ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆదికాండము

 1. ఆదిలో దేవుడు ఆకాశమును, భూమిని సృష్టించెను.

2. భూమికి ఒక ఆకారము లేకుండ శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించియుండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను.

3. అపుడు 'వెలుగు కలుగునుగాక” అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను.

4. దేవుని కంటికది బాగుగా నుండెను. ఆయన చీకటినుండి వెలుగును వేరుచేసెను.

5. వెలుగునకు పగలని, చీకటికి రాత్రియని పేర్లు పెట్టెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే మొదటి రోజు.

6. “నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని రెండు భాగములుగా విడదీయును గాక" అని దేవుడానతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను.

7. పై నీటి నుండి క్రింది నీటిని వేరుచేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను.

8. ఆయన ఆ గుండ్రని కప్పునకు 'ఆకాశము' అని పేరు పెట్టెను. అంతట సాయంకాలము గడచి, ఉదయమాయెను. అదే రెండవ రోజు.

9.' 'ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రింద నున్న నీరంతా ఒక చోట నిలుచును గాక!" అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను.

10. ఆరిన నేలకు భూమియని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికది బాగుగానుండెను.

11."గింజల నిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్నిరకముల వానిని భూమి మొలిపించును గాక" అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను.

12. భూమి గింజల నిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను అన్ని రకముల వానిని మొలిపించెను. దేవుని కంటికది బాగుగా నుండెను.

13. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే మూడవ రోజు.

14. 'రాత్రినుండి పగటిని వేరుచేయుటకు, పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు, ఆకాశమున జ్యోతులు అవతరించును గాక!

15. అవి భూమికి వెలుగు నిచ్చుటకు ఆకాశమున ప్రకాశించును గాక!" అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను.

16. దేవుడు మహాజ్యోతులను రెండింటిని సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును. చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడ సృష్టించెను.

17-18. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికది బాగుగా నుండెను.

19. అంతట సాయంకాలము గడచి, ఉదయమాయెను. అదే నాల్గవ రోజు.

20. "జలములందు పలురకముల ప్రాణులు పుట్టును గాక! ఆకాశమున పక్షులు ఎగురును గాక” అని దేవుడు అనెను. ఆ ప్రకారమే జరిగెను.

21. దేవుడు సముద్రములో మహా తిమింగిలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను, పలురకముల పక్షులను సృజించెను. దేవుని కంటికది బాగుగా నుండెను.

22. వాని నన్నిటిని దీవించి “జలములందలి ప్రాణులు వృద్ధిచెంది సముద్రములో నిండియుండును గాక! నేలమీద పక్షులు లెక్కకు మిక్కుటమగును గాక!" అని ఆనతిచ్చెను.

23. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే అయిదవ రోజు.

24. "భూమి పెంపుడు జంతువులను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వానిని పుట్టించును గాక" అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను.

25. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కంటికది బాగుగా నుండెను.

26. దేవుడు “ఇక ఇప్పుడు మానవజాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మా వలె ఉండును. అతడు నీళ్ళలోని చేపలపై, ఆకాశమందు పక్షులపై, నేలమీది పెంపుడు ప్రాణులపై, క్రూరమృగము లపై, ప్రాకెడు జంతువులపై అధికారము కలిగి యుండును" అనుకొని,

27. దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను. స్త్రీ, పురుషులుగా వారిని సృజించెను.

28. దేవుడు వారిని దీవించెను: ఫలించి,"సంతానాభివృద్ధి పొంది, భూమండల మందంతట వ్యాపించి, దానిని వశము చేసికొనుడు. నీళ్ళలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు.

29. గింజలనిచ్చు మొక్కలన్ని విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్ని మీకిచ్చితిని. అవి మీకాహారమగును.

30. కాని నేల మీది మృగములకు, ఆకాశమందలి పక్షులకు, నేలమీద ప్రాకెడు జంతువుల కు జీవులన్నిటికిని పచ్చని మొక్కలు ఆహారమగును"అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను.

31. దేవుడు తాను చేసిన సృష్టినంతా చూచెను. ఆయన కంటికది చాల బాగుగానుండెను. అదే ఆరవ రోజు. 

 1. ఈ విధముగా ఆకాశము, భూమి, సమస్త సమూహములు సంపూర్ణముగా రూపొందెను.

2. ఏడవరోజు దేవుడు తాను చేయుచున్న పనియంతటి నుండి విశ్రమించెను.

3. సృష్టిని పూర్తిచేసి ఏడవరోజున దేవుడు తాను చేసిన, సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని 'పవిత్రదినము'గా చేసెను.

4. భూమ్యాకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే.

5. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు, నేలమీద పచ్చని చెట్టుచేమలేవియును లేవు. ఏలయన దేవుడు భూమిమీద వానలు కురిపింపలేదు. నేలను సాగుచేయుటకు ఎవ్వడును లేడు.

6. కాని భూమి నుండి నీటియావిరి పెల్లుబికి నేలనెల్ల తడుపుచుండెను.

7. అప్పుడు దేవుడైన యావే నేలమట్టిని కొంత తీసికొని, దానినుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను.

8. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోటను నాటెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను.

9. చూచుటకు ఇంపుగానుండి, తినుటకు తియ్యగానుండు పండ్లనిచ్చు చెట్లన్నియు ఆ తోటలో పెరుగునట్టు చేసెను. తోటనడుమ జీవమిచ్చుచెట్టు, మంచిచెడుల తెలివినిచ్చు చెట్టును మొలిపింపచేసెను.

10. తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది ప్రవహించెను. అది నాలుగు పాయలుగా చీలెను.

11. మొదటిపాయ పేరు పీషోను. అది హవీలా దేశమును చుట్టిపారును.

12. ఆ దేశమున మేలిమి బంగారమును, మంచిగుగ్గిలమును, గోమేధికములును దొరకును.

13. రెండవపాయ పేరు గీహోను. అది కూషు దేశమును చుట్టి పారుచుండును.

14. మూడవ పాయ పేరు టిగ్రీసు. అది అస్సిరియాకు తూర్పున ప్రవహించును. నాలుగవపాయ యూఫ్రటీసు.

15. దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదెను తోటను సాగుచేయుటకును, కాచుటకును దానిలో  ఉంచెను.

16. “నీవు తోటలో ఉన్న ప్రతిచెట్టు పండును నిరభ్యంతరముగా తినవచ్చును.

17. కాని మంచిచెడులనెంచు తెలివినిచ్చు చెట్టునుండి మాత్రము తినరాదు. నీవు వాటిని తినుదినమున తప్పక చని పోవుదువు” అని దేవుడయిన యావే నరుని ఆజ్ఞా పించెను.

18. అంతట దేవుడైన యావే “నరుడు ఒంటరిగా జీవించుట మంచిదికాదు. అతనికి సాటియైన తోడును సృష్టింతును” అని అనుకొనెను.

19. కావున దేవుడైన యావే నేలనుండి అన్నిరకముల మృగములను, పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలిసికొనగోరి, వానినన్నిటిని అతని కడకు కొనితెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి.

20. ఇట్లు అన్నిరకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూరమృగములకు నరుడు పేర్లు పెట్టెను. కాని అతనికి తగిన తోడెవ్వరును దొరకలేదు.

21. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢనిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునపుడు ఆయన అతని ప్రక్కటెముకనొకదానిని తీసి, ఆ చోటును మరల మాంసముతో పూడ్చెను.

22. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి, దేవుడైన యావే ఆమెను అతనికడకు తోడ్కొనివచ్చెను.

23. అప్పుడు నరుడు “చివరకు ఈమె నా వంటిదైనది ఈమె నా ఎముకలలో ఎముక నా దేహములో దేహము ఈమె నరునినుండి రూపొందినది కావున నారియగును” అనెను.

24. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొనిపోవును. వారిరువురు ఏక శరీరులగుదురు.

25. అప్పుడు ఆ స్త్రీపురుషులిద్దరు దిసమొలతోనుండిరి. అయినను వారికి సిగ్గు వేయలేదు. 

 1. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి యందును సర్పము జిత్తులమారిది. అది “తోటలో నున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట! నిజమేనా?" అని స్త్రీని అడిగెను.

2-3. దానికి స్త్రీ “తోట నడుమనున్న చెట్టుపండు తప్ప  మిగిలిన ఏ చెట్టు పండయినను మేము తినవచ్చును. ఆ చెట్టుపండును మాత్రము మేము తినరాదు, తాకరాదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని దేవుడు చెప్పెను” అని బదులిచ్చెను.

4. అంతట సర్పము “ఆ మాట నిజముగాదు. మీరు చావనే చావరు.

5. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు, మీరు మంచిచెడులు తెలిసికొని దేవునివలె అగుదురనియు ఎరిగి ఆయన మీకు అటుల చెప్పెను” అని అనెను.

6. స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనపడెను. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ‘ఆ పండు వలన తెలివితేటలు గలిగిన, ఎంత బాగుండునోకదా!' అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టుపండ్లు కోసి తానుతిని, తనతోపాటు నున్న తన భర్తకును ఇచ్చెను. అతడును తినెను.

7. అపుడు వారిద్దరి కనులు తెరువబడెను. తాము దిసమొలతో ఉన్నట్లు వారు తెలిసికొనిరి. అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి.

8. ఆ సాయంకాలమున దేవుడైన యావే చల్ల గాలికి తోటలో తిరుగాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండ చెట్లనడుమ దాగుకొనిరి.

9. కాని దేవుడైన యావే నరుని బయటికి పిలిచి “ఓయి! నీవు ఎక్కడ ఉంటివి?” అని ప్రశ్నించెను.

10. అంతట మానవుడు “తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని. నేను దిసమొలతో ఉంటిని కనుక భయపడి దాగు కొంటిని” అనెను.

11. “నీవు దిసమొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా?” అని దేవుడు ప్రశ్నించెను.

12. “నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని” అని నరుడు చెప్పెను.

13. దేవుడైన యావే “నీవు చేసినదేమిటి?" అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె “సర్పము ఆ పండు తినుమని నన్ను మోసపుచ్చినది, కనుక తింటిని” అని బదులు చెప్పెను.

14. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను: “నీవు ఇంతపని చేసితివి కనుక జంతువులలోను, క్రూరమృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్నాళ్ళు పొట్టతో ప్రాకుదువు. మట్టియే నీకు ఆహారము.

15. నీకును, స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతతికిని మధ్య వైరము కలుగచేయుదును. ఆమె సంతతి నీ తల చితక గొట్టును. నీవేమో వాని మడమ కరిచెదవు.”

16. ఆయన స్త్రీతో ఇట్లనెను: “నీవు గర్భము ధరించినపుడు నీ బాధలు అధికము చేయుదును. నీ ప్రసవవేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్తయెడల నీకు కోరిక కలుగును. అతడు నిన్ను ఏలును.”

17. ఆయన నరునితో ఇట్లనెను: “నీవు నీ భార్య మాటవిని నేను తినవలదనిన చెట్టుపండును తింటివి. నీ వలన ఈ భూమి శాపము పాలయినది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి, కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు.

18. ఈ నేల నీకై ముండ్లతుప్పలను, గచ్చపొదలను మొలిపించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు.

19. నీవు పుట్టిన మట్టిలో మరల కలిసిపోవువరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొందువు. ఈ నీవు మట్టినుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు.”

20. ఆదాము " తన భార్యకు 'ఏవ” అని పేరు పెట్టెను. ఎందుకనగా జీవులందరికి ఆమె తల్లి.

21. అంతట దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు ఏవకు తొడిగెను.

22. అప్పుడు దేవుడైన యావే "మానవుడు కూడ మంచిచెడులు గుర్తించి మా సాటివాడయ్యెను. అతడిక చెయ్యిచాచి జీవమిచ్చు చెట్టుపండ్లను కోసికొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో!” అనుకొనెను.

23. కావున ఆయన ఏదెను తోటనుండి నరుని వెళ్ళగొట్టెను. అతడు ఏ నేలనుండి తీయబడెనో ఆ నేలను సాగు చేయుటకు అతనిని పంపివేసెను.

24. ఈ విధముగా దేవుడు తోటనుండి మానవుని తరిమివేసెను. ఆయన ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబు దూతలను, గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. జీవమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరిని రానీయకుండుటకే దేవుడిట్లుచేసెను. 

 1. ఆదాము తన భార్య ఏవను కూడెను. ఆమె గర్భవతియై కయీనును కనెను. “దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను” అని ఆమె తలంచెను.

2. తరువాత ఆమె కయీను తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెలకాపరి. కయీను సేద్యగాడు.

3. కొంతకాలము గడచిన తరువాత కయీను పండినపంటలో కొంతపాలు దేవునికి కానుకగా కొనివచ్చెను.

4. హేబెలు కూడ మందలో పుట్టిన తొలిచూలు పిల్లలను, వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభువు హేబెలును, అతని కానుకను ప్రసన్నదృష్టితో చూచెను.

5. కాని కయీను కానుకను తోసిపుచెను. కావున కయీను మిక్కిలి కోపముతో ముఖము చిన్నబుచ్చుకొనెను. "

6. ప్రభువు కయీనుతో “నీకు కోపమేల? నీ ముఖము చిన్నబుచ్చుకొననేల?

7. మంచిపనులు చేసినచో తలయెత్తుకొని తిరుగగలవు. చెడుపని చేసినచో పాపమువచ్చి వాకిట పొంచియుండి నిన్ను మ్రింగజూచును. కాని నీవు దానిని అణగదొక్కవలెను.” అని అనెను.

8. ఒకనాడు కయీను తన సోదరుడు హేబెలుతో “మనమిద్దరము పొలమునకు వెళ్ళుదము రమ్ము" అని అడిగెను. అక్కడికి వెళ్ళిన తరువాత కయీను హేబెలు మీదపడి అతనిని చంపెను.

9. “నీ తమ్ముడు హేబెలు ఎక్కడ?” అని ప్రభువు కయీనును అడిగెను. దానికి కయీను “నాకు తెలియదు. నేనేమైన వానికి కావలివాడనా?” అని ఎదురుచెప్పెను.

10. దానికి ప్రభువు “అయ్యో! నీవెంత పనిచేసితివి? నీ తమ్ముని నెత్తురు నేలమీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది.

11. నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరుతెరచినది. ఈ భూమిపై నీవిక నిలువరాదు. నిన్ను శపించు చున్నాను.

12. నీ వెంత సాగుచేసినను ఈ నేలలో పంటలు పండవు. పారుబోతువై, దేశదిమ్మరివై బ్రతుకుము” అనెను.

13. కయీను ప్రభువుతో “నేనింత శిక్ష భరింపజాలను.

14. ఈనాడు ఇక్కడనుండి నన్ను వెళ్ళగొట్టితివి. నేనిక నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి, పారుబోతునై దేశదిమ్మరినై తిరుగవలెను. ఎదురుపడినవాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయును” అని పలికెను.

15. అంతట ప్రభువు అతనితో “కయీనును చంపినవాడు ఏడంతల దండన పాలగును.” అనెను. ఇట్లని దేవుడు కయీనునకు ఎదురుపడినవాడు ఎవడును అతనిని చంపకుండు టకు అతని ముఖమున ఒక గుర్తుంచెను.

16. కయీను ప్రభువు సముఖమునుండి వెడలి, ఏదెనుకు తూర్పుగా ఉన్న నోదు దేశములో నివసించెను.

17. కయీను తన భార్యను కూడెను. ఆమె గర్భవతియై హనోకును కనెను. అంతట కయీను ఒక నగరమును నిర్మించెను. ఆ నగరమునకు తన కుమారుని పేరు పెట్టెను.

18. హనోకునకు ఈరాదు పుట్టెను. ఈరాదునకు మహూయాయేలు జన్మించెను. మహూయాయేలునకు మతూషాయేలు, మతూషాయే లునకు లెమెకు పుట్టిరి.

19. ఆదా, సిల్లా అను పేర్లు గల స్త్రీలనిద్దరిని లెమెకు పెండ్లియాడెను.

20. ఆదా యాబాలును కనెను. ఈతడు గుడారములలో నివసించు పశువుల కాపరులకు మూలపురుషుడయ్యెను.

21. యాబాలు తమ్ముని పేరు యూబాలు. అతడు పిల్లనగ్రోవిని, సితారును మ్రోగించువారికి మూలపురుషుడు.

22. లెమెకు రెండవ భార్య సిల్లా తూబలుకయీనును కనెను. అతడు కాంస్య, ఇనుపవస్తువులను చేయనేర్పెడివాడు. తూబలుకయీను సోదరి పేరు నామా.

23. లెమెకు తన భార్యలతో ఇట్లనెను: “ఆదా! సిల్లా! నా మాటలు వినుడు. లెమెకు భార్యలారా! నా పలుకులు ఆలింపుడు. నన్ను గాయపరచిన వానిని చంపివేసితిని. నన్ను కొట్టిన పడుచువాని ప్రాణములు తీసితిని.

24. కయీనును చంపిన వానికి ఏడంతల శిక్ష. లెమెకును చంపినవారికి డెబ్బది యేడంతల దండనము.”

25. ఆదాము మరల తన భార్యను కూడెను. ఆమెకు ఒక కొడుకు పుట్టెను. “కయీను చంపిన హేబెలునకు బదులుగా దేవుడు ఇంకొక కుమారుని నాకిచ్చెను” అని తలంచి ఆమె తన కొడుకునకు షేతు అను పేరు పెట్టెను.

26. షేతుకు కూడ ఒక కొడుకు పుట్టెను. అతని పేరు ఎనోషు. అతని నాటినుండియే జనులు యావే నామమున దేవుని ఆరాధింప మొదలు పెట్టిరి. 

 1. ఆదాము వంశీయుల వృత్తాంతము ఇది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతనిని తనను పోలినవానిగా చేసెను.

2. వారిని స్త్రీ పురుషులనుగా చేసెను. వారిని సృష్టించినప్పుడే ఆశీర్వదించి వారికి “నరుడు” అను పేరు పెట్టెను.

3. ఆదాము నూటముప్పది యేండ్ల వయస్సున తన పోలికయున్న రూపముగల కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.

4. షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిదివందలయేండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు కలిగిరి.

5. అతడు తొమ్మిదివందలముప్పది యేండ్లు బ్రతికి చనిపోయెను.

6-7. ఎనోషు పుట్టినపుడు షేతు వయసు నూట ఐదేండ్లు, తరువాత అతడు ఎనిమిదివందల యేడేండ్లు జీవించి కుమారులను, కుమార్తెలను కనెను.

8. షేతు తొమ్మిదివందల పండ్రెండేండ్లు బ్రతికి చనిపోయెను.

9-10. కేనాను పుట్టినప్పుడు ఎనోషు తొంబది. యేండ్లవాడు. తరువాత ఎనోషు ఎనిమిదివందల పదునైదేండ్లు జీవించి, కుమారులను కుమార్తెలను కనెను.

11. అతడు తొమ్మిది వందల ఐదేండ్లు బ్రతికి చనిపోయెను.

12-13. మహలలేలు పుట్టినపుడు కేనాను వయస్సు డెబ్బది యేండ్లు. అతడు పుట్టిన తరువాత కేనాను ఎనిమిదివందల నలువదియేండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను.

14. అతడు తొమ్మిదివందల పదియేండ్లు బ్రతికి చనిపోయెను.

15-16. మహలలేలు అరువది అయిదు యేండ్లప్పుడు యెరెదును కనెను. తరువాత అతడు ఎనిమిదివందల ముప్పదియేండ్లు జీవించి, కుమారులను కుమార్తెలను కనెను.

17. మహలలేలు ఎనిమిది వందల తొంబది అయిదేండ్లు బ్రతికి చనిపోయెను.

18. యెరెదు నూటఅరువది రెండేండ్లప్పుడు హనోకును కనెను.

19. పిదప ఎనిమిదివందల యేండ్లు జీవించి, కుమారులను కుమార్తెలను కనెను.

20. యెరెదు తొమ్మిదివందల అరువది రెండేండ్లు బ్రతికి చనిపోయెను.

21-22. హనోకు అరువది అయిదేండ్లప్పుడు మెతూ షెలాను కనెను. మెతూషెలా పుట్టిన తరువాత హనోకు మూడువందల యేండ్లు దేవునితో నడచుచూ కుమారులను, కుమార్తెలను కనెను.

23. అతడు మూడువందల అరువదిఅయిదేండ్లు బ్రతికెను.

24. హనోకు దేవునకు సహచరుడై జీవించెను. ఆ తరువాత జనులు అతనిని చూడలేదు. దేవుడు హనోకును కొనిపోయెను.

25. మెతూ షెలా నూటయెనుబది. యేడేండ్లు అప్పుడు లెమెకును కనెను.

26. లెమెకు పుట్టిన తరువాత అతడు ఏడువందల ఎనుబదిరెండేండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను.

27. మెతూషెలా తొమ్మిదివందల అరువది తొమ్మిదేండ్లు బ్రతికి చనిపోయెను.

28. లెమెకు నూటయెనుబది రెండేండ్లు బ్రతికి ఒక కొడుకును కనెను.

29. “దేవుడు ఈ భూమిని శపించెను. కావున ఎడతెగని పని, వెట్టిచాకిరి మా పాలివాయెను. ఈ బాలుడు వీటినుండి మమ్ము ఓదార్చి ఉపశమింపచేయును” అని తలంచి లెమెకు తన కుమారునకు నోవా అని పేరు పెట్టెను.

30. నోవా పుట్టిన తరువాత లెమెకు ఐదువందల తొంబది యైదేండ్లు వచ్చువరకు కుమారులను కుమార్తెలను కనెను.

31. లెమెకు ఏడువందల డెబ్బది యేడేండ్లు బ్రతికి చనిపోయెను.

32. నోవా ఐదువందల యేండ్లు జీవించి షేము, హాము, యాఫెతులను కనెను. 

 1. మానవులు పెంపొంది భూమిపై విస్తరిల్లిరి. వారికి కుమార్తెలు పుట్టిరి.

2. దేవపుత్రులు వారి సౌందర్యమును చూచి, వారిలో తమకు నచ్చినవారిని పెండ్లాడిరి.

3. కాని దేవుడు “నా ఆత్మ మనుష్యునితో ఎల్లప్పుడును వాదించదు. అతడు భౌతికదేహము ధరించిన దుర్బలప్రాణి. నరుడు నూట యిరువది యేండ్లు మాత్రమే బ్రతుకును” అని తలంచెను.

4. ఆ రోజులలో భూమిపై నెఫీలులను మహాకాయులు ఉండిరి. దేవపుత్రులు మానవ స్త్రీలను కూడగా జన్మించినవారే ఈ మహాకాయులు. వారే ప్రసిద్ధుల యిన పురాతన వీరులు.

5. భూమిపై గల మానవులు పరమ దుష్టులై పోయిరి. వారు ఎల్లప్పుడు చెడుపనులు చేయవలెననియే తలంచుచుండిరి.

6. ఇది చూచి దేవుడు భూమిమీద మానవుని సృష్టించినందులకు పరితాపము నొంది హృదయములో నొచ్చుకొనెను.

7. అంతట దేవుడు "నేనే సృష్టించిన ఈ మానవజాతిని జంతువులతో, ప్రాకెడుపురుగులతో, పక్షులతో సైతము భూమి మీద కానరాకుండ మొదలంట తుడిచి వేయుదును. ఈ మానవులను సృజించినందులకు చింతించు చున్నాను” అని అనుకొనెను.

8. కాని నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను.

9. నోవా వంశచరిత్ర ఇది: నోవా నీతిమంతుడు. తన కాలమువారిలో ఉత్తముడు. దేవునకు సహచరుడై జీవించెను.

10. అతనికి షేము, హాము, యాఫెతు అను ముగ్గురు కుమారులు ఉండిరి.

11. భూమిమీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై  ఒకరినొకరు హింసించు కొనుచుండిరి.

12. దేవుడు పరిశీలించి చూచెను. భూలోకము పూర్తిగా చెడిపోయెను. సర్వ మానవులు దుష్టులైరి.

13. దేవుడు నోవాతో ఇట్లనెను: “మానవులకు చివరిగడియలు సమీపించినవి. వారి మూలమున భూలోకము హింసామయమైనది. వారిని సర్వనాశ నము చేయవలెనని నిశ్చయించుకొంటిని.

14. చితి సారకపు చెట్టుకొయ్యతో నావను నిర్మింపుము. దానిలో గదులను ఏర్పరుచుము. నావకు లోపల వెలుపల కీలువేయుము.

15. ఈ విధముగా ఓడను చేయుము. ఓడ పొడవు మూడువందల మూరలు, వెడల్పు ఏబదిమూరలు, ఎత్తు ముప్పదిమూరలు.

16. ఓడకు పై కప్పు ఉండవలయును. అది పూర్తి అయిన తరువాత పైనుండి ఒక మూర క్రిందికి కిటికీ వ్రాలునట్లు చూడుము. ఒక ప్రక్కన తలుపును అమర్పుము. ఓడకు పై భాగమున ఒక అంతస్తు, నడుమ ఒక అంతస్తు, క్రింద ఒక అంతస్తు ఉండునట్లు చూడుము.

17. ఆకాశము క్రింద ప్రాణమున్న ప్రతి శరీరి నాశనమగునట్లు నీటిలో భూమిని తెప్పలదేలింతును. భూమిమీద ఉన్న ప్రతిప్రాణి నాశనమైపోవును.

18. కాని నేను నీతో ఒడంబడిక చేసికొందును. నీవు ఓడలోనికి వెళ్ళుము. నీవేకాదు. నీ భార్య, నీ కొడుకులు కోడండ్రు అందరును ఓడలోనికి రావలెను.

19. నీతోపాటు బ్రతికి ఉండుటకు ప్రతిజాతి ప్రాణులను రెండేసి చొప్పున ఓడలోనికి కొనిరమ్ము. వానిలో ఒకటి ఆడుది, మరియొకటి మగది అగునట్లు చూడుము.

20. అన్నిరకముల పక్షులు, మృగములు, ప్రాకెడు పురుగులు ఒక్కొక్క జంటచొప్పున బ్రతుకుటకై నీయొద్దకు చేరును.

21. నీవు అన్ని విధములైన ఆహారపదార్థములను సేకరించి ఓడలో నిలువ జేయుము. ఆ ప్రాణులకును, నీకును అవియే ఆహార మగును.”

22. నోవా ఏమరుపాటు లేకుండ దేవుడు ఆజ్ఞాపించినట్టే చేసెను. 

 1. దేవుడు నోవాతో “ఈ తరము వారిలో నీవు ఒక్కడవే నీతిమంతుడవు. కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుడు.

2. స్వచ్చమైన వానిలో ప్రతిజాతి వానిని ఏడుజంటల చొప్పున నీతోపాటు తీసికొని వెళ్ళుము. స్వచ్చముకాని అశుచికరమైన జంతువులలో మాత్రము ప్రతి జాతిదానిని ఒక్కజంట చొప్పున కొనిపొమ్ము.

3. పక్షులలో ప్రతిజాతికి చెందిన వానిని ఏడు జంటలచొప్పున తీసికొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమిమీది ప్రాణులు నశింపవు.

4. ఇంక ఏడు రోజులకు భూమిమీద నలువదిపగళ్ళు, నలువది రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. నేను భూమిమీద సృజించిన ప్రాణుల జాడ కానరాకుండ చేయుదును” అనెను.

5. నోవా దేవుడు ఆనతిచ్చినట్టే చేసెను.

6. భూలోకములో జలప్రళయము సంభవించినప్పుడు నోవా వయస్సు ఆరువందల యేండ్లు.

7. జలప్రళయము తప్పించుకొనుటకై నోవా తన భార్య, కొడుకులు, కోడండ్రతో ఓడలోనికి వెళ్ళెను.

8-9. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తినదగిన జంతువులలో, తినదగని జంతువులలో, ప్రాకెడు పురుగులలో, పక్షులలో ప్రతిజాతికి చెందినవి జతలు జతలుగా ఓడలోనున్న నోవా వద్దకు చేరెను.

10. అంతట ఏడు రోజులయిన తరువాత భూలోకములో జలప్రళయము సంభవించెను.

11. నోవాకు ఆరువందల యేండ్లు నిండి రెండు నెలల పదునేడవనాడు అగాధజలముల ఊటలన్ని బయటపడెను. ఆకాశమునకు చిల్లులు పడెను.

12. నలువది పగళ్ళు, నలువది రాత్రులు కుండపోతగా వానకురిసెను.

13. ఆనాడే షేము, హాము, యాఫెతు అను తన ముగురు కొడుకులతో, ముగ్గురు కోడండ్రలతో, భార్యతో నోవా ఓడలోనికి చేరెను.

14. ఆయాజాతుల మృగములు, పశువులు, పక్షులు, ప్రాకెడుపురుగులు ఒకటిగాదు అన్నియు

15. ఓడలోనున్న నోవావద్దకు వచ్చెను, జీవముగల ప్రతిప్రాణి జంట జంటలుగా వచ్చెను.

16. దేవుడు నోవాకు ఆజ్ఞాపించినట్టుగా అవి జంట జంటలుగా వచ్చి చేరెను. నోవా లోనికి వెళ్ళినపిదప దేవుడు ఓడ తలుపుమూసెను.

17. భూమిమీద నలువది రోజులపాటు నీటి ముంపు కొనసాగెను. నీరు ఉప్పొంగి ఓడను నేల మట్టము నుండి తేల్చెను.

18. నీరు నేలను ముంచి, పొంగి పొరలినపుడు ఓడ నీటిమీద తేలియాడెను.

19. ఆకాశము క్రిందనున్న ఉన్నత పర్వతములన్నియు మునిగిపోవువరకు, ఎడతెగకుండ నీరు ఉబికెను.

20. కొండలు పదునైదు మూరల లోతున ఉండునంతగా నీటిమట్టము పెరిగెను.

21. పక్షులు, పశువులు,  మృగములు, ప్రాకెడు పురుగులు, మానవులు, భూమి మీద నడయాడుచున్న ప్రతి ప్రాణియు నీటిపాలయ్యెను.

22. పొడినేల మీద ఉన్న ప్రతిజంతువు, ముక్కున ఊపిరియున్న ప్రతి ప్రాణి నాశమయ్యెను.

23. మానవుడుగావచ్చు, మృగముగావచ్చు, ప్రాకెడుపురుగు గావచ్చు, పక్షి గావచ్చు, మరింకేమయిన గావచ్చు దేవుడు ప్రతిప్రాణిని నాశనము చేసెను. సమస్త జీవరాశిని భూమిమీదనుండి తుడిచివేసెను. ఇక మిగిలినది ఓడలోనున్న నోవా, అతని పరివారము మాత్రమే.

24. నూట యేబది రోజులదాక భూమి మీద నీరు పొంగారెను. 

 1. నోవా, ఓడలో అతనితోపాటునున్న క్రూర మృగములు, పశువులు దేవునకు జ్ఞప్తికివచ్చెను. దేవుడు భూమిమీద గాలివీచునట్లు చేసెను. అంతట నీరుతీయుట మొదలయ్యెను.

2. అగాధజలముల ఊటలుతగెను. ఆకాశరంధ్రములు మూతపడెను. పైనుండి పడుచున్న వానవెలిసెను.

3. క్రమక్రమముగా భూమిమీది నుండి నీళ్ళు తీసిపోవుచుండెను. నూటయేబది రోజులు అయిన పిదప నీరు పూర్తిగా తగ్గేను.

4. ఏడవనెల పదునేడవ రోజున ఓడ అరారతులోనున్న కొండకొమ్మున నిలిచెను.

5. పదవనెలవరకు నీళ్ళు తగ్గుచు వచ్చెను. పదవనెల మొదటిరోజున కొండకొమ్ములు కనబడెను. .

6. నలువది రోజులైన తరువాత నోవా ఓడ కిటికీ తెరచెను. నీరు తగెనో లేదో తెలిసికొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను.

7. అది భూమి మీది నీరు ఇంకిపోవు వరకు అటునిటు తిరుగాడెను.

8. తరువాత నీళ్ళు తగ్గేనో లేదో తెలిసికొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదలెను.

9. ఇంకను భూమిమీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటుకూడలేదు. అందుచే అది ఓడలో నున్న నోవా వద్దకే తిరిగివచ్చెను. నోవా చేయిచాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను.

10. మరియొక ఏడురోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను.

11. అది క్రొత్తగా త్రుంచిన ఓలివుచెట్టు రెమ్మను నోటకరచుకొని మాపటివేళకు వచ్చెను. భూమిమీది నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించుకొనెను.

12. అతడు మరియొక ఏడు రోజులు ఆగెను. మరల పావురమును వదలెను. అది తిరిగిరాలేదు.

13. ఆరువందల ఒకటవయేట మొదటి నెల మొదటిరోజున భూమిమీద ఉన్న నీరు అంతయు ఇంకిపోయెను. నోవా ఓడకప్పు తీసి బయటికి చూడగా నేల అంతయు ఆరియుండెను.

14. రెండవనెల ఇరువది ఏడవ నాటికి నేల ఎండిపోయెను. నోవా ఓడనుండి దిగివచ్చుట

15-16. దేవుడు నోవాతో “నీవు నీ భార్య నీ కుమారులు కోడండ్రు మీరందరు ఓడనుండి వెలుపలికి రండు.

17. ఓడలో నీతో పాటున్న పక్షులను, జంతువులను, ప్రాకెడు పురుగులను, ప్రతిప్రాణిని వెలుపలికి తీసికొనిరమ్ము. అవి అన్నియు భూమిమీద విస్తరిల్లి, పిల్లలను కని, పెంపొందును” అని చెప్పెను.

18. భార్య, కొడుకులు, కోడండ్రతో నోవా వెలుపలికి వచ్చెను.

19. ఆయా జాతుల మృగములు, పశువులు, పక్షులు, ప్రాకెడు పురుగులు ఓడ నుండి వెలుపలికి వచ్చెను.

20. అప్పుడు నోవా దేవునికి బలిపీఠము నిర్మించెను. ఆయాజాతుల పవిత్ర జంతువులను, పక్షులను పీఠముపై దహనబలిగా సమర్పించెను.

21. బలి సుగంధమును ఆఘ్రాణించి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను: “యవ్వనప్రాయము నుండి మానవుని ఆలోచనములు దుష్టములు. అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడును శపింపను. ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను.

22. భూమి ఉన్నంతవరకు విత్తుట, కోయుట - వేడి, చలి , వేసవి, శీతలము - పగలు, రేయి యథావిధిగా కొనసాగునుగాక!” 

 1. దేవుడు నోవాను, అతని కుమారులను దీవించి “పిల్లలతో, పాపలతో పెంపొంది భూమియందంతట వ్యాపింపుడు.

2. క్రూరజంతువులకు, ఆకాశమున విహరించుపక్షులకు, భూమిమీద నడయాడు ప్రతి ప్రాణికి, సముద్రమున సంచరించు చేపలకు మీరన్నచో బెదురుపుట్టును. వానిని మీ వశము చేసితిని.

3. భూమిమీద తిరుగుచున్న ప్రతి ప్రాణి మీకు ఆహారమగును. చెట్టుచేమలను ఇచ్చినట్లే, ఇప్పుడు ఈ ప్రాణులను గూడ మీకు అప్పగించుచున్నాను.

4. నెత్తుటిలో ప్రాణముండును. కనుక, మీరు జంతువుల మాంసమును తినునపుడు వాని నెత్తురు మాత్రము ముట్టుకొనరాదు.

5. నెత్తురు ప్రాణముతో సమానము. కావున నెత్తురు చిందించువారు జంతువులైనను, నరులైనను నాకు జవాబుదారులగుదురు. మనుష్యుని ప్రాణమునకు మనుష్యునినే బాధ్యునిగా చేసెదను.

6. దేవుడు తనను పోలిన వానినిగా మానవుని సృజించెను. అందుచే నరుని నెత్తురు చిందించిన వాని నెత్తుటిని గూడ నరుడే చిందించును.

7. పిల్లలతో, పాపలతో పెంపొందుడు. భూ మండలమంతట వ్యాప్తి చెందుడు” అనెను.

8-9. దేవుడు నోవాను, అతని కుమారులను చూచి “నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసికొనుచున్నాను.

10. ఓడనుండి వెలుపలికి వచ్చి మీతోపాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూరమృగములు - ఇంత ఎందులకు? మీ చెంతనున్న ప్రతి ప్రాణితో గూడ ఒడంబడిక చేసికొనుచున్నాను.

11. మీతోను ఒడంబడిక చేసికొనుచున్నాను. మరల ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయమున సమసిపోవు. భూమిని నాశనముచేయు నీటిముంపు తిరిగి ఏనాడును రాదు.

12. తరతరములవరకు నాకును, మీకును, మీతోపాటున్న ఈ ప్రాణులకును నడుమ ఈ ఒడంబడిక గుర్తును ఉంచుచున్నాను. .

13. నాకు, భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ధనుస్సును ఉంచు చున్నాను.

14. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును.

15. అపుడు నాకును, మీకును, ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడికను గుర్తు చేసి కొందును. తిరిగి ఏనాడును జలములు పొంగి ప్రాణులను నాశనము చేయవు.

16. రంగుల ధనుస్సు మేఘములలో ఉండును. దానిని నేను చూచినప్పుడు దేవునకు, భూమిమీద జీవరాశికి నడుమ ఉన్న శాశ్వత నిబంధనమును గుర్తుచేసికొందును” అని అనెను.

17. దేవుడు నోవాతో “నాకు, భూమిమీది ప్రాణులకు నడుమ ఉన్న ఒడంబడిక గుర్తు ఇదే” అని అనెను.

18. షేము, హాము, యాఫెతు అను ముగ్గురు, ఓడనుండి వెలుపలికి వచ్చిన నోవాకుమారులు. హాము కనానుకు తండ్రి.

19. వీరు మువ్వురు నోవా కుమారులు, వారి సంతతి భూమండలమంతట వ్యాపించెను.

20-21. నోవా సేద్యముచేసి ద్రాక్షతోటలు వేయమొదలిడెను. అతడు ద్రాక్షరసము త్రాగి, కైపెక్కి గుడారములో దిగంబరుడుగా పడిపోయెను.

22. కనాను తండ్రియగు హాము, తండ్రి నగ్నముగా ఉండుట చూచి, వెలుపల ఉన్న తన ఇద్దరు సోదరులకు చెప్పెను.

23. షేము, యాఫేతు ఒక వస్త్రము తీసికొని, భుజములమీద వేసికొని, వెనుకకు అడుగులు వేయుచు వెళ్ళి, తండ్రి దిసమొలను కప్పిరి. వారు ముందువైపు మొగములు పెట్టియుండుటచే దిగంబరుడయిన తండ్రివైపు చూడలేదు.

24. మత్తు దిగిన తరువాత నోవా కడగొట్టుకొడుకు చేసిన పని తెలిసికొని యిట్లనెను: .

25. "కనాను శపితుడై సోదరులకు బానిసగునుగాక!”

26. అతడు ఇంక ఇట్లనెను: “మేము దేవుడగు యావే కొనియాడబడునుగాక! కనాను షేము బానిస అగునుగాక!

27. దేవుని దయవలన యాఫెతు వృద్ధిచెంది. షేము సంతతివారి నడుమ నివసించుగాక! కనాను వానికి బానిస అగునుగాక!”

28. జలప్రళయము తరువాత నోవా మూడు వందల యేబదియేండ్లు బ్రతికెను.

29. చనిపోవునాటికి అతని వయస్సు తొమ్మిదివందల యేబదియేండు. 

 1. నోవా కుమారులు షేము, హాము, యాఫెతుల వంశవృత్తాంతము ఇది. జలప్రళయము తరువాత ఆ ముగ్గురికి కుమారులు పుట్టిరి.

2. యాఫేతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.

3. గోమెరు కుమారులు: అష్మనసు, రీఫతు, తోగర్మా,

4. యావాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిట్టీము, దాడోనీము.

5. వీరినుండి ద్వీపనివాసులు తమతమ భాషల ప్రకారము, తమతమ కుటుంబముల ప్రకారము, తమతమ జాతుల ప్రకారము వేరై ఆయా దేశములలో స్థిరపడిరి.

6. హాము కుమారులు: కూషు, మిస్రాయీము, పూతు, కనాను.

7. వీరిలో కూషుకు సెబా, హవీలా, సప్తా, రామా, సబ్తకా అను కుమారులుకలిగిరి. వారిలో రామాకు షెబా, దెదాను అను కుమారులు

8. కూషుకు నిమ్రోదు పుట్టెను. నిమ్రోదు భూలోకములో మహావీరుడుగా ప్రసిద్ధిగాంచెను.

9. అతడు దేవుని దయవలన బలిమిగల వేటకాడయ్యెను. కావున “దేవుడు నిన్ను నిమ్రోదువలె గొప్ప వేటగానిని చేయుగాక” అను లోకోక్తి వ్యాపించెను.

10. మొట్టమొదట షీనారు దేశమందున్న బాబెలు, యెరెకు, అక్కదు అను పటణములతో అతని రాజ్యము ప్రారంభమయ్యెను.

11. నిమ్రోదు ఆ దేశమునుండి బబులోనియాకు వలసపోయెను. అతడు నీనెవె, రహోబోతీరు, కాలహు, రెసెను అను పట్టణములను నిర్మించెను.

12. రెసెను- నీనెవె, కాలహు అనువాని నడుమనున్న మహానగరము.

13. మిస్రాయీము నుండి లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తూహీయులు, పత్రూసీయులు, కస్లుహీయులు, కఫ్తోరీయులు అను జాతుల వారు పుట్టిరి.

14. ఫిలిస్తీ యులు ఈ కఫ్తోరీయుల సంతతి వారే.

15. కనాను పెద్దకొడుకు సీదోను.

16. అతనికి ఇంకను హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,

17. హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతియులు పుట్టిరి.

18. తరువాత కనానీయులు విస్తరిల్లిరి.

19. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారు వైపున గాజావరకు, సొదొమ, గొమొఱ్ఱా, అద్మా, సెబోయీముల వైపున లాషా వరకు వ్యాపించి యుండెను.

20. వీరందరు హాము కుమారులు. వీరు ఆయా కుటుంబములవారుగా, భాషలవారుగా, దేశములవారుగా, జాతులవారుగా విడివడిపోయిరి.

21. ఏబెరు కుమారులకు మూలపురుషుడును మరియు యాఫేతు పెద్దన్నయగు షేమునకు గూడ కుమారులు పుట్టిరి.

