ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యాకోబు వ్రాసిన లేఖ

 1. దేవునియొక్కయు, యేసుక్రీస్తు ప్రభువుయొక్కయు, సేవకుడగు యాకోబు నుండి: ప్రపంచమునందంతటను చెదరియున్న పండ్రెండు గోత్రముల వారికి శుభాకాంక్షలు.

2. నా సోదరులారా! మీరు పలువిధములైన పరీక్షలను ఎదుర్కొనునప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగ ఎంచుకొనుడు.

3. ఎట్లన, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుటవలన, మీకు సహనము చేకూరును.

4. కాని మీ సహనము విఫలముకాక, తుదివరకు మిమ్ము తీసుకొనిపోవునట్లు చూచు కొనుడు. అపుడు మీరు ఏ కొరతయులేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు.

5. కాని మీలో ఎవరికైనను వివేకము కొరతగా ఉన్నయెడల, అతడు దేవుని అడుగవలెను. ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవ్వరిని గద్దింపక అందరకు ఉదారముగ అనుగ్రహించును గదా!

6. కాని అతడు విశ్వాసముతో అడుగవలెను. ఏ మాత్ర మును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొను సముద్రతరంగము వంటివాడు.

7. అట్టి వాడు ప్రభువు నుండి ఏమైన పొందగలనని తలంపరాదు.

8. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వానికి ఏ పని యందును స్థిరత్వము ఉండదు.

9. దీనస్థితిలో నున్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలెను.

10. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్వింపవలెను. ఏలయన గడ్డిపూవువలె ధనికుడు గతించి పోవును.

11. ప్రచండమగు ఉష్ణముతో సూర్యుడు ఉదయించి మొక్కలను మాడ్చివేయును; వాని పూవు నశించును, దాని సౌందర్యము అంతమొందును. అట్లే తన సొంత వ్యవహారములయందు మునిగియుండు ధనికుడును నశించును.

12. శోధనకు గురియైనను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలయన, పరీక్షయందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవకిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించువారికి దేవుడు వాగ్దాన మొనర్చిన బహుమానము.

13. ఏ వ్యక్తియైనను అట్టి పరీక్షచే శోధింపబడినచో, “నేను దేవునిచే శోధింపబడుచున్నాను” అని అతడు పలుకరాదు. ఏలయన, ఏ దుష్ట శక్తిచేతను దేవుడు శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు.

14. తన దుష్టవాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినపుడు మానవుడు శోధింపబడును.

15. అప్పుడు ఆ దుష్టవాంఛనుండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకమగును.

16. నా ప్రియ సోదరులారా! మోసపోకుడు.

17. అన్ని మంచి వరములును అన్ని సమగ్ర బహుమానములును పరలోకమునుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవునినుండియే అవి పుట్టును. ఆయన మార్పునొందడు. తిరోగమనుడై చీకటిని కలిగింపడు.

18. సమస్త సృష్టియందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తనసంకల్పము చేతనే, సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను.

19. నా ప్రియ సోదరులారా! దీనిని జ్ఞాపకము ఉంచుకొనుడు. ప్రతివ్యక్తియు ఆలకించుటయందు చురుకుదనమును, మాట్లాడుటయందు నిదానమును ప్రదర్శింపవలెను. త్వరపడి కోపింపరాదు.

20. ఏలయన, దేవుని నీతినెరవేరుటకు మానవుని కోపము తోడ్పడదు.

21. కనుక సమస్త దుష్టప్రవర్తనలను, సర్వదురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగ ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తిగలది.

22. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసికొనకుడు. దానిని ఆచరింపుడు.

23. ఏలయన, ఆ వాక్కును కేవలము విని, ఆచరింపని వాడు అద్దమున తన ప్రతిబింబమును చూచుకొనునట్టి వ్యక్తి వంటివాడు.

24. తన రూపమును ఒక్కమారు చూచుకొని, అతడు మరలిపోవును. ఆ క్షణముననే తన రూపమును మరచిపోవును.

25. కాని స్వాతంత్య్రము నొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగ పరిశీలించి కేవలము విని మరచుటకాక దానిని ఆచరించువాడు దేవుని దీవెనలను పొందును.

26. మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని అనుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వాని దైవభక్తి వ్యర్థము. అట్టి వాడు ఆత్మవంచన చేసికొనినట్లే.

