ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ

 1. దైవసంకల్పముచే యేసుక్రీస్తు అపోస్తలుడగు పౌలు, క్రీస్తుయేసునందు విశ్వాసులైన ఎఫెసు లోని పవిత్ర ప్రజలకు వ్రాయునది:

2. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తునుండియు మీకు కృపయు, శాంతి కలుగును గాక!

3. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక! క్రీస్తునందు దేవుడు, మనలను ఆశీర్వదించి, మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగుచున్నాడు!

4. ఆయనఎదుట మనము పవిత్రులముగను, నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగ ఎన్నుకొనెను.

5. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన, క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగ తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించు కొనియుండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము.

6. దేవుడు తన కుమారునిద్వారా మనకు ఉచితముగా ఒసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము.

7. క్రీస్తు రక్తమువలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపాఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి.

8. ఆయన మనకు అంత ఉదారముగా ఒసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది గదా!

9. తన సంపూర్ణజ్ఞానముచేతను, విషయ పరిచయముచేతను, దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక, క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను.

10. దివియందలి, భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున, ఒకటిగా చేయుటయే దేవుని ప్రణా ళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెర వేర్చును.

11. సమస్తము దేవుని ప్రణాళికను, నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక, ఆదియందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి, దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు, తన ప్రజలుగ ఎన్నుకొనెను.

12. కనుక, క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమ ఫలమైన మనము దైవమహిమను స్తుతింతుముగాక!

13. మీ విషయములోను అంతే! మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్యసందేశమును మీరు ఆలకింపగనే మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతట తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తనవారుగ దేవుడు ధృవ పరచెను.

14. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగ మనము పొందుదుము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతుముగాక!

15. యేసు ప్రభువునందలి మీ విశ్వాసమును, పవిత్ర పజలందరిని గూర్చిన మీ ప్రేమను నేను వినియుంటిని. ఈ కారణముననే

16. మీ కొరకై దేవునకు కృతజ్ఞతలను అర్పించుట నేను ఏనాడును విరమింపలేదు. నా ప్రార్థనలలో మిమ్ము స్మరించి,

17. మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగ, మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును, మహిమాన్వితుడును అగు తండ్రిని అర్ధించు చుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగ, ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి, దేవుని మీకు విదిత మొనర్చును.

18. ఆయన వెలుగును చూచునట్లుగ మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే, ఆయన మిమ్ము చేరబిలిచిన, ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్ధానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో,

19. విశ్వాసులమగు మనలో వున్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలిసికొనగలరు.

20. క్రీస్తును మృత్యువునుండి లేవనెత్తి పరలోకమున తన కుడిప్రక్కన కూర్చుండబెట్టుకొనినపుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది.

21. దివ్యులగు ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, నాథులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహపర లోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు.

22. దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను.

23. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్ర సర్వమును పరిపూర్ణము చేయ గల ఆయనయొక్క పరిపూర్ణత్వమే దైవసంఘము. 

 1. మీ అపరాధముల వలనను, పాపముల వలన గతమున ఆధ్యాత్మికముగ మీరు మృతులైతిరి కాని, ఆయన మిమ్ము బ్రతికించెను.

2. అప్పుడు మీరు లోకముయొక్క పోకడను అనుసరించితిరి. వాయు మండల సంబంధమైన అధిపతికి మీరు విధేయు లైతిరి. దేవునకు అవిధేయులగువారికి ఆ ఆత్మయే ఇప్పుడు అధిపతి.

3. నిజముగ మనము అందర మును అట్లే ఉంటిమి. శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించితిమి. మన బుద్ధికిని, శరీరమునకును ప్రీతికరమైన వాంఛలను తీర్చుకొంటిమి. కనుక ఇతరులవలెనే మనమును దేవుని ఆగ్రహమునకు గురి కావలసిన వారమైతిమి.

4. కాని, దేవునికృప అపారము. మనపట్ల ఆయన ప్రేమ అమితము.

5. కనుకనే అపరాధములవలన ఆధ్యాత్మికముగ నిర్జీవులమై ఉన్న మనలను, క్రీస్తుతో కూడ ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి.

6. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుటవలన, ఆయనతోపాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండచేసెను.

7. క్రీస్తు ద్వారా మనయందు ఆయన ప్రదర్శించిన ప్రేమవలన, క్రీస్తుయేసునందు తన అను గ్రహ వైభవము ఎట్టిదో నిదర్శన పూర్వకముగ రాబోవు యుగములకు ప్రదర్శించెను.

8. ఏలయన, విశ్వాసము ద్వారా, దేవునివరమువలననే, మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయంకృతం కాదు. దేవుని వరమే.

9. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమియును లేవు.

10.మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము. క్రీస్తుయేసుద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మనకొరకై సిద్ధపరచియే ఉంచెను.

11. పూర్వము మీరెట్లుండిరో స్మరింపుడు. ఒక ప్పుడు మీరు శారీరకముగా అన్యులైయుంటిరి. శరీర మందు హస్తములచే సున్నతి పొందినవారిచే సున్నతి లేనివారుగా పిలువబడితిరి.

12. అప్పుడు మీరు క్రీస్తు నుండి వేరుచేయబడి ఉంటిరి. మీరు పరదేశీయులు. దేవునిచే ఎన్నుకొనబడిన యిస్రాయేలీయులు వారి లోనివారు కారు. దేవుడు తన ప్రజల కొనర్చిన వాగ్ధాన ములపై ఆధారపడిన నిబంధనలతో మీకు సంబంధము లేదు. నిరీక్షణగాని, దేవుడుగాని లేకుండ మీరు ఈ ప్రపంచమున జీవించితిరి.

13. కాని ఇప్పుడు క్రీస్తుయేసునందు ఏకమగుటతో, దూరముగనున్న మీరు క్రీస్తు రక్తమువలన సమీపమునకు తీసికొనిరాబడితిరి.

14. యూదులను, అన్యులను ఏకమొనర్చుటద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. వారిని వేరుచేసి, విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంసమొనర్చెను.

15. ఆ రెండు జాతులనుండి, తనతో ఏకత్వమునొందిన ఒకే నూతనజాతిని సృజించి, శాంతినెలకొల్పుటకై శాసనములతో, సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను.

16. సిలువపై తాను మరణించుటవలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన రెండు జాతులను ఏకమొనర్చి, మరల దేవునిదరికి చేర్చెను.

17. కనుక క్రీస్తు విచ్చేసి, దేవునకు దూరముగ ఉన్న అన్యులగు మీకును, దేవునకు సమీపముగనున్న యూదులందరికిని సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను.

18. కనుక మన మిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము.

19. కనుక, అన్యులారా! మీరు ఇక పరదేశులును, పరాయివారును కారు. మీరు ఇపుడు పరిశుద్దులు, దైవ ప్రజలతో సహపౌరులు. దేవుని కుటుంబములో సభ్యులు.

20. క్రీస్తుయేసు మూలరాయిగా అపోస్తలుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునా దిపై మీరును నిర్మింపబడినవారే.

21. ఆ భవనము నంతయు ఒకటిగా నిలిపి, దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే.

22. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మద్వారా నివసించును.

1. ఇందువలననే అన్యులగు మీకొరకై, క్రీస్తుయేసు బందీనైన పౌలునగు నేను, దేవుని ప్రార్ధించుచున్నాను.

2. మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించెనని మీరు నిశ్చయముగా వినియుందురు.

3. దేవుడు తన దైవదర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని.

4. నేను వ్రాసిన దానిని మీరు చదివినచో, క్రీస్తు రహస్యమును నేను గ్రహించితినని మీకు తెలియగలదు.

5. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు. కాని, నేడు దేవుడు తన ఆత్మ మూలమున పవిత్రులగు అపోస్తలులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను.

6. అనగా, సువార్తవలన అన్యులకును యూదులతోపాటు దేవుని దీవెనలలో పాలులభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తుయేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్తులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము.

7. దేవుని విశేషవరముచే నేను ఈ సువార్తికరణ సేవచేయువాడనైతిని. ఆయన తన శక్తి ప్రభావము ద్వారా దానిని నాకు ఒసగెను.

8. పవిత్రులందరిలో నేను అత్యల్పుడను. అయినను క్రీస్తు అనంత ఐశ్వర్య ములను అన్యులకు అందించువరమును దేవుడు నాకు ప్రసాదించెను.

9. దేవుని రహస్యప్రణాళిక ఎట్లు అమలు జరుపబడవలెనో మానవాళిలో ప్రతి ఒక్కరు గ్రహించునట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను.

10. ఏలయన, దివ్యలోకము నందలి ప్రభువులకును, శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవసంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటుల చేసెను.

11. తన శాశ్వత ఉద్దేశానుసారముగనే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను.

12. ఆయనయందలి విశ్వాసమువలనను, ధైర్యముతో మనము దేవునిసన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది.

13. మీ కొరకై నేను శ్రమనొందు చున్నానని మీరు నిరుత్సాహపడవలదని మనవి చేయుచున్నాను. అది అంతయు మీ మహిమ కొరకే గదా!

14. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను.

15. దివియందలి, భువియందలి ప్రతికుటుంబము తన నిజమైన నామమును ఆతండ్రి నుండియే పొందుచున్నది.

16. మీరు ఆంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మద్వారా శక్తిని ప్రసాదించుమని దేవుని అర్థించుచున్నాను.

17. విశ్వాసమువలన క్రీస్తు మీ హృదయములయందు నివాసమేర్పరచు కొనునుగాక అనియు ప్రార్ధించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొనిపోయి, వేళ్లూనికొని పోయి,

18. పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింప గల శక్తికల వారు కావలెననియు దేవునకు నా విన్నపము.

19. మీ గ్రహణశక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలిసికొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగ నింపబడుదురు గాక!

20. మనయందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటెను, ఊహించుదాని కంటెను, ఎన్నియో రెట్లు అధికముగ నెరవేర్పగల,

21. ఆ దేవునకు, దైవ సంఘమునందును, క్రీస్తు యేసునందును, తరతరములు సదా మహిమ కలుగునుగాక! ఆమెన్.  

 1. ప్రభు సేవకుడనగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిననాడు దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధముగ జీవింపుడు

2. మీరు ఎల్లప్పుడును సాధువులుగను, సాత్త్వికులు గను, సహనశీలురుగను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు.

3. మిమ్ము ఒకటిగ బంధించు శాంతిద్వారా ఆత్మ ఒసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగ ప్రయత్నింపుడు.

4. శరీరము ఒకటే. ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకేగదా!

5. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము,

6. ఒకేదేవుడు, మానవులందరకు ఒకేతండ్రి. ఆయన అందరికి పైగా, అందరిద్వారా, అందరియందు ఉండువాడు.

7. క్రీస్తు ఒసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతివ్యక్తియు ఒక్కొక్క విశేషవరమును పొందెను.

8. “ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినపుడు చెరలోని వారిని జయించి వెంట తీసికొనిపోయెను మనుజులకు వరములను ఒసగెను” అని లేఖనము పలుకుచున్నది.

9. అయినచో “ఎక్కి వెళ్ళినపుడు” అనగా ఏమి? అనగా మొదట ఆయన దిగివచ్చెననియే గదా? అనగా భూలోకపులోతులకు అనియేగదా తాత్పర్యము.

10. కనుక లోకమునంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశమునకంటె అత్యున్నత స్థితిని చేరినవాడే క్రిందికి దిగివచ్చినవాడు.

11. “మానవులకు వరములు ఇచ్చినది” ఆయనయే. ఆయన కొందరిని అపోస్తలులుగను, కొందరిని ప్రవక్తలుగను, కొందరిని సువార్తీకులుగను, కొందరిని కాపరులుగను బోధకులుగను నియమించెను.

12. క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుపడుటకు పవిత్రులెల్లరను సిద్ధము చేయుటకు ఆయన ఇనర్చెను.

13. కనుక మనము అందరము విశ్వాసము విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను, ఏకత్వము పొంది, సంపూర్ణ పురుషులముకాగలము; అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము.

14. అప్పుడు ఇంక మనము పసిబిడ్డ లము కాము. తమ టక్కరిజిత్తులతో ఇతరులను తప్పుత్రోవన నడుపు మోసగాండ్ర బోధల గాలి తాకిడికిని, అలలపోటునకును కొట్టుకొనిపోము.