22. షేముకు ఏలాము, అస్పూరు, అర్ఫక్షదు, లూదు, అరాము అను కుమారులు పుట్టిరి.

23. అరాము కుమారులు ఊసు, హూలు, గెతెరు, మాషు.

24. అర్ఫక్షదు కుమారుడు షేలా. షేలా కుమారుడు ఏబేరు.

25. ఏబెరుకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాని పేరు పెలేగు. అతని కాలముననే భూమండలము దేశదేశములుగా విభక్తమయ్యెను, గావున అతనికి ఆ పేరు వచ్చినది. పెలెగు తమ్ముని పేరు యోక్తాను.

26. యోక్తానుకు ఆల్మోదాదు, షెలపు, హసర్మవేతు, యెరహు,

27. హదోరాము, ఊసాలు, దిక్లా,

28. ఓబలు, అబీమాయేలు, షేబా, ఓఫీరు, హవీలా, యోబాబు అను కుమారులు జన్మించిరి.

29. వీరందరు యోక్తాను కుమారులు.

30. మేషా నుండి సేఫరుకు వెళ్ళు త్రోవలోనున్న తూర్పు కొండలలో వారు నివసించిరి.

31. ఆయా వంశముల వారుగా, భాషలవారుగా, దేశములవారుగా, జాతుల వారుగా విడిపోయిన వీరందరును షేము కుమారులే.

32. వారివారి వంశముల ప్రకారముగా జాతులు జాతులుగా విడిపోయిన నోవా కుమారుల కుటుంబములు ఇవే. జలప్రళయము తరువాత ఈ వంశములు ప్రత్యేక జాతులుగా రూపొందినవి. 

 1. ఒకానొకప్పుడు భూమిమీది జనులందరు ఒకే భాషను మాట్లాడిరి. ఆ భాషలోని మాటలు ఒక తీరుగనే ఉండెడివి.

2. మానవులు తూర్పుగా ప్రయాణమై పోవుచుండగా వారికి షీనారు దేశమందలి మైదానము తగిలెను. వారు అక్కడ నివసించిరి.

3. వారు “ఇటుకలు చేసి బాగుగా కాల్చెదము రండు” అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రాళ్ళకు బదులుగా ఇటుకలను, అడుసునకు బదులుగా మట్టికీలును వాడిరి.

4. “రండు! మనము ఒక పట్టణమున నిర్మించి, ఆకాశమునంటు గోపురము కట్టుదము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును, మనము భూమి యందంతట చెల్లాచెదరయిపోము” అని వారు అనుకొనిరి.

5. అప్పుడు మానవమాత్రులు నిర్మించిన నగరమును, గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భువికి దిగివచ్చెను.

6. "ఇదిగో వీరందరు ఒక ప్రజయే. వీరి భాషయు ఒకటియే. అయినను వీరు ఈ పని మొదలు పెట్టిరి. వీరు తలపెట్టిన పనినెల్ల ఏ ఆటంకము లేకుండ కొనసాగింతురు.

7. రండు! మనము దిగిపోయి, వారు ఒకరితోనొకరు చెప్పుకొను మాటలు అర్ధము గాకుండ, వారి భాషను తారుమారు చేయుదము” అని అనుకొనెను.

8. ఇట్లనుకొని దేవుడు వారినందరను అక్కడినుండి భూమి నాలుగు చెరగులకు చెదరగొట్టెను. వారు నగరమును నిర్మించుట మానివేసిరి.

9. దేవుడు ప్రపంచమునందలి ప్రజలు అందరును మాట్లాడు భాషను అక్కడ తారుమారు చేసెను. కావున దానికి బాబేలు' అను పేరు వచ్చెను. అక్కడి నుండియే నేల నాలుగు వైపులకు దేవుడు మానవులను చెదర గొట్టెను.

10. షేము వంశము ఇది. జలప్రళయము వచ్చిన రెండేండ్లకు షేము నూరేండ్ల వయస్సున అర్పక్షదును కనెను.

11. అర్ఫక్షదు పుట్టిన తరువాత షేము ఐదువందల యేండ్లు జీవించెను. అతనికింకను కుమారులు కుమార్తెలు పుట్టిరి.

12. అర్ఫక్షదు ముప్పదిదైదేండ్ల వయస్సున షేలాను కనెను.

13. తరువాత అతడు నాలుగువందల మూడేండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు కలిగిరి.

14. షేలా ముప్పదియేండ్ల వయస్సున ఏబేరును కనెను.

15. తరువాత షేలా నాలుగువందల మూడేండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు జన్మించిరి.

16-17. ఏబెరు ముప్పది నాలుగేండ్ల యీడున పెలెగును కనెను. తరువాత అతడు నాలుగువందల ముప్పదియేండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి.

18-19. పెలెగు ముప్పదియేండ్లప్పుడు రయూను కనెను. తరువాత అతడు రెండువందల తొమ్మిదియేండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి.

20-21. రయూ ముప్పది రెండేండ్ల యీడున సెరూగును కనెను. తర్వాత అతడు రెండువందల యేడేండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు, కుమార్తెలు పుట్టిరి.

22-23. సెరూగు ముప్పది యేండ్ల వయస్సున నాహోరును కనెను. తరువాత అతడు రెండు వందల యేండ్లు జీవించెను. అతనికి కుమారులు కుమార్తెలు కలిగిరి.

24-25. నాహోరు ఇరువది తొమ్మిదియేండ్ల వయస్సున తెరాను కనెను. తరువాత అతడు నూట పందొమ్మిదియేండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి.

26. తెరా డెబ్బది యేండ్లప్పుడు అబ్రామును, నాహోరును, హారానును కనెను.

27. తెరా సంతతివారి వంశవృక్షము ఇది: తెరా అబ్రాము, నాహోరు, హారానులను కనెను. హారానుకు లోతు పుట్టెను.

28. హారాను స్వదేశములో కల్దీయు లకు చెందిన ఊరు అను పట్టణములో తండ్రి కన్నుల యెదుట చనిపోయెను.

29. అబ్రాము, నాహారు వివాహములు చేసికొనిరి. అబ్రాము భార్య పేరు సారయి, నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె హారాను కూతురు. హారానుకు యిస్కా అను మరియొక కుమార్తె కూడ కలదు.

30. సారయి గొడ్రాలు.

31. తన కుమారుడు అబ్రామును, హారాను కుమారుడును తన మనుమడగు లోతును, అబ్రాము భార్యయు తన కోడలునుయగు సారయిని తెరా వెంటబెట్టుకొని కల్డీయుల నగరమైన ఊరు నుండి కనాను దేశమునకు బయలుదేరెను. కాని, వారు హారాను చేరిన తరువాత అక్కడనే నివసించిరి.

32. హారానులో మరణించు నాటికి తెరా వయస్సు రెండువందల ఐదేండ్లు, 

 1. దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను: “నీ దేశమును, నీ చుట్టపక్కాలను, నీ పుట్టినింటిని వదలి నేనుచూపు దేశమునకు వెళ్ళుము.

2. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను. నిన్ను ఆశీర్వదింతును. నీ పేరు మహా గొప్పదగును. నీవు అందరికి ఒక దీవెనగా ఉందువు.

3. నిన్ను దీవించువారిని దీవింతును.నిన్ను శపించువారిని శపింతును. నీయందు సకలజాతి జనులు ఆశీర్వదింపబడుదురు.”

4. దేవుడు చెప్పిన రీతిగనే అబ్రాము బయలు దేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదలినప్పుడు అబ్రాము వయస్సు డెబ్బదియైదేండ్లు.

5. భార్య సారయితో, సోదరుని కుమారుడు లోతుతో, గడించిన ఆస్తిపాస్తులతో, హారానులో చేర్చుకొనిన సేవకులతో అబ్రాము కనానునకు ప్రయాణమై వెళ్ళెను. వారందరు కనాను దేశమున చేరిరి.

6. అబ్రాము ప్రయాణము చేయుచు షెకెము అను స్థలమునకు చేరి, మోరేవద్ద నున్న సింధూరవృక్షము కడకు వచ్చెను. ఆ కాలమున ఆ దేశములో కనానీయులు నివసించు చుండిరి.

7. అక్కడ దేవుడు అబ్రామునకు కనబడి “ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను” అని చెప్పెను. అబ్రాము తనకు కనబడిన దేవునకు అక్కడ బలిపీఠమును నిర్మించెను.

8. అతడు అక్కడినుండి బయలుదేరి బేతేలునకు తూర్పుగా ఉన్న కొండ నేలకు వెళ్ళెను. పడమట ఉన్న బేతేలునకు, తూర్పున ఉన్న హాయికి నడుమ గుడారములు ఎత్తెను. అక్కడ బలిపీఠమును నిర్మించి దేవుని ఆరాధించెను.

9. తర్వాత అక్కడక్కడ విడుదులు చేయుచు అబ్రాము నేడేబునకు బయలుదేరెను.

10. ఆ దేశములో పెద్ద కరువు వచ్చెను. దాని తాకిడికి తట్టుకొనలేక అబ్రాము కొన్నాళ్ళు ఉండుటకై ఐగుప్తుదేశమునకు వెళ్ళెను.

11-12. ఐగుప్తుదేశమును సమీపించుచున్నపుడు అతడు భార్యయగు సారయితో “నీవు సౌందర్యవతివి. ఐగుప్తుదేశీయులు నిన్ను చూచి ఆమె యితని భార్యరా! - అని గుసగుసలాడుదురు. వారు నన్ను చంపి నిన్ను ప్రాణములతో వదలుదురు.

13. నాకు సోదరివి అయినట్లు వారితో చెప్పుము. ఇట్లయిన నాకు మేలుకలుగును. నీపై గల ఆదరముచే వారు నా ప్రాణములు కాపాడుదురు” అని చెప్పెను.

14. అబ్రాము ఐగుప్తుదేశములో ప్రవేశించెను. ఐగుప్తుదేశీయులు అబ్రాము భార్య లోకోత్తర సౌందర్యవతి అని కనుగొనిరి.

15. ఫరో కొలువువారు ఆమెను చూచిరి. రాజు సమ్ముఖమున ఆమె సౌందర్యమును కొనియాడిరి. వెంటనే ఆమెను ఫరో భవనమునకు కొనిపోయిరి.

16. ఫరోరాజు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. రాజానుగ్రహము చేత అబ్రాము గొఱ్ఱెలను, పశువులను, గాడిదలను, దాసదాసీ జనమును, ఒంటెలను సంపాదించెను. 1

17. కాని దేవుడు అబ్రాము భార్య సారయిని కాపాడుటకు, ఫరో రాజును అతని కుటుంబమువారిని మహారోగములపాలు చేసెను.

18. ఫరో రాజు అబ్రామును పిలిపించి “నీవు నాకు ఇంతపని చేసితివేల? ఆమె నీ భార్య అని ఏల చెప్పలేదు?

19. నీ సోదరియని ఏల చెప్పితివి? కావుననే నేను ఆమెను భార్యగా చేసికొంటినిగదా! ఇదిగో! నీ భార్య! ఈమెను తీసికొని నీ దారిని నీవు పొమ్ము” అనెను.

20. ఫరో అబ్రామును పంపి వేయుడని భటులను ఆజ్ఞాపించెను. అబ్రాము భార్యను, తన సర్వస్వమును తీసికొని వెడలిపోయెను. 

 1. అబ్రాము భార్యను వెంటబెట్టుకొని తన సర్వస్వముతో ఐగుప్తు దేశమునుండి నేగేబునకు తిరిగి వచ్చెను. లోతు కూడ అతని వెంటవెళ్ళెను.

2. ఇప్పుడు అబ్రాము పశుసంపదతో, వెండి, బంగారములతో తులదూగుచుండెను.

3. విడుదులు చేయుచు అతడు నేగేబునుండి బేతేలునకు వెళ్ళెను. పిదప బేతేలునకు హాయికి నడుమ మొట్టమొదట తాను గుడారములు ఎత్తినచోటికి వచ్చెను.

4. అక్కడనే యింతకుముందు అబ్రాము ప్రభువునకు బలిపీఠమును నిర్మించెను. అచ్చటనే దేవుని ఆరాధించెను.

5. లోతు కూడ అబ్రామువెంట ప్రయాణములు చేసెను. అతనికిని గొఱ్ఱెలు, గొడ్డుగోదలు, గుడారములు కలవు.

6. వారిరువురును కలిసి కాపురములు చేయుటకు ఆ చోటు చాలలేదు. పశుసంపద విరివిగానుండుటచే వారిరువురు కూడి ఒక ప్రదేశమున నివసింపలేక పోయిరి.

7. అదియునుగాక అబ్రాము గొఱ్ఱెలకాపరులకు, లోతు గొఱ్ఱెలకాపరులకు నడుమ కలహములు పెట్టెను. ఆ కాలమందు ఆ ప్రదేశమునందే కనానీయును, పెరిస్సీయులును నివసించుచుండిరి.

8. అందుచే అబ్రాము లోతుతో “మనము అయినవారము, మనలోమనకు జగడములు రాగూడదు. నా గొఱ్ఱెల కాపరులు, నీ గొఱ్ఱెల కాపరులు క్రుమ్ము లాడుకొనరాదు.

9. కావలసినంత నేల నీముందున్నది. మనము విడిపోవుటమేలు. నీవు ఎడమ వైపునకు వెళ్ళిన నేను కుడివైపునకు వెళ్ళెదను. నీవు కుడివైపునకు వెళ్ళిన నేను ఎడమవైపునకు వెళ్ళెదను” అనెను.

10. లోతు కన్నులెత్తిచూచి యోర్ధాను మైదానము మంచి నీటివనరులు గలదని కనుగొనెను. సోయరుకు పోవుత్రోవ పొడుగున అది దేవుని తోటవలె, ఐగుప్తుదేశమువలె ఉండెను. దేవుడు సొదొమ, గొమొఱ్ఱాలను నాశనము చేయకమునుపు ఆ ప్రదేశము ఆ విధముగనుండెను.

11. కావున లోతు యోర్ధాను మైదానములను కోరుకొని తూర్పు వైపునకు వెడలిపోయెను. ఈరీతిగా వారు విడిపోయిరి.

12. అబ్రాము కనాను దేశమందు నివసించెను. కాని లోతు మైదానమునందలి నగరములలో కాపురము ఉండెను. సొదొమ వద్ద గుడారములు నాటెను.

13. సొదొమ ప్రజలు దుష్టులు, యావేకు విరుద్ధముగా పాపము చేయువారు.

14. లోతు, అబ్రాము విడిపోయిన తరువాత, దేవుడు అబ్రాముతో “అబ్రామూ! నీవున్న తావునుండి కనులెత్తి నాలుగుదిక్కులు చూడుము.

15. నీ కను చూపుమేర నేలను నీకును, నీ సంతతికిని శాశ్వతముగా ఇత్తును.

16. భూరేణువులవలె అసంఖ్యాక ముగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. భూరేణువుల వలె నీ సంతతియు లెక్కకు అందదు.

17. నీవు లేచి ఈ దేశమునందంతట సంచరింపుము. దీనిని నీకు ఇచ్చుచున్నాను” అనెను.

18. అందుచే అబ్రాము తన పరివారముతో తరలివెళ్ళి హెబ్రోను మండలమున మమ్రే దగ్గర ఉన్న సింధూరవృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునకు బలిపీఠము నిర్మించెను. 

 1. ఆ కాలమున అమ్రాఫేలు షీనారునకు రాజు. అరియోకు ఎల్లాసరునకు రాజు. కెదొర్లాయోమేరు ఏలామునకు రాజు. తిదాలు గోయీమునకు రాజు.

2. వారు నలుగురు ఏకమై సొదొమ రాజయిన బేరాతో, గొమొఱ్ఱా రాజయిన బీర్షాతో, అద్మా రాజయిన సీనాబుతో, సెబోయీము రాజయిన షేమేబేరుతో, బేలా రాజయిన సోయరుతో యుద్ధము చేసిరి.

3. ఇప్పుడు మృతసముద్రముగా ఉన్న సిద్దీములోయలో ఈ రాజులందరు తమతమ సైన్య ములను కలిపివేసిరి.

4. వారు పండ్రెండు ఏండ్లు కేదోర్లాయోమేరు రాజునకు సామంతులుగా ఉండిరి. పదుమూడవయేట తిరుగుబాటు చేసిరి.

5. పదు నాలుగవయేట కెదోర్లాయోమేరు అతని పక్షమున ఉన్న రాజులు దండెత్తి అష్టారోతుకర్నాయీము వద్ద రేఫాయీలను, హామువద్ద సూసీయులను, సావేకిర్యతాయీము వద్ద ఏమీయులను ఓడించిరి.

6. సేయీరునుండి, ఎడారిదాపునగల ఎల్పారాను వరకు వ్యాపించియున్న పర్వత ప్రదేశములో హూరీయులను ఓడించిరి.

7. వారు వెనుదిరిగి వచ్చుచు నేడు కాదేషు అని పిలువబడు ఎన్మిష్పాత్తు దేశమున ప్రవేశించిరి. అమాలేకీయుల దేశమును, హాససోన్తాతామారులో ఉన్న అమోరీయుల దేశమును వల్లకాడుచేసిరి.

8. అప్పుడు సొదొమరాజు, గొమొఱ్ఱా రాజు, అద్మా రాజు, సేబోయీమురాజు, బేతరాజగు సోయరులు ఏకమై సైన్యములను సేకరించుకొని వచ్చి సిద్ధీము లోయలో ఏలామురాజగు

9. కెదొర్లాయోమేరును, గోయీము రాజయిన తిదాలును, షీనారు రాజైన అమ్రాఫేలును, ఎల్లాసరు రాజయిన అరియోకును ఎదుర్కొనిరి. ఈ విధముగా అయిదుగురు రాజులు నలుగురు రాజులను ఎదిరించిరి.

10. సిద్దీములోయ, మట్టికీలుగుంటలతో నిండి యుండెను. సొదొమరాజు, గొమొఱ్ఱారాజు యుద్ధ రంగమునుండి పారిపోవుచు ఆ గుంటలలో పడిపోయిరి. మిగిలినవారుకూడ కొండలు పట్టిపోయిరి.

11. శత్రువులు సొదొమ గొమొఱ్ఱా నగరములలోని యావదాస్తిని, వారి ఆహారపదార్థములను వశము చేసికొని వెళ్ళిపోయిరి.

12. వారు అబ్రాము సోదరుని కుమారుడు, సోదొమ నివాసియగు లోతును గూడ బంధించి తీసికొనిపోయిరి. అతని పశుసంపద నంతటిని తోలుకొనిపోయిరి.

13. కాని తప్పించు కొనిన వాడొకడు వచ్చి హెబ్రీయుడైన ' అబ్రాముతో జరిగినదంతయు చెప్పెను. అప్పుడు అబ్రాము, అమోరీయుడగు మమ్రేకు చెందిన సింధూరవనము నందు నివసించుచుండెను. ఎష్కోలు, అనేరు అనువారి సోదరుడు మమ్రే. వీరు అబ్రాము పక్షమువారు.

14. సోదరుని కుమారుని చెరపట్టిరని విన్న వెంటనే అబ్రాము తన ఇంట పుట్టి పెరిగిన యోధులను మూడు వందల పదునెనిమిది మందిని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ రాజులను దాను వరకు తరిమెను.

15. అబ్రాము, అతని అనుచరులు రాత్రివేళ శత్రువులను చుట్టుముట్టి ఎదుర్కొనిరి. వారిని దమస్కునకు ఉత్తరముగా నున్న హూబా వరకు తరిమి కొట్టిరి.

16. ఆ రాజులు తోలుకొనిపోయిన మందలను, బంధువయిన లోతును, అతని స్త్రీలను, అతని యావదాస్తిని, చెరపట్టిన ఇతరులను విడిపించి అబ్రాము తిరిగి తీసికొని వచ్చెను.

17. కెదోర్లాయోమేరును, అతని పక్షమున నున్న రాజులను ఓడించి తిరిగివచ్చుచున్న అబ్రామును కలిసి కొనుటకు సొదొమరాజు షావే లోయకు బయలు దేరెను. షావే లోయను ఇప్పుడు రాజు లోయ అందురు.

18. షాలేము రాజయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షసారాయమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు దేవునకు యాజకుడు.

19. అతడు అబ్రామునకు ఇట్లు దీవెనలు పలికెను. “సర్వోన్నతుడై, భూమ్యాకాశములను సృష్టించిన దేవుడు అబ్రామును ఆశీర్వదించును గాక!

20. శత్రువులను నీ వశముచేసిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక!” అపుడు అబ్రాము అతనికి తన సమస్తములో పదియవ వంతును అప్పగించెను.

21. అంతట సొదొమ రాజు “మనుష్యులను నాకు అప్పగింపుము. వస్తువాహనములను నీవు తీసి కొనుము” అని అబ్రామును అడిగెను.

22. దానికి అబ్రాము 'సర్వోన్నతుడై భూమ్యాకాశములను సృష్టించిన ప్రభుడగు దేవుని యెదుట నా చేయియెత్తి ప్రమాణములు చేసియున్నాను.

23. నీకుచెందిన నూలు పోగునుగాని, చెప్పుల దారమునుగాని, ఇంకదేనినైనను నేను ముట్టను. ఏనాడును నీవు 'నేను అబ్రామును ధనవంతుని చేసితిని' అని అనకుందువుగాక!

24. ఈ పడుచువారు తిన్నది మాత్రము నావంతు, నాతో వచ్చిన అనేరు, ఎష్కోలు, మమ్రే అనువారు వారి పాలును వారు తీసికొననిమ్ము" అనెను. 

 1. ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రామునకు దర్శనమున ప్రత్యక్షమయ్యెను. అతనికి దేవునిమాట వినబడెను. “అబ్రామూ! భయపడకుము. నేను నిన్ను డాలువలె కాపాడెదను. నీకొక గొప్ప బహుమానము ఇచ్చుచున్నాను” అనెను.

2. అంతట అబ్రాము “ప్రభూ! నీవు నాకేమి యీయగలవు? నేను సంతానములేని వాడనైతిని. దమస్కువాడయిన ఎలియెజెరే నా యింటికి వారసుడు అగునుగదా!” అనెను. అతడు ఇంకను ఇట్లు చెప్పెను:

3. “నీవు నాకు సంతానము కలిగింపలేదు. నా ఇంటిలో పుట్టిన బానిస ఒకడు నాకు వారసుడు అగును.”

4. అంతట అబ్రామునకు దేవునిమాట ఇట్లు వినవచ్చెను: “ఇతడు నీకు వారసుడు కాడు. నీకు పుట్టినవాడే నీకు వారసుడు అగును.”

5. దేవుడు అబ్రామును వెలుపలికి తీసికొనివచ్చి “ఆకాశమువైపు చూడుము. లెక్కపెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము. నీ సంతతి కూడ అలాగుననే అగును” అని చెప్పెను.

6. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను.

7. దేవుడు అతనితో “నేను సర్వేశ్వరుడను. ఈ దేశమును నీ వశముచేయుటకు నేనే కశీయుల ఊరు నగరమునుండి నిన్నుకొని వచ్చితిని” అనెను.

8. అబ్రాము “ప్రభూ! ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియును?” అనెను.

9. దానికి ప్రభువు “మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల ఆడుమేకను, మూడేండ్ల పొట్టేలును, ఒకగువ్వను, ఒక పావురమును నా యొద్దకు తీసికొనిరమ్ము” అనెను.

10. అబ్రాము వాటినన్నిటిని తీసికొనివచ్చెను. జంతువులను నడిమికి రెండుముక్కలుగా నరికెను. దేని ముక్కను దాని ముక్కకు ఎదురునుంచెను. పక్షులను మాత్రము కోయలేదు.

11. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి. కాని అబ్రాము వానిని తోలివేసెను.

12. ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్రపట్టెను. భయానకమైన మహాగాఢాంధకారము అతనిని క్రమ్మెను.

13. ప్రభువు అబ్రాముతో “ఇది నిశ్చయమని తెలుసుకొనుము. నీ సంతతివారు వారిది కాని దేశములో పరదేశులుగా వసించి, ఆ దేశపు వారికి బానిసలగుదురు. ఆ దేశీయులు నాలుగు వందల యేండ్లపాటు నీ వారిని పీడింతురు.

14. పీడించిన జాతిని నేనే శిక్షింతును. తరువాత నీ సంతతివారు ఐశ్వర్యముతో తులదూగుచు ఆ దేశమునుండి బయటబడుదురు.

15. ఏ దిగులు లేకుండ నీవు నీ పితరులను కలిసికొందువు. పండు ముసలితనమున నిన్ను పాతి పెట్టుదురు.

16. నీ తరువాత నాలుగవ తరము వారు తిరిగి ఇక్కడికి వత్తురు. అప్పటికిగాని అమోరీయుల పాపము పండదు.” అనెను.

17. అంతట ప్రొద్దుకూకి చీకటిపడెను. అప్పుడు పొగ కుంపటి, నిప్పుమంట కనబడి మాంసఖండముల నడుమగా కదలిపోయెను.

18. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసికొని “ఐగుప్తు దేశపునది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకుగల భూఖండమును నీ సంతతికి ధారపోయుచున్నాను.

19-21. ఆ భూఖండము కేనీయులకు, కనిస్సీయులకు, కద్మోనీయులకు, హిత్తీయులకు, పెరిస్సీయులకు, రెఫాయీలకు, అమోరీయులకు, కనానీయులకు, గిర్గాషీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు చెందినట్టిది” అని చెప్పెను. 

 1. అబ్రామునకు సారయి యందు సంతానము కలుగలేదు. ఆమెకు ఐగుప్తుదేశీయురాలయిన ఒక దాసీకన్య ఉండెను. ఆమె పేరు హాగారు.

2. సారయి అబ్రాముతో “దేవుడు నన్ను బిడ్డలతల్లిగా చేయలేదు. నా దాసీకన్యను భార్యగా స్వీకరింపుము. ఆమె వలననైన నాకు సంతానము కలుగునేమో!” అనెను. అబ్రాము భార్యచెప్పిన మాటలకు ఒప్పుకొనెను',

3. అబ్రాము భార్య సారయి, ఐగుప్తు దేశీయురాలు దాసీ కన్య హాగారును కొనివచ్చి అతనికి భార్యగా చేసెను. ఇది జరుగు నాటికి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు నివసించెను.

4. అతడు హాగారును కూడెను. ఆమె గర్భవతి అయ్యెను. చూలాలైన నాటినుండి యజమానురాలు హాగారు కంటికి చులకన అయ్యెను.

5. సారయి అబ్రాముతో “నాకు ఎంతపని జరిగినదో చూచితివా? ఈ అవమానమును తీర్పవలసినవాడవు నీవే. ఆ బానిస తొత్తును నేనే నీ చేతులలో పెట్టితిని. అది నేను గర్భవతినైతిని గదా అని కన్నుమిన్నుగానక నన్నే చిన్నచూపు చూచు చున్నది. దేవుడే మనకిద్దరకు తీర్పుచెప్పునుగాక!” అనెను.

6. అబ్రాము సారయితో “నీ దాసి నీ చెప్పు చేతలలోనే ఉన్నది. దానిని నీ ఇష్టము వచ్చినట్లు చేయుము” అనెను. సారయి ఆ దాసిని నేలబెట్టి కాలరాచెను. ఆమె బాధలు పడలేక పారిపోయెను.

7. ఎడారియందు షూరునకు పోవు త్రోవలో నున్న నీటి బుగ్గచెంత యావే దూత హాగారును చూచెను.

8. అతడు “సారయి దాసివగు హాగారు! నీవు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి పోవుచుంటివి?” అని అడిగెను. ఆమె “నా యాజమానురాలు సారయి పోరు పడలేక పారిపోవుచున్నాను” అని చెప్పెను.

9. అంతట యావే దూత ఆమెతో "తిరిగి నీ యజమానురాలి దగ్గరకు పొమ్ము. ఆమెకు అణగిమణగి ఉండుము. ఇంకను వినుము.

10. నీ సంతతిని లెక్కకు మిక్కిలి అగునట్లు చేయుదును, నిశ్చయముగ విస్తరింప జేసెదను” అనెను.

11. మరియు యావే దూత ఆమెతో ఇట్లనెను: “నీవు గర్భవతివి. నీకు కుమారుడు కలుగును. దేవుడు నీ మొర ఆలకించెను గావున ఆ బిడ్డకు యిష్మాయేలు" అను పేరు పెట్టుము.

12. అతడు అడవి గాడిద వలె స్వేచ్చగా తిరుగును. అతడు అందరిమీద చేయిచేసికొనును. అందరు వానిమీద చేయిచేసికొందురు. అతనికి, అతని చుట్టపక్కాలకు సుతికలియదు”

13. ఆమె తనతో మాట్లాడిన దేవుని “ఎల్ రోయి” అను పేరున పిలిచెను. “నిజముగా నేను నా కంటితో దేవుని చూచితినిగదా! దైవదర్శనమైన తరువాత కూడ నేనింకను బ్రతికియుంటినిగదా!” అనుకొనెను.

14. అందుచే జనులు ఆ నీటి బుగ్గకు “బేయెర్లహాయిరోయి” అను పేరు పెట్టిరి. అది కాదేషునకు బెరెదునకు నడుమ ఉన్నది.

15. హాగారు అబ్రాము నకు ఒక కొడుకును కనెను. అబ్రాము తనకు హాగారు నకు పుట్టిన కుమారునకు యిష్మాయేలు అను పేరు పెట్టెను.

16. హాగారు యిష్మాయేలును కన్నప్పుడు ; అబ్రాము వయస్సు ఎనుబదియారేండ్లు. 

 1. అబ్రామునకు తొంబదితొమ్మిదియేండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై "నేను సర్వశక్తిమంతుడగు దేవుడను. నా సన్నిధిన మెలగుము. నిర్దోషివై యుండుము.

2. నేను నీతో ఒడంబడిక చేసికొందును. నీ సంతతిని విస్తరిల్లజేయుదును” అనెను.

3. అబ్రాము దేవుని యెదుట సాగిలబడెను. దేవుడు అతనితో మాట్లాడుచు

4.“నేను నీతో ఒడంబడిక చేసికొనుచున్నాను. నీవు అనేక జాతులకు తండ్రివగుదువు.

5. ఇకముందు నీకు అబ్రాము' అను పేరుండదు. అబ్రహాము " అను పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రినిగా చేసితిని.

6. నీ సంతతిని పెంపొందింపజేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును. నీనుండి రాజులు పుట్టుదురు.

7. నీయెడ, నీసంతతియెడ నా ఒడంబడిక చెల్లును. అది తరతరములవరకు శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక, నీకును నీసంతతికిని నేనే దేవుడను.

8. మీకు కానిదేశముగా ఉన్న కనాను భూమిని మొత్తము నీకును, నీ తరువాత వారికిని శాశ్వతభోగముగా చేయుదును. నీ తరువాత వారికి సైతము నేనే దేవుడను” అని చెప్పెను.

9. దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లనెను: “నీవును, నీసంతతివారును తరతరములవరకు నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలయును.

10. నాకును, నీకు నీ తర్వాతి తరములవారికిని నడుమ నేను చేసిన ఒడంబడికను మీరెల్లరు పాటింపవలెనన్నచో, మీలో ప్రతిపురుషుడును సున్నతి పొందవలయును.

11. మీరు చర్మాగ్రమున సున్నతి చేసికొనవలయును. ఇదియే మన నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా ఉండును.

12. తరతరమున నీ యింట పుట్టినవారు, నెత్తురుపొత్తు లేకపోయినను నీవు సొమ్మిచ్చికొన్నవారు ఎనిమిదవనాడు సున్నతి పొందవలయును.

13. నీ యింట పుట్టినవారికి, నీవు సొమ్మిచ్చి కొన్నవారికి సున్నతి చేయుము. ఈ విధముగా నా నిబంధనము శాశ్వత నిబంధనముగా మీ శరీరములందు ముద్రిత మగును.

14. చర్మాగ్రమున సున్నతి పొందని ప్రతి పురుషుడు తనవారినుండి వెలివేయబడును. అతడు నా ఒడంబడికను మీరినట్లేయగును.”

15. దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లనెను: “ఇక నీ భార్యను 'సారయి' అని పిలువకుము. 'సారా ” అని మాత్రమే పిలువుము.

16. నేను ఆమెను ఆశీర్వదింతును. ఆమెవలన నీకు కొడుకు పుట్టును. నేను ఆమెను దీవింతును. ఆమె అనేక జాతులకు తల్లి అగును. అనేకజాతుల రాజులకు అమ్మయగును.”

17. ఈ మాటలు విని అబ్రహాము దేవునియెదుట సాగిలబడెను. అతడు తనలో తాను నవ్వుకొనెను. 'కాటికి కాళ్ళుచాచిన నూరేండ్ల ముదుసలికి కొడుకు పుట్టుటయా? తొంబదియేండ్ల సారా కనుటయా?” అని అనుకొనెను.

18. ఇట్లనుకొని అతడు దేవునితో, “ప్రభూ! నీవు యిష్మాయేలును చల్లనిచూపు చూచిన నాకదియే పదివేలు” అని అనెను.

19. కాని దేవుడు ఇట్లు చెప్పెను: “అది కాదు! నీ భార్య సారా తప్పక నీకు కుమారుని కనును. అతనికి ఈసాకు అను పేరు పెట్టుము. నేను అతనితో ఒడంబడిక చేసికొందును. అతని తరువాత తరములతో కూడా నేను శాశ్వతముగా ఒడంబడిక చేసికొందును.

20. ఇక యిష్మాయేలందువా! అతనికొరకు నీవు చేసిన మనవిని వింటిని. అతనిని ఆశీర్వదించితిని. అతనికి సంతానాభివృద్ధి అగునట్లు చేయుదును. అతని సంతతిని విస్తరిల్ల జేయుదును. అతడు పండ్రెండుగురు రాజులకు తండ్రి యగును. అతనినుండి ఒక మహాజాతిని రూపొందించే దను.

21. కాని ఈసాకుతో మాత్రమే నేను ఒడంబడిక చేసికొందును. రానున్నయేట ఈ ఋతువునందే సారా నీకు ఆ బిడ్డనుకనును.”

22. ఇట్లు అబ్రహాముతో మాట్లాడిన తరువాత దేవుడు అతనిని వీడి పరమునకు వెడలిపోయెను.

23. దేవుడు చెప్పినరీతిగా అబ్రహాము తన కుమారుడు యిష్మాయేలును, ఇంటపుట్టిన ప్రతి పురుషుని, సొమ్మిచ్చికొన్న ప్రతిపురుషుని, ఇంటిలో ఉన్న ప్రతిపురుషుని తీసికొనివచ్చి ఆ దినమందే వారి చర్మాగ్రమున సున్నతి చేసెను.

24. తన చర్మాగ్రమున సున్నతి చేసికొన్నప్పుడు అబ్రహాము తొంబదితొమ్మిది యేండ్ల యీడువాడు.

25. సున్నతి చేసినప్పుడు అతని కుమారుడు యిష్మాయేలు వయస్సు పదుమూడేండ్లు.

26. అబ్రహాము యిష్మాయేలు ఇద్దరును ఒకనాడె సున్నతి చేసికొనిరి.

27. వారితోపాటు అబ్రహాము ఇంటిలో పుట్టినవారికి, పరదేశులనుండి సొమ్ముకు కొన్నవారికి అందరకును సున్నతి జరిగెను. 

 1. మమ్రే యొద్ద ఉన్న సింధూరవృక్ష వనమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయునపుడు అబ్రహాము తన గుడారమువాకిట కూర్చుండెను.

2. అతడు తలయెత్తి చూడగా దాపున ముగ్గురు మనుజులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటినుండి పరుగెత్తిపోయి వారియెదుట సాగిల బడెను.

3. అతడు వారితో “ఈ దాసుడు మీకృపకు పాత్రుడయినచో మా యింటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు.

4. నీరు తెచ్చెదను. కాలు సేతులు కడుగుకొనుడు. చెట్ల క్రింద అలసట తీర్చు కొనుడు.

5. ఆహారము తెచ్చెదను. ఇంత తిని ప్రాణ ములు కుదుటపడునట్లు చేసికొనుడు. తరువాత మీ దారిని మీరుపోవచ్చును. మీ ప్రయాణములో ఈ మీ సేవకుని వద్దకు రానే వచ్చితిరి గదా!” అనెను. అందులకు వారు “నీవు చెప్పినట్టే చేయుము” అనిరి.

6. అబ్రహాము గబగబ గుడారములోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో “నీవు తొందరగా మూడు మానికలపిండిని తీసికొని పిసికి రొట్టెలుచేయుము” అని చెప్పెను.

7. తరువాత అబ్రహాము ఆలమందకు పరుగెత్తి ఒక మంచిలేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు కన్నుమూసి తెరుచునంతలో దానిని సిద్ధము చేసెను.

8. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానును అక్కడనే చెట్టుక్రింద నిలుచుండెను.

9. “నీ భార్య సారా ఎక్కడ?” అని అతిథులు అతనిని అడిగిరి. “ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది” అని అతడు చెప్పెను.

10. అంతట ఆయన “నేను రాబోవు యేడు కూడ సరిగా ఈ సమయమునకే తిరిగివత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును” అని చెప్పెను. అతనికి వెనుకప్రక్కన ఉన్న గుడారములో తలుపుచాటున నిలిచియున్న సారా యీ మాటలు వినెను.

11. అబ్రహాము సారా యిద్దరును ముదివగ్గులయిరి. సారా పిల్లలను కను వయస్సు దాటినది.

12. కావున సారా తనలో తాను నవ్వుకొని “నాకు ప్రాయము చెల్లినది. నా భర్తయు ఎండివరుగయ్యెను. నేను ఇపుడు మగని పొందును అనుభవించి బిడ్డలను కనుటయా?” అని అనుకొనెను.

13. అందుకు దేవుడు అబ్రహాముతో “ముసలిదాననైన నాకు బిడ్డలు పుట్టుదురా? అని సారా నవ్వనేల?

14. దేవునకు అసంభవమైనదేదైనా ఉన్నదా? రాబోవు యేడు కూడ సరిగా ఈ సమయమునకు నేను తప్పక తిరిగి నీ యొద్దకు వత్తును. సారాకు కొడుకు పుట్టును” అనెను.

15. ఆ మాటలకు భయపడి సారా నేను నవ్వలేదని బొంకెను. “అవును. నీవు నవ్వితివి” అని అతడనెను.

16. ఆ మనుజులు అక్కడినుండి లేచి సొదొమ వైపు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారి వెంటవెళ్ళెను.

17. దేవుడు తనలో తాను ఇట్లు అనుకొనెను: “నేను చేయదలచుకొన్నపని అబ్రహామునకు చెప్పకుండ దాచెదనా?

18. శక్తిమంతమయిన ఒక మహాజాతి అతనివలన ఏర్పడును. భూమండల మునందలి సకలజాతులు అతని ద్వారా దీవెన బడయును.

19. అబ్రహాము కుమారులు, అతని కుటుంబము వారు, తరువాత కూడ దైవమార్గమును అంటిపెట్టుకొని, నీతిధర్మములను పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా ఎన్నుకొంటిని. ఈ విధముగా నేను అతనికి మాట యిచ్చినట్లు అంతయు నెరవేర్చెదను.”

20. కావున దేవుడు “సొదొమ గొమొఱ్ఱా ప్రజల పాడుపని పైకి పొక్కినది. వారి పాపముపండినది.

21. నేను దిగివెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడుపనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలయునను మొర నా చెవినిబడినది. నేను నిజము తెలిసికొనతలచితిని” అని చెప్పెను.

22. అంతట ఆ మనుజులు సొదొమవైపు వెళ్ళిపోయిరి. కాని అబ్రహాము దేవునియెదుటనే నిలుచుండెను.

23. అతడు దేవుని సమీపించి “ప్రభూ! దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశము చేయుదువా?

24. ఆ పట్టణములో సజ్జనులు ఏబదిమంది ఉన్నచో, వారినిబట్టి అయిన ఆ నగరమును నాశనము చేయకుండ కాపాడవా?

25. మంచివారిని, చెడ్డవారిని కలిపికట్టగా నాశనము చేయుట నీకుతగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకుతగునా? భూలోకమున కెల్ల తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా?” అని అనెను.

26. అంతట దేవుడు “సొదొమ నగరములో ఒక్క యేబదిమంది మంచివారు ఉన్నచో వారినిబట్టి యెల్లరను క్షమింతును” అని చెప్పెను.

27. అబ్రహాము "ప్రభూ! నేను బూడిద ప్రోగునే. మట్టిమనిషినే. అయినను తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను.

28. ఐదుగురు తక్కువగా ఏబది మంది మంచివారున్న తాము ఏమి చేయుదురు? ఐదుగురు తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా?” అనెను. “నలువది ఐదుగురున్నను నేను దానిని నాశనము చేయను” అని దేవుడు చెప్పెను.

29. అబ్రహాము తిరిగి “ఒకవేళ నలువదిమంది మాత్రమే ఉన్న ఎట్లు?” అనెను. “నలువదిమందియున్నను నేను నాశనము చేయను” అని దేవుడు చెప్పెను.

30. అపుడు అబ్రహాము "ప్రభూ! కోపపడకుము. ఇంకొక మనవి. ముప్పదిమంది మాత్రమే ఉండిరనుకొనుము. అప్పుడు ఏమి చేయుదురు?” అనెను. “ముప్పదిమందియున్నను నేను ఏమియు చేయను” అని దేవుడు అనెను.

31. అబ్రహాము “ప్రభూ! ఇంకను మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో ఇరువది మంది మాత్రమే ఉన్నచో ఏమియగును?” అని అడిగెను. దానికి దేవుడు “ఇరువదిమందియున్నను నాశనము చేయను” అనెను.

32. తరువాత అబ్రహాము “ప్రభూ! తాము కోపపడకున్న ఇంకొక్కసారి మాత్రము మాటాడెదను. ఒకవేళ అక్కడ పదుగురు మంచివారు మాత్రమే ఉందురేమో?” అని అడిగెను. దానికి దేవుడు “పదుగురు మంచివారున్నను చాలు. దానిని నాశనము చేయను” అని చెప్పెను.

33. అంతట దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము ఇంటికి తిరిగివచ్చెను. 

 1. దేవదూతలు ఇద్దరు ఆ సాయంకాలము సొదొమ వచ్చిరి. అప్పుడు లోతు నగరద్వారము వద్ద కూర్చుండియుండెను. అతడు వారిని చూచి ఎదురు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారము చేసెను.

2. అతడు వారితో "అయ్యలార! మీరు ఈ దాసుని ఇంటికి రావలయునని వేడుకొనుచున్నాను. ఈ రాత్రి మా ఇంట గడపుడు, కాళ్ళు కడుగుకొనుడు. పెందలకడ లేచి మీ త్రోవను మీరు పోవచ్చును” అనెను. దానికి వారు "ఆలాగు కాదు. మేము వీధిలోనే యీ రాత్రి గడిపెదము” అనిరి.

3. కాని లోతు పట్టుపట్టుటచే అతని మాట కాదనలేక వారు అతని యింటికి వచ్చిరి. లోతు పొంగనిరొట్టెలతో వారికి విందుచేసెను. వారు విందారగించిరి.

4. వారు నిదురించక మునుపే సొదొమ నగరమునందలి పురుషులు-పిన్నలు, పెద్దలు - అందరును ఎగబడివచ్చి లోతు యింటిని చుట్టుముట్టిరి.

5. ఆ జనులు లోతును విలిచి “ఈ రాత్రి నీ ఇల్లు చొచ్చినవారు ఎక్కడ ఉన్నారు? వారిని వెలుపలికి రప్పింపుము. మేము వారిని కూడవల యును” అని కేకలు వేసిరి.

6. లోతు వాకిట ఉన్న జనసమూహము కడకు వెళ్ళెను. వెలుపలికి వచ్చి ఇంటి తలుపువేసెను.

7. వారితో "సోదరులారా! మీరు ఇంత పాతకమునకు తెగింపవలదు.

8. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు కన్యలు. వారిని మీకు అప్పగింతును. మీ ఇచ్చవచ్చినట్లు చేయుడు. నా యింటి నీడకు వచ్చిన యీ మనుజులకు మాత్రము మీరు ఏ అపచారము చేయవలదు” అనెను.

9. దానికి వారు “నీవు నోరెత్తకుండ అవతలికి పొమ్ము. వీడు పరదేశిగా వచ్చి యిక్కడ పాతుకొనిపోయెను. నేటికి మనపాలిటి పెద్ద తీర్పుగాడయ్యెను. ఓరీ! ముందు వారికంటె ఎక్కువగా నిన్నవమానపరుతుము” అనిరి. వారు గుంపుకట్టి లోతు మీదపడి తలుపు పగులగొట్టుటకు దగ్గరకు వచ్చిరి.

10. కాని లోపలనున్న మనుజులిద్దరు వెలుపలికి చేతులు చాచి, లోతును లోనికి లాగి, తలుపులు మూసిరి.

11. పిదప తలుపుదగ్గర ఉన్న వారిలో పిన్నలనుండి పెద్దలవరకు అందరకును కంటిచూపు పోవునట్లు చేసిరి. అందుచే వారు తలుపు కనబడక తడబడిరి.

12. ఆ మనుజులు ఇద్దరు లోతుతో “ఇక్కడ నీ కుమారులుగాని, కుమార్తెలుగాని, అల్లుళ్ళుగాని, ఎవరైన ఉన్నారా? వారికి అయినవారు ఇంకెవరైన ఉన్నచో వారిని అందరను నీవు ఇక్కడి నుండి నగరము వెలువలికి తీసికొనిపొమ్ము .

13. మేము ఈ నగరమును నేలమట్టము చేయబోవుచున్నాము. ఈ నగరములోని వారిని దండింపవలయునను మొర మాటిమాటికి చెవినిబడుటచే, దీనిని నాశనము చేయుటకు దేవుడు మమ్ము పంపెను” అని అనిరి.

14. లోతు వెళ్ళి తనకు కాబోవు అల్లుళ్ళతో "లెండు, ఈ చోటు వదలిపొండు. దేవుడు ఈ నగరమును నాశనము చేయబోవుచున్నాడు” అని చెప్పెను. కాని వారు లోతు ఎగతాళికి అటుల చెప్పుచున్నాడు కాబోలని అనుకొనిరి.

15. తెల్లవారిన తరువాత దేవదూతలు లోతును వెళ్ళిపొమని తొందర పెటిరి. అతనితో “తొందరపడుము. ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసికొని వెళ్ళిపొమ్ము. పోకున్న ఈ నగరము వారు తాము చేసిన తప్పులకు అగ్గిపాలగునపుడు నీవును బుగ్గియై పోదువు” అనిరి.

16. కాని లోతు జాగుచేసెను. అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని, భార్యతో కుమార్తెలతో అతనిని నగరము వెలుపలికి తీసికొనివచ్చిరి.

17. వెలుపలికి చేర్చిన తరువాత వారు “ప్రాణములు దక్కించుకొనదలచిన, ఇక్కడి నుండి పారిపోవుడు. వెనుకకు తిరిగిచూడకుడు. మైదానములో ఎక్కడ ఆగకుడు. కొండలకు పారిపోవుడు. పారిపోకున్న మీరును బూడిదయై పోదురు” అనిరి.

18. అంతట లోతు "అయ్యా! అటుల కాదు.

19. మీరు ఈ దాసుని పట్ల ఎంతయో మన్నన చూపితిరి. నా ప్రాణములు కాపాడి మీకు నాయందున్న దయ ఎంత అధికమో రుజువుచేసితిరి. నేను కొండలకు తప్పించుకొని పోలేను. అక్కడ ఉపద్రవములపాలై చచ్చిపోవుదునేమో!

20. ఇదిగో! పారిపోవుటకు ఇక్కడికి దగ్గరగా ఒక చిన్న ఊరున్నది. నన్ను అక్కడికి తప్పించుకొనిపోయి బ్రతుకనిండు. అదియే ఆ చిన్న ఊరు” అనెను.

21. దేవదూత అతనితో “నీ మనవి మన్నింతును. నీవు చెప్పిన ఆ ఊరిని నాశనము చేయను.

22. తొందరగా నీవు అక్కడికి పారిపొమ్ము. నీవు అక్కడికి చేరుదాక నేను ఏమియు చేయజాలను” అనెను. కావుననే ఆ ఊరికి సోయరు' అను పేరు వచ్చెను.

23. లోతు సోయరు చొచ్చునప్పటికి ఆ ప్రదేశ మున సూర్యుడు ఉదయించెను.

24. దేవుడు ఆకాశము నుండి సొదొమ గొమొఱ్ఱాల మీద అగ్నిని, గంధకమును కురిపించెను.

25. దేవుడు ఆ పట్టణములను నేలమట్టము చేసెను. మైదానమునెల్ల నాశనము చేసెను. పట్టణ ప్రజలను చంపెను. నేల నుండి పుట్టి పెరిగిన చెట్టుచేమలను బూడిదచేసెను.

26. అపుడు లోతు భార్య అతని వెంట నడచివచ్చుచు వెనుదిరిగి చూచెను. చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయెను.

27. అబ్రహాము వేకువజాముననే లేచెను. పూర్వము తాను దేవుని సన్నిధిన నిలచిన చోటికి వచ్చెను.

28. అతడు సొదొమ గొమొఱ్ఱాలవైపు, మైదానమువైపు చూచెను. దట్టమైన ఆవము పొగవలె నేలనుండి పొగ పైకిలేచుచుండెను.

29. ఆ రీతిగా మైదానపు నగరములను నాశనము చేసినపుడు దేవుడు అబ్రహామును గుర్తు తెచ్చుకొనెను. లోతు నివసించుచున్న పట్టణములను నేలమట్టము గావించినప్పుడు దేవుడు అతనిని ఆ ఉపద్రవమునుండి తప్పించెను.

30. లోతు సోయరులో ఉండుటకు భయపడెను. సోయరు వదలి అతడు కుమార్తెలతో పర్వతప్రాంతమున నివసించెను. అతడు అతని కుమార్తెలిద్దరు ఒక గుహలో వసించిరి.

31. ఇట్లుండ అక్క చెల్లెలితో “మన తండ్రి ముసలివాడాయెను. లోకాచారము ప్రకారముగా మనలను కూడుటకు ఒక్క మగపురుగయినను దేశములో కనబడుటలేదు గదా!

32. కావున తండ్రిని తప్పద్రాగింతము. అప్పుడు అతనితో శయనింతము. ఈ విధముగా తండ్రి వలన మన వంశమును నిలుపుకొందము” అనెను.

33. ఆ రాత్రి వారు తండ్రికి ద్రాక్షసారాయమునిచ్చిరి. పెద్దకూతురు వచ్చి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు వచ్చి శయనించెనో, ఎప్పుడు లేచివెళ్ళెనో అతనికి తెలియదాయెను.

34. మరునాడు అక్క చెల్లెలితో "నిన్నటి రేయి నేను తండ్రితో శయనించితిని. ఈ రాత్రి కూడ తండ్రికి త్రాగుటకు ద్రాక్షసారాయము పోయుదము. అప్పుడు నీవుపోయి అతనితో శయనింపుము. ఈ రీతిగా తండ్రివలన వంశము నిలుపుకొందము” అనెను.

35. ఆ రాత్రిగూడ తండ్రి త్రాగుటకు ద్రాక్షసారాయమును ఇచ్చిరి. అంతట చిన్నకూతురు వెళ్ళి తండ్రితో శయనించెను. ఆమె ఎప్పుడు వచ్చి శయనించెనో, ఎప్పుడు లేచివెళ్ళెనో తండ్రికి తెలియదాయెను.

36. ఈ విధముగా లోతు కుమార్తెలు తండ్రివలన గర్భవతులైరి.

37. వారిలో పెద్దకూతురు కుమారుని కని అతనికి మోవాబు అను పేరు పెట్టెను. అతడే ఇప్పటి మోవాబీయులకు మూలపురుషుడు.

38. చిన్న కూతురు ఒక కుమారుని కని అతనికి బెన్-అమ్మి అను పేరు పెట్టెను. అతడే ఇప్పటి అమ్మోనీయులకు మూలపురుషుడు. 

 1. అక్కడినుండి అబ్రహాము విడుదులు చేయుచు నేగేబునకు వెళ్ళెను. అతడు కాదేషునకు, షూరునకు నడుమనున్న గెరారులో స్థిరపడి పరదేశివలె బ్రతుకుచుండెను.

2. అతడు తన భార్యయైన సారాను తన చెల్లెలని చెప్పుకొనెను. అందుచేత గెరారురాజు అబీమెలెకు సారాను రప్పించి తన అంతఃపురమున చేర్చుకొనెను.

3. కాని దేవుడు రాత్రి అబీమెలెకునకు కలలో కనబడి “నీవు దగ్గరకు చేర్చిన ఈ స్త్రీ కారణముగా చత్తువు. ఆమె వివాహిత” అని చెప్పెను.

4. కాని అబీమెలెకు ఆమె చెంతకు పోలేదు. కనుక అతడు దేవునితో "ప్రభూ! నిర్దోషులగు జనులను నాశనము చేయుదువా?

5. అతడు తనకుతానే “ఈమె నా చెల్లెలని చెప్పలేదా?” ఆమె కూడ 'అతడు నా సోదరుడని చెప్పలేదా?' నిర్మల హృదయముతో ఈ పనిచేసితిని” అనెను.

6. కలలో దేవుడు అతనితో “నిజమే! నిర్మలహృదయముతోనే నీవు ఈ పని చేసితివని యెరుగుదును. నాకు వ్యతిరేకముగా పాపము చేయకుండ నిన్ను అడ్డగించినది నేనే. కావుననే నిన్ను ఆమెను తాకనీయలేదు.

7. నీవు వెంటనే అతని భార్యనతనికి అప్పగింపుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు దేవునకు విన్నపములు చేయును. నీవు బ్రతుకుదువు. కాని నీవామెను తిరిగి పంపకున్న నీకు చావుతప్పదు. నీవే కాదు నీ వారందరును చత్తురు” అని చెప్పెను.

8. అందుచేత అబీమెలెకు తెల్లవారకముందే లేచి సేవకులందరను పిలిపించి, వారికి జరిగినదంతయు పూసగ్రుచ్చినట్లు చెప్పెను. వారందరు మిక్కిలి భయ పడిరి.

9. అంతట అబీమెలెకు అబ్రహామును పిలిపించి “మాకు ఇంతపని చేసితివేల? నీకు నేను ఏ అపకారము చేసియెరుగను. నీవు మాత్రము నాకును నా రాజ్యమునకును మహాపాతకమును అంటగట్టితివి. చేయ రాని పనిచేసితివికదా!

10. ఇంతపనిచేసి నీవేమి లాభము పొందితివి?” అని అడిగెను.

11. అంతట అబ్రహాము “ఈ రాజ్యమున దైవభీతిలేదు. వీరు నా భార్యను ఆశించి నన్ను చంపుదురనుకొని ఈ పని చేసితిని.

12. అదియును గాక ఈమె నిజముగా నా సోదరియే. ఆమె మా తండ్రి కుమార్తెయేకాని మా తల్లికుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. '

13. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు వదలి దేశములు పట్టి పొమ్మన్నప్పుడు నేనామెతో 'నీవు నాయందు కరుణకలిగి నేరవేర్పవలసిన విధి యొకటి ఉన్నది. మనము వెళ్ళిన యెల్లచోట్ల నేను నీ సోదరుడనని చెప్పుము' అంటిని” అని అనెను.

14. అప్పుడు అబీమెలెకు గొఱ్ఱెలను, గొడ్లను, దాసదాసీ జనమును రప్పించి అబ్రహామునకు కానుకగా ఇచ్చెను. సారాను గూడ తిరిగి అతనికి అప్పగించెను.

15. అబీమెలెకు అబ్రహాముతో “ఇదిగో! నా ఈ దేశమంతయు నీ కళ్ళకు గట్టినట్లు ఉన్నదిగదా! ఇక్కడ నీకు మనసు నచ్చినచోట కాపురముండుము” అనెను.

16. అతడు సారాతో “నేను నీ సోదరునకు వేయి వెండినాణెములిచ్చితిని. కావున మీ జనులెవ్వరును జరిగిపోయిన ఈ పనిని పట్టించుకొనరు. నీవును పూర్తిగా దోషమునుండి విముక్తి చెందెదవు” అనెను.

17. అపుడు అబ్రహాము దేవుని ప్రార్థించెను. దేవుడు అబీమెలెకును, అతని భార్యను, దాసీకన్యలను బాగుచేసెను. వారు బిడ్డలను కనిరి.

18. ఇంతకు ముందు అబ్రహాము భార్యయగు సారాను కాపాడనెంచి దేవుడు అబీమెలెకు ఇంటిలో నున్న ప్రతి గర్భమును మూసివేసెను. 

 1. మాటయిచ్చినట్లే దేవుడు సారా పట్ల కనికరముచూపెను. ఆమె గూర్చి చెప్పినదెల్ల నెరవేరునట్లు చేసెను.

2. దేవుడు నిర్ణయించిన సమయమునకే సారా గర్భవతియై ముదుసలియైన అబ్రహామునకు ఒక కుమారుని కనెను.

3. అబ్రహాము, సారా తనకు కన్న కుమారునకు ఈసాకు అను పేరు పెట్టెను.

4. ఈసాకు ఎనిమిది రోజుల నెత్తురుకందుగా ఉన్నప్పుడే దేవుడు ఆనతిచ్చిన విధముగా అబ్రహాము అతనికి సున్నతిచేసెను.

5. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు నూరేండ్లు.

6. సారా “దేవుడు బిడ్డనిచ్చి నన్ను నవ్వులలో తేలించెను. ఇది విన్న వారందరును నాతోపాటు నవ్వుదురు” అనుకొనెను.

7. ఆమె యింకను ఇట్లనుకొనెను: “సారా బిడ్డలకు చనుగుడుపునని అబ్రహాముతో ఎవరైన చెప్పియుండిరా? అయినను నేను ముదుసలియైన అబ్రహామునకు కొడుకును గంటిని.”

8. పిల్లవాడు పెరిగి చనుబాలు వదలిన రోజున అబ్రహాము ఒక గొప్పవిందు చేసెను.

9. అబ్రహామునకు, ఐగుప్తు దేశీయురాలు అయిన హాగారునకు పుట్టిన కుమారుడు ఈసాకుతో ఆడుకొనుచుండగా సారా చూచెను.

10. చూచి అబ్రహాముతో “ఈ బానిసతొత్తును, దాని కొడుకును ఇంటినుండి గెంటివేయుము. ఈ దాసీపుత్రుడు నా కుమారుడు ఈసాకునకు వారసత్వమున సమముగా ఉండుట నేను సహింపను” అనెను.

11-12. అబ్రహామునకు తన కుమారుడైన యిష్మాయేలు మీద ప్రేమ మెండు. సారా మాటలువిని అతడు చాల బాధపడెను. కాని దేవుడు అబ్రహాముతో “ఈ దాసిని, ఈమె కొడుకును తలచుకొని బాధపడవలదు. సారా చెప్పినట్లు చేయుము. ఈసాకునకు పుట్టినవారే నీ సంతతి వారగుదురు.

13. ఈ దాసీపుత్రుని సంతతిని గూడ ఒక జాతిగా చేయుదును. అతడును నీ కుమారుడే కదా!” అనెను.

14. అబ్రహాము తెల్లవారకముందే లేచెను. అతడు రొట్టెలమూటను, నీళ్ళతిత్తిని తెచ్చి హాగారునకిచ్చి, కుమారుని ఆమె, భుజములమీద నుంచి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో దిక్కుతోచక తిరుగాడుచుండెను.

15. తిత్తిలోని నీరంతయు అయిపోయెను. ఆమె పిల్లవానిని ఒక పొదక్రింద పడవేసెను.

16. పొదకు వింటివేత దూరముగా కూర్చుండెను. “ఈ పిల్లవాని చావు నేనెట్లు చూతును” అనుకొనెను. ఈ విధముగా ఆమె కొంచెము దూరముగా కూర్చుండి గొంతెత్తి ఏడ్చుచుండెను.

17. దేవుడు పిల్లవాని ఏడ్పువినెను. దేవుని దూత ఆకాశము నుండి “హాగారూ! నీకేమి ఆపదకలిగినది? భయపడకుము. దేవుడు నీవు పడవేసిన చోటునుండి పిల్లవాని ఏడ్పు వినెను.

18. ఇకలెమ్ము. పిల్లవానిని లేవనెత్తి చంకబెట్టుకొనుము. అతడు ఒకమహాజాతికి మూలపురుషుడగును” అనెను.

19. దేవుడు ఆమె కన్నులు తెరచెను. ఆమె నీటి ఊటను చూచెను. వెళ్ళి తిత్తిని నీటితో నింపెను. పిల్లవానికి నీరుపట్టెను.

20-21. పిల్లవానికి దైవబలము కలదు. అతడు పెరిగి పెద్దవాడై పారాను అడవులలో నివసించెను. గొప్ప విలుకాడయ్యెను. తల్లి ఐగుప్తు దేశమునుండి ఒక పిల్లను తెచ్చి అతనికి పెండ్లి చేసెను.

22. ఆ కాలమున అబీమెలెకు తన సేనాధిపతి ఫీకోలుతో వచ్చి అబ్రహాముతో “నీవు చేయు పనులన్నింటికి దేవుడు తోడ్పడుచున్నాడు.

23. నాకు, నా బిడ్డలకు, నా సంతతివారికి విశ్వాసద్రోహము చేయనని దేవునిమీద ప్రమాణముచేసి చెప్పుము. నేను నిన్ను నమ్మినట్లుగా నీవును నన్ను, నీకు పరదేశముగానున్న నా దేశమును నమ్మవలయును” అనెను.

24. ఆ మాటలకు అబ్రహాము "అట్లే నేను ప్రమాణము చేయుచున్నాను” అనెను.

25. ఇది ఇట్లుండగా అబీమెలెకు సేవకులు అబ్రహాము నీళ్ళబావిని బలవంతముగా వశము చేసికొనిరి. దానికి అబ్రహాము అబీమెలెకు మీద అభియోగము తెచ్చెను.

26. అంతట అబీమెలెకు “ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను. నీవును ఎన్నడు నాతో అనలేదు. ఇప్పటివరకు నేను. ఈ విషయము విననేలేదు” అనెను.

27. అంతట అబ్రహాము గొఱ్ఱెలను, గొడ్లను తోలుకొనివచ్చి అబీమెలెకునకు అప్పగించెను. వారిరువురు ఒక ఒడంబడిక చేసికొనిరి.

28. అబ్రహాము తన గొఱ్ఱెల మందనుండి ఏడు పెంటి పిల్లలను విడిగా నుంచెను.

29. అబీమెలెకు “ఈ పెంటి పిల్లలను ఏడింటిని విడిగా ఉంచితివేల”? అని అబ్రహామును అడిగెను.

30. దానికి అబ్రహాము “నేనే ఈ బావిని త్రవ్వించితిని అనుటకు సాక్ష్యముగా నీవు వీనిని స్వీకరింపుము” అనెను.

31. వారిరువురు ప్రమాణములు చేసిన తావు కావున ఆ స్థలమునకు బేర్షెబా" అను పేరువచ్చెను.

32. వారు బేర్షెబా దగ్గర ఒడంబడిక చేసికొన్నపిదప అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిరి,

33. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచుల వృక్షమును నాటెను. నిత్యుడగు దేవుని పేరిట ప్రార్ధన చేసెను.

34. అబ్రహాము ఫిలిస్తీయుల దేశములో పెక్కేండ్లు పరదేశిగా బ్రతికెను. 

 1. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. "అబ్రహామూ!" అని దేవుడు పిలిచెను. “చిత్తము ప్రభూ!” అని అబ్రహాము అనెను.

2. అంతట దేవుడు అతనితో “నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైకకుమారుని, ఈసాకును వెంటబెట్టుకొని మోరీయా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దానిమీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపుము” అని చెప్పెను.

3. అందుచే అబ్రహాము తెల్లవారకముందే లేచెను. ప్రయాణమునకు గాడిదమీద మెత్తని బొంత పరిచెను. కుమారునితోపాటు, ఇంక తన పనివారిలో ఇద్దరను గూడ వెంటబెట్టుకొని వెళ్ళెను. దహనబలికి కట్టెలు చీల్చి, మోపుకట్టుకొని, దేవుడు చెప్పినచోటికి బయలు దేరెను.

4. బయలుదేరిన మూడవనాడు అబ్రహాము తలయెత్తి దూరమునుండి ఆ చోటుచూచెను.

5. అతడు తన పనివారితో “మీరు గాడిదతో ఇక్కడ నుండుడు. నేనును, ఈ చిన్నవాడును, అక్కడికి వెళ్ళెదము. దేవునకు మొక్కులు చెల్లించి తిరిగి మీ యొద్దకు వత్తుము” అని చెప్పెను.

6. ఇట్లు చెప్పి అబ్రహాము దహనబలికి కావలసిన కట్టెలమోపును ఈసాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును, కత్తిని తీసికొనెను. తండ్రి కొడుకు లిరువురును కలిసి వెళ్ళిరి.

7. ఈసాకు తండ్రి అయిన అబ్రహాముతో “నాయనా!” అని పిలిచెను. అబ్రహాము “ఏమి కుమారా!” అని అడిగెను. అంతట ఈసాకు “నిప్పు, కట్టెలున్నవిగదా! మరి దహనబలికి కావలసిన గొఱ్ఱెపిల్లయేదీ?” అని అడిగెను.

8. దానికి అబ్రహాము “కుమారా! దహనబలికి కావలసిన గొఱ్ఱెపిల్లను దేవుడే సమకూర్చును” అనెను.

9. అటుల వారిద్దరు కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలిపీఠము నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఈసాకును బంధించి బలిపీఠముమీద పేర్చిన కట్టెలపైన ఉంచెను.

10. అంతట అతడు చేయిచాచి కుమారుని చంపుటకు కత్తిని తీసికొనెను.

11. కాని ఆకాశము నుండి యావేదూత “అబ్రహామూ! అబ్రహామూ!' అని పిలిచెను. అబ్రహాము “చిత్తము ప్రభూ!” అనెను

12. యావే దూత “చిన్నవానిమీద చేయివేయకుము అతనిని ఏమియు చేయకుము. నీవు నీ ఏకైకపుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావు: నీవు దైవభీతి కలవాడవని నేను తెలిసికొంటిని” అనెను

13. అప్పుడు అబ్రహాము తలఎత్తి చూచెను. అతనికి  దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకొన్న పొట్టేలు కన బడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసికొనివచ్చెను. కుమారునికి బదులుగా దానిని దహనబలిగా సమ ర్పించెను.

14. అబ్రహాము ఆ ప్రదేశమునకు 'యావే యిర్‌ యెహ్' అనగా “దేవుడు సమకూర్చును" అను పేరు పెట్టెను. కావుననే ఈనాడుగూడ “కొండమీద దేవుడు సమకూర్చును” అను లోకోక్తి వాడుకలో ఉన్నది.

15. ఆకాశమునుండి యావేదూత మరల రెండవ సారి అబ్రహామును పిలచి

16. “నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నీవు నీ కుమారుని, నీ ఏకైకకుమారుని సమర్పించుటకు వెనుకంజవేయలేదు. నీవు చేసిన ఈ గొప్ప కార్యమునుబట్టి

17. నిన్ను మిక్కుటముగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్రతీరము నందలి ఇసుక రేణువులవలె లెక్కకందనంతగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. నీ సంతతివారు శత్రునగరములను వశముచేసికొందురు.

18. భూమండలమందలి సకలజాతులవారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడ వైతివి గావున తప్పక ఇట్లు జరుగును” అని అనెను.

19. అబ్రహాము తన పనివారికడకు వెళ్ళెను. వారందరు బేర్షెబాకు తిరిగివచ్చిరి. అబ్రహాము అక్కడనే వసించెను.

20. ఇది జరిగిన తరువాత “నీ సోదరుడగు నాహోరునకు మిల్కా బిడ్డలను కనెను.

21. పెద్ద కొడుకు ఊజు. ఊజు తమ్ముడు బూజు. తరువాత ఆరాము తండ్రి కెమూవేలు,

22. కెసెదు, హాజో, పిల్దాషు, యిద్లాపు, బెతూవేలు పుట్టిరి.

23. బెతూవేలునకు రిబ్కా అను కుమార్తె కలిగెను” అను వార్తలెవరో అబ్రహామునకు తెలిపిరి. మిల్కా అబ్రహాము సోదరుడగు నాహోరునకు ఈ ఎనిమిదిమందిని కనెను.

24. రవూమ అను ఆమె నాహోరునకు ఉంపుడుకత్తె. ఆమె అతనికి తెబా, గహాము, తహాషు, మాకా అనువారిని కనెను. 

 1-2. సారా నూటయిరువది యేడేండ్లు బ్రతికెను. ఆమె కనానుదేశమందు హెబ్రోను అను పేరుగల కిర్యతర్బాలో మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింప వెళ్ళెను.

3. అతడు ఎట్టకేలకు లేచి శవమును వదలి వచ్చెను. అతడు హిత్తీయులతో

4. “నేను మీచెంత పరదేశివలె నివసించితిని. మా యింట చనిపోయినవారిని పాతి పెట్టుటకు కొంత భూమినిండు” అనెను.

5. హిత్తీయులు అబ్రహాముతో

6. "అయ్యా! మామాట వినుము. నీవు మా మధ్య మహారాజుగా బ్రతుకుచున్నావు. మా శ్మశానభూము లలో అతిశ్రేష్ఠమయిన దానియందు మీ యింట చని పోయినవారిని పాతి పెట్టుము. మాలో ఏ ఒక్కడును నీకు శ్మశానభూమిని ఇవ్వనను వాడులేడు. ఎవ్వడును మీ ఇంట చనిపోయిన వారిని పాతి పెట్టుటకు అడ్డు పడడు” అనిరి.

7. అబ్రహాములేచి ఆ దేశప్రజలగు హిత్తీయుల ముందట సాగిలబడెను.

8. అతడు వారితో “మా యింట చనిపోయినవారిని పాతి పెట్టుటకు మీకు సమ్మతమైనచో నా మాటవినుడు.

9. మీరు సోహారు కుమారుడు ఎఫ్రోనును అతని పొలము చివర మక్పేలా అనుచోట ఉన్న గుహను నాకిమ్మని అతనితో మనవి చేయుడు. అది మీ దేశమున మా శ్మశానభూమి అగునట్లు నిండువెలకే దానిని నాకు స్వాస్థ్యముగా ఇమ్మనుడు” అనెను.

10. హిత్తీయుడగు ఎఫ్రోను తనవారి నడుమ కూర్చుండియుండెను. వారు నగర ద్వారముచెంత ఉండగా, వారి కెల్లరకును వినబడునట్లు అతడు అబ్రహాముతో

11. "అయ్యా! నేను చెప్పదలచుకొన్న మాటవినుము. మా జాతి ప్రజలు చూచుచుండ నేను ఆ పొలమును నీకు దానము చేయుదును. ఆ పొలములోనున్న గుహను గూడ ఇత్తును. అక్కడ మీ వారిని పాతిపెట్టుకొనుము” అనెను.

12-13. అబ్రహాము ఆ ప్రజలయెదుట సాగిలబడెను. వారు వినునట్లు ఎఫ్రోనుతో “అది సరియేకాని నా మాటగూడ వినుము. ఆ పొలము వెలయిత్తును, తీసికొనుము. దానిలో మా వారిని పాతి పెట్టెదను” అనెను.

14. దానికి ఎఫ్రోను "అయ్యా! నా మాటకూడ వినుము.

15. ఆ పొలము నాలుగువందల తులముల వెండి విలువచేయును. అయినను మన ఇద్దరి నడుమ ఇదియేపాటి సొమ్ము! అక్కడ ఏ ఆటంకము లేకుండ మీవారిని పాతి పెట్టుకొనుము” అనెను.

16. అబ్రహాము హిత్తీయులతో బేరము కుదుర్చుకొనెను. తాను హిత్తీయులకు ముందు చెప్పినరీతిగా, నాటి వర్తకులలో చెల్లుబడి అగుచున్న ప్రకారముగా నాలుగువందల తులముల వెండిని తూచి ఎఫ్రోనునకు ఇచ్చెను.

17-18. ఈ విధముగా మమేకు తూర్పున, మక్పేలా దగ్గర వున్న ఎఫ్రోను పొలము, దానిలో నున్న గుహ, చెట్టుచేమలు సరిహద్దులతో పాటు న్యాయానుసారముగా, నగరద్వారము చెంతనున్న హిత్తీయుల సమక్షమున అబ్రహాము వశమైనవి.

19. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కనాను దేశమునందు, హెబ్రోను అను పేరుగల మమ్రేకు తూర్పుగా, మక్పేలా దగ్గర ఉన్న పొలముమీది గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను.

20. ఈ విధముగా హిత్తీయులు ఆ పొలమును, దానిమీద ఉన్న గుహను శ్మశానమునకై అబ్రహాము వశము చేసిరి. 

 1. అబ్రహాము పండు ముదుసలి అయ్యెను. అతడు చేసిన పనులన్నిటికిని దైవము తోడ్పడెను.

2. అబ్రహాము తన ఇంటి పనిపాటలు తీర్చుచు సర్వస్వము చక్కదిద్దుచున్న పెద్ద సేవకుని పిలిచి "నీ చేయి నా తొడక్రింద పెట్టుము.

3. ఇక్కడ నాతో పాటు నివసించుచున్న ఈ కనానీయుల పిల్లను నా కుమారునకిచ్చి పెండ్లి చేయనని భూమ్యాకాశములకు దేవుడైన యావే పేరిట ప్రమాణము చేయుము.

4. మా దేశముపోయి మా చుట్టపక్కాలలో ఒకరి పిల్లను తెచ్చి ఈసాకునకు భార్యగా చేయుము” అనెను.

5. అంతట సేవకుడు “ఒకవేళ మీ చుట్టపుపిల్ల నా వెంట ఈ దేశము వచ్చుటకు ఇష్టపడనిచో నేనేమి చేయవల యును? ఆ పక్షమున తాము వచ్చిన దేశమునకు మీ కుమారుని తిరిగి తీసికొనిపోవలయునా?” అని అడిగెను.

6. అబ్రహాము అతనితో “మిన్నువిరిగి మీద బడినను అక్కడికి నా కుమారుని తీసికొనిపోవలదు.

7. నా తండ్రి ఇంటికి, నేను పుట్టిన నేలకు దూరముగా తీసికొని వచ్చిన పరలోక దేవుడగు ప్రభువు, నాతో మాట్లాడి నా సంతతికే ఈ దేశమును ధారపోయుదునని నాకు ప్రమాణముచేసి చెప్పిన దేవుడు, తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి పిల్లను మా కోడలిగా చేయుము.

8. ఒకవేళ ఆ పిల్ల నీ వెంట వచ్చుటకు ఇష్టపడనిచో, నీవు నాకిచ్చిన మాటకు కట్టుపడవలసిన పనిలేదు. నా కుమారుని మాత్రము అక్కడికి తీసికొని పోవలదు” అనెను.

9. ఆ సేవకుడు యజమానుడగు అబ్రహాము తొడక్రింద చేయి పెట్టి, అతడు చెప్పిన రీతిగా చేయుదునని మాట ఇచ్చెను.

10. ఆ సేవకుడు యజమానుని ఒంటెలలో పదింటిని ఎన్నుకొనెను. నానావిధ బహుమానములను తీసికొనెను. అతడు అరామ్ నహరయిమునకు ప్రయాణమై, నాహోరు నివసించు నగరమునకు వచ్చెను.

11. అపుడు సాయంకాలమయ్యెను. అది ఆడువారు నీళ్ళు చేదుకొనుటకు దిగుడుబావి వద్దకు వచ్చు సమయము. అప్పుడు ఆ సేవకుడు నగరమునకు వెలుపలనున్న బావికడ ఒంటెలను విశ్రమింపజేసెను.

12.. అతడిట్లు ప్రార్థనచేసెను: “నా యజమానుని దేవుడవైన ప్రభువా! ఈనాడు నేను వచ్చినపని నెరవేరు నట్లు చేయుము. నా యజమానుడగు అబ్రహామును కరుణింపుము.

13. ఇదిగో! నేను ఈ నీళ్ళబావి యెద్ద నిలబడియుంటిని. ఈ ఊరి పిల్లలు నీళ్ళు తీసికొని పోవుటకువత్తురు.

14. ఇక ఇట్లు జరుగునుగాక! 'తల్లీ! దయచేసి కడవవంచి నీళ్ళుపోయుము. త్రాగెదను' అని నేను అడుగగా 'బాటసారీ! నీవు నీరు త్రాగుము. నీ ఒంటెలకు గూడ నీళ్ళుపట్టెదను' అని బదులు చెప్పెడి బాలికయే నీ దాసుడు ఈసాకునకు నీవు నిర్ణయించిన భార్య అగునుగాక. ఈ రీతిగా జరుగునేని, నీవు నా యజమానుని కరుణించితివని తెలిసికొందును.”

15. అతడు ప్రార్థనను ముగింపకముందే, అబ్రహాము సోదరుడైన నాహోరునకును మిల్కాకును పుట్టిన బెతూవేలు కూతురైన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని అచటకు వచ్చెను.

16. ఆ బాలిక గొప్ప అందగత్తె. మగపోడిమి ఎరుగనికన్య. ఆమె బావిలోనికిదిగి, కడవనింపుకొని తిరిగి పైకివచ్చెను.

17. వెంటనే అబ్రహాము సేవకుడు "అమ్మా! గ్రుక్కెడు నీళ్ళు పోయుము త్రాగెదను” అని అడిగెను.

18. "అయ్యా! త్రాగుము” అని ఆమె బదులు చెప్పి చేతి మీదికి కడవ దించుకొని అతడు త్రాగుటకు నీళ్ళు పోసెను.

19. అతని దప్పికతీరిన తరువాత ఆమె “ఇక దప్పికదీర త్రాగువరకు నీఒంటెలకుగూడ నీళ్ళు చేది పోయుదును” అనెను.

20. ఆ బాలిక త్వరగా తొట్టిలో కడవ కుమ్మరించి బావికడకు పరుగెత్తుకొని పోయెను. ఒంటెలన్నిటికి నీళ్ళు తెచ్చిపోసెను.

21. దేవుడు తన ప్రయాణము సఫలమగునట్లు చేసెనో లేదో తెలిసికొనగోరి, ఆ సేవకుడు బాలికవైపు చూచుచు మిన్నకుండెను.

22. ఒంటెలు నీళ్ళు త్రాగిన తరువాత అతడు అర తులము బరువుగల బంగారపు ముక్కుపోగు, పది తులముల ఎత్తుగల రెండు బంగారపుగాజులను వెలికి తీసెను.

23. “నీవు ఎవరి కుమార్తెవో చెప్పుము. మేము ఈ రాత్రి మీ తండ్రియింట బసచేయుటకు చాలినంత చోటుఉన్నదా?” అని ఆమెను అడిగెను.

24. అంతట ఆమె "అయ్యా! నేను మిల్కా నాహోరుల కుమారుడగు బెతూవేలు కుమార్తెను.

25. కావలసినంత గడ్డి, పశుగ్రాసము మాకున్నవి. మీరు ఈ రాత్రి బసచేయుటకు చోటును కలదు” అని చెప్పెను.

26. ఆ సేవకుడు తలవంచి ప్రభునకు నమస్కారము చేసెను.

27. అతడు “నా యజమానుడైన అబ్రహాము దేవుడగు ప్రభువు స్తుతింపబడునుగాక! ప్రభువు నా యజమానునికి ఇచ్చినమాట నిలుపుకొని దయచూపుట మానలేదు. ప్రభువు నా యజమానుని చుట్టాల ఇంటికే నన్ను నడిపించెను” అనెను.

28. అంతట ఆ బాలిక తల్లి దగ్గరకు పరుగెత్తు కొనిపోయెను. ఇంటిలో వారికి అందరకు జరిగిన దంతయు చెప్పెను.

29. రిబ్కాకు లాబాను అను సోదరుడు గలడు. అతడు సోదరి ముక్కుపోగును చూచెను. ఆమె చేతులనున్న గాజులను చూచెను. ఆ మనుష్యుడు తనతో చెప్పిన మాటలుగా రిబ్కా పలికిన పలుకులు అతడు వినెను.

30. వెంటనే లాబాను బావికడనున్న బాటసారి దగ్గరకు పరుగెత్తుకొని పోయెను. అతడు వచ్చినపుడు ఆ మనుష్యుడు బావికడ నున్న ఒంటెల ప్రక్కనే ఉండెను.

31. అంతట లాబాను “అయ్యా! దేవుడు నిన్ను ఆశీర్వదించెను. ఊరి వెలుపల ఉండనేల? మా యింటికి రమ్ము. నేను బస యేర్పాటు చేసితిని. ఒంటెలకు తగినచోటున్నది” అనెను.

32. లాబాను ఆ మనుష్యుని ఇంటికి కొని వచ్చెను. ఒంటెలమీది సంచులు దింపించెను. వానికి మేత పెట్టించి గడ్డివేయించెను. ఆ మనుష్యునకు, అతని వెంటనున్న వారికి కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళిచ్చెను.

33. ఆ మనుష్యునకు భోజనము వడ్డించెను. కాని అతడు "నేను తెచ్చిన కబురు చెప్పకముందు భోజనము చేయను” అనెను. లాబాను “చెప్పుము" అనెను.

34. ఆ మనుష్యుడు చెప్పమొదలిడెను. "అయ్యా! నేను అబ్రహాము దాసుడను.

35. ప్రభువు అపారముగా నా యజమానుని కరుణించెను. నా యజమానుడు గొప్పవాడయ్యెను. ప్రభువు అతనికి గొఱ్ఱెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీజనమును, ఒంటెలను, గాడిదలను సమకూర్చెను.

36. ముసలితనమున మా యజమానురాలు సారా మా యజమానునికి ఒక కుమారుని కనెను. మా యజమానుడు తనకు ఉన్నదంతయు ఆ కుమారునకిచ్చెను.

37. ఆయన తాను కలిసిమెలిసి బ్రతుకుచున్న కనానీయుల పిల్లను తన కుమారునకిచ్చి పెండ్లి చేయవలదనియు,

38. తన తండ్రి ఇంటికి, చుట్టపక్కాల దగ్గరకు వెళ్ళి కుమారుని కొరకు ఒక పిల్లను చూడవలయుననియు నా చేత ప్రమాణము చేయించుకొనెను.

39. అంతట నేను 'ఒకవేళ ఆ పిల్ల నావెంటరానిచో ఏమి చేయవలయును?” అని అంటిని.

40. దానికి మా యజమానుడు 'నేను ఆశ్రయించిన ప్రభువు తన దూతను నీతో కూడ పంపును. నీ ప్రయాణము సఫలమగునట్లు చేయును. మా తండ్రి కుటుంబమునకు చెందిన చుట్టపక్కల పిల్లలలో ఒక పిల్లను చూచి నా కుమారునకిచ్చి పెండ్లి చేయుము.

41. అప్పుడే నీవు నీకు అప్పగించిన పని బరువు తొలగించుకొన్న వాడవగుదువు. ఒకవేళ మా చుట్టపక్కాలలో ఎవ్వరును తమ పిల్లను ఈయనిచో నీవు నాకు ఇచ్చినమాటను తప్పినవాడవుకావు' అని అనెను.

42. నేడు నేను ఆ బావియొద్దకు వచ్చి 'మా యజమానుడు అబ్రహామునకు దేవుడవైన ప్రభువా! నీవు నా ప్రయాణము సఫలమగునట్లు చేయుము.

43. ఇదిగో! నేను ఈ నీళ్ళబావి దగ్గర నిలబడియుంటిని. ఏ చిన్నదియైన నీళ్ళు తీసికొని పోవచ్చి నపుడు నేను అమ్మా! దయచేసి నీ కడవలో నీళ్ళు కొంచెము త్రాగుటకు ఇమ్మని అడిగెదను.

44. ఆమె అలాగుననే త్రాగుము. నీ ఒంటెలకు గూడ నీళ్ళు తెచ్చిపోయుదును అని చెప్పినచో, ఆమెయే దేవుడు మా యజమానుని కుమారునకు నిర్ణయించిన పిల్లయగునుగాక!' అని దేవుని ప్రార్ధించితిని.

45. నా ప్రార్ధనము ముగియుటకుముందే కడవ భుజముమీద పెట్టుకొని వచ్చుచున్న రిబ్కాను చూచితిని. ఆమె బావి లోనికి దిగి కడవ నింపెను. నేను 'తల్లీ! త్రాగుటకు నీళ్ళుపోయుము' అని ఆమెనడిగితిని.

46. ఆమె వెంటనే భుజముమీది కడవను క్రిందికిదించి 'అయ్యా! త్రాగుము. నీ ఒంటెలకు గూడ నీళ్ళు పెట్టెదను” అనెను. నేను నీళ్ళు త్రాగితిని. ఆమె నా ఒంటెలకుగూడ నీళ్ళు పెట్టెను.

47. 'నీవు ఎవరి కుమార్తెవు' అని నేను ఆమెను అడిగితిని. ఆమె “మిల్కా నాహోరుల కుమారుడగు బెతూవేలు కుమార్తెను' అని చెప్పెను. అప్పుడు నేను అమె ముక్కుకు పోగుపెట్టి, చేతికి గాజులు తొడిగితిని.

48. నేలవ్రాలి దేవునికి సాష్టాంగ నమస్కారము చేసితిని. మా యజమానుని దేవుడగు ప్రభుని స్తుతించితిని. ఆ ప్రభువే నన్ను సరియైన బాటలో నడిపించి మా యజమానుని కుమారునకు, తన సోదరుని కుమార్తెను ఎన్నుకొనునట్లు చేసెను.

49. మీరు మా యజమానుని నమ్మి ఆయనమీద దయదలచి నామాట దక్కునట్లు చేయుదురా? అది నాకు తెలియజేయుడు. ఒకవేళ చేయజాలమందురా? ఆ మాటయైనను చెప్పుడు. నేను ఎటుపోవలయునో అటు పోయెదను.”

50. లాబాను, బెతూవేలు "అయ్యా! ఇది దేవుడు చేసినపని. 'అవును', 'కాదు' అని చెప్పుటకు మేము ఎవ్వరము

51. ఇదిగో! రిబ్కా నీ యెదుటనే ఉన్నది గదా! ఆమెను తీసికొని వెళ్ళుము. దేవుడు ఆదేశించి నట్లు ఆమె మీ యజమానుని కుమారునకు భార్య అగునుగాక!” అనిరి.

52. వారు చెప్పిన మాటలువిన్న తర్వాత అబ్రహాము దాసుడు నేలమీద వ్రాలి దేవునకు సాష్టాంగ నమస్కారము చేసెను.

53. అతడు. వెండి బంగారునగలు. విలువగల వస్త్రములు వెలికిదీసి రిబ్కాకు ఇచ్చెను. ఆమె సోదరునకు, తల్లికి అమూల్య ములైన బహుమానములను సమర్పించెను.

54. అప్పుడు అతడు, అతని వెంటవచ్చిన వారు అన్నపానములు స్వీకరించిరి. అక్కడ ఆ రాత్రి గడపిరి. తెల్లవారినపిదప, అబ్రహాము దాసుడు నిద్రలేచి "అయ్యా! మా యజమానుని దగ్గరకు తిరిగివెళ్ళెదను. సెలవిండు” అని అడిగెను.

55. దానికి రిబ్కా సోదరుడు, తల్లి "మా అమ్మాయి మా దగ్గర ఒక పది రోజులపాటు ఉండి తరువాత వచ్చును” అనిరి.

56. అంతట సేవకుడు “నన్ను ఆపవలదు. దేవుడు నా మాటదక్కించెను. ఇక మా యజమానుని కడకు పోవుటకు సెలవిండు” అని అనెను.

57. వారు “అమ్మాయిని పిలిచి ఆమె ఏమి చెప్పునో చూతము” అనిరి.

58. వారు రిబ్కాను పిలిచి “ఈ మనుష్యుని వెంటవెళ్ళెదవా?” అని అడిగిరి. ఆమె “వెళ్ళేదను” అనెను.

59. అంతట వారు చెల్లెలైన రిబ్కాను, ఆమె దాదిని అబ్రహాము సేవకునితో, అతని పరిజనులతో పంపిరి.

60. పంపుచు రిబ్కాను దీవించి యిట్లు పలికిరి: "తల్లీ! నీవు మా సోదరివి. నీ కడుపు పండి గంపెడుబిడ్డలు పుట్టుదురుగాక! నీ కుమారులు శత్రునగరములను వశముచేసికొందురుగాక!”

61. అప్పుడు రిబ్కా, ఆమె చెలికత్తెలు, ప్రయాణమునకు సిద్ధమై, ఒంటెలనెక్కి, ఆ సేవకుని వెంట వెళ్ళిరి. అబ్రహాము సేవకుడు రిబ్కాను తోడ్కొని వెడలిపోయెను.

62. ఇంతలో ఈసాకు “బేయెద్దహాయిరోయి” అను బావివరకు కదలివచ్చి, నేగేబులో నివసించు చుండెను.

63. ఒకనాటి సాయంకాలము ఈసాకు ధ్యానించుకొనుటకు పొలమునకు వెళ్ళెను. అతడు తలయెత్తి పారజూడగా, ఒంటెలు వచ్చుచుండెను.

64. రిబ్కా కూడ కన్నెత్తి ఈసాకును చూచెను. ఆమె త్వరత్వరగా ఒంటెదిగి

65. "పొలము నుండి మన వైపువచ్చుచున్న ఆ మనుష్యుడెవరు?” అని సేవకుని ప్రశ్నించెను. సేవకుడు “ఆయనయే మా యజమా నుడు” అని చెప్పెను. అంతట ఆమె ముసుగు కప్పు కొనెను.

66. సేవకుడు జరిగినదంతయు పూసగ్రుచ్చి నట్లు ఈసాకుతో చెప్పెను.

67. ఈసాకు ఆమెను తన గుడారమునకు తీసికొనిపోయి భార్యగా చేసికొనెను. అతడు ఆమెను ప్రేమించెను. అతనికి తల్లి లేనికొరతతీరి ఊరడిల్లెను. 

 1. అబ్రహాము మరియొక స్త్రీని కూడ వివాహ మాడెను. ఆమె పేరు కతూరా.

2. ఆమె అతనికి సిమ్రాను, యోక్షాను, మేదాను, మీద్యాను, ఇష్బాకు, షువానులను కనెను.

3. యోక్షాను షబా, దెదానులకు తండ్రి అయ్యెను. దెదానునకు అస్సూరీము, లెతూషీము, లెయుమ్మీము అనువారు కుమారులు.

4. మిద్యానునకు ఏఫ, ఏఫరు, హనోకు, అబీదా, ఎల్దయా అనువారు కుమారులు. వీరందరు కతూరా సంతతివారు.

5. అబ్రహాము తనకున్నదంతయు ఈసాకున కిచ్చెను.

6. అతడు తాను చనిపోవకమునుపే తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చెను. కుమారుడు ఈసాకునకు ఏ అంతరాయము కలుగకుండ వారిని తూర్పువైపుగా తూర్పుదేశమునకు పంపివేసెను.

7. చనిపోవునాటికి అబ్రహాము వయస్సు నూట డెబ్బది అయిదేండ్లు.

8. అతడు దీర్ఘకాలము జీవించి, పండుముసలితనమున రాలిపోయి, తన పితరుల యొద్దకు చేర్చబడెను.

9. అబ్రహాము కుమారులు ఈసాకు, యిష్మాయేలు అతనిని మమ్రేకు తూర్పున ఉన్న మక్ఫేలా గుహలో పాతి పెట్టిరి. ఆ గుహ ఉన్న భూమి తొలుత హిత్తియుడు, సోహరు కుమారుడైన ఎఫ్రోనునకు చెందినది.

10. అబ్రహాము ఆ పొలమును హిత్తియులనుండి కొనెను. అబ్రహామును, అతని భార్య సారాను అచ్చటనే పాతి పెట్టిరి.

11. అబ్రహాము చనిపోయిన పిదప దేవుడు ఈసాకును చల్లనిచూపు చూచెను. అతడు 'బేయెర్ లహాయిరోయి' బావియొద్ద స్థిరపడెను.

12. ఐగుప్తుదేశీయురాలు, సారా దాసియగు హాగారు అబ్రహామునకు కనిన యిష్మాయేలు వంశీ యుల వృత్తాంతమిది.

13. జన్మక్రమమును బట్టి యిష్మాయేలు కుమారుల పేరులివి: యిష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు.

14-15. అతని తరువాత కేదారు, అద్బేలు, మిబ్సము, మిష్మా, దుమా, మస్సా, హదాదు, తెమా, యాతూరు, నాఫీషు, కెద్మా అనువారు పుట్టిరి.

16. వీరు యిష్మాయేలు కుమారులు. వారు తమ గ్రామములకు, విడుదులకు తమ పేరులే పెట్టుకొనిరి. వీరు పండ్రెండుగురు వంశకర్తలై పండ్రెండుతెగలవారైరి.

17. యిష్మాయేలు నూటముప్పదియేడేండ్లు జీవించి మరణించెను. అతడు చనిపోయి తన పితరులవద్దకు చేర్చబడెను.

18. యిష్మాయేలు కుమారులు తమ ప్రజలకు దూరముగా హవీలా షూరుల నడుమనున్న దేశమున నివసించిరి. ఆ ప్రదేశము అస్సిరియాకు పోవు మార్గమున, ఐగుప్తునకు తూర్పున కలదు.

19. అబ్రహాము కుమారుడు ఈసాకు వృత్తాంతమిది.

20. నలువదియవయేట ఈసాకు రిబ్కాను పెండ్లియాడెను. ఆమె పద్దనారామునకు చెందిన అరమీయుడగు బెతూవేలు కూతురు, అరమీయుడగు లాబాను సోదరి,

21. రిబ్కా గొడ్రాలగుటచే ఆమె కొరకు ఈసాకు దేవుని వేడుకొనెను. దేవుడు అతని మనవిని వినెను. రిబ్కా గర్భవతియయ్యెను.

22. ఆమె గర్భమున ఉన్న శిశువులు ఒకరినొకరు గట్టిగా నెట్టుకొనిరి. అపుడామె “ఈ విధముగా జరిగినచో ఇక  నేను బ్రతికి ఏమి లాభము?” అనుకొని దేవుని సంప్రతింపబోయెను.

23. దేవుడు ఆమెతో ఇట్లనెను: “నీ గర్భమున రెండుజాతులు గలవు. పరస్పర వైరముగల రెండు జాతులు నీ గర్భమునుండి వెలువడును. ఒకజాతి రెండవజాతికంటె బలిష్ఠముగా ఉండును. పెద్దవాడు చిన్న వానికి దాసుడగును.”

24. నెలలు నిండినపిదప ఆమె గర్భమున కవల పిల్లలు ఉన్నట్లు తెలిసినది.

25. మొదట పుట్టినబిడ్డ ఎఱ్ఱగా నుండెను. రోమవస్త్రమువలె అతని ఒడలి యందంతట వెండ్రుకలు ఉండెను. అతనికి ఏసావు అను పేరు పెట్టిరి.

26. మొదటిబిడ్డ పుట్టిన వెంటనే అతని మడమపట్టుకొని రెండవ బిడ్డ కూడ పుట్టెను. కావున రెండవ వానికి యాకోబు అను పేరు పెట్టిరి. వారిరువురు పుట్టినపుడు ఈసాకు వయస్సు అరువదిది యేండ్లు.

27. పిల్లలిద్దరు పెరిగి పెద్దవారైరి. ఏసావు వేట యందు నేర్పరియై అరణ్యవాసి అయ్యెను. యాకోబు సౌమ్యుడై గుడారములకు అంటిపెట్టుకొని ఉండెను.

28. ఎల్లప్పుడు తనకు జింకమాంసమును తెచ్చి యిచ్చుచున్న ఏసావుపట్ల ఈసాకునకు అనురాగము ఎక్కువ. కాని రిబ్కాకు యాకోబుపట్ల ఆదరము మెండు.

29. ఒకనాడు యాకోబు పులుసు చేసెను. అప్పుడే ఏసావు అలసిసొలసి పొలమునుండి వచ్చెను.

30. అతడు యాకోబుతో “నేను అలసిపోతిని. ఆ ఎర్రని పులుసును కొంచెము త్రాగనిమ్ము” అనెను. కావుననే అతనికి ఎదోము అనుపేరు వచ్చినది.

31. దానికి యాకోబు “జ్యేష్ఠునిగా నీకున్న హక్కులను నాకు నేడు అమ్మివేయుము” అనెను.

32. ఏసావు "నేను మృత్యు ముఖమున ఉన్నాను. ఇక ఈ జ్యేషాధికారము వలన నాకేమి మేలు కలుగును?” అనెను.

33. దానికి యాకోబు “అది కుదరదు. ముందు దానిని వదలు కొన్నట్లు ప్రమాణముచేయుము” అనెను. ఏసావు ప్రమాణముచేసి తన జ్యేషాధికారమును యాకోబునకు సంక్రమింపజేసెను.

34. అప్పుడు యాకోబు ఏసావునకు రొట్టెను, చిక్కుడుకాయల పులుసును వడ్డించెను. ఏసావు తిని, త్రాగి, లేచి వెళ్ళిపోయెను. ఈ విధముగా ఏసావు జ్యేషాధికారమును తృణీకరించెను. 

 1. అబ్రహాము కాలములో ఒక కరువు వచ్చెను గదా! అదిగాక మరియొక కరువు దేశమున తాండ వించెను. ఈసాకు ఫిలిస్తీయులరాజు అబీమెలెకు దగ్గరకు వెళ్ళెను. అప్పుడు ఆరాజు గెరారులో ఉండెను.

2. దేవుడు ఈసాకునకు ప్రత్యక్షమై "ఐగుప్తు దేశమునకు వెళ్ళకుము. నేను చెప్పినచోట ఉండుము.

3. ఈ దేశమునందే నివసింపుము. నేను నీకు చేదోడుగా ఉందును. నిన్ను దీవింతును. నీకు, నీ సంతతికి ఈ భూములనిత్తును. ఈ విధముగా నేను నీ తండ్రి అబ్రహామునకిచ్చిన మాట నెరవేర్చుకొందును.

4. నీ సంతతివారిని ఆకాశమందలి నక్షత్రములవలె లెక్కకు మిక్కుటమగునట్లు చేయుదును. ఈ భూములన్నియు వారికి పంచి పెట్టుదును. భూలోకమందలి సకల జాతులవారు నీ సంతతిద్వార దీవెనలు పొందుదురు.

5. అబ్రహాము నామాట వినెను. నా ఆజ్ఞలను శిరసావహించెను. అతడు నేను చేసిన కట్టడలు మీర లేదు. నేను కావించిన నియమములను ఉల్లంఘింప లేదు. కావుననే నిన్ను దీవించెదను” అనెను.

6. దేవుని మాటమీద ఈసాకు గెరారులో నివసించెను. .

7. ఆ దేశీయులు తన భార్యను గూర్చి అడుగగా ఈసాకు “ఆమె నా సోదరి” అని చెప్పెను. రిబ్కా తన భార్య అని చెప్పుటకు అతడు భయపడెను. రిబ్కా అందగత్తె. ఆమెవలన తనకు చావు మూడునని ఈసాకు తలంచెను.

8. వారు అక్కడ చాలకాలము నివసించిరి. ఒకనాడు ఫిలిస్తీయులరాజు అబీమెలెకు గవాక్షము నుండి ఈసాకు రిబ్కాతో సరసమాడుటచూచెను.

9. అతడు ఈసాకును పిలిపించి “ఆమె నీ భార్యయే! అవునా? నీ ప్రాణాలమీదికి ఏమొచ్చి ఆమె నా సోదరియని చెప్పితివి?” అనెను. ఈసాకు “ఆమెవలన నాకు ప్రాణాపాయము కలుగునని తలంచి ఆ విధముగా చెప్పితిని” అనెను,

10. అంతట అబీమెలెకు “ఎంత పనిచేసితివి? ఈ దేశప్రజలలో ఎవడో ఒకడు ఏ ఆటంకము లేకుండా ఆమెను కూడెడివాడు. అప్పుడు నీవేమో నింద మానెత్తికి చుట్టెడివాడవు” అనెను.

11. ఇట్లని అబీమెలెకు ఈసాకును గాని అతని యిల్లాలిని గాని ముట్టుకొన్న వారికి చావుమూడునని తన ప్రజలకు హెచ్చరిక చేసెను.

12. ఈసాకు అక్కడ పొలమున విత్తగా ఆ సంవత్సరమే నూరురెట్ల పంట చేతికి వచ్చెను. దేవుడు అతనిని దీవించెను.

13. అతడు క్రమక్రమముగా అభివృద్ధిచెంది చివరకు మహాసంపన్నుడయ్యెను.

14. అతని గొఱ్ఱెలు గొడ్లు మందలుమందలుగా పెరిగెను. అతనికి కావలసినంతమంది బానిసలుండిరి. అతని సిరిని చూచిన ఫిలిస్తీయులకు కన్నుకుట్టెను.

15. వారు ఈసాకు తండ్రి అబ్రహాము కాలమున బానిసలు త్రవ్విన బావులన్నిటిని మన్నుపోసి పూడ్చివేసిరి.

16. అబీమెలెకు ఈసాకుతో “నీవు మాకంటె అధిక శక్తిమంతుడవైతివి. ఇక ఇక్కడనుండి వెళ్ళిపో!” అనెను.

17. ఈసాకు ఆ చోటువదలి, గెరారులోయలో గుడారములు వేసికొని, అక్కడనే నివసించెను.

18. ఫిలిస్తీయులు బావులు వట్టిపోవునట్లు చేసిరిగదా! కనుక, ఈసాకు అబ్రహాము కాలములో త్రవ్విన బావులన్నింటిని తిరిగి త్రవ్వించి వాటికి తన తండ్రి పెట్టిన పేరులనే పెట్టెను.

19. ఈసాకు బానిసలు ఆ లోయలో బావిని త్రవ్వగా మంచి జలపడెను.

20. కాని గెరారు గొఱ్ఱెల కాపరులువచ్చి, ఆ నీళ్ళు మావియనుచు ఈసాకు గొఱ్ఱెలకాపరులతో వాదనకు దిగిరి. వారు తనతో జగడమాడుటచే ఈసాకు ఆ బావికి “ఎసెకు" అను పేరు పెట్టెను.

21. ఈసాకు పనివారు మరియొక బావిని త్రవ్విరి. ఆ గొఱ్ఱెల కాపరులు దానికొరకును పోట్లాడిరి. కావున ఈసాకు ఆ బావికి “సిత్నా" అను పేరు పెట్టెను.

22. అతడు అక్కడినుండి కదలి పోయి మరియొక బావిని త్రవ్వించెను. దానికి ఏ జగడము లేదు. కావున ఈసాకు ఆ బావికి “రెహోబోతు” అను పేరు పెట్టి “ఈనాటికి దేవుడు మాకు కావలసినంతచోటు చూపించెను. మేమిక ఈ దేశమున అభివృద్ధి చెందగలము” అనెను.

23. ఈసాకు అక్కడనుండి బేరైబాకు వెళ్ళెను.

24. ఆ రాత్రి దేవుడు అచట ప్రత్యక్షమై అతనితో: “నేను నీ తండ్రి అబ్రహాము కొలిచిన దేవుడను. భయపడకుము. నేను నీకు చేదోడుగా ఉందును. నా దాసుడు అబ్రహామును బట్టి నిన్ను దీవింతును. నీ సంతతిని విస్తరిల్లచేయుదును.” అని అనెను.

25. ఈసాకు అక్కడ ఒక బలిపీఠమును నిర్మించెను. దేవుని ఆరాధించెను. అక్కడనే గుడారము వేసికొనెను. అతని బానిసలు అక్కడ కూడ ఒక బావిని త్రవ్విరి.

26. అబీమెలెకు తన సలహాదారుడు అయిన అహూసతుతో, సేనాధిపతి ఫీకోలుతో గెరారు నుండి ఈసాకు కడకు వచ్చెను.

27. ఈసాకు వారితో “మీరు ఇక్కడికి ఏలవచ్చితిరి? నామీద పగపట్టి నన్ను తరిమివేసితిరే!” అనెను.

28. అంతట వారు “దేవుడు నీకు చేదోడువాదోడుగా ఉండుట మేము మా కన్నులార చూచితిమి. మనము ప్రమాణ బద్దులమై ఒక ఒడంబడిక చేసికొనుట మంచిదని తలంచితిమి.

29. మేము నిన్ను తాకనైనతాకలేదు. నీకు మేలుతప్ప కీడన్నది చేయలేదు. నిశ్చింతగా నీదారిన నిన్ను పోనిచ్చితిమి. నీకు దైవబలము కలదు. మేము నీకు కీడుచేయనట్టే, నీవును మాకు ఎట్టికీడును చేయనని మాట ఇమ్ము” అనిరి.

30. అంతట ఈసాకు వారికి విందుచేసెను. వారు తిని త్రాగిరి.

31. వారు ప్రొద్దుననే లేచి పరస్పరము ప్రమాణములు చేసికొనిరి. పిదప ఈసాకు వారిని సాగనంపగా వారు మిత్ర భావముతో వెళ్ళిపోయిరి.

32. ఆనాడే ఈసాకు బానిసలువచ్చి తాము త్రవ్విన క్రొత్తబావిని గూర్చి చెప్పిరి. “బావిలో నీళ్ళు పడినవి” అని చెప్పిరి.

33. ఈసాకు ఆ బావికి షేబా అను పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడ ఆ నగరమును 'బెర్షెబా" అను పేరిట పిలుచుచున్నారు.

34. నలువదియవ యేట ఏసావు యూదితును, బాసెమతును పెండ్లియాడెను. యూదితు, హిత్తీయుడగు బీరీ కుమార్తె, బాసెమతు హిత్తీయుడగు ఏలోను కుమార్తె.

35. ఈ ఇరువురివలన ఈసాకునకును, రిబ్కాకును తీవ్ర మనస్తాపము కలిగెను. 

 1. ఈసాకు పండుముదుసలి అయ్యెను. చూపు ఆననంతగా అతని కన్నులు మసకబడెను. అతడు “కుమారా!" అని పెద్ద కొడుకు ఏసావును పిలిచెను. ఏసావు “చిత్తము తండ్రీ!” అనెను.

2. ఈసాకు అతనితో “నాయనా! వినుము. నేను కాటికి కాళ్ళు చాచుకొనియుంటిని. ఎప్పుడు చావువచ్చునో నాకు తెలియదు.

3. నీ వేటపనిముట్లు, అమ్ములపొది, విల్లుతీసికొని అడవికిపోయి వేటాడి జింకమాంసము తీసికొనిరా!

4. దానిని నాకు రుచించునట్లుగా వండి వడ్డింపుము. నేను తృప్తిగా భుజించి నిన్ను దీవించి కన్నుమూసెదను” అనెను.

5. ఈసాకు తన కుమారుడు ఏసావుతో మాట్లాడినదంతయు రిబ్కా వినుచుండెను. వేటాడి జింకమాంసము తెచ్చుటకై ఏసావు అడవికి వెళ్ళెను.

6. అప్పుడు రిబ్కా యాకోబుతో “మీ తండ్రి మీ అన్న ఏసావుతో మాట్లాడుట నేనువింటిని.

7. 'జింక మాంసము తెచ్చి నాకు రుచించునట్లు వండిపెట్టుము. నేనుతిని, కన్ను మూయకముందే దైవసన్నిధిని నీకు దీవెనలు పలుకుదును' అని మీ తండ్రి ఏసావుతో చెప్పెను.

8. నాయనా! నా మాటవిని నేను ఆజ్ఞాపించి నట్లు చేయుము.

9. మందకుపోయి రెండు మంచి మేకపిల్లలను తీసికొనిరమ్ము. వానితో మీ తండ్రికి రుచించు భోజనము సిద్ధముచేయుదును.

10. నీవు దానిని మీ తండ్రి కడకు తీసికొనిపొమ్ము. మరణింపక ముందే దానిని ఆరగించి మీ తండ్రి నీకు దీవెనలు పలుకును” అనెను.

11. యాకోబు రిబ్కాతో “మరి అన్నయ్య ఒడలంతా వెండ్రుకలపుట్ట, నా ఒడలేమో నున్నగా ఉన్నది గదా!

12. ఒకవేళ తండ్రి నన్ను తడిమిచూచిన ఏమగును? నేను తనను వంచించినట్లు తెలిసికొనడా? దీవెనలమాట దేవుడెరుగు. తండ్రికోపము లేనిపోని శాపమై నా మెడకు చుట్టుకొనునేమో?” అనెను.

13. అతని తల్లి “ఆ శాపమేదో నాకే తగులనిమ్ము. నీవు మాత్రము నేను చెప్పినట్లు చేయుము. పోయి మేకపిల్లలను తీసికొనిరా!” అనెను.

14. యాకోబు పోయి మేకపిల్లలను తెచ్చి తల్లికిచ్చెను. వానితో ఆమె అతని తండ్రికి రుచించు భోజనము తయారుచేసెను.

15. పెద్ద కుమారుడు ఏసావు కట్టుకొను మేలి ఉడుపులు ఇంటిలో తనదగ్గరనే ఉండుటచే, రిబ్కా వానిని బయటకి తీసి, ధరించుటకై చిన్నకుమారునకు ఇచ్చెను.

16. చంపిన మేకపిల్లలతోళ్ళతో యాకోబు చేతులను, నున్ననిమెడను కప్పెను.

17. తాను సిద్ధముచేసిన రుచికరమాంసమును, రొట్టెను యాకోబు చేతికిచ్చెను.

18. యాకోబు తండ్రి కడకువచ్చి "తండ్రీ” అని పిలిచెను. ఈసాకు "కుమారా! ఎవరు నీవు?” అని అడిగెను.

19. యాకోబు తండ్రితో “నేను ఏసావును. నీ పెద్దకుమారుడను. నీవు చెప్పినట్టు చేసితిని. లేచి కూర్చుండుము. నేను తెచ్చిన జింక మాంసమును తినుము. తిని దీవెనలు పలుకుము” అనెను.

20. అంతట ఈసాకు “ఇంత తొందరగా మాంసము నీ కెట్లు దొరికినది?” అని అడిగెను. దానికి యాకోబు “నీ దేవుడైన ప్రభువే దానిని నాయొద్దకు పంపెను” అనెను.

21. ఈసాకు యాకోబుతో “నాయనా! దగ్గరకు రా! నిన్ను తడిమిచూచి నీవు ఏసావువో కావో తెలిసి కొందును” అనెను.

22. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్ళెను. ఈసాకు అతనిని తడిమిచూచెను. “గొంతు యాకోబు గొంతువలె ఉన్నదిగాని, చేతులు మాత్రము ఏసావు చేతులే” అనెను.

23. యాకోబు చేతులుగూడ ఏసావు చేతులవలె వెండ్రులకతో నిండియుండుటచే ఈసాకు అతనిని గుర్తుపట్టలేకపోయెను. కావున అతనిని దీవింపనెంచి

24. “నీవు నిజముగా నా కుమారుడు. ఏసావువేనా?” అని అడిగెను. దానికి యాకోబు “అవును నేను ఏసావునే” అనెను.

25. అంతట ఈసాకు “తిని దీవెనలు పలుకుదును. ఏదీ! నీవు తెచ్చిన జింకమాంసమును తీసికొనిరా!” అనెను. అతడు తెచ్చినప్పుడు దానిని తినెను. యాకోబు ద్రాక్షసారాయమును గూడ అందీయగా తండ్రి త్రాగెను.

26. అతడు యాకోబుతో “నాయనా! దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుము” అనెను.

27. యాకోబు దగ్గరకు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకొనెను. ఈసాకు యాకోబు ధరించిన దుస్తులను వాసన చూచి అతనిని దీవించుచు ఇట్లు పలికెను. “ఇదిగో! నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావివలె ఉన్నది.

28. దేవుడు ఆకాశమంచును కురియించునుగాక! నీ చేలకు చేవనిచ్చునుగాక! ధాన్యమును ద్రాక్షసారాయమును సమృద్దిగా నీకు సమకూర్చునుగాక!

29. ఎల్లజనులు నీకు సేవకులగుదురుగాక! సకలజాతులు నీకు తల ఒగ్గునుగాక! నీవు నీ సోదరులను పాలింతువుగాక! నీ తల్లి బిడ్డలు నీకు సాగిలబడుదురుగాక! నిన్ను శపించినవారు శపింపబడుదురుగాక! నిన్ను దీవించినవారు దీవింపబడుదురుగాక!"

30. ఈసాకు యాకోబును దీవించుట ముగించెను. అతడు తండ్రియగు ఈసాకు సమ్ముఖము నుండి నాలుగడుగులు వేసి వెళ్ళెనో లేదో ఇంతలో అతని అన్న ఏసావు వేటనుండి తిరిగివచ్చెను.

31. అతడు కూడ రుచికర భోజనమును సిద్ధముచేసి తండ్రికి తెచ్చెను. అతడు “తండ్రీ! లేచి కూర్చుండుము. నేను తెచ్చిన జింక మాంసమును తిని నాకు దీవెనలు పలుకుము” అనెను.

32. అతని తండ్రి ఈసాకు “నాయనా! నీవు ఎవరవు?” అని అడిగెను. అతడు “నేను ఏసావును, నీ పెద్దకొడుకును” అనెను.

33. ఆ మాటలు వినగనే ఈసాకు ఒళ్ళు కంపించెను. అతడు "అయినచో వేటాడి జింకమాంసమును తెచ్చిన వారు ఎవరు? నీవు రాకముందే దానినెల్లతింటిని. తిని అతనిని దీవించితిని. ఆ దీవెనకు ఇక తిరుగులేదు” అనెను.

34. తండ్రి చెప్పినమాటలు విని ఏసావు గుండె బద్దలగునట్లుగా వెఱ్ఱికేకవేసి "తండ్రీ! నన్నుగూడ దీవింపుము” అని అడిగెను.

35. కాని ఈసాకు అతనితో “నీ సోదరుడు కపటోపాయముపన్ని వచ్చి నీ బదులుగా తాను దీవెనలు పొందెను” అనెను.

36. అంతట ఏసావు “అతనికి యాకోబు అని సార్థకమైన పేరే పెట్టిరి. అతడు నన్ను మోసగించుట యిది రెండవసారి. అప్పుడేమో నా జ్యేషాధికారమును అపహరించెను. ఇప్పుడేమో నా బదులుగా దీవెనలు పొందెను. తండ్రీ! నాపాలిట ఏయొక్క దీవెనయు మిగులలేదా?” అని అడిగెను.

37. ఈసాకు “నాయనా! అతనిని నీకు అధిపతిగా నియమించితిని. అతని తోడబుట్టిన వారందరిని అతనికి బానిసలనుగా చేసితిని. నాయనా! ధాన్యమును, ద్రాక్షరసమును ఇచ్చి అతనిని సమృద్ధిగా దీవించితిని. నీకు మేలు చేయుటకు ఇంక నాదగ్గర ఏమి మిగిలినది?” అనెను.

38. ఏసావు “నా తండ్రీ! నీ వద్ద ఒక దీవెనయే ఉన్నదా? నన్నుకూడ దీవింపవా?” అని ఈసాకును బతిమాలుకొనుచు గుండె చెదరునట్లు బిగ్గరగా ఏడ్చెను.

39. అప్పుడు అతని తండ్రి ఈసాకు ఇట్లనెను: “నీవు భూసారము కొరవడినచోట ఆకాశపుమంచు కురియనిచోట వసింతువు.

40. నీవు ఖడ్గముచేపట్టి బ్రతుకుదువు. నీ తమ్ముని సేవింతువు. కాని నీవు తిరుగుబాటు చేసిననాడు నీ మెడమీదనుండి అతని కాడివిరిచెదవు."

41. తన బదులుగా దీవెనలు పొందినందులకు ఏసావు యాకోబుమీద పగపట్టెను. అతడు “తండ్రి చావును తలంచుకొని విలపించు దినములు సమీపించుచున్నవి. ఆ తరువాత యాకోబు ప్రాణము తీసెదను” అని తనలో తాననుకొనెను.

42. పెద్ద కొడుకు ఏసావు ఆలోచనలు రిబ్కాకు తెలిసెను. ఆమె చిన్నకొడుకు యాకోబును పిలిచి “మీ అన్న ఏసావు నిన్ను చంపి పగదీర్చుకొనగోరుచున్నాడు.

43. నాయనా! నా మాట చెవినిబెట్టుము. తప్పించుకొని, హారానులోనున్న నా సోదరుడగు లాబాను దగ్గరకు పొమ్ము.

44. నీ అన్న కోపము చల్లారువరకు కొన్నాళ్ళు అక్కడనే ఉండుము.

45. కోపము పూర్తిగా తగ్గి, అతడు నీవు చేసినదంతయు మరచిపోయినప్పుడు, మనుష్యులను పంపి నిన్ను పిలిపించుకొందును. ఒక్కనాడే మీ ఇద్దరిచావును నేను చూడజాలను” అని చెప్పెను.

46. ఆ తరువాత రిబ్కా ఈసాకుతో “ఏసావు పెండ్లాడిన ఈ హితీయుల పిల్లలు నా ప్రాణాలు తోడివేయుచున్నారు. యాకోబుకూడ ఈ జాతిపిల్లలను పెండ్లియాడినచో, ఇక నేను చచ్చినను, బ్రతికినను సమానమే” అనెను. 

 1. ఈసాకు యాకోబును పిలిపించి, దీవించి అతనికి బుద్ధులు చెప్పుచు “ఈ కనానీయుల పిల్లలలో ఎవ్వతెను పెండ్లాడకుము.

2. పద్దనారాములో ఉన్న వాడును, నీ తల్లికి తండ్రియగు బెతూవేలు ఇంటికి వెంటనే వెళ్ళుము. అక్కడ నీ మేనమామ లాబాను పిల్లలలో ఒకపిల్లను పెండ్లియాడుము.

3. సర్వశక్తి మంతుడగు దేవుడు నిన్ను దీవించి నీ ఇల్లు పదిండ్లు చేయును. అనేక జాతులుగా రూపొందునట్లు నీ సంతతిని విస్తరిల్లచేయును.

4. దేవుడు అబ్రహామును దీవించినట్లే నిన్ను నీ బిడ్డలను దీవించునుగాక! దేవుడు అబ్రహామునకు ప్రసాదించిన ఈ దేశము. నేడు నీవు పరదేశిగా బ్రతుకుచున్న ఈదేశము, నీ వశమగును గాక!” అనెను.

5. ఈ మాటలు చెప్పి ఈసాకు యాకోబును పద్దనారాములో ఉన్న లాబాను కడకు పంపెను. లాబాను అరమీయుడగు బెతూవేలు కుమారుడును, యాకోబు ఏసావుల తల్లియగు రిబ్కా సోదరుడు.

6. ఈసాకు యాకోబును దీవించి, పెండ్లి చేసి కొనుటకై పద్దనారామునకు పంపెననియు, దీవించునపుడు కనానీయుల పిల్లలను పెండ్లియాడవలదని హెచ్చరించెననియు

7. యాకోబు తల్లిదండ్రులమాట తలదాల్చి పద్దనారామునకు వెళ్ళెననియు ఏసావునకు తెలిసెను.

8. తన తండ్రికి కనానీయుల పిల్లలనిన గిట్టదని గ్రహించి,

9. ఏసావు యిష్మాయేలు దగ్గరకు వెళ్ళెను. ఇదివరకున్న భార్యలకు తోడు, అబ్రహాము కుమారుడగు యిష్మాయేలు కుమార్తెయు, నెబాయోతు సోదరియునైన మహలతునుకూడ పెండ్లియాడెను.

10. యాకోబు బేర్పెబా దాటి, హారాను వైపు వెళ్ళు బాటపట్టెను.

11. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయెను. ఆచోట నున్న రాతిని తలదిండుగా చేసికొని, నిద్రపోవుటకు నడుము వాల్చెను.

12. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను. దాని చివర ఆకాశమును అంటు చుండెను. దేవదూతలు నిచ్చెనమీదుగా ఎక్కుచును దిగుచును ఉండిరి.

13. అపుడు యావే దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో “నేను ప్రభుడను, నీ పితామహులగు అబ్రహామునకు, ఈసాకునకు నేనే దేవుడను. నీవు పండుకొనిన ఈ ప్రదేశమును నీకును నీ సంతతికిని అప్పగింతును.

14. నీ సంతతి వారు భూరేణువులవలె అసంఖ్యాకముగా పెరిగిపోయి, నేల నాలుగుచెరగుల వ్యాపింతురు. నీద్వారా, నీ సంతానము ద్వారా భూమండలమందలి సకలవంశముల వారు దీవెనలు బడయుదురు.

16. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చెదను. నేను చెప్పినదంతయు చేయువరకు నిన్ను వదలను” అనెను.

16. యాకోబు మేల్కొని “ఇక్కడ దేవుడుండుట నిజము. ఇది నాకు తెలియదుగదా!” అని అనుకొనెను.

17. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు “ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది! ఈ తావు దైవనిలయము. ఇది పరలోక ద్వారము” అనెను.

18. యాకోబు పెందలకడలేచెను. తలదిండుగా చేసికొనిన రాతిని తీసి, స్తంభముగా నాటెను. దానిమీద తైలముపోసి, దానిని దేవునికి అంకితము చేసెను.

19. ఆ ప్రదేశమునకు బేతేలు' అను పేరు పెట్టెను. ఇంతకుముందు ఆ నగరము పేరు లూజు.

20. తరువాత యాకోబు “దేవుడు నా వెంట నంటి, ఈ ప్రయాణములో నన్ను కాపాడినయెడల, ఏ యిబ్బంది కలుగకుండ నాకు తినుటకు కూడు, కట్టుకొనుటకు గుడ్డలు సమకూర్చినయెడల,

21. నేను నా తండ్రి ఇంటికి సమాధానముతో తిరిగి వెళ్ళిన యెడల, ఆ ప్రభువే నా దేవుడగును.

22. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక! నీవు నాకు ఇచ్చిన దానిలో పదవ వంతు తిరిగి నీకే చెల్లింతును” అని మ్రొక్కుకొనెను. 

 1. యాకోబు ప్రయాణము సాగించి తూర్పు జాతులవారి దేశము చేరెను.

2. అతడు అక్కడి పొలములో ఒక బావిని చూచెను. ఆ బావి ప్రక్క గొఱ్ఱెలమందలు మూడు పండుకొనియుండెను. గొఱ్ఱెలమందలకు ఆ బావినీళ్ళు పెట్టుదురు. ఆ బావి మీద ఒక పెద్ద రాయి ఉండెను.

3. మందలన్ని ఆ బావి దగ్గర చేరినప్పుడు కాపరులు రాతిని దొర్లించి వానికి నీళ్ళు పెట్టుదురు. తరువాత రాతిని తిరిగి బావి పైకి దొరలింతురు.

4. యాకోబు “అన్నలార! మీది ఏ ఊరు?” అని వారినడిగెను. వారు “మాది హారాను” అని బదులుచెప్పిరి.

5. అతడు “మీరు నాహోరు కుమారుడగు లాబానును యెరుగుదురా?” అని అడిగెను. వారు “మేమెరుగుదుము” అని చెప్పిరి.

6. “ఆయన క్షేమముగా ఉన్నాడా?” అని యాకోబు అడిగెను. వారు “ఆయన క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో! ఆయన కూతురు రాహేలు మందవెంట వచ్చుచున్నది!” అని చెప్పిరి.

7. యాకోబు “ఇంకను చాల ప్రొద్దున్నది. మందలను ప్రోగుచేసి పెరడుకు తోలుటకు ఇంకను వేళగాలేదు. గొఱ్ఱెలకు నీళ్ళు పెట్టి, తిరిగి తోలుకొనిపోయి మేపరాదా?” అని వారితో అనేను.

8. “మందలన్నియు వచ్చిన పీదప రాతిని కదలించిన తరువాతగాని గొఱ్ఱెలకు నీళ్ళు పెట్టము” అని వారు బదులు చెప్పిరి.

9. అతడు ఇంకను వారితో మాట్లాడుచుండగనే రాహేలు తన తండ్రిమందను తోలుకొనివచ్చెను. ఆమెయే తన తండ్రిమందను మేపుచుండెను.

10. గొఱ్ఱెలమందతో వచ్చిన తన మేనమామ కూతురు రాహేలును చూచి యాకోబు బావి దగ్గరకు పోయి దానిమీది రాతిని దొరలించి, లాబాను మందకు నీళ్ళు పెట్టెను.

11. అతడు రాహేలును ముద్దు పెట్టుకొని, ఆనందముతో బిగ్గరగా ఏడ్చెను

12. “మీ తండ్రికి అయినవాడను. రిబ్కా కుమారుడను” అని యాకోబు ఆమెతో చెప్పెను. ఆమె ఆనందముతో పరుగెత్తు కొనిపోయి తండ్రితో జరిగినదంతయు చెప్పెను.

13. మేనల్లుడు యాకోబు వచ్చెనన్నమాట విని లాబాను పరుగెత్తుకొని ఎదురువచ్చెను. యాకోబును కౌగలించుకొని ముద్దాడెను. సాదరముగా ఇంటికి తోడ్కొని పోయెను. యాకోబు లాబానుకు జరిగిన విషయములన్నియు పూసగుచ్చినట్లు చెప్పెను.

14. చివరివరకు విని లాబాను “నీవు నా రక్తమాంసములు పంచుకొని పుట్టినవాడవే, ఏ సందేహమును లేదు” అని అనెను. యాకోబు ఒక నెలరోజులపాటు అతని యొద్ద ఉండెను.

15. లాబాను యాకోబుతో “నీవు నాకు బంధువుడవే. అంతమాత్రాన నీవు నాకు ఊరకనే ఊడిగము చేయవలయునా? నీకు ఎంతజీతము కావలయునో చెప్పుము” అనెను.

16. లాబానుకు ఇద్దరు కుమార్తెలు కలరు. వారిలో పెద్దకూతురు పేరు లేయా, చిన్నకూతురు పేరు రాహేలు.

17. లేయా బలహీనమైన కండ్లుకలది. రాహేలు అంగసౌష్టవము గల రూపవతి.

18. యాకోబు రాహేలును ప్రేమించెను. అతడు లాబానుతో “నీ చిన్నకూతురు రాహేలుకొరకు నేను ఏడేండ్లు నీకు ఊడిగము చేయుదును” అనెను.

19. దానికి లాబాను “ఆమెను ఎవనికో ఇచ్చుట కంటే నీకిచ్చుటయేమేలు. నా యొద్దనే ఉండుము” అనెను.

