ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోహాను వ్రాసిన దర్శన గ్రంధము

 1. యేసుక్రీస్తు బహిరంగమొనర్చిన విషయములు ఇచట గ్రంథస్థము కావింపబడినవి. దేవునిచే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి. అనతికాలమున ఏమి సంభవింపనున్నదియు ఆయనచే దేవుని సేవకులకు ప్రకటింపబడవలెను. ఇది దేవుని అభిమతము. క్రీస్తు తన దూతద్వారా తన సేవకుడగు యోహానుకు ఈ విషయములను విదితము చేసెను.

2. తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించెను. ఇది దేవుని వాక్కును గూర్చియు, యేసు క్రీస్తు బహిరంగము చేసిన సాక్ష్యమును గూర్చియు యోహాను వ్రాసిన నివేదిక.

3. ఇవి అన్నియు అనతికాలముననే సంభవింప నున్నవి. కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయ ములను పాటించువారు ధన్యులు.

4. ఆసియా మండలమునందలి సప్తసంఘ ములకు యోహాను వ్రాయునది: భూత, భవిష్యత్, వర్తమానములందున్న దేవుని నుండియు ఆయన సింహాసనము ఎదుట ఉన్న సప్త ఆత్మలనుండియు

5. విశ్వాసపాత్రుడగు సాక్షియు, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును, భూపాలురకు ప్రభువును అగు యేసు క్రీస్తునుండియు, మీకు కృపయు శాంతియు లభించును గాక! ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాపవిముక్తులను చేసెను.

6. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును, శక్తిమంతుడును అగునుగాక! ఆమెన్.

7. ఇదిగో! మేఘమండలమునుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతినేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచినవారును, సమస్త తెగలును ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అట్లే తప్పక జరుగును. ఆమెన్.

8. “ఆల్ఫా, ఓమేగ నేనే” అని సర్వశక్తిమంతుడును, భూత, భవిష్యత్, వర్తమానములందున్న ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు.

9. నేను మీ సోదరుడగు యోహానును, యేసుక్రీస్తు నిమిత్తము కలుగు కష్టములలోను, రాజ్యమునను, సహనమునందును మీతో భాగస్వామిని అగుదును. దేవుని వాక్కును, యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున, నేను పత్మోసు ద్వీపమునకు కొనిపోబడితిని.

10. ప్రభుదినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకా ధ్వనివలె ఉండెను.

11. “నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము కావింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, స్ముర్న, పెర్గమూ, తియతైర, సార్ధిసు, ఫిలదెల్ఫియా, లవోదికయలయందలి సప్తసంఘములకును పంపుము" అని అది నన్ను ఆదేశించినది.

12. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియుటకై వెనుకకు తిరిగితిని. అట నేను ఏడు సువర్ణ దీపస్తంభములను చూచితిని.

13. వాని మధ్య మనుష్యకుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. వక్షమున ఆయన ఒక సువర్ణమయ పట్టికను తాల్చి ఉండెను.

14. ఆయన శిరస్సు, శిరోజములు ఉన్నివలె, మంచువలె తెల్లగా ఉండెను. ఆయన కన్నులు అగ్నిగోళములవలె మండుచుండెను.

15. కొలిమిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన ఇత్తడివలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన కంఠధ్వని జలపాత ఘోషవలె ఉండెను.

16. ఆయన దక్షిణ హస్తమున సప్తతారకలు ఉండెను. రెండు అంచులుగల వాడియైన ఖడ్గము ఒకటి ఆయన నోటి నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న మార్తాండునివలె దేదీప్యమానమై ఉండెను.

17. నేను ఆయనను చూచిన తోడనే మృతునివలె ఆయన పాదముల ముందట పడితిని. ఆయన తన కుడి చేతిని నా పై ఉంచి ఇట్లనెను: “భయపడకుము. ఆదియును, అంతమును నేనే!

18. సజీవుడను నేనే! నేను మరణించితిని. కాని చూడుము. నేను సదా జీవించియుందును. మృత్యువు యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా ఆధీనములోనే ఉన్నవి.

19. కనుక నీవు చూచెడి ఈ విషయ ములను గ్రంథస్థము కావింపుము. జరుగుచున్న విషయములను, జరుగనున్న విషయములను, సమస్తమును లిఖింపుము.

20. నా కుడిచేతియందు నీవు చూచు సప్త తారకలయొక్కయు, సప్త దీపస్తంభముల యొక్కయు రహస్యార్థమును నీకు విదితము చేయచున్నాను. సప్తతారకలనగా సప్తసంఘముల దేవదూతలు. సప్తదీపస్థంభములే సప్తసంఘములు. 

 1. ఎఫెసు సంఘ దూతకు ఇట్లు వ్రాయుము: “తన దక్షిణహస్తమున సప్తతారకలను దాల్చు వాని సందేశము ఇది. సప్త దీపస్తంభముల నడుమ నడచువాని సందేశమే యిది.

2. మీరు ఏమి ఒనర్చి తిరో నాకు తెలియును. మీరు ఎంత శ్రమపడి పని చేసితిరో, ఎంత సహనమును ప్రదర్శించితిరో నేను ఎరుగుదును. దుష్టులను మీరు సహింపజాలరనియు నాకు విదితమే. అపోస్తలులు కాకుండగనే, అపోస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి, వారు అసత్యవాదులని మీరు కనుగొంటిరనియు నాకు తెలిసినదే.

3. మీరు ఓర్పును చూపితిరి. నా నామము నిమిత్తము కష్టములను అనుభవించితిరి. అయినను మీ పూనికను త్యజింపలేదు.

4. కాని మొదటివలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుటలేదు. ఇదియే మీపై నేను చేయు నేరారోపణ.

5. మీరెంత భ్రష్టులైతిరో ఒకపరి గుర్తుకు తెచ్చుకొనుడు. మారుమనస్సు పొంది, మొదట మీరు చేసిన క్రియలనుచేయుడి. అటులగాక, మారుమనస్సు పొందనియెడల, నేనే వచ్చి మీ ద్వీపస్తంభమును దాని స్థానమునుండి తొలగింతును.

6. కాని, నికోలాయితుల చేష్టలను నేను ఎంతగ ద్వేషింతునో మీరును అంతే ద్వేషింతురు. ఇది మీయందలి సుగుణము.

7. మీకు వీనులున్నచో దైవసంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు! ఆ గెలుపొందిన వారికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవవృక్షపు ఫలమును ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహింతును.”

8. స్ముర్నా సంఘదూతకు ఇట్లు వ్రాయుము: “ఆద్యంతములైనవాడును, మరణించియు సజీవు డగువాని సందేశము ఇది.

9. మీ బాధలు నాకు తెలియును. మీరు నిరుపేదలగుట ఎరుకే. కాని యథార్థముగ మీరు భాగ్యవంతులే! మీపై ఆరోపింపబడు దోషములు నాకు ఎరుకయే. దోషారోపణ మొనర్చువారు యూదులమని చెప్పుకొందురు. నిజమునకు వారు యూదులు కారు. వారు సైతాను బృందము!

10. మీకు కలుగబోవు ఎట్టిశ్రమలను గూర్చియు భయపడకుడు, ఆలకింపుడు! సైతాను మిమ్ము శోధించును. మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. మీ బాధలు పది దినములు మాత్రమే. మరణించువరకు విశ్వాసపాత్రులై ఉండుడు. అప్పుడు మీకు జీవకిరీటమును అనుగ్రహించెదను.

11. మీకు వీనులున్నచో, దైవసంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధతో ఆలకింపుడు! గెలుపొందినవారు రెండవ మరణముచే బాధింపబడరు. "మీ విశ్వాసాడుగదా! ఆ సైతాను నివాస

12. పెర్గమూ సంఘ దూతకు ఇట్లు వ్రాయుము: “వాడియైన రెండంచులుగల ఖడ్గధారి సందేశము ఇది:

13. మీ నివాసము నాకు తెలియును. సైతాను సింహాసనమును అచటనే ఉన్నది. నా నామమందు స్థిరముగానున్నారు. నా విశ్వాసపాత్రుడును సాక్షియునైన అంతిప అనువాడు సైతాను నివాస స్థానమున చంపబడినాడుగదా! ఆనాడును మీరు నా యందలి మీ విశ్వాసమును త్యజింపలేదు.

14. కాని, మీపై నేను ఒనర్చు ఆరోపణలు ఇవి: బిలాము అనుయాయులు కొందరు మీలో ఉన్నారు. బాలాకునకు అతడే బోధకుడుగదా! ఆ బాలాకు యిస్రాయేలు ప్రజలను పాపాత్ములను చేసెను. ఆ యిస్రాయేలు ప్రజలు విగ్ర హములకు అర్పింపబడిన ఆహారములనే భుజించుచు, జారత్వము చేయునట్లు అతడు చేసెను.

15. అట్లే నికోలాయితుల బోధలను అనుసరించువారును మీ యందు ఉన్నారు.

16. కనుక హృదయపరివర్తన చెందుడు. లేనిచో నేనే త్వరలో మిమ్ము చేరి నా నోటి నుండి వెలువడు ఖడ్గమున వారితో యుద్ధము చేసె దను.

17. మీకు వీనులున్నచో, దైవసంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. జయము నొందిన వారికి దాచబడియున్న మన్నాలో భాగము ఇత్తును. వారిలో ప్రతి వ్యక్తికిని ఒక తెల్లని రాతిపలకను ఇత్తును. దానిపై ఒక క్రొత్త నామ ముండును. అది, పొందినవానికి తప్ప మరెవ్వనికిని తెలియదు.”

18. తియతైర సంఘదూతకు ఇట్లు వ్రాయుము: “ఎవని కన్నులు అగ్నిజ్వాలలవలె వెలుగొందునో, ఎవని పాదములు మెరుగు పెట్టిన ఇత్తడివలె ప్రకాశించునో ఆ దేవపుత్రుని సందేశము ఇది.

19. మీరు ఏమి చేసితిరో నాకు తెలియును. మీ ప్రేమ, విశ్వాసము, సేవ, సహనము నాకు ఎరుకే. మొదట చేసిన దానికంటె నేడు మీరు అధికముగ చేయుచున్నారనియు నాకు తెలియును.

20. కాని మీ పై చేయు ఆరోపణ యిది: ప్రవక్తినని చెప్పుకొనెడి యెసెబెలు అను స్త్రీని మీరు సహింతురుగదా! ఆమె నా సేవకులను దుర్బోధ లొనర్చి తప్పుదారి పట్టించుచున్నది. అందువలన వారు జారత్వమొనర్చుచు, విగ్రహములకు అర్పించిన ఆహారమును భుజించుచున్నారు.

21. ఆమె హృదయ పరివర్తన చెందుటకు తగినంత సమయము ఒసగియుంటిని. కాని, తన జారత్వమునుండి ఆమె మరలుటకు నిరాకరించుచున్నది.

22. చూడుడు. నేను ఆమెను జబ్బుతో మంచమున పడియుండునట్లు చేసెదను. ఆమెతో వ్యభిచరించువారు హృదయ పరివర్తన చెందనిచో వారిని నేను భయంకర వేదనలకు గురిచేసెదను.

23. ఆమె పుత్రులను కూడ సంహరించెదను. అప్పు డైన దైవసంఘములన్ని నన్ను మానవుల మనస్సుల, హృదయములయందలి ఆలోచనలను, ఆశలను గ్రహింపగలవానినిగ గుర్తించును. మీరొనర్చు కృత్య ములను బట్టియే మీకు ప్రతిఫలమిత్తును.

24. “కాని తియతైరనందు మిగిలిన మీరు ఈ దుష్టబోధనలను అనుసరింపలేదు. 'సైతాను నిగూఢ రహస్యములు' అని పేర్కొనబడు వానిని మీరు అభ్య సింపలేదు. మీపై ఇక ఎట్టి భారమును మోపనని వాగ్దానము చేయుచున్నాను.

25. కాని నేను వచ్చు నంతవరకును, మీకు ఉన్నదానిని మీరు పటిష్టముగ నిలుపుకొనవలయును.

26-27. జయము నొందినవారికిని, తుది దాకా నా ఆశయమును నెరవేర్చువారికిని, నా తండ్రి నుండి నేను ఎట్టి అధికారమును పొందితినో, అట్టి అధికారమునే ప్రసాదింతును. మానవాళిపై వారికి అధికార మిచ్చెదను. వారు ఇనుపదండముతో పరిపాలింతురు గాక మట్టి కుండలవలె వారిని ముక్కలు చేయుదురుగాక!

28. వారికి వేగుచుక్కను కూడ అను గ్రహింతును.

29. మీకు వీనులున్నచో దైవసంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు!” 

 1. సార్దిసు సంఘదూతకు ఇట్లు వ్రాయుము: “దేవుని సప్త ఆత్మలును, సప్తతారకలును కలవాని సందేశమిది. మీ కృత్యములు నాకు తెలియును. మీరు మృత జీవులై ఉండికూడ సజీవులని ప్రసిద్ధి పొందితిరని నాకు విదితమే.

2. కనుక మేల్కొనుడు! అంతయు నశింపకమునుపే మిగిలియున్న దానిని బలపరచు కొనుడు. ఏలయన, మీరొనర్చినది నా దేవుని దృష్టిలో ఇంకను సమగ్రము కాదు.

3. కనుక మీకు ఏమి బోధింపబడినదో, దానిని మీరు ఎట్లువింటిరో జ్ఞాపకము ఉంచుకొనుడు. దానిని అనుసరించి మీ పాపముల నుండి విముఖులు కండు. మీరు మేల్కొననిచో, నేను దొంగవలె మీపై వచ్చి పడెదను. నేను ఎప్పుడు వచ్చునది కూడ మీరు ఊహింపలేరు.

4. కాని, సార్ధిసులోని మీలో కొందరు మాత్రము తమ వస్త్రములను అపవిత్రపరుచుకోలేదు. వీరు ధవళవస్త్ర ధారులై నాతో ఏతెంచెదరు. మీరు అందులకు అర్హులు.

5. జయమును పొందిన వారందరును ఇట్లే ధవళ వస్త్రధారులయ్యెదరు. సజీవుల గ్రంథము నుండి వాని నామములను తొలగింపను. నా తండ్రియగు దేవుని సమక్షమున, ఆయన దూతల సముఖమునను, వారు నావారనిబాహాటముగా ప్రకటించెదను.

6. మీకు వీనులున్నచో, దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు!”

7. ఫిలదెల్ఫియా సంఘదూతకు ఇట్లు వ్రాయుము: "పవిత్రుడును, సత్యవంతుడునగు వాని సందేశమిది. దావీదు తాళపుచెవి ఆయనయొద్ద ఉన్నది. ఇతరులు మూయలేకుండ ఆయన తెరువగలడు. ఇతరులు తెరువలేకుండ ఆయన మూయగలడు.

