ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తీతుకు వ్రాసిన లేఖ

 1. దేవుని సేవకుడును, యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలునుండి: ఎన్నుకొనబడిన దేవుని ప్రజల విశ్వాసమునకు తోడ్పడుటకును, భక్తి జీవనసంబంధమగు సత్యమును బోధించుటకును,

2.నిత్యజీవమును గూర్చిన నమ్మకమును వారి కొసగుటకును నేను ఎన్ను కొనబడితిని. ఈ నిత్యజీవమును దేవుడు చాలకాలము క్రితమే వాగ్రత్త మొనర్చెను. ఆయన ఎన్నటికిని అసత్య మాడడు.

3. కనుక, యుక్తసమయమున తానొనర్చిన వాగ్దానమును ఆయన ప్రదర్శించెను. నాకు అప్పజెప్ప బడిన ఈ విషయమును, మన రక్షకుడైన దేవుని ఆజ్ఞచే నేను ప్రకటించుచున్నాను.

4. మన విశ్వాసమునందు సహపాలివాడును నా నిజమైన కుమారుడు తీతునకు వ్రాయుచున్నాను: పితయగు దేవునినుండియు, మన రక్షకుడగు క్రీస్తు యేసునుండియు నీకు కృప, సమాధానము.

5. నేను నీకాజ్ఞాపించిన ప్రకారము ఇంకను తీర్చి దిద్దబడవలసిన వానిని క్రమపరచుటకును, ప్రతినగరము నందును దైవసంఘమునకు పెద్దలను నియమించుటకును, నిన్ను నేను క్రీటులో వదలి వచ్చితిని.

6. సంఘాధిపతి దోషరహితుడును, ఒకే భార్య కల వాడునై ఉండవలెను. అతని పిల్లలు భోగలాలసులును, క్రమరహితులును గాక, విశ్వాసము గలవారై ఉండవలెను.

7. అతడు దేవుని పనికి యాజమాన్యము వహించును కనుక, సంఘాధిపతి నిందారహితుడై ఉండవలెను. అతడు అహంకారియు, ముక్కోపియు, త్రాగుబోతును, దౌర్జన్యము చేయువాడును, దురాశా పరుడును కారాదు.

8. అతడు అతిథులను సత్కరించు వాడును, మంచిని ప్రేమించువాడును కావలెను. ఇంద్రియ నిగ్రహము కలవాడును, ఋజుమార్గమున నడుచువాడును, పవిత్రుడును, క్రమశిక్షణ కలవాడునై ఉండవలెను.

9. సిద్ధాంతముతో ఏకీభవించు సందేశమును అతడు దృఢముగ అంటిపెట్టుకొని ఉండవలెను. ఈ విధముగ ఇతరులను సత్యబోధనలచే ప్రోత్సహించుటకును, దానికి వ్యతిరేకులైన వారి దోషములను చూపెట్టుటకును అతడు సమర్థుడుగా ఉండవలెను.

10. ఏలయన, అవిధేయులు, శూన్యవాదులు, మోసగాండ్రు ముఖ్యంగా సున్నతి సంబంధులు అనేకులు ఉన్నారు.

11. ధన సంపాదనము అను నీచ వ్యామోహముతో వారు దుర్బోధలు చేయుచు, కుటుంబములకు కుటుంబములనే తలక్రిందులు చేయుచున్నారు. కనుక వారి నోళ్ళు మూయింపవలసి ఉన్నది.

12.“క్రీటు దేశీయులు సర్వదా అసత్యమాడువారును,  దుష్ట మృగములును, సోమరులై, తిండిపోతులునై ', ఉన్నారు” అని వారిలో ఒకడైన ప్రవక్త ఒకడు చెప్పెను.

13. అతడు చెప్పినది యథార్థమే. అందుచేతనే వారు మంచి విశ్వాసమును కలిగి ఉండవలెనని హెచ్చరింపుము.

14. యూదుల కట్టు కథలను, సత్యమును త్రోసిపుచ్చిన వారి ఆజ్ఞలను పట్టుకొని వ్రేలాడ కుండునట్లు వారిని నీవు తీవ్రముగ గద్దింపుము.

15. పవిత్రులకు సమస్తమును పవిత్రమే. కాని వారి బుద్దియు, అంతఃకరణమును మలినములగుటచే, అపవిత్రులును, విశ్వాసము లేనివారును అగు వారికి ఏదియును నిర్మలము కాదు.

16. వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు. కాని వారు చేయు కార్యములు దానికి విరుద్ధములు. వారు కలుషాత్ములు, అవిధేయులు, మంచి చేయుటకు అసమర్థులు.

 1. కాని నీవు దృఢమైన సిద్ధాంతమునకు అనుగుణముగా ఉన్నదానినే బోధింపుము.

2. వృద్ధులైన పురుషులు విజ్ఞతకలవారు, తెలివికలవారు, ఇంద్రియ నిగ్రహము కలవారు కావలెను. వారు విశ్వాసము, ప్రేమ, సహనము అను వానియందు దృఢత్వము కలిగి ఉండవలెనని బోధింపుము.

3. అట్లే వృద్ధ స్త్రీలు ఇతరులపై అపవాదములు వేయక, మద్యమునకు బానిసలుకాక, భయభక్తులతో ప్రవర్తింపవలెనని చెప్పుము.

4. యువతులు తమ భర్తలను, బిడ్డలను ప్రేమించునట్లును,

5. ఇంద్రియ నిగ్రహమును, శుచిత్వమును కలిగియుండునట్లును, మంచి గృహిణులుగ, కనికరము గలవారై భర్తలకు విధేయులు అగునట్లును బోధించుచు వృద్ధ స్త్రీలు వారిని తీర్చిదిద్దవలెను. అట్లయినచో దేవుని సందేశము గూర్చి ఎవరును చెడుగా పలుకరు.

6. అదే విధముగా యువకులు ఇంద్రియ నిగ్రహము కలవారై ఉండవలెనని ప్రోత్సహింపుము.

7. అన్ని విషయములలోను నీవే వారికి మంచిపనుల యందు ఆదర్శము కావలెను. నీ బోధనలయందు నీవు కపటములేక గంభీరముగ ఉండుము.

8. విమర్శించుటకు వీలులేని మంచి పదములనే ఉపయోగింపుము. అటులయిన మనలను గూర్చి శత్రువులెట్టి చెడును చెప్పుటకు వీలు కలుగక సిగ్గుపడుదురు.

9. సేవకులు యజమానులకు విధేయులై అన్ని పనులు వారికి తృప్తికరముగా చేయవలెను. వారికి ఎదురు పలుకరాదు.

10. వారినుండి దొంగిలింప రాదు. అన్ని విషయములందును వారు సర్వదా మంచి వారును విశ్వాసపాత్రులని నిరూపించుకొనవలెను. ఏలయన, ఇట్లు ప్రవర్తించుట వలన వారు మన రక్షకుడగు దేవుని గూర్చిన బోధకు గౌరవమును ఆపాదింతురు.

11. సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యెను.

12. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియనిగ్రహము కలిగి, ఋజుమార్గమున, పవిత్రమయిన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది.

13. ఇట్లు ఇహలోక మందు జీవించుచు, సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు, రక్షకుడగు యేసు క్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినముకొరకు నిరీక్షణతో వేచియుండవలయునని మనకు ఆ కృప తెలుపు చున్నది.

14. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విముక్తులను చేసి, సత్కార్యములయందు ఆసక్తిగలవారినిగ తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తనను తానే మనకొరకు అర్పించుకొనెను.

15. ఈ విషయములను బోధింపుము. నీ శ్రోతలను ప్రోత్సహించునపుడును, గద్దించునపుడును నీ సంపూర్ణాధికారమును వినియోగింపుము. నిన్ను ఎవ్వడును నిర్లక్ష్యము చేయకుండును గాక! 

 1. ప్రభువులకును, అధికారులకును లొంగి యుండి, విధేయులై, ఎట్టి సత్కార్యము చేయుటకైనను సంసిద్ధులై ఉండవలెనని నీ ప్రజలకు గుర్తుచేయుము.

2. ఎవ్వరిని గూర్చికాని చెడుగా మాటలాడక, జగడ మాడక, శాంతముగ ఉండి, అందరితో సౌమ్యముగ ప్రవర్తించుచుండవలెనని వారికి బోధింపుము.

3. మనమే ఒకప్పుడు మూడులుగను, అవిధేయులుగను మోసపోయినవారముగ ఉంటిమి. సర్వవిధములగు మోహములకును, భోగములకును మనము దాసులమైతిమి. ఈర్ష్య ద్వేషములతో మన జీవితము గడిపితిమి. ఇతరులు మనలను ద్వేషించిరి. మనము వారిని ద్వేషించితిమి.

4. కాని, మనరక్షకుడగు దేవునికృపయు, ప్రేమయు ప్రత్యక్షమగుటతో,

5. ఆయన మనలను రక్షించెను, మనము చేసిన సత్కార్యములవలనగాక, తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకును, నూతన జీవితమునకును సంబంధించిన జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను.

6. మన రక్షకుడగు యేసు క్రీస్తు ద్వారా, పవిత్రాత్మను విస్తారముగ దేవుడు మనపై కురియించెను.

7. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్యజీవమునకు వారసులమగుటకు ఆయన అటుల చేసెను. ఇది సత్యము.

8. దేవునియందు విశ్వాసముంచువారు సత్కార్య నిమగ్నులై శ్రద్ధవహించుటకుగాను నీవు ఈ విషయ ములను గట్టిగా బోధింపవలయునని కోరుచున్నాను. ఇవి మంచివియును, మనుజులకు ప్రయోజన కరములునై ఉన్నవి.

9. కాని మూర్ఖపు వాదములకును, వంశావళులకును, తగవులకును, చట్టమును గూర్చిన వివాదములకును, దూరముగా ఉండుము. ఏలయన అవి వ్యర్ధమే కాని, వాటి మూలమున ఏ ప్రయోజనము లేదు.

10. మత భేదములను సృష్టించువానికి ఒకటి రెండు పర్యాయములు బుద్ధిచెప్పిన తరువాత వానితో ఎట్టి సంబంధము ఉంచుకొనకుము.

11. ఏలయన అట్టివాడు కలుషాత్ముడు. అతని పాపములే అతడు దోషి అని నిరూపించును.

12. నేను శీతకాలమును నికోపోలిలో గడప దలచితిని. కనుక నేను ఆరైమానైనను, తుకికునైనను నీ యొద్దకు పంపినపుడు వెంటనే బయలుదేరి అచటకు రమ్ము.

13. న్యాయవాదియగు జేనాసును, అపోల్లోను వెంటనే ప్రయాణము కట్టించి పంపుము. వారి ప్రయాణమునకు కావలసినవన్నియు చూడుము.

14. మన ప్రజలు నిష్ఫలులుకాకుండ అవసరమును బట్టి సమయోచితముగా సత్కార్యములను శ్రద్ధగా చేయుట నేర్చుకొనవలెను.

15. నా తోడి వారందరును నీకు శుభాకాంక్షలు పంపుచున్నారు. మన విశ్వాసమునుబట్టి మమ్ము ప్రేమించువారందరకు మా శుభాకాంక్షలు తెలియ జేయుము. దేవుని కృప మీ అందరితో ఉండునుగాక!