15. అంతే కాక, ప్రేమతో సత్యము పలుకుటవలన సర్వవిధముల క్రీస్తునందు వృద్ధిచెందవలెను. ఆయన మనకు శిరస్సు,

16. ఆయన నిర్వహణలో దేహముయొక్క సర్వాంగములును స్వస్థానములందు నిలిచి ఉండును. దేహమంతయు తనకు అమర్చబడిన కీళ్ళతో పొందిక అగును. అప్పుడు ప్రతి అవయవమును సక్రముగ పనిచేసినచో, దేహము అంతయు ప్రేమ ద్వారా పెంపొందును.

17. ప్రభు నామమున నేను ఇట్లు వక్కాణించు చున్నాను. ఉపయోగములేని ఆలోచనలు కలవారును,

18. అంధకారమయమగు మనస్సులు కలవారును అయిన అన్యజనులవలె మీరు ఇక ప్రవర్తింప రాదు. వారు అవివేకులును మూర్ఖులును అగుటచే దేవుని జీవితమునుండి దూరమైరి.

19. వారికి సిగ్గు లేదు.వారు దురభ్యాసములకు తమను తాము అర్పించు కొని, అత్యాశతో విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరములగు పనులను చేయుచుందురు.

20. మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొనినది అది కాదుగదా!

21. ఆయనను గూర్చి నిశ్చయముగ మీరు వినియున్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది.

22. కనుక మీ పూర్వ జీవితపు పాతస్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము, మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది.

23. మీ మనస్తత్వమును నూత్నీకరించుకొనుడు.

24. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు.

25. కనుక ఇక అసత్యములు పలుకరాదు! ప్రతి వ్యక్తియు తన సోదరునితో సత్యమునే పలుక వలయును. ఏలయన, క్రీస్తుదేహమున మనము అందరమును పరస్పర సంబంధముగల సభ్యులమే కదా!

26. కనుకనే ఒకవేళ మీకు కోపము వచ్చినచో, ఆ కోపము మిమ్ము పాపములోనికి లాగుకొనిపోకుండ చూచుకొనుడు.సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలెను.

27. సైతానునకు అవకాశము ఒసగకుడు.

28. దొంగ, దొంగతనము మానివేసి, అక్కరగల వానికి పంచి పెట్టగలందులకై తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.

29. సంభాషణలలో దుర్బాషలు రానీయక అది వినువారికి మేలు కలుగునట్లు చూడవలెను. సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదింపగల అనుకూల వచనమునే పలుకుడు.

30. దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలయన, ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము గదా! అంతే కాదు. దేవుడు మీకు స్వేచ్ఛను ఒసగెడు దినము రానున్నది అనుటకు అది నిదర్శనము కూడ.

31. వైరము, మోహము, క్రోధము అనువానిని త్యజింపుడు. అరపులు గాని, అవమానములు గాని ఇక ఉండరాదు. ఏవిధమైన ద్వేషభావము ఉండరాదు.

32. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. 

 1. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక, ఆయనను పోలి జీవింపుడు.

2. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను మనకొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు.

3. మీ మధ్య జారత్వము, అపవిత్రత, లోభితనము అనునవి పేరుకైనను ఎత్తకూడదు. ఇదే పవిత్రులకు తగినది.

4. అంతేకాక, అసహ్యకరములును, అవివేక పూరితములును, అపవిత్రములునైన పదములనువాడుట మనకు తగదు. మీరు దేవునికి కృతజ్ఞులై ఉండవలెను.

5. మీరు ఈ విషయము దృఢముగ నమ్మవచ్చును. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, లోభియైనను (అనగా విగ్రహారాధకుడును), క్రీస్తు రాజ్యములో, దేవునిరాజ్యములో వారసత్వము పొందడు.

6. ఎవరును మిమ్ము వ్యర్థపుమాటలతో మోస పుచ్చకుండ చూచుకొనుడు. ఈ కారణము వలననే, ఆయనకు అవిధేయులైన వారిపై దేవుని ఆగ్రహము వచ్చును.

7. కనుక అట్టి వారితో ఏ సంబంధమును పెట్టుకొనకుడు.

8. ఒకప్పుడు మీరును చీకటిలో ఉండినవారే. కాని ఇపుడు ప్రభువు నందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను.

9. ఏలయన వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి. సత్యము అనువానియందు కనపడును.

10. ప్రభువును ఆనందపరచునది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు.

11. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములగు పనులు చేయు వారితో ఎట్టి సంబంధమును కలిగి ఉండరాదు. అంతేకాక వారిని కూడ వెలుగులోనికి తెండు.

12. వారు రహస్యముగ చేయు పనులనుగూర్చి మాట్లాడుటకు కూడ చాల సిగ్గు కలుగుచున్నది.

13. సమస్తమును వెలుగులోనికి తీసికొని రాబడినప్పుడు అంతయు గోచరమగును. గోచరమగు నట్లు చేయునది వెలుగే.

14. కనుకనే, “నిద్రితుడా! మేల్కొనుము, మృతులలోనుండి లెమ్ము! క్రీస్తు నీపై ప్రకాశించును” అని చెప్పబడినది.

15. కనుక, మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధవహింపుడు. జ్ఞాన హీనులవలె జీవింపకుడు. వివేకవంతులవలె జీవింపుడు.

16. ఇవి చెడుదినములు కనుక దొరికిన ప్రతి అవకా శమును సద్వినియోగము చేసికొనుడు.

17. మూర్ఖులు కాక, మీరేమి చేయవలెనని దేవుని చిత్తమో గ్రహించు టకు ప్రయత్నింపుడు.

18. మద్యపానముతో మత్తిల్లకుడు. అందునుండే జారత్వమును కలుగును. దానికి బదులుగా ఆత్మ పూరితులుకండు.

19. ఒకరితో ఒకరు కీర్తనలతోను, స్తోత్రములతోను, పవిత్రగీతములతోను సంభాషింపుడు. హృదయపూర్వకముగ పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను, స్తోత్రములను పాడుడు.

20.మన ప్రభువగు యేసు క్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు.

21. క్రీస్తునందుగల గౌరవముచే, పరస్పరము విధేయులై ఉండుడు.

22. భార్యలారా! ప్రభువునకు విధేయులైనట్లే, మీ భర్తలకును విధేయులై ఉండుడు.

23. భర్తకు భార్య పై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు.

24. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలుకూడ తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను.

25. భర్తలారా! క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దానికొరకై తన ప్రాణములు అర్పించెనో, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు.

26. ఆమెను వాక్కుచే కడిగి, శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటుల చేసెను.

27. మచ్చకాని, ముడుతకాని, మరేది కాని లేకుండ ఆమెను తనకు దివ్యముగా సమర్పించు కొనుటకును, ఆమె పవిత్రముగను నిర్దోషిగను ఉండుటకును ఆయన అటుల చేసెను.

28. తమ దేహములను తాము ప్రేమించునట్లే పురుషులు తమ భార్యలనుకూడ ప్రేమింపవలెను. ఏలయన, తన భార్యను ప్రేమించువ్యక్తి తనను తాను ప్రేమించుకొనును.

29. ఎవడును తన దేహమును ద్వేషింపడుగదా! దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించునట్లే, వాడు దానిని పోషించుచు, దాని విషయమై శ్రద్ధవహించును.

30. ఏలయన, మనము ఆయన శరీరములో సభ్యులమే కదా!

31. “ఇందువలననే, పురుషుడు తన తల్లిదండ్రులను వదలి భార్యతో ఐక్యమగును. వారు ఇరువురును ఏకశరీరులగుదురు.” అని లేఖనము పలుకుచున్నది.

32. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢసత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును, శ్రీసభకును వర్తించునని నా భావన.

33. కాని అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలయును. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలయును. 

 1. బిడ్డలారా! ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఇది మీ ధర్మము.

2. “నీ తల్లిదండ్రులను గౌరవింపుము. అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ: అప్పుడు,

3. నీకు క్షేమము కలుగును. నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదువు”.

4. తండ్రులారా! మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను, ప్రభువు బోధనలోను పెంచుడు.

5. బానిసలారా! మానవులగు మీ యజమానులకు విధేయత చూపుడు. వారిని గూర్చి భయముతోను వణకుతోను నడువుడు. కాని క్రీస్తునే సేవించు చున్నట్లుగ హృదయపూర్వకముగ అటుల చేయుడు.

6. వారి ముఖప్రీతికొరకై వారు చూచుచున్నపుడు మాత్రమే కాక, క్రీస్తు సేవకులుగ దేవుని సంకల్పమును హృదయపూర్వకముగ చేయుడు.

7. సేవకులుగ మీ పనిని సంతోషముతో చేయుడు. కేవలము మానవులను సేవించుచుంటిమి అనుకొనక, ప్రభు సేవ చేయుచుంటిమి అని భావింపుడు.

8. సేవకుడు కానిండు, స్వతంత్రుడు కానిండు, అతడు చేసిన పనికి దేవుడు ప్రతివ్యక్తిని బహూకరించునను మాట జ్ఞాపకము ఉంచుకొనుడు.

9. యజమానులారా! మీ బానిసలపట్ల మీరును అట్లే ప్రవర్తింపుడు. వారిని భయపెట్టుట మానివేయుడు. మీరును మీ సేవకులును పరలోకమునందలి ఒకే యజమానునికి సంబంధించిన వారను మాట జ్ఞాపకము ఉంచుకొనుడు. ఆయన యందు పక్షపాతము ఉండదు.

10. చివరిగా, ప్రభువుతో ఏకమై, ఆయన మహా శక్తి ద్వారా, మీ బలమును అభివృద్ధిపరచుకొనుడు.

11. సైతాను టక్కరిజిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు.

12. ఏలయన, మనము పోరాడునది రక్తమాంసములతో నుండు శరీరధారులతో కాదు! ప్రధానులతోను, అధికారులతోను, ఈ యుగపు అంధకార శక్తులతోను, ఆకాశమందలి దురాత్మలతోను మనము పోరాటము చేయుచున్నాము.

13. కనుక ఇపుడు దేవుని పూర్ణకవచమును ధరింపుడు! ఆ దుష్టదినము వచ్చిననాడు మీరు శత్రుబలములను ఎదుర్కొనగలిగి, తుదివరకు పోరాడి నిలదొక్కుకొందురు.

14. కనుక, సిద్ధపడుడు. సత్యమును నడుమునకు తోలుదట్టిగా బిగింపుడు. నీతిని కవచముగా ధరింపుడు.

15. శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకైన సంసిద్ధతను మీ పాదరక్షలుగ చేసికొనుడు.

16. అన్ని సమయములందును, విశ్వాసమును డాలుగ చేసికొనుడు. దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటిని దానితో ఆర్పివేయగలరు.

17. రక్షణను శిరస్త్రాణముగను, దేవుని వాక్కును ఆత్మయొసగు ఖడ్గముగను, మీరు గ్రహింపుడు.

18. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును, విజ్ఞాపనములతో ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండుడు. పవిత్ర ప్రజల కొరకై సదాప్రార్థింపుడు.

19. ధైర్యముగా నోరువిప్పి మాట్లాడుచు సువార్త పరమరహస్యమును ప్రకటించుటకు నాకు అవకాశము కలుగునట్లు ప్రార్థింపుడు.

20. ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంకెళ్ళతో ఉన్నాను. కనుక నేను దానిని గూర్చివలసినంత ధైర్యముతో ప్రకటించునట్లు ప్రార్థింపుడు.

21. దైవసేవలో మన ప్రియ సోదరుడును, విశ్వాసపాత్రుడైన సేవకుడును అగు తుకికు నేను ఎట్లు జీవించుచున్నానో సమస్తమును మీకు తెలియజేయగలడు.

22. కనుక, ఇచటి మా అందరి జీవితమును మీకు వివరించి, మీ హృదయములకు ధైర్యము చేకూర్చుటకై అతనిని మీ వద్దకు పంపుచున్నాను.

23. తండ్రి దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తును విశ్వాసముతో కూడిన సోదరులకు అందరకును, శాంతిని, ప్రేమను ప్రసాదించుగాక!

24. తరిగి పోని ప్రేమతో మన యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించు వారందరికి దేవునికృప తోడగునుగాక!