27. తండ్రియైన దేవుని దృష్టిలో పవిత్రమును, నిష్కళంకమునైన దైవభక్తి ఏదనగా  అనాథలను, విధవరాండ్రను, వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండ, తనను తాను కాపాడుకొనుట అనునవియే. 

 1. నా సోదరులారా! మీరు ప్రజలపట్ల పక్షపాతము లేకుండ ఉండవలెను. మీరు మహిమోపేతుడగు యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసము గలవారు గదా!

2. వ్రేలికి బంగారు ఉంగరము, మంచిదుస్తులు ధరించిన ధనికుడు ఒకడు మీ సమావేశమున ప్రవేశించెనను కొనుడు. చింపిరిగుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించెననుకొనుడు.

3. “ఈ ఉన్నతాసనమును అలంకరింపుడు” అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగను, “నీవు అక్కడ నిలువుము లేదా ఇక్కడ నా పాదపీఠమునకు సమీపముగ నేలపై కూర్చుండుము” అని పేదవానితోను, పలుకరాదు.

4. అట్లోనర్చినచో మీలో మీరు వర్గములు సృష్టించిన వారును, దుర్బుద్ధితో న్యాయనిర్ణయములు చేయు వారును అగుదురు.

5. నా ప్రియ సోదరులారా! ఆలకింపుడు. ఈ లోక విషయములలో పేదలగు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగ ఉండుటకును, తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎన్నుకొనును. తనను ప్రేమించువారికి ఆ రాజ్యమును వాగ్దానమొనర్చెను.

6. కాని, పేదలను మీరు అవమానించితిరి. మిమ్ము పీడించి న్యాయాధిపతుల ఎదుటకు ఈడ్చునది ధనవంతులే గదా!

7. దేవుడు మీకు ప్రసాదించిన శుభనామమును గూర్చి దుర్భాషలాడునదియు వారే కదా!

8. “నిన్ను నీవు ప్రేమించుకొనునటులే నీ పొరుగు వానిని ప్రేమింపుము” అను లేఖనమునందలి ప్రము ఖమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చుట సముచితము.

9. కాని మీరు పక్షపాతబుద్దితో ప్రజలపట్ల వ్యవహరించినచో మీరు పాపము కట్టుకొందురు. ఆజ్ఞలను అతిక్రమించిన వారినిగ ధర్మశాస్త్రము మిమ్ము అందులకు శిక్షించును.

10. ఏలయన, ధర్మశాస్త్రమునంత యును పాటించుచు, దానిలో ఏ ఒక్క ఆజ్ఞను అతిక్రమించినను, వాడు ధర్మశాస్త్రమునంతయును ఉల్లంఘించిన దోషమునకు గురియగును.

11. ఎట్లన, “వ్యభిచరింపకుము” అని చెప్పిన వ్యక్తియే “హత్యచేయరాదు” అనియు పలికెను. కనుక మీరు వ్యభిచరింపకున్నను, హత్య యొనర్చినచో ధర్మశాస్త్ర మును ఉల్లంఘించిన వారగుదురు.

12. మానవులకు స్వాతంత్య్రమును ప్రసాదించు ధర్మశాస్త్రముచే న్యాయ నిర్ణయమొనర్పబడు వ్యక్తులుగ మీరు మాట్లాడుడు. అట్లే ప్రవర్తింపుడు.

13. కనికరము లేనివానికి కనికర ములేని తీర్పే దేవునినుండి లభించును. కనికరము తీర్పుకంటె గొప్పది.

14. నా సోదరులారా! ఏ వ్యక్తియైనను, “నాకు విశ్వాసము ఉన్నది” అని చెప్పుకొనినచో, తన చేతలు దానిని నిరూపింపకున్నయెడల దానివలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా?

15. కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైన, లేక సోదరియైన అలమటించుచున్నచో,

16. వారి జీవితావసరములను తీర్పక, 'సమాధానముగా వెళ్ళుడు, చలికాచుకొనుడు, తృప్తి పొందుడు' అని మీలో ఎవడైన పలికినయెడల ప్రయోజనమేమి?

17. కనుక దానిని అనుసరించి పనులొనర్పబడనిచో, క్రియలులేని విశ్వాసము నిర్జీవమే.

18. కాని, “నీకు విశ్వాసమున్నది, నాకు క్రియ లున్నవి” అని ఎవరైన పలికినచో దానికి సమాధానము ఇది: “క్రియలు లేకుండ నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును”.

19. దేవుడు ఒక్కడేయని నీవు విశ్వసింతువు గదా? మంచిదే! పిశాచములునూ విశ్వసించును. భయముతో గజగజలాడును.

