6. మా దేవుడు సర్వదా నీతిమంతుడే. కాని మేమును, మా పితరులును నేటికిని సిగ్గుతో వెలవెల బోవుచున్నాము.

7. ప్రభువు తాను పంపుదునన్న శిక్షలన్నిటిని మా మీదికి పంపెను.

8. అయినను మేము మా దుష్టాలోచనలు మార్చుకొందుమని ఆయనకు ప్రార్థన చేయమైతిమి.

9-10. మేము ఆయనకు లొంగలేదు. న్యాయసమ్మతములైన ఆయన ఆజ్ఞలను పాటింపలేదు. కావున ఆయన మా కొరకు సిద్ధముచేసి ఉంచిన శిక్షలన్నిటిని మా మీదికి రప్పించెను.

11. యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! నీ బాహుబలముతోను, అద్భుతకార్యములతోను, సూచనక్రియలతోను, చాచిన చేతితోను నీ ప్రజలను ఐగుప్తునుండి వెలుపలికి కొనివచ్చితివి. నీవు నీ మహాబలమును ప్రదర్శించి గొప్పకీర్తి బడసితివి. నేటికిని ఆ కీర్తి మాసిపోలేదు.

12. మా దేవుడవైన ప్రభూ! మేము పాపము చేసితిమి. విశ్వాసముతో ప్రవర్తింపమైతిమి. నీ ఆజ్ఞలనెల్ల మీరితిమి.

13. ఇక నీవు మా మీద కోపింపవలదు. నీవు మమ్ము చెల్లాచెదరు చేసిన ఈ జాతుల మధ్య మేము కొద్దిమందిమి మాత్రమే మిగిలియున్నాము.

14. ప్రభూ! నీవు మా విన్నపమును ఆలింపుము. నీ కీర్తి కొరకే నీవు మమ్ము రక్షింపుము. మమ్ము చెరగొనిపోయిన వారు మా వలన ప్రీతి చెందుదురుగాక!

15. అప్పుడు నీవు మా దేవుడైన ప్రభుడవనియు, నీవు యిస్రాయేలును నీ ప్రజగా ఎన్నుకొంటివనియు లోకమెల్ల గుర్తించును.

16. ప్రభూ! నీవు పవిత్రమైన నీ నివాసస్థలమునుండి మా వైపు పారచూడుము. మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము.  మా మనవిని వినుము. మమ్ము కన్నులెత్తి చూడుము.

17. ఊపిరి కోల్పోయి మృతలోకముననున్నవారు నిన్ను స్తుతింపలేరు. నీ న్యాయమును ప్రకటింపలేరు.

18. ప్రభూ! బ్రతికియున్నవారు మాత్రమే నిన్ను స్తుతింతురు. నీ న్యాయమును ప్రకటింతురు. వారు బాధలకు గురియైయున్నను, బలహీనులై వంగి నడుచుచున్నను, ఆకటికి చిక్కి కంటిచూపు కోల్పోయిన వారైనను ఈ కార్యములను చేయగలుగుదురు.

19. మా దేవుడవైన ప్రభూ! మా పితరులును, రాజులును, చేసిన సత్కార్యములను బట్టి మేము నీకు మనవి చేయుటలేదు.

20. నీవు నీ ప్రవక్తల ద్వారా వాకొనినట్లే, నీ ఆగ్రహమును మామీద కుమ్మరించితివి. నీ పలుకులను వారు మాకు ఇట్లు ఎరిగించిరి.

21. “మీరు మీ మెడలు వంచి బబులోనియా రాజునకు సేవలు చేయుడు. అప్పుడు మీరు నేను మీ పితరులకు ఇచ్చిన నేలపై నిలుతురు. 

22. కాని మీరు నా ఆజ్ఞను మీరి, అతనిని సేవింపనొల్లరేని,

23. నేను యూదా.నగరములలోను, యెరూషలేమువీధులలోను ఆనందనాదములనెల్ల అణచివేయుదును. వివాహమహోత్సవములలో వధూవరుల నోట విన్పించు సంతోషనాదములనెల్ల నిర్మూలింతును. దేశమును నిర్మానుష్యమైన ఎడారిగా చేయుదును”.

24. కాని మేము నీ ఆజ్ఞలు పాటించి బబులోనియా రాజును సేవింపమైతిమి. కావున నీవు చెప్పినట్లే చేసితివి. మా రాజులయు, పితరులయు అస్థికలను సమాధులనుండి బయటికి తీసి నేలపై వెదజల్లుదురని నీవే నీ సేవకులైన ప్రవక్తలద్వారా చెప్పించితివి. నీవు చెప్పినట్లే ఆ శిక్షను మా మీదికి రప్పించితివి.

25. నీవు చెప్పినట్లే నేడిచట ఆ అస్థికలు ఎండలో ఎండి, మంచులో నానుచున్నవి. ప్రజలు పోరు, కరువు, అంటురోగముల వలన ఘోర బాధలను అనుభవించి చనిపోయిరి.

26. యూదా, యిస్రాయేలు ప్రజల పాపములకు గాను నీవు నీ మందిరమును నేలమట్టము చేసితివి. అది నేటికిని అట్లే ఉన్నది.

27. అయినను మా ప్రభుడవైన దేవా! నీవు మాపట్ల ఓర్పును, మహాకరుణను చూపితివి.

28. నీవు నీ సేవకుడైన మోషేను నీ ప్రజలయెదుట ధర్మశాస్త్రమును లిఖింపుమని ఆదేశించినప్పుడు, అతడితో ఏమి చెప్పితివో అటులనే చేసితివి. నీవు అతనికిట్లు మాటయిచ్చితివి:

29. “మీరు నా మాటవినరేని మీరు చెల్లాచెదరైన జాతుల మధ్య స్వల్పసంఖ్యాకులై పోవుదురు.

30. మీరు మొండివారు. కనుక నా మాట వినరని నాకు తెలియును.  కాని అన్యదేశమునకు ప్రవాసమునకు పోయినపుడుగాని మీకు బుద్దిరాదు.

31. అప్పుడు మీరు, నేను మీ దేవుడనైన ప్రభుడనని గ్రహింతురు. నేను మీకు నన్ను తెలిసికొను కోరికను, నన్నర్థము చేసికొను మనస్సును దయచేసితినని గుర్తింతురు.

32. ఆ ప్రవాసదేశమున మీరు నన్ను స్తుతింతురు. జ్ఞప్తికి తెచ్చుకొందురు.

33. మీ పితరులు నాకు ద్రోహముగా పాపము చేసినపుడు వారికేమి జరిగినదో జ్ఞాపకము తెచ్చుకొని, మీరు మీ మొండితనమును, చెడ్డతనమును విడనాడుదురు.

34. అప్పుడు నేను పూర్వము అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ప్రమాణము చేసిన నేలకు మిమ్ము మరల తోడ్కొని వత్తును. మీరు దానిని భుక్తము చేసికొందురు. నేను మిమ్ము వృద్ధి చేయుదును. మీరికమీదట స్వల్పసంఖ్యాకులైపోరు.

35. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసికొందును. నేను మీకు దేవుడనగుదును. మీరు నా ప్రజలగుదురు. నా ప్రజలును, యిస్రాయేలీయులైన మిమ్మును నేను మీ కొసగిన నేలమీదినుండి మరల తరిమివేయను.”

 1. "సైన్యములకధిపతియు యిస్రాయేలు దేవుడవునైన ప్రభూ! మేము సంతాపముతోను, నిస్పృహతోను నీకు మొరపెట్టుచున్నాము.

2. మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి. నీవు మా వేడుకోలును ఆలించి మాపై కరుణ చూపుము.

3. నీవు శాశ్వతముగా పరిపాలన చేయువాడవు. మేము సదా మరణించువారము.

4. సైన్యములకధిపతియైన యిస్రాయేలు , దేవుడవునైన ప్రభూ! మా మొర వినుము. మేము చచ్చినవారితో సమానులము. మా పితరులు తమ దేవుడవైన నీకు ద్రోహముగా పాపము చేసిరి. నీ మాట వినరైరి. వారి అపరాధములకుగాను మేము వెతలొందుచున్నాము.

5. పూర్వము మా పితరులు చేసిన పాపములను మరచిపొమ్ము. ఈ పట్టున నీ బలమును, కీర్తిని తలంచుకొనుము.

6. నీవు మా ప్రభుడవైన దేవుడవు. మేము నిన్ను స్తుతింతుము.

7. నీవు మా హృదయమున నీ పట్ల భయభక్తులు నెలకొల్పి మేము నీకు ప్రార్థన చేయునట్లు చేసితివి. ఈ ప్రవాసమున మేము నిన్ను స్తుతింతుము. మేము మా పూర్వుల పాపమునుండి వైదొలగితిమి.

8. నీవు మమ్ము జాతుల మధ్య చెల్లాచెదరు చేసితివి. వారు మమ్ము చిన్నచూపు చూచి , శపించుచున్నారు. మా దేవుడవు, ప్రభుడనైన నిన్ను మా పితరులు పరిత్యజించిరి. కనుక నీవు మమ్ము దండించుచున్నావు”.

9. యిస్రాయేలూ! మీరు జీవనదాయకములైన ఆజ్ఞలనాలింపుడు, మీరు సావధానముగా విని జ్ఞానముబడయుడు.

10. మీరు శత్రుదేశమున వసింపనేల? పర దేశముననే ముసలివారు కానేల?

11. చచ్చిన వారివలె మైలపడిపోనేల?  పాతాళమునకు పోయినవారితో సమానముకానేల?

12. జ్ఞానపు బుగ్గను పరిత్యజించుటవలననే కదా?

13. మీరు దైవమార్గమున నడచియుండినయెడల సదా శాంతిని అనుభవించి ఉండెడివారేకదా?

14. జ్ఞానము, బలము, వివేకము ఎచట లభించునో ఎరుగుడు. అపుడు మీకు దీర్ఘాయువు, వెలుగు, శాంతి దొరకును.

15. జ్ఞానము ఎచట వసించునో ఎరిగిన వాడెవడు? దాని బొక్కసమున ప్రవేశించిన వాడెవడు?

16. జాతులను పాలించిన నేతలు

17. వన్యమృగములను, ఆకాశపక్షులను వేటాడిన వారును, నరులు మిక్కుటముగ ఆశించునవియు,ఎంత సంపాదించిన సంతృప్తినీయనివినైన వెండిబంగారములను ఆర్జించినవారును నేడు ఏమైరి?

18. కష్టపడి ఎన్నో పన్నాగములతో సొమ్మును ఆర్జించి, నేడు తమజాడకూడ తెలియకుండపోయిన వారేరీ?

19. వారెల్లరు కనుమరుగై మృతలోకము చేరుకొనిరి. అన్యులు వారి స్థానమున అడుగిడిరి.

20. అటు తరువాత ఇతర తరములవారు వచ్చి భూమిమీద నివాసమేర్పరచుకొనిరి. కాని వారికి జ్ఞానము తెలియదయ్యెను. వారు జ్ఞాన పథమును కనుగొననులేదు, దానిని సంపాదింపను లేదు.

21. వారి సంతానమునకు అది దక్కదయ్యెను.

22. కనానీయుల కది కొంచెమైనను దొరకలేదు. తేమాను వాసులకు వీసమైనను లభింపలేదు.

23. ఇహలోక జ్ఞానమును వెదకిన హాగారు సంతతికాని, మేరాను తేమావర్తకులుగాని, పిట్టకథలు అల్లువారుకాని, జ్ఞానార్థులు కాని జ్ఞానమార్గమును కనుగొనజాలరైరి.

24. యిస్రాయేలూ! ప్రభువు వసించు విశ్వమెంత గొప్పది! ఆయన రాజ్యమెంత విశాలమైనది!

25. దానికంతము లేదు. దాని వైశాల్యమునకును, ఎత్తునకును కొలతలులేవు.

26. ఈ విశ్వమున పూర్వము సుప్రసిద్ధులును, దీర్ఘకాయులును, యుద్ధనిపుణులునైన రాక్షసులు పుట్టిరి.

27. కాని ప్రభువు వారిని తన వారిగా ఎన్నుకోలేదు. వారికి జ్ఞానమార్గమును తెలియజేయలేదు.

28. వారు జ్ఞానము బడయకయే, వివేకమును ఆర్జింపకయే గతించిరి.

29. ఆకసమునకు ఎక్కిపోయి జ్ఞానము బడసి మేఘమండలమునుండి దానిని క్రిందికి గొనివచ్చిన వాడెవడు?

30. సముద్రములను దాటిపోయి, ఆ దానిని కనుగొన్నవాడెవడు? మేలిమి బంగారముతో దానిని కొని తెచ్చిన వాడెవడు?

31. దాని దగ్గరకు పోవుట ఎవరికిని తెలియదు. దాని చెంతకుపోవు త్రోవనెవరును ఎరుగరు.

32. అన్నియు ఎరిగినవాడే జ్ఞానమునెరుగును. తన తెలివితో ఆయన దానిని కనుగొనెను. ఆయన భూమిని శాశ్వతముగా పాదుకొల్పెను. ఆ భూమిని జంతుజాలముతో నింపెను.

33. ఆయన పంపగా వెలుగు బయల్వెడలెను. ఆయన పిలువగా అది భయపడి ఆయనకు లొంగెను.

34. ఆ నక్షత్రములు వాటి స్థానములలో, మెరసి సంతోషించెను.

35. ఆయన పిలువగా ఇక్కడ మేమున్నామని అవి పలికెను. వాటిని సృజించినవాని నిమిత్తమవి సంతోషముతో ప్రకాశించెను. అవి తమతమ తావులలో నిలిచి తమను చేసిన ఆయన ముందు సంతసముతో మెరిసెను.

36. ఆయన మన దేవుడు, ఆయనకు సాటి వాడెవడును లేడు.

37. ఆయన జ్ఞానమార్గము కనుగొని, తన సేవకుడగు యాకోబునకు ఇచ్చెను. తాను ప్రేమించిన సేవకుడగు యిస్రాయేలునకు దానిని అనుగ్రహించెను.

38. అప్పటినుండి జ్ఞానము భూమిపై ప్రత్యక్షమై నరులనడుమ వసించెను.

 1. ఈ జ్ఞానము దేవుని ఆజ్ఞల గ్రంథము, శాశ్వతముగా నిలుచు ధర్మశాస్త్రము. దానిని పాటించువారు బ్రతుకుదురు, విడనాడువారు చత్తురు.

2. యాకోబూ! మీరు జ్ఞానమువైపు మరలి, దానిని గైకొనుడు, దాని వెలుగులో కాంతివైపు నడువుడు.

3. దేవుడు మీ కీర్తిని అన్యుల కొసగకుడు మీ భాగ్యమును అన్య ప్రజలకు వదిలివేయకుడు.

4. యిస్రాయేలూ! మనము నిజముగా ధన్యులము. దేవుడు తనకు ప్రీతి కలిగించునదేదియో మనకు తెలియజేసెను.

5. నా ప్రజలారా! మీరు ధైర్యము వహింపుడు. యిస్రాయేలు నామమును నిలబెట్టువారు మీరే.

6. మీరు అన్యజాతులకు అమ్ముడు పోయినది నాశనమగుటకు కాదు. మీరు దేవునికి కోపము రప్పించితిరి కనుక ఆయన మిమ్ము శత్రువులకు అప్పగించెను.

7. మీరు దేవునికి కాక దయ్యములకు బలులు అర్పించి, మీ సృష్టికర్తకు ఆగ్రహము కలిగించితిరి.

8. మీరు మిమ్ములను పెంచి పెద్దజేసిన శాశ్వతుడైన దేవుని విస్మరించితిరి. మిమ్ము తల్లివలె పెంచిన, యెరూషలేమును దుఃఖపెట్టితిరి. ..

9. ప్రభువు ఆగ్రహముచెంది మిమ్మును శిక్షించుటను చూచి తన చుట్టుపట్లనున్న నగరములతో యెరూషలేము ఇట్లనెను: “ప్రభువు నా కెంతటి విచారమును తెచ్చి పెట్టెనో చూడుడు.

10. నేను నా పుత్రీపుత్రులు ప్రవాసమునకు పోవుటను చూచితిని. నిత్యుడైన దేవుడే వారికి ఆ శిక్ష విధించెను.

11. నేను నా బిడ్డలను మహానందముతో పెంచితిని. వారు నానుండి వెడలిపోవుట గాంచి కన్నీరు కార్చి విలపించితిని.

12. నేను వితంతువునై విచారించుచున్నందునను, నా బిడ్డలందరు నన్ను వదిలి పోయినందునను, ఎవరును ఆనందముతో పొంగిపోకుందురుగాక! నా బిడ్డలు దేవుని ధర్మశాస్త్రమును విడనాడి పాపము చేసిరి కనుక నేను పరిత్యక్తనైతిని.

13. వారికి దేవుని ఆజ్ఞలపట్ల గౌరవము లేదయ్యెను. వాని ప్రకారము జీవించుబుద్ధి పుట్టదయ్యేను. వారు ప్రభువు తమను న్యాయపథమున నడిపించుటకు ఇష్టపడరైరి.

14. చుట్టుపట్లనున్న నగరములారా! మీరిచటికి వచ్చి శాశ్వతుడైన దేవుడు  నా బిడ్డలనెట్లు ప్రవాసమునకు పంపెనో చూడుడు

15. ఆయన దూరము నుండి కలు వారి మీదికొక జాతిని గొనివచ్చెను. అది పరభాష మాటలాడు జాతి, సిగ్గుసెరములేని జాతి. వృద్ధులయెడల గౌరవము, పిల్లలయెడల కరుణలేని జాతి.

16. ఆ జాతి నాముద్దు కుమారులను, కుమార్తెలను గొనిపోయెను. నేను వితంతువునై ఏకాకినైతిని.

17. ప్రవాసముననున్న బిడ్డలారా! నేను మీకు ఏవిధముగాను సహాయపడలేను.

18. ఈ వినాశనములను మీ మీదికి కొనివచ్చిన దేవుడు మాత్రమే శత్రువుల నుండి మిమ్ము కాపాడును.

19. బిడ్డలారా! మీ దారి మీరు చూచుకొనుడు. నేను ఒంటరిదాననైతిని.

20. నేను శాంతికాలమున ధరించు దుస్తులను తొలగించి, శోకించువారు ధరించు దుస్తులను తొడుగుకొంటిని. నేను బ్రతికున్నంతకాలము నిత్యుడైన దేవునికి మొరపెట్టుదును.

21. బిడ్డలారా! మీరు ధైర్యము తెచ్చుకొని దేవునికి మనవిచేయుడు. ఆ పరపీడన నుండియు, అన్యుల బలము నుండియు ఆయన మిమ్ము విడిపించును.

22. నిత్యుడైన దేవుడు త్వరలోనే మీకు విముక్తి దయచేయునని నా నమ్మకము. పవిత్రుడును, మిమ్ము శాశ్వతముగా రక్షించువాడైన ప్రభువు, మీ మీద కరుణ చూపినపుడు నేను ఆనందింతును.

23. మీరు బందీలుగా వెడలిపోయినపుడు నేను కన్నీరు కార్చి విలపించితిని. కాని ప్రభువు మిమ్ము మరల తీసికొనిరాగా నేను నిత్యానందమును అనుభవింతును.

24. ఈ సియోను, పొరుగువారు బందీలుగా వెడలిపోవుట చూచినట్లే, నిత్యుడైన దేవుడు మహావైభవముతో విచ్చేసి మిమ్ము రక్షించుటను గూడ త్వరలోనే చూచును.

25. బిడ్డలారా! మీరు దైవశిక్షను ఓర్పుతో సహింపుడు. మీ శత్రువులు మిమ్ము హింసించిరి. కాని వారి వినాశనమును మీరు త్వరలోనే చూతురు. వారు మీ దయకొరకు కాచుకొని ఉండుటను గాంతురు.

26. నేను మురిపెముతో పెంచిపాడుచేసిన మీరు ఇపుడు కరకుత్రోవవెంట పయనించితిరి. శత్రువులు దాడిచేసి తోలుకొనిపోయిన గొఱ్ఱెలమందవలె మీరును వెడలిపోతిరి.

27. బిడ్డలారా! మీరు ధైర్యము తెచ్చుకొని దేవునికి మొరపెట్టుడు. దేవుడు మిమ్ము దండించినను, మిమ్ము విస్మరింపడు.

28. మీరు పూర్వము దేవునినుండి వైదొలగ నిశ్చయించుకొనినట్లే ఇప్పుడు పదియంతలు అదనముగా ఆయనచెంతకు తిరిగివచ్చి ఆయనను సేవించుటకు ఉత్సహింపుడు.

29. మీకీ శిక్షను గొనివచ్చిన దేవుడు మిమ్ము కాపాడి శాశ్వతానంద భరితులను చేయును."

30. యెరూషలేమూ! నీవు ధైర్యము తెచ్చుకొనుము. నీకీ పేరు పెట్టిన దేవుడే నిన్ను ఓదార్చును.

31. నిన్ను బాధపెట్టి, నీ శ్రమలను చూచి సంతోషించిన వారు దుఃఖముపాలగుదురు.

32. నీ బిడ్డలను బానిసలను చేసిన నగరములు దుఃఖము పాలగును.నీ బిడ్డలను మ్రింగివేసిన బబులోనియా నగరము దుఃఖము పాలగును.

33. నీ పతనమును, నాశనమును గాంచి ఆనందించిన ఆ నగరము ఇపుడు ఏకాకియై విలపించును.

34. ఆ నగరము తాను ప్రగల్భములు ఆడినందుకు దుఃఖించును. దానికి గర్వకారణమైన మహాప్రజను నేను నాశనము చేయుదును.

35. నిత్యుడనైన నేను ఆ పట్టణముపై అగ్ని కురిపించగా అది రోజుల తరబడి మండును, దానిలో చాల రోజుల వరకు దయ్యములు వసించును.

36. యెరూషలేమూ! నీవు తూర్పువైపు మరలి దేవుడు కొనివచ్చు ఆనందమును చూడుము.

37. నీనుండి వెడలిపోయిన బిడ్డలు తిరిగివచ్చుచున్నారు చూడుము! పవిత్రుడైన దేవుని ఆజ్ఞపై వారిని తూర్పు పడమరలనుండి ప్రోగుచేసిరి. దేవుని వైభవమును గాంచి ఆనందించుచు వారిపుడు తిరిగివచ్చుచున్నారు.

 1. యెరూషలేమూ! నీవు విచారవస్త్రములను తొలగించి దైవవైభవమనెడు శాశ్వత సౌందర్యమును ధరింపుము.

2. నీవు దేవుని నీతివస్త్రము కప్పుకొనుము. నిత్యుడైన దేవుని వైభవమను కిరీటమును తలపై పెట్టుకొనుము.

3. దేవుడు ఆకాశము క్రింద నరులకెల్ల నీ సౌందర్యవైభవమును చూపించును.

4. నీ నీతినుండి శాంతిని, నీ భక్తినుండి కీర్తిని బడయుదానవని ఆయన నీకు శాశ్వతముగా పేరు పెట్టును.

5. యెరూషలేమూ! నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరలనుండి కొనివచ్చుటను చూడుము. ప్రభువు తమను జ్ఞప్తికి తెచ్చుకొనెనని వారు ప్రమోదము చెందుదురు.

6. పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకొని పోగా, వారు కాలినడకన వెళ్ళిపోయిరి. కాని దేవుడిప్పుడు వారిని నీ చెంతకు తీసికొనివచ్చుచున్నాడు, రాజవైభవములతో జనులు వారిని మోసికొని వచ్చుచున్నారు.

7. యిస్రాయేలీయులు దైవమహిమతో సురక్షితముగా తిరిగివచ్చుటకై ఉన్నతపర్వతములను, శాశ్వత నగరములను చదును చేయవలెననియు, లోయలను పూడ్చి నేలనుసమతలము చేయవలెననియు దేవుడు ఆజ్ఞాపించెను.

8. దేవుని ఆనతిపై సుగంధవృక్షములతో కూడిన అడవులు పెంపుజెంది యిస్రాయేలీయులకు నీడనిచ్చును.

9. దేవుడు యిస్రాయేలీయులను తొడ్కొని వచ్చును. ఆయన కరుణయు, నీతియు వారిని నడిపించుకొని వచ్చును. . ఆయన మహిమాన్విత కాంతి వారినంటియుండును. వారు మహానందముతో తిరిగివత్తురు.

 1. బబులోనియా రాజు యెరూషలేము పౌరులను బంధించి బందీలనుగా కొనిపోకముందు యిర్మీయా వారికి పంపిన లేఖకు నకలు ఇది. ప్రభువు యిర్మీయాను వారితో చెప్పుమనిన సందేశమిందు కలదు.

2. మీరు ప్రభువునకు ద్రోహముగా పాపము చేసితిరి. కావుననే బబులోనివరాజగు నెబుకద్నెసరు మిమ్ము బందీలుగా కొనిపోవుచున్నాడు.

3. మీరు ఆ దేశమున చాలకాలము, అనగా ఏడుతరముల వర కును ప్రవాసమున గడి పెదరు. అటు తరువాత దేవుడు మిమ్ము క్షేమముగా ఇంటికి గొనివచ్చును.

4. మీరు బబులోనియా దేశమున కొయ్యతోను, వెండిబంగారములతోను చేయబడిన దైవములను చూతురు. విగ్రహారాధకులు వానిని భుజములపై మోసికొని పోవుచుందురు. అవి వారికి భీతిని పుట్టించు చుండును.

5. మీరు ఆ అన్యజాతి ప్రజలను అనుక రింపవలదు. ప్రజలు ఆ దైవములను ఊరేగించుచు, వానిని ఆరాధించునపుడు మీరు వానిని చూచి వెరగందకుడు.

6. మీరు మీ మనస్సులలో “ప్రభూ! మేము నిన్ను మాత్రమే పూజింపవలయును” అని అనుకొనుడు.

7. అచట దేవదూత మీతోనుండి మిమ్ము కాపాడుచుండును.

8. వారు విగ్రహములకు వెండిబంగారములు పొదుగుదురు. వడ్రంగులు వానికి నాలుకలు అమర్చు దురు. అయినను అవి నిజమైన దైవములుకావు కనుక మాట్లాడలేవు.

9. ప్రజలు బంగారు కిరీటములుచేసి వాని తలలపై పెట్టుదురు. సొమ్ములు పెట్టుకొనుటకు అవి ఆడపిల్లలా ఏమి?

10. కొన్నిసారులు పూజారులు తమ వేల్పులనుండి వెండిబంగారములు దొంగిలించి తమ ఇష్టము వచ్చినట్లు వాడుకొందురు.

11. వానిని దేవాలయములలో వసించు దేవదాసీలకు గూడ ఇత్తురు. ఆ కొయ్య, వెండి, బంగారు దైవములకు నరులకువలె బట్టలు కట్టబెట్టుదురు.

12. వానిని రాజులవలె ముదురుకెంపువన్నె ఉడుపులతో అలంక రించినను అవి మాసిపోకమానవు. చెదలు వానిని కొట్టివేయకమానదు.

13. దేవాలయ ధూళి వారి మొగములమీద క్రమ్ముకొనినపుడు ఇతరులు దానిని తుడిచివేయవలెను.

14. అవి న్యాయాధిపతివలె చేతిలో రాజదండము తాల్చును. కాని తమకు ఎవరైన ద్రోహము చేసినచో వారిని శిక్షింపజాలవు.

15. కొన్నిమార్లు అవి చేతిలో కత్తులను, గొడ్డళ్ళను పట్టుకొనియుండును. కాని యుద్ధమున శత్రువులు తమను నాశనము చేయునపుడు కాని, దొంగలు తమను దోచుకొనునపుడుగాని అవి తమ్ము తాము రక్షించుకోజాలవు.

16. దీనినిబట్టి అవి దైవములు కావని ఋజువగుచున్నది. కనుక వానిని పూజింపకుడు.

17. దేవాలయములలో కూర్చుండియున్న ఆ దైవములు పగిలిపోయిన కుండలవలె నిష్ప్రయోజన మైనవి. గుడిలోనికి వచ్చువారు రేపు దుమ్ము వాని కన్నుల నిండ పడును.

18. దొంగలు పడకుండుటకు పూజారులు గుళ్ళను తలుపులతోను, అడ్డు గడియలతోను బిగింతురు. కావున రాజద్రోహము చేయగా ఉరితీయుటకు బంధించి ఉంచిన ఖైదీలనువలె ఆ దైవములను చెరలో పెట్టి తలుపులు బిగింతురు.

19. పూజారులు తాము ముట్టించు కొనిన దానికంటేకూడ అదనముగా తమ వేల్పులకు దీపములు ముట్టింతురు. కాని విగ్రహములు ఆ దివ్వెలలో ఒక్కదానిని గూడ చూడలేవు.

20. గుడి దూలములనువలె ఆ బొమ్మల అంతర్భాగమును గూడ చెదలు తినివేయును. వాని బట్టలను నాశనము చేయును. కాని వానికి సంగతి కూడ తెలియదు.

21. గుడిలోని పొగవలన వాని మొగములు నల్లబారును.

22. గబ్బిలములు, వానకో విలలు, ఇతరపక్షులు వాని తలలమీద, దేహముల మీద వాలును. పిల్లులు వాని పైకెక్కి కూర్చుండును.

23. దీనినిబట్టి అవి దైవములు కావని ఋజువగు చున్నది. కనుక మీరు వానిని పూజింపకుడు.

24. అందముగా ఉండుటకై ఆ బొమ్మలకు బంగారము పొదుగుదురు. కాని ఎవరైన వానిని రుద్దిననేగాని అవి మెరవవు. మూసలలో బొమ్మలుగా పోసినపుడు వానికెట్టి బాధయు కలుగలేదు.

25. ఎంత వెల ఇచ్చి కొనినను ఊపిరి పీల్చుకోజాలవు.

26. అవి తమ కాళ్లతో తాము నడవలేవు. ఇతరులు వానిని మోసికొని పోవలెను. దీనిని బట్టే అవెంత నిష్ప్రయోజనమైనవో తెలియుచున్నది.

