ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యూదితు 8వ అధ్యాయము || Telugu catholic bible online

 1. అప్పుడు యూదితు ఉజ్జీయా నిర్ణయములను గూర్చి వినెను. ఆమె తండ్రితాతలు క్రమముగా మెరారి, ఓక్సు, యోసేపు, ఓసీయేలు, ఎల్కియా, అననిసు, గిద్యోను, రఫాయిము, అహిటూబు, ఏలీయా, హిల్కియా, ఎలియాబు, నతనయేలు, సలమియేలు, సరసదాయి, యిస్రాయేలు అనువారు

2. ఆమె భర్త పేరు మనష్షే, అతడు ఆమె వంశమునకు, తెగకు చెందినవాడే. అతడు యవలపంటను కోయుకాలమున మరణించెను.

3.మనష్షే పొలములో కోతకోయించుచు ఎండదెబ్బ తగిలి జబ్బుపడెను. ఆ జబ్బుతో మంచముపట్టి బెతూలియా నగరమున తన యింటనే ప్రాణములు విడిచెను. అతనిని దోతాను, బాలమోను నగరములమధ్యనున్న పొలములో, అతని పితరులచెంతనే పాతి పెట్టిరి.

4. యూదితు అప్పటికి మూడేండ్ల నాలుగు నెలల నుండి వితంతువుగా తన యింటనే వసించుచుండెను.

5. ఆమె తన యింటిమీద ఒక చిన్న కుటీరమును నిర్మించుకొని సంతాప సూచకముగా గోనెను, విధవ వస్త్రములను ధరించెను.

6. వితంతువైనప్పటి నుండి ఆమె ప్రతిరోజు ఉపవాసముండెడిది. విశ్రాంతిదినము, దానికి ముందటిరోజు సాయంకాలము, అమావాస్య, దానికి ముందటిరోజు సాయంకా లము, యిస్రాయేలీయుల ఉత్సవదినములు, సెలవుదినములు అయిన ఈ దినములలో మాత్రము ఆమె ఉపవాసనియమమును పాటింపదయ్యెను.

7. యూదితు మిగుల అందకత్తె. భర్తనుండి ఆమెకు వెండి బంగారములును, దాసదాసీ జనమును, పొలమును, పశులమందలును సంక్రమించెను. ఈ ఆస్తికి అంతటికి ఆమెయే యాజమాన్యము వహించెను.

8. ఎవరును ఎపుడును యూదితును వేలెత్తి చూపియెరుగరు. ఆమె అంత నిష్ఠతో జీవించెడిది.

9. ప్రజలు నీరు దొరకక నిరుత్సాహము చెంది ఉజ్జీయామీద నేరము తెచ్చిరనియు, అతడు పట్టణమును ఐదుదినముల తరువాత అస్సిరియనుల వశము చేయుదునని మాట ఇచ్చెననియు యూదితు వినెను.

10. ఆమె వెంటనే తన ఆస్తిపాస్తులను పర్యవేక్షించు సేవకురాలిని పంపి ఉజ్జీయా, కాబ్రిసు, కార్మిసు అను నగరాధికారులను పిలిపించెను.

11. ఆ అధికారులు తన చెంతకు రాగానే యూదితు వారితో “మీరు ఈ బెతూలియా నగరమునకు పెద్దలు కదా! ఇప్పుడు నా మాట వినుడు. మీరు నేడు మన ప్రజలకు మాటయిచ్చిన తీరు సక్రమముగా లేదు. ప్రభువు మనకిన్ని రోజుల కాలములో సాయపడడేని ఈ నగరమును శత్రువులకు అప్పగింతుమని మీరు దేవుని ఎదుట బాసచేయుట ధర్మము కాదు.

12. అసలు దేవుని పరీక్షించుటకు గాని, మేము దేవునికంటె అధికులము అన్నట్లుగా ప్రవర్తించుటకుగాని మీరెవరు?

13. మీరిపుడు సర్వశక్తిమంతుడైన ప్రభువునే పరీక్షకు గురిచేసితిరి. మీకేమియు తెలియదు, తెలిసికోలేరు కూడ.

14. ఏ నరుని హృదయములో ఏమియున్నదో, ఎవడేమి ఆలోచించుచున్నాడో మీకు తెలియదుకదా! మరి సర్వమును సృజించిన దేవుని హృదయము మీకెట్లు తెలియును? అతని మనసును, ఆలోచనలను మీరెట్లు గుర్తుపట్టుదురు? సోదరులారా! మీరిట్టిపనికి పూనుకోవలదు. ప్రభువు కోపమును రెచ్చగొట్టవలదు.

15. అతడు మనలను ఈ ఐదునాళ్లలోనే రక్షింపక పోవచ్చునుగాక. తనకు ఇష్టము వచ్చినపుడే మనలను కాపాడవచ్చునుగదా! లేదా మనలను శత్రువుచేత నాశనము చేయింప వచ్చునుగూడ.

16. ముందుగా దేవునికి షరతులు పెట్టుట మీ పనికాదు. బుజ్జగించుటకుగాని, బెదరించుటకుగాని ఆయన నరుడాయేమి?

17. మన మట్టుకు మనము దేవునికి సహాయము చేయుమని మనవి చేయుదము, ఓపికతో ఆయన సాయము కొరకు వేచియుందము. ఆ ప్రభువునకు సమ్మతమయ్యెనేని ఆయన మన మొరాలించును.

18. ఇటీవల కాలమునకాని, ప్రస్తుతము కాని మన నగరములలో, గ్రామములలో, మన వంశములలో, తెగలలో ఎవరును విగ్రహములను పూజించుటలేదు. మన పూర్వులు మాత్రము వానికి మ్రొక్కెడివారనివింటిమి.

19. కనుకనే శత్రువులు వారిని సంహరించి కొల్లగొట్టగా వారు సర్వనాశనమైరి.

20. మనమిపుడు ప్రభువును తప్ప మరియొకరిని కొలుచుట లేదు. కనుక ఆయన మనలనుగాని, మన జాతిలో ఎవరినిగాని చేయివిడువడని నమ్మవచ్చును.

21. ఇపుడు శత్రువులు మన నగరమును జయింతురేని యూదయా దేశమంతయు వారికి వశమగును. వారు మన దేవాలయమును గూడ కొల్ల గొట్టుదురు. దేవాలయమును అమంగళము చేయనిచ్చినందులకు దేవుడు మన ప్రాణములను బలిగొనును.

22. మన ప్రజల చావునకు, ప్రవాసమునకు, తరతరముల దాక మనకు భుక్తమైయున్న ఈ దేశమును పాడువడుటకును మనమే కారకులమగుదుము. మనము వివిధ దేశములకు బానిసలముగా వెడలిపోగా, అచటి అన్యజాతి యజమానులు మనలను అసహ్యించుకొని, అవమానము చేయుదురు.

23. మనమిపుడు శత్రువులకు లొంగిపోయినచో వారు మనలను ఆదరముతో చూడరు. అట్లు లొంగిపోయినందుకు గాను దేవుడు మనలను నగుబాట్లపాలుచేయును.

24. సోదరులారా! ఇపుడు మనమెల్లరము తోడి యిస్రాయేలీయులకు మంచి ఆదర్శము చూపవలెను. వారి బ్రతుకులును, దేవాలయపు బలిపీఠ సౌభాగ్యమును గూడ మన మీదనే ఆధారపడియున్నవి.

25. ప్రభువు మన పితరులవలె మనలనుగూడ నేడు పరీక్షకు గురిచేయుచున్నాడు. అయినప్పటికి మనము ఆయనకు వందనములు అర్పింపవలెను.

26. ఆయన అబ్రహామును, ఈసాకును ఎట్లు పరీక్షించెనో జప్తికి తెచ్చుకొనుడు. మెసపొటామియాలో తన మేనమామయగు లాబాను గొఱ్ఱెలను మేపు యాకోబునకు ఏమిజరిగినదో గుర్తు తెచ్చు కొనుడు.

27. ప్రభువు వారిని పరీక్షించినంత కఠినముగా, మనలను పరీక్షించుటలేదు. ఆయన మనలను ఈ ఉపద్రవమునకు గురిచేసినది మనమీద పగతీర్చుకొనుట కుగాదు. తనను కొలుచు మనలను హెచ్చరించుటకే.”

28. అపుడు ఉజ్జీయా ఆమెతో ఇట్లనెను: “అమ్మా! నీవు చెప్పినది సముచితమే, నీ మాట కాదనుటకు వీలులేదు. 

29. నీవు వివేకముతో మాట్లాడుట ఇదియే మొదటిసారి కాదు. చిన్ననాటి నుండి నీవు తెