ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హెబ్రీయులకు వ్రాసిన లేఖ

 1. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధ ములుగ ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లా డెను.

2. కాని, ఈ కడపటి దినములలో ఆయన తన కుమారునిద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియ మించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను.

3. ఆ కుమారుడు దేవుని మహిమయొక్క తేజస్సుగాను, అతని మూర్తిమంతమైన ప్రతిరూప ముగా ఉన్నాడు. శక్తిగల తనవాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తిని చేసినవాడై పిదప పరలోకమున సర్వ శక్తిమంతుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.

4. ఆ కుమారుడు దేవదూతల కంటె ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటె అంత ఘనుడు.

5. ఎట్లన “నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని” అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా పలికి ఉండెనా? అట్లే “నేను ఆయన తండ్రినగుదును. ఆయన నా కుమారుడగును” అని దేవుడు ఏ దూతతోనైన చెప్పియుండెనా?

6. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినపుడు, “దేవుని దూతలందరు ఆయనను పూజింపవలెను” అనియు చెప్పుచున్నాడు.

7. దేవదూతలను గూర్చి దేవుడిట్లు పలికెను: “దేవుడు తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసికొనెను.”

8. కాని తన కుమారుని గూర్చి దేవుడు “ఓ దేవా! నీ సింహాసనము నిరంతరమైనది! నీతిమంతమైన నీ రాజదండము నీ రాజ్యపరమైనది.

9. నీవు నీతిని ప్రేమించి, అక్రమమును ద్వేషించితివి. అందువలననే దేవుడు, నీ దేవుడు, నిన్ను నీ తోడివారి కంటె మిన్నగా ఆనంద తైలముతో అభిషేకించెను.” అని చెప్పెను.

10. “ఆదియందే నీవు భూమికి పునాదులు వేసితివి. నీ చేతులతోనే ఆకాశమును సృజించితివి.

11. భూమ్యాకాశములు గతించునుగాని నీవు నిలిచియుందువు.  అవి వస్త్రముల వలె పాతబడును.

12. వానిని నీవు అంగీవలె మడిచివేయుదువు. అవి దుస్తులవలె మార్చబడును. కాని నీవు ఎల్లవేళల ఏకరీతిగా నుందువు. నీ ఆయుషునకు అంతము లేదు” అనియు దేవుడు చెప్పెను.

13. “నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయువరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడవు కమ్ము” అని దేవుడు తన దూతలలో ఎవ్వరితోనైన ఎన్నడైన పలికి ఉండెనా?

14. అట్లయిన దేవదూతలు ఎవరు? వారందరు దేవుని సేవించుచు రక్షణను పొందనున్న వారి సహాయార్ధము దేవునిచే పంపబడు ఆత్మలు కారా? 

 1. అందువలననే, మనము అన్యథా ప్రభావితులము కాకుండుటకై మనము వినిన సత్యములపైననే మరింత దృఢముగ ఆధారపడి ఉండవలెను.

2. దేవదూతల ద్వారా ఒసగబడిన సందేశము నిజమని నిరూపింపబడినప్పుడు, దానిని అనుసరింపని, దానికి తలవంచని ప్రతి వ్యక్తియు తగిన శిక్షను పొందియుండగా,

3. ఇక మిక్కిలి గొప్పదగు ఈ రక్షణను నిర్లక్ష్యము చేసిన మనము ఎట్లు తప్పించుకొనగలము? ప్రథమమున ప్రభువే ఈ రక్షణను ప్రకటించెను. ఆయన మాట వినినవారు అది యథార్థమని మనకు నిరూపించిరి.

4. అదే సమయమున, తమ సూచకక్రియల చేతను, మహత్కార్యముల చేతను, అద్భుత కృత్యముల చేతను తన చిత్తానుసారముగ అనుగ్రహించిన పవి త్రాత్మ వరములచేతను దేవుడే వారి పలుకులకు సాక్షి అయ్యెను.

5. మనము ప్రస్తావించుచున్న రాబోవు లోకమునకు దేవుడు తన దూతలను ప్రభువులుగా చేయలేదు.

6. అయితే ఒకానొకడు ఒకచోట ఇట్లు సాక్ష్యమిచ్చు చున్నట్లుగ: “ఓ దేవా! నీవు అతనిని గూర్చి యోచించుటకు మనుజుడు ఎంతటివాడు? నీవతడిని లక్ష్యపెట్టుటకు అల్పుడగు మానవపుత్రుడు ఎంతటివాడు?

7. కొద్దికాలము మాత్రమే అతనిని దేవదూతల కంటె తక్కువగ చేసితివి. మహిమతో, గౌరవముతో నీవు అతనికి కిరీటము ధరింపజేసి

8. సర్వమును అతని పాదాక్రాంతమొనర్చితివి." “సర్వమును అతని పాదాక్రాంతమొనర్చెను” అనగా అతనికి లోబరచకుండ దేనిని విడువలేదు అని అర్ధము. కాని ఇంకను ప్రస్తుతమందు అంతయును అతనికి లోపరచబడుట మనము చూచుటలేదు.

9. కాని, మనము యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. దైవానుగ్రహమువలన మానవులందరి కొరకై తాను మరణించునట్లు, కొద్దికాలమువరకు ఆయన దేవదూతలకంటె తక్కువగ చేయబడెను. తాను అనుభవించిన మృత్యువేదనవలన ఆయన మహిమ గౌరవములతో అభిషిక్తుడగుట చూచుచున్నాము.

10. సర్వసృష్టి స్థితికారకుడగు దేవుడు, తన మహిమలో పాలుపంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధలద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే.

11. మానవులను పాపమునుండి ప్రక్షా ళన చేసినవానికి, పాపప్రక్షాళన చేయబడినవారికి తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు.

12. ఆయన ఇట్లు చెప్పెను: "ఓ దేవా! నిన్ను గూర్చి నా సోదరులకు ప్రకటించెదను. ఆ సభాముఖమున నిన్ను స్తుతించెదను."

13. "నేను దేవునియందు విశ్వాసముంచెదను” అనియు “ఇదిగో, దేవుడిచ్చిన పుత్రులతో నేనిట ఉంటిని” అనియు పలికెను.

14. తాను పుత్రులని పిలుచువారు, రక్తమాంస పూరితములగు శరీరములు కలవారగుటచే తానును వారివలె అగుటయేకాక, వారి మానవస్వభావము నందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారముగల సైతానును తన మరణము ద్వారా నశింప చేయుటకును,

15. తద్వారా మృత్యుభయముచేత తమ జీవితమంతయు బానిసత్వమున గడిపినవారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అటులయ్యెను.

16. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించి నది కాదని, అబ్రాహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది.

17. ప్రజల పాపముల పరిహా రార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును, దయామయుడును అగు ప్రధానయాజకుడగుటకుగాను, ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము.

18. తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక, ఇప్పుడు ఆయన శోధింపబడువారికి సాయపడగలడు. 

 1. దేవుని పిలుపునందుకొనిన పవిత్రులైన సోదరులారా! మనము ప్రచారముచేయు విశ్వాసమునకు ప్రధానయాజకుడుగా దేవునిచే పంపబడిన యేసును చూడుడు.

2. దేవుని గృహకృత్యములందు మోషే విశ్వసనీయుడుగా ప్రవర్తించినట్లే, తనను ఈ పనికి ఎన్నుకొనిన దేవునికి ఆయన విశ్వసనీయుడై ఉండెను.

3. గృహనిర్మాణమొనర్చిన వ్యక్తి, గృహముకంటెను ఎక్కువ ప్రతిష్ఠను పొందును. అట్లే యేసు, మోషే పొందినదానికంటే ఎక్కువ కీర్తిని పొందుటకు యోగ్యుడు.

4. ప్రతిగృహమును ఎవరో ఒకరు నిర్మింతురు. కాని దేవుడు విశ్వనిర్మాత.

5. మోషే దేవుడు చెప్పబోవు విషయములకు సాక్షిగ దేవుని ఇంటియందంతట నమ్మకముగ ఒక పరిచారకుని వలెయున్నాడు.

6. కాని క్రీస్తు దేవుని ఇంటిలో నమ్మకముగా ఒక కుమారు నివలె ఉన్నాడు. మన నిరీక్షణయందు విశ్వాసము కలవారమై ధైర్యమును వహించినచో మనమే ఆయన గృహముగా నిలిచెదము.

7. ఎట్లన, పవిత్రాత్మ చెప్పిన విధమున; “ఈనాడు మీరు దేవుని వాణిని వినినచో,

8. దేవునిపై తిరుగుబాటుచేసిన నాటివలె, ఎడారియందు ఆయనను పరీక్షించిన నాటివలె, మీ హృదయములను కఠినపరచుకొనకుడు.

9. నేను వారికి నలువది సంవత్సరములపాటు చేసినది చూచియు, ఆనాడు మీ పూర్వులు నన్ను శోధించి పరీక్షించిరి అని దేవుడు పలికెను.

10. ఆ కారణముననే నాకు వారిపై ఆగ్రహము కలిగి, 'వారి ఆలోచనయందు వారు ఎప్పుడును తప్పిపోవుదురు. నా మార్గములను వారు ఎన్నడును గ్రహింపలేరు' అని పలికితిని.

11. నేను కోపించి ఇటొక శపథమొనర్చితిని: 'వారు ఎన్నడును లోపల ప్రవేశించి నాతో విశ్రమింపకుందురుగాక'.”

12. నా సోదరులారా! సజీవదేవునినుండి విముఖుని చేయునంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయము మీలో ఎవ్వరికిని లేకుండునట్లు అప్రమ తులై ఉండుడు.

13. కానిచో, మీలో ఏ ఒక్కరును పాపముచే మోసగింపబడి మొండిపట్టుదలకు పోకుండునట్లు, 'ఈదినము' అనునది ఉన్నంతకాలము, మీరు ప్రతిదినము పరస్పరము సాయపడవలెను.

14. మొదట ఉన్న విశ్వాసమును చివరివరకు మనము దృఢముగ నిలిపి ఉంచుకొనగలిగినచో మన మందరము క్రీస్తులో భాగస్వాములమే.

15. “ఈనాడు మీరు దేవుని మాట వినినచో, దేవునిపై తిరుగుబాటు చేసిన నాటివలె, మీ హృదయములను కఠినపరచుకొనకుడు” అని చెప్పినప్పుడు,

16. దేవుని వాక్కును విని, ఆయనపై తిరుగు బాటొనర్చినది ఎవరు? నిజమునకు వారందరు మోషే నాయకత్వమున ఐగుప్తులోనుండి వెడలివచ్చిన వారే కదా!

17. దేవుడు నలువది సంవత్సరములు కోపించినది ఎవరిపైన? పాపములు చేసి ఎడారియందు ప్రాణములు కోల్పోయిన వ్యక్తులపైన ఆయన కోపించెను గదా!

18. “వారు ఎన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకుందురుగాక!” అని దేవుడు ఎవరిని గూర్చి శపథము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే ఆయన పలికెను గదా!

19. కాన అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని మనము గ్రహింతుము. 

 1. కావున లోపల ప్రవేశించి ఆయనతో విశ్ర మింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానమొనర్చి ఉన్నను, ఆ విశ్రాంతియందు ప్రవేశింపక మీలో ఎవ్వరైనను తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందము,

2. వారు ఎట్లు వినిరో, అట్లే మనమును  పదునైనది. జీవాత్మల సంయోగస్థానమువరకును, కిళ్ళు, మజ్జ కలియువరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. సువార్తను వింటిమి. వారు సందేశమును వినినను, అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది వినినప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము.

3. కావున, విశ్వసించు మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతుము. అది కేవలము ఆయన చెప్పినట్లే, “నేను కోపించి ఇటొక శపథమొనర్చితిని:: 'వారు ఎన్నడును నా విశ్రమస్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక!' ” జగత్తును సృష్టించినప్పుడు ఆయన పనులన్ని పూర్తియైయున్నను, ఆ విశ్రాంతిని గూర్చి ఆయన అటుల చెప్పెను.

4. మరియు ఏడవ దినమును గూర్చి ఆయన ఒకచోట చెప్పియున్నట్లు: “దేవుడు ఏడవ దినమున తన అన్ని పనులనుండి విశ్రమించెను.”

5. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది: “వారు ఎన్నడును నా విశ్రమస్థానమును ప్రవేశించి విశ్రమింప కుందురుగాక!”

6. ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశింపవలసి ఉన్నది. ముందు ఆ సువార్తను వినిన వారు అనేకులు తమ అవిధేయతచేత ప్రవేశింపక పోయిరి. కనుక ఇతరులు లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింపగలరు.

7. 'ఈ దినము' అను మరియొక దినమును దేవుడు నిర్ణయించుట దీనిని నిరూపించు చున్నది. “ఈ దినము మీరు దేవుని మాట వినినచో, మీ హృదయములను కఠినపరచుకొనకుడి” అని పరిశుద్ధ గ్రంథమునందు చాలకాలము తరువాత దావీదు ద్వారా దేవుడు దానినిగూర్చి మరల పలికెను.

8. యెహోషువ ప్రజలను దేవుని విశ్రాంతికి నడిపియున్నచో, తదనంతరకాలమున మరియొక దినమును గూర్చి దేవుడు పలికి ఉండెడి వాడు కాడు.

9. కావున ఎటులైనను, సప్తమదిన విశ్రాంతి దేవుని ప్రజలకొరకై ఇంకను మిగిలియున్నది.

10. దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లే దేవునితో విశ్రమించు ఏ వ్యక్తియైనను తన పనులనుండి విశ్రాంతిని పొందును.

11. కావున దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగ కృషిచేయుదము. వారివలె మనము, మనలో ఏ ఒక్కడును అవిధేయుడై పోకుండా, విశ్రాంతిలో ప్రవేశింపయత్నించుదము..

12. దేవుని వాక్కు సజీవమును, చైతన్యవంతమునైనది. అది పదునైన రెండంచుల ఖడ్గముకంటెను పదునైనది. జీవాత్మల సంయోగ స్థానము వరకును, కిళ్ళు, మజ్జ కలియువరకును అది ఛేదించుకొనిపోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు.

13. దేవునివద్ద నుండి దాచగలిగినది ఏదియును లేదు. సర్వసృష్టి యందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము.

14. ఆకాశమండలముగుండ వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగ నిలిచియుందము.

15. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధానయాజకుడు. అంతేకాక మనవలెనే అన్ని విధములుగా శోధింపబడియు, పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు.

16. కావున ధైర్య వంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. 

 1. ప్రతి ప్రధానయాజకుడును ప్రజలనుండి ఎన్నుకొనబడి, వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను, బలులను అర్పించుట కొరకు నియమింపబడెను.

2. తానే పెక్కు విధములుగ బలహీనుడు కనుక, అజ్ఞానమువలన దోషములొనర్చు వారితో అతడు సౌమ్యముగ ఉండ గలుగును.

3. తానే బలహీనుడు కనుక, ప్రజల పాపములకొరకే కాక,తన పాపముల నిమిత్తము కూడ బలులను అర్పింపవలెను.

4. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపువలననే ఏ వ్యక్తియైనను ప్రధాన యాజకుడుగ చేయబడును.

5. అదే విధముగ ప్రధానయాజక పదవీ గౌరవ మును క్రీస్తు తనకుతాను ఆపాదించుకోలేదు. దేవుడే ఆయనను నియమించెను. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను: “నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. "

6. మరియొకచోట దేవుడు ఇట్లు చెప్పెను: “మెల్కీసెదెకు యాజక క్రమమున, నీవు సర్వదా యాజకుడవైయుందువు."

7. తన ఇహలోక జీవితమున, మృత్యువునుండి తనను రక్షింప శక్తికలిగిన దేవునిగూర్చి, యేసు ఏడ్పు లతోను కన్నీటితోను పెద్దగా ఎలుగెత్తి ప్రార్ధించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను.

8. తాను దేవుని పుత్రుడై ఉండికూడ తానుపొందిన బాధలద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను.

9. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగువారి శాశ్వత రక్షణకు మూలమాయెను.

10. మెల్కీసెదెకు యాజక క్రమమున, ప్రధాన యాజకునిగ దేవుడు ఆయనను ప్రకటించెను.

11. దీనిని గూర్చి మేము చెప్పవలసినది చాల ఉన్నది కాని, విషయములను మీరు త్వరగా గ్రహింప కుండుటవలన మీకు వివరించుట కష్టము.

12. ఇప్పటికే మీరు బోధకులై ఉండవలసియున్నను మీకే వేరొకరు బోధింపవలసియున్నది. దేవుని సందేశ మును గూర్చిన ప్రాథమిక విషయములు కూడ మీకు తెలియవు. అన్నము తినదగిన మీరు ఇంకను పాలే త్రాగవలసియున్నది.

13. ఎవరైన పాలుత్రాగవలసియున్నచో వారు ఇంకను మంచి చెడులయందు అనుభవము లేని శిశువులే.

14. అట్లుకాక, బలమైన ఆహారము వయోజనుల కొరకైనది. వయోజనులు తమ అనుభవమువలన మంచిచెడులయందలి తారత మ్యమును అభ్యాసమువలన గ్రహింపగలుగుదురు. 

 1. కావున క్రీస్తు సందేశమునందలి ప్రారంభ దశను వదలి, పరిపక్వమైన బోధనలవైపుకు సాగి పోదము. ప్రయోజన రహితములగు పనులనుండి విముఖులమై, దేవుని విశ్వసింపవలెనను విషయ మును తిరిగి మనము ప్రస్తావింపరాదు.

2. అట్లే బప్తిస్మ బోధనలను గూర్చియు, హస్త నిక్షేపణమును గూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు, శాశ్వతమగు తీర్పును గూర్చియు తిరిగి మనము ప్రస్తావింపరాదు.

3. దేవుని అనుమతి ఉన్నచో ముందుకు సాగుదము.

4. పతితులైన వారిని తిరిగి పశ్చాత్తాప మార్గమునకు తెచ్చుట ఎట్లు? ఒకప్పుడు వారు జ్ఞానజ్యోతిని పొంది, పరలోక వరమును చవిచూచిరి. పవిత్రాత్మలో భాగస్వాములైరి.

5. దేవుని సువార్తను, భవిష్యత్కాలపు శక్తుల ప్రభావములను రుచిచూచిరి.

6. అయినను భ్రష్టులైరి. వారు దేవుని కుమారుని తిరిగి సిలువ వేయుచు, బహిరంగముగ అవమానములపాలు చేయుచున్నందున, వారిని పశ్చాత్తాపమునకు తిరిగి మరల్చుట అసాధ్యము.

7. ఏలయన, భూమి తనపై తరచుగా కురియు వాన నీటిని గ్రహించి, వ్యవసాయము చేయువారికి అనుకూలమైన పంట పండించినయెడల దేవుని దీవెనను పొందును.

8. కాని అది ముళ్ళపొదలు, కలుపు మొక్కలు పెరుగు భూమియైనచో విలువలేనిది అగును. అట్టిదానికి దేవునిచే శపింపబడు ప్రమాదమున్నది. అది అగ్నిచే దహింపబడి నాశనము చేయబడును.

9. ప్రియ సోదరులారా! మేమిట్లు మాట్లాడు చున్నను, మీరు ఇంతకంటెను మంచిదియు, రక్షణకరమైనదియు అయిన స్థితిలో ఉన్నారని మాకు గట్టి నమ్మకము.

10. దేవుడు అన్యాయము చేయువాడు కాడు. మీరు చేసిన పనులను, తోడి సోదరులకు మీరొనర్చిన, ఒనర్చుచున్న సహాయముల ద్వారా ఆయనయందు మీరు ప్రదర్శించు ప్రేమను ఆయన మరచిపోడు.

11. అయినను మీలో ఒక్కొక్కడు, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసకిని చివరివరకు ప్రదర్శింపవలెనని మేము కోరుచున్నాము.

12. మీరు సోమరిపోతులు కారాదు. అంతేకాక, విశ్వాసముతోను, ఓర్పుతోను దేవుని వాగ్దా నములకు వారసులగువారిని మీరు అనుసరింపుడు.

13. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినపుడు, తాను చేసిన వాగ్దానమును నెరవేర్తునని ప్రతిజ్ఞ చేసెను. తనకంటె అధికుడు మరియొకడు లేకుండుటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞ యొనర్చెను.

14. “నేను నిన్ను దీవించి, నీ వంశమును అభివృద్ధి చేయుదునని నీకు వాగ్దాన మొనర్చుచున్నాను” అని దేవుడు చెప్పెను.

15. అబ్రహాము చాల ఓర్పుగల వాడగుట వలన, దేవుని వాగ్దానఫలమును అతడు పొందెను.

16. సర్వసాధారణముగా, మానవులు ఒక ప్రతిజ్ఞ చేయునపుడు తమకంటె ఉత్తమమగు నామమును ఉపయోగించుదురు. అట్టి ప్రతిజ్ఞ వారి మధ్యనున్న అన్ని వివాదములను పరిష్కరించును.

17. అటులనే తన వాగ్దానఫలమును పొందబోవువారితో, తన ఉద్దేశములో ఎట్టి మార్పు కలుగబోదని స్పష్టముచేయ దేవుడు సంకల్పించెను. కనుకనే తన వాగ్ధానమునకు ప్రమాణమును కూడ జోడించెను.

18. కావున ఈ రెండు విషయములు మార్పులేనివి. ఇవి దేవుడు అసత్యమాడజాలని విషయములు. కనుక శరణాగతులమైన మనము, మన ముందుంచబడిన ఈ నిరీక్షణను దృఢముగ నిలిపి ఉంచుకొనుటకు మరింత ప్రోత్సహింపబడుచున్నాము.

19. ఈ నిరీక్షణ మన హృదయములకు ఓడయొక్క లంగరు వంటిది. అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలో నుండి గర్భాలయములోనికి చొచ్చుకొనిపోవును.

20. మన కొరకై, మన కంటే ముందే యేసు అచట ప్రవేశించెను. ఆయన మెల్కీసెదెకు యాజక క్రమమున, శాశ్వతముగ ప్రధాన యాజకుడయ్యెను. 

1. ఈ మెల్కీసెదెకు సాలేము రాజు, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. రాజులను సంహరించి, యుద్ధభూమినుండి అబ్రహాము మరలి వచ్చుచుండగ, మెల్కీసెదెకు అతనిని కలిసికొని ఆశీర్వదించెను.

2. తన వద్దనున్న సర్వస్వము నుండియు పదియవ వంతును అబ్రహాము ఆయనకు ఇచ్చెను. మెల్కీసెదెకు పేరునకు “నీతిమంతుడగు రాజు” అని మొదటి అర్థము. అతడు సాలేమునకు రాజగుట వలన “శాంతికాముకుడగు రాజు” అనియు ఆయన పేరునకు అర్థము.

3. తండ్రి, తల్లి, వంశావళిలేని, జీవిత కాలమునకు ఆదియైనను, జీవమునకు అంతమైనను లేని అతడు దేవుని కుమారుని పోలియున్నాడు. అతడు శాశ్వతముగ యాజకుడై ఉండును.

4. కనుక అతడు ఎంత గొప్పవాడో మీరు గ్రహింపగలరు. మూలపురుషుడు అబ్రహాము తాను యుద్ధమున సంపాదించిన సర్వస్వమునుండి అతనికి పదియవవంతు ఇచ్చెను.

5. అదేవిధముగ లేవీ వంశమునకు చెంది, యాజకత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రహాము సంతతివారైనను, ధర్మశాస్త్రముచొప్పున వారియొద్ద అనగా ప్రజలయొద్ద పదియవ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు.

6. కాని మెల్కీసెదెకు లేవీ సంతతివాడు కాకపోయినను, అబ్రహామునుండి పదియవ వంతు వసూలు చేసికొని, దేవుని వాగ్దానములను పొందిన అతనిని దీవించెను.

7. తక్కువ వాడు ఎక్కువ వానిచేత దీవింపబడుననుట నిర్వివాదము.

8. ఇచట పదియవవంతు వసూలు చేయువారు మానవమాత్రులైన యాజకులు. కాని అచట, పదియవ వంతును అమరుడని సాక్ష్యము పొందిన మెల్కీసెదెకు పుచ్చుకొనుచున్నాడు.

9. అనగా అబ్రహాము పదియవవంతు చెల్లించినపుడు, పదియవ వంతు వసూలుచేయు ఆ లేవి కూడ అతని ద్వారా చెల్లించెను.

10. కాని, అప్పటికి ఇంకను లేవి జన్మింపలేదు. అనగా మెల్కీసెదెకు అబ్రహామును కలియున్నప్పటికి, లేవి తన పూర్వుడగు అబ్రహాము నందు అంతర్గతుడై ఉండెను.

11. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రము ఈయబడెను. కనుక ఆ యాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగియున్నచో అహరోను క్రమమున గాక, మెల్కీసెదెకు యాజక క్రమమున, మరియొక రకమగు యాజకుడు రావలసిన అవసరము ఉండెడిది కాదు.

12. ఎట్లన, యాజకత్వము మార్చబడినపుడు, చట్టమునందును మార్పురావలసి ఉండును.

13. మన ప్రభువును గూర్చియే ఈ విషయములు చెప్ప బడినవి. ఆయన వేరొక తెగకు చెందినవాడు. ఆ జాతి వారినుండి మరి ఎవ్వరును బలిపీఠము నొద్ద పరిచర్య చేయలేదు.

14. ఆయన యూద తెగయందు జన్మించెననుట విదితమే. అంతేకాక, మోషే యాజకులనుగూర్చి చెప్పినపుడు ఈ జాతిని పేర్కొనలేదు.

15. విషయము మరింత స్పష్టమగుచున్నది. మెల్కీసెదెకువంటి మరియొక యాజకుడు వచ్చియున్నాడు.

16. శరీరానుసారముగ చట్టపు నియమమును బట్టి ఆయన యాజకుడుగ చేయబడలేదు, అనంత మగు ఒక జీవశక్తిచే ఆయన యాజకుడాయెను.

17. ఏలయన ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడి యున్నది: “మెల్కీసెదెకు యాజకక్రమమున, నీవు సర్వదా యాజకుడవైయుందువు.”

18. కావున పాతనియమము బలహీనమును, నిరుపయోగమును అగుటచే త్రోసిపుచ్చబడినది.

19. మోషే చట్టము దేనిని సమగ్రము చేయజాలకుండెను. కనుక, ఈనాడు అంతకంటే ఉత్తమమగు ఒక నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడినది. దాని ద్వారా మనము దేవునికి సన్నిహితులము కాగలము.

20. అంతేకాక ప్రమాణము లేకుండ యేసు యాజకుడు కాలేదు. పూర్వము ఇతరులు ప్రమాణము లేకుండ యాజకులైరి.

21. దేవుడు ఆయనతో, “ప్రభువు ఒక ప్రమాణము చేసెను ఆయన మనసు మార్చుకొనడు, 'నీవు సర్వదా యాజకుడవైయుందువు' " అని పలుకుటచే, యేసు ప్రమాణపూర్వకముగ యాజ కుడయ్యెను.

22. కావున ఈ ప్రమాణము యేసును, మరింత మేలైన నిబంధనకు పూచీదారుగకూడ చేయుచున్నది.

23. వేరొక భేదముకూడ ఉన్నది. పూర్వ యాజకులు పెద్దసంఖ్యలోనున్నారు. ఎందుకనగా వారు మృత్యువు పాలై తమ పనిని సాగింపలేక పోవుటయే.

24. కాని యేసు శాశ్వతజీవి. కనుక ఆయన సదా యాజకత్వము కలిగియున్నాడు.

25. ఆయన, ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవియైయున్నాడు. కావున తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన ఇప్పుడును, ఎల్లప్పుడును సమర్దుడే.

26. కావున ఇట్టి ప్రధానయాజకుడు మనకు ఉండుట సమంజసమే. ఆయన పవిత్రుడు. నిర్దోషి, నిష్కల్మషుడు. పాపాత్ములగు మనుజులనుండి వేరు చేయబడి జ్యోతిర్మండలముకంటె ఉన్నతుడుగ చేయబడినవాడు.

27. ఆయన ఇతర ప్రధానయాజకుల వంటివాడు కాదు. ప్రతిదినము, మొదట తన పాపములకొరకును, తరువాత ప్రజలపాపముల కొరకును బలులను అర్పింపవలసిన అవసరము ఆయనకు లేదు. తనను తాను అర్పించుకొనినపుడు ఒకే ఒక బలిగ, శాశ్వతముగ అర్పించుకొనెను.

28. మోషే చట్టము బలహీనులగు వ్యక్తులను ప్రధాన యాజకులుగ నియమించును. ఆ చట్టమునకు తదుపరి కాలమున వచ్చిన దేవుని ప్రమాణ వాక్కు సర్వదా సంపూర్ణుడుగ చేయబడిన దైవపుత్రుని నియమించెను.  

 1. మనము చెప్పుచున్న విషయసారాంశమిది. పరలోకమున సర్వేశ్వరుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉండెడి ప్రధానయాజకుని మనము పొందియున్నాము.

2. ఆయన పరమ పవిత్రమగు, అనగా మానవనిర్మితము కాని, దేవునిచే ఏర్పరుపబడిన నిజమైన గుడారమున ప్రధానయాజకుడుగ ఉండును.

3. ప్రతి ప్రధానయాజకుడును దేవునికి కాను కలను అర్పించుటకును, బలులను సమర్పించుటకును నియమింపబడును. కనుకనే మన ప్రధానయాజకుడు సమర్పించుటకును ఏదియో ఒకటి ఉండవలెను.

4. ఆయన ఇంకను భూమియందే ఉన్నచో, యూదుల నిబంధనల ననుసరించి కానుకలను అర్పించు యాజకులు ఉన్నారు కనుక, ఆయన యాజకుడే కాకపోయి ఉండును.

5. యాజకులుగ వారు చేయుపని యథార్థముగ పరలోకమందుండు దానికి కేవలము అనుకరణమును, ఛాయామాత్రమునై ఉన్నది. మోషే గుడారమును నిర్మించునపుడు "పర్వతముపై నీకు ప్రదర్శింపబడిన మాదిరిగ అన్ని అమర్చబడునట్లు జాగ్రత్తపడుము” అని దేవుడాతనితో చెప్పెను.

6. మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడియున్నందున, దేవునికిని మానవులకును మధ్య, క్రీస్తు ఏర్పరచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అటులనే వారి కంటె చాల గొప్పదగు యాజకత్వకార్యము యేసునకు ఇయ్యబడెను.

7. మొదటి నిబంధన కొరత లేనిదైనయెడల రెండవ నిబంధనకు అవసరమే ఉండియుండక పోవును.

8. కాని, దేవుడు తన ప్రజలయందు దోషమును ఎత్తి చూపి, యిట్లు చెప్పెను. “ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: యిస్రాయేలు ప్రజలతోను, యాదా తెగతోను నేను ఒక క్రొత్త నిబంధనను చేసికొను దినములు సమీపించుచున్నవి.

9. ఐగుప్తు దేశమునుండి బయల్వెడలుటకు, వారిని నేను చేయిపట్టుకొని నడిపించిననాడు, వారి పూర్వులతో నేనొనర్చుకొనిన నిబంధన వలె ఇది ఉండదు. నేను వారితో ఒనర్చుకొనిన నిబంధనకు వారు కట్టుబడియుండలేదు, కావున వారిని గూర్చి నేను శ్రద్ధవహింపలేదు అని ప్రభువు చెప్పుచున్నాడు.

10. తదనంతరము, యిస్రాయేలు ప్రజలతో నేనొనర్చుకొను నిబంధన ఇది అని ప్రభువు చెప్పుచున్నాడు: నా చట్టములనువారి మనస్సులందు ఉంచెదను. వారి హృదయములపై వానిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు.

11. “ప్రభువును తెలుసుకొనుడు' అని వారి యందెవ్వరును ఇరుగు పొరుగులకు గాని, స్వజాతీయులకుగాని బోధింపవలసి ఉండదు. అత్యల్పుని నుండి అత్యధికుని వరకు అందరు నన్ను తెలుసుకొందురు.

12. వారి దోషములపై నేను దయచూపుదును. వారి పాపములను ఇక జ్ఞాపకము ఉంచుకొనను.”

13. క్రొత్త నిబంధనను గూర్చి ప్రసంగించుటచే దేవుడు మొదటిదానిని పాత దిగచేసెను. పాతదై శిథిలమగు ఏదియైనను త్వరలో కంటికి కనబడకుండ పోవును. 

 1. మొదటి నిబంధన ఆరాధన నియమములను, భూలోక సంబంధమైన పవిత్రస్థలమును కలిగియుండెను.

2. ఎట్లన మొదట ఒక గుడారము ఏర్పరుపబడెను. దానియందు దీపస్తంభమును, బల్లయు, దేవునికి అర్పింప బడిన రొట్టెలును ఉండెను. దానికి పవిత్రస్థలమని పేరు.

3. రెండవ తెరవెనుక అతిపవిత్రస్థలమను గుడారము ఉండెను.

4. దానియందు ధూపమిచ్చుటకు బంగారు పిఠమును, బంగారుమయమగు నిబంధన మందసమును ఉండెను. ఆ మందసమునందు మన్నా గల బంగారుపాత్రయు, చిగురించిన అహరోను దండమును, నిబంధన వ్రాయబడిన రెండు రాతిపలకలును ఉండెను.