27. ఆ దైవములను కొలుచువారుకూడ అవి క్రిందబడగా మరల పైకెత్తవలసి వచ్చినపుడు సిగ్గుపడుదురు. ఒకచోట నిలబెట్టిన పిదప అవి అడుగులు వేయలేవు. ప్రక్కకు ఒరిగినచో మరల నిలువుగా నిలబడలేవు. వానికి కాను కలు అర్పించుట శవముల కర్పించుటతో సమానము.

28. ఆ దైవములకర్పించిన అర్పణలను పూజారులు అమ్మి సొమ్ము జేసికొందురు. పూజారుల భార్యలు ఆ అర్పణములను పేదలకు అనాథలకు పంచి పెట్టరు. ఉప్పువేసి పదిల పరచుకొందురు.

29. ముట్టుతలు, బాలింతరాండ్రు గూడ వానిని ముట్టుకొందురు. దీనిని బట్టి అవి దైవములు కావని ఋజువగుచున్నది. కనుక మీరు వానిని గూర్చి భయపడకుడి.

30. కొయ్యతోను, వెండి బంగారముల తోను చేయబడిన ఈ విగ్రహములకు స్త్రీలు కూడ బలుల ర్పింతురు. అవి దైవములెట్లగును?

31. పూజారులు విలపించునపుడు చినిగినబట్టలుతాల్చి శిరస్సులు గొరి గించుకొని తలలు కప్పుకొనకయే గుళ్ళలో కూర్చుందురు.

32. జనులు చనిపోయిన దినమునందువలె పూజారులు ఆ దైవములెదుట పెద్దగా అరచుచు కేకలు వేయుదురు.

33. వారు ఆ దేవతలకు తొడిగిన బట్టలను తమ ఆలుబిడ్డల కిత్తురు.

34. ఆ విగ్రహములకు అపకారము చేసినను ఉపకారముచేసినను ఒకటే. అవి తిరిగేమియు చేయజాలవు. అవి రాజులను చేయజాలవు. రాజులను తలక్రిందులు చేయలేవు.

35. అవి ఎవరిని సంపన్నులను చేయలేవు. ఎవరికీ డబ్బీ యలేవు. ఎవడైన మ్రొక్కుబడిచేసి తీర్పకుండెనేని వానిచే ఆ మ్రొక్కుబడిని చెల్లింపజేయలేవు.

36. అవి ఎవనిని చావునుండి తప్పింపలేవు. దుర్భలుని బల వంతునినుండి కాపాడలేవు.

37. గ్రుడ్డివారికి చూపునీయలేవు. ఆర్తిలోనున్నవారిని రక్షింపలేవు.

38. వితంతువులను, అనాథలను, కరుణతో ఆదుకొని సాయము చేయలేవు.

39. కొయ్యతో చేసి, వెండి బంగారములతో పొదిగిన ఈ దైవములు, కొండనుండి పగులగొట్టిన బండవలె నిరర్ధకమైనవి. వానిని కొలుచువారు అవమానము తెచ్చుకొందురు.

40. వానిని దైవములుగా భావించుట ఎట్లు? పేర్కొనుటెట్లు?

41. బబులోనీయులు తమ దైవములకే అపకీర్తి తెచ్చుచున్నారు. ఎవడైన మూగవాడు కన్పించినచో వానిని దేవాలయమునకు కొనిపోయి వాక్చక్తిని ప్రసాదింపుమని బేలు దేవతను అర్ధింతురు. ఆ దేవత ఈ సంగతి నేమియు అర్థము చేసికోలేదు.

42. తాము కొలుచు దైవములు తమకు సాయము చేయలేవని తెలిసియు, ప్రజలు మూర్ఖముగా వానినే కొలుచు చుందురు.

43. ఇంకను స్త్రీలు నడుముచుట్టు త్రాళ్ళు చుట్టుకొని తవుడును సాంబ్రాణివలె కాల్చుచు, వేశ్య లుగా వర్తించుచు దారిప్రక్కన కూర్చుందురు. ఎవడైనను వారిలో ఒకతెను కొనిపోయి కూడెనేని, ఆమె తిరిగివచ్చి తన ప్రక్కన కూర్చుండి ఉన్న ఉవిదను పరిహాసము చేయును. నీవు అందగత్తెవు కాదు కనుక ఎవడును నీ త్రాటిని ట్రెంచి నిన్ను తీసికొని పోలేదని పలుకును.

44. ఈ విగ్రహములకు సంబంధించి నదంతయు వట్టి అనృతము. వానిని దేవతలని భావించుటకాని, పిలుచుటకాని తగునా?

45. వడ్రంగులును, కంసాలులును చేసిన ఇవి దైవములా? ఆ పనివారు ఉద్దేశించిన దానికంటే అవి ఎక్కువ కాజాలవు.

46. ఈ విగ్రహములను చేయువారే చిరకాలము జీవింపరు. మరి వారు దైవముల నెట్లు చేయుదురు?

47. ఈ పనివారు భావితరముల వారికి వంచనను, అవమానమును వదిలిపెట్టిపోవుచున్నారు.

48. యుద్ధములు, క్షోభములు సంభవించినపుడు విగ్రహములను తీసికొనిపోయి ఎక్కడ దాగుకొందమా అని పూజారులు ఆలోచన చేయుదురు.

49. ఈ విగ్రహములు ఆ సంఘటనలనుండి తమను తామే రక్షించుకోలేవు. కనుక ఇవి దైవములు కావని నరులేల గ్రహింపరు?

50. ఇవి వెండిబంగారములు పొదిగిన కొయ్యలు.వీని మోసము ఒక రోజున బయటపడకపోదు.

51. ఎల్ల జాతులును, ఎల్ల రాజులును విగ్రహములు నరమాత్రులు చేసినవనియు, వానికి దైవశక్తి లేదనియు గ్రహింతురు.

52. ప్రతివాడును అవి దైవములు కావని తెలిసికోవలెను.

53. అవి దేశమునకు రాజును నియమింపలేవు. ప్రజలకు వర్షము కురిపించలేవు.

54. తమ విషయమును తామే చక్కబెట్టుకోలేవు, అన్యాయము జరిగిన వానికి న్యాయము చేకూర్చి పెట్టలేవు. కనుక అవి ఆకాశముననెగురు కాకులవలె నిరర్ధకమైనవి.

55. దేవాలయమునకు నిప్పంటుకొనినచో పూజారులు పారిపోయి ప్రాణములు దక్కించుకొందురు. కొయ్యతో చేసి, వెండిబంగారములు పొదిగిన ఈ బొమ్మలు ఆ దేవాలయములోని దూలములతో పాటు కాలిపోవును.

56. అవి రాజులతోగాని, విరోధులతోగాని యుద్ధములు చేయలేవు. అవి దైవములని ఎవడు నమ్మును? కొయ్యతో చేసి వెండిబంగారములను పొదిగిన ఈ ప్రతిమలు దొంగలనుండియు, దోపిడికాండ్ర నుండియు తమను తాము రక్షించుకోలేవు.

57. వారు వాని వెండి బంగారములను, ఉడుపులను దొంగిలించుకొని పోవుదురు. ఆయినను ఈ దైవములు వారినాపలేవు.

58. శూరుడైన రాజుకాని, గృహకృ త్యములకు ఉపయోగపడెడి కుండకాని ఈ దొంగ దైవములకంటెను మెరుగు. ఇంటిలోని వస్తువులను కాపాడును గనుక తలుపు, ఈ దబ్బర దేవతలకంటె మేలు. ప్రాసాదమునందలి కొయ్యకంబము ఈ కల్ల దేవతలకంటే నయము,

59. దేవుడు వెలుతురునిచ్చుటకు సూర్యచంద్ర నక్షత్రములను చేసెను. అవి ఆయన మాట పాటించును.

60. మెరుపులును, వాయువులును ఇట్లే మెలగును. మెరుపులను దూరమునుండి చూడవచ్చును. గాలి ఎల్ల తావులందును వీచును.

61. దేవుడు మబ్బులకు లోకమంతట క్రమ్మవలెనని ఆజ్ఞ ఈయగా అని అట్లే చేయును.

62. ఆయన కొండలను, అడవులను తగులబెట్టుటకు ఆకసమునుండి అగ్గిని పంపును. అది ఆయన మాటమీరదు. రూపమునగాని, శక్తిలోగాని విగ్రహములు ఈ ప్రకృతి శక్తులతో సమానము కాజాలవు.

63. విగ్రహములు మనకు మేలుగాని, కీడుగాని చేయలేవు. కనుక వానినెవరును వేల్పులని ఎంచనక్కర లేదు, పిలువనక్కరలేదు.

64. అవి దైవములు కావు. కనుక మీరు వానికి భయపడవలదు.

65. ఈ దేవములు రాజులను దీవింపలేవు. శపింపలేవు. వారిపై వీనికి అధికారము లేదు.

66. అవి జాతుల మేలుకొరకు ఆకాశమున గురుతులు చూపింపలేవు. సూర్యచంద్రులవలె ప్రకాశింపలేవు.

67. వీని కంటె వన్యమృగములే మెరుగు. అవి కనీసము అపాయమునుండి తప్పించుకొని పారిపోవును.

68. కనుక అవి దైవములు కావని రూఢిగా తెలియుచున్నది. కనుక మీరు వానిని పూజింపకుడు.

69. కొయ్యతో చేసి, వెండి బంగారములు పొదిగిన అన్యుల విగ్రహములు దోసతోటలోని దిష్టిబొమ్మతో సమానము. అవి కావలి కాయలేవు.

70. అవి పూల తోటలోని ముండ్లచెట్టు వంటివి. పక్షులను తోలివేయుటకు మారుగా తమమీదికి ఎక్కించుకొనును. అవి చీకటిలోనికి విసరివేసిన శవములవంటివి.

71. అవి ధరించిన నీల, రక్తవర్ణ వస్త్రములు చివికిపోవును. కనుక అవి దైవములు కావు. కడన చెదలు వానిని కొట్టివేయును. అటు పిమ్మట ఎల్లరును వానిని చీదరించుకొందురు.

72. సజ్జనుడు విగ్రహములను పెట్టుకొని నగుబాట్లు తెచ్చుకొనడు. కనుక అతడు ఉత్తముడు.