20. యాకోబు రాహేలుకొరకు ఏడేండ్లు కొలువు చేసెను. కాని అతనికి ఏడేండ్లు ఏడు గడియలవలె గడచిపోయెను. అతనికి రాహేలుపట్ల ఉన్న వలపు అట్టిది.

21. అప్పుడు యాకోబు లాబానుతో “పెట్టిన గడువు ముగిసినది. నా రాహేలును నాకు అప్ప గింపుము. మేమిద్దరమును కలిసి కాపురముచేసి కొందుము” అనెను.

22. అంతట లాబాను అక్కడి వారందరిని పిలిపించి విందుచేసెను.

23. చీకటి పడిన తరువాత లాబాను తన కుమార్తెయైన లేయాను యాకోబునొద్దకు తీసుకొనిపోగా, యాకోబు లేయాతో శయనించెను.

24. అప్పుడే లాబాను జిల్పా అను బానిస పిల్లను లేయాకు దాసిగా ఇచ్చివేసెను.

25. తెల్లవారిన తర్వాత ఆ రాత్రి తాను కూడిన ఆమె లేయా అని యాకోబునకు తెలిసెను. అతడు లాబానును “ఇదేమిపని? నేను కొలువు చేసినది రాహేలుకొరకు కదా? నన్ను మోస గించితివేల?” అని అడిగెను.

26. అంతట లాబాను “పెద్దపిల్లకంటె ముందు చిన్నపిల్లకు పెండ్లి చేయుట మా దేశ ఆచారముగాదు.

27. ఈ ఏడురోజుల ఉత్సవము జరిగిపోనిమ్ము. రాహేలును గూడ నీకిచ్చి పెండ్లి చేయుదును. కాని రాహేలును ఇచ్చినందులకు నాకింకను ఏడేండ్లు ఊడిగము చేయవలయును” అనెను.

28. దానికి యాకోబు ఒప్పుకొని, ఏడు రోజుల ఉత్సవము జరుగనిచ్చెను. తరువాత లాబాను రాహేలును యాకోబునకిచ్చి పెండ్లి చేసెను.

29. బిల్హా అను బానిస పిల్లను గూడ తన కుమార్తె రాహేలునకు దాసిగా ఇచ్చివేసెను.

30. యాకోబు రాహేలుతో శయనించెను. అతడు లేయాకంటెను మిక్కుటముగా రాహేలును ప్రేమించెను. మరి ఏడేండ్లు యాకోబు లాబానునకు సేవచేసెను.

31. లేయా భర్త ప్రేమకు నోచుకొనకపోవుట చూచి దేవుడు ఆమెను సంతానవతిగా చేసెను. రాహేలు గొడ్రాలైయుండెను.

32. లేయా చూలాలై కొడుకును కనెను. ఆమె “దేవుడు నా బాధను కనులార చూచెను. ఇప్పుడైన నాభర్త నన్ను ప్రేమించునుగదా” అని అనుకొని బిడ్డకు రూబేను' అను పేరు పెట్టెను.

33. ఆమె మరల గర్భవతియై కుమారునికనెను. "నేను నా నాథుని అనురాగమునకు దూరమైతినని విని దేవుడు నాకు ఈ బిడ్డను గూడ ఇచ్చెను" అని ఆమె అనుకొనెను. కొడుకునకు షిమ్యోను అనుపేరు పెట్టెను.

34. లేయా మరల గర్భముదాల్చి కుమారుని కనెను. ఆమె “నేను నా మగనికి ముగ్గురు కుమారులను కంటిని. ఇక ఆయన నాకు అంటుకొనియుండును” అని అనుకొని మూడవ కుమారునకు లేవి' అను పేరు పెట్టెను.

35. నాలుగవమారు కూడ లేయా గర్భవతియై కుమారుని కనెను. ఆమె “నేనిక దేవుని స్తుతింతును” అని అనుకొని అతనికి యూదా అను పేరు పెట్టెను. తరువాత ఆమెకు కానుపు ఉడిగెను. 

 1. తాను యాకోబునకు పిల్లలను కనక పోవుటచే రాహేలు తన సోదరిని చూచి కన్నులలో నిప్పులు పోసికొనెను. ఆమె యాకోబుతో “నాకు పిల్లలను కలిగింతువా? లేక నన్ను చావమందువా?” అనెను.

2. యాకోబునకు అరికాలిమంట నడినెత్తి కెక్కెను. అతడు రాహేలుతో “నీ కడుపున కాయ కాయకుండునట్లు చేసినది దేవుడు. నేనేమైనా ఆయన స్థానమున ఉంటినా?” అనెను.

3. అంతట ఆమె అతనితో "ఇదిగో నా దాసి బిల్హా ఉన్నదికదా! నీవు దానితో శయనింపుము. అది నా బదులుగా బిడ్డలను కనును. ఆమెవలన నేనుగూడ పిల్లలతల్లిని అగుదును” అనెను.

4. ఇట్లని ఆమె దాసియైన బిల్హాను అతనికి భార్యగా జేసెను. యాకోబు ఆమెతో శయనించెను.

5. బిల్హా గర్భవతియై యాకోబునకు ఒక పుత్రుని కనెను.

6. రాహేలు “దేవుడు నావైపు మొగ్గి తీర్పుచేసెను. నా మొరాలకించి నాకు కుమారుని ప్రసాదించెను” అనుకొని అతనికి దాను అను పేరు పెట్టెను.

7. రాహేలు దాసి బిల్హా మరల గర్భవతియై యాకోబునకు మరల ఒక కొడుకుని కనెను.

8. అంతట రాహేలు “మా అక్కతో బాగుగా పోరాడితిని చివరకు నేనే నెగ్గితిని” అనుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.

9. లేయా తన కడుపు పండుటలేదని తలంచి దాసియయిన జిల్పాను తీసికొనిపోయి యాకోబునకు భార్యగా చేసెను.

10. జిల్పా యాకోబునకు ఒక కొడుకుని కనెను.

11. అదృష్టము కలసివచ్చినదను కొని లేయా అతనికి గాదు అను పేరు పెట్టెను.

12. లేయా దాసియగు జిల్పా యాకోబునకు మరొక కొడుకుని కనెను.

13. అంతట లేయా "నా భాగ్యమే భాగ్యము! స్త్రీలు అదృష్టవతి అని నన్నునెత్తిన బెట్టు కొందురు” అనుకొని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.

14. గోధుమపంట కోతకు వచ్చినపుడు రూబేను వెళ్ళిపొలములో "పుత్రదాత” వృక్షము పండ్లు చూచెను. వాటిని కోసికొని వచ్చి తల్లికిచ్చెను. కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్నింటి నిమ్మని రాహేలు లేయాను అడిగెను.

15. దానికి లేయా “నా, మగనిని కొంగున కట్టుకొంటివే! అది చాలక నా కుమారుడు తెచ్చిన 'పుత్రదాత' పండ్లనుకూడ అడుగుచుంటివా?” అనెను. అంతట రాహేలు “నీ కుమారుడు తెచ్చిన పండ్ల నిచ్చెదవేని నీవు ఈ రాత్రి యాకోబుతో శయనింప వచ్చును” అని పలికెను.

16. ప్రొద్దుగూకిన తరువాత యాకోబు పొలమునుండి ఇంటికి వచ్చునప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్ళి “నీవు ఈ రాత్రి నాతో గడపవలయును. నిన్ను నా కుమారుడు తెచ్చిన పుత్రదాతపండ్లకు కొంటిని” అనెను. ఆ రాత్రి యాకోబు ఆమెతో శయనించెను.

17. దేవుడు ఆమె మొర ఆలకించెను. ఆమె గర్భవతియై ఐదవకొడుకుని కనెను.

18. లేయా “నేను నా దాసిని నా నాథునికి అప్పగించితిని. దానికి దేవుడు ఈ ఎదురు మేలు చేసెను” అనుకొని అతనికి యిస్సాఖారు అను పేరు పెట్టెను.

19. లేయా మరల గర్భవతియై ఆరవ కొడుకును కనెను.

20. ఆమె “దేవుడు నాకు మంచి కానుకిచ్చెను. నేను ఆరుగురు కుమారులను కనిన మగనాలిని, ఇక నా మగడు నన్ను తప్పక ఆదరించును” అని అనుకొని అతనికి సెబూలూను ' అను పేరు పెట్టెను.

21. ఆ తరువాత లేయా ఒక కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.

22. దేవుడు రాహేలును మరచిపోలేదు. ఆమె మొర నాలకించి ఆమె కడుపుపండించెను.

23. అందు చేత రాహేలుకూడ గర్భవతియై ఒక కొడుకును కనెను. “దేవుడు నా అవమానమును తొలగించి నేను తలయెత్తు కొనునట్లు చేసెను” అని అనుకొనెను.

24. "యావే నా కడుపున మరొక కాయకాచునట్లు చేయును గాక!” అని అనుకొని అతనికి యోసేపు' అను పేరు పెట్టెను.

25. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో "నన్ను పంపివేయుము. మా దేశమందలి మా ఇంటికి తిరిగి పోవలయుననుకొనుచున్నాను.

26. పిల్లలతోపాటు నా భార్యలను నాకు అప్పగింపుము. నేను వారికొరకే నీకు సేవచేసితిని. నేను వెళ్ళిపోయెదను. నేను ఎంత సేవచేసితినో నీకు తెలియును” అనెను.

27. లాబాను అతనితో “దయ చేసి నా మాటకూడ వినుము. దేవుడు నీ వలననే నాకు మేలుచేసెనని శకునములబట్టి తెలిసికొంటిని.

28. నేను నీకు ఈయవలసిన జీతము ఎంతో నీవే చెప్పుము. దానిని ఇచ్చివేయుదును” అనెను.

29. దానికి యాకోబు “నేనెట్లు చాకిరిచేసితినో నీకు తెలియును. నీ గొఱ్ఱెలమందలను ఎంత జాగ్రత్తతో పెంచితినో నీవెరుగుదువు.

30. నేను వచ్చినప్పుడు నీకు గొఱ్ఱెలు తక్కువగా ఉండెడివి. కాని ఈనాడో! అవి లెక్కకు మిక్కుటముగా పెరిగినవి. నేను కాలు మోపిన చోట్లనెల్ల దేవుడు నీకు మేలుచేసెను. ఇక నేనుకూడ నా కుటుంబముకొరకు నాలుగు డబ్బులు కూడబెట్టుకొను సమయమొచ్చినదిగదా?” అనెను.

31. లాబాను “అయినచో నేను నీకేమి ఈయవలయునో చెప్పుము” అనెను. దానికి యాకోబు “నీవు నాకు ఏమియు ఈయవలదు. నేను చెప్పబోవు మాటలను నీవు ఒప్పుకొనుము. ఎప్పటిమాదిరిగా నీ మందలను మేపుదును.

32. ఈనాడు వెళ్ళి నీ మందలన్నిటిని చూచెదను. వానినుండి నల్లగొఱ్ఱెపిల్లలన్నిటిని, పొడలు, మచ్చలు ఉన్న మేకపిల్లలన్నిటిని ఎన్నుకొందును. అవియే నాకు వేతనము.

33. ఇదే నా సత్యమును రుజువు చేయును. తరువాత మన మిద్దరము కూర్చుండి నా జీతనాతములను సరిచూచు కొనునప్పుడు, నా మందలో నల్లగాలేని గొఱ్ఱెలు, పొడలుమచ్చలులేని మేకలు ఉన్నచో, వానిని నేను నీ మందనుండి దొంగిలించినట్లే అనుకొనుము” అనెను.

34. అంతట లాబాను “ఒప్పుకొంటిని. నీ మాట చొప్పుననే కానిమ్ము” అనెను.

35. ఆనాడే లాబాను తెల్లచారలు మచ్చలుగల మేకపోతులను, తెల్లపొడలు మచ్చలు గల ఆడుమేకలను, నల్లగొఱ్ఱె పిల్లలను వేరు చేసి తన కుమారులకు అప్పగించెను.

36. లాబాను వానిని దూరముగా కొనిపోయి, యాకోబు మందల నుండి మూడు రోజులు ప్రయాణము పట్టు చోట ఉంచెను. యాకోబు మాత్రము మిగిలిన లాబాను మందలను మేపుచుండెను.

37. యాకోబు రావి, బాదము, బూరుగుచెట్ల పచ్చిపుల్లలను తీసికొనివచ్చి, వానిలోని తెల్లచారలు కనబడునట్లు పై బెరడు ఒలిచెను.

38. అతడు వానిని మందలు నీళ్ళు త్రాగుటకు వచ్చుచోట ఉన్న తొట్లలోనిలువుగ పాతెను. యెదకువచ్చిన ఆడుమేకలు నీళ్ళు త్రాగుటకు వచ్చినప్పుడు ఆ పుల్లలు వానికెదురుగా నుండెను.

39. పోతులు దాటినపుడు, ఆ పుల్లలు ఆడుమేకలకు ఎదురుగానుండెను. కనుక వానికి తెల్లవారలు పొడలుమచ్చలుగల పిల్లలుపుట్టెను.

40. అతడు గొఱ్ఱెలను వేరుచేసి వానిని లాబాను మందలో నల్లరంగు నల్లమచ్చలుగల వానివైపు తోలెను. ఆ గొఱ్ఱెలకు నల్లపిల్లలు పుట్టెను. ఈ రీతిగా అతడు సొంత మందలను పెంచి, వానిని లాబాను మందలో చేర్చకుండ విడిగా మేపుకొనెను.

41. బలముగల పశువులు ఎదకు వచ్చినప్పుడు మాత్రమే అతడు నీళ్ళతొట్లలో పుల్లలుంచెను. అవి పుల్లలయెదుట కట్టెను.

42. బక్కమేకల యెదుట పుల్లలు పాతలేదు. ఈ విధముగా బక్కపిల్లలు లాబానుకు వచ్చెను. బలిసిన పిల్లలు యాకోబునకు వచ్చెను.

43. ఈ ప్రకారముగా యాకోబు మహాసంపన్నుడై పెక్కు మందలను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను సంపాదించుకొనెను. 

 1. “యాకోబు పూచికపుల్ల కూడ వదలకుండ మన తండ్రి ఆస్తి అంతయు కాజేసెను. మన తండ్రి సొత్తును దోచుకొనుటవలననే అతనికింత వైభవము కలిగినది” అని లాబాను కుమారులు అనుకొనుట యాకోబు వినెను.

2. లాబాను కూడ మునుపటి మాదిరిగా అతనిపట్ల ప్రసన్నుడుగా లేడు.

3. అప్పుడు దేవుడు యాకోబుతో “నీ పితరుల దేశములో ఉన్న బంధువుల యొద్దకు వెళ్ళిపొమ్ము. నేను నీ వెన్నంటి ఉందును” అని చెప్పెను.

4. కావున యాకోబు రాహేలును, లేయాను పొలములోనున్న తన మందల వద్దకు పిలిపించి వారితో,

5. "మీ తండ్రి మునుపటి వలె నాపట్ల ప్రసన్నుడగుటలేదు. అయినప్పటికి మా తండ్రి కొలిచిన దేవుడు నాకు తోడ్పడెను.

6. నేను మీ తండ్రికెట్లు వెట్టిచాకిరి చేసితినో మీకు తెలియును.

7. కాని అతడు నన్ను మోసగించెను. ఇప్పటికి పదిమార్లు అతడు నా జీతమును మార్చియుండెను. దేవుడు మీ తండ్రివలన నాకు ఏ అపాయము కలుగకుండ కాపాడెను.

8. లాబాను పొడలుగల మేకపిల్లలను నీ జీతము క్రింద కట్టుకొనుమన్నప్పుడు . దీనికి భిన్నమయిన అనువాదమును సాధ్యమే. మందలో అన్నియు పొడలుగల మేకపిల్లలే పుట్టెను. చారలుగల మేకపిల్లలను నీ జీతము క్రింద తీసుకొనుమని అన్నప్పుడు మందలో అన్నియు చారల మేక పిల్లలే పుట్టెను.

9. దేవుడు మీ తండ్రి పశువులన్నిటిని నా ఆధీనమునకిచ్చెను.

10. మందలు ఎదకు వచ్చిన ఋతువులో నాకు ఒక కల వచ్చెను. నేను కన్నెత్తి చూచితిని. మందలలోని ఆడుపశువులను దాటుచున్న పోతులకు చారలుగాని, మచ్చలుగాని, పొడలుగాని ఉండెను.

11. కలలో దేవునిదూత 'యాకోబూ!' అని పిలిచెను. 'చిత్తము ప్రభూ!' అని నేనంటిని.

12. అంతట దేవునిదూత 'అదిగో! చూడుము మందలోని మేకలను, గొఱ్ఱెలను దాటుచున్న పోతులకు చారలు గాని, మచ్చలుగాని పొడలుగాని ఉన్నవి. లాబాను నీకెంత అపకారము చేసెనో చూచి నేనే ఈ పని చేసితిని.

13. నీవు స్తంభమునకు తైలాభిషేకముచేసి, మ్రొక్కుకొన్న బేతేలులో నీకు ప్రత్యక్షమయిన దేవుడను నేనే. వెంటనే ఈ దేశమువిడిచి నీవు పుట్టినచోటికి తిరిగిపొమ్ము' అనెను” అని చెప్పెను.

14. రాహేలు, లేయా యాకోబుతో “మాకిక తండ్రి ఇంటిలో పాలుపంపకములులేవు.

15. అతడు మమ్మును మాత్రము కాని వారిగా చూచుటలేదా? మా తండ్రి మమ్ము విక్రయించి వచ్చిన సొమ్మంత తానే మ్రింగెను.

16. దేవుడు మా తండ్రి చేతికి చిక్కకుండచేసిన సొమ్మంత మాది, మా పిల్లలది. కావున దేవుడు చెప్పినట్లే చేయుము” అనిరి.

17. యాకోబు వెంటనే తన కుమారులను, యిల్లాండ్ర నందరను ఒంటెలమీద ఎక్కించెను.

18. వస్తువాహనములను ప్రోగుజేసికొని పద్దనారాములో గడించిన గొఱ్ఱెలమందలను, మేకల గుంపులను, పశుసమూహమును తోలుకొని కనానులోనున్న తండ్రి ఈసాకుకడకు బయలుదేరెను.

19. లాబాను గొఱ్ఱెల ఉన్ని కత్తెర వేయించుటకు వెళ్ళెను. అప్పుడు రాహేలు తన తండ్రికి చెందిన గృహదేవతా విగ్రహములను దొంగిలించెను.

20. తన ప్రయాణము మాట రహస్యముగానుంచి యాకోబు అరమీయుడగు లాబానును మోసగించెను.

21. తనకు ఉన్నదంతయు చంకబెట్టుకొని యాకోబు పారిపోయెను. అతడు యూఫ్రటీసు నదిని దాటి పర్వతమయమైన గిలాదువైపు వెళ్ళిపోయెను.

22. లాబాను మూడు రోజులు తరువాత యాకోబు పారిపోయెనన్న మాట వినెను.

23. అతడు చుట్ట పక్కాలను వెంటబెట్టుకొనిపోయి, ఏడురోజులపాటు యాకోబును వెంటాడి, చివరకు అతనిని గిలాదుకొండ మీద పట్టుకొనెను.

24. కాని ఆ రాత్రి దేవుడు అతనికి కలలో కనబడి “జాగ్రత్త! యాకోబునకు ఏమాత్రము హాని చేయవలదు” అని అరమీయుడగు లాబానును హెచ్చరించెను.

25. లాబాను పట్టుకొన్నప్పుడు యాకోబు గిలాదు కొండ నేలలో గుడారములు వేసికొనియుండెను. ఆ కొండనేలయందే లాబాను కూడ చుట్టపక్కాలతో గుడారములెత్తెను.

26. లాబాను యాకోబుతో “ఇదియేమిపని? నీవు నన్ను మోసగించితివి. కత్తితో చెర పట్టిన వారి మాదిరిగా నా కుమార్తెలను తీసికొని వచ్చితివి.

27. నాతో చెప్పకుండ గుట్టుగా పారిపోయి వచ్చితివేల? నాకు తెలిసినచో, నిన్ను సంతోషముగా మేళతాళములతో సాగనంపి ఉండెడివాడనుగదా!

28. నీవు వచ్చునపుడు నా కుమార్తెలను, వారి పిల్లలను కడసారిగానైన ముద్దాడనీయలేదు. వారితో ఒక్క మాటైన మాట్లాడనీయలేదు. ఎంత తెలివితక్కువ పని చేసితివి!

29. నీకు కీడుచేయుట నాకును చేతనగును. కాని నిన్న రాత్రి మీ తండ్రి దేవుడు నాతో మాట్లాడి నపుడు “జాగ్రత్త! యాకోబుతో మంచిగాని, చెడుగాని మాట్లాడవలదు” అని హెచ్చరించెను.

30. ఇంటిమీద బెంగపుట్టినచో నీవు నీ తండ్రి యింటికి మరలి పోయెదవుగాక! కాని నా దేవతలను దొంగిలించితి వేల?” అనెను.

31. అంతట యాకోబు “నీవు నీ కుమార్తెలను బలాత్కారముగా తీసికొనిపోదువేమో అని భయపడితిని.

32. నీ దేవతావిగ్రహములను దగ్గర పెట్టుకొన్న వారికి చావుమూడినదని తెలిసికొనుము. ఇదిగో! ఇక్కడ ఉన్న మన బంధువుల యెదుట వెదకి, నీదేదైన పూచికపుల్లంత నా దగ్గర ఉన్నచో తిరిగి తీసికొనుము” అనెను. రాహేలు దేవతా విగ్రహములను దొంగిలించి నదని యాకోబునకు తెలియదు.

33. లాబాను లేయా, యాకోబుల గుడార ములు, దాసీ స్త్రీల గుడారములు వెదకెను. అతనికి ఏమియు కనబడలేదు. అతడు లేయా గుడారమునుండి రాహేలు గుడారమునకు వెళ్ళెను.

34. రాహేలు దేవతావిగ్రహములను తీసికొనిపోయి, ఒంటె జీను క్రిందబెట్టి, దానిమీద కూర్చుండియుండెను. లాబాను కంట వత్తి పెట్టుకొని గుడారమంతయు వెదకెను. కాని అతనికేమియు దొరకలేదు.

35. అంతట రాహేలు తండ్రితో "అయ్యా! నీ ముందు లేచి నిలబడలేదని తప్పుపట్టకుము, నేను కడగానుంటిని” అనెను. ఎంత వెదకినను లాబాను గృహదేవతా విగ్రహములను కనుగొనలేకపోయెను.

36. యాకోబు కోపముతో రగిలిపోయెను. అతడు లాబానును మందలించుచు “నేను చేసిన తప్పేమి? నేను ఏ పాపము చేసితినని నీవు ఇట్లు నురుగులు గ్రక్కుకొనుచు వచ్చి నన్ను వెంటాడితివి?

37. నీవు నా సామాగ్రినంతటిని వెదకినను, నీ గృహ సామగ్రిలోని వస్తువు ఒక్కటియైన నీకు కనబడినదా? కనబడినచో ఇదిగో! నావారు నీవారు అందరును ఇక్కడనే ఉన్నారుగదా! వీరి ముందు పెట్టుము. వీరే మన ఉభయుల మధ్య తగిన తీర్పుచెప్పెదరు.

38. నేను నీ దగ్గరనున్న ఇరువదియేండ్లలో ఏనాడును నీ గొఱ్ఱెలలోగాని నీ మేకలలోగానీ ఒక్కటి గూడ పట్టుకొనిపోలేదు. నీ మంద పొట్టేళ్ళను నేను తినలేదు.

39. క్రూరమృగముల వాతబడిన దానిని ఒక్కదానిని గూడ నేను నీ ఎదుటికి తీసికొని రాలేదు. నేనే ఆ నష్టము పెట్టుకొంటిని. పగలుగాని, రేయిగాని ఎవరు దేనిని దొంగలించినను నీవు వెంటనే నాయొద్ద నష్టపరిహారము పుచ్చుకొంటివి.

40. పగలు నిప్పులు చెరుగు ఎండకు మాడిపోతిని. రేయి మూడ మంచు నకు ముద్దయిపోతిని. ఏనాడు కంటిమీద కునుకు పడలేదు.

41. ఈ రీతిగా ఇరువదియేండ్లపాటు నీ ఇంటిలో పడియుంటిని. నీ కుమార్తెలిద్దరి కొరకు పదునాలుగేండ్లు బండ చాకిరిచేసితిని. నీ మందల కొరకు ఆరేండ్లపాటు ఒడలు గుల్లచేసికొంటిని. నీవు కనీసము పదిపర్యాయములైనా నా జీతము మార్చియుందువు.

42. మా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఈసాకు భయపడిన దేవుడు నాకు తోడ్పడ కున్న, నీవు నన్ను వట్టిచేతులతో పం పెడివాడవే? దేవుడు నా కాయకష్టమును, నా బాధలను చూచి గత రాత్రి నిన్ను మందలించెను” అనెను.

43. లాబాను యాకోబునకు బదులు చెప్పుచు “ఈ కుమార్తెలు నా కుమార్తెలే. ఈ పిల్లలు నా పిల్లలే. ఈ మందలు నామందలే, నీవు చూచుచున్నదంతయు నాదే. ఇక నా కుమార్తెలకు, వారు కనిన పిల్లలకు నేడు నేనేమి చేయగలను?

44. ఇటురమ్ము! నీవు నేను ఒక ఒడంబడిక చేసికొందము. అది నీకు నాకు నడుమ సాక్షిగా నుండును” అనెను.

45. అందుచే యాకోబు ఒక పెద్దరాతిని తీసి కొని, దానిని స్తంభముగా నిలబెట్టెను.

46. అప్పుడు అతడు రాళ్ళు ప్రోగుచేయుడని తనవారికి చెప్పెను. వారు రాళ్ళుతెచ్చి కుప్పచేసిరి. దాని దగ్గరనే వారు కలసి భోజనములు చేసిరి.

47. లాబాను దానికి “యగార్ సహదూతా” అను పేరు పెట్టగా, యాకోబు దానికి “గలెదు”' అను పేరు పెట్టెను.

48. అంతట లాబాను “ఈ కుప్పయే నాకు నీకు నడుమసాక్షిగా నుండును” అనెను. ఈ కారణముచేత దానికి గలెదు అను పేరు వచ్చెను.

49. లాబాను “మనము ఒకరి కంటికొకరు కనబడకుండ విడిపోయినపుడు, దేవుడు మనలనిద్దరను ఒకకంట కనిపెట్టునుగాక!” అనెను. కావుననే ఆ తావునకు మిస్సా అను పేరు వచ్చెను.

50. అతడు యాకోబుతో “నీవు నా కుమార్తెలను హింసించిననూ, ఎవ్వరు చూచుటలేదు గదా అని యితర స్త్రీలను పెండ్లాడిననూ దేవుడు నీకు నాకు నడుమ సాక్షిగా నుండునుగాక!” అనెను.

51. లాబాను యాకోబుతో ఇంకను మాట్లాడుచు “నీకు నాకు నడుమ నేను పేర్చిన ఈ కుప్పను చూడుము. నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము.

52. ఈ కుప్ప ఒక సాక్షి. ఈ స్తంభము మరొకసాక్షి, నీకు హాని చేయుటకు నేను ఈ కుప్పదాటి నీవైపురాను. నీవును నాకు కీడు చేయుటకు ఈ కుప్పను, ఈ స్తంభమును దాటి ఈవలకు రావలదు.

53. "అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రిదేవుడు మనకు తీర్పరియై ఉండును” అనెను. యాకోబు “మా తండ్రి ఈసాకు భయపడిన దేవుని తోడు” అని ప్రమాణము చేసెను.

54. అతడు ఆ కొండమీదనే బలి అర్పించి, తనవారిని విందునకు పిలిచెను. వారందరు కలిసి విందారగించి, కొండమీదనే ఆ రాత్రి గడిపిరి.

55. లాబాను మరునాడు తెల్లవారుజామున లేచి కుమార్తెలను వారి పిల్లలను ముద్దాడి, దీవించి ఇంటికి తిరిగివెళ్ళెను. 

 1. అంతట యాకోబు ప్రయాణము సాగించు చుండగా, త్రోవలో దేవదూతలు అతనికి ఎదురొచ్చిరి.

2. 'యాకోబు వారిని చూచి "ఇది దేవుని సైన్యము” అని పలికెను. కావున ఆ చోటికి మహనయీము' అను పేరు పెట్టెను.

3. యాకోబు తనకంటే ముందుగా ఎదోము దేశమునందు సేయీరు మండలములో ఉన్న తన అన్న ఏసావునొద్దకు దూతలను పంపెను.

4. నా మాటలుగా ఏసావునకు చెప్పుడని వారితో ఇట్లనెను: “ప్రభూ! నీ దాసుడు యాకోబు ఇట్లు చెప్పుచున్నాడు. నేను పరదేశిగ లాబాను దగ్గరుంటిని. ఇప్పటివరకు అక్కడనే నివసించితిని.

5. నాకు ఎడ్లు, గాడిదలు, గొఱ్ఱెలు, మేకలు కలవు. దాసదాసీజనమున్నది. ప్రభూ! నీ అనుగ్రహము సంపాదించుకొనుటకే నీ వద్దకు వర్తమానము పంపుచున్నాను.”

6. వార్తావాహకులు తిరిగొచ్చి యాకోబుతో “మేము మీ అన్నను చూచివచ్చితిమి. నాలుగువందల మందిని వెంటబెట్టుగొని త్రోవలోనే నిన్ను కలసి కొనుటకు ఏసావు బయలుదేరి వచ్చుచున్నాడు” అనిరి.

7. యాకోబునకు మిక్కిలి భయము, తత్తరపాటు కలిగెను. అతడు తనవెంట నున్నవారిని, మేకలను, గొఱ్ఱెలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విడదీసెను.

8. ఏసావు ఒక గుంపు మీదబడి దానిని కూల్చివేసినను, రెండవగుంపైనను అతనిబారిన పడక తప్పించుకొనిపోవునని అతడు తలంచెను. ,

9. అప్పుడు యాకోబు “నా తండ్రి అబ్రహాము దేవా! నా తండ్రి ఈసాకు దేవా! స్వదేశమందలి చుట్టపక్కాల దగ్గరకు వెళ్ళుమని నన్ను ఆదేశించి నిన్ను సంపన్నుని చేయుదునని మాటయిచ్చిన ప్రభూ!

10. ఈ నీ దాసునిపట్ల నీవు చూపిన దయకు విశ్వాసమునకు అపాత్రుడను, నేను యోర్ధాను దాటినపుడు చేతిలో నా చేతికఱ్ఱతప్ప ఇంకేమియులేదు. కాని ఈనాడో ఈ రెండు బలగములతో తిరిగివచ్చితిని.

11. మా అన్న ఏసావు వచ్చి, తల్లియనక, పిల్లయనక వరుసపెట్టి అందరిని ఊచకోత కోయునని భయపడుచున్నాను.

12. నిన్ను మహాసంపన్నుని చేయుదుననియు, సముద్ర తీరమునందలి ఇసుకవలె లెక్కలకందనట్లు నీ సంతతిని విస్తరిల్లచేయుదుననియు నీవే నాకు చెప్పితివిగదా!" అని ప్రార్ధించెను.

13. యాకోబు ఆ రాత్రి అక్కడనే గడిపెను. సోదరుడగు ఏసావునకు బహుమానముగా పంపుటకై అతడు తనదగ్గర ఉన్న మందలనుండి

14. రెండు వందల ఆడుమేకలను, ఇరువది మేకపోతులను, రెండువందల అడుగొఱ్ఱెలను, ఇరువది పొట్టేళ్ళను,

15. పిల్లలతో పాటు ముప్పది పాడి ఒంటెలను, నలువది ఆవులను, పది కోడెలను, ఇరువది ఆడు గాడిదలను, పది మగగాడిదలను ఎన్నుకొనెను.

16. అతడు విడివిడిగా ఒక్కొక్క మందను ఒక్కొక్క దాసునకు అప్పజెప్పి, “మీరు నాకంటే ముందుగా సాగిపొండు. మందకుమందకు నడుమ ఎడముండునట్లు చూడుడు” అని చెప్పెను.

17. అప్పుడు మొదటి మందవానికి “మా సోదరుడు ఏసావు త్రోవలో నిన్ను కలిసికొని నీవు ఎవ్వరివాడవు? ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు తోలుకొనిపోవుచున్న ఈ మంద యెవ్వరిది? అని అడిగినచో నీవు అతనితో,

18. ఇది మీ దాసుడగు యాకోబుమంద. మా ఏలిక అగు ఏసావునకు దీనిని కానుకగా పంపెను. ఆయన మా వెనుకనే వచ్చు చున్నాడని చెప్పుము” అని తెలియజేసెను.

19. ఏసావు కలసినప్పుడు మీరు ఆయనతో చెప్పవలసిన మాటలివియే అని యాకోబు రెండవవానిని, మూడవవానిని, మందలవెంటనున్న వారందరిని ఆజ్ఞాపించెను.

20. మీ దాసుడు యాకోబు మా వెనుకవచ్చుచున్నాడని కూడ తెలియజేయుడు అనెను. 'నేను ముందుగా పంపిన ఈ కానుకలతో అతని కోపము చల్లారునట్లు చేసెదను. ఇక ఆ తరువాత అతని సముఖమునకు వెళ్ళినప్పుడతడు నన్ను సాదరముగా చూచును' అని యాకోబు తనలో తాను అనుకొనెను,

21. కావున యాకోబు తనకంటే ముందుగా కానుకలు పంపెను. అతడు విడిదియందే ఆ రాత్రి గడపెను.

22. యాకోబు రాత్రివేళ లేచి తన భార్యలను ఇద్దరను, దాసీ స్త్రీలను ఇద్దరను, కొడుకులను పదునొకండ్రను వెంటబెట్టుకొనిపోయి యబ్బోకురేవు దాటెను.

23. యాకోబు వారిని తీసికొనిపోయి యేరు దాటించిన తరువాత తనకున్నదంతయు, యేటి ఆవలి యొడ్డుకు చేర్పించెను.

24. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. అప్పుడు ఒకానొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టెను.

25. ఆ మనుష్యుడు యాకోబునెంత సేపటికి ఓడింపలేక పోవుటచే అతని తుంటిమీదకొట్టెను. అంతటవారు పెనుగులాడుచుండగా యాకోబునకు తుంటి తొలగెను.

26. ఆ మనుష్యుడు “తెల్లవారు చున్నది నన్నికపోనిమ్ము” అనెను. దానికి యాకోబు “నన్ను దీవించువరకు నిన్ను వెళ్ళనీయను” అని పలికెను.

27. అతడు “నీ పేరేమి?" అని అడుగగా, ఇతడు “నా పేరు యాకోబు” అని జవాబు చెప్పెను.

28. ఆ మనుష్యుడు “ఇక ముందు నీకు యాకోబు అను పేరు కాక, యిప్రాయేలు' అను పేరు ఉండును. నీవు దేవునితో మానవులతో పోరాడి గెల్చితివి కావున నీకు ఆ పేరు కలుగును” అని చెప్పెను.

29. యాకోబు “దయచేసి నీ పేరు చెప్పుము” అని అడిగెను. దానికి ఆ మనుష్యుడు “నా పేరడుగనేల?” అని అక్కడనే యాకోబును దీవించెను.

30. “నేను దేవుని ముఖాముఖి చూచితిని. అయినను బ్రతికి బయటపడితిని” అనుకొని యాకోబు ఆ చోటికి పెనుయేలు' అను పేరు పెట్టెను.

31. యాకోబు పెనుయేలునుండి సాగిపోవుచుండగా ప్రొద్దు పొడిచెను. తుంటితొలగుటచే అతడు కుంటుకొనుచు పోయెను.

32. కావుననే యిస్రాయేలీయులు ఈ నాటికి గూడ తుంటినరమును తినరు. ఆ మనుష్యుడు యాకోబును తుంటి నరముమీద కొట్టెనుగదా! 

 1. యాకోబు కన్నులెత్తి చూడగా ఏసావు నాలుగువందల మందిని వెంటబెట్టుకొని వచ్చు చుండెను. అప్పుడతడు తన పిల్లలను వేరుచేసి లేయాకును, రాహేలునకును అప్పగించెను.

2. దాసీ స్త్రీలను వారి పిల్లలను అతడు ముందుంచెను. వారి వెనుక లేయాను, ఆమె పిల్లలనుంచెను. అందరికి వెనుక రాహేలు, యోసేపులుండిరి.

3. యాకోబు అందరికంటే ముందుగా వెళ్ళెను. సోదరుని సమీపించుచు అతడు ఏడుమారులు నేలమీద సాగిల బడెను.

4. ఏసావు పరుగెత్తుకొని వచ్చి యాకోబును కౌగలించుకొనెను. అతడు యాకోబు మెడపై వ్రాలి ముద్దు పెట్టుకొనెను. వారిరువురు కన్నీరు కార్చిరి.

5. ఏసావు ఆ స్త్రీలను పిల్లలను పారజూచి “నీతో పాటున్న వీరందరెవరు?” అని యాకోబును ప్రశ్నించెను. అతడు “వీరందరు దేవుడు మీ ఈ దాసునకనుగ్రహించి ఇచ్చిన పిల్లలు” అని చెప్పెను.

6. అప్పుడు దాసీ స్త్రీలు, వారి పిల్లలు దగ్గరకు వచ్చి ఏసావు ముందు సాగిల పడిరి.

7. తరువాత లేయా తనపిల్లలతో వచ్చి సాగిల పడెను. పిదప యోసేపు, రాహేలులు కూడ వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి.

8. అంతట ఏసావు 'ఆ గుంపంత నాకు ఎదురుగా వచ్చినదేల?' అని యాకోబును ప్రశ్నించెను. దానికి యాకోబు “ప్రభూ! అదంతయు మీ అనుగ్రహము సంపాదించుకొనుటకే” అని చెప్పెను.

9. “తమ్ముడా! నాకు కావలసినంత ఉన్నది. నీ సొమ్ము నీవే అట్టిపెట్టు కొనుము” అని ఏసావు అనెను.

10. యాకోబు “అటుల గాదు. నీకు నామీద దయ ఉన్న నా ఈ కానుకలు స్వీకరింపుము. ఒకమాట చెప్పెదను చూడుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీవు దయతో నన్ను చేరదీసితివి.

11. నేను తెచ్చిన ఈ కానుకను పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను. నాకు కావలసినంత సమకూర్చెను” అనుచు బలవంతము చేసెను. ఏసావు అతని బహుమానములు పుచ్చుకొనెను.

12. “ఇక మనము బయలుదేరుదము. నేను ముందునడచుచు నీకు దారిచూపెదను" అని ఏసావు అనెను.

13. దానికి యాకోబు జవాబు చెప్పుచు “ప్రభూ! నీకు తెలియనిది ఏమున్నది? పిల్లలందరు పసివారు. గొఱ్ఱెలు, మేకలు, పశువులు, పిల్లలకు పాలుగుడుపుచున్నవి. వానిని చూచిన జాలికలుగును. ఒక్కనాడే తరిమితరిమి తోలుకొనిపోయిన మంద అంతయు చచ్చును.

14. కావున ప్రభూ! మీరు నాకంటె ముందు వెళ్ళవలయునని వేడుకొనుచున్నాను. నాతో ఉన్న ఈ పిల్లలను మందలను నడువగలిగినంత మెల్లగా నడిపించుకొనుచు, అంచలంచెలుగా ప్రయాణము చేసి సేయీరు నందున్న యేలినవారిని కలిసికొందును” అనెను.

15. “అట్లయిన నిన్ను అనుసరించి వచ్చుటకు నా మనుష్యులలో కొందరిని దిగవిడిచి పోయెదను” అని ఏసావు అనెను. దానికి యాకోబు “ఏలినవారికి నామీద దయగలిగిన అదియే పదివేలు. ఇక ఈ బలగముతో పనియేమి?" అనెను.

16. ఆనాడే ఏసావు సేయీరునకు తిరిగి వెళ్ళెను.

17. కాని యాకోబు సుక్కోతునకు బయలుదేరెను. అతడక్కడ తనకు ఒక ఇల్లు కట్టుకొనెను. పశువులకు పాకలు వేయించెను. కావుననే ఆ చోటికి సుక్కోతు' అను పేరువచ్చెను.

18. పద్దనారాము నుండి ప్రయాణమై యాకోబు సురక్షితముగా కనాను దేశమునందలి షెకెము నగరము చేరెను. దానికెదురుగా గుడారములు వేసికొనెను.

19. అతడు తాను గుడారములువేసిన చోటును షెకెము తండ్రియైన హామోరు కుమారుల వద్ద నూరు వెండినాణెములకు కొనెను.

20. అతడు అక్కడ ఒక బలిపీఠము కట్టి, దానికి “ఏల్ ఎలోహి యిస్రాయేల్” అనగా “యిస్రాయేలు దేవుడయిన దేవునికి” అను అర్థము వచ్చు పేరు పెట్టెను. 

 1. లేయా యాకోబుల కూతురు దీనా. ఆమె ఒకనాడు ఆ దేశస్త్రీలను చూచుటకు వెళ్ళెను.

2. హివ్వీయుడును ఆ దేశ యువరాజు అయిన హామోరు కుమారుడగు షెకెము దీనాను చూచెను. అతడు ఆమెను చెరపట్టి మానభంగము చేసెను.

3. కాని అతడు యాకోబు కూతురు దీనాను మనసార ప్రేమించెను. ఆమెకు ఓదార్పుమాటలు చెప్పెను.

4. కావున షెకెము ఆ పిల్లను నాకు పెండ్లి చేయుము అని తండ్రి హామోరును అడిగెను. .

5. యాకోబు తనకూతురు దీనాను షెకెము చెరిచెనని వినెను. అపుడతని కొడుకులందరు పొలములో మందలదగ్గర ఉండిరి. వారు ఇంటికి వచ్చువరకు అతడు నోరెత్తలేదు.

6. ఇంతలో షెకెము తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడవచ్చెను.

7. అంతలో యాకోబు కుమారులు పొలము నుండి వచ్చిరి. వారికి జరిగినదంతయు తెలిసెను. షెకెము దీనాతో శయనించి యిస్రాయేలు ప్రజలను అవమానపరిచెనని యాకోబు కుమారులు ఎంతో నొచ్చుకొనిరి. అగ్గిమీద గుగ్గిలము వేసినట్లు భగ్గున మండిపడిరి. షెకెము చేసిన పని చేయగూడనిదిగదా!

8. హామోరు యాకోబుతో అతని కుమారులతో "నా కుమారుడు షెకెము మీ కుమార్తెను ప్రేమించెను. ఆమెనతనికిచ్చి పెండ్లి చేయుడని మిమ్ము వేడుకొను చున్నాను.