5. కరుణాపీఠమును మహిమాన్వితమైన కెరూబుదూతలు తమ రెక్కలతో కప్పుడు ఆ మందసము పై ఉండిరి. కాని వీనిని గూర్చి ఇప్పుడు సవిస్తరముగ వివరించుటకు వీలుపడదు. .

6. ఈ ఏర్పాటు చేయబడిన పిమ్మట, ప్రతి దినమును తమ కర్తవ్యములను నిర్వర్తించుటకు యాజకులు మొదటి గుడారమున ప్రవేశింతురు.

7. రెండవ గుడారము లోనికి కేవలము ప్రధానయాజ కుడు మాత్రమే ప్రవేశించును. అది సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే. తన కొరకును, ప్రజలు తెలియక చేయు పాపముల కొరకును, తాను తీసికొనివచ్చిన రక్తమును దేవునికి అర్పించును.

8. ఈ ఏర్పాట్లను బట్టి, మొదటి గుడారము నిలిచి ఉన్నంతకాలము అతి పవిత్ర ప్రదేశములోనికి మార్గము ఇంకను తెరువబడలేదని పవిత్రాత్మ స్పష్టముగ బోధించుచున్నది.

9. ఈ గుడారము ప్రస్తుత కాలమును సూచించు సంకే తము. దేవునికి అర్పింపబడు కానుకలును, బలులును ఆరాధకుని అంతఃకరణమును పరిపూర్ణము చేయజాలవని ఈ సంకేతము తెలుపుచున్నది.

10. అవి కేవలము అన్నపానములకును, శుద్ధిచేయు కర్మలకును సంబంధించినవి. అవి అన్నియు బాహ్యములే. దేవుడు సమస్తమును సరిదిద్దువరకు మాత్రమే అవి వర్తించును.

11. కాని క్రీస్తు ఇటనున్న సద్విషయములకు ప్రధానయాజకుడుగ వచ్చి గుడారమున ప్రవేశించెను. మరింత శ్రేష్ఠమును సంపూర్ణమునైన అది మానవ నిర్మితము కాదు. అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు.

12. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి, అతి పవిత్రస్థలమును శాశ్వతముగ చేరినపుడు, బలిని అర్పించుటకుగాను మేకలయొక్కయు, దూడలయొక్కయు రక్తమును తీసికొనిపోలేదు. తన రక్తమునే తీసికొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను.

13. మేకలయొక్కయు, ఎద్దులయొక్కయు రక్తమును, దహింపబడిన దూడబూడిదను మైలపడిన వారిపై చల్ల బడినపుడు అవి వారికి శరీర శుద్ధికలుగునట్లు పవిత్రులనుగా చేయును.

14. అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించు కొనిన క్రీస్తు రక్తము, నిర్జీవక్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకను ఎంతగానో శుద్ధిచేయునుగదా!

15. ఈ కారణము వలననే దేవుని పిలుపును పొందినవారు, దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వ తమైన వారసత్వమును పొందుటకు గాను, క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషములనుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే.

16. వీలునామా ఉన్నచోట దాని కర్త మరణించెనని నిరూపింపవలసియున్నది.

17. వీలునామా వ్రాసినవాడు బ్రతికి ఉన్నంతకాలమును ఆ వీలునామాకు విలువలేదు. అతని మరణానంతరమే అది అమలులోనికి వచ్చును.

18. అందువలననే, మొదటి నిబంధన కూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.

19. ధర్మశాస్త్రపు ఆజ్ఞలను అన్నిటిని మొదట ప్రజలకు మోషే వినిపించెను. పిమ్మట నీటితో కూడ దూడల, మేకల రక్తమును తీసికొని గ్రంథముపైన, జనసమూహములపైన దర్భపోచతోను, ఎఱ్ఱనిగొఱ్ఱె ఉన్నితోను చల్లెను.

20. అప్పుడు అతడు ఇట్లు చెప్పెను: “దేవుడు మీకు శాసించిన నిబంధనను ఈ రక్తము ధ్రువపరచుచున్నది.”

21. అదే విధముగా గుడారముపైనను, ఆరాధనకు ఉపయోగించు అన్ని వస్తువులపైనను కూడ రక్తమును చల్లెను.

22. నిజమునకు ధర్మశాస్త్రమును అనుసరించి దాదాపు సమస్తవస్తువులును రక్తముచే శుద్ధి చేయబడును. రక్తము చిందకయే పాపక్షమాపణ లభింపదు.

23. పరలోక వస్తువులను పోలిన ఈ వస్తువులు ఇట్టి బలులవలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కాని, పరలోక వస్తువులు ఇంత కంటె మేలైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను.

24. నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవనిర్మితమగు పవిత్రస్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకముననే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచియున్నాడు.

25. యూదుల ప్రధానయాజకుడు, జంతు రక్తముతో పవిత్ర ప్రదేశములోనికి ప్రతిసంవత్సరము ప్రవేశించును. కాని క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు.

26. అటులైనచో ప్రపంచము సృష్టింపబడినప్పటినుండి, అనేక పర్యాయములు, ఆయన బాధనొందవలసి ఉండెడిది. అటులకాక, తనను తానే బలిగా అర్పించుకొనుటవలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకే ఒకసారి జన్మించెను.

27. ప్రతి వ్యక్తియు ఒక్కసారియే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను,

28. అదే విధముగా అనేకుల పాపపరిహారమునకై క్రీస్తుకూడ ఒక సారే బల్యర్పణముగ సమర్పింపబడెను. పాపమును గూర్చి విచారించుటకు గాక, తనకొరకై వేచియున్నవారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును.

 1. యూదుల చట్టము, రాబోవు మేలుల ఛాయ గలదియేగాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. ఏటేట ఎడతెగక ఒకే విధమైన బలులు అర్పింపబడుచుండెను. అటులైనచో ఈ బలుల మూలమున దేవుని చేరదలచిన ప్రజలను, చట్టము ఎట్లు సంపూర్డులను చేయగలదు?

2. దేవుని పూజించు ప్రజలు నిజముగ వారి పాపములు తొలగింపబడి ఉన్నచో, ఇక ఏ మాత్రము వారు పాపాత్ములమను కొనరు. అప్పుడు వానిని అర్పించుట మానుకొందురు గదా!

3. ప్రజలకు ఏటేట వారి పాపములను గూర్చి గుర్తుచేయుటకు ఈ బలులు తోడ్పడుచున్నవి.

4. ఏలయన ఎద్దులయొక్కయు, మేకలయొక్కయు రక్తము ఏనాటికిని పాపములను తొలగింపలేదు.

5. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవే శించునపుడు, దేవునితో క్రీస్తు ఇట్లు అనెను: “నీవు జంతుబలులను, అర్పణలను కోరలేదు. కాని నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి.

6. దహన బలులకును, పాప పరిహారార్థమైన అర్పణలకును నీవు ఇష్టపడలేదు.”

7. అప్పుడు నేను ఇట్లంటిని: “నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగ, ఇదిగో! ఓ దేవా! నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను”.

8. ఆయన మొదట ఇట్లు చెప్పెను: “బలులను, అర్పణలను, దహనబలులను, పాపపరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వానితో తృప్తి చెందలేదు.” ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను, ఆయన ఇట్లనెను.

9. తదుపరి ఆయన “ఓ దేవా! నీచిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చియున్నాను” అని పలికెను. కనుక పాతబలులను అన్నిటిని తొలగించివాని స్థానమున దేవుడు, రెండవదైన క్రీస్తు బలిని నియమించెను.

10. యేసు క్రీస్తు, దేవుడు తనను కోరినటొనర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యర్పణచేత మనమందరమును, పాపములనుండి శాశ్వతముగ పవిత్రులుగ చేయబడితిమి.

11. ప్రతి యూద యాజకుడును అనుదినమును అర్చన ఒనర్చుచు, ఒకే రకమగు బలులనే పదేపదే అర్పించుచుండును. కాని ఆ బలులు ఏనాటికిని పాప ములను తొలగింపలేవు.

12. అటుల కాక, క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాపపరిహారార్ధమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను.

13. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఒనర్చువరకు, ఆయన అచట వేచియుండును.

14. పాపములనుండి శుద్ధి పొందినవారిని, ఒకే ఒక బలిమూలముగ ఆయనశాశ్వతముగ పరిపూర్ణులుగ చేసెను.

15. పవిత్రాత్మ కూడ దీనికి సాక్షియే. ప్రథమమున ఆయన ఇట్లు చెప్పెను:

16. “ఆ దినములు కడచిన తరువాత వారితో నేనొక నిబంధన చేసికొందును. నా శాసనములను వారి హృదయములందు ఉంచుదును. వారి మనస్సులపై వ్రాయుదును.”