20. మూర్ఖ మానవుడా! చేతలులేని విశ్వాసము నిష్పలమైనదని నీకు నిరూపింపబడవలెనా?

21. మన పితరుడగు అబ్రహాము తన కుమారుడగు ఈసాకును బలి పీఠముపై అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొందలేదా!

22. ఇంకను గ్రహింపలేవా! అతని విశ్వాసమును, అతని చేతలును కలిసియే కృషిసలిపినవి. అతని విశ్వాసము అతని చేతల ద్వారా పరిపూర్ణత పొందినది.

23. “అబ్రహాము దేవుని విశ్వసించెను. అతని విశ్వాసము వలననే దేవుడు అతనిని నీతిమంతునిగ ఎంచెను” అను లేఖనము నెరవేరెను. అతడు దేవుని మిత్రుడుగ. పిలువబడెను.

24. కనుక, కేవలము వాని విశ్వాసమువలన మాత్రమే కాక, వాని చేతల వలన మానవుడు నీతిమంతుడుగా ఎంచబడును.

25. వేశ్యయగు రాహాబు విషయమునను అట్లే. తన చేతల వలననే ఆమె నీతిమంతురాలుగ ఎంచబడెను. ఆమె యూదుల దూతలను ఆహ్వానించి వేరొక మార్గము ద్వారా వారు వెడలుటకు తోడ్పడినది గదా!

26. ఆత్మలేని శరీరము నిర్జీవమైనట్లే, చేతలులేని విశ్వాసమును నిర్జీవమే. 

 1. సహోదరులారా! బోధకులమగు మనము ఇతరులకంటె తీవ్రముగ న్యాయవిచారణకు గురి అగుదుమని మీకు తెలియును గదా! కనుక మీలో ఎక్కువ మంది బోధకులు కారాదు.

2. మనము అందరమును పెక్కు తప్పులు చేయుచునే ఉందుము. ఎన్న డును తన మాటలయందు తప్పు చేయనివాడు పరిపూర్ణుడే. అట్టివాడు తన శరీరమును అదుపులో ఉంచుకొనగల వ్యక్తి.

3. గుఱ్ఱములు మనకు లొంగి ఉండుటకు వాని నోటికి కళ్ళెములు తగిలింతుము. అప్పుడే ఆ గుఱ్ఱములను మనము అదుపులో ఉంచగలము.

4. అట్లే ఒక ఓడ ఉన్నదనుకొనుడు. అది పెద్దదే కావచ్చు. అది పెనుగాలికి కొట్టుకొని పోవుచున్నను ఒక చిన్న చుక్కానితో ఓడ నడుపువాడు దానిని తన ఉద్దేశము చొప్పున త్రిప్పగా ఆ ప్రకారమే అది సాగిపోవును.

5. మన నాలుక విషయమునను ఇంతే. అది ఒక చిన్న అవయవమేయైనను, తనను తాను పొగడుకొనుటయందు అది దిట్ట. ఒక చిన్న నిప్పురవ్వ ఎంత విస్తారమైన అడవినైన తగులబెట్టును!

6. నాలుక నిప్పువంటిది. అదియొక దోష ప్రపంచము. దానికి నిలయము మన శరీరము. అది మన శరీరము నంతను మలినము చేయును. మన జీవితము సర్వస్యమునకు అది నిప్పుపెట్టును. దానికి ఆ అగ్నిజ్వాల నరకము నుండియే ప్రాప్తించును.

7. మానవుడు జీవకోటినంతటిని మచ్చిక ఒనర్చుకొనగలడు. ఇంతకు పూర్వమే మచ్చిక ఒనర్చుకొనెను. పశుపక్ష్యాదులు. భూచర జలచరములు, వానికి లోబడినవే.

8. కాని నాలుకను లోబరచుకొనిన మానవుడు ఎవ్వడును లేడు. అది విశ్రమింపని దోషము, ఘోర విషపూరితము.

9. మన ప్రభువును పితయగు దేవుని స్తుతింతుము.  కాని ఆ దేవుని ప్రతిరూపములుగా సృజింపబడిన మనతోడి మానవులను అదే నోటితో శపింతుముగదా!

10. ఆశీర్వచనమును, శాపవచనమును ఒకే నోటి నుండి ఉద్భవించుటయా! సోదరులారా! ఇట్లు జరుగరాదు.

11. ఒకే నీటి బుగ్గలోనుండి మంచినీరును, ఉప్పు నీరును ఊరునా!