8. మీకార్యములు నాకు తెలియును; మీకు కొలది శక్తి మాత్రమే కలదని నాకు తెలియును. అయినను నా ఉపదేశములను మీరు అనుసరించితిరి. మీరు నా నామమును నిరాకరింపలేదు. మీ ఎదుట నేను ఒక ద్వారమును తెరచితిని. అన్యులు దానిని మూయ జాలరు.

9. ఆలకింపుడు! సైతాను అనుయాయులు తాము యూదులమని చెప్పుకొందురు. కాని నిజమునకు వారు అట్టివారు కాదు. వారు అసత్యవాదులు, వారు మీవద్దకు వచ్చి మీ పాదములపై పడి మీకు నమస్కరించునట్లు చేయుదును. నేను మిమ్ము  ప్రేమింతునని వారు అందరును తెలిసికొనగలరు.

10. సహనమును ప్రదర్శింపుడను నా శాసనమును మీరు పాటించితిరి గదా! కనుక భువియందలి ప్రజలను పరీక్షింప ఆసన్నమగుచున్న క్లిష్టగడియల నుండి నేను మిమ్ము రక్షింతును.

11. నా ఆగమనము సంపించుచున్నది. ఉన్నదానిని పదిలపరచుకొనుడు. మీ విజయ సూచకమగు బహుమానమును ఎవరును అపహరింపకుండ చూచుకొనుడు.

12. గెలుపొందిన వానిని నా దేవుని ఆలయమునకు మూలస్తంభముగ చేయుదును. ఇక ఎన్నటికిని అతడు దానిని విడువడు. అతనిపై నా దేవుని నామమును లిఖింతును. దివ్యలోకములోని నా దేవుని నుండి అవతరించు నూతన యెరూషలేము పట్టణ నామమును, నా దేవుని పట్టణనామమును కూడ వానిపై వ్రాయుదును. నా నూతన నామధేయమును కూడ వ్రాసెదను.

13. మీకు వీనులున్నచో, దైవసంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు!”

14. లవోదికయ సంఘదూతకు ఇట్లు వ్రాయుము: “విశ్వాసపాత్రుడును, సత్యవాదియును, సాక్షి యును, దేవుని సృష్టికి ఆదియును అయిన ఆమెన్ అనువాని సందేశమిది.

15. నీ కృత్యములు నాకు తెలియును. నీవు చల్లగానైనను, వేడిగానైనను లేవు. నీవు ఆ రెంటిలో ఏదియో ఒకటియైన ఎంతయో బాగుండెడిది.

16. నీవు చల్లగానైనను, వేడిగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోటినుండి ఉమియబోవుచున్నాను!

17. 'నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, నాకే కొదవయులేదు' అని నీవు అనుకొందువు. కాని నీవు ఎంత ధీనుడవో ఎంత హీనుడవో నీవు ఎరుగవు! నీవు నిరుపేదవు, దిగంబరివి, గ్రుడ్డివాడవు.

18. కనుక భాగ్యవంతుడవగుటకై, నా నుండి అగ్నిలో శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన బంగారమును కొనుగోలు చేయుమని హితవు చెప్పుచున్నాను. అసహ్యకరమగు నీ దిగంబరత్వమును మరుగు చేయుటకై వస్త్రధారణకుగాను ధవళ వస్త్రములను కూడ కొనుగోలు చేయుము. వీ దృష్టి బాగుపడుటకు గాను కన్నులకై ఏదేని ఔషధమును గూడ సంపాదించు కొనుము.

19. నేను ప్రేమించువారినందరిని గద్దించుచుందును, శిక్షించుచుందును. కనుక ఆసక్తి కలిగి, పాపములనుండి విముఖుడవుకమ్ము.

20. వినుము! నేను ద్వారమువద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరై నను నా స్వరమును విని తలుపు తెరచినలోనికి వత్తును. వానితో భుజింతును. అతడును నాతో భుజించును.

21. గెలుపొందినవారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహింతును. నేనును అట్లే గెలుపొంది, ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహా సనమున ఆసీనుడనైతినిగదా!

22. మీకు వీనులున్నచో, దైవసంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు.” 

 1. ఈ సమయమున నాకు మరియొక దృశ్యము గోచరించినది. దేవలోకమున ఒక ద్వారము తెరువబడి ఉండుట గమనించితిని. నాతో ఇదివరకు సంభాషించియున్న బాకా నాదమువంటి స్వరము “ఇటు రమ్ము. తదనంతరము ఏమి జరుగవలయునో నీకు చూపె దను” అని నన్ను ఉద్దేశించి పలికెను.

2. ఆ క్షణమే ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవలోకమున ఒక సింహాసనము ఉన్నది. దానిపై ఎవరో ఆసీనుడైయుండుట గమనించితిని.

3. ఆసీనుడైనవాని వదనము సూర్య కాంత మణివలెను, కురువింద రత్నమువలెను దేదీప్యమానమై ఉండెను. సింహాసనము చుట్టును మరక తమణివర్ణముగల రంగుల ధనుస్సు వెలుగొందుచుండెను.

4. ఆ సింహాసనము చుట్టును మరి ఇరువది నాలుగు సింహాసనములు ఉండెను. వానిపై ఇరువది నలుగురు పెద్దలు కూర్చుండియుండిరి. వారు ధవళవస్త్రములను ధరించి శిరస్సులపై బంగారపు కిరీటములను కలిగి యుండిరి.

5. ఆ సింహాసనమునుండి మెరుపులు మెరయుచుండెను. గర్జనలును, ఉరుములును వెలువ డుచుండెను. ఆ సింహాసనము ఎదుట ఏడు దివిటీలు వెలుగుచుండెను. ఇవి దేవుని సప్తఆత్మలు.

6. సింహాసనమునకు ఎదురుగా స్ఫటికమువలె స్వచ్ఛమై, పారదర్శకమై సముద్రమువలె గోచరించునది ఏదియో ఉండెను.

సింహాసనమును పరివేష్టించి దానికి ఒక్కొక్క పార్శ్వమున, ముందు వెనుకల నేత్రములుగల నాలుగుజీవులు ఉండెను.

7. అందు మొదటిది సింహమువలె ఉండెను, రెండవది ఆవుదూడవలె కనపడెను, మూడవది మానవుని ముఖాకృతి కలిగి ఉండెను, నాలుగవది ఎగురుచున్న గ్రద్దను పోలి యుండెను.

8. ఈ నాలుగు జీవులలో ప్రతిజీవియు ఆరు రెక్కలుగలిగి, లోపలను, వెలుపలను నేత్రములతో నిండిఉండెను. అవి రేయింబవళ్ళు ఇట్లు పాడుచునే ఉండును. “సర్వశక్తిమంతుడును, దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు; ఆయనయే త్రికాలస్థితుడు”.

9. సింహాసనాసీనుడును, నిత్యుడును అగు వ్యక్తికి వైభవకీర్తి కృతజ్ఞతాస్తోత్రములను ఆ నాలుగుజీవులును పెక్కుమారులు అర్పించినవి. 10. అట్లే ఆ సింహా సనాసీనుని ఎదుట ఆ ఇరువది నలుగురు పెద్దలును సాష్టాంగపడిరి. ఆ శాశ్వతుని పూజించిరి. తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట ఉంచి ఇట్లు స్తుతించిరి:

11. “ప్రభూ! ఓ దేవా! మహిమ, గౌరవము, శక్తిపొందుటకు నీవు అర్హుడవు. ఏలయన, సర్వమునకు నీవే సృష్టికర్తవు నీ సంకల్పముననే అవి జీవమును పొంది బ్రతుకుచున్నవి.” 

 1. ఆ సింహాసనాసీనుడగు వాని కుడి చేతియందు ఒక గ్రంథమును నేను చూచితిని. ఆ గ్రంథమునకు ఇరుప్రక్కల వ్రాయబడి ఉండెను. అది ఏడు ముద్రలచే ముద్రింపబడి ఉండెను.

2. అప్పుడు అటనున్న ఒక గొప్ప దేవదూత బిగ్గరగా ఇట్లు ప్రకటించెను: “ఈ ముద్రలను పగులగొట్టి గ్రంథమును విప్పగల యోగ్యుడెవడు?"

3. అయితే పరలోకమందుగాని, భూమి మీదగాని, భూమి క్రిందగాని ఆ గ్రంథమును తెరచి, లోని విషయములను గ్రహింపయోగ్యుడగు వ్యక్తి ఎవడును కానరాడయ్యెను.

4. గ్రంథమును తెరచుటకుగాని, లోని విషయమును గ్రహించుటకుగాని యోగ్యుడగు వ్యక్తి ఒక్కడును లభింపకపోవుటచే నేను మిక్కిలి దుఃఖించితిని.

5. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు నాతో ఇట్లు పలికెను: “విలపింపకుము. చూడుము! యూదాజాతి సింహము, దావీదు సంతతిలో శ్రేష్ఠుడు, గెలుపొందినాడు, అతడే ఏడు ముద్రలను పగులగొట్టి గ్రంథమును తెరువగలడు."

6. అప్పుడు ఆ సింహాసనము మధ్య ఒక గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట కనుగొంటిని. అది నాలుగు జీవుల చేతను, పెద్దల చేతను పరివేష్టింపబడియుండెను. ఆ గొఱ్ఱెపిల్ల వధింపబడినట్లు ఉండెను. అది ఏడు కొమ్ములను, ఏడు కన్నులను కలిగియుండెను. అవి భువికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు.

7. సింహాసనాసీనుడైన వ్యక్తి కుడిచేతినుండి ఆ గొఱ్ఱెపిల్ల ఆ గ్రంథమును గ్రహించెను.

8. ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, ఇరువది నలుగురు పెద్దలును ఆ గొఱ్ఱెపిల్లముందు సాగిలపడిరి. ఆ పెద్దలందరును వీణలను ధరించి బంగారుపాత్రలలో ధూపములను అర్పించుచుండిరి. ఆ ధూప ద్రవ్యములే పరిశుద్దుల ప్రార్థనలు:

9. వారొక క్రొత్త పాటను ఇట్లు పాడిరి: “గ్రంథమును గ్రహించుటకును, దాని ముద్రలను పగులగొట్టుటకు నీవు యోగ్యుడవు. ఏలయన, నీవు వధింపబడి నీ రక్తమువలన ప్రతి జాతినుండి, భాషనుండి, ప్రజలనుండి, తెగనుండి దేవునకై ప్రజలను కొంటివి.

10. మన దేవుని సేవించుటకు వారిని ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసితివి. వారు ఈ భువిని పాలింతురుగాక!”

11. నేను మరల చూచితిని. కోట్ల కొలదిగ దేవదూతలు పాడుట వింటిని. ఆ నాలుగు జీవులు, పెద్దలు, అందరును సింహాసనము చుట్టును నిలుచుండి ఇట్లు బిగ్గరగ పాడిరి.

12. “వధింపబడిన గొఱ్ఱెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది!" ,

13. త్రిలోకములయందలి ప్రతిజీవిని జలచరములను అన్నిటిని, సృష్టియందలి జీవకోటిని అంత టిని నేను వింటిని. వారు ఇట్లు పాడుచుండిరి: “సింహాసనాసీనునకును, గొఱ్ఱెపిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభవము శాశ్వతమగును గాక!”

14. ఆ నాలుగు జీవులును 'ఆమెన్' అని సమాధాన మొసగెను. పెద్దలు సాగిలపడి నమస్కరించిరి. 

 1. అప్పుడు గొఱ్ఱెపిల్ల ఆ ఏడింటిలో మొదటి ముద్రను విప్పుట చూచితిని. ఆ నాలుగు జీవులలో ఒకటి ఉరుమువంటి కంఠస్వరముతో “రమ్ము!” అని పిలిచెను.

2. నేను అటుచూడగా, అట ఒక తెల్లని గుఱ్ఱము ఉండెను. దాని పైనున్న ఆశ్వికుని హస్తమున ఒక విల్లు ఉండెను. అతనికి ఒక కిరీటము ఒసగబడెను. విజయునివలె అతడు జయింపనేగెను.

3. పిమ్మట గొఱ్ఱెపిల్ల రెండవ ముద్రను విప్పెను. అప్పుడు ఆ రెండవ జీవి “రమ్ము" అనుట వింటిని.

4. మరియొక గుఱ్ఱము బయల్వెడలెను. ఇది ఎఱ్ఱనిది. మానవులు ఒకరిని ఒకరు చంపుకొనుటకుగాను, భువిపై సమాధానము లేకుండ చేయు శక్తి ఆ ఆశ్వికునకు ఒసగబడెను. అతనికి ఒక పెద్ద ఖడ్గము ఈయబడెను.

5. తదనంతరము ఆ గొఱ్ఱెపిల్ల మూడవ ముద్రను విప్పెను. అప్పుడు ఆ మూడవ జీవి "రమ్ము!” అని పిలిచెను. అట ఒక నల్లని గుఱ్ఱము నాకు గోచరమయ్యెను. ఆ ఆశ్వికుడు తన చేతియందు ఒక త్రాసును ధరించెను.

6. ఆ నాలుగు జీవులనుండి వెలువడిన ఒక విచిత్రస్వరమును నేను వింటిని. ఆ స్వరము ఇట్లు పలికెను: “ఒక దినము కూలికి ఒక సేరు గోధుమలు. ఒక దినపు కూలికి మూడు పేర్లు యవలు. కాని ఓలీవు నూనెను, ద్రాక్షరసమును పాడుచేయకుడు!"

7. అంతట ఆ గొఱ్ఱెపిల్ల నాలుగవ ముద్రను విప్పెను. అప్పుడు ఆ నాలుగవ జీవి “రమ్ము!” అని పిలిచెను.

8. అట ఒక పాలిపోయిన వర్షముగల అశ్వమును నేను కనుగొంటిని. ఆ ఆశ్వికుని పేరు మృత్యువు. పాతాళమువాని వెన్నంటియే ఉండెను. భువియందు నాలుగ వపాలు వారికి ఒసగబడెను. ఖడ్గముతోను, కరువుతోను, వ్యాధులతోను, క్రూర మృగముచేతను చంపుటకు వారికి అధికారము ఒసగబడెను.

9. అనంతరము గొఱ్ఱెపిల్ల ఐదవ ముద్రను విప్పెను. అంతట దైవపీఠము క్రింద దేవుని వాక్కును ప్రకటించి విశ్వాసపాత్రులైన సాక్షులై, తత్ఫలితముగా చంపబడినవారి ఆత్మలను చూచితిని.

10. పెద్ద స్వరములతో వారుఇట్లు అరచిరి: “సర్వశక్తిమంతుడవగు ప్రభూ! పవిత్రుడా! సత్యస్వరూపీ! భూలోకవాసులను తీర్పునకు గురిచేయకుండుట ఎన్నినాళ్ళు? మా రక్తము నిమిత్తము వారిని శిక్షించుట ఎన్నడు?"

11. వారిలో ఒక్కొక్కనికి ఒక ధవళవస్త్రము ఇయ్యబడెను. తమవలెనే చంపబడవలసిన తమ సహోదరుల, సహసేవకుల లెక్క పూర్తి అయ్యెడు వరకు, ఇంకను కొంతకాలము ఓపిక పట్టవలసినదిగా వారితో చెప్పబడెను.

12. తరువాత ఆ గొఱ్ఱెపిల్ల ఆరవ ముద్రను విప్పు టచూచితిని. అంతట ఒక భయంకరమగు భూకంపము సంభవించెను. సూర్యుడు కాంతివిహీనుడయ్యెను. అతడు ఒక నల్లని ముతక గుడ్డవలె ఉండెను. చంద్రుడు రక్తవర్ణము దాల్చెను.

13. నక్షత్రములు భువిపై రాలెను. అవి పెద్ద గాలికి అంజూరపు చెట్లనుండి రాలిపడెడి పచ్చికాయలవలె ఉండెను.

14. చుట్ట చుట్టిన కాగితము వలె ఆకాశము అదృశ్యమయ్యెను. పర్వతములు, ద్వీపములు స్థానభ్రంశము నొందెను.

15. అప్పుడు భువి యందలి రాజులు, ప్రభువులు, సేనానాయకులు, ధనికులు, బలవంతులు, బానిసలు, స్వతంత్రులు, సమస్త జనులు, కొండరాళ్ళలో గుహలలో తలదాచుకొనిరి.

16. ఆ పర్వతములతోను, ఆ శిలలతోనువారు: 'సింహాసనాసీనుని కన్నుల బడకుండ మమ్ము దాచి వేయుడు! గొఱ్ఱెపిల్ల కోపమునకు గురికాకుండ మమ్ము కప్పివేయుడు!

17.ఏలయన, వారు కోపించు దినము వచ్చినది. వారికి ఎవరు ఎదురు నిలువగలరు?” అని మొరపెట్టుకొనిరి. 

 1. పిమ్మట ప్రపంచము నాలుగు మూలలను నలుగురు దేవదూతలు నిలిచి ఉండుట గమనించితిని. భూమిపైగాని, సముద్రముపైగాని, ఏ చెట్టుపైననుగాని గాలి వీచకుండ వారు నాలుగుదిక్కులయందును గాలులను నిరోధించిరి.

2. తూర్పు దిక్కునుండి సజీవ దైవముయొక్క ముద్రతో మరియొక దేవదూత వచ్చుట చూచితిని. భూమిని, సముద్రమును నాశనము చేయుటకు దేవునిచే అధికారము నొసగబడిన నలుగురు దేవదూతలను అతడు బిగ్గరగా పిలిచెను.

3. “మా దేవుని సేవకులనుదుటిపై ముద్రవేయువరకు భూమినిగాని, సముద్రమునుగాని, చెట్లనుగాని నాశన మొనర్పకుడు” అని ఆ దేవదూత వారితో పలికెను.

4. తమ నొసళ్ళపై దేవుని ముద్రను పొందినవారి సంఖ్య నాకు ఎరిగింపబడెను. వారు యిస్రాయేలునందలి అన్ని గోత్రములనుండి గ్రహింపబడిన నూట నలువది నాలుగువేలమంది మాత్రమే.

5. ముద్రాంకితులైన వారు యూదా గోత్రములనుండి పండ్రెండువేలు, రూబేను గోత్రమునుండి పండ్రెండువేలు, గాదు గోత్రమునుండి మరి పండ్రెండు వేలు.

6. ఆషేరు గోత్రమునుండి యింకొక పండ్రెండు వేలు, నఫ్తాలి గోత్రమునుండి వేరొక పండ్రెండు వేలు, మనష్షే గోత్రమునుండి ఒక పండ్రెండువేలు,

7. షిమ్యోను గోత్రమునుండి పండ్రెండువేలు, లేవీ గోత్రమునుండి పండ్రెండువేలు, యిస్సాఖారు గోత్రమునుండి వేరొక పండ్రెండువేలు,

8. సెబులూను గోత్రమునుండి ఇంకొక పండ్రెండువేలు, యోసేపు గోత్రమునుండి ఒక పండ్రెండువేలు, బెన్యామీను గోత్రమునుండి పండ్రెండువేలును అట ఉండిరి.

9. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను! అందు అన్ని జాతుల వారును, అన్ని తెగలవారును, అన్ని వర్గములవారును, అన్ని భాషలవారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకును, గొఱ్ఱెపిల్లకును ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసికొని ఉండిరి. చేతులయందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి.

10. “సింహాసనాసీనుడగు మా దేవునివలనను, ఈ గొఱ్ఱెపిల్ల వలనను మాకు రక్షణ లభించుచున్నది, స్తోత్రము!” అని వారు బిగ్గరగ పలికిరి.

11. దేవదూతలందరు సింహాసనము చుట్టును, పెద్దల చుట్టును, నాలుగు జీవుల చుట్టును నిలుచుండిరి. అంతట వారు సింహాసనమునకు ఎదురుగా సాష్టాంగపడి

12. “ఆమెన్! మన దేవునకు సదా స్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభవము, శక్తియు కలుగును గాక! ఆమెన్!” అని వారు పలుకుచు దేవుని ఆరాధించిరి.

13. “ఈ తెల్లని దుస్తులు ధరించినవారు ఎవరు? వారు ఎట నుండి వచ్చిరి?” అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను.

14. “అయ్యా, నీకే తెలియును” అని నేను అంటిని. “భయంకర హింసను సురక్షితముగ అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొఱ్ఱెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళన మొనర్చుకొని వానిని తెల్లనివిగ చేసికొనిరి.

15. అందుచేతనే వారు దేవుని సింహాసనము ఎదుట నిలిచి రాత్రింబవళ్ళు ఆయన దేవాలయములో సేవలు చేయుదురు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును.

16. ఎన్నటికిని వారికి ఇక ఆకలి దప్పులు ఉండవు. సూర్యుడుగాని, ఏ వేడిమిగాని వారిని దహింపదు.

17. ఏలయన, సింహాసనమునకు మధ్య నున్న గొఱ్ఱెపిల్ల వారికి కాపరిఅగును, వారిని జీవ జలమువద్దకు తీసికొనిపోవును. దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిచి వేయును” అని ఆ పెద్ద నాతో పలికెను. 

 1. ఆ గొఱ్ఱెపిల్ల ఏడవ ముద్రను విప్పగా, పరలోకము ఒక అరగడియపాటు నిశ్శబ్దమాయెను.

2. దేవుని సమక్షమున నిలుచు ఏడుగురుదేవదూతలను నేను అప్పుడు చూచితిని. వారికి ఏడు బాకాలు ఇయ్యబడెను.

3. సువర్ణ ధూపపాత్రను ధరించిన మరియొక దేవదూత బలిపీఠమువద్ద నిలిచెను. పునీతులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి ఎంతయో ధూపము ఒసగబడెను. సింహాసనము ఎదుటనుండు సువర్ణ బలిపీఠముపై అది అతనిచే అర్పింపబడెను.

4. దేవుని సమక్షమున ఉన్న ఆ దేవదూత హస్తములనుండి ధూపాన్ని ధూమము పునీతుల ప్రార్థనలతోపాటు పైకెగసెను.

5. అప్పుడు ఆ దేవదూత ధూప పాత్రను గైకొని బలిపీఠమునుండి సంగ్రహించిన అగ్నితో నింపి భువిపై విసరెను. దానితో ఉరుములును, గర్జనలును, మెరపులును, భూకంపములును సంభవించెను.

6. అంతట ఆ ఏడుగురు దేవదూతలు ఏడు బాకాలను ఊదుటకై సంసిద్ధమైరి.

7. మొదటి దేవదూత బాకాను ఊదెను. తోడనే రక్తముతో కూడిన వడగండ్లు, అగ్ని భువిపై ధారాపాతముగ వర్షించెను. భువిలో మూడవ పాలు దగ్గమయ్యెను. వృక్షములలో మూడవ వంతు దహింపబడెను. పచ్చగడ్డి కూడ భస్మమయ్యెను.

8. అంతట రెండవ దేవదూత తన బాకాను ఊదెను. మండుచున్న పెద్ద పర్వతము వంటిది ఏదియో సముద్రములోనికి విసరివేయబడెను.

9. దానితో సముద్రములో మూడవపాలురక్తముగా మారెను. జలచరములలో మూడవవంతు నశించెను. నౌకలలో మూడవ భాగము ధ్వంసమయ్యెను.

10. అంతట మూడవ దేవదూత తన బాకాను మ్రోగించెను. దానితో కాగడావలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలెను. అది మూడవ వంతు నదులపైనను, నీటి ఊటలపైనను పడెను.

11. అది చేదు అను పేరుగల నక్షత్రము. దానితో జలమున మూడవ వంతు చేదుగా మారెను. ఆ చేదు నీటిని త్రాగుటవలన చాలమంది మృత్యువుపాలైరి.

12. పిమ్మట నాలుగవ దేవదూత తన బాకాను మ్రోయించెను. సూర్యుడును, చంద్రుడును, నక్షత్రములును తమతమ కాంతులలో మూడవ భాగమును కోల్పోవునట్లు వానిలో తృతీయాంశము భగ్నము ఒన ర్పబడెను. రాత్రిలో మూడవ భాగమును, పగటిలో మూడవభాగమును కాంతిహీనములు అయ్యెను.

13. నేను అటు చూడగా గాలిలో ఎత్తుగా ఒక గ్రద్ద ఎగురుచుండెను. “అనర్ధము, అనర్థము, అనర్థము. మిగిలిన ముగ్గురు దేవదూతలు ఇంకను బాకాలు ఊదవలసి ఉన్నది. వానినుండి వెలువడెడి ధ్వని భువి యందలి ప్రజలకు ఎంత భయానకముగా ఉండునో!" అని ఆ గ్రద్ద బిగ్గరగా పలికెను. 

 1. అంతట ఐదవ దేవదూత తన బాకాను ఊదెను. అప్పుడు దివినుండి రాలిన నక్షత్రము ఒకటి భువిపై కూలుట చూచితిని. అగాధపు తాళపుచెవి దానికి ఒసగ బడెను.

2. ఆ నక్షత్రము అగాధమును తెరచెను. పెద్ద కొలిమినుండి వెలువడు పొగవలె ఆ అగాధమునుండి ధూమపంక్తులు పైకి ఉబుకుచుండెను. ఆ అగాధము నుండి బయల్వెడలిన పొగచే సూర్యుడు, గాలియు నల్లబడెను.

3. ఆ పొగనుండి ఒక మిడుతల దండు భువిపైకి వెడలెను. అవి తేళ్లకుండు శక్తిని కలిగి ఉండెను.

4. గడ్డినిగాని, చెట్లనుగాని, ఏ ఇతర విధములైన మొక్కలను గాని పాడుచేయకుండునట్లు అవి ఆజ్ఞాపింపబడెను. కాని నుదుటిపై దేవుని ముద్రలు లేని మానవులను మాత్రమే అవి బాధింపగలిగెను.

5. కాని మిడుతలకు వారిని చంపుటకు ఆజ్ఞ ఈయబడలేదు. కేవలము ఐదు మాసములు మాత్రమే వారిని బాధించుటకు అవి అనుమతింపబడెను. వాని వలన కలుగుబాధ తేలుకుట్టినప్పటి బాధవలె ఉండెను.

6. ఆ దినములలో వారు మృత్యువును అన్వేషింతురు. కాని అది వారికి లభింపదు. చావును వారు కోరు కొందురు. కాని అది వారినుండి పారిపోవును.

7. ఆ మిడుతలు యుద్ధమునకు సిద్ధముగ ఉన్న గుఱ్ఱములవలె ఉండెను, వాని శిరములపై బంగారపు కిరీటముల వంటివి ఉండెను. వాని ముఖములు మానవవదనములను పోలియుండెను.

8. వాని రోమములు స్త్రీల జుట్టువలె ఉండెను. వాని దంతములు సింహపు పండ్లవలె ఉండెను.

9. వాని వక్షములు ఇనుప కవచముల వంటి వానితో కప్పబడి ఉండెను. వాని రెక్కల చప్పుడు పెక్కు గుఱ్ఱములచే లాగబడుచు యుద్ధభూమి యందు సంచరించుచున్న రథముల ధ్వనివలె ఉండెను.

10. తేళ్లకు వలె వానికి తోకయు, కొండియు ఉండెను. వాని తోకలతోనే అవి మనుజులను ఐదు నెలలపాటు బాధింపగలవు.

11. వానిపై అధికారము నెరపు రాజుకూడ కలడు. అతడు ఆ అగాధముపై యాజమాన్యము గల దేవదూత. హీబ్రూ భాషలో వానికి 'అబద్దాను' అని పేరు. గ్రీకు భాషలో అపొల్లుయోను అనునది అతని నామము. అనగా “విధ్వంసకుడు” అని అర్ధము.

12. మొదటి అనర్ధము గతించినది. తరువాత ఇంకను రెండు అనర్ధములు సంభవింపనున్నవి.

13. అంతట ఆరవ దేవదూత తన బాకాను ఊదెను. దేవుని సముఖమున ఉన్న సువర్ణ బలిపీఠపు నాలుగు కొమ్ముల నుండి వెలువడుచున్న ఒక స్వరమును నేను అప్పుడు వింటిని.

14. “యూఫ్రటీసు మహానదీ తీరమున బంధింపబడి ఉన్న నలుగురు దేవదూతలను విడుదల చేయుము!” అని ఆ స్వరము బాకాతో నున్న ఆరవ దేవదూతకు చెప్పెను.

15. ఆ నలుగురు దేవదూతలును విడుదల చేయబడిరి. వారే ఈ క్షణమున, ఈ దినమున, ఈ నెలలో, ఈ సంవత్సరమే మానవాళిలో మూడవ వంతును నశింప జేయుటకు సిద్ధము చేయబడిరి.

16. అశ్వారూఢులై ఉన్న సైనికుల సంఖ్య నాకు తెలుపబడినది. అది యిరువది కోట్లు.

17. గుఱ్ఱములును, ఆశ్వికులును కూడ నాకు ఆ దృశ్యమున గోచరించిరి. వారు వక్షమున ధరించిన కవచములు నిప్పువలె ఎఱ్ఱగాను, ఇంద్రనీల మణులవలె నీలముగాను, గంధకము వలె పసుపు పచ్చగాను ఉండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహముల శిరస్సుల వలె ఉండెను. వాని నోటి నుండి మంటలు, పొగ, గంధకము వెలువడుచుండెను.

18. ఆ గుఱ్ఱముల నోళ్ల నుండి వెలువడుచున్న మంటలు, పొగ, గంధకము అను మూడు అనర్థముల చేతనే మానవాళిలో మూడవ వంతు నశించెను.

19. ఏలయన, ఆ గుఱ్ఱముల శక్తి వాని నోళ్లలోను, తోకలలోను ఉండెను. వాని తోకలు, తలలు కలిగిన పాముల వలె ఉండెను. అవి ఆ తోకలతో ప్రజలను బాధించును.

20. ఈ మూడు అనర్ధములచే నశింపక మిగిలి యున్న మానవాళి, తాము ఒనర్చిన వాని నుండి మరలిపోలేదు. దయ్యములను, విగ్రహములను పూజించుట వారు మానలేదు. ఇవి చూడలేనివి, వినలేనివి, నడవలేనివియైన బంగారు, వెండి, కంచు, శిలా, కొయ్య విగ్రహములు.

21. అంతేకాక, తాము ఒనర్చిన హత్యలనుగాని, తమ మాయలనుగాని, తమ జారత్వమునుగాని, తమ దొంగతనములను గాని వారు మానుకొనలేదు.. 

 1. అంతట మహా బలవంతుడగు మరియొక దేవదూత దివి నుండి క్రిందికి బయల్వెడలుట గమనించితిని. అతడు మేఘమును వస్త్రముగా ధరించెను. వాని తల చుట్టును ఒక రంగుల ధనుస్సు ఉండెను. వాని వదనము నూర్యబింబమువలె ఉండెను. వాని పాదములు అగ్ని స్తంభములవలె ఉండెను.

2. వాని చేతియందు తెరవబడిన చిన్న గ్రంథము ఒకటి ఉండెను. అతడు తన కుడి పాదమును సముద్రముపైనను, ఎడమ పాదమును భువిపైనను ఉంచెను.

3. అంతట అతడు సింహగర్జనను పోలిన గంభీరమగు కంఠముతో పిలిచెను. అతని పిలుపును అనుసరించి ఏడు ఉరుములు ప్రతిధ్వనించెను.

4. అవి అట్లు పలుకగనే నేను వ్రాయ మొదలిడితిని. కాని అంతలో దేవలోకము నుండి నాకు ఒక స్వరము వినబడెను. “ఏడు ఉరుములు ఏమి చెప్పెనో అది రహస్యముగా ఉంచుము. దానిని లిఖింపకుము!” అని ఆ స్వరము నాతో పలికెను.

5. అంతట సముద్రముపైనను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన దేవదూత తన కుడి చేతిని దేవలోకము వైపునకెత్తెను.

6. అట్లు చేతిని ఎత్తి నిత్యుడును, దివిని, భువిని, సముద్రమును, వానియందలి సర్వమును సృజించినవాడగు దేవుని నామమున ఇట్లు శపథమొనర్చెను: “ఇక ఆలస్యము ఉండదు!

7. ఏడవ దేవదూత తన బాకాను ఊదిన వెంటనే దేవుడు తన రహస్య ప్రణాళికను నెరవేర్చును. అది ఆయన తన సేవకులగు ప్రవక్తలకు బోధించిన విధముగనే జరుగును" అని ఆ దేవదూత పలికెను.

8. దేవలోకము నుండి నేను పూర్వము వినియున్న స్వరము నాతో మరల ఇట్లు పలికెను. “సముద్రము మీదను, భువి మీదను నిలిచియున్న దేవదూత హస్తమునుండి తెరచియున్న గ్రంథమును తీసికొనుము" అనెను.

9. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించితిని. “దీనిని తీసికొని తినుము. అది నీ కడుపులో చేదుగా నుండును. కాని నీ నోటిలో మాత్రము తేనెవలె తీయగా ఉండును” అని అతడు నాతో పలికెను.

10. నేను అతని చేతినుండి ఆ చిన్నగ్రంథమును గ్రహించితింటిని. అది నా నోటిలో తేనెవలె తీయగా ఉండెను. కాని తినిన తరువాత అది నా కడుపులో చేదుగా మారెను.

11. అప్పుడు అనేకమంది. “ప్రజలను, జాతులను, భాషలను, రాజులను గూర్చి మరల నీవు ప్రవచింపవలెను” అని నాకు చెప్పబడెను. 

 1. అంతట నాకు ఒక చేతికఱ్ఱ వంటికొలత బద్ద ఇయ్యబడెను. పిమ్మట నాకు ఇట్లు చెప్పబడినది. “లేచి, దేవాలయమునకును, బలిపీఠమునకును కొలతలు తీసికొనుము. దేవాలయములో ఎందరు ఆరాధించుచున్నారో లెక్కింపుము.

2. కాని దేవాలయ బాహ్య ప్రాంగణములను కొలతవేయక విడిచిపెట్టుము. అది జాతులకు ఈయబడినవి. వారు పవిత్ర నగరమును నలువది రెండు నెలలపాటు తమ కాళ్ళతో మట్టగింతురు.

3. నేను నా ఇద్దరు సాక్షులను పంపెదను. వారు గోనెపట్టలను ధరించి ఈ పండ్రెండు వందల అరువది దినములవరకు ప్రవచించెదరు.

4. ఈ రెండు ఓలీవు చెట్లే ఆ సాక్షులు: భువికి నాథుడగు వాని ఎదుట నిలుచు దీపములు.

5. వానికి ఎవరైన హాని కలిగింపనెంచినచో వాని నోళ్ళనుండి అగ్నిజ్వాలలు పుట్టి అట్టి శత్రువులను పరిమార్చును. ఈ విధముగ వానికి హాని కలిగింపనెంచువారు అందరును నశింతురు.

6. వారు ప్రవచించునంత కాలమును భువిపై వానలు లేకుండును. అట్లు ఆకాశమును మూసివేయు అధికారము వారికి ఉన్నది. నీటి ఊటలపై కూడ వారికి అధికారము ఉన్నది. ఆ నీటి ఊటలను రక్త ప్రవాహములుగ వారు మార్చగలరు. వారి ఇష్ట ప్రకారము ఎన్ని మారులైనను, ఏ విధములైన జాడ్యములతోనైనను భువిని బాధించు అధికారము కూడవారికి ఉన్నది.

7. వారు సాక్ష్యము చెప్పుట ముగించిన తరువాత అగాధమునుండి వెలువడిన మృగము వారితో పోరాడును. అది వారిని ఓడించి చంపును.

8. ఆ మహానగరముననే, ప్రభువు సిలువవేయబడిన ఆ వీధి యందే వారి దేహములు పడియుండును. ఆ నగరమునకు సాంకేతిక నామము సొదొమ మరియు ఐగుప్తు

9. అన్ని జాతులకును, అన్ని తెగలకును, అన్ని భాషల కును,అన్ని దేశములకును చెందిన ప్రజలు మూడున్నర రోజులపాటు వారి దేహములను దర్శించుచు వానిని సమాధిలో భూస్థాపన మొనర్పనీయరు.

10. ఈ ఇరువురి మరణమును గూర్చి భువియందలి ప్రజలు సంతోషింతురు. వారు పండుగ చేసికొందురు. ఒకరికి ఒకరు బహుమానములను పంపుకొందురు. ఏలయన, ఈ ఇరువురు ప్రవక్తలు భువియందలి ప్రజలకు పెక్కు కష్టములను తీసికొని వచ్చిరి గదా!

11. కాని మూడున్నర దినముల తరువాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహములయందు ప్రవేశించెను. వారు లేచి నిలబడిరి. వారిని చూచిన వారందరును మిగుల భయమునొందిరి.

12. అప్పుడు ఆ ఇరువురు ప్రవక్తలును దివినుండి తమతో సంభాషించుచున్న ఒక గంభీర స్వరమును వినిరి. “మీరు ఇచటకు రండు” అని ఆ స్వరము వారితో పలికెను. వారి శత్రువులు చూచుచుండగనే వారు మేఘమండలము ద్వారా దివిని చేరిరి.

13. ఆ క్షణముననే ఒక భయంకర భూకంపము సంభవించెను. నగరములో పదియవపాలు నాశనమాయెను. ఆ భూకంపమున మొత్తము ఏడువేల మంది జనులు మరణించిరి. మిగిలిన ప్రజలు భయకంపితులై దివియందలి దేవుని మహిమను స్తుతించిరి.

14. రెండవ అనర్ధము గతించిపోయినది. కాని గమనింపుడు! మూడవ అనర్ధము ఆసన్నమైనది.

15. .అంతట ఏడవ దేవదూత తన బాకాను ఊదెను. తోడనే దివినుండి పెద్ద ధ్వనులు విననయ్యెను. “ప్రపంచమును పాలించు అధికారము ఇపుడు మన ప్రభువుది, మెస్సియాది. ఆయన పాలన సదా కొనసాగునుగాక!” అని ఆ స్వరము పలికెను.

16. అంతట దేవుని ఎదుట తమ సింహాసనములపై కూర్చుండి యుండెడి ఇరువది నలుగురు పెద్దలు దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధించిరి.

17. వారు ఇట్లు పలికిరి. “భూత వర్తమానములలో ఉండువాడవును, సర్వశక్తిమంతుడవును అగు దేవా! ఓ ప్రభూ! నీ మహాశక్తిని ఉపయోగించి పరిపాలించుట ప్రారంభించితివి నీకు మేము కృతజ్ఞులము!

18. అన్యజాతులకు క్రోధము ఎక్కువ కాగా నీ ఆగ్రహము ప్రదర్శితమాయెను: ఏలన, మృతులకు తీర్పు చెప్పుదినము సమీపించినది. నీ సేవకులగు ప్రవక్తలకును, పరిశుద్ధులకును నిన్నుచూచి భయమునొందు అధికులకు అల్పులకు బహుమానములు ఈయదగిన సమయము ఆసన్నమైనది. భువికి వినాశకులైనవారిని ధ్వంసమొనర్పవలసిన సమయమిదియే!”

19. దివియందలి దేవుని ఆలయము తెరువబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులును, గర్జనలును, ఉరుములును, భూకంపములును, వడగండ్లవానలును ప్రారంభ మయ్యెను. 

 1. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను: ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు. చంద్రుడు ఆమె పాదములక్రింద ఉండెను. ఆమె శిరముపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను.

2. ఆమె నిండుచూలాలు. ప్రసవవేదనవలన ఆమె మూలుగుచుండెను.

3. అపుడు దివియందు మరియొక సంకేతము గోచరించెను. ఒకఎఱ్ఱనిగొప్పసర్పము గోచరించెను. దానికి ఏడు తలలు, పదికొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను.

4. అది తన తోకతో ఆకసమునందలి తారకలలో మూడవ భాగమును చుట్టచుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మ్రింగ ఆ సర్పము చూచుచుండెను.

5. అంతట సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించగా, ఆమె శిశువు దేవుని వద్దకును, ఆయన సింహాసనము వద్దకును తీసికొనిపోబడెను.

6. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె పండ్రెండువందల అరువది దినముల పాటు పోషింపబడును.

7. అంతట దేవలోకమున యుద్ధము ఆరంభ మయ్యెను! మిఖాయేలు, అతని తోడిదేవదూతలును ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును, దాని దూతలును వారిని ఎదిర్చి పోరాడిరి.

8. కాని ఆ సర్పమును దాని దూతలును ఓడిపోయిరి. కనుక వారు దివినుండి వెలుపలకు త్రోయబడిరి.

9. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను! ఆ సర్ప ము మనకు సుపరిచితమైనదే. పిశాచము, సైతాను అనునామములు గల ఆ సర్పమే లోకమునంతటిని మోసగించునది. అతడును, అతని అనుయాయులగు దూతలును భువికి నెట్టబడిరి.

10. అంతట దివియందు ఒక గంభీరకంఠ స్వరము ఇట్లు పలుకుట వింటిని: “ఇపుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగ దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సియాగా తన అధికారమును నెరపెను! ఏలయన, మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్లు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివినుండి బయటకు గెంటి వేయబడినాడు.

11. గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా, వారు ప్రకటించిన సత్యము ద్వారా, మన సోదరులు వానిపై గెలుపును సాధించిరి. వారు ప్రాణములు త్యజించుటకును, మరణించుటకును కూడ సిద్ధపడిరి.

12. కనుక దేవలోకము సంతోషించునుగాక! దేవలోక వాసులు ఆనందింతురుగాక! కాని భువికిని సముద్ర మునకును ఎంత అనర్గము! ఏలయన, సైతాను మీపై వచ్చి పడినదిగదా! తనకు ఉన్న వ్యవధి కొలదిమాత్రమే అని దానికి తెలియును. కనుకనే అది ప్రచండమగు కోపముతో ఉన్నది.”

13. తాను భువికి గెంటబడితినని ఆ గొప్ప సర్పము గ్రహింపగనే, ఆ బాలుని ప్రసవించిన స్త్రీని వెన్నంటుటకు ప్రయత్నించెను.

14. కాని గ్రద్ద రెక్కల వంటి రెండు రెక్కలు ఆ స్త్రీకి అనుగ్రహింపబడెను. ఆ రెక్కల సాయమున ఆమె ఎడారిలోని తన నివాసమును చేరెను. అచట ఆమె సర్పముఖమును చూడకుండ ఒక కాలము, కాలములు, అంకాలము పోషింపబడెను.

15. అంతట ఆ సర్పము తన నోటినుండి ఒక భయంకర జలప్రవాహమును సృష్టించి ఆమెను అనుసరింప జేసెను. ఆ జలప్రవాహమున బడి ఆమె కొట్టుకొని పోవునని ఆ సర్పము భావించెను.

16. కాని భువి ఆ స్త్రీకి సాయపడెను. ఎట్లన, భువి తన నోటిని తెరచి ఆ సర్పము తన నోటినుండి గ్రక్కిన ఆ జలప్రవాహమును మ్రింగివేసెను.

17. సర్పమునకు ఆ స్త్రీ పై కోపము అధికమయ్యెను. అందుచే ఆ సర్పము మిగిలియున్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యెను కాని వారు దేవుని ఆలకు విధేయులు, యేసుకు సాక్షులుగా నిలచినవారు.

18. అప్పుడు ఆ భయంకర సర్పము సముద్రపుబొడ్డున నిలిచెను. 