17. తరువాత ఆయన, “వారి అపరాధములను, దుష్కార్యములను, నేను ఇక ఎంత మాత్రము జ్ఞాపక ముంచుకొనను” అని పలికెను.

18. కనుక ఇవి క్షమింపబడినపుడు పాపపరిహారార్థమైన బలి ఇక అవసరములేదు.

19. సోదరులారా! యేసు రక్తమువలన, పవిత్ర స్థలమున ప్రవేశించుదుమని మనకు నమ్మకము కలదు.

20. తన శరీరము అను తెరద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరచెను.

21. దేవుని గృహమును నిర్వహించుటకు ఒక గొప్ప యాజకుని మనము పొంది ఉన్నాము.

22. కనుక మనము, కలుషములనుండి శుద్ధినొందిన నిష్కపటమగు హృదయములతోను, స్వచ్ఛమగు నీటితో కడుగబడిన శరీరములతోను, గట్టి విశ్వాసముతోను దేవుని సమీపింతము.

23. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును. కనుక మన నిరీక్షణను మనము దృఢముగ నిలిపియుంచుకొందము.

24. మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి, మేలు చేయుటకు పరస్పరము ప్రేరేపించుకొనుటకు దారులు కనుగొందము.

25. సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటుగా మారిన ప్పటికి మనము మాత్రము ఆ సమావేశమగుటయను అలవాటును విడనాడక, ప్రభువు దినము సమీపించుచున్నందున ఒకరిని ఒకరము మరింతగ ప్రోత్స హించుకొందము.

26. సత్యము మనకు తెలియజేయబడిన తరువాత కూడ మనము బుద్ధిపూర్వకముగ పాపములు చేయుచున్న యెడల, ఆ పాపములను తొలగింపగల బలి ఏదియును లేదు.

27. ఇక మిగిలినదేమన, భయముతో కూడినన్యాయవిచారణ, దేవుని ధిక్కరించు వారిని దహించివేయు భయంకర అగ్ని అనునవియే.

28. ఏ వ్యక్తియైనను మోషే చట్టమునకు అవిధేయుడై ప్రవర్తించి, ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యాధారములతో దోషిగ నిర్ణయింప బడినచో నిర్దయగా చంపివేయబడును.

29. అటులయినచో దేవునిపుత్రుని తృణీకరించువాని గతి, తనను పవిత్రునిగ ఒనర్చిన దేవుని నిబంధన రక్తమును నీచముగ చూచువాని గతి దయామయుడగు ఆత్మను అవమానపరచువాని గతి ఏమగునని చెప్పవలయును? అతడెట్టి నీచమగు శిక్షకర్హుడో విచారింపుడు!

30. “నేను పగతీర్చుకొందును, నేను ప్రతీకారమొనర్తును” అనియు, “ప్రభువు ఆయన ప్రజ లకు తీర్పుచెప్పును” అని చెప్పిన వానిని మనము ఎరుగుదుము.

31. సజీవుడగు దేవుని చేతులలో చిక్కుట మహాభయంకరము.

32. గతించిన దినములలో మీరు ఎట్లుండిరో జ్ఞాపకము చేసికొనుడు. ఆ దినములలో మీరు వెలు గును పొందిన తరువాత, మీరు పెక్కు బాధలకు గురియైనను, ఆ పోరాటముచే భంగపడలేదు.

33. కొన్నిమార్లు మీరు బహిరంగముగ నిందింపబడి అవమానింపబడితిరి. మరికొన్నిమార్లు మీరు ఆ విధముగ అవమానింపబడు వారితో పాలివారైతిరి.

34. బందీల బాదలలో మీరు పాలుపంచుకొంటిరి. మీ ఆస్తులన్నియు స్వాధీనపరచుకొనబడినను, వానికంటె మరింత మేలైనదియు శాశ్వతముగ నిలిచియుండునదియు మీకు మిగిలియున్నదని తెలియుటచే, మీ నష్టమును మీరు సంతోషముతో భరించితిరి,

35. కావున మీ ధైర్యమును కోల్పోకుడు. ఆ ధైర్యమే మీకు గొప్పబహుమానమును తెచ్చును.

36. దేవుని సంకల్ప మును నెరవేర్చి, ఆయన వాగ్దానఫలమును పొందు టకు మీరు ఓర్పు వహింపవలెను.

37. "ఇక కొంచెము సేపు మాత్రమే, పిమ్మట వచ్చుచున్న ఆయన రాగలడు ఆయన ఆలస్యము చేయడు.

38. నీతిమంతుడైన నా సేవకుడు విశ్వాసమూలమున జీవించును. కాని, అతడు విముఖుడైనచో, అతనియందు నా ఆత్మ ఆనందించదు.”

39. మనము విముఖులమై నశించువారము కాము. మన ఆత్మలను రక్షించుకొనుటకు మనము తగిన విశ్వాసము గలవారమై యున్నాము. 

 1. విశ్వసించుటయన, మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగ ఉండుట; మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయ ముగ ఉండుట.

2. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి.

3. కంటికి కనిపింపని వానినుండి, కంటికి కనిపించు ప్రపంచము దేవుని వాక్కుచేత సృజింప బడినదని, విశ్వాసమువలన మనకు అర్థమగుచున్నది.

4. విశ్వాసమువలన హేబెలు కయీను కంటె ఉత్తమమగు బలిని దేవునికి అర్పించెను. అట్టి విశ్వా సమువలన అతడు నీతిమంతుడని గుర్తింపు పొందెను. అతని కానుకలను ఆమోదించిన దేవుడే అందుకు సాక్షి. హేబెలు మరణించెను. కాని విశ్వాసముద్వారా అతడు ఇంకను మాటలాడుచునే ఉన్నాడు.

5. విశ్వాసమే హనోకును మృత్యువునుండి కాపా డినది. అతడు దేవునివద్దకు తీసికొనిపోబడెను. దేవుడు అతనిని గ్రహించుటచే ఎవరును అతనిని కనుగొన లేకపోయిరి. తాను తీసికొనిపోబడక పూర్వమే హనోకు దేవుని సంతోషపెట్టెనని పరిశుద్ధ గ్రంథము తెలుపు చున్నది.

6. విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోషపెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతివ్యక్తి, దేవుడు ఉన్నాడనియు, తన కొరకై వెదకువారికి ఆయన ప్రతిఫలమిచ్చుననియు విశ్వసింపవలెను.

7. తాను చూడని భవిష్యత్కాలపు విషయము లను గూర్చిన దేవుని హెచ్చరికలను నోవా వినునట్లు చేసినది అతని విశ్వాసమే. అతడు దేవునికి విధేయుడై ఒక ఓడను నిర్మించెను. దానియందే అతడును, అతని కుటుంబమును రక్షింపబడిరి. కాగా ప్రపంచము తీర్మానింపబడినది. నోవా విశ్వాసమువలన కలుగు నీతికి వారసుడాయెను.

8. విశ్వాసమే, దేవుడు పిలిచినపుడు అబ్రహాము విధేయుడగునట్లు చేసినది. అదియే దేవుడు అతనికి ఇచ్చెదనని వాగ్దానమొనర్చియున్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచటికి పోవుచున్నది తెలియకయే, అతడు తన స్వదేశమును విడిచెను.

9. విశ్వాసమువలననే, దేవుడు తనకు వాగ్దానమొనర్చిన దేశమున తానొక విదేశీయునివలె నివసించెను. దేవుని వద్దనుండి అదియే వాగ్దానమును పొందిన ఈసాకు, యాకోబులతో గుడారములయందు అతడు నివసించెను.

10. దేవునిచే నిర్మింపబడి ఏర్పరుపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురుచూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది.

11. సారా వయస్సు మరలినదైనను, విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలయన, దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను.

12. మృత తుల్యుడైన ఆ ఒక్క మనుష్యుని నుండియే, ఆకాశమునందలి నక్షత్రములవలె, సముద్రతీరమునందలి యిసుక రేణువులవలె లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను.

13. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరును మరణించిరి. దేవుడు వాగ్దానమొనర్చిన విషయములను వారు పొందలేదు. కాని చాలదూరము నుండియే వానిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమనియు, యాత్రికులమనియు వారు బహిరంగముగ ఒప్పుకొనిరి.

14. అట్లు పలుకు వారు తమకొరకు ఒక స్వదేశమును గూర్చి వెదకు చుంటిమని స్పష్టముచేయుదురు.

15. కానీ, వారు వదలివచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అటుల ఆలోచించినచో, తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండెడిది.