12. సోదరులారా! అంజూరపుచెట్టుకు ఓలివలు, ద్రాక్ష తీగకు అంజూరములు కాయునా! అట్లే ఉప్పు నీటి బుగ్గనుండి మంచి నీరు ఊరదు.

13. మీలో ఎవరైన జ్ఞానియును, వివేకియును అగువాడు ఉండెనా? అయినచో అతడు తన సత్పవర్తనచేతను, వినయ వివేకములతో కూడిన సత్కార్య ముల చేతను దానిని నిరూపింపవలెను.

14. కాని మీ హృదయమున ఈర్ష్య ద్వేష స్వార్థ పరత్వములకు తావు ఉన్నచో మీరు గర్వింపరాదు. సత్యమునకు విరుద్దముగ పలుకరాదు.

15. ఇట్టి వివేకము పరలోకము నుండి దిగివచ్చినది కాదు. ఇది లౌకికము, భౌతికము, పైశాచికము.

16. ఏలయన, అసూయ స్వార్ధ పరత్వములు ఎచటనుండునో అచట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములును ఉండును.

17. కాని దివ్యమగు వివేకము స్వచ్చమయినది. అంతే కాక, అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండియుండి సత్కార్య ప్రదమగును. అది పక్షపాతమునకును, వంచనకును దూరమైనది.

18. శాంతిస్థాపకులు నాటిన శాంతిబీజముల ఫలసాయమే నీతి.

 1. మీ మధ్య ఇన్ని కలహములు, వివాదములు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండి, సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే గదా!

2. మీరు ఆశించుచున్నారుగాని పొందుటలేదు. కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురుగాని పొందలేరు. కనుక మీరు కలహించుదురు. యుద్ధములు చేయుదురు. మీకేమి కావలయునో వాని కొరకై దేవుని అర్ధింపక పోవుటచేతనే, మీకు కావలసిన వానిని మీరు పొంద లేకున్నారు.

3. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురుగదా!

4. విశ్వాసరహితులారా! ఐహికమును ప్రియముగ నెంచువాడు దేవునకు విరోధియని మీకు తెలియదా? ఐహిక మైత్రిని సంపాదింపనెంచువాడు దేవునితో విరోధము తెచ్చి పెట్టుకొనుచున్నాడు.

5. “మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును” అను పరిశుద్ధ గ్రంథ వచనము అర్థరహితము అగునని అనుకొందురా!

6. కాని ఆయన కృపను ఎక్కువగ ఇచ్చును. ఏలయన, “దేవుడు అహంకారులను ఎదిరించును. వినమ్రులకు కృపను అనుగ్రహించును” అని లేఖనము చెప్పుచున్నది.

7. కావున దేవునకు విధేయులు కండు. సైతానును వ్యతిరేకింపుడు. అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును.

8. దేవుని దరికి చేరుకొనుడు. అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. పాపాత్ములారా! మీ చేతులు శుభ్రము చేసికొనుడు. ద్విమనస్కులారా! హృదయములను శుద్ధి యొనర్చుకొనుడు.

9. విచారింపుడు, మొర పెట్టు కొనుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు.

10. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు; అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును.

11. సోదరులారా! మీరు పరస్పరము విరుద్ధముగా పలుకరాదు. ఎవడైనను తన తోడివానిని గూర్చి విరుద్ధముగ పలికెననుకొనుడు. లేదా వానిపై తీర్పరి అయ్యెననుకొనుడు. అట్లయినచో అతడు ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా పలికినట్లే. అప్పుడు అతడు ధర్మశాస్త్రమునే విమర్శించువాడగును. నీవు ధర్మశాస్త్రమును విమర్శించినచో ధర్మశాస్త్రమునకు విధేయుడవు కావు. పైగా ధర్మశాస్త్రముపై తీర్పరివి అగుదువు.

12. ధర్మ శాస్త్రమును విధించువాడు దేవుడొక్కడే. ఆయన ఒక్కడే న్యాయాధికారి. ఆయన మాత్రమే రక్షింపను, శిక్షింపను సమర్థుడు. తోడివారి న్యాయాన్యాయములను ఎంచు టకు నీవు ఎంతటివాడవు?

13. "నేడో, రేపో, ఏదైన నగరమునకు పోయెదము. అచట ఒక సంవత్సరములో వ్యాపారమున మంచి లాభములు సంపాదించేదము" అని మీరు  పలుకుదురా? అయ్యలారా! నా మాట వినుడు.

14. మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడ తెలియదు కదా! ఏలయన, మీరు ఈ క్షణముండి, మరు క్షణములో అదృశ్యమయ్యెడి పొగమంచు వంటివారు.

15. కనుక, “ప్రభువు అనుగ్రహించినచో ఎట్లో జీవించి, ఏదేని సాధింతుము” అని మీరు పలుకవలెను.

16. కాని, ఇప్పుడు మీరు పొగరుబోతులై డంబములు పలుకుచున్నారు. అటుల చేయుట తగదు.

17. మేలైనది చేయనెరిగియు అటుల చేయనివాడు పాపము చేసినవాడగును. 

 1. భాగ్యవంతులారా! నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి, రోదింపుడు.

2. మీ భాగ్యములు మురిగిపోయినవి. బట్టలు చెదలు పట్టినవి.

3. మీ బంగారము, వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షియై మీ శరీర ములను అగ్నివలె దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాసులను కూడబెట్టితిరి.

4. ఇదిగో, మీ పొలములో పనిచేసినవారికి ఇచ్చుటలో మీరు మోసముగ బిగపట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సైన్యములకధిపతియైన దేవుని చెవుల చొచ్చుచున్నవి.

5. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి.

6. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు.

7. కనుక, సోదరులారా! ప్రభువు విచ్చేయునంత వరకు ఓపికపట్టుడు. పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము, కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంటకొరకు ఎదురు చూచుచున్నాడుగదా!

8. కాబట్టి మీరుకూడ ఓపికతో ఉండవలెను. ప్రభువు విచ్చేయుదినము సమీపించి నది. కనుక ధైర్యముతో ఉండుడు.

9. సోదరులారా! మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు. అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురిచేయడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు, లోన ప్రవే శింపనున్నాడు.

10. సోదరులారా! ప్రభు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములలో సహన మననేమియో ఎరుగుటకు వారిని ఉదాహరణముగ గైకొనుడు.

11. వారు సహనమును చూపిరి. కనుకనే వారిని ధన్యులనుచున్నాము. యోబు సహనమును గూర్చి వినియున్నాము. చివరకు ప్రభువు అతనికి ఏమి ఏర్పాటు ఒనర్చెనో మీకు తెలియును. ప్రభువు ఎంతయో జాలియును, కనికరమును కలవాడు కదా!

12. సోదరులారా! ముఖ్యముగా, మీరేదైన వాగ్దానము చేయునప్పుడు ఒట్టు పెట్టుకొనరాదు. పరలోకముపైగాని, అన్యధాగాని ప్రమాణము చేయ కుడు. అయినచో అవుననియు, కానిచో కాదనియు మాత్రమే పలుకుడు. అప్పుడు మీరు దేవుని తీర్పునకు గురి కాకుందురు.

13. మీలో ఎవడైన కష్టములో ఉన్నాడా? అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైన సౌఖ్యముగా ఉన్నాడా? ఉన్నచో అతడు స్తుతింపవలెను.

14. మీలో ఎవ్వడైన వ్యాధిగ్రస్తుడా? అయినచో అతడు సంఘపు పెద్దలను పిలువవలెను.వారు అతనికొరకు ప్రార్థింతురు. ప్రభువు నామమున వానిపై తైలమును పూయుదురు.

15. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్ధన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చేయును. వాని పాపములు క్షమింపబడును.

16. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు. ఒకరికొకరు ప్రార్ధించుకొనుడు. అప్పుడు మీరు స్వస్తులగుదురు. నీతిమంతుని ప్రార్ధన మహాశక్తిమంతమైనది.

17. ఏలీయా మనవంటివాడే. వానలు కలుగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్ధించెను. తత్ఫలితముగ మూడు న్నర సంవత్సరములపాటు లోకమున వానలు లేకుండెను.

18.మరల అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి యందు పంటలుపండెను.

19. సోదరులారా! మీలో ఎవ్వడైన సత్యమునకు దూరమయ్యెననుకొనుడు. మరియొకడు వానిని తిరిగి సన్మార్గమునకు తెచ్చెననుకొనుడు.

20. అటులైన దీనిని జ్ఞాపకము ఉంచుకొనవలెను. పాపాత్ముని దుర్మార్గము నుండి మరలించువాడు వాని ఆత్మను మృత్యుముఖము నుండి కాపాడినవాడు అగును. వాని అనేక పాపములను క్షమింపజేసినవాడు అగును.