 1. అంతలో సముద్రమునుండి ఒక క్రూర మృగము వెలుపలికి వచ్చుట గమనించితిని. దానికి పది కొమ్ములు, ఏడుతలలు. అన్ని కొమ్ములకును కిరీటములు ఉండెను. దాని తలలపై ఒక దుష్టనామము వ్రాయబడి ఉండెను.

2. ఆ మృగము ఒక చిరుత పులివలె ఉండుట గమనించితిని. దాని పాదములు ఎలుగుబంటి పాదములను పోలిఉండెను. నోరు సింహపునోటివలె ఉండెను. ఆ భయంకర సర్పము తన శక్తిని, సింహాసనమును, విస్తారమైన అధికారమును ఆ మృగమునకు ఒసగెను.

3. ఆ మృగము తలలలో ఒకటి తీవ్రముగ గాయపడి చావుదెబ్బ తగిలినట్లు ఉండెను. కాని గాయము మాని ఉండెను. భువి యంతయు ఆశ్చర్యముతో నిండినదై ఆ మృగమును అనుసరింపసాగెను.

4. సర్పము తన అధికారమును ఆ మృగమునకు ఒసగుటచే ప్రజలందరు ఆ సర్ప మునుపూజించిరి.వారు ఆమృగమును కూడ పూజించిరి. “ఈ మృగము వంటివారు ఎవరున్నారు? దానితో పోరాడగలవారు ఎవరు?” అని వారు పలుకసాగిరి.

5. ఆ మృగమునకు కుత్సితపు పలుకులను దేవదూషణములను పలుకు ఒక నోరు ఇవ్వబడెను. అది నలువది రెండు నెలలపాటు అధికారము కలిగి ఉండుటకు అనుమతింపబడెను.

6. కనుక దేవుని, ఆయన నామమును, ఆయన నివాసమును, పరలోక వాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను.

7. అది పరిశుద్దులతో, పోరాడి వారిని ఓడించుటకు కూడ అనుమతింపబడెను. ప్రతి తెగపై, జాతులపై, ప్రజలపై, భాషలపై దానికి అధికారము ఒసగబడెను.

8. భువియందు జీవించు ప్రజలు అందరును దానిని పూజింతురు. అనగా చంపబడిన గొఱ్ఱెపిల్లయొక్క జీవ గ్రంథమున ఎవరి నామములు సృష్టికి పూర్వము వ్రాయబడలేదో అట్టివారు మాత్రమే..

9. “కనుక వినుటకు మీకు వీనులున్నచో శ్రద్ధగా వినుడు.

10. ఎవడు చెరపట్టవలెనని నిర్ణయింపబడెనో అట్టివాడు చెరలోనికి పోవును. ఖడ్గమునకు బలి గావింపబడవలెనని ఎవడు నిర్ణయింపబడెనో అట్టి వాడు తప్పక ఖడ్గమునకు బలియగును. కాని దీనియందు పవిత్రులు సహనమును, విశ్వాసమును ప్రదర్శింపవలసి ఉన్నది.”

11. అంతట భూమిలోనుండి మరియొక జంతువు బయల్వెడలుట గమనించితిని. దానికి గొఱ్ఱెపోతు కొమ్ములవంటి రెండు కొమ్ములు ఉండెను. అది భయంకర సర్పమువలె సంభాషించెను.

12. మొదటి జంతువు యొక్క సర్వాధికారమును దాని సమక్షముననే ఉపయోగించెను. భువిని, భువిపై ఉన్న వారినందరిని, ఆ మొదటి జంతువును నమస్కరింపవలసినదిగ అది బలవంతపెట్టెను. అప్పటికి ఆ మొదటి జంతువు తీవ్రమైన గాయము నయమయ్యెను.

13. ఈ రెండవ జంతువు గొప్ప సూచనలను ప్రదర్శించెను. అది దివినుండి భువికి అగ్నివర్షము కురిపించెను. అది అందరును చూచుచుండగనే జరిగినది.

14. ఈ మాయల ద్వారా అది భువియందలి ప్రజలందరిని మోసగించెను. అది ఆ మహిమలను మొదటి జంతువు సమక్షముననే ఒనర్చుటకు అనుమతింపబడెను. కత్తిచే గాయపరచబడియు జీవించిన ఆ మొదటి జంతువు గౌరవార్థము ఒక విగ్రహమును నిర్మింపవలసినదిగ ఈ జంతువు మానవాళికి బోధించెను.

15. ఆ మొదటి జంతువు విగ్రహములోనికి ప్రాణము ఊదుట ద్వారా, రెండవ జంతువు ఆ విగ్రహమునకు ప్రాణము పోసెను. అంతట ఆ విగ్రహము మాటలాడు శక్తిగలదై తనను పూజించుటకు ఇష్టపడని వారిని చంపగలిగి ఉండెను.

16. చిన్న, పెద్ద, ధనిక, దరిద్ర, దాస, స్వతంత్ర మానవులందరును తమ కుడిచేతులపైగానీ, నొసళ్ళపైగానీ ముద్రలు ధరింపవలెనని ఆ జంతువు నిర్బంధించెను.

17. ఈ ముద్ర ఉన్ననే కాని ఎవడును ఏమియు కొనజాలక, అమ్మజాలక ఉండెను. ముద్ర అనగా ఆ జంతువు నామము, లేదా ఆ నామమునకు బదులైన సంఖ్య.

18. దీనిని అర్థము చేసికొనుటకు జ్ఞానము అవసరము. జ్ఞానము గలవాడు జంతువు యొక్క సంఖ్య అననేమియో తెలిసికొనగలడు. ఏలయన, ఆ సంఖ్య ఒక మనుష్యుని సంఖ్యయే. దాని సంఖ్య ఆరు వందల అరువదియారు.

 1. అంతట నేను అటుచూడగా, సియోను పర్వతముపై నిలిచి ఉన్న గొఱ్ఱెపిల్ల గోచరించెను. ఆయనతోపాటు నూట నలువది నాలుగువేల మంది ప్రజలు ఉండిరి. వారి నొసళ్ళపై ఆయన పేరును, ఆయన తండ్రి పేరును ఉండెను.

2. అంతట దివి నుండి వెలువడిన ఒక స్వరమును నేను వింటిని. అది ఒక గొప్ప జలపాత ధ్వనిని పోలి ఉండెను, పెద్ద ఉరుమువలె ఉండెను. నేను వినిన ఆ స్వరము మీటిన వీణానాదము వలె ఉండెను.

3. వారు సింహాసనము వంకకు తిరిగి, నాలుగుజీవులకును, పెద్దలకును ఎదు రుగా నిలిచి ఒక క్రొత్తపాటను పాడిరి. భువినుండి విమోచనము నొందిన ఆ నూటనలువది నాలుగువేలమంది ప్రజలు తప్ప అన్యులు ఆ పాటను నేర్వజాలకుండిరి.

4. తమను తాము స్త్రీ సాంగత్యముతో అపవిత్రము కావించుకొననివారు. వారు అవివాహితులు. ఆ గొఱ్ఱెపిల్ల ఎటు పోయినవారు దానిని అనుసరింతురు. వారు మిగిలిన మానవాళినుండి విముక్తులైరి. దేవునికిని, గొఱ్ఱెపిల్లకును అర్పింపబడుటలో వారే ప్రథమ ఫలములు.

5. వారు ఎన్నడును అసత్య మాడినట్లు ఎరుగము. వారు దోషరహితులు.

6. అంతట మధ్యాకాశములో ఎగురుచున్న ఒక దేవదూతను చూచితిని. అతనియొద్ద భువియందలి ప్రజలకు అన్ని జాతులకును, తెగలకును, అన్ని భాషా వర్గములకును ప్రకటింపబడవలసిన నిత్య సువార్త ఒకటి ఉండెను.

7. అతడు పెద్దగా ఇట్లు పలికెను: “దేవునకు భయపడుడు. ఆయన మహిమను స్తుతింపుడు! ఏలయన, ఆయన మనుజులకు తీర్పుచెప్పుదినము ఆసన్నమైనది. దివిని, భువిని, సముద్రమును, నీటి ఊటలను సృష్టించిన ఆ దేవునిఎదుట భక్తితో వినమ్రులుకండు!"

8. అంత మరియొక దేవదూత అనగా రెండవ దూత అతని వెంబడివచ్చి “అది పతనమయ్యెను! మహానగరమగు బబులోనియా కూలిపోయెను! జాతులన్నింటికి మహోద్రేకముతో కూడిన వ్యభిచారమను మద్యమును త్రాగించినది” అని పలుకుచుండెను.

9. అంతట మరియొక దేవదూత, మూడవది, వారిరువురిని అనుసరించెను. అది గంభీర స్వరముతో ఇట్లు పలికెను: “ఆ జంతువునుగాని దాని విగ్రహమునుగాని పూజించి, దాని ముద్రను తన చేతిమీద గాని, నొసటిమీద గాని పొందువాడు,

10. దేవుని కోపము అను మద్యమును, తనంతట తాను త్రాగవలసివచ్చును. ఆ క్రోధమను మద్యమును ఆగ్రహమను పాత్రలో తానే పోసికొనెనుగదా! ఇట్లు చేయువారు అందరును అగ్నిలోను, గంథకము నందును, పవిత్రులగు దేవదూతల ఎదుటను, గొఱ్ఱెపిల్ల సమక్షమునను హింసింపబడుదురు.

11. వారిని హింసించు ఆ నిప్పు నుండి వెలువడు పొగ సదా పైకెగయుచునే ఉండును. ఆ మృగమునుగాని, దాని విగ్రహమునుగాని ఆరాధించిన వారికిని, దాని నామముద్రను ధరించిన వారికిని రాత్రిగాని, పగలు గాని విశ్రాంతి ఉండదు.”

12. దేవుని శాసనములకు విధేయులును, యేసునకు విశ్వాసపాత్రులు అగు పరిశుద్దులు దీని కొరకై సహనమును వహింపవలెను.

13. అంతట నేను పరమునుండి ఒక దివ్య స్వరమును వింటిని. “ఇప్పటినుండియు ప్రభువునందు మరణించువారు ధన్యులు అని వ్రాయుము” అని ఆ దివ్యవాణి పలికెను. “నిజముగనే ధన్యులు. వారివారి శ్రమలనుండి వారు విశ్రాంతిని పొందుదురుగాక! ఏలయన, వారి కృషి ఫలితము వారి వెంటపోవును" అని ఆత్మ పలికెను.

14. అంతట నేను అటు చూడగ అటనొక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించి మనుష్యకుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. ఆయన శిరస్సున సువర్ణ కిరీటము ఉండెను. చేతి యందు వాడియైన కొడవలి ఒకటి ఉండెను.

15. అంతలో దేవాలయము నుండి మరియొక దేవదూత వెలువడి మేఘారూఢునితో, “ఇది తగిన సమయము. కోతకు పైరు సిద్ధముగ ఉన్నది. నీ కొడవలితో పైరు కోయుము” అని పలికెను.

16. వెంటనే మేఘారూఢుడు తన కొడవలిని భూమిపై విసరగా, భూమిపై పైరు కోయబడెను.

17. అంతలోనే పరలోకమునందున్న ఆలయ మునుండి వేరొక దేవదూత వెలువడెను. అతని చేతిలో కూడ ఒక వాడియైన కొడవలి ఉండెను.

18. అగ్నికి అధిపతియగు మరియొక దేవదూత బలిపీఠమునుండి వెలువడెను. చేత వాడియైన కొడ వలి గల దేవదూతతో అతడు బిగ్గరగా, “ద్రాక్ష పండ్లు పండినవి. భువియను ద్రాక్షతోటలోని ద్రాక్ష పండ్లను నీ కొడవలితో కోయుము” అని చెప్పెను.

19. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భువిపైకి విసరి భువిమీది ద్రాక్షలను కోసి, దేవుని మహాఆగ్రహమను యంత్ర మునవేసెను.

20. నగరమునకు వెలుపలనున్న యంత్రాగార ములో ఆ ద్రాక్షపండ్లనుండి రసము తీయబడెను. అప్పుడు ఆ యంత్రమునుండి రెండువందల మైళ్ల పొడవున, గుఱ్ఱపు కళెమంత ఎత్తున, రక్తము వరదై ప్రవహించెను. 

 1. అప్పుడు దివియందు నేనుమరియొక అత్యా శ్చర్యకరమగు సంకేతమును చూచితిని. ఏడు అరిష్టములను ధరించిన ఏడుగురు దేవదూతలు నాకు అట గోచరించిరి.ఇ వి తుది జాడ్యములు. ఏలయన, వానితో దేవుని ఆగ్రహము పరి సమాప్తమాయెను.

2. అగ్నితోకూడి గాజువలె మెరయుచు సముద్రమువలె విస్తరించియున్న ఒకదానిని నేను అట చూచితిని. ఆ మృగము పైనను, దాని విగ్రహము పైనను గెలుపును సాధించినవారిని, సంఖ్యచే సూచింపబడు నామము గలవాని పై విజయమును పొందిన వారిని కూడ నేను అట చూచితిని. వారు ఆ గాజు సముద్ర మువలె గోచరించు దాని తీరమున నిలబడి ఉండిరి. వారి చేతులలో దేవుడు ప్రసాదించిన వీణలు ఉండెను.

3. దేవుని సేవకుడగు మోషే గీతమును, గొఱ్ఱెపిల్ల గీతమును వారు ఇట్లు పాడుచుండిరి: “సర్వశక్తిమంతుడవగు దేవా! ఓ ప్రభూ! నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు! ఎంత మహిమాన్వితములు? సర్వజాతులకు చక్రవర్తీ! నీ మార్గములు ఎంత నిర్దోషములు, సత్యాన్వితములు!

4. ఓ ప్రభూ! నీ నామమునకు భయపడనివాడెవ్వడు? నీ మహిమను ప్రకటింపక తిరస్కరించు వాడెవ్వడు? ఏలయన, నీవు మాత్రమే పవిత్రుడవు. నీ సత్యార్యములు అందరకు సువిదితమైనవి. కనుక సర్వ జాతులును నిన్ను చేరి నిన్నే ఆరాధించును”.

5. తరువాత దివియందలి, సాక్ష్యపు గుడారము గల ఆలయము తెరువబడుట చూచితిని.

6. ఏడు జాడ్యములను ధరించిన ఏడుగురు దేవదూతలు ఆ ఆలయమునుండి బయల్వెడలిరి. వారు తెల్లని వస్త్ర ములను ధరించియుండిరి. వారి వక్షముల యందు బంగారపు పట్టీలు ఉండెను.