16. కాని వారు అంతకంటె ఉత్తమమగు దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారిచేత, వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలయన ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను.

17. దేవుడు, అబ్రహామును పరీక్షించినపుడు విశ్వాసముచేతనే అబ్రహాము తన కుమారుడగు ఈసాకును బలిగ అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైకకుమారుని బలిగ అర్పించుటకు సిద్ధపడెను.

18. “ఈసాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును” అని దేవుడు అతనితో చెప్పియుండెను.

19. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువునుండి తిరిగి పొందినట్లుగా పొందెను,

20. విశ్వాసమువలన ఈసాకు భవిష్యత్తు కొరకై యాకోబు ఏసావులను ఆశీర్వదించెను.

21. విశ్వాసమువలన యాకోబు తన మరణమునకుముందు యోసేపు కుమారులలో ఒక్కొక్కనిని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.

22. తానుమరణింపనున్న సమయమున యోసేపు విశ్వాసము చేతనే ఐగుప్తు నుండి యిస్రాయేలీయుల నిర్గమనమును గూర్చి చెప్పి, తన శరీరము ఏమి చేయవలయునో అను విషయమును గూర్చి ఉత్తరువులను ఇచ్చెను.

23. విశ్వాసమే మోషే తల్లిదండ్రులు, అతడు పుట్టినది మొదలుకొని, మూడునెలలపాటు వానిని దాచి ఉంచునట్లు చేసినది. అతడు మిక్కిలి అందమైన బాలుడని గ్రహించి, రాజాజ్ఞను ధిక్కరించుటకు వారు భయపడలేదు.

24. విశ్వాసమే, మోషే పెరిగి పెద్దవాడైన తరువాత, ఫరో కుమార్తె యొక్క పుత్రుడు అని పిలిపించుకొనుటకు నిరాకరించునట్లు చేసినది.

25. పాప పూరితములు క్షణికములగు సౌఖ్యములకంటె, దేవుని ప్రజలతో పాటు బాధలను అనుభవించుటనే అతడు ఎన్నుకొనెను.

26. ఐగుప్తులోని సమస్త ధనరాసుల కంటె, క్రీస్తుకొరకు నిందను సహించుటయే గొప్ప భాగ్యమని అతడు తలచెను. రాబోవు బహుమానముపై అతడు చూపు నిలిపెను.

27. విశ్వాసమే రాజు కోపమును లెక్కచేయక, మోషే ఐగుప్తును విడిచి వెడలునట్లు ఒనర్చినది. అగో చరుడగు దేవుని తాను దర్శించెనో అనునట్లు అతడు వెనుకకు మరలలేదు.

28. మృత్యుదేవత యిస్రాయేలీయుల ప్రథమ సంతానములను చంపకుండ ఉండునట్లు, మోషే పాస్కను నియమించి, ద్వారములపై రక్తమును చల్లుటకు ఆజ్ఞాపించునట్లు చేసినది విశ్వాసమే.

29. విశ్వాసమే, యిస్రాయేలీయులు ఎండిన నేలపై నడచిన విధమున రెల్లు సముద్రమును దాటునట్లు చేసినది. ఐగుప్తువారును అట్లే చేయుటకు ప్రయ త్నింపగా, నీరు వారిని మ్రింగివేసెను.

30. విశ్వాసమే, యెరికో గోడల చుట్టును యిస్రాయేలీయులు ఏడు దినములపాటు తిరిగిన తరువాత అవి కూలిపోవునట్లు చేసెను.

31. రాహాబు, గూఢచారులకు స్నేహపూర్వకమైన స్వాగతము ఒసగుటచే, దేవునికి అవిధేయులైన వారితో పాటు చంపబడకుండ, విశ్వాసమే వేశ్యయగు ఆమెను కాపాడెను.

32. ఇంకను చెప్పవలెనా? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూవేలు అనువారిని గూర్చియు, ప్రవక్తలను గూర్చియు వివరించుటకు చాలినంత సమయము లేదు.

33. విశ్వాసమువలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి. న్యాయమైన వానిని మాత్రమే చేసి, దేవుని వాగ్దానఫలమును పొందిరి. వారు సింహముల నోళ్ళను మూసిరి.

34. భయంకరమైన అగ్నులను చల్లార్చిరి. ఖడ్గముల మూలమున మృత్యువువాత పడకుండ తప్పించు కొనిరి. వారు బలహీనులైనను, బలవంతులుగ మారిరి. వారు యుద్ధములందు మహాశక్తిమంతులై శత్రు సైన్య ములను ఓడించిరి.

35. కొందరు స్త్రీలు మృతులైన తమ వారిని పునర్జీవితులుగా పొందిరి. మరికొందరు స్వేచ్చను అంగీకరింపక, ఉత్తమ పునరుత్థానమును పొందుటకై హింసింపబడిరి.

36. కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తినిరి. మరికొందరు బంధింపబడి చెరసాలయందుండిరి.

37. వారు రాళ్ళచే కొట్టబడిరి, రంపములచే కోయబడిరి, కత్తితో నరకబడిరి. గొఱ్ఱెలయొక్కయు, మేకలయొక్కయు తోళ్ళను కప్పుకొని శ్రమలు, హింసలననుభవించుచు దరిద్రులవలె వారు వీధులవెంట తిరిగిరి.

38. ఈ ప్రపంచము వారికి యోగ్యమైనదికాదు! శరణార్థులవలె వారు ఎడారులలో పర్వతములయందును సంచరించుచు గుహలలోను, సొరంగములలోను తలదాచుకొనిరి.

39. వారి విశ్వాసమువలన వారు ఎంతటి ఘనతను సాధించిరో గదా! అయినను దేవుడు వాగ్ధానమొనర్చినది ఏదియో అది వారు పొందలేదు.

40. ఏలయన మనకొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను. మనతోనే వారిని పరిపూర్డులను చేయవలెనని ఆయన ఆశయము. 

 1. ఈ మహాసాక్షీ సమూహము మేఘమువలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనలను పెనవేసికొని ఉన్న పాపములను వదల్చుకొని, మనయెదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగిడుదము.

2. మన విశ్వాసమునకు కారకుడును, పరిపూర్ణతను ఒసగువాడును అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడిప్రక్కన కూర్చుండియున్నాడు.

3. ఆయన ఎట్టి పాట్లుపడెనో, పాపాత్ముల విద్వేషమునెట్లు సహించెనో ఆలోచింపుడు! కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు. నీరసపడి పోవలదు.

4. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు.

5. పుత్రులుగ మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములగు మాటలను మరచితిరా? "కుమారుడా! ప్రభువు నిన్ను శిక్షించినపుడు శ్రద్ధవహింపుము. ఆయన నిన్ను మందలించినపుడు నీవు నిరుత్సాహపడకుము.

6. ఏలయన, దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును.”

7. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలయును. ఏలయన దేవుడు మిమ్ము తన కుమారులనుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు?

8. ఆయన పుత్రులందరి వలెనే మీరు శిక్షింపబడక పోయినచో, మీరు నిజమైన కుమారులు కారు. అక్రమ పుత్రులు మాత్రమే.

9. మన తండ్రులు మానవులే అయినను వారు మనలను శిక్షించిరి. మనము వారిని గౌరవించితిమి. అయినచో మన ఆధ్యాత్మిక పితకు మనము ఎంత విధేయులమై జీవించవలెనో కదా!

10. వారికి మంచిదని తోచిన విధమున మన తండ్రులు ఈ కొలదిపాటి జీవితమునకై మనలను శిక్షించిరి. కాని ఆయన పవిత్రత యందు మనము పాలుపంచుకొనుటకై మన మేలు కొరకే దేవుడు మనలను శిక్షించును.

11. మనము శిక్షింపబడినపుడు మనకది దుఃఖకరముగనే తోచునుకాని, సంతోషకరము కాదు. కాని తదనంతరము, అట్టి దండనచే క్రమశిక్షణ పొందినవారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు.

12. కుంటువడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాళ్ళను దృఢముగ నిలబెట్టుడు.

13. కుంటు వడిన కాలు శక్తివిహీనము కాకుండ స్వస్థతపొందుటకు ఋజుమార్గములనే అనుసరింపుడు.

14. తోడి ప్రజలతో ప్రశాంత జీవితమునకై ప్రయత్నింపుడు. పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు.

15. దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరును తప్పిపోకుండునట్లు జాగ్రత్త వహింపుడు. చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోకుండునట్లు జాగ్రత్తపడుడు.

16. ఒక్కపూట తిండి కొరకు జేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏసావువలె ఎవరును వ్యభిచారియును, భ్రష్టుడును కాకుండ శ్రద్ధ వహింపుడు.

17. తరువాత అతడు తన తండ్రి దీవెనలను పొందగోరినను నిరసింపబడెనని మీకు తెలియును. తానొనర్చిన వానిని దిద్దుకొనుటకు కన్నీటితో వెదకినను అతడు మార్గ మును కనుగొనలేక పోవుటయే దానికి కారణము.

18. స్పర్శచే గ్రహింపగలిగినట్టియు, మంటలను ఎగజిమ్ముచున్నట్టి కొండకును, అగ్నికి, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానునకును,

19. బాకా ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి యుండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక్క మాటయైనను వినవలసిన అవసరములేకుండ చేయుమని వేడుకొనిరి.

20. ఏలయన, “ఒక జంతువైనను సరే, ఆ పర్వతమును తాకిన రాళ్ళతో కొట్టి చంపబడవలెను” అను ఆజ్ఞను వారు భరింపలేకపోయిరి.

21. ఆ దృశ్యము మహాదారుణముగ ఉండుట చేతనే “నేను భయముతో వణకుచున్నాను” అని మోషే పలికెను.

22. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకును, వేలకొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని యొక్క నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి,

23. పరలోకమున పేర్లు వ్రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుజులందరకును తీర్పరి అగు దేవుని వద్దకును, పరిపూర్ణులుగ చేయబడిన నీతిమంతులైనవారి ఆత్మల వద్దకును మీరు వచ్చితిరి.

24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు వద్దకును, హేబెలు రక్తముకంటె ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణరక్తము వద్దకు మీరు వచ్చితిరి.

25. కనుక జాగ్రత్త వహించి ఆయన మాటలను వినుటకు నిరాకరింపకుడు. భూమి మీదనుండి హెచ్చరించిన వానిని వినుటకు నిరాకరించినవారు తప్పించుకొనలేక పోయిరి. ఇక పరలోకమునుండి హెచ్చరించువానిని మనము తిరస్కరించినచో మనము మాత్రము ఎంతగ తప్పించుకొనగలము?

26. అప్పుడు ఆయన స్వరము భూమిని కంపింపజేసెను. కాని ఇపుడు, “నేను ఇంకొకసారి భూమినే కాక పరలోకమునుకూడ కంపింపచేయుదును” అని ఆయన వాగ్దానమొనర్చియున్నాడు.

27. సృష్టించబడిన వాటిలో కంపింపబడినవి తొలగించబడి, కంపింపబడనివి మాత్రమే నిలకడగానుండునని, “ఇంకొక సారి” అను మాట స్పష్టముగా నిరూపించుచున్నది.

28. సుస్థిరమైన రాజ్యమును పొందుచున్న మనము కృతజ్ఞులమై యుందుము, భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన విధముగ ఆయనను పూజింతము.

29. ఏలయన, మన దేవుడు దహించు అగ్నియై ఉన్నాడు. 

 1. సోదరులుగ ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు.

2. పరాయి వారికి ఆతిథ్య మొసగుటలో అశ్రద్ధ చేయకుడు. దానివలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి.

3. మీరును వారితోపాటు ఖైదీలైనట్లుగ, చెరసాల యందున్న వారిని స్మరింపుడు. మీరును శరీరముతో ఉన్నారు కనుక బాధలనొందుచున్నవారిని స్మరింపుడు.

4. వివాహము అన్ని విషయములలోను ఘనమైనది. వివాహబంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏలయన, అవినీతిపరులును, వ్యభిచారులును, దేవుని తీర్పునకు గురియగుదురు.

5. ధనాపేక్షనుండి మీ జీవితములను దూరముగ ఉంచుకొనుడు. ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలయన, “నేను మిమ్ము ఎన్నడును విడువను. ఏనాటికిని ఎడబాయను” అని దేవుడు చెప్పెను.

6. కనుక, ధైర్యముతో మనము “ప్రభువు నాతోడు నీడ, నేను భయపడను! మానవుడు నన్ను ఏమి చేయగలడు?” అని పలుకుదము.

7. దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలచుకొనుడు. వారు ఎట్లు జీవించి మృతిచెందిరో విచారించి వారి విశ్వాసమును అనుసరింపుడు.

8. నిన్నను, నేడును, ఎల్లపుడును యేసుక్రీస్తు ఒకే రీతిగ ఉండును.

9. విభిన్నములును, విచిత్రములైన బోధనలు మిమ్ము సన్మార్గమునుండి మరల్పనీయకుడు. ఆహార నియమములకు విధేయులమై ఉన్నదాని కంటె, దేవుని అనుగ్రహమువలన మన ఆత్మలు దృఢపరుపబడుట ఉత్తమము. ఆ నియమములను పాటించినవారికి అవి సహాయపడలేదు.

10. యూదుల గుడారమున సేవలనర్పించు యాజకులకు, మన బలిపీఠముపై అర్పింపబడిన బలిని భుజించుటకు ఎట్టి అర్హతయును లేదు.

11. యూదుల ప్రధానయాజకుడు పాపములకు బలిగ అర్పించుటకు ఏ జంతువుల రక్తమును పవిత్ర స్థలము లోనికి తెచ్చునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల దహింపబడును.

12. ఈ కారణముననే, తన రక్తముచే ప్రజలను పాపములనుండి శుద్ది యొనర్చుటకు యేసు గూడ నగర ద్వారమునకు వెలుపలనే మరణించెను.

13. కనుక మనమును శిబిరము వెలుపలకు వెడలి ఆయన అవమానమున పాలుపంచుకొందము.

14. ఈ భూమిపై మనకు స్థిరమగు నగరము ఏదియులేదు. ఇకముందు రాగల నగరమును గూర్చి మనము ఎదురుచూచు చున్నాము.

15. కావున, యేసుద్వారా నిరంతరము మనము దేవునకు స్తోత్రబలులను అర్పింతము. అనగా ఆయన నామమునకు మనము ముక్తకంఠముతో నిరంతరము కృతజ్ఞతలను అర్పింతము.

16. ఒకరికొకరు మేలొనర్చి ఉన్న దానిలో పాలుపంచుకొనుట మరువకుడు. ఇవియే దేవునికి ప్రీతికరమైన బలులు.

17. మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. వారి సేవలను గూర్చి వారు దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారివలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకొని ఉన్నారు. మీరు వారికి విధేయులె ఉన్నచో వారు వారి కర్తవ్యమును సంతోషముగ నెరవేర్తురు. కానిచో తమ పనిని విషాదముతో చేయుదురు. అప్పుడు అది మీకు నిష్ప్రయోజనము.

18. మా కొరకై సదా ప్రార్ధింపుడు. సర్వదా మనము సత్కార్యములనే ఒనర్పవలెనను తలంపు కలవారమగుటచే, మనము స్వచ్చమగు అంతఃకరణ మును కలిగి ఉన్నామనుట నిశ్చయము.

19. త్వర లోనే నన్ను మీ వద్దకు చేర్చుటకై దేవుని ప్రార్థింపవలసినదిగ మిమ్ము బతిమాలుచున్నాను.

20. గొఱ్ఱెల గొప్పకాపరియైన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలోనుండి లేపిన,

21. సమాధానకర్తయైన దేవుడు, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఉత్తమ విషయములను పొందుపరచునుగాక! ఆయనకు ఏది యిష్టమగునో అది యేసు క్రీస్తు ద్వారా మనయందొనర్చునుగాక! యేసు క్రీస్తునకు యుగయుగములకు మహిమ కలుగును గాక! ఆమెన్.

22. సోదరులారా! ఈ నా హెచ్చరికను సహనముతో ఆలకింపవలసినదిగ మిమ్ము వేడుకొనుచున్నాను. నేను మీకు వ్రాసిన ఈ లేఖ అంత పెద్దది కాదు.

23. మన సోదరుడగు తిమోతి చెరసాలనుండి విడుదల అయ్యెనని తెలిసికొనగలరు. అతడు త్వరలో వచ్చినచో నేను మిమ్ము చూచుటకు వచ్చినపుడు వెంట తీసికొనిరాగలను.

24. మీ నాయకులకు అందరకును, దేవుని ప్రజలకును, మా శుభాకాంక్షలను అందింపుడు. ఇటలీ దేశపు సోదరులు మీకు శుభాకాంక్షలు చెప్పుచున్నారు.

25. దేవుని కృప మీ అందరితో ఉండునుగాక!