9. మనము వియ్యమొంది పొత్తు కలియుదము. మీరు మీ కుమార్తెలను మా వారికిచ్చి పెండ్లి చేయుడు. అట్లే మేమును మా కుమార్తెలను మీ వారి కిచ్చి పెండ్లి చేయుదుము.

10. ఈ దేశమున మీకు ఎదురులేదు. ఇక్కడ మాతో ఉండుడు. ఈ నేలపై స్వేచ్చగా తిరుగుడు. వ్యాపారముచేసుకొని పొలము పుట్ర గడింపుడు” అనెను.

11. షెకెము వారితో “నా మనవి ఆలింపుడు. మీరేదికోరిన అది చేయుదును.

12. మీరు పెండ్లికానుకల నెన్నియైన కోరుడు. మీరు కోరినవన్ని ఇత్తును ఆ బాలికను నా భార్యగనిండు” అనెను.

13. షెకెము తమ సోదరి దీనాను చెరుచుటచే యాకోబు కుమారులొక పన్నాగముపన్నిరి. వారతనికి, అతని తండ్రి హామోరునకు జవాబు చెప్పుచు,

14. “మేము ఈ పని చేయజాలము. సున్నతి చేసికొనని వానికి మా సోదరినిచ్చి పెండ్లి చేయుట మాకు అవమానకరము.

15. మేము ఒక షరతు మీద ఒప్పు కొందుము. మావలె మీలో ప్రతిపురుషుడు సున్నతి చేసికొనిన,

16. మా కుమార్తెలను మీకిత్తుము, మీ పిల్లలను మేము పెండ్లి చేసికొందుము. అప్పుడు మీ మధ్య మేము నివసింతుము. మనమందరము ఏకజాతి కాగలము.

17. మీరు మామాట పెడ చెవినిబెట్టి సున్నతి చేసికొననియెడల మేము మా సోదరిని తీసికొని వెళ్ళిపోయెదము” అనిరి.

18. వారిమాటలు హామోరునకు, అతని కుమారుడు షెకెమునకు నచ్చెను.

19. తండ్రి ఇంటిలో అందరికంటే ప్రముఖుడయిన ఆ పడుచువాడు యాకోబు కుమార్తె పై మోహము కలిగియున్నందున వెంటనే యాకోబు కుమారులు చెప్పినట్టు చేసెను.

20. హామోరు, షెకెము నగరద్వారము దగ్గరకు తిరిగి వెళ్ళి తమ వారితో

21. “ఈ ప్రజలు మన మిత్రులు. వారిని ఈ దేశములో స్థిరపడనిండు. స్వేచ్చగా తిరుగనిండు. ఈ నేలమీద వారికిని కావలసినంత చోటున్నది గదా! మనము వారి పిల్లలను పెండ్లి చేసికొందము. మన పిల్లలను వారికిచ్చి పెండ్లి చేయుదము.

22. ఇదిగో! ఈ ఒక్క షరతు మీద మాత్రమే వారు మనతో కలిసిమెలిసి బ్రతుకుచు ఏకజాతి అగుటకు ఒప్పుకొందురు. వారివలె మనలో ప్రతి పురుషుడును సున్నతి చేసికొనవలయును.

23. ఇట్లయిన వారి మందలు, పశువులు, ఆస్తిపాస్తులన్ని మనకే దక్కును గదా! మనము వారిమాట ఒప్పుకొన్న చాలును. వారు ఏ ఆటంకము లేకుండ మనతో కలిసి బ్రతుకుదురు” అనిరి.

24. నగరద్వారము వద్దకు వెళ్ళిన వారందరు హామోరు, షెకెము చెప్పిన మాటలకు ఒప్పుకొనిరి. ఆ పురుషులందరును సున్నతి చేయించుకొనిరి.

25. మూడవనాడు సున్నతి వలన పురప్రజ లింకను మహాబాధననుభవించుచుండ, యాకోబు కుమారులు, దీనా సోదరులైన షిమ్యోను, లేవి అనువారు కత్తులు చేపట్టి తమ గుట్టు బయటికి పొక్కనీయకుండ నగరమున ప్రవేశించి, ప్రతి పురుషుని మట్టుపెట్టిరి.

26. వారు హామోరును, షెకెమును కండతుండెములు చేసిరి. షెకెము " ఇంటినుండి దీనాను విడిపించుకొని వెళ్ళిపోయిరి.

27. యాకోబు కుమారులలో మిగిలిన వారుగూడ సోదరికి జరిగిన పరాభవమునకు ప్రతీకారము చేయుటకై నగరమును దోచుకొనిరి.

28. పొలములో ఉన్న గొఱ్ఱెలను, పశువులను, గాడిదలను పట్టణములోనున్న సర్వస్వ మును వశముచేసికొనిరి.

29. ఆ దేశస్థుల సంపద నంతా దోచుకొనిరి. వారి పిల్లలను స్త్రీలను చెరపట్టిరి. ఇండ్లలో ఉన్నదంతయు దోచుకొనిరి.

30. యాకోబు షిమ్యోనుతో, లేవితో “మీరు నా మెడకు ఉరిత్రాడు తెచ్చితిరి. ఈ దేశీయులగు కనానీయులు పెరిస్సీయులు నాపై పగ పూనునట్టు చేసితిరి. నాకున్న బలగము తక్కువ. వారు మందిని కూడగట్టుకొని నా మీదపడిన, నేనును నా ఇంటి వారును నాశనమగుదుము గదా!” అనెను.

31. దానికి వారు “వాడు మాసోదరిని వేశ్యగా భావించి ప్రవర్తించుట తగునా?" అనిరి. 

 1. దేవుడు యాకోబుతో “నీవు లేచి, బేతేలునకు వెళ్ళి అచట స్థిరపడుము. నీవు నీ సోదరుడు ఏసావు బారినపడక తప్పించుకొని పారిపోవు చున్నపుడు, నీకు ప్రత్యక్షమయిన దేవునకు అక్కడ ఒక బలిపీఠమును నిర్మింపుము” అనెను.

2. కావున యాకోబు ఇంటివారితో, తనతో ఉన్నవారితో “మీ దగ్గర ఉన్న అన్యదేవతా విగ్రహములను పారవేయుడు, మిమ్మల్ని మీరు శుద్ధిచేసికొని, మైలబట్టలు మార్చు కొనుడు.

3. మనము బేతేలునకు వెళ్ళుదము. ఇక్కట్లు చుట్టిముట్టిననాడు నా మొరాలకించిన దేవునకు, నేను వెళ్ళిన త్రోవపొడుగున నన్ను వేయికన్నులతో కాపాడిన దేవునకు ఒక బలిపీఠము నిర్మింతును” అనెను.

4. వారందరు తమ దగ్గరనున్న దేవతా విగ్రహ ములను చెవిపోగులను యాకోబునకు అప్పగించిరి. అతడు వానినన్నిటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టెను.

5. తరువాత వారు బయలుదేరిరి. దేవునిభయము చుట్టుపట్టులనున్న నగరములపై కొచ్చెను. అక్కడి వారు యాకోబు కుమారులను వెంటాడుటకు సాహసింపలేదు.

6. యాకోబు, అతనివెంట ఉన్నవారందరు కనాను దేశమందలి లూజునకు వచ్చిరి. అదే బేతేలు.

7. అక్కడతడు ఒక బలిపీఠమును నిర్మించెను. సోదరుని బారిబడక, తప్పించుకొని పారిపోవుచున్న తనకు, ఆ చోట దేవుడు ప్రత్యక్షమయ్యెను. కావున, అతడు దానికి 'ఎల్ బేతేలు' అను పేరు పెట్టెను.

8. అప్పుడు రిబ్కా దాది దెబోరా చనిపోయెను. యాకోబు ఆమెను బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టెను. కావున ఆ చోటికి "అల్లోన్ బొకుత్' అనుపేరు వచ్చెను.

9. పద్దనారాము నుండి వచ్చిన తరువాత దేవుడు మరల యాకోబునకు ప్రత్యక్షమై అతనిని దీవించెను.

10. దేవుడు అతనితో నీ పేరు యాకోబు. ఇకనుండి నీకు యాకోబు అను పేరుండదు. నీకు 'యిస్రాయేలు' అను పేరు చెల్లును అనెను. కావున అతనికి యిస్రాయేలు అను పేరువచ్చెను.

11. దేవుడు ఇంకను అతనితో “నేను సర్వశక్తిమంతుడగు దేవుడను. నీవు ఫలించి వృద్ధిచెందుము. నీ వలన అనేక జాతులు అవతరించును. నీ నుండి రాజులు పుట్టుదురు.

12. అబ్రహామునకు, ఈసాకునకు ఇచ్చిన దేశమును నీకు ఇచ్చుచున్నాను. నీ తరువాత నీ సంతతికి ఈ దేశమును అప్పగింతును” అని చెప్పెను.

13. దేవుడు తాను మాట్లాడిన తావు నుండి యాకోబును వీడి వెళ్ళెను.

14. యాకోబు దేవుడు తనతో మాట్లాడిన చోట ఒక స్తంభము నెత్తెను. అది శిలాస్తంభము. అతడు దానిపై పానీయమును పోసి, తైలాభిషేకము చేసెను.

15. యాకోబు దేవుడు తనతో మాట్లాడిన చోటికి 'బేతేలు' అను పేరు పెట్టెను.

16. వారు బేతేలునుండి బయలుదేరిరి. ఎఫ్రాతాకు కొంచెము దూరముననుండగా రాహేలు పురిటినొప్పులు పడెను.

17. ఆమెకు ప్రసవవేదన దుర్బరముగా ఉండెను. ఆమె నొప్పులచే బాధపడు చున్నప్పుడు మంత్రసాని “భయపడకుము. నీకు మరీయొక కొడుకు పుట్టబోవుచున్నాడు” అని చెప్పెను.

18. ప్రాణములు పోవుచున్నప్పుడు, చివరి ఊపిరి విడుచుచు రాహేలు కుమారునకు బెనోని' అను పేరు పెట్టెను. కాని తండ్రి అతనిని బెన్యామీను అను పేరున పిలిచెను.

19. ఆ విధముగా రాహేలు మృతినొందెను. ఆమెను ఎఫ్రాతాకు పోవు బాటప్రక్క పాతిపెట్టిరి. ఈ ఎఫ్రాతాయే బేత్లెహేము.

20. యాకోబు ఆమె సమాధి మీద స్తంభమునెత్తెను. ఈనాటికి దానిని 'రాహేలు స్తంభము' అను పేరున పిలచుచున్నారు.

21. ఆ తరువాత యిస్రాయేలు ముందుకు సాగిపోయి ఏదెరు గోపురమునకు అవతల గుడారము వేసెను.

22. యిస్రాయేలు ఆ మండలములందు నివసించుచున్నప్పుడు, రూబేను వెళ్ళి తండ్రి ఉంపుడు కత్తెయగు బిల్హాతో శయనించెను. ఇది యిస్రాయేలు వినెను.

23. యాకోబునకు కొడుకులు పండ్రెండుగురు కలరు. అతనికి మొదట పుట్టిన రూబేను, తరువాతి వారయిన షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాఖారు, సెబూలూను అనువారు లేయా కుమారులు.

24. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.

25. దాను, నఫ్తాలి అనువారు రాహేలు దాసియగు బిల్హా పుత్రులు.

26. గాదు, ఆషేరు అను వారు లేయా దాసియగు జిల్పా సుతులు. వీరందరు పద్దనారాములో పుట్టిన యాకోబు కుమారులు.

27. యాకోబు మమ్రేలో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చెను. ఆ తావునే 'కిరియత్ అర్బా' లేక 'హెబ్రోను' అని అందురు. అబ్రహాము, ఈసాకు అక్కడనే పరదేశులుగ నివసించిరి.

28. చనిపోవునాటికి ఈసాకు వయస్సు నూటయెనుబదియేండ్లు.

29. పండుబారిన వయస్సులో మరణించి, అతడు తన పితరులను చేరుకొనెను. అతని కుమారులు ఏసావు, యాకోబు అతనిని పాతిపెట్టిరి. 

 1. ఎదోము అను ఏసావు సంతతి వారి పట్టికయిది.

2. ఏసావు కనానీయుల పిల్లలలో హిత్తీయుడగు ఏలోను కుమార్తె ఆదాను, హివ్వీయుడగు సిబ్యోనునకు కుమారుడగు ఆనా కూతురు ఓహోలిబామాను,

3. యిష్మాయేలు కుమార్తెయు నెబాయోతు చెల్లెలైన బాసేమతును పెండ్లియాడెను.

4. ఆదా ఏసావునకు ఎలీఫాసును కనెను. బాసెమతు రవూవేలును కనెను.

5. ఓహోలిబామా ఎయూషును, యాలమును, కోరాలను కనెను. వీరందరు కనాను దేశములో పుట్టిన ఏసావు కుమారులు.

6. ఏసావు భార్యలను, కుమారులను, కుమార్తెలను, ఇంటిలోనివారందరిని, కనాను దేశములో గడించిన చరాస్తులను వెంటతీసికొని, సోదరుడు యాకోబు త్రోవకు అడ్డమురాకుండ వేరొక మండలమునకు వెళ్ళెను.

7. ఇరువురికి విస్తారమయిన సంపద ఉండుటచే వారు కలిసికట్టుగా బ్రతుకలేకపోయిరి. మందలెన్నో ఉండుటచే వారికి ఉన్నచోటు చాలలేదు.

8. కావున ఏసావు సేయీరు పర్వత ప్రాంతములో నివసించెను. అతడే ఎదోము.

9. సేయీరు కొండలలో నివసించిన ఎదోమీయుల తండ్రి ఏసావు సంతతివారి పట్టిక యిది.

10. ఏసావు కుమారుల పేరులు ఇవి: ఎలీఫాసు ఏసావు భార్యయైన ఆదా కుమారుడు. రవూవేలు ఏసావు భార్యయగు బాసెమతు పుత్రుడు.

11. తేమాను, ఓమరు, సేఫో, గాతాము, కేనసులు అను వారు ఎలీఫాసు కుమారులు.

12. ఏసావు కుమారుడైన ఎలీఫాసునకు తిమ్నా ఉపపత్ని. ఆమె అతనికి అమాలేకును కనెను. ఏసావు భార్యయైన ఆదా సంతతివారు వీరు:

13. నహతు, సేరా, షమ్మా, మిజ్జాలు రవూవేలు కుమారులు. వీరు ఏసావు భార్యయైన బాసెమతు సంతతివారు.

14. సిబ్యోను కుమారుడగు ఆనా యొక్క కూతురును మరియు ఏసావు భార్యయుయైన ఓహోలిబామా కుమారులు వీరు. ఏసావునకు ఎయూషు, యాలము, కోరాలను కనెను.

15. వీరు ఏసావు సంతతి వారిలో నాయకులు.

16. తేమాను, ఓమరు, సేఫో, కేనసు, కోరా, గాతాము, అమాలెకులు ఏసావు జ్యేష్ఠపుత్రుడు ఎలీఫాసు కుమారులు. ఎదోము దేశమందు ఎలీఫాసు సంతతివారిలో వీరు నాయకులు. వీరు ఆదా సంతతి వారు.

17. నహతు, సేరా, షమ్మా, మిజ్జాలు ఏసావు కుమారుడగు రవూవేలు కుమారులు. ఎదోము దేశమందు రవూవేలు సంతతి వారిలో వీరు నాయకులు. వీరు ఏసావు భార్యయైన బాసెమతు సంతతివారు.

18. ఎయూషు, యాలము, కోరా అనువారలు ఏసావు భార్యయైన ఓహోలిబామా కుమారులు. వీరు ఏసావుభార్య, ఆనా కుమార్తెయైన ఓహోలిబామాకు పుట్టిన నాయకులు.

19. వీరు ఎదోము అనబడు ఏసావు కుమారులు, నాయకులు.

20-21. లోతాను, షోబాలు, సిబ్యోను, ఆనా, దీసోను, ఏసేరు, దీషానులు ఆదినుండి ఆ దేశవాసులైన హోరీయులవాడైన సేయీరు కుమారులు. ఎదోము దేశమందు హోరీయులకు నాయకులైన వీరు సేయీరు కుమారులు.

22. హోరి, హేమానులు లోతాను కుమారులు. లోతానునకు తిమ్నా అను సోదరి కలదు.

23. ఆల్వాను, మానహాతు, ఏబాలు, షేఫో, ఓనాములు షోబాలు కుమారులు.

24. అయ్యా, ఆనా అనువారు సిబ్యోను కుమారులు. తన తండ్రియైన నిబ్యోను గాడిదలను మేపుచున్నప్పుడు అడవిలో ఉష్ణధారలను కనుగొన్నవాడు ఆనాయే.

25. దీసోను, ఆనా కూతురు ఓహోలిబామాలు ఆనా పిల్లలు.

26. హేమ్దను, ఏష్పాను, ఇత్రాను, కేరానులు దీసోను పిల్లలు.

27. బిల్హాను, సావాను, ఆకానులు ఏసేరు పిల్లలు.

28. ఊసు, ఆరానులు దీషాను పిల్లలు.

29-30. లోతాను, షోబాలు, సిబ్యోను, ఆనా, దీసోను, ఏసేరు, దీషానులు హోరీయుల సంతతికి చెందిన నాయకులు. సేయీరు మండలములో వారి వారి గణముల ప్రకారముగా హోరీయుల సంతతికి చెందిన నాయకులు వీరే.

31. యిస్రాయేలు సమాజములో రాచరిక వ్యవస్థ ఏర్పడకమునుపే ఏదోము దేశమును రాజులుగా పాలించినవారు వీరు:

32. బేయోరు కుమారుడు బేలా ఏదోములో రాజయ్యెను. అతని రాజధాని పేరు దినాబా.

33. బేలా చనిపోయిన తరువాత బొస్రావాడైన సేరా కుమారుడగు యోబాబు రాజయ్యేను.

34. యోబాబు చనిపోయిన తరువాత తేమానువాడు హూషాము రాజు అయ్యెను.

35. హూషాము మరణించిన పిదప బేదాదు కుమారుడగు హదాదు రాజు అయ్యెను. అతడు మోవాబీయుల దేశములో మిద్యానును ఓడించెను. అతని నగరము పేరు ఆవితు.

36. హదాదు మరణించిన తరువాత మస్రేకావాడైన సమ్లా రాజు అయ్యెను.

37. సమ్లా చనిపోయిన పిదప యూఫ్రటీసు నదీతీరమందలి రహోబోతువాడైన సావూలు రాజు అయ్యెను.

38. సావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బాల్హనాను రాజయ్యెను.

39. బాల్హనాను మరణించిన తరువాత హదాదు రాజయ్యెను. అతని నగరము పేరు పావు. మెహేతబేలు అతని భార్య. ఆమె మేసాహాబు కుమార్తెయైన మత్రేదు కూతురు.

40. వారివారి వంశముల ప్రకారముగా వారివారి ప్రదేశముల చొప్పున, వారివారి నామములబట్టి ఏసావు సంతతికి చెందిన నాయకుల పేరులివి: తిమ్నా, ఆల్వా, యేతేతు.

41. ఓహోలిబామా, ఏలా, పీనోను,

42. కేనాసు, తేమాను, మిబ్సారు,

43. మాగ్డ్ యేలు, ఇరాము. వీరందరు తాము వశము చేసికొన్న భూభాగములలో గల తమతమ నివాసస్థలముల ప్రకారముగా ఎదోమునకు నాయకులయిరి. ఏసావు ఎదోమీయుల మూలపురుషుడు. 

 1. తన తండ్రి పరదేశిగ స్థిరపడిన కనాను దేశమునందే యాకోబు నివసించెను.

2. అతని వంశీయుల వృత్తాంతమిది. యోసేపు పదునేడేండ్ల ప్రాయమువాడయ్యెను. అతడింకను చిన్నవాడు. సోదరులతో కలిసి తండ్రిమందలను మేపెడివాడు. ఆ సోదరులెవరోకారు, యోసేపు సవతి తల్లులు బిల్హా, జిల్పాల పుత్రులే. అతడు సోదరులుచేసిన చెడుపనులు తండ్రికి చెప్పెను.

3. ముదిమిని పుట్టినవాడు కావున యిస్రాయేలు యోసేపును ఇతర కుమారులకంటె ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగుచేతుల నిలువుటంగీని కుట్టించెను,.

4. తమకంటె ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి.

5. యోసేపు ఒక కల కనెను. దానిని గూర్చి సోదరులకు చెప్పగా వారతనిని మునుపటికంటె ఎక్కువగా ద్వేషింపసాగిరి.

6. యోసేపు సోదరులతో “నేను కన్నకలను గూర్చి చెప్పెదను. వినుడు.

7. మనము పొలములో పనలు కట్టుచుంటిమి. నేను కట్టిన పన చివాలున లేచి నిలువుగా నిలబడెను. మీ పనలేమో దానిచుట్టు చేరి సాగిలబడినవి” అని చెప్పెను.

8. అది విని వారు “ఏమేమి! మాకు రాజువై మా మీద పెత్తనము చేయవలెనను కొనుచున్నావా?” అనిరి. యోసేపు స్వప్నపు సుద్దులను వినిన సోదరులు మునుపటికంటె ఎక్కువగా అతనిని ద్వేషించిరి.

9. యోసేపు మరియొక కల కనెను. సోదరులతో “నేను మరొక కల కంటిని. వినుడు. సూర్యచంద్రులు, పదునొకండు నక్షత్రములు నాకు నమస్కరించెను” అని చెప్పెను.

10. అతడు ఈ కలను గురించి సోదరులతోను, తండ్రితోను చెప్పెను. దానికి తండ్రి “ఇది ఎక్కడికల? నేను, మీ అమ్మ, నీ సోదరులు, మేమందరము వచ్చి నీ ముందు సాష్టాంగ ప్రణామము చేయవలయునాయేమి?” అని మందలించెను.

11. అతని సోదరులు అతనిపై అసూయపడిరి. కాని తండ్రి మాత్రము ఆ కలను మరవలేదు.

12. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి.

13. యిస్రాయేలు యోసేపుతో “నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు గదా! రమ్ము. నిన్నుకూడ వారి దగ్గరకు పంపెదను” అనెను. యోసేపు “నేను సిద్ధముగా ఉన్నాను” అనెను.

14. యిస్రాయేలు “వెళ్ళి నీ సోదరుల యోగక్షేమమును, మందల మంచిచెడ్డలను తెలిసికొని మరలి వచ్చి, నాకేమాట చెప్పుము” అని యోసేపుతో అనెను. ఈ విధముగా యాకోబు యోసేపును హెబ్రోను లోయ నుండి పంపగా అతడు షెకెమునకు వచ్చెను.

15. అక్కడ పొలములో తిరుగుచున్న యోసేపును ఒక మనుష్యుడు కలిసికొని “నీవేమి వెదకుచున్నావు?” అని అడిగెను.

16. యోసేపు అతనితో “నేను నా సోదరులను వెదకుచున్నాను. వారెక్కడ మందలను మేపుచున్నారో తెలిసిన దయచేసి చెప్పుడు” అనెను.

17. అంతట ఆ మనుష్యుడు “వారు ఇక్కడినుండి సాగి పోయిరి. దోతాను వెళ్ళుదమని వారిలో వారు అనుకొనుచుండగా వింటిని” అని చెప్పెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి, వారిని దోతానులో చూచెను.

18. వారు అతనిని దూరాన ఉండగనే చూచిరి. అతడు దగ్గరకు రాకమునుపే అతనిని చంపవలెనని కుట్రపన్నిరి.

19. వారు “ఇదిగో! కలలు గనువాడు వచ్చుచున్నాడు.

20. రండు! వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మ్రింగివేసినదని చెప్పుదము. వీని కలలు ఏమగునో చూతము” అని తమలో తాము అనుకొనిరి.

21. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను.

22. “మనకు ఈ రక్తపాతమేల? యోసేపును ఈ అడవియందలి గోతిలో త్రోయుడు. అతనికి ప్రాణహాని చేయకుడు” అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను.

23. యోసేపు సోదరుల దగ్గరకొచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువుటంగీని తీసివేసిరి.

24. అతనిని గోతిలో పడదోసిరి. అది వట్టి గొయ్యి. దానిలో నీళ్ళులేవు.

25. అంతట వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదునుండి ఐగుప్తుదేశమునకు పోవు యిష్మాయేలీయుల బిడారు వారి కంటబడెను. యిష్మాయేలీయులు ఒంటెలపై గుగ్గిలమును, బోళమును, లేపనద్రవ్యమును తీసికొనిపోవుచుండిరి.

26. అప్పుడు యూదా తన సోదరులతో "యోసేపును చంపి, అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును?

27. రండు! అతనిని యిష్మాయేలీయులకు అమ్మివేయుదము. మనము అతనికి హానిచేయరాదు. అతడు మన రక్తమాంసములు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా!?” అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి.

28. ఇంతలో మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతిమీదుగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకిలాగిరి. అతనిని ఇరువది వెండినాణెములకు యిష్మాయేలీయులకు అమ్మిరి. యిష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి.

29. పిమ్మట రూబేను గోతిదగ్గరకు వెళ్ళిచూడగా, దానిలో యోసేపు కనబడలేదు.

30. అతడు తన వస్త్రములు చించుకొనుచు, సోదరుల దగ్గరకు వెళ్ళి “అయ్యో! చిన్నవాడు గోతిలో లేడు. ఇక నేనేమి చేయుదును? ఎక్కడికి వెళ్ళుదును?” అని విలపించెను.

31. యోసేపు సోదరులతని పొడువు చేతుల నిలువుటంగీని తీసికొనిరి. ఒక మేకపిల్లను చంపి,  దాని నెత్తుటిలో నిలువుటంగీని ముంచిరి.

32. దానిని తండ్రియొద్దకు తెచ్చి, “ఇది మా కంటబడినది. ఇది నీ కొడుకు అంగీయో కాదో గుర్తింపగలవా?" అని అడిగిరి.

33. యాకోబు దానిని గుర్తుపట్టి “ఇది నా కుమారుని అంగీయే. ఏ మాయదారి మృగమో యోసేపును ముక్కలు ముక్కలుగా చేసి మ్రింగివేసినది” అనెను.

34. అతడు తన వస్త్రములను చించుకొనెను. నడుమునకు గోనెపట్ట కట్టుకొనెను. ఎన్నో రోజులు కొడుకును తలచుకొని అంగలార్చెను.

35. యాకోబు కుమారులు, కుమార్తెలు అతనిని ఓదార్చుటకెంతో ప్రయత్నించిరి. కాని అతనికి కొంచెముకూడ ఓదార్పు కలుగలేదు. “నేను ఇట్లే ఏడ్చుచు ఏడ్చుచు నా కుమారునితో పాటు మృతలోకము చేరెదను” అని యాకోబు అనెను. ఈ విధముగా యాకోబు యోసేపు కొరకు విలపించెను.

36. ఇది ఇట్లుండగా మిద్యానీయులు ఐగుప్తుదేశమున యోసేపును పోతీఫరునకు అమ్మిరి. పోతీఫరు ఫరోరాజు కడనున్న ఉద్యోగి, రాజసంరక్షకులకు నాయకుడు. 

 1. అప్పుడు యూదా సోదరులను వీడి వెళ్ళి పోయెను. అతడు హీరా అనునొక అదుల్లామీయుని దగ్గర నివసింపమొదలిడెను.

2. అక్కడ యూదా కనానీయుడైన షూవ కుమార్తెను చూచెను. ఆమెను పెండ్లియాడి ఆమెతో సంసారము చేసెను.

3.. ఆమె గర్భము ధరించి కొడుకును కనెను. అతనికి 'ఏరు' అను పేరు పెట్టెను.

4. రెండవసారి ఆమె గర్భవతియై కుమారుని కని అతనికి 'ఓనాను' అను పేరు పెట్టెను.

5. మూడవసారి కూడ ఆమె గర్భవతియై ఒక కుమారుని కని, అతనికి 'షేలా' అను పేరు పెట్టెను. ఆమె మూడవ కుమారుని కన్నప్పుడు కేసిబులో ఉండెను.

6. యూదా పెద్దకుమారుడు ఏరుకు తామారు అను ఆమెను ఇచ్చి పెండ్లి చేసెను.

7. దేవుని కంటికి ఏరు చెడ్డవాడాయెను. అందుచే దేవుడతనిని చంపివేసెను.

8. అప్పుడు యూదా రెండవ కుమారుడగు ఓనానుతో “మీ వదినెను స్వీకరించి మరిది ధర్మము నెరవేర్చి మీ అన్నకు సంతానమును కలిగింపుము” అని చెప్పెను.

9. అట్టి సంతానము తనది కానేరదని ఓనానునకు తెలియును. వదినెను కూడినపుడెల్ల ఆమెకు సంతానము కలుగకుండునట్లుగా అతడు రేతస్సును భూమిపై విడిచెడివాడు.

10. దేవుని కంటికి ఓనాను చేసిన పని చెడ్డదయ్యెను. అందుచే దేవుడు వానిని కూడ చంపివేసెను.

11. అంతట యూదా కోడలు తామారుతో “మూడవ బిడ్డడగు షేలా పెరిగి పెద్దవాడగు వరకు నీవు నీ పుట్టినింట వితంతువుగనే ఉండుము” అని చెప్పెను. షేలాకు కూడ అన్నల గతిపట్టునని యూదా భయపడి ఈ పన్నాగము పన్నెను. తామారు వెళ్ళి పుట్టినింటిలో నుండెను.

12. కాలము గడచినది. యూదా, భార్యగా స్వీకరించిన షూవ కుమార్తె మరణించెను. దుఃఖ దినములు ముగిసిన తరువాత యూదా తన స్నేహితుడైన అదుల్లామీయుడగు హీరాతో కలిసి తన గొఱ్ఱెల ఉన్ని కత్తిరించువారిని చూచుటకు తిమ్నాతు వెళ్ళెను.

13. మామ గొఱ్ఱెల ఉన్ని కత్తెర వేయించుటకు తిమ్నాతు 'వెళ్ళుచున్నాడని తామారునకు తెలిసినది.

14. షేలా , పెద్దవాడయ్యెనని ఆమెకు తెలియును. మామ తన్నింకను అతనికి భార్యగా అర్పింపడయ్యెను. కనుక ఆమె విధవ వస్త్రములను వదలినది. మొగమున మేలిముసుగు దాల్చి ఒడలు కప్పుకొనినది. తిమ్నాతు పోవు త్రోవచీలి ఎనాయిమునకు పోవుచోట కూర్చున్నది.

15. యూదా, ఆమెను చూచెను. మేలిముసుగు దాల్చియున్నందున అతడు ఆమెను వెలయాలిగా తలంచెను.

16. బాటప్రక్కనే కూర్చున్న ఆమె చెంతకు పోయికోడలని గుర్తింపజాలక “నాతో వత్తువా?” అని అడిగెను. దానికామె “యేమిత్తువు?” అని ప్రశ్నించెను.

17. అతడు "నా మందనుండి మేకపిల్లను పంపెదను” అనెను. “మేకపిల్లను పంపువరకు ఏమైన కుదువ బెట్టెదవా?” అని ఆమె అడిగెను.

18. “ఏమి కుదువ బెటవలయునో నీవే చెప్పుము” అని అతడు కోరెను. దానికామె “నీముద్రికను, నీ త్రాటిని, నీచేతికఱ్ఱను కుదువబెట్టుము” అని చెప్పెను. యూదా వానిని ఇచ్చి ఆమెను కూడెను. ఆమె గర్భము ధరించెను.

19. అంతట ఆమె ఇల్లు చేరుకొనెను. మేలిముసుగు తొలగించి, మునుపటి విధవవస్త్రములు ధరించెను.

20. తరువాత యూదా కుదువబెట్టిన సొమ్మును తీసికొనుటకై మిత్రుడు అదుల్లామీయునికి మేకపిల్లను ఇచ్చిపంపెను. కాని ఆమె అదుల్లామీయునకు కనబడలేదు.

21. "త్రోవలో ఎనాయిము నొద్ద కూర్చుండెనే! ఆ వెలయాలు ఎక్కడ ఉన్నది?" అని అతడు అక్కడివారిని అడిగెను. వారు “ఇక్కడ వెలయాలు యెవ్వతెయులేదే” అనిరి.

22. అదుల్లామీయుడు వెనుదిరిగి వెళ్ళి యూదాతో “ఆమె కనబడలేదు. పైగా అక్కడివారు ఈ తావున వెలయాలు యెవ్వతెయు లేదనిరి” అని చెప్పెను.

23. యూదా అతనితో “ఆమెనే ఆ వస్తువులనుంచుకొననిమ్ము. ఇరుగు పొరుగువారు విన్న మనకు నగుబాటగును. అనుకొన్న మాట ప్రకారముగా నేను మేకపిల్లను పంపితిని. ఆమె నీకు కనబడదాయెను” అనెను.

24. మూడునెలలు తరువాత ఎవ్వరో “నీ కోడలు వెలయాలివలె బ్రతికినది. తప్పుత్రోవ తొక్కిన ఆమె గర్భము దాల్చినది” అని యూదాతో చెప్పిరి. అతడు మండిపడి “ దానిని నలుగురిలోనికి ఈడ్చుకొని వచ్చి నిలువున కాల్చివేయుడు” అనెను.

25. జనులామెను బయటికి కొనివచ్చిరి. బయటికి వచ్చిన తరువాత ఆమె మామను పిలువనంపి ఈ వస్తువులెవనివో అతని వలననే నేను గర్భవతినైతిని. ఈ ముద్రికను, ఈ త్రాడును, ఈ చేతికఱ్ఱను చూడుము. దయచేసి ఇవెవనివో చెప్పుము” అనెను.

26. యూదా వానిని గుర్తుపట్టి “ఈమె నాకంటె నీతిమంతురాలు. ఈమెను షేలాకు అప్పగింపనైతిని” అనెను. తరువాత అతడు ఎన్నడును తిరిగి ఆమెను కూడలేదు.

27. ప్రసవ సమయమున ఆమె గర్భమునందు కవలపిల్లలు ఉండిరి.

28. ఆమె ప్రసవవేదన పడుచున్నప్పుడు వారిలో ఒకడు బయటికి చేయిచాచెను. మంత్రసాని ఎఱ్ఱనూలుతీసి వానిచేతికి కట్టి “వీడే మొదటివాడు” అనెను.

29. ఆ శిశువు చేతిని వెనుకకు లాగుకొనిన వెంటనే వానితమ్ముడు బయటికివచ్చెను. అంతట మంత్రసాని “ఇదేమి? నీవు ఎట్లు బయటపడితివి?" అనెను. అందుచే అతనికి 'పెరెసు' అను పేరు పెట్టిరి.

30. తరువాత చేతికి తొగరునూలున్న శిశువు బయటికి వచ్చెను. అతనికి సెరా' అను పేరు పెట్టిరి. 

 1. యిష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు తీసికొని వెళ్ళిరి కదా! పోతీఫరు అను ఐగుప్తుదేశీయుడు యిష్మాయేలీయులనుండి అతనిని కొనెను. ఫోతీఫరు ఫరోరాజు కడనున్న ఉద్యోగి. రాజ సంరక్షకులకు నాయకుడు.

2. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను. కావుననే అతడు వర్ధిల్లెను. యోసేపు ఐగుప్తు దేశీయుడగు యజమానుని ఇంటిలో ఉండెను.

3. దేవుడు అతనికి తోడుగానుండుటయు, అతడు చేయుచున్న పనులన్నియు విజయవంతములు అగుటయు పోతీపరు కనిపెట్టెను.

4. కావున యోసేపు యజమానుని అనుగ్రహమునకు పాత్రుడై, ఇష్టసేవకుడు అయ్యెను. పోతీఫరు యోసేపునకు ఇంటి పెత్తనమంత ఇచ్చుటయేకాక తన సర్వస్వమును అతనికి అప్పగించెను.

5. ఆనాటినుండియు యోసేపును బట్టి దేవుడు ఆ ఇంటిని చల్లనిచూపు చూచెను. పోతీపరు ఇల్లువాకిలి, పొలముపుట్ర సమస్తమును, దేవుని కృపకు పాత్రములయ్యెను.

6. అతడు తిండి మాటతప్ప ఇంకేమియు పట్టించుకొనెడివాడుకాడు. సర్వస్వమును యోసేపునకు అప్పగించి చీకుచింత లేక ఉండెడివాడు.

7. యోసేపు చక్కని రూపవంతుడు, అందగాడు. యజమానుని భార్య అతనిమీద కన్నువేసెను. తనతో శయనింపరమ్మని కోరెను.

8. కాని యోసేపు అందులకు అంగీకరింపలేదు. “అమ్మా! ఈ ఇంటిలో ఏమి జరుగుచున్నదో నాకు తప్ప నా యజమానునకు ఏమియు పట్టదు. ఆయన తనకు ఉన్నదంతయు నాకు అప్పగించెను.

9. ఈ ఇంటిలో నాకన్నా పైవాడు ఎవడును లేడు. నీవు ఆయనకు భార్యవు. కావుననే ఆయన నిన్నొక్కదానిని తప్ప మిగిలినదంతయు నాకు అప్పగించెను. కాగా, నేనింత దుష్కార్యమునకెట్లు ఒడిగట్టుదును? ఇది దైవద్రోహము కాదా?” అనెను.

10. అయినను ప్రతిదినము ఆమె యోసేపును అట్లే అర్ధించుచుండెను. అతడు ఆమె కోరికను నిరాకరించు చుండెను. చివరకు యోసేపు అమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకడకు పోవుటకూడ మానివేసెను.

11. ఇట్లుండగా ఒకనాడు యోసేపు ఎప్పటివలె పనిమీద యజమానుని ఇంటిలోపలికి వెళ్ళెను. ఇంటి బలగములోని ఏ ఒక్కడునూ అక్కడ లేడు.

12. యజమానుని భార్య అతని పై వస్త్రమును పట్టుకొని తనతో శయనింప రమ్మని అడిగెను. అతడా పై వస్త్రమును ఆమె చేతిలోనే వదలివేసి, ఇంటినుండి వెలుపలికి పారిపోయెను.

13. అతడు తన పై వస్త్రమును ఆమె చేతిలో వదలి పారిపోవుట చూచి

14. వెంటనే ఆమె ఇంటిలో వారిని పిలిచి “చూచితిరా! మనలను అవహేళన చేయుటకై మీ యజమానుడు ఒక హెబ్రీయుని తీసికొనివచ్చి నెత్తికి ఎక్కించుకొని నాడు. వాడేమో లోపలికి వచ్చి నాతో శయనింపనెంచి నా యొద్దకు రాగ

15. నేను కెవ్వున కేకవేసితిని. నా కేకలువిని వాడు పైవస్త్రమును విడిచిపారిపోయెను” అని చెప్పెను.

16. ఆమె యజమానుడు వచ్చువరకు అతని పైవస్త్రమును తన దగ్గరనే ఉంచుకొని తన భర్తతో తన కథను ఏకరువు పెట్టెను.

17. ఆమె “చూచితిరా! మీరు కొని తెచ్చి నెత్తికెక్కించుకొన్న బానిస ఉన్నాడే! ఆ హెబ్రీయుడు నన్ను అల్లరిపాలు చేయుటకు ఇక్కడికి వచ్చెను.

18. నేను గొంతెత్తి బిగ్గరగా కేకలు పెట్టుసరికి వాడు తన పైవస్త్రమును నా చేతిలో వదలి పారిపోయెను” అని అతనితో చెప్పెను.

19. “మీ సేవకుని ప్రవర్తనము ఈ తీరుగా ఉన్నది” అని భార్య యోసేపును ఉద్దేశించి వల్లించిన మాటలు విని యజమానుడు మండిపడెను.

20.యోసేపును బంధించి రాజుగారి ఖైదీలుండు చెరసాలలో త్రోయించెను.

21. యోసేపు కారాగారమునందే ఉండెను. అయినను దేవుడు అతనికి తోడుగా ఉండెను. కావుననే కారాగార పాలకునకు అతనిమీద దయకలిగెను.

22. అతడు బంధితులందరిని యోసేపునకు అప్పగించెను. యోసేపు వారిచే ఆయా పనులు చేయించెడివాడు.

23. యావే యోసేపునకు సహాయపడుచు అతడు చేయు పనులు సఫలీకృతము కావించుచుండెను. కావున కారాగార అధికారి యోసేపు పెత్తనమునకు ఏనాడును అడ్డుచెప్పలేదు. 

 1. తరువాత కొన్నాళ్ళకు ఐగుప్తుదేశపు రాజ పానీయవాహకుడును, వంటవాడును తమ యేలికపట్ల తప్పుచేసిరి.

2. పానీయవాహకులలోను, వంటవారి లోను వారిరువురు ముఖ్యులు. ఫరో రాజు ఆ ఇద్దరి మీద కోపపడెను.

3. వారిని రాజసంరక్షక నాయకునకు అప్పగించి, యోసేపు ఉన్న చెరసాలలో త్రోయించెను,

4. ఆ నాయకుడు వారి మంచిచెడ్డలు చూచుటకు యోసేపును నియమించెను. యోసేపు వారి అక్కరలు తీర్చుచుండెను. వారిరువురు చెరసాలలో కొన్నాళ్ళుండిరి.

5. ఆ తరువాత పానీయవాహకుడు, వంటవాడు ఇరువురును ఒకేరాత్రి కలలుగనిరి. ఆ కలలు రెండును రెండు రకములు.

6. మరుసటి ప్రొద్దున యోసేపు వారికడకు వచ్చెను. వారు చింతాక్రాంతులై ఉండుట చూచెను.

7. “మీ మొగములు చిన్నబోయినవేల?” అని వారినడిగెను.

8. “మేము కలలుగంటిమి. వాని అర్థము వివరించి చెప్పెడువాడు ఒకడును లేడు” అని వారనిరి. యోసేపు “స్వప్న వ్యాఖ్యానము దేవుని వశముగదా? మీ కలలేమో చెప్పుడు” అనెను.

9. అంతట పానీయవాహకుడిట్లు చెప్పదొడగెను. “నా కలయిది: నా ముందు ద్రాక్షాలత ఉండుట చూచితిని.

10. దానికి మూడు రెమ్మలుగలవు. ఆ లత మొగ్గ తొడిగినదో లేదో వెంటనే పూలుపూచెను. దాని గుత్తులును పండెను.

11. నా చేతిలో ఫరో ప్రభువు పాన పాత్ర ఉన్నది. నేను పండ్లు కోసితిని. పాత్రలో రసమును పిండి ప్రభువునకు ఇచ్చితిని.”.

12. యోసేపు అతనితో “నీ కలకు అర్థమిది: మూడు రెమ్మలు మూడు రోజులు,

13. మూడు రోజులలో ఫరో ప్రభువు నిన్ను ఆదరించి తిరిగి నీ పదవియందు నిలుపును. అప్పుడు యథావిధిగా నీవు ఆ చక్రవర్తికి పానీయవాహకుడవు అయ్యెదవు.

14. నీకు మేలు కలిగినపుడు నన్ను గుర్తు పెట్టుకొనుము. నాపై దయ చూపుము. ప్రభువునకు నా విషయము విన్న వింపుము. నేను చెరసాలనుండి బయటపడునట్లు చూడుము.

15. హెబ్రీయుల దేశమునుండి నన్ను అపహరించుకొని వచ్చిరి. ఇక్కడ చీకటి కొట్టులో త్రోయ దగినంత తప్పును నేనేమియు చేయలేదు” అనెను.

16. అనుకూలముగా స్వప్న వ్యాఖ్యానము చేసిన యోసేపుతో వంటవాడు "అయ్యా! నేనును ఒక కల కంటిని. తెల్ల పిండివంటల గంపలు మూడు నా తలమీద ఉన్నవి.

17. పైనున్న గంపలో ఫరో ప్రభువునకు ఇష్టములైన వివిధ పిండివంటలు కలవు. కాని పక్షులు ఆ గంపలోని పిండివంటలను తినుచుండెను” అని చెప్పెను.

18. అంతట యోసేపు “దీని అర్థమిది. మూడుగంపలు మూడు రోజులు.

19. మూడురోజుల తరువాత ఫరోరాజు నిన్ను విడుదల చేసి చెట్టుకు వ్రేలాడదీయించును. అప్పుడు మింటపోవు పక్షులు నీ మాంసమును భక్షించును” అని చెప్పెను.

20. మూడవరోజున ఫరోరాజు జన్మ దినోత్సవము జరిగెను. ఆయన తన సేవకులందరికి విందు చేసెను. ముఖ్య పానీయవాహకుని, వంటవానిని చెర నుండి విడిపించి సేవకులయెదుటికి కొనివచ్చెను.

21. పానీయవాహకునకు పూర్వపదవినే దయచేయగా అతడు ఫరో చేతికి పానపాత్రను అందించెను.

22. కాని రాజు వంటవానిని ఉరితీయించెను. యోసేపు కలలను వ్యాఖ్యానించిన విధముగనే అంతా జరిగెను.

23. అయినప్పటికి ముఖ్య పానీయవాహకుడు యోసేపును మరచిపోయెను. 

 1. రెండేండ్ల తరువాత ఫరోప్రభువు ఒక కల కనెను. అతడు నైలునది ఒడ్డున నిలుచుండెను.

2. ఇంతలో ఏడు ఆవులు నదినుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను. అవి కండపట్టి చూడచక్కగానుండెను.

3. కొంతసేపటికి మరి ఏడు ఆవులు నది నుండి పైకివచ్చెను. అవి బక్కచిక్కి వికారముగా నుండెను. అవి యేటి ఒడ్డుననే మొదట వచ్చిన ఆవుల సరసన నిలబడెను.

4. బక్కచిక్కి వికారముగానున్న ఆవులు, కండపట్టి చక్కగా ఉన్న ఆవులను తినివేసెను. అంతట ఫరోరాజు. మేల్కొనెను.

5. అతడు మరల నిద్రపోయెను. మరల ఒక కలకనెను. కలలో ఒక దంటుకు ఏడు మంచి పుష్టిగల కంకులు పుట్టుటచూచెను.

6. వాని తరువాత ఏడు సన్నని పీలకంకులు పుట్టెను. అవి తూర్పుగాలి వీచుట చేత యెండిపోవుచుండెను.

7. ఈ పీలకంకులు గట్టి కంకులను మ్రింగివేసెను. ఫరోప్రభువు మేల్కొని అది కలయని గ్రహించెను.

8. తెల్లవారిన తరువాత అతని మనస్సు కలవర పడెను. ఫరోరాజు ఐగుప్తుదేశములో ఉన్న సర్వ మంత్రగాండ్రను, సమస్తజ్ఞానులను పిలిపించి, వారికి తన కలలను గూర్చి చెప్పెను. కాని వారిలో స్వప్న ఫలములను వివరించు వాడొక్కడును లేడాయెను.

9. అంతట ముఖ్య పానీయవాహకుడు తన యేలికతో “ఈ నాటికి నేను చేసిన తప్పులు నాకు తెలిసి వచ్చినవి.

10. ఒకసారి ఏలినవారు దాసులమీద కోపపడితిరి. అప్పుడు నన్నును, ముఖ్యవంటవానిని అంగరక్షకనాయకుని అధీనమునందుంచి చెరసాలలో వ్రాయించిరి.

11. ఒకరాత్రి మేమిరువురము కలలు గంటిమి. అవి వేరువేరు భావములు కలవి.

12. చెరసాలలో మాతో పాటు ఒక హెబ్రీయ పడుచువాడు ఉండెను. అతడు అంగరక్షకనాయకుని సేవకుడు. మేమతనికి మా కలలు చెప్పుకొంటిమి.

13. అతడు చెప్పినట్టే మా కలలు నిజములైయినవి. నాకు కొలువు దొరికినది, వంట వానిని ఉరితీసిరి.”

14. ఫరోరాజు యోసేపును పిలువనంపెను. సేవకులు అతనిని. శీఘ్రముగా కొనివచ్చిరి. అతడు క్షౌరముచేయించుకొని మంచి ఉడుపులు తాల్చి ఫరో ప్రభువు సముఖమునకు వచ్చెను.

15. ప్రభువు అతనితో “నేను ఒక కలకంటిని. దాని ఫలమును తెలియజేయువాడొక్కడును కనబడుటలేదు. నీవు స్వప్నార్ధములను వివరింపగలవని వింటిని” అనెను.

16. దానికి యోసేపు “నేనెంతవాడను? ఏలినవారికి మేలు కలుగునట్లుగా దేవుడే చెప్పగలడు” అని బదులు చెప్పెను.

17. అంతట ఫరోరాజు యోసేపుతో ఇట్లు చెప్పెను: “కలలో నేను నైలునది ఒడ్డున నిలబడితిని.

18. కండపట్టి చూడచక్కగానున్న ఏడు ఆవులు నది నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను.

19. తరువాత బక్కచిక్కి వికారముగానున్న మరి ఏడు ఆవులు పైకి వచ్చెను. ఇట్టి బక్క ఆవులను నేను ఐగుప్తు దేశమున ఎన్నడును, ఎచ్చటను చూచియెరుగను.

20. బక్కచిక్కి వికారముగానున్న ఆవులు మొదట వచ్చిన మంచి ఆవుల ఏడింటిని తినివేసెను.

21. అయినప్పటికి వాని కడుపులో కండపట్టిన ఆవులు ఉన్నట్లెవడును కనుగొనలేదు. బక్కచిక్కిన ఆవులెప్పటి మాదిరిగనే ఉండెను. నేనప్పుడు మేల్కొంటిని.

22. తిరిగి నిద్రపోతిని. మరియొక కలగంటిని. ఒక దంటుకు ఏడు మంచి పుష్టిగల కంకులు పుట్టుట చూచితిని.

23. వాని తరువాత తూర్పుగాలి తగిలి యెండి, మాడిపోయిన ఏడు పీలకంకులు పుట్టెను.

24. ఈ పీలకంకులు గట్టికంకులను ఏడింటిని మ్రింగివేసెను. నేను దీనినంతయు శాకునికులతో చెప్పితిని. కాని వివరించువాడు ఎవ్వడును కనబడలేదు.”

25. అంతట యోసేపు “దేవరవారు కన్న కలలు రెండునూ ఒక్కటియే. దేవుడు తాను చేయబోవు పనిని ఏలినవారికి తెలియచేసెను,

26. మంచి ఆవులు ఏడును ఏడుసంవత్సరములు. అట్లే మంచికంకులు ఏడును ఏడేండ్లు, కల ఒక్కటియే,

27. మంచి ఆవుల తరువాత పైకి వచ్చిన బక్కచిక్కి వికారముగానున్న ఆవులు ఏడును ఏడేండ్లు. తూర్పుగాలి తగిలి మాడి పోయిన ఏడు పీలకంకులు ఏడు కరువుయేండ్లు.

28. నేను చెప్పినట్లు దేవుడు తాను చేయబోవు పనిని ఏలినవారికి తెలియచేసెను.

29. మొదట ఏడేండ్లు ఐగుప్తుదేశమంతట పుష్కలముగా పంటలుపండును.

30. తరువాత ఏడేండ్లు దేశమంతట భయంకర క్షామము సంభవించును. దీనివలన ఐగుప్తు దేశము నందలి ప్రజలెల్లరు మొదటి ఏడేండ్ల సమృద్ధిని మరచిపోవుదురు. ఆ కరువు వలన దేశము మలమల మాడిపోవును.

31. రానున్న కరువు మహాదారుణమైనది. కావున సుభిక్షముగా సాగిపోయిన యేండ్లను ఈ దేశీయులెవ్వరును స్మరింపరు.

32. ఈ విపత్తు కలుగవలెనని దేవుడు ఇదివరకే సంకల్పించెను. ఇక అచిరకాలముననే దానిని కలిగించితీరును. రెండు కలలువచ్చుటకు హేతువు ఇదియే.

33. అందుచేత ఏలినవారు వెంటనే వివేకశీలి, ఉపాయశాలి అగువానినన్వేషించి, దేశమును అతని వశము కావింపవలయును.

34. అంతేకాదు. దేశమునందంతట అధికారులను నియమింపవలయును. పుష్కలముగా పంటలుపండు ఏడేండ్ల కాలములో, పంటలో ఐదవవంతు సేకరింపవలయును.

35. ఈ విధముగా సుభిక్షములైన ఏడేండ్లలో లభించు పంటనంతయును ప్రోగుచేయవలయును. ప్రోగుచేసినపంటను ఏలినవారి వశముచేసి నగరములో భద్రపరుపవలయును.

36. అది. ఐగుప్తు దేశమున కరువు తాండవించు ఏడేండ్లు గుప్తాహారముగా ఉండును. ఇట్లు చేసినచో దేశము క్షామమునకు బలిగాదు” అని వక్కాణించెను.

37. ఇది విని ఫరోరాజు అతని కొలువువారు సంతసించిరి.

38. అతడు యోసేపును చూపి వారితో “దేవుని ఆత్మగల ఇట్టి మానవుని మరొకనిని మనము చూడగలమా?" అనెను.

39. తరువాత అతడు యోసేపుతో “ఇది అంతయు దేవుడు నీకెరుకపరిచెను. కావున నీ వంటి ఉపాయజ్ఞుడు, వివేకి వేరోకడు లేడు.

40. నా ఇంటి పెత్తనమంతయు నీదే. నా ప్రజలందరు నీ మాటకు కట్టువడియుందురు. ఒక్క సింహాసనము విషయమున మాత్రమే నేను నీ కంటెను అధికుడను.

41. ఇదిగో! నేటినుండి నిన్ను ఐగుప్తుదేశమునకు సర్వాధికారిగా నియమించుచున్నాను” అని చెప్పెను.

42. ఇట్లు చెప్పి తనచేతనున్న రాజాంగుళీకమును యోసేపు చేతికి పెట్టెను. ధరించుటకు పట్టువస్త్రముల నిచ్చెను. మెడలో బంగారు గొలుసు వేసెను.

43. అతనిని రాజరథమునకు సాటియైన మరియొక రథము ఎక్కించి వాడవాడల త్రిప్పించెను. సేవకులు రథము ముందుండి 'ఇతనికి నమస్కరించుడు' అని కేకలువేసిరి. ఈ విధముగా యోసేపును ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించి ఫరోరాజు.

44. “ఇదిగో! ఫరోనైన నేను చెప్పుచున్నాను. వినుము. ఈ ఐగుప్తుదేశమున నీ అనుమతి లేకుండ ఏ ఒక్కడును కాలుచేయి కదల్పడు” అనెను.

45.పిదప యోసేపునకు జఫెనత్పానెయా అను మారుపేరు పెట్టెను. అతనికి ఓను పట్టణ పురోహితుడైన పోతీఫెర కుమార్తెయగు ఆస్నతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు ఐగుప్తుదేశము నందంతట తిరిగెను.

46. ఫరోరాజు కొలువులో చేరిననాటికి యోసేపు వయస్సు ముప్పదియేండ్లు. అతడు రాజు సెలవు తీసికొని దేశమునందంతట పర్యటించెను.

47. ఏడేండ్లు పుష్కలముగా పంటలుపండినవి.

48. యోసేపు దేశమున పండిన పంటనంతయు సేకరించెను. దానిని పట్టణములో నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునున్న పొలములలో పండిన పంటను ఆ పట్టణమునందే భద్రపరిచెను.

49. అతడు పెద్ద పెద్ద మొత్తములలో ధాన్యమును నిలువచేసెను. సముద్రపు ఇసుక తిప్పలవలె ధాన్యరాసులు పెరిగినవి. అవి కొలతల కందనివి కనుక అతడు వానిని కొలువలేక పోయెను.

50. కరువు వచ్చుటకు ముందు యోసేపునకు ఆస్నతువలన ఇద్దరు కుమారులుపుట్టిరి. ఆస్నతు ఓనుపట్టణ పురోహితుడైన పోతీ ఫెర కుమార్తె.

51. దేవుడు నన్ను కన్నవారిని, నా కష్టములను మరచిపోవునట్లు చేసెనని యోసేపు పెద్దకుమారునికి 'మనష్షే' అను పేరు పెట్టెను.

52. నేను కష్టముల పాలైన దేశమునందే దేవుడు నాకు వృద్ధినిచ్చెనని రెండవ కుమారునకు 'ఎఫ్రాయీము" అను పేరు పెట్టెను.

53. యోసేపు చెప్పినట్లు సమృద్ధిగా పంటలు పండిన ఏడేండ్లు కడచిన తరువాత ఏడేండ్లపాటు కరువు వచ్చెను.

54. ప్రతిదేశమున క్షామము సంభవించినది. కాని ఐగుప్తు దేశములో మాత్రము కావలసినంత తిండి దొరకినది.

55. ఐగుప్తు  దేశమందంతట కరువురాగా ప్రజలు ఫరోరాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు "యోసేపు దగ్గరకు వెళ్ళుడు. ఆయన చెప్పినట్టు చేయుడు” అని వారిని ఆజ్ఞాపించెను.

56. దేశము నాలుగుచెరగుల కరువు తాండవించుచున్నది. కనుక యోసేపు ధాన్యపు గిడ్డంగులను తెరచి ప్రజలకు ధాన్యము అమ్మించెను.

57. ప్రతి దేశమున క్షామము దుర్బరముగా ఉండెను. అందుచే సమస్త దేశస్థులు యోసేపువద్ద ధాన్యము కొనుటకై ఐగుప్తుదేశమునకు వచ్చిరి. 

 1. యాకోబు ఐగుప్తుదేశములో ధాన్యమున్నదని వినెను. తన కుమారులను పిలిచి “మీరెందుకు ఒకరి మొగమొకరు చూచుకొనుచు నిలబడితిరి?

2. ఐగుప్తుదేశమున కావలసినంత ధాన్యమున్నదని వింటిని. వెళ్ళి ధాన్యముకొని తీసికొని రండు. అట్లయినగాని మన ప్రాణములు నిలువవు. లేనిచో మనము చత్తుము” అనెను.

3. అంతట యోసేపు సోదరులు పదుగురు ధాన్యము కొనుటకు ఐగుప్తు దేశము వెళ్ళిరి.

4. కానియాకోబు యోసేపునకు సొంత తమ్ముడైన బెన్యామీనును మాత్రము అన్నలవెంట పంపలేదు. అతనికి ఏ అపాయమైన సంభవించునేమో నని తండ్రి భయపడెను.

5. కనానులోకూడ కరువు వచ్చుటచే ఇతరులతో పాటు యిస్రాయేలు కుమారులుకూడ ధాన్యము కొనుటకై ఐగుప్తుదేశము వచ్చిరి.

6. యోసేపు ఐగుప్తు దేశములో సర్వాధికారికదా! దేశ ప్రజలకందరకును ధాన్యము అమ్మెడివాడు అతడే. యోసేపు సోదరులు వచ్చి అతనికి సాష్టాంగ ప్రణామములు చేసిరి.

7. అతడు సోదరులనుచూచి గుర్తుపట్టెను. కాని గుర్తు పట్టనట్లు నటించి వారితో పరుషముగా మాట్లాడెను. “మీరు ఎక్కడినుండి వచ్చితిరి?” అని యోసేపు వారి నడిగెను. వారు అందులకు “ధాన్యము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితిమి” అని చెప్పిరి.

8. యోసేపు సోదరులను గుర్తుపట్టెను కాని, వారతనిని గుర్తుపట్టలేకపోయిరి.

9. యోసేపు వారిని గూర్చి కన్నకలలను కూడ జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు వారితో “మీరు గూఢచారులు. మా దుర్గముల లోటు పాటులు తెలిసికొనుటకు వచ్చితిరి” అనెను.

10. వారు “లేదు ప్రభూ! మీ దాసులమైన మేము ధాన్యము కొనుటకు వచ్చితిమి.

11. మేమందరము ఒక తండ్రి బిడ్డలము. ఏలినవారి దాసులమైన మేము ఋజు వర్తనులము కాని గూఢచారులముకాము” అనిరి.

12. “కాదు మీరు మా దేశము లోగుట్టు తెలిసికొనుటకే వచ్చితిరి” అని యోసేపు అనెను.

13. వారు “ప్రభూ! మేము అన్నదమ్ములము పండ్రెండుమందిమి. ఒక తండ్రి బిడ్డలము, కనాను దేశీయులము. మాలో కడగొట్టువాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు. మరొకడు లేడు” అని చెప్పిరి.

14. యోసేపు మరల వారితో “మీరు చెప్పునది నిజముకాదు. నేను చెప్పినట్టుగా మీరు గూఢచారులే.

15. దీనితో మీ యదార్థత బయటపడును. మీ కడగొట్టు తమ్ముడు ఇక్కడికి రానిచో మీరు ఇక్కడినుండి కదలుటకు వీలులేదు. ఫరోరాజు ప్రాణములమీద ఒట్టు.

16. మీ తమ్ముని తీసికొనివచ్చుటకు మీలో ఒకనిని పంపుడు. మిగిలినవారు చెరసాలలో ఉండుడు. అప్పుడుగాని మీమాటలలోని నిజముతేలదు.

17. ఫరో జీవము తోడు. దీనికి అంగీకరింపకున్న మీరు నిక్కముగా గూఢచారులే” అని చెప్పి వారినందరిని మూడురోజులపాటు చెరలో ఉంచెను.

18. మూడవ రోజున యోసేపు సోదరులతో “నేను చెప్పినట్టుచేసిన, మీరు బ్రతికి బయటపడుదురు. నేను దైవభీతిగలవాడను.

19. మీరు సత్యవంతులమందురా! మీలో ఒకడు ఈ చెరసాలలో ఉండవలసి యుండును. మిగిలినవారు ఆకటితో అల్లాడిపోవుచున్న మీ కుటుంబముల కరువు తీర్చుటకై ధాన్యమును తీసికొనిపోవచ్చును.

20. పోయి మీ కడగొట్టు తమ్ముని తీసికొనిరండు. ఇట్లయిన మీరు చెప్పినమాటలు నిజమని ఋజువగును. మీ ప్రాణములు దక్కును” అనెను. వారు ఆ విధముగనే చేసిరి.

21. ఈ మాటలువిని వారు “మనము మన తమ్మునకు కీడు చేసితిమి కనుక మనము ద్రోహులమే. సందేహము లేదు. వాడు మనలనెంతో బతిమాలెను. వాని బాధను కనులార చూచియు, వానిమొరను పెడ చెవిని పెట్టితిమి. దానికి ఫలముగా, ఇప్పుడు మన ప్రాణముల మీది కొచ్చినది” అని తమలో తామను కొనిరి.

22. అంతట రూబేను “చిన్నవానికి కీడు చేయవలదని నేను నెత్తినోరుకొట్టుకొని చెప్పలేదా? కాని మీరు వినరైతిరి. తమ్ముని రక్తాపరాధము లెక్కించిన మనమిక నాశనమై పోవలసినదే” అనెను.

23. యోసేపు ఒక ద్విభాషిని పెట్టుకొని వారితో మాట్లాడుచుండెను. కావున తాము అనుకొన్న మాటలు యోసేపునకు తెలిసినవని అతని సోదరులు గ్రహింపరైరి.

24. యోసేపు అవతలికిపోయి కన్నీరు కార్చెను. తిరిగివచ్చి వారితో మాట్లాడెను. వారు చూచుచుండగనే షిమ్యోనును పట్టుకొని కట్టివేసెను.

25. ఆ తరువాత వారి గోతాలను ధాన్యముతో నింపవలయుననియు, ఎవరి రూకలను వారి గోతాలలో అట్టిపెట్టవలెననియు, వారి ప్రయాణమునకై ఆహార పదార్థములను సమకూర్పవలెననియు యోసేపు సేవకులకు కట్టడచేసెను. అతడు ఆజ్ఞాపించి నట్లే జరిగెను.

26. అతని సోదరులు గోతాలను గాడిదల మీదికెత్తించుకొని వెళ్ళిపోయిరి.

27. రాత్రికి వారు ఒకచోట విడిదిచేసిరి. వారిలో ఒకడు గాడిదకు మేత పెట్టుటకై గోనెసంచిని విప్పెను. గోనె మూతి దగ్గరనే అతని రూకలు కనబడెను.

28. అతను మిగిలిన వారితో “నా డబ్బు నాకు తిరిగి ఇచ్చివేసిరి. ఇదిగో! నా గోనెసంచిలోనే ఉన్నది” అని చెప్పెను. వారికి గుండెచెదిరి వణుకుపుట్టెను. “దేవుడు మనకెంత పని చేసెను!” అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. .

29. వారు కనానుదేశము చేరి తండ్రి దగ్గరకు వచ్చి జరిగినదంతయు పూసగ్రుచ్చినట్టు చెప్పిరి.

30.“ఆ దేశాధిపతి మాతో పరుషముగా మాట్లాడెను. మేము వేగులవారమని అనుకొనెను.

31. 'మేము ఋజువర్తనులమే కాని గూఢచారులముకాము.

32. పండ్రెండుమంది అన్నదమ్ములము. ఒక తండ్రి బిడ్డలము. కడగొట్టు తమ్ముడు కనాను దేశమున మా తండ్రికడ ఉన్నాడు. మరియొకడు చనిపోయెను' అని చెప్పితిమి.

33. కాని ఆ దేశాధిపతి మీరు సత్య వంతులో సత్యవంతులుకారో తెలిసికొందును. మీలో ఒకనిని నా దగ్గర వదలిపెట్టుడు. మిగిలిన వారు ఆకలితో అల్లాడుచున్న మీ కుటుంబములకు ధాన్యమును తీసికొని వెళ్ళుడు.

34. మీ కడగొట్టు తమ్ముని నా కడకు తీసికొనిరండు. ఇట్లయినగాని మీరు విశ్వాస పాత్రులనియు, గూఢచారులుకారనియు ఋజువు కాగలదు. ఆనాడు మీ సోదరుని మీకు అప్పగింతును. మీరు మా దేశమున స్వేచ్ఛగా వర్తకము చేసికొనవచ్చునని పలికెను” అని చెప్పిరి.

35. వారు గోనెసంచులను కుమ్మరించిరి. ఎవరి డబ్బులమూట వారి గోనెలలోనే ఉండెను. ఆమూటలు చూచి ఆ తండ్రీకుమారులు భయపడిరి.

36. యాకోబు వారితో “మీరు నా బిడ్డలను బ్రతుకనీయరు. యోసేపు లేడు. షిమ్యోను లేడు. ఇప్పుడు బెన్యామీనును కూడ నాకు దక్కకుండా చేయుచున్నారు. ఇదంతయు నాకెదురుతిరిగి నడుచుచున్నది” అనెను.

37. అంతట రూబేను తండ్రితో “నేను తమ్ముని తిరిగితీసికొనిరానిచో నా కుమారులిద్దరిని చంపివేయుము. వానిని నాకు అప్పగింపుము. నేనే వానిని తిరిగి తీసికొనివత్తును” అని చెప్పెను.

38. కాని యాకోబు “నా కుమారుడు మీ వెంటరాడు. వాని అన్న చనిపోయెను. ఇక మిగిలినది వీడు ఒక్కడే. దారిలో వానికి ఏ హానియైన కలిగినచో తలనెరసియున్న నేను దిగులుతో కుళ్ళి కుళ్ళి చావవలసినదే” అనెను. 

 1. దేశములో కరువు ఇంకను తీవ్రముగా ఉండెను.

2. ఐగుప్తుదేశమునుండి తెచ్చిన ధాన్యమంతయు అయిపోయినది. యాకోబు బిడ్డలను పిలిచి “ఐగుప్తుదేశమునకు మరలవెళ్ళి కొంచెము ధాన్యముతెండు” అని చెప్పెను.

3. అంతట యూదా “మీ తమ్ముడు లేకుండ మీరు నా సముఖమునకు రావలదని ఆ దేశాధికారి మోమాటము లేకుండా మమ్ము హెచ్చరించెను.

4. నీవు మావెంట తమ్ముని పంపినచో మేము వెళ్ళి ధాన్యము కొనితెత్తుము.

5. పంపనందువా! మేము వెళ్ళము. మీ తమ్ముడు వెంటలేకుండ మీరు నా సముఖమునకు రావలదని ఆ దేశాధికారి మాతో ఖచ్చితముగా చెప్పెను” అనెను.

6. ఈ మాటలువిని యిస్రాయేలు “మీరునన్నింత రాచిరంపాన పెట్టనేల? మాకింకొక తమ్ముడున్నాడని అతనితో మీరేల చెప్పితిరి?” అని అడిగెను.

7. దానికి వారు "మేము ఏమిచేయగలము? మీ తండ్రి ఇంకను బ్రతికియున్నాడా? మీకింకొక సోదరుడు కలడా? అని అతడు మనలను గూర్చి మన చుట్టపక్కాలను గూర్చి గ్రుచ్చిగుచ్చి ప్రశ్నించెను. మేము ఆ ప్రశ్నలకు బదులిచ్చితిమి. ఐగుప్తు దేశమునకు తమ్ముని తీసికొని రండని అతడు అడుగునని మేము ఏమైనా కల గంటిమా?" అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.

8. యూదా, తండ్రితో “నాతో పాటు తమ్ముని పంపుము. మేము వెంటనే బయలుదేరి వెళ్ళెదము. ఈ విధముగా చేసిన నీవు, మేము, మా పిల్లలందరమును చావక బ్రతికి పోవుదుము.

9. తమ్మునకు నేను పూచీగా నుందును. భారమంతయు నాది. అతనిని తిరిగి తీసికొనివచ్చి నీకు అప్పగింపకున్న నేను బ్రతికినన్నాళ్ళు ఆ పాపము నానెత్తికి చుట్టుకొనును.

10. ఈ విధముగా మాటలతో కాలము వెళ్ళబుచ్చకున్నచో మేము ఈపాటికి రెండవ సారి కూడ వెళ్ళివచ్చెడివారమే కదా!” అని చెప్పెను.

11. అంతట యిస్రాయేలు వారితో “మీరు కుఱ్ఱవానిని తీసికొనిపోవుట తప్పనిచో ఈ విధముగా చేయుడు. ఈ దేశములో సుప్రసిద్ధములయిన వస్తువులు -లేపనములు, తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాపప్పు, బాదముపప్పు సంచులలో తీసికొని వెళ్ళి ఆ దేశాధికారికి కానుకగా నివ్వుడు.

12. ఈసారి రెండింతలసొమ్ము తీసికొనివెళ్ళుడు. మీ సంచులలో పెట్టినసొమ్ము తిరిగి ఇచ్చివేయుడు. పోయినసారి బహుశ ఏదైనా పొరపాటు జరిగియుండవచ్చును.

13. మీ తమ్ముని కూడ వెంట బెట్టుకొనిపొండు. సూటిగా అతని దగ్గరకే వెళ్ళుడు.

14. సర్వశక్తిమంతుడు అయిన దేవుడు అతనియెదుట మిమ్మును కరుణించు గాక! మీరక్కడ వదలివచ్చిన సోదరునితోపాటు బెన్యామీనును కూడ అతడు తిరిగి పంపునుగాక! ఇక నా మాటందురా? నేను కుమారుని కోల్పోవలసివచ్చిన అటులనే కోల్పోవుదును” అనెను.

15. వారు తండ్రి చెప్పినట్లు కానుకలను, రెండురెట్ల సొమ్మును తీసికొని బెన్యామీనుతో పాటు వెంటనే ఐగుప్తుదేశమునకు బయలుదేరి వెళ్ళి, యోసేపును దర్శించిరి.

16. యోసేపు వారితో పాటు వచ్చిన బెన్యామీనును చూచెను. గృహనిర్వాహకుని పిలిచి “వీరిని ఇంటి లోపలికి తీసికొనిపొమ్ము. ఒక వేటను కోసి భోజనము సిద్ధము చేయుము. మధ్యాహ్నము వీరు నాతోపాటు భోజనము చేయుదురు” అని ఆజ్ఞాపించెను.

17. అతడు యోసేపు చెప్పినట్టు వారిని లోపలికి తీసికొనిపోయెను.

18. ఇంటిలో ప్రవేశించిన తరువాత వారికి భయము కలిగెను. వారు "మొదటిసారి వచ్చిపోయినప్పుడు మన గోనె సంచులలో పెట్టిన సొమ్ముకొరకు ఇతడు మనలను ఈ ఇంటికి రప్పించెనేమో! ఇతడేదో ఒక నేరముకల్పించి తప్పక మనలను, మన గాడిదలను వశము చేసుకొనును. మనమితని బానిసల మగుట తప్పదు” అని అనుకొనిరి.

19. ఇట్లు ఊహించి తలవాకిటిలో యోసేపు గృహనిర్వాహకుని చూచి,

20. "అయ్యా! మేము మొదటిసారి ధాన్యమును కొనుటకు వచ్చితిమికదా?

21. తిరిగి వెళ్ళుచు మేము ఆ రాత్రి విడిదిచేసినచోట ఆ గోనెసంచులు విప్పితిమి. ఒక్కొక్కరి సొమ్ము వానివాని సంచిమూతిదగ్గర ఉండుట చూచితిమి. ఆ సొమ్మును . ఈసారి తిరిగి తెచ్చితిమి.

22. ఆహార పదార్థములు కొనుటకు మరికొంత సొమ్ముకూడ దానికి జతచేసి తెచ్చితిమి. మా గోనె సంచులలో మా సొమ్మును ఎవరు ఉంచిరో మాకు తెలియదు” అనిరి.

23. వారి దీనవాక్యములువిని గృహనిర్వాహ కుడు “మీకు తప్పక మేలుజరుగును. భయపడకుడు. మీరును, మీ తండ్రులును కొలచిన దేవుడే మీ గోనె సంచులలో సొమ్ము దాచెను. ఆనాడే మాసొమ్ము మాకుముట్టినది” అని చెప్పెను. ఇట్లు చెప్పి అతడు షిమ్యోనును వారిచెంతకు తీసుకొని వచ్చెను. -

24. పిమ్మట అతడు వారిని ఇంటిలోనికి తీసికొని పోయెను. కాలు సేతులు కడుగుకొనుటకు వారికి నీళ్ళిచ్చెను. గాడిదలకు మేత వేయించెను.

25. ఆ ఇంటిలోనే తాము భోజనము చేయవలయునని వారు తెలిసికొనిరి. మధ్యాహ్నము యోసేపు వచ్చుసరికి కానుకలు సిద్ధముచేసి ఉంచిరి.

26. యోసేపు ఇంటిలోనికి వచ్చిన తరువాత వారతనికి సాష్టాంగ నమస్కారములు చేసిరి. తాముతెచ్చిన కానుకలు సమర్పించిరి.

27. యోసేపు వారి యోగక్షేమములు విచారించెను. “మీ ముదుసలి తండ్రిని గూర్చి చెప్పితిరి గదా? ఆయన క్షేమముగా ఉన్నాడా? ఇంకను బ్రతికియే ఉన్నాడా?” అని అడిగెను.

28. వారు “మీ దాసుడు, మా తండ్రి ఇంకను బ్రతికియే ఉన్నాడు. క్షేమముగనే ఉన్నాడు” అని చెప్పి సాగిలబడిరి.

29. యోసేపు తనతల్లి కడుపున పుట్టిన తమ్ముడు బెన్యామీనును జూచి "మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా?” అని వారిని ప్రశ్నించెను. తమ్మునివైపు తిరిగి "కుమారా! దేవుడు నిన్ను కరుణించునుగాక!" అనెను.

30. సోదరానురాగము యోసేపును ముంచెత్తెను, అతని కన్నులలో గిఱ్ఱున నీరుతిరిగెను. కన్నీరాపుకొన జాలక లోపలికి వెళ్ళి వెక్కివెక్కి ఏడ్చెను.

31. తరువాత ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చెను. అనురాగమును ఎట్లో బిగబట్టి భోజనము వడ్డింపుడని సేవకులకు ఆనతిచ్చెను.

32. సేవకులు యోసేపునకు వేరుగా, అతని సోదరులకు వేరుగా వడ్డించిరి. యోసేపుతో భుజించు ఐగుప్తుదేశీయులకు విడిగా వంచిరి. ఐగుప్తుదేశీయులు హెబ్రేయులతో కూడి భోజనముచేయుట హేయముగా భావింతురు.

33. సేవకులు యోసేపు సోదరులను పెద్దవాని నుండి చిన్నవాని వరకు ఈడునుబట్టి, అతనికెదురుగనే వరుసగా కూర్చుండబెట్టిరి. వారు ఒకరి మొగమొకరు చూచుకొని విస్తుపోయిరి.

34. యోసేపు తన ముందు ఉన్న ఆహారపదార్థములను తీసి అన్నదమ్ములకు పంచిపెట్టెను. బెన్యామీను వంతు వచ్చినది ఇతరులకు వచ్చిన దానికంటే ఐదురెట్లెక్కువ. ఈ విధముగా వారెల్లరు యోసేపుతో భోజనము చేసిరి. సంతృప్తిగా పానీయములు సేవించిరి. 

 1. యోసేపు తన గృహనిర్వాహకుని ఇట్లు ఆజ్ఞాపించెను: “ఆ మనుష్యులు తీసికొని పోగలిగినన్ని ఆహారపదార్థములతో వారి గోనెసంచులను నింపుము. ఎవరిరూకలు వారి సంచిమూతిదగ్గర పెట్టుము.

2. ధాన్యము కొనుటకు తెచ్చిన సొమ్ముతో పాటు నా గిన్నెను, వెండిగిన్నెను కడగొట్టు తమ్ముని గోనె సంచి మూతికడ ఉంచుము.” వాడు యోసేపు చెప్పినట్లే చేసెను.

3. తెల్లవారిన తరువాత వారు ప్రయాణమై గాడిదలను తోలుకొనిపోయిరి.

4. వారు నగరము నుండి ఎంతో దూరము వెళ్ళకమునుపే యోసేపు గృహనిర్వాహకునితో “వెంటనే వెళ్ళి వారిని కలిసికొనుము. 'చేసిన మేలునకు బదులుగా కీడు చేయుదురా? నా వెండిగిన్నెను అపహరించితిరేల?

5. ఇది మా దొర పానీయము సేవించుటకు, శకునములు చూచుటకు ఉపయోగించు గిన్నెగదా? మీరెంత పాడు పని చేసితిరి' అని అనుము” అని చెప్పెను.

6. అతడు వారిని కలిసికొని యోసేపు చెప్పుమనిన మాటలన్నియు వారివద్ద వల్లించెను.

7. అంతట వారు “ఎంతమాట సెలవిచ్చితిరి! కలలోనైన మేము ఇటువంటి పనిని తలపెట్టకుందుముగాక!

8. మా గోనెసంచుల మూతులదగ్గర డబ్బు కనబడినదికదా! వానిని మీకిచ్చివేయుటకు కనాను నుండి తెచ్చితిమి. మీ యజమానుని ఇంటినుండి వెండిగాని, బంగారముగాని దొంగిలింపవలసిన అక్కరమాకేమున్నది?

9. మాలో ఎవ్వరి దగ్గరనైన మీ గిన్నె ఉన్న వానితల తీయుడు. పైగా మేమందరము బానిసలమగుదుము” అనిరి.

10. “అటులయిన మంచిది. మీరు చెప్పునది ఒప్పుకొందును. గిన్నె కలవాడు నాకు బానిసగును. మిగిలినవారు వెళ్ళి పోవచ్చును” అని అతడనెను.

11. వెంటనే వారిలో ప్రతివాడు తన గోనె సంచిని నేలమీదికి దింపి దాని మూతివిప్పెను.

12. గృహనిర్వాహకుడు పెద్దవాని గోనెసంచి మొదలు చిన్నవాని గోనె సంచి వరకు అన్నింటిని వెదకెను. చివరకు బెన్యామీను గోనెసంచిలో గిన్నె కనబడెను.

13. ఇది చూచి వారు దుస్తులు చించుకొనిరి. గాడిదల పైకి గోతాలెత్తించు కొని నగరమునకు తిరిగివచ్చిరి.

14. యూదా సోదరులతోపాటు వచ్చుసరికి యోసేపు ఇంటివద్దనే ఉండెను. వారు అతని ముందు సాగిలబడిరి.

15. అంతట యోసేపు “మీరిటువంటి పనినెట్లు చేసితిరి? నావంటివాడు శకునములు చూచి జరిగిన కార్యము గుర్తింపకుండునా?” అనెను.

16. అప్పుడు యూదా “ప్రభూ! మేమేమి చెప్పగలము? నిర్దోషులమని ఎట్లు ఋజువు చేసికొనగలము? దేవుడే మా పాపములను కనిపెట్టెను. ఇదిగో! మేము మాతో పాటు గిన్నెగలవాడును ఏలినవారి బానిసలమయ్యెధము” అనెను.

17. దానికి యోసేపు “కలలోనైనా నేనటువంటి పనిని తలపెట్టను. గిన్నె గలవాడు నాకు బానిసగును. మిగిలిన మీరందరు ఏ దిగులు లేకుండ మీ తండ్రి దగ్గరకెళ్ళవచ్చును.” అనెను.

18. యూదా అతని దగ్గరకెళ్ళి "ప్రభూ! నా మనవిని చిత్తగింపుడు. ఏలినవారితో ఒక్కమాట చెప్పు కొననిండు. ఈ దాసునిపై కోపపడకుడు. మీరు ఫరో ప్రభువు వంటివారు.

19. ఏలినవారు 'మీకు తండ్రి ఉన్నాడా? తమ్ముడున్నాడా?' అని తమ దాసులను అడిగితిరి.

20. 'కాటికి కాళ్ళుచాచిన తండ్రి ఉన్నాడు. ఆయనకు ముసలితనమున పుట్టిన కొడుకున్నాడు. వాడుచిన్నవాడు. అతని సోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలెను. వాడన్నచో తండ్రికెంతో గారాబము' అని మేము చెప్పితిమి.

21. తరువాత ఏలినవారు 'నేనతనిని చూడవలయును. నా దగ్గరకు అతనిని తీసికొనిరండు' అని చెప్పితిరి.

22. అంతట మేము 'ఆ చిన్నవాడు తండ్రిని వదలిరాలేడు. వాడు కంటబడనిచో తండ్రికి ప్రాణములు నిలువవు' అని చెప్పితిమి.

23. కాని మీరు 'మీ తమ్ముడు మీతోపాటు ఇక్కడికి రానిచో మీరు మీ ముఖము నాకు చూపవలదు' అంటిరి.

24. మేము తిరిగి వెళ్ళి మీ దాసుడైన మా తండ్రికి ఏలినవారు చెప్పిన మాటలన్నియు చెప్పితిమి.

25. ఆ పిమ్మట 'మరలవెళ్ళి ఆహార పదార్థములు కొని తీసికొనిరండు' అని మా తండ్రి చెప్పెను.

26. 'మేమక్కడికి వెళ్ళలేము. తమ్ముడు లేకుండ మేమాయన ఛాయలకే పోరాదు. తమ్ముడు మా వెంట వచ్చినచో వెళ్ళెదము' అని అంటిమి.

27. దానికి మీదాసుడైన మా తండ్రి 'మీకు తెలియని దేమున్నది? నా భార్య ఇద్దరు కుమారులను కనెను.

28. వారిలో ఒకడు నన్నొదలిపోయెను. ఏదో మృగము నిశ్చయముగా వానిని కండతుండెములు చేసియుండునని అనుకొంటిని. వాడు ఈనాటివరకు కనబడలేదు.

29. ఉన్న ఈ ఒక్క కుమారునికూడ మీరు నాకు దూరము చేయుదురా? వానికి ఏ హానియైన కలిగిన ముదుసలినై, తలనెరసియున్న నేను దిగులుతో కుళ్ళి కుళ్ళి చావవలసినదే' అని అనెను.

30. ఇప్పుడు మాత్రము ఈ చిన్నవాడు లేకుండ నేను మా తండ్రి దగ్గరకు వెళ్ళినచో మా తండ్రి ప్రాణ మితనితో ముడిపడియున్నది కనుక, జరగబోవునది ఒక్కటియే.

31. తమ్ముడు మా వెంటరాలేదని తెలిసిన వెంటనే మా తండ్రి మరణించును. మీ దాసులమైన మేమే ముదుసలియై తలనెరసియున్న మీ దాసుడైన మా తండ్రి దిగులుతో కుళ్ళి కుళ్ళి చనిపోవుటకు కారణమగుదుము.

32. ప్రభూ! మా తమ్మునికై మా తండ్రికి పూచీ ఇచ్చినది మీ దాసుడనైన నేనే. 'నేను తమ్ముని తిరిగి తీసికొనిరానిచో బ్రతికినన్నాళ్ళు ఆ పాపము నా నెత్తికి చుట్టుకొనును' అని మా తండ్రితో చెప్పితిని.

33. మా తమ్మునకు బదులుగా నేను ఏలిన వారి బానిసనగుదును. సోదరులతోపాటు అతనిని వెళ్ళనిండు.

34. తమ్ముడు లేకుండ తండ్రి దగ్గరకు ఏ మొగము పెట్టుకొనివెళ్ళెదను? నా తండ్రికి దాపురించు విపత్తును నేను చూడజాలను” అనెను. 

 1. యోసేపు సేవకుల ఎదుట తన భావోద్వేగమును అణచుకొనజాలకపోయెను. “మీరందరు నా యెదుటనుండి వెళ్ళిపొండు” అని వారికి ఆనతిచ్చెను. కావున యోసేపు సోదరులకు తన్నుతాను ఎరుక పరుచుకొన్నప్పుడు అక్కడ ఎవరును లేరు.

2. అతడు బిగ్గరగా ఏడ్చెను. ఐగుప్తుదేశీయులు, ఫరోరాజు పరివారము ఆ ఏడుపు వినిరి.

3. “నేనే యోసేపును, నా తండ్రి ఇంకను బ్రతికి ఉన్నాడా?” అని అతడు సోదరులను అడిగినపుడు తమ్ముని గుర్తుపట్టిన యోసేపు సోదరులకు నోటమాటరాలేదు. వారతని ప్రశ్నలకు భయపడి వెంటనే బదులు చెప్పలేకపోయిరి.

4. అంతట యోసేపు సోదరులను దగ్గరకు రండు అనగా వారతని చెంతకువచ్చిరి. అతడు వారితో “మీరు ఐగుప్తుదేశీయులకు అమ్మిన యోసేపును నేనే. మీ సోదరుడను.

5. నన్ను బానిసగా అమ్మివేసినందుకు మీరు దుఃఖించుచు కలతచెందవలదు. మీ ప్రాణములను రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను.

6. దేశములో రెండేండ్లనుండి కరువుఉన్నది. ఇక ఐదేండ్లదాక సేద్యముకాని, కోతలుగాని ఉండవు.

7. మిమ్ము అందరిని ప్రాణములతో కాపాడుటకు మీ బిడ్డలను శేషప్రజలుగా భూమిపై నిలుపుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను.

8. నన్ను ఇక్కడకు పంపినది దేవుడేకాని మీరుకారు. నన్ను ఫరో రాజునకు తండ్రిగాను, అతని ఇంటికి సర్వాధికారిగాను, ఐగుప్తుదేశమునకు పాలకునిగాను చేసినవాడు దేవుడే.

9. తొందరగా తండ్రి దగ్గరకెళ్ళి నా మాటగా ఈ సందేశమును వినిపింపుడు: 'నీ కుమారుడు యోసేపు ఇట్లనుచున్నాడు. దేవుడు ఐగుప్తుదేశమున కంతటికి నన్ను ప్రభువుగా నియమించెను. వెంటనే నా దగ్గరకు రమ్ము. జాగుచేయకుము.

10. గోషేను మండలములో నివసింపుము. నీవు, నీ కొడుకులు, నీ మనుమలు, నీ మందలు, నీ పశువులగుంపులు ఇంత ఏల? నీదన్నదంతయు నా దగ్గర ఉండవచ్చును.

11. ఇంకను ఐదేండ్లదాక కరువు ఉండును. కావున నిన్ను పోషించు భారమునాది. నీకు, నీ జనులకు, నీ మందలకు ఏ లోటు కలుగనీయను.

12. ఇదిగో మీ కన్నులును, నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నట్లు, మీతో మాట్లాడుచున్న యోసేపును నేనే.

13. ఐగుప్తుదేశములో నాకున్న ప్రాభవమును నా తండ్రికి తెలియజేయుడు. మీరు చూచినదంతయు ఆయనకు చెప్పుడు. తొందరగా వెళ్ళి ఆయననిక్కడికి తీసికొనిరండు.”

14. ఇట్లనుచు యోసేపు బెన్యామీను మెడపై మొగము వాల్చి ఏడ్చెను. బెన్యామీనును అట్లే చేసెను.

15. యోసేపు సోదరులందరిని ముద్దాడుచు ఏడ్చెను. తరువాత వారు యోసేపుతో మాట్లాడిరి.

16. యోసేపు సోదరులొచ్చిరన్న వార్త ఫరోరాజు ఇంటికి ప్రాకెను. అతడు, అతని కొలువువారు సంతసించిరి.

17. ఫరోరాజు యోసేపుతో ఇట్లనెను: “నీ సోదరులతో నామాటగా చెప్పుము. మీరు చేయ వలసినది ఇది. కావలసినంత గాడిదల మీదికెత్తించు కొని కనాను దేశమునకెళ్ళుడు.

18. మీ తండ్రిని మీ ఇంటిల్లపాదిని వెంటబెట్టుకొని నా వద్దకురండు. ఐగుప్తుదేశములో ఉన్న సారవంతమైన భూమిని మీ వశము చేసెదను. ఈ భూసారమును మీరు అనుభవింపుడు.

19. ఇంకను నా మాటలుగా వారితో ఇట్లు చెప్పుము. భార్య పిల్లలను కొనివచ్చుటకు ఐగుప్తు దేశమునుండి బండ్లు తోలుకొనిపొండు. మీ తండ్రిని తీసికొనిరండు.

20. మీ ఆస్తిపాస్తులను వదలి వచ్చుటకు బాధపడకుడు. ఐగుప్తుదేశములోని సార వంతమైన భూమి మీవశమగును.”

21. యిస్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. ఫరోరాజు ఆజ్ఞననుసరించి యోసేపు వారికి బండ్లు సిద్ధముచేయించెను. దారి బత్తెములిప్పించెను.

22. వారిలో ఒక్కొక్కరికి ఒకజత మేలిమి దుస్తులను ఇప్పించెను. కాని బెన్యామీనుకు మాత్రము మున్నూరు వెండినాణెములను, ఐదుజతల మేలిమి దుస్తులను ఇచ్చెను.

23. అంతేకాక ఐగుప్తుదేశములో ఉన్న ప్రశస్తవస్తువులను పది గాడిదల పైకెత్తించి తండ్రికి పంపెను. తండ్రి వచ్చునపుడు దారి బత్తెమునకు కావలసిన ధాన్యమును, ఆహారపదార్థములను పది ఆడుగాడిదల మీద పంపెను.

24. త్రోవలో తగవులు వలదని హెచ్చరించి అతడు సోదరులను సాగనంపెను.

25. ఈ విధముగా వారందరు ఐగుప్తుదేశము నుండి బయలుదేరి కనాను దేశమునందున్న యాకోబు వద్దకు వచ్చిరి.

26. వారు యాకోబుతో "యోసేపు ఇంకను బ్రతికియేయున్నాడు. ఐగుప్తుదేశమునెల్ల ఏలుచున్నాడు” అని చెప్పిరి. ఆ పలుకులకు యాకోబు నివ్వెరపడెను. వారి మాటలు నమ్మలేకపోయెను.

27. యోసేపు సోదరులు అతడు చెప్పిన మాటలన్నియు తండ్రికి చెప్పిరి. తనను తీసికొనిపోవుటకై యోసేపు పంపిన బండ్లను చూచినపుడు యాకోబు ప్రాణము కుదుటపడెను.

28. యిస్రాయేలు “ఇకచాలు! నా కుమారుడు యోసేపు బ్రతికియే ఉన్నాడు. ఈ బొందిలో ప్రాణము లుండగనే వెళ్ళి ఒక్కసారి వానిని కన్నులార చూతును” అనెను. 

 1. యిస్రాయేలు తనకున్నదంత బేర్షెబాకు వచ్చెను. అచట తనతండ్రి ఈసాకు కొలిచిన దేవునకు బలులర్పించెను.

2. రాత్రివేళ దర్శనములో దేవుడు “యాకోబూ! యాకోబూ!” అని పిలిచెను. యాకోబు “చిత్తముప్రభూ!” అనెను.

3. అప్పుడు దేవుడు “నేను ప్రభుడను. నీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తుదేశము వెళ్ళుటకు భయపడకుము. అచ్చట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును.

4. నీతోపాటు నేనును ఐగుప్తుదేశమునకు వత్తును. తప్పక నిన్ను తిరిగి తీసికొనివత్తును. నీవు మరణించునపుడు యోసేపు నీ కన్నులు మూయును” అని చెప్పెను.

5. అంతట యాకోబు బేర్పెబా నుండి బయలుదేరెను. యిస్రాయేలు కుమారులు తమ తండ్రి యాకోబును భార్యాపిల్లలను ఫరోరాజు పంపిన బండ్లమీది కెక్కించిరి.

6. కనానులో గడించిన మందలను, వస్తుసామగ్రిని ప్రోగుచేసికొని యాకోబు, అతని సంతతి ఐగుప్తుచేరెను.

7. యాకోబు తన కుమారులను, కుమార్తెలను, మనుమలను, మనుమరాండ్రను యావత్సంతతిని తనతోపాటు ఐగుప్తుదేశమునకు కొనివచ్చెను.

8. ఐగుప్తుదేశమున ప్రవేశించిన యిస్రాయేలు పిల్లల పేర్లు ఈ క్రింది విధముగా ఉన్నవి. యాకోబు, అతని కుమారులు: యాకోబు జ్యేష్ఠపుత్రుడు రూబేను.

9. హనోకు, పల్లు, హెస్రోను, కర్మి అనువారు రూబేను కుమారులు.

10. యమూవేలు, యామీనులు, ఓహాదు, యాకీను, సోహరు, కనానీయురాలి కుమారుడైన దింపవచ్చును. షావులు అనువారు షిమ్యోను కుమారులు.

11. అవి కుమారులైన గెర్షోను, కోహాతు, మెరారి.

12. ఎరు, ఓనాను, షేల, పెరెసు, సెరా అనువారు యూదా కుమారులు. వీరిలో ఎరు, ఓనాను కనానుదేశమందే మరణించిరి. పెరెసుకుమారులైన ఎస్రోను, హామూలు.

13. యిస్సాఖారు కుమారులైన తోలా, పువా, యోబు, సిమ్రోను.

14. సెబూలూను కుమారులైన సెరెదు, ఏలోను,  యాహ్లేలు.

15. వీరందరును లేయా పుత్రులు. ఆమె యాకోబునకు పద్దనారాములో వీరిని కనెను. వారికొక కుమార్తెయు కలదు. ఆమె పేరు దీనా. యాకోబు కుమారులు కుమార్తెలు మొత్తము ముప్పది ముగ్గురు.

16. సిఫియోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, ఆరేలి అనువారు గాదు కుమారులు.

17. ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా అనువారు ఆషేరు కుమారులు. వీరి సోదరి సేరా.

18. బెరెయా కుమారులైన హెబెరు, మాల్కీయేలు. లాబాను తన కుమార్తె లేయాకు దాసిగా ఇచ్చిన జిల్పా సంతతివారు వీరు. ఈమె ఈ పదునారుమందిని యాకోబునకు కనెను.

19. యోసేపు, బెన్యామీను అనువారు రాహేలు కుమారులు.

20. మనష్షే, ఎఫ్రాయీము అనువారు ఐగుప్తుదేశములో యోసేపునకు పుట్టిరి. ఓను నగర పురోహితుడైన పోతీఫెర కుమార్తె ఆస్నతు వారిని కనెను.

21. బేలా, బేకెరు, అస్బెలు, గేరా, నామను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, ఆర్డు అనువారు బెన్యామీను కుమారులు.

22. వీరందరు రాహేలు సంతతి. ఆమెకు, యాకోబునకు జన్మించిన వీరు మొత్తము పదునలుగురు.

23. దాను కుమారుడైన హషీము.

24. యహసేలు, గుని, యేజరు, షిలేము అనువారు నఫ్తాలి కుమారులు.

25. వీరందరు లాబాను తన కుమార్తెయైన రాహేలు నకు దాసిగా ఇచ్చిన బిలా సంతతివారు. ఆమె ఈ ఏడుగురిని యాకోబునకు కనెను.

26. యాకోబుతోపాటు ఐగుప్తు దేశమునకు వచ్చిన అతని కుమారులు మొత్తము అరువది ఆరుగురు. ఈ లెక్కలో అతని కుమారుల భార్యలు చేరలేదు.

27. ఐగుప్తు దేశములో యోసేపునకు ఇద్దరు కుమారులు పుట్టిరి. ఈ విధముగా ఐగుప్తు దేశములో ప్రవేశించునాటికి యాకోబు కుటుంబము వారందరు మొత్తము డెబ్బదిమంది.

28. గోషేనులో యోసేపును కలిసికొనుటకై యాకోబు యూదాను పంపెను. పిదప వారు గోషెను చేరిరి.

29. యోసేపు రథము సిద్ధము చేయించుకొని తండ్రిని చూచుటకై గోషేను వెళ్ళెను. తండ్రిని కలసి కొని అతని మెడ పై వ్రాలి, ఎంతో సేపు ఏడ్చెను.

30. యిస్రాయేలు యోసేపుతో “నాయనా! బ్రతికి బట్టగట్టు కొనుచున్న నిన్ను కన్నులార చూచితిని. ఇక నేను చీకుచింతలేకుండ చనిపోయెదను” అనెను.

31. అంతట యోసేపు తన సోదరులను తండ్రి పరివారమును చూచి “ఇక నేను వెళ్ళి ఫరోరాజుతో కనాను దేశములోనున్న మా సోదరులు మా తండ్రి కుటుంబము వారందరు నా దగ్గరకు వచ్చిరి.

32. వారు గొఱ్ఱెల కాపరులు. వారికి ఆలమందలు గొఱ్ఱెగుంపులు కలవు. ఆలమందలతో తమకున్న ఇతర సంపదలతో వారు వచ్చిరని చెప్పెదను.

33. కావున ఫరోరాజు పిలిపించి మీ వృత్తేమి? అని ప్రశ్నించిన,

34. ప్రభూ! మా తాత ముత్తాతల మాదిరిగా మేము చిన్ననాటినుండి గొఱ్ఱెల కాపరులమే అని చెప్పుడు. అప్పుడు మీరు గోషేనులో స్థిరపడవచ్చును. ఈ ఐగుప్తు దేశీయులు గొఱ్ఱెలకాపరులను హేయముగా చూతురు” అని అనెను. 

 1. యోసేపు వచ్చి ఫరోరాజుతో “మా తండ్రి, సోదరులు కనానుదేశమునుండి వచ్చిరి. ఆలమందలతో గొఱ్ఱెలగుంపులతో సమస్తవస్తువులతో వచ్చి వారిపుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పెను.

2. పిదప అతడు తన సోదరులలో ఐదుగురిని ఫరోరాజు సముఖమునకు కొనివచ్చెను.

3. ఫరోరాజు “మీ వృత్తి యేమి?” అని వారినడిగెను. అంతటవారు “దొరా! మేము గొఱ్ఱెలకాపరులము. మా తాతముత్తాతలు కూడ మావంటివారే.

4. మేము ఈ దేశములో కొన్నాళ్ళపాటు బ్రతుకవచ్చితిమి. క్షామమునకు బలియైన కనానుదేశములో మందలకు మేతలేదు. గోషేను మండలములో మేముండుటకు దేవరవారు సెలవు దయచేయవలయునని, ఈ దాసులు వేడుకొనుచున్నారు” అనిరి.

5. ఫరోరాజు యోసేపుతో “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చిరన్నమాట!

6. ఈ ఐగుప్తుదేశమంతయు నీ ముందున్నది! సారవంతమైనచోటికి వారిని చేర్పుము. వారు గోపెనులో ఉండవచ్చును. వారిలో సమర్థులను మా మందలకు నాయకులుగా చేయుము” అనెను.

7. తరువాత యోసేపు తన తండ్రిని ఫరోరాజు సముఖమునకు గొనివచ్చెను. యాకోబు ఫరోరాజును దీవించెను.

8. “నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని?” అని ఫరోరాజు యాకోబును అడిగెను.

9. యాకోబు రాజుతో “నా ఇహలోకయాత్ర నూట ముప్పదియేండ్ల నుండి సాగుతున్నది. నాకు ఎన్నో ఏండ్లు లేవు. అవియును కష్టములతో గడిచిపోయినవి. మా తాతముత్తాతలు నాకంటె ఎక్కువయేండ్లే బ్రతికిరి” అని ప్రత్యుత్తరమిచ్చెను.

10. తరువాత యాకోబు ఫరోరాజును దీవించి, అతని సముఖమునుండి వెడలి పోయెను.

11. ఫరోరాజు ఆనతిచ్చినట్లే యోసేపు తండ్రికి, సోదరులకు ఐగుప్తు దేశములో ప్రశస్తమయిన రామెసేసు మండలమందలి భూము లిచ్చి నివాసములు ఏర్పరచెను.

12. అతడు తండ్రిని, సోదరులను, వారి కుటుంబములవారినందరిని వారి వారి లెక్కచొప్పున ఆహారమిచ్చి పోషించెను.

13. క్షామము దుర్బరముగానుండెను. దేశములో తిండి లేదు. కనానుదేశము, ఐగుప్తుదేశము దెబ్బతిన్నవి.

14. యోసేపు ఐగుప్తుదేశములో, కనాను దేశములో ధాన్యమును అమ్మగా వచ్చిన ద్రవ్యమును ప్రోగుచేసి ఫరోరాజు కోశాగారమునకు చేర్చెను.

15. ఐగుప్తుదేశములో కనాను దేశములో ఉన్న ద్రవ్యమంత వ్యయమైపోయినది. ఐగుప్తుదేశీయులు యోసేపుకడకువచ్చి “మా సొమ్మంతయు వ్యయమై పోయినది. మాకింత తిండి పెట్టుము. లేనిచో నీ కన్నులముందే మేముచత్తుము” అని మొరపెట్టుకొనిరి.

16. అంతట యోసేపు “మీ దగ్గర సొమ్ము లేక పోయిననేమి? మందలున్నవిగదా! వానిని నాకిచ్చి వేయుడు. మీకు ధాన్యమిచ్చెదను” అని చెప్పెను.

17. వారు మందలను తోలుకొని వచ్చి యోసేపు వశము చేసిరి. గుఱ్ఱములను, గొఱ్ఱెల గుంపులను, ఆలమందలను, గాడిదలను వశముచేసికొని వానికి బదులుగా యోసేపు ధాన్యమిచ్చెను. మందలకు బదులుగా ధాన్యమిచ్చి అతడు ఆయేడు వారిని పోషించెను.

18. ఆ యేడు గడచిపోయినది. వారు మరుసటియేడు కూడ వచ్చి “దొరా! నీదగ్గర కప్పిపుచ్చుట ఎందులకు? మా సొమ్ము అంతయు వ్యయమైపోయినది. మా మందలు మీ వశమైనవి. మేము, మా భూములు తప్ప ఇంకేమియు మిగులలేదు.

19. మీరు చూచు చుండగనే మేము, మాభూములును నాశనముగానేల? ధాన్యమిచ్చి మమ్మును, మా భూములను కొనుడు. మా భూములు ఫరోరాజునకు దక్కును. మేము వారికి దాసులము అగుదుము. మేము చావకుండుటకును, మా పొలములు బీళ్ళు కాకుండుటకును మాకు విత్తనములిండు” అనిరి. .

20. కావున యోసేపు ఐగుప్తుదేశములో ఉన్న భూములన్నింటిని ఫరోరాజు పేరిట కొనెను. కరువు దారుణముగా ఉండుటచే ఐగుప్తు దేశీయులు తమ భూములనన్నింటిని విక్రయించిరి. ఈ రీతిగా భూము లన్నియు ఫరోరాజు వశమైనవి.

21. ఐగుప్తు దేశము పొలిమేరలలో ఆ చివరనుండి ఈ చివరివరకు అతడు ప్రజలను బానిసలుగా చేసెను.

22. యోసేపు యాజకుల భూములను కొనలేదు. వారికి ఫరోరాజు బత్తెములిచ్చుచుండెను. వారు ఆ బత్తెముల మీద బ్రతుకుచుండిరి. కావున వారికి భూములు అమ్మ వలసిన అక్కర కలుగలేదు.

23. అంతట యోసేపు ప్రజలతో “నా మాట వినుడు. ఈనాడు మిమ్మును మీ భూములను ఫరోరాజు పేరిటకొంటిని. ఇవిగో! విత్తనములు. వీనిని పొలములో విత్తుడు.

24. పండిన పంటలో ఐదవవంతు ఫరోరాజునకు సమర్పింపుడు. మిగిలిన నాలుగు వంతుల పంట విత్తనములు కట్టుటకు, మీరు మీ పిల్లలు మీ కుటుంబమువారు తిండితినుటకు మీకే చెందును” అనెను.

25. ప్రజలు అతనితో “మీరు మా ప్రాణములు కాపాడితిరి. మీరు అనుగ్రహించిన మేము ఫరోరాజుకు బానిసలమగుదుము” అనిరి.

26. ఈ రీతిగా వండినపంటలో ఐదవవంతు వరోరాజునకు చెందవలెనని యోసేపు కట్టడచేసెను. అది ఈనాటికిని అమలులో ఉన్నది. యాజకుల భూములు మాత్రము ఫరోరాజు కైవసము కాలేదు.

27. యిస్రాయేలీయులు ఐగుప్తుదేశమునందలి గోషేను మండలములో నివసించిరి. అక్కడ వారు భూములు సంపాదించిరి, బిడ్డలతో, గొడ్డుగోదలతో మిక్కిలి పెంపొందిరి,

28. యాకోబు పదునేడేండ్లు ఐగుప్తుదేశములో నివసించెను. అతడు నూట నలుబది ఏడేండ్లు బ్రతికెను.

29. మరణసమయము సమీ పించినప్పుడు అతడు యోసేపును పిలచి “నాయనా! నా తొడక్రింద నీ చేయి పెట్టుము. నా పట్ల దయావిశ్వాస ములు చూపుము. నన్ను ఐగుప్తుదేశములో పాతి పెట్టవలదు.

30. నా తాతముత్తాతలవలె నేను మరణించిన తరువాత, నన్ను ఇక్కడ నుండి తీసికొని పోయి మన భూమిలో వారిసరసనే పాతి పెట్టుము” అనెను. "తండ్రీ! నీవు చెప్పినట్లే చేయుదును” అని యోసేపు అనెను.

31. యాకోబు “అట్లని ప్రమాణము చేయుము” అనెను. యోసేపు ప్రమాణము చేసెను. వెంటనే యిస్రాయేలు మంచము తలగడమీద వ్రాలిపోయెను. 

 1. పిమ్మట తండ్రికి జబ్బు చేసినదని యోసేపునకు వార్తవచ్చెను. అతడు తన కుమారులైన మనష్షేను, ఎఫ్రాయీమును వెంటబెట్టుకొని తండ్రి కడకు వెళ్ళెను.

2. కుమారుడు యోసేపు వచ్చుచున్నాడని యాకోబునకు తెలిసెను. తన బలమంతయు కూడగట్టుకొని అతడు మంచముమీద లేచి కూర్చుండెను.

3. యాకోబు కుమారుని చూచి "కనాను దేశమందలి లూజులో సర్వశక్తిమంతుడగు దేవుడు నాకు ప్రత్యక్షమై నన్నాశీర్వదించెను.

4. దేవుడు నాతో 'యాకోబూ! నీవు పెంపొందునట్లు చేయుదును. ఒక మహాజాతిగా అవతరింప నీ సంతతిని విస్తరిల్లచేయుదును. ఈ దేశమును నీ తరువాత నీ సంతతికి శాశ్వత భుక్తి యగునట్లు ప్రసాదింతును' అనెను.

5. యోసేపూ! నేను రాకముందు ఐగుప్తుదేశములో నీకు పుట్టిన కుమారులిద్దరు నా కుమారులే అగుదురు. రూబేను షిమ్యోనుల మాదిరిగా మన్మ, ఎఫ్రాయీములుగూడ నా సొంతపుత్రులే.

6. వారి తరువాత పుట్టినవారు మాత్రము నీ సంతానమే. కాని వారు నివసించు ప్రదేశములనుబట్టి పిలువవలసి వచ్చినపుడే వారు తమ అన్నల పేరులతో పిలువబడుదురు.

7. పద్దనారాము నుండి వచ్చుచున్నప్పుడు కనాను దేశములో ఎఫ్రాతాకు ఇంకా కొంతదూరమున నుండగా త్రోవలో రాహేలు చనిపోయినది. బేత్లెహేము అను ఎఫ్రాతా నగరమార్గ మున ఆమెను పాతి పెట్టితిని” అనెను.

8.పిమ్మట యిస్రాయేలు యోసేపు కుమారులను చూచి 'వీరెవరు?” అని అడిగెను.

9. “వీరు నా కుమారులు. ఈ దేశమున దేవుడు వీరిని నాకు ప్రసాదించెను” అని యోసేపు చెప్పెను. అంతట యాకోబు “వీరిని నా దగ్గరకు తీసికొనిరమ్ము, దీవింతును” అనెను.

10. ముసలితనముచేత యిస్రాయేలునకు చూపుమందగించినది. అతడు మనుమలను చూడలేకపోయెను. అందుచేత యోసేపు తండ్రికి దగ్గరగా కుమారులను తీసికొని వెళ్ళెను. యాకోబు వారిని కౌగలించుకొని ముద్దాడెను.

11. యాకోబు యోసేపుతో “మరల నిన్ను చూచెదనని కలలోకూడ అనుకోలేదు. కాని దేవుని దయచేత నిన్నేకాదు, నీ కుమారులనుకూడ చూడగలిగితిని” అనెను.

12. అప్పుడు కుమారులను తండ్రి ఒడినుండి తీసికొని యోసేపు అతనికి సాష్టాంగనమస్కారము చేసెను.

13. అతడు యిస్రాయేలునకు ఎడమ ప్రక్కగా ఉండునట్లు ఎఫ్రాయీమును తన కుడిచేతితో పట్టు కొనెను. యిస్రాయేలునకు కుడితట్టుగా ఉండునట్లు మనష్పేను తన ఎడమచేతితో పట్టుకొనెను. ఈ విధముగా పట్టుకొనిన కుమారులను ఇద్దరిని తండ్రికి దగ్గరగా తీసికొనివచ్చెను.

14. యాకోబు తన కుడి చేతినిచాచి, చిన్నవాడైన ఎఫ్రాయీము తలమీద ఉంచెను. కుడిచేతిమీదుగా ఎడమచేతినిచాచి, పెద్ద వాడైన మనష్షే తలమీద పెట్టెను.

15-16. ఈ విధముగా చేతులుంచి యాకోబు యోసేపును ఆశీర్వదించుచు, . “నా తాతతండ్రులైన అబ్రహాము, ఈసాకు త్రికరణశుద్ధిగా కొలిచినదేవుడు,  పుట్టినది మొదలు ఈ నాటివరకును నన్ను కాపాడిన దేవుడు, ఎల్లకీడులనుండి నన్ను తప్పించిన దేవదూత, ఈ బాలురను ఆశీర్వదించునుగాక! వీరు నా పేరును, నా పితరులైన అబ్రహాము, ఈసాకుల పేరును నిలబెట్టుదురుగాక! వీరు పెక్కుమంది పిల్లలను కని మహాజాతిగా విస్తరిల్లుదురుగాక!” అనెను.

17. ఎఫ్రాయీము తలమీద తండ్రి తన కుడి చేతిని ఉంచుట యోసేపునకు కష్టము కలిగించెను. అతడు తండ్రి చేతిని పట్టుకొనెను. దానిని ఎఫ్రాయీము తల మీదినుండి తీసి మన ష్నే తలమీద పెట్టనెంచి,

18. "తండ్రీ! ఇదేమి? వీడు పెద్దవాడుకదా! నీ కుడి చేతిని వీని తలమీదఉంచుము” అనెను.

19. దానికి యాకోబు ఒప్పుకొనలేదు. అతడు "కుమారా! తెలిసి తెలిసి ఇట్లు చేసితిని. మనప్పే గొప్పవాడగును. అతని సంతతి కూడా విస్తరిల్లును. కాని అతని తమ్ముడు ఎఫ్రాయీము అతనికంటె కూడ గొప్పవాడు అగును. ఎఫ్రాయీము సంతతి ఒక మహాజాతిగా పరిణ మించును” అనెను.

20. అంతట యాకోబు వారిని ఆశీర్వదించి, “యిస్రాయేలీయులు తమవారిని దీవించునపుడు “మీరును ఎఫ్రాయీము మనష్షేలంతటి వారగుదురుగాక!' అని పలుకుదురు మీకు నా దీవెనలు” అనెను. ఈ విధముగా యాకోబు ఎఫ్రాయీమును మనష్షేకంటె పెద్దచేసెను.

21. యిస్రాయేలు ఇంకను యోసేపుతో “నాయనా! నేను చనిపోవుచున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండును. మీ తాతదండ్రుల భూమికి మిమ్ము మరల తీసికొనిపోవును.

22. సోదరులకంటె ఎక్కువగా ఒక భాగము నీకిచ్చితిని. అది కత్తిని, వింటిని చేపట్టి అమోరీయులనుండి నేను స్వయముగా సంపాదించిన షెకెము”' అనెను. 

 1. యాకోబు కుమారులను పిలిపించి ఇట్లనెను: “నాయనలారా! దగ్గరకు రండు మునుముందు మీకేమి జరుగునో చెప్పెదను.

2. యాకోబు కుమారులారా! నా చుట్టుచేరి సావధానముగా వినుడు. యిస్రాయేలైన ఈ తండ్రిమాటలు వినుడు.

3. రూబేనూ! నీవు నా పెద్ద కుమారుడవు. నా బలము నీవే. నా ఓజస్సుకు ప్రథమఫలమును నీవే. బలగర్వములచే అతిశయించువాడవు నీవే. జలప్రవాహమువలె నీవు చంచలుడవు. అయినను నీవు అతిశయిల్లలేవు.

4. నీవు తండ్రిమంచము మీదికి ఎక్కి సవతి తల్లిని కూడితివి. నా శయ్యను మైలపరచి నన్ను ధిక్కరించితివి.

5. షిమ్యోను, లేవి సోదరులు. వారు తమ ఆయుధములను హింసకు వాడిరి.

6. నేను వారి పన్నాగములను అంగీకరింపను. నేను వారి మంత్రాలోచనలలో పాల్గొనను. వారు కోపావేశముతో మనుష్యులను చంపిరి. వారు క్రోధముతో ఎద్దుల గుదికాలినరములు తెగగొట్టిరి.

7. దారుణమైన వారి ఆగ్రహము నిందాపూరితము. ఉగ్రమైన వారి కోపము శాపారము. వారిని యాకోబు దేశములో చిందరవందర చేసెదను, వారిని యిస్రాయేలు భూమిలో చెల్లాచెదరుచేసెదను.

8. యూదా! నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీవు పగవారిని ఎదుర్కొని, వారిమెడలు విరుతువు. తోడబుట్టినవారు నీముందు సాగిలబడుదురు.

9. యూదా! నీవు సింహపుపిల్లవు. వేటాడి విడిదికి తిరిగి వచ్చెదవు. నీవు సింహమువలె పొంచి నేలపై పరుండెదవు. ఆడుసింహమువలె, నిన్ను రెచ్చగొట్టగల సాహసి ఎవడు?

10. హక్కుగల రాజు వచ్చువరకు సకలజాతులవారు విధేయులైయుండువరకు, రాజదండము యూదా చేతినుండి జారిపోదు. రాజధ్వజము అతని సంతతివారినుండి తొలగిపోదు.

11. యూదా ద్రాక్షాలతకు గాడిదపిల్లను కట్టివేయును. మంచితీగకే దానిని కట్టివేయును. అతడు ద్రాక్షారసములో తన వస్త్రములు శుభ్రము చేసికొనును.

12. ద్రాక్షారసముచే యూదా కన్నులు ఎర్రనగును. పాలుత్రాగుటచే అతని పళ్ళు తెల్లనగును.

13. సెబూలూను సముద్రతీరమున నివసించును. అతని నివాసము నౌకలకు నిలయమగును. అతని రాజ్యమునకు సీదోను పొలిమేర అగును.

14. యిస్సాఖారు, మందపట్టులనడుమ పరుండు బలిష్ట గార్దభమువంటివాడు.

15. అతడు విశ్రాంతిపొందుట మేలని తలంచెను. తాను వసించుభూమి మంచిదని యెంచెను. కావున అతడు భుజమువంచి బరువులు మోసెను. బానిసయై వెట్టిచాకిరి చేసెను.

16. యిస్రాయేలులో నొకతెగవలె దానుకూడా తన ప్రజలకు తీర్పులు చేయును.

17. దాను, త్రోవలోని పామువంటివాడు. అతడు దారిలోని విషసర్పము వంటివాడు. అతడు గుఱ్ఱపుమడమలు కరచును. అంతట రౌతు నేలగూలును.

18. ప్రభూ! నేను నీ రక్షణము కొరకు ఎదురు తెన్నులు చూచుచున్నాను.

19. దోపిడిమూకలు గాదుపై దాడిచేయుదురు. అతడు వెనుకవైపునుండి , వారి పైబడి ఎదురుదెబ్బతీయును.

20. ఆషేరు భూములలో మంచిపంటలు పండును. అతడు తన గడప దొక్కినవారికి రాజభోజనము పెట్టును.

21. మంచి పిల్లలను ఈనుచు స్వేచ్చగా తిరుగు లేడివంటివాడు నఫ్తాలి.

22. యోసేపు జలాధారము చెంతనున్న ఫలవృక్షము వంటివాడు. దాని కొమ్మలు గోడలు దాటి ప్రాకును.

23. విలుకాండ్రు యోసేపుపై దాడిచేయుదురు. బాణములు వేసి అతనిని హింసింతురు.

24. అయినను యిస్రాయేలునకు శిలయు, కాపరి అయిన సర్వశక్తిమంతుడైన యాకోబుదేవుని వలన అతని విల్లు బలమైనదిగా, బాహువులు ధృడముగా మారెను.

25. నీ తండ్రి దేవుడు నీకు తోడ్పడును. సర్వశక్తిమంతుడు నిన్ను దీవించును. మింటినుండి పడు వానల దీవెనలు, క్రిందదాగియున్న అగాధజలముల దీవెనలు సంతానప్రాప్తి దీవెనలు బడసి అతని బాహుబలము దిట్టపరచబడును

26. శాశ్వతములు సుస్థిరములునైన పర్వతముల దీవెనలు, యోసేపు నుదుటను అలంకరించునుగాక! సోదరులకంటె ఎక్కువగా దేవునికి అంకితమైన యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక!

27. బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. అతడు ఉదయమున తన ఎరను పట్టుకొని మ్రింగును. సాయంకాలమున వేటాడి తెచ్చిన మృగమును భుజించును.”

28. వీరందరు యిస్రాయేలు పండ్రెండు తెగలవారు. యాకోబు వారిని ఒక్కొక్కరిని వరుసగా దీవించి, చెప్పిన మేలిపలుకులివి.

29. అతడు వారికి చివరిమాటగా ఇట్లు చెప్పెను. “నేను కొంతకాలమునకు చనిపోయెదను. హిత్తీయుడైన ఎఫ్రొను భూమిలో ఉన్న గుహయందు నా పూర్వీకుల సరసన నన్ను పాతిపెట్టుడు.

30. ఆ గుహ మమ్రేకు తూర్పుగా ఉన్న మక్ఫేలా పొలమునందున్నది. ఆ పొలమును శ్మశానముగా వాడుకొనుటకు అబ్రహాము హిత్తీయుడగు ఎఫ్రానువద్ద కొనెను.

31. అబ్రహామును భార్యయైన సారాతోపాటు అక్కడనే పాతిపెట్టిరి. అక్కడనే ఈసాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టిరి. అక్కడనే నేను లేయానుగూడ పాతి పెట్టితిని.

32. అబ్రహాము ఆ పొలమును, గుహను హిత్తీయులనుండి కొనెను.”

33. కుమారులకు చివరిమాట చెప్పి యాకోబు కాళ్ళు మంచము మీదికి లాగుకొనెను. అతడు తుదిశ్వాస విడిచి తన పితరులను కలిసికొనెను. 

 1. యోసేపు తండ్రి ముఖముమీద వ్రాలి అతనిని ముద్దుపెట్టుకొని రోదించెను.

2. శవమును సుగంధ ద్రవ్యములతో చేర్పుడని అతడు తన కొలువున ఉన్న వైద్యులను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి.

3. నలుబది దినములు పూర్తి అయ్యెను. ఆ నలువది దినములలో వైద్యులు సుగంధ ద్రవ్యములతో శవమును భద్రపరచిరి. ఐగుప్తు దేశీయులు డెబ్బది రోజుల పాటు యాకోబుకొరకు అంగలార్చిరి.

4. దుఃఖ దినములు ముగిసిన తరువాత యోసేపు ఫరోరాజు కుటుంబము వారి వద్దకు వెళ్ళి “మీకు నామీద దయ గలదేని నా మాటగా ఫరోరాజుతో ఇట్లు మనవి చేయుడు:

5. 'నేను చనిపోవుచున్నాను. కనాను దేశములో నాకై నేను సిద్ధముచేసికొన్న సమాధిలో నన్ను పాతిపెట్టుము' అని చెప్పి మా తండ్రి నాచేత ప్రమాణము చేయించుకొనెను. సెలవైనచో అక్కడకి వెళ్ళి తండ్రిని పాతి పెట్టి తిరిగివత్తునని ఏలినవారితో చెప్పుడు” అనెను.

6. "ప్రమాణము చేసిన విధముగా వెళ్ళి తండ్రిని పాతి పెట్టుము” అని వరోరాజు సెలవిచ్చెను.

7. యోసేపు తండ్రిని సమాధి చేయుటకు వెళ్ళెను. ఫరో సేవకులు, రాజుఇంటి పెద్దలు, ఐగుప్తుదేశపు పెద్దలు, యోసేపు ఇంటివారు, అతని సోదరుల కుటుంబమువారు, తండ్రి కుటుంబమువారు, వీరందరును యోసేపు వెంటవెళ్ళిరి.

8. అతని సోదరులు తమ పిల్లలను, పశుమందలను, గొఱ్ఱెల మందలను మాత్రము గోషేను మండలములో విడిచి వెళ్లిరి.

9. రథములవారు, రౌతులు, అతనిని అనుసరించిరి. వీరందరు కూడి మహాజనసమూహమైరి.

10. యోర్దాను నదికి ఆవలి ప్రక్కనున్న ఆటాద్ కళ్ళము వద్దకు వచ్చినప్పుడు వారు గుండె బద్దలగునట్లు ఏడ్చిరి. అతడు తండ్రి కోసము ఏడు దుఃఖదినములను పాటించెను.

11. ఆటాద్ కళ్ళము దగ్గర వీరందరు ఇట్లు అంగలార్చుచుండగా, అక్కడకి సమీపమున నివసించుచున్న కనానీయులు చూచిరి. “ఐగుప్తు దేశీయులు ఎంత మిక్కిలిగా దుఃఖించుచున్నారు?” అని తమలో తాము అనుకొనిరి. అందుచేత వారు యోర్దానునది ప్రక్కనున్న ఆ ప్రదేశమునకు “ఆబెల్ మిస్రాయిమ్”' అను పేరు పెట్టిరి.

12. ఈ విధముగా యాకోబు చెప్పినట్లే అతని కుమారులు చేసిరి.

13. వారు అతనిని కనాను దేశమునకు కొనిపోయిరి. మక్పేలా పొలములో ఉన్న గుహలో అతనిని పాతి పెట్టిరి. శ్మశానముగా వాడుకొనుటకై అబ్రహాము ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రొను వద్దకొనెను. అది మమ్రేకు తూర్పున ఉన్నది.

14. తండ్రిని ఖననముచేసిన తరువాత యోసేపు సోదరులతో, అనుచరులతో తిరిగి ఐగుప్తు చేరెను.

15. తండ్రి చనిపోయిన పిదప యోసేపు సోదరులు భయపడి "యోసేపు మనమీద పగబట్టి మనముచేసిన కీడునకు తప్పక బదులు తీర్చుకొనును”

16. అందుచేత వారు యోసేపునకు ఇట్లు వర్తమానము పంపిరి.

17. “మరణింపకముందు మీ తండ్రి యోసేపునకు ఈ సందేశము వినిపింపుడని మమ్ము కోరెను  'నీ సోదరులు నీకు కీడుచేసిరి. వారి దోషములను. అపరాధములను మన్నింపుమని కోరుచున్నాను. ” అందుచేత మేము మా తప్పులు క్షమింపుమని వేడుకొనుచున్నాము. మీ తండ్రి కొలిచిన దేవుడినే కొలుచుచున్న దాసుల మనవి ఇది.” వారి మాటలు వినినప్పుడు యోసేపు ఏడ్చెను.

18. అంతట అతని సోదరులు తమంతట తాము వెళ్ళి అతనిఎదుట సాగిలబడి “ఇదిగో! మేము నీ బానిసలము" అనిరి.

19. కాని యోసేపు వారితో “భయపడకుడు. నేను దేవుడనా యేమి?

20. మీరు నాకు కీడు తలపెట్టితిరి. కాని దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహుప్రజలు జీవించుటకై దేవుడు మేలుకే ఉద్దేశించెను.

21. మీరేమి భయపడవలదు. నేను మిమ్మును, మీ పిల్లలను ఆద రింతును” అనెను. ఇట్లనుచు యోసేపు ప్రీతి పూర్వకముగా మాట్లాడి వారిని ఓదార్చెను.

22. తండ్రి కుటుంబమువారితోపాటు యోసేపు ఐగుప్తుదేశములో నివసించెను. అతడు నూటపది యేండ్లు బ్రతికెను.

23. యోసేపు ఎఫ్రాయీము పిల్లలను మూడవతరమువరకు చూచెను. మనష్షే కుమారుడగు మాకీరు పిల్లలనుకూడ ఎత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొనెను.

24. అతడు సోదరులతో “నేను మరణింపనుంటిని. దేవుడు మిమ్ము తప్పక ఆదు కొనును. ఆయన అబ్రహామునకు, ఈసాకునకు, యాకోబునకు మాట ఇచ్చిన దేశమునకే మిమ్ము కొనిపోవును” అనెను.

25. “దేవుడు మిమ్ము ఆదుకొని నపుడు ఈ దేశమునుండి నా అస్థికలను మీ వెంట కొనిపోవుడు” అని యోసేపు యిస్రాయేలు కుమారులచే ప్రమాణము చేయించుకొనెను.

26. యోసేపు నూట పదియవయేట చనిపోయెను. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిన అతని మృతదేహమును అతని సోదరులు ఐగుప్తుదేశమున ఒక శవపేటికయందు ఉంచిరి.