7. అంత, ఆ నాలుగు జీవులలో ఒకటి నిత్యుడగు దేవుని ఆగ్రహముతో నిండిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవ దూతలకును ఇచ్చెను.

8. దేవుని మహిమనుండి శక్తి నుండి వెలువడిన ధూమముతో ఆ ఆలయము నిండి యుండెను. ఆ ఏడుగురు దేవదూతలచే కల్పింపబడిన ఏడు జాడ్యములు ముగియునంతవరకు ఎవ్వరును ఆ ఆలయమును ప్రవేశింపజాలకపోయిరి. 

 1. అప్పుడు ఆ దేవాలయమునుండి ఒక గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో పలుకుట విన బడెను. “దేవుని ఆగ్రహముతో కూడిన సప్త పాత్రలను భూమిపై కుమ్మరింపుడు, పొండు” అని ఆ స్వరము పలికెను.

2. కావున మొదటి దేవదూత భువిని చేరి తన చేతి పాత్రను కుమ్మరించెను. ఆ మృగము ముద్రను ధరించిన వారికిని, దానిని ఆరాధించిన వారికిని శరీర ములపై భయంకరములును బాధాకరములగు పుండ్లు పుట్టెను.

3. అంత రెండవ దేవదూత తన పాత్రను సముద్రముపై కుమ్మరించెను. దానితో ఆ జలమంతయు మృతుని రక్తమువలె మారిపోయెను. ఆ సముద్రములోనున్న జీవులన్నియు చనిపోయెను.

4. పిమ్మట మూడవ దేవదూత తన చేతి పాత్రను నదుల పైనను, నీటి ఊటల పైనను కుమ్మరించెను. దానితో అవి రక్తమయములయ్యెను.

5. అపుడు జలాధి దేవదూత ఇట్లు పలుకుట వింటిని. “భూత వర్తమాన కాలములలో నున్న ఓ పవిత్రుడా! నీవు న్యాయవంతుడవు. ఏలయన, నీవు అటుల తీర్పు విధించితివి.

6. ఏలయన, వారు పరిశుద్ధుల, ప్రవక్తల రక్తమును చిందింపచేసితిరి గదా! కనుకనే వారు త్రాగుటకు రక్తమును ఒసగితివి. వారికి యోగ్యమైన దానినే వారు పొందుచున్నారు!”

7. అంతట బలిపీఠము నుండి ఒక కంఠస్వరము “సర్వశక్తిమంతుడవగు ఓ దేవా! ఓ ప్రభూ! నీ నిర్ణయములు సత్యాన్వితములు, న్యాయసమ్మతములు” అని పలుకుట నాకు విదితము అయ్యెను.

8. పిమ్మట నాలుగవ దేవదూత తన చేతి పాత్రను సూర్యునిపై క్రుమ్మరించెను. తన ప్రచండమగు ఉష్ణముతో సూర్యుడు మానవులను దహింప అనుమతి పొందెను.

9. ఆ ఉష్ణ తీవ్రతచే మాడిపోయిన మానవులు ఈ జాడ్యములకు అధిపతియగు దేవుని నామమును దూషించిరి. కాని వారు తమ పాపములకు పశ్చాత్తాపపడుటగానీ, దేవుని మహిమను స్తుతించుటగానీ చేయలేదు.

10. అనంతరము ఐదవ దేవదూత తన చేతి పాత్రను ఆ మృగముయొక్క సింహాసనముపై క్రుమ్మరించెను. ఆ మృగరాజ్యమును అంధకారము ఆవరించెను. బాధచే జనులు తమ నాలుకలను కొరుకు కొనిరి.

11. తమ బాధలకును, కురుపులకును దివి యందలి దేవుని దూషించిరి. కాని తమ దుర్మార్గముల నుండి వారు మరల లేదు.

12. అప్పుడు ఆరవ దేవదూత యూఫ్రటీసు మహానదిపై తన పాత్రను కుమ్మరించెను. తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధముచేయ ఆ నది ఎండిపోయెను.

13. అంతలో కప్పలవలె కానవచ్చు చున్న మూడు అపవిత్ర ఆత్మలను చూచితిని. అవి సర్పము నోటినుండియు, మృగము నోటినుండియు, అసత్య ప్రవక్త నోటి నుండియు ఒకటొకటిగా వెలువడెను.

14. మాహాత్మ్యములను ప్రదర్శించు దయ్యముల ఆత్మలే అవి. అవి భువి యందలి రాజుల దరిచేరును.  సర్వశక్తిమంతుడగు దేవుని మహా దినమున ఆయనతో యుద్ధము ఒనర్ప వారిని కూడదీయుటకై అవి ప్రయ త్నించును.

15. "ఆలకింపుడు! నేను దొంగవలె వచ్చుచు న్నాను. మెలకువగఉండి తన వస్త్రములను కాపాడు కొనువాడు ధన్యుడు. అప్పుడు అతడు దిగంబరిగా తిరుగవలసిన అవసరము తప్పును, పదిమందిలో సిగ్గుపడవలసిన అవసరమును తప్పును!”

16. అప్పుడు ఆత్మలు ఆ రాజులనందరిని ఒక చోట చేర్చెను. ఆ ప్రదేశము హీబ్రూ భాషలో ఆర్మెగెడ్డను అని పిలువబడును.

17. అంతట ఏడవ దేవదూత తన చేతి పాత్రను గాలిలో కుమ్మరించెను. అప్పుడు దేవాలయములోని సింహాసనమునుండి ఒక గంభీరధ్వని ఇట్లు వినబడెను; “సమాప్తమైనది!” అని ఆ స్వరము పలికెను.

18. అంతట మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు సంభవించెను. సృష్ట్యాదినుండియు అభి భూకంపము ఎన్నడును కలుగలేదు. ఇది భయంక రమగు భూకంపము.

19. ఆ మహానగరము మూడు విభాగములుగా చీలిపోయెను. అన్ని దేశములయందలి నగరములును ధ్వంసమయ్యెను. మహానగరమగు బబులోనియాను దేవుడు మరువలేదు. తన ప్రచండ ఆగ్రహమను మద్యమును, ఆ నగరము తన మద్యపాత్రనుండి త్రాగునట్లు దేవుడొనర్చెను.

20. ద్వీపములు అంతరించెను. పర్వతములు అదృశ్యమయ్యెను.

21. ఆకాశమునుండి మనుష్యుల మీద వడగండ్ల వాన కురిసెను. అందు ఒక్కొక్క శిలయు ఒక మణుగు బరువు కలదైనట్లు తోచెను. ఆ వడగండ్ల జాడ్యము మహాదారుణమైనది. కనుకనే ఆ వడగండ్ల వానకు మానవులు దేవుని దూషించిరి. 

 1. అప్పుడు ఆ ఏడు పాత్రలుగల ఏడుగురు దేవదూతలలో ఒకడు నా కడకు వచ్చి, “నాతో రమ్ము అనేక జలములపై ఆసీనురాలైన మహావేశ్య ఎట్లు శిక్షింపబడనున్నదో నీకు చూపెదను.

2. భువియందలి రాజులు ఈ మహావేశ్యతో వ్యభిచరించిరి. ఆమె యొక్క జారత్వమను మద్యమును గ్రోలుటద్వారా భువియందలి ప్రజలు త్రాగుబోతులైరి” అని పలికెను.

3. నేను ఆత్మవశుడనైతిని. దేవదూత నన్ను ఒక ఎడారికి తీసికొనిపోయెను. అట ఒక ఎఱ్ఱని మృగముపై కూర్చుండియున్న ఒక స్త్రీని నేను చూచితిని. ఆ మృగము సర్వావయవములందును దుష్టనామములు లిఖింపబడి ఉండెను. ఆ మృగమునకు ఏడు తలలు, పది కొమ్ములు.

4. ఆ స్త్రీ ధూమ్ర, రక్త వర్ణములుగల వస్త్రములను ధరించి ఉండెను. ఆమె సువర్ణా భరణములను అమూల్యములైన రత్నములను, ముత్యములను దాల్చియుండెను. ఆమె హస్తమున ఒక సువర్ణ పాత్రను ధరించెను. అది ఆమె అసహ్యకరములు, జుగుప్సాకరములు, వ్యభిచారసంబంధమైన అపరిశుద్ధతతో నిండియుండెను.

5. ఆమె నుదుటియందు ఒక రహస్యార్ధము గల నామము లిఖింపబడి ఉండెను. “వేశ్యలకు మాతయు, లోకమునందలి దుర్నీతులకు తల్లియు అగు బబులోనియా మహానగరము” అని అట వ్రాయబడి ఉండెను.

6. ఆమె పునీతుల మరియు యేసు కొరకు ప్రాణమును ఇచ్చిన వేదసాక్షుల రక్తపానముచే మత్తిల్లి ఉండుట నేను గమనించితిని. నేను ఆమెను చూచి మహాశ్చర్యపడితిని.

7. “నీవు ఏల ఆశ్చర్యపడితివి?” అని దేవదూత నన్ను అడిగెను. “ఆ స్త్రీ యొక్కయు, ఆమెను మోయుచున్న ఏడు తలలు పదికొమ్ములు గల మృగము యొక్కయు రహస్యార్ధ మును నీకు ఎరిగించెదను.

8. నీవు చూచిన మృగము ఒకప్పుడు సజీవియే. కాని ఇప్పుడు జీవమును కోల్పో యినది. అది అగాధమునుండి వెలువడి నాశనము ఒనర్పబడనున్నది. సృష్ట్యాదియందు సజీవుల గ్రంథము నందు పేర్లు చేర్పబడని వారందరు ఆ మృగమును చూచి ఆశ్చర్యపడుదురు. ఏలయన, ఒకప్పుడు అది సజీవియే. ఇప్పుడు నిర్జీవి. కాని పునర్జీవియగును.

9. “కాని ఇది బోధపడుటకు జ్ఞానము, అవగాహన శక్తి అవసరము. ఏడు శిరస్సులే ఏడు పర్వతములు. ఆ ఏడు పర్వతములపై ఆ స్త్రీ ఆసీనురాలగును. అవియే ఏడుగురు రాజులు.

10. వానిలో ఐదుగురు పతనమైరి. ఒకరు ఇంకను అధికారము నెరపుచున్నారు. ఒకరు ఇంకను రాలేదు. వచ్చిన అనంతరము కేవలము కొలది కాలము మాత్రమే నిలుచును.

11. ఒకప్పుడు సజీవియైనను, ఇప్పుడు నిర్జీవియగు ఆ మృగమే ఎనిమిదవ రాజు. అతడు మొదటి ఏడుగురికిని సంబంధించినవాడే. అతడును నశించును.

12. నీవు చూచిన పదికొమ్ములు పదిమంది రాజులు. వారి రాజ్యాధికారము ఇంకను ప్రారంభము కాలేదు. కాని మృగముతోపాటు ఒక గంటకాలము రాజులుగా వారికి అధికారము ఇవ్వబడెను.

13. ఈ పదిమంది ఉద్దేశము ఒక్కటే. వారు తమ శక్తిని, అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.

14. వారును గొఱ్ఱెపిల్లతో పోరాడుదురు. కాని గొఱ్ఱెపిల్ల వారిని ఓడించును. ఏలయన ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. అతనితో ఉన్నవారు పిలువబడినవారు, ఎన్నుకొనబడినవారు, విశ్వాసపాత్రులు.”

15. ఆ దేవదూత ఇంకను నాతో ఇట్లు చెప్పెను: “వేశ్య కూర్చుండి ఉండెడి జలములే ప్రజలు, ప్రజా సమూహములు, జాతులు, భాషలు. నీవు గమనించి తివి గదా!

16. నీవు చూచిన ఆ పది కొమ్ములు, ఆ మృగము కూడ ఆ వేశ్యను ద్వేషించును. అవి, ఆమెకు ఉన్న సమస్తమును గ్రహించి ఆమెను వివస్త్రగా వదలి వేయును. అవి ఆమె మాంసమును తిని ఆమెను అగ్నిచే దగ్ధమొనర్చును.

17. ఏలయన, దేవుని వాక్కు నెరవేరువరకును, ఏకాభిప్రాయముతో తమ రాజ్యా ధికార శక్తిని మృగమునకు ఇచ్చుట ద్వారా, తన ఆశయమునే నెరవేర్చు వాంఛలను దేవుడు వారి మనసులలో ప్రవేశపెట్టెను.

18. నీవు చూచిన ఆ స్త్రీ భువి యందలి రాజులపై ఆధిపత్యమును వహించు మహా నగరము.” 

 1. అటుపిమ్మట దివినుండి మరియొక దేవదూత వెడలుట కనుగొంటిని. అతని అధికారము చాల గొప్పది. ఆయన భువినంతటిని తన వైభవముచే ప్రకాశింపజేసెను.

2. ఆయన బిగ్గరగా ఇట్లు పలికెను: “ఆమె నశించెను! బబులోనియా మహానగరము పతనమయ్యెను! ఆమె ఇప్పుడు దయ్యములకును, కలుషాత్ములకును నిలయమైనది. అసహ్యకరములును, జుగుప్పాకరములునైన అన్ని రకముల పక్షులు ఇప్పుడు అట నివసించును.

3. ఏలయన, ఆమె తన మద్యమును ప్రజలకు అందరకును పంచి పెట్టి వారిచేత త్రాగించెను. ఆ మద్యము అనునది ఆమె వ్యభిచార వ్యామోహమే. భువియందలి రాజులు ఆమెతో వ్యభిచరించిరి. లౌకిక వర్తకులు ఆమె విపరీత వ్యామోహము వలన భాగ్యవంతులైరి” అని అతడు వచించెను.

4. అంతట దివినుండి నేను మరియొక కంఠధ్వని ఇట్లు పలుకుట వింటిని: “నా ప్రజలారా! బయటకురండు! దానినుండి బయటపడుడు! ఆమె పాపములో మీరు భాగస్వాములు కారాదు! ఆమె శిక్షలలో మీరు పాలుపంచుకొనరాదు.

5. ఏలయన, ఆమె పాపములు ఆకాశమును అంటుచున్నవి. ఆమె దుష్టప్రవర్తనలు దేవునకు జ్ఞాపకము ఉన్నవి.

6. ఆమె మిమ్మెట్లు చూచెనో మీరును ఆమెనట్లే చూడుడు. ఆమె ఒనర్చినదానికి రెట్టింపు ప్రతిఫలమిండు. మీకు ఆమె ఎట్టి పానీయమును ఒసగెనో, ఆమె పానపాత్రను దానికి రెట్టింపు ఘాటైన పానీయముతో నింపుడు.

7. ఆమె తనకు ఎట్టి వైభవమును సౌఖ్యమును కూర్చుకొన్నదో దానికి తగినంత బాధను, దుఃఖమును ఆమెకు కలిగింపుడు. 'నేను ఇట రాణిని! నేను వితంతువును కాను. దుఃఖమును నేను ఎన్నటికిని ఎరుగకుందును' అని ఆమె తనకు తాను చెప్పుకొనుచుండునుగదా!

8. కనుకనే వ్యాధి, దుఃఖము, కరువు అను ఆమె రోగములన్నియు ఒక్క దినముననే ఆమెను పీడించును. ఆమె అగ్నిచే దగ్ధమగును. ఏలయన, ఆమెకు తీర్పుతీర్చు ప్రభువు, దేవుడు, మహాబలవంతుడు”.

9. ఆ నగరము దగ్ధమై పొగ వెలువడుట చూచి ఆమెతో వ్యభిచరించి భోగములనుభవించిన భూపాలురు విలపించి ప్రలాపింతురు.

10. ఆమె పడు కష్టములకు భయపడి దూరమునుండియే, “ఎంత దారుణము! ఎంత భయంకరము! ఓ బబులోనియా మహానగరమా! ఎంత దృఢమైనదానవు! కాని ఒక్క గంటలో నీవు తీర్పు తీర్చబడితివిగదా!” అని పలు కుదురు.

11. భువియందలి వర్తకులు ఆమె కొరకై ఆక్రందింతురు, దుఃఖింతురు. ఏలయన, తమ వస్తువులను ఇక ఎవరును కొనరుగదా!

12. వారి బంగారము, వెండి, రత్నములు, ముత్యములను, చిత్ర విచిత్ర వర్ణములుగల పట్టుబట్టలను, చీనాంబరములను, జరీ వస్త్రములను, దంతపు వస్తువులను, అమూల్యములగు కొయ్య వస్తువులను, కంచు, ఇనుము, పాల రాతితో చేసిన వస్తువులను,

13. దాల్చిన చెక్క సువాసన ద్రవ్యములు, ధూపము, గుగ్గిలము, గంధరసము, సాంబ్రాణి, మద్యము, నూనె, పిండి, గోధుమలు, పశువులు, గొఱ్ఱెలు, గుఱ్ఱములు, బండ్లు, బానిసలను, మనుజుల ప్రాణములను ఇకమీదట ఎవరును కొనరు.

14. నీవు కావలెనని కోరుకొనుచుండెడి వస్తువులన్నియు అదృశ్యములైనవి. నీ ధనవైభవములు గతించినవి. అవి ఎన్నటికిని మరల నీకు లభింపవు!” అని వర్తకులు ఆమెతో పలుకుదురు.

15. ఆ నగరమున వర్తకము చేసి ధనికులైన వ్యాపారులు, ఆమె పడు బాధకు భయపడి దూరముగ ఉందురు. వారు ఏడ్చుచు దుఃఖించుచు,

16. “ఎంత దారుణము! ఆ మహానగరమునకు ఎట్టి భయానకస్థితి! ఆమె నారవస్త్రములను, చీనాంబరములను, జరీ వస్త్రములను ధరించెడిదిగదా! సువర్ణా భరణములతోను, అమూల్యములగు రత్నముల తోను, ముత్యములతోను, తనను అలంకరించు కొనెడిదిగదా!

17. ఈ భాగ్యమంతయు ఒక్క గడియలోనే నశించెనే!” అని వారు పలుకుదురు. నాయకులును, నావికులును, ప్రయాణికులును, సముద్ర జీవనము గడుపువారును, అందరును, దూరముగ నిలిచి ఉండిరి.

18. దగ్ధమైన ఆ నగరమునుండి వెలువడు పొగను చూచి ఆక్రందించుచు “ఈ మహానగరమునకు సాటియైనది మరియొకటి కలదా!” అని పలికిరి.

19. తమ తలలపై దుమ్ము పోసికొనుచు, ఏడ్చుచు, శోకించుచు, “అయ్యో ఎంత దారుణము! ఆ నగరమునకు ఎంత భయానక స్థితి! నౌకలుగల వారందరు ఆ నగర సంపద చేతనే ధనికులైరి! కాని ఒక్క గడియలో ఆమె సమస్తమును కోల్పోయెను గదా! అని విలపించిరి.

20. ఓ దివ్యలోకమా! ఆమె నాశనమునకు ఆనందింపుము. పునీతులారా! అపోస్తలులారా! ప్రవక్తలారా! మీరును ఆనందింపుడు, ఆమె మీకు ఒనర్చిన దానికి ప్రతిక్రియగా దేవుడు ఆమెను తీర్పునకు గురిచేసెను” అని కేకలు పెట్టిరి. .

21. అంత ఒక బలిష్ఠుడగు దేవదూత గొప్ప తిరుగటి రాతివంటి రాతిని ఎత్తి సముద్రము లోనికి విసరివేయుచు, “మహానగరమగు బబులోనియా ఇదే విధముగా తీవ్రముగ విసరికొట్టబడి మరల కనబడకుండ పోవును.

22. వాయిద్యకారులయొక్కయు, గాయకులయొక్కయు, వేణువును బాకాను ఊదు వారల ధ్వనులు నీనుండి ఇక ఎన్నడును వినరావు! ఏ వృత్తికి చెందిన పనివాడును నీయందిక ఎన్నిటికి కానరాడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడును నీనుండి వినబోము!

23. దీపకాంతి ఇక నీయందు ఎన్నడును చూడబోము! వధూవరుల కంఠ ధ్వనులు ఇక ఏనాడును నీ నుండి వినబడబోవు! నీ వర్తకులు ప్రపంచమునకెల్ల శక్తిమంతులు. కాని నీ మాయాజాలముతో ప్రపంచ ప్రజలనే నీవు మోసగించితివి!” అని పలుకును.

24. ప్రవక్తలయొక్కయు, పునీతులయొక్కయు, భువియందు చంపబడిన అందరియొక్కయు రక్తము ఆ నగరమున ప్రవహించెను. 

 1. అనంతరము, దివియందు ఒక గొప్ప ప్రజాసమూహపు కలకల ధ్వనివంటిది ఏదో నాకు వినబడెను. “అల్లెలూయా! రక్షణ, మహిమ, శక్తి మన దేవునకే చెల్లును!

2. ఆయన తీర్పులు న్యాయాన్వితములు, సత్యోపేతములు. ఏలయన, తన జారత్వముతో భువిని కలుషిత మొనర్చుచున్న ఆ మహా వేశ్యను ఆయన శిక్షించెను గదా! ఆమె చిందించిన తన సేవకుల రక్తమునకు దేవుడు ఆమెను దండించెను” అని వారు పలుకుచుండిరి.

3. మరలవారు ఇట్లు బిగ్గరగా పలికిరి: “అల్లెలూయా! ఆ మహానగరము నుండి సర్వదా పొగ వెలువడుచునే ఉండునుగాక!”

4. అప్పుడు ఇరువది నలుగురు పెద్దలును, నాలుగు జీవులును సింహాసనాసీనుడగు దేవుని ముందు సాగిల పడి ఆయనను ఆరాధించి “ఆమెన్! అల్లెలూయా!” అని పలికిరి.

5. అంతట సింహాసనమునుండి ఒక స్వరము ఇట్లు వినబడెను: “మన దేవుని స్తుతింపుడు! ఆయన సేవకులును, ఆయనయందు భయభక్తులుగల పిన్నలును, పెద్దలును, అందరును స్తుతింపుడు!"

6. అంతట ఒక గొప్ప జనసమూహముయొక్క ధ్వని వంటిదియు, భయంకర జలపాత గర్జనను పోలినదియు, గొప్ప ఉరుమువలె ఉన్న ఒక స్వరమును నేను వింటిని. “అల్లెలూయా! మన దేవుడు, ప్రభువు మహాశక్తిమంతుడు పరిపాలించును.

7. మనము ఆనందింతము, సంతోషింతము, ఆయన ఘనతను స్తుతింతము!  గొఱ్ఱెపిల్ల వివాహ మహోత్సవము ఆసన్నమయినది, వధువు సిద్ధమైనది.

8. ఆమె స్వచ్చమును, ప్రకాశవంతమును అయిన అమూల్య నారవస్త్రములు ధరింప అనుమతింపబడినది. పరిశుద్దుల సత్కారములే ఆ అమూల్యవస్త్రములు” అని ఆ స్వరము పలికెను.

9. అప్పుడు ఆ దేవదూత, “గొఱ్ఱెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడినవారు ధన్యులు అని వ్రాయుము” అని నాతో చెప్పెను. “ఇవి దేవుని సత్య మగు పలుకులు"  అనియు ఆ దేవదూత నాతో వచించెను.

10. అంతట నేను అతని పాదములపై పడి ఆరాధింపబోగా అతడు, “నీవు అట్లోనర్పరాదు! నీకును, యేసు సాక్ష్యము కలిగిన నీ సోదరులకును నేను తోటి సేవకుడను మాత్రమే. దేవుని ఆరాధింపుము. ఏలయన, యేసు సాక్ష్యమే ప్రవచన ఆత్మ” అని పలికెను.

11. అంతట దివి తెరువబడి అట ఒక తెల్ల గుఱ్ఱము నాకు కాననయ్యెను. ఆ అశ్వికుడు విశ్వాస పాత్రుడు, సత్యవంతుడు అని పిలువబడును. ఆయన న్యాయముగా విచారించి యుద్ధములందు పోరాడును.

12. ఆయన కన్నులు అగ్నిజ్వాలవలె ఉండెను. ఆయన తన శిరస్సున పెక్కు కిరీటములు ధరించి ఉండెను. ఆయన ఒక నామమును ధరించి ఉండెను. కాని అది ఏమియో ఆయన తప్ప అన్యులెరుగరు.

13. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉండెను. “దేవుని వాక్కు” అను నామమున ఆయన పిలువ బడును.

14. దేవ సైన్యములు ఆయనను అనుసరించుచుండెను. వారు పరిశుద్ధ ధవళవస్త్రములను ధరించి ధవళాశ్వములపై పయనించు చుండిరి.

15. ఒక వాడియైన కత్తి ఆయన నోటినుండి వెలువడెను. దానితో ఆయన సమస్త జాతులను జయించును. ఆయన ఇనుపదండముతో వారిపై అధికారము నెరపును. సర్వశక్తిమంతుడగు దేవుని ప్రచండ ఆగ్రహమను మద్యపు తొట్టిని తొక్కును.

16. “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు” అను పేరు ఆయన దుస్తులపైనను, ఆయన తొడ పైనను వ్రాయబడి ఉండెను.

17. అప్పుడు సూర్యగోళముపై నిలిచియున్న ఒక దేవదూతను కనుగొంటిని. గాలిలో ఎగురుచున్న పక్షిజాలముతో అతడు బిగ్గరగా “రండు! దేవుని మహా విందుకు సమావేశమగుడు!

18. రాజులయొక్కయు, బలిష్టులయొక్కయు, నాయకులయొక్కయు, అశ్వికుల యొక్కయు, బానిసలు, స్వతంత్రులు, పిన్నలు, పెద్దల సమస్త జనుల మాంసమును ఆరగింపరండు!” అని పలికెను.

19. అంతట ఆ అశ్వికునితోను, ఆయన సైన్యముతోను పోరాడుటకై ఆ మృగమును, భూపాలురును, వారి సైన్యములును సమాయత్తమగుట నేను గమనించితిని.

20. ఆ మృగమును, దాని సమక్షమున మాయలు ప్రదర్శించిన ఆ అసత్య ప్రవక్తయు బంధింపబడిరి (అతడు ఆ మృగనామమును ధరించిన వ్యక్తులను, ఆ మృగవిగ్రహమును పూజించిన వ్యక్తులను, ఆ మాయల చేతనేగదా మోసగించినది!). అప్పుడు ఆ మృగమును, ఆ అసత్య ప్రవక్తయును సజీవులుగనే సలసలకాగు గంధకముతో కూడుకొని ఉన్న అగ్ని గుండములోనికి త్రోయబడిరి.

21. మిగిలిన వారు అశ్వికుని నోటినుండి వెలువడిన ఖడ్గముచే వధింపబడిరి, పక్షులన్నియు వాని మాంసమును కడుపార ఆరగించినవి. 

 1. అంతట దివినుండి అవతరించుచున్న ఒక దేవదూతను నేను కనుగొంటిని. అతని చేతిలో అగాధపు తాళపు చెవియు, ఒక బరువైన గొలుసును ఉండెను.

2. సైతాను అనబడు ఆ ప్రాచీన సర్పమును, ఆ భయంకర సర్పమును అతడు పట్టుకొని ఒక వేయి సంవత్సరములపాటు బంధించెను.

3. ఆ దేవదూత, ఆ సైతానును అగాధములోనికి త్రోసి, ఒక వెయ్యి సంవత్సరముల పాటు మానవజాతిని ఆ సైతాను మోసగింపకుండ, ఆ అగాధమునకు తాళము పెట్టి ముద్రవేసెను. తదుపరి కొద్ది కాలము పాటు వానిని తిరిగి విడువవలసి ఉన్నది.

4. పిమ్మట సింహాసనములను, సింహాసనాసీనులగు వ్యక్తులను, అచట నేను చూచితిని. తీర్పు తీర్చు అధికారము వారికి ఇయ్యబడెను. యేసుకు, దేవుని వాక్కుకు సాక్షులుగా శిరచ్ఛేదనము గావింపబడిన వ్యక్తుల ఆత్మలనుకూడ నేను అట చూచితిని. ఆ మృగమునుగాని, దాని విగ్రహమునుగాని వారు పూజింపలేదు. ఆ మృగ చిహ్నమునుకూడ వారు తమ నుదురులపైన గాని, చేతులపై గాని వేయించుకొన లేదు. వారు సజీవులై వచ్చి క్రీస్తుతో పాటు ఒక వేయి సంవత్సరములు పాలించిరి.

5. (మిగిలిన మృతులు వేయి సంవత్సరములు పూర్తియగు వరకును సజీవులు కాలేరు. ఇదియే మృతుల ప్రథమ పునరుత్థానము)

6. ఈ ప్రథమ పునరుత్థానమున పాలుగల వారందరును ధన్యులు, పవిత్రులు. రెండవ మరణమునకు వారిపై ప్రభావము ఉండదు. వారు దేవునకును, క్రీస్తునకును యాజకులగుదురు. వారు ఆయనతో కూడి ఒకవేయి సంవత్సరములు పాలింతురు.

7. వేయి సంవత్సరముల తరువాత చెరసాల నుండి సైతాను విడుదల చేయబడును.

8. అంతట గోగు, మాగోగు అనెడు ప్రపంచ నలుమూలల వ్యాప్తమైన సమస్త జాతులను మోసగించుటకు అతడు బయల్వెడలును. సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె ఉండిన వారినందరిని కూడగట్టుకొని సైతాను యుద్ధమునకు సిద్ధమగును.

9.వారు ప్రపంచ మందంతట వ్యాప్తినొంది, పరిశుద్ధుల శిబిరమును, ఆయన ప్రేమకు పాత్రమైన నగరమును చుట్టు ముట్టిరి. కాని దివినుండి అగ్ని దిగివచ్చి వారిని ధ్వంసమొనర్చెను.

10. అంతట ఆ మృగమును, అసత్య ప్రవక్తయును ఏ గంధకపు అగ్ని గుండములో నెట్ట బడిరో, మోసగాడగు ఆ సైతాను దాని లోనికే త్రోయ బడెను. వారు అహోరాత్రులు కలకాలము పీడింప బడుదురు.

11. అప్పుడు ఒక గొప్ప తెల్లని సింహాసనమును, దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని. దివియు, భువియు ఆయన సమక్షము నుండి పారిపోయినవి. వాటికి స్థానము లేకుండెను.

12. పిన్నలును, పెద్దలును అగు మృతులందరు తారతమ్యము లేకుండ ఆయన సింహాసనము ఎదుట నిలిచి యుండుట అప్పుడు నేను గమనించితిని. గ్రంథములు విప్పబడెను. అంత సజీవుల గ్రంథమను మరియొక గ్రంథము తెరువబడెను. గ్రంథములలో వ్రాయబడి నట్టుగ వారివారి పనులనుబట్టి మృతులకు తీర్పు తీర్చ బడును.

13. అంత సముద్రము తనలోనున్న మృతులను వదలివేసెను. మృత్యువును, మృత్యులోకమును కూడ తమయందున్న మృతులను విడుదల చేసెను. అందరకు వారివారి పనులను బట్టియే తీర్పు చెప్పబడెను.

14. అంతట మృత్యువును, మృత్యులోకమును, అగ్నిగుండము లోనికి నెట్టబడెను. (ఈ అగ్ని గుండమే ద్వితీయ మృత్యువు)

15. జీవగ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరు అగ్ని గుండమున త్రాయ బడిరి! 

 1. అంతట నేను ఒక క్రొత్త దివిని, క్రొత్త భువిని చూచితిని. మొదటి దివియు, భువియు అదృశ్య మయ్యెను. సముద్రము కూడ అదృశ్యమయ్యెను.

2. అనంతరము దివియందలి దేవునినుండి దిగివచ్చు చున్న పవిత్ర నగరమగు నూతన యెరూష లేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము ఒనర్చుకొని సిద్ధపడిన వధువువలె ఉండెను.

3. సింహాసనమునుండి ఒక గంభీరధ్వని వెలువడుట నేను వింటిని. “ఇక దేవుడు మానవులతోనే నివసించును! ఇక ఆయన వారితోనే నివసించును! వారే ఆయన ప్రజలు.స్వయముగ దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును.

4. వారి నేత్రముల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక, మృత్యువుగాని, దుఃఖముగాని, ఏడుపుగాని, బాధ గాని, ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి” అని ఆ గంభీర స్వరము పలికెను.

5. అంతట సింహాసనాసీనుడు, “ఇప్పుడు అన్నిటిని క్రొత్తగా సృష్టించెదను!" అని పలికెను. “ఇది నిజము. విశ్వసనీయము. కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము!” అని ఆయన నాతో చెప్పెను.

6. ఇంకను ఆయన, “సమాప్తమైనది! ఆల్పా, ఓమేగ నేనే. ఆదియును, అంత్యమును నేనే! దాహముగొన్న వ్యక్తిని జీవజలపు ఊటనుండి ఉచితముగా త్రాగనిత్తును.

7. జయమును పొందు వ్యక్తికి నేనే దేవుడను. అతడు నా పుత్రుడు. ఈ వరమును అతడు నానుండి పొందును.

8. కాని పిరికివారికిని, వక్రబుద్ధులకును, విశ్వాస రహితులకును, హంతలకును, వ్యభిచారులకును, మాంత్రికులకును, విగ్రహారాధకులకును, అసత్య వాదులకును గంధకయుక్తమైన అగ్నిగుండమే తగిన స్థలము. అదియే రెండవ మరణము” అని పలికెను.

9. అంతిమ సప్తజాడ్యములుగల సప్త పాత్రలను ధరించిన ఏడుగురు దేవదూతలలో ఒకడు నన్ను సమీపించి “గొఱ్ఱెపిల్లకు భార్యయగు వధువును చూపెదను రమ్ము!” అని పిలిచెను.

10. అంతట ఆత్మయందు ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దివియందుండి, దేవునినుండి, దివ్య వైభవముతో వెలుగొందుచు, దిగివచ్చుచున్న పవిత్రనగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను.

11. ఒక అమూల్య రత్నమువలెను, సూర్య కాంతమణివలెను, స్ఫటికమువలెను, స్వచ్చముగను ఆ నగరము ప్రకాశించెను.

12. ఆ నగరము చుట్టు ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు పండ్రెండు ద్వారములు ఉండెను. ఆ పండ్రెండు ద్వారములును పండ్రెండు మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ పండ్రెండు ద్వారములపై యిస్రాయేలు ప్రజల పండ్రెండు గోత్రములపేర్లును వ్రాయబడి ఉండెను.

13. తూర్పున మూడు, దక్షిణమున మూడు, ఉత్తరమున మూడు, పశ్చిమమున మూడు ద్వారములుండెను.

14. ఆ నగరపు గోడ పండ్రెండు పునాదులపై నిర్మింపబడెను. వాటిపై గొఱ్ఱెపిల్లయొక్క పండ్రెండు అపోస్తలుల నామములు లిఖింపబడి ఉండెను.

15. నాతో మాట్లాడిన దేవదూత వద్ద, నగరమును, నగరద్వారములను, దాని గోడలను, కొలుచుటకు ఒక బంగారపు కొలబద్ద ఉండెను.

16. ఆ నగరము పొడవు, వెడల్పులు సమానముగా ఉండి సమచతురస్రమై ఉండెను. ఆ దేవదూత నగరమును తన కొలబద్దతో కొలిచెను. అది పదిహేను వందల మైళ్ల పొడవును, అంతే వెడల్పు, అంతే ఎత్తు గలదై ఉండెను.

17. ఆ దేవదూత నగరపు గోడను గూడ కొలిచెను. అది మనుష్యుని కొలత చొప్పున నూట నలువది నాలుగు మూరలైనది, ఆ కొలత దూతకొలతయే,

18. గోడ సూర్యకాంతమణులతో పొదగబడినది. నగరము స్వచ్చమగు బంగారముతో కట్టబడెను. గాజువలె నిర్మలమైయుండెను.

19. ఆ నగర ప్రాకారపు గోడ పునాది రాళ్ళు అమూల్యములగు రత్నాదులచే అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది రాయి సూర్యకాంతమణి. రెండవది నీలమణి. మూడవది రత్నము. నాలుగవది మరకతము.

20. ఐదవది గోమేధికము. ఆరవది. కెంపు. ఏడవది చంద్రకాంతమణి, ఎనిమిదవది గరుడపచ్చ, తొమ్మిదవది పుష్య రాగము. పదియవది వైడూర్యము, పదునొకండవది పద్మరాగము. పండ్రెండవది ఊదామణి.

21.పండ్రెండు ద్వారములును పండ్రెండుముత్యములు. ఒక్కొక్క ద్వారమును ఒక్కొక్క ముత్యముచే చేయబడి యుండెను. ఆ నగర వీధులు సువర్ణమయమై గాజువలె పారదర్శకముగ ఉండెను.

22. ఆ నగరమున ఎచటనను నాకు దేవాలయము గోచరింపలేదు. ఆ నగరమునకు సర్వశక్తి మంతుడైన దేవుడగు ప్రభువును, గొఱ్ఱెపిల్లయును దేవాలయము గదా!

23. ఆ నగరమునకు సూర్య చంద్రుల వెలుగే అవసరము లేకుండెను. దేవుని తేజస్సు ఆ నగరమును దేదీప్యమానముగ చేయును. గొఱ్ఱెపిల్లయే ఆ నగరమునకు దీపము.

24. ప్రపంచ ప్రజలు దాని వెలుగుచే నడువగలుగుదురు. భూపాలురు తమ వైభవమును దానిలోనికి తీసుకొని వత్తురు.

25. ఆ నగర ద్వారములు దినమంతయు తెరువబడియే ఉండును. అటరాత్రి అనునది ఉండదు. కనుక ఆ ద్వారములు ఎన్నడును మూయబడవు.

26. పెక్కు జాతుల ఘనతయు, భాగ్యమును ఆ నగరమునకు కొనిరాబడును.

27. కాని కలుషితమైనది ఏదియు ఆ నగరమున ప్రవేశింపదు. అట్లే దుష్కార్యము లొనర్చి నవారు, అసత్యవాదులు అట ప్రవేశింపరు. ఆ గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నవో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశింతురు. 

 1. జీవజల నదీప్రవాహమును కూడ నాకు ఆ దేవదూత చూపెను. అది దేవుని సింహాసనము నుండియు, గొఱ్ఱెపిల్లనుండియు ఉద్భవించెను. అది స్పటికమువలె మెరయుచు

2. ఆ నగర రాజమార్గ మధ్యముగుండ ప్రవహించును. ఆ నదికి రెండు ప్రక్కల జీవవృక్షములు ఉండెను. నెలకు ఒక మారు చొప్పున, అవి సంవత్సరమునకు పండ్రెండుమార్లు కాపునకు వచ్చును. వాని ఆకులు ప్రజల గాయములు మాన్పును.

3. ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు అక్కడ కనిపించదు. దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవింతురు.

4. వారు ఆయన ముఖమును దర్శించేదరు. ఆయన నామము వారి నొసళ్లపై వ్రాయబడి ఉండును.

5. ఇక రాత్రి ఎన్నటికిని ఉండబోదు. ప్రభువగు దేవుడే వారికి వెలుగు. కనుక వారికి దీపపు వెలుతురుగాని, సూర్యకాంతిగాని అవసరము లేదు. వారు సదా రాజ్యపాలనము చేయుదురు.

6. అంత, ఆ దేవదూత నాతో “ఈ పలుకులు యథార్థములు, విశ్వసింపతగినవి. ప్రవక్తలకు తన ఆత్మ నిచ్చు ప్రభువగు దేవుడు, తన సేవకులకు త్వరలో ఏమి జరుగనున్నదో చూపుటకు తన దేవదూతను పంపెను” అని చెప్పెను.

7.“ఇదిగో నేను త్వరలో రానున్నాను! ఈ గ్రంథమునందలి ప్రవచన వాక్కులను పాటించువారు ధన్యులు!” అని క్రీస్తు వచించెను.

8. యోహాను అనబడు నేను ఈ సర్వ విషయములను వింటిని, చూచితిని. వానిని వినిచూచిన తరువాత, ఆయనను ఆరాధించుటకై నాకు వీనినన్నిటిని ప్రదర్శించిన దేవదూత పాదములయొద్ద సాగిలపడితిని.

9. కాని ఆ దేవదూత “అటుల చేయకుము! నీకును, ప్రవక్తలైన నీ సోదరులకును, ఈ గ్రంథము నందలి విషయములను పాటించు వారికిని, అందరకును నేను సహ సేవకుడను మాత్రమే. దేవుని ఆరాధింపుము” అని పలికెను.

10. అతడు ఇంకను, “ఈ గ్రంథము నందలి ప్రవచనములను రహస్యముగ ఉంచకుము. ఏలయన, ఇవి సంభవించు కాలము ఆసన్నమైనది.

11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము. అపవిత్రుని అపవిత్రునిగనే ఉండనిమ్ము. నీతిమంతులను నీతిమంతులుగనే ఉండ నిమ్ము. పవిత్రుని ఇంకను పవిత్రునిగనే ఉండనిమ్ము” అని పలికెను.

12. "ఇదిగో! నేను త్వరలో రానున్నాను. వారివారి క్రియలను బట్టి వారికి ఒసగదగిన బహుమానములను నావెంటతెత్తును.

13. నేనే ఆల్ఫా, ఓమేగ; నేనే మొదటి వాడను, కడపటివాడను; నేనే ఆదియును అంతమునై ఉన్నాను” అని యేసు పలికెను.

14. తమ వస్త్రములను శుభ్రముగ క్షాళనము ఒనరించుకొను వారు ధన్యులు. వారే జీవవృక్షమునకు అర్హత గలవారు. ద్వారముల గుండా నగరమున ప్రవేశింప వారే అర్హులు.

15. వక్రబుద్దులు, మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహారాధకులు, అబద్దమును ప్రేమించి పాటించు ప్రతివాడు నగరమునకు వెలుపలనే ఉండును.

16. "యేసును అయిన నేను, దైవసంఘములలో మీకు ఈ విషయములు ప్రకటించు నిమిత్తము నాదూతను పంపియున్నాను. నేను దావీదు వేరుచి గురును, సంతానమును, ప్రకాశవంతమైన వేగు చుక్కను.”

17. ఆత్మయు, వధువును, “రమ్ము!” అని పలుకుచున్నారు. దీనిని వినిన ప్రతివ్యక్తియు “రమ్ము!” అని పలుకవలెను. దప్పిక గొనినవారు అందరును రండు! ఇష్టపడువారు అందరును జీవజలములను ఉచితముగ పుచ్చుకొనవచ్చును.

18. యోహానునగు నేను, ఈ గ్రంథపు ప్రవచనములను వినిన ప్రతివ్యక్తిని ఇట్లు తీవ్రముగా హెచ్చరించుచున్నాను. దీనియందలి విషయములకు ఎవరైన ఏమైన చేర్చినచో, ఈ గ్రంథమున వివరింపబడిన అరిష్టములతో దేవుడు వానిని శిక్షించును.

19. ఎవరైనను ఏమైనను ఈ గ్రంథపు ప్రవచన వాక్కులనుండి తొలగించినచో, ఈ గ్రంథమున వివరింపబడినట్లు వాని భాగమగు జీవ వృక్షఫలములను, వాని పవిత్ర నగర భాగస్వామ్యమును దేవుడు తొలగించును.

20. ఈ విషయములను గూర్చి సాక్ష్యము ఇచ్చు వ్యక్తి “అది నిజము! నేను త్వరలో వచ్చుచున్నాను.” అని పలుకుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసూ, రమ్ము.

21. యేసు ప్రభుని అనుగ్రహము పవిత్రులందరితోను ఉండునుగాక! ఆమెన్.