ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య మొదటి గ్రంధము 9వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. యిస్రాయేలీయులను వారివారి కుటుంబముల ప్రకారము గణించి వారి పేర్లను యిస్రాయేలు రాజులచరిత్రలో లిఖించిరి. యూదా నివాసులను వారి పాపములకు గాను బబులోనియాకు బందీలుగా కొనిపోయిరి.

2. ఆ ప్రవాసమునుండి మరలివచ్చి యిస్రాయేలు దేశములోని తమ నగరములను, పొలములను తిరిగి స్వాధీనము చేసికొనినవారిలో మొదటివారు యాజకులు, లేవీయులు, నెతీనీయులు'.

3. యూదా, బెన్యామీను, ఎఫ్రాయీము, మనష్షే తెగలకు చెందినవారు యెరూషలేమునకు వచ్చి అచట స్థిరపడిరి.

4-6. యూదా తెగకు చెందినవారు 690 మంది యెరూషలేమున వసించిరి. యూదా కుమా రుడైన పేరెసు వంశజులకు నాయకుడు ఉత్తయి. ఇతని పూర్వులు క్రమముగా అమ్మీహూదు, ఒమ్రి, ఇమ్రి, బాని. షేలా వంశజులకు నాయకుడు అసాయ. సెరా వంశజులకు నాయకుడు యెవూయేలు.

7-9. బెన్యామీను తెగలలో ఈ క్రిందివారు యెరూషలేమున వసించిరి. షల్లు-ఇతని పూర్వులు క్రమముగా మెషుల్లాము, హోదవ్యా, హస్సెనూయా, యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రి మనుమడును ఉజ్జి కుమారుడైన ఏలా. మెషుల్లాము - ఇతని పూర్వులు క్రమముగా షేపట్యా, రెవూవేలు, ఇబ్నియా. ఈ తెగలవారు మొత్తము 956 మంది యెరూషలేమున వసించిరి. పైన పేర్కొనబడిన వారందరు ఆయా వంశీయులకు నాయకులు.

10-13. ఈ క్రింది యాజకులు యెరూషలేమున నివసించిరి: యెదాయా, యెహోయారీబు, యాకీను. దేవళమున ప్రధానాధికారియైన అజర్యా- ఇతని పూర్వులు క్రమముగా హిల్కీయా, మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహిటూబు. అదయా - ఇతని పూర్వులు క్రమముగా యెరోహాము, పాష్షూరు, మల్కియా. మాసయి - ఇతని పూర్వులు క్రమముగా అదీయేలు, యహజేరా, మెషుల్లాము, మెషిల్లీమీతు, ఇమ్మెరు. ఆయా కుటుంబములకు నాయకులైన ఈ యాజకులు మొత్తము 1760 మంది. వారు దేవాలయ కార్యములలో నిపుణులు.

14-16. ఈ క్రింది లేవీయులు యెరూషలేమున వసించిరి: షెమాయా-ఇతని పూర్వులు క్రమముగా హష్షూబు, అజ్రీకాము, హషబ్యా, మెరారి, బక్బక్కరు, హెరేషు, గాలాలు. మత్తన్యా-ఇతని పూర్వులు క్రమముగా మీకా, సిక్రీ, ఆసాపు. షెమాయా కుమారుడు ఓబద్యా-ఇతని పూర్వులు క్రమముగా షేమాయా, గాలాలు, ఎదూతూను. నెటోఫా మండలమున జీవించిన బెరక్యా - ఇతని పూర్వులు క్రమముగా ఆసా, ఎల్కానా.

17. ఈ క్రింది దేవాలయ ద్వారపాలకులు యెరూషలేమున వారి సహోదరులతో వసించిరి: షల్లూము, అక్కూబు, తల్మోను, అహీమాను. షల్లూము వీరికి నాయకుడు.

18. వారి వంశజులు నేటివరకు దేవాలయమున తూర్పుదిశయందున్న రాజద్వారమునకు పాలకులుగా ఉండిరి. పూర్వము వీరు లేవీయుల శిబిరపు ద్వారమునకు కాపుండెడివారు.

19. కోరా మునిమనుమడును ఎబ్యాసాపు మనుమడును కోరె కుమారుడైన షల్లూము. కోరా వంశజులు సాన్నిధ్యపు గుడారము గుమ్మమునకు కాపుండెడివారు. వారి పూర్వులుకూడ ప్రభువు శిబిరమునకు కాపుండెడివారు. 

20. ఎలియెజెరు కుమారుడు ఫీనెహాసు వారికొకప్పుడు అధికారిగానుండెను. ప్రభువతనికి తోడైయుండెను.

21. మెషెలెమ్యా కుమారుడు జెకర్యాగూడ ఒకప్పుడు సాన్నిధ్యపు గుడారము గుమ్మమునకు కాపుండెడివాడు. 

22. ఈ ద్వారపాలకులందరు కలిసి 212 మంది. వారివారి గ్రామముల ప్రకారము వారిని నమోదు చేసిరి. దావీదు, సమూవేలు ప్రవక్త వారి పూర్వులను ఈ ఉద్యోగమున నియమించిరి.

23. అప్పటినుండి వారును, వారి కుమారులు దేవాలయ ద్వారములకు కావలికాయుచు వచ్చిరి.

24. ఉత్తర దక్షిణములందు, తూర్పు పడమరలందు గల నాలుగుద్వారములకు నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉండెడివారు.

25. పల్లెలలో వసించు ఆ ద్వారపాలకుల బంధువులు వచ్చి వారముపాటు ద్వారములకు కావలికాసెడివారు.

26. నలుగురు ప్రధాన ద్వారపాలకులు లేవీయులే. దేవాలయరక్షణ బాధ్యత వారిదే. దేవాలయములోని గదులను, వానిలోని సామగ్రిని కాపాడునదికూడ వారే.

27. వారెల్లరు దేవాలయము దాపున వసించిరి. వారే ఆలయాన్ని కాచునది, ఉదయము దాని తలుపులు తెరచునది.

28. ఇతర లేవీయులు ఆరాధనలోవాడు వివిధ పాత్రలమీద అధికారులుగానుండిరి. వారు ఈ పాత్ర లను ఇచ్చునప్పుడు, పుచ్చుకొనునపుడుగూడ లెక్క పెట్టెడివారు.

29. లేవీయులలో ఇంక కొందరు ఆరాధనలో వాడు పరికరముల మీద మరియు పిండి, ద్రాక్షసారాయము, నూనె, సాంబ్రాణి, సుగంధ ద్రవ్యములు మొదలైన వానిమీద అధికారులుగ నుండిరి.

30. కాని సుగంధ ద్రవ్యములను మిశ్రమము చేయువారు మాత్రము యాజకులే.

31. మత్తిత్యా అను లేవీయుడు పెనముమీద కాల్చి బలిగా అర్పించు రొట్టెలమీద అధికారిగా నుండెను. ఇతడు షల్లూము పెద్దకొడుకు, కోరా వంశజుడు.

32. ప్రతి విశ్రాంతిదినమున దేవాలయమున అర్పించు రొట్టెలను ప్రతి సబ్బాతు దినమున తగిన విధముగా వరుసక్రమములో సిద్ధముచేయు పూచీ కోహాతు వంశజులది.

33. దేవాలయమున సంగీతముపాడుట మరి కొందరు లేవీయుల పూచీ. వారి నాయకులు దేవాలయ గృహములలోనే వసించిరి. వారు రేయింబవళ్ళు గానము చేయవలయును గనుక వారికి ఇతర పనులేమి ఒప్పజెప్పరైరి.

34. పైన పేర్కొనబడిన వారు ఆయా వంశములకు చెందిన లేవీయ కుటుంబములకు పెద్దలు. ఈ నాయకులు యెరూషలేముననే వసించిరి.

35-38. గిబ్యోను తండ్రియైన యెయీవేలు గిబ్యోనున వసించెను. అతని భార్య పేరు మాకా. అతని కుమారులు వరుసగా అబ్దోను, జూరు, కీషు, బాలు, నేరు, నాదాబు, గేదోరు, అహ్యో, జెకర్యా, షిమెయాము తండ్రి మిక్లోతు. వీరి వంశజులు యెరూషలేమున తమ బంధువులచెంత వసించిరి.

39. నేరు కుమారుడు కీషు. అతని కుమారుడు సౌలు. సౌలు తనయులు యోనాతాను, మల్కీషువ, అబీనాదాబు, ఎష్బాలు.

40. యోనాతాను కుమా రుడు మెరీబ్బాలు. అతని తనయుడు మీకా.

41. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాసు. 

42-43. ఆహాసు కుమారుడు యరా'. అతని కుమారులు అలెమెతు, అజ్మావెతు, సిమ్రీ. సిమ్రీ వంశజులు క్రమముగా మోసా, బిన్యా, రెఫాయా, ఏల్యాసా, ఆసేలు.

44. ఆసేలు తనయులు అజ్రికాము, బోకేరు, యిష్మాయేలు, షేయర్యా, ఓబద్యా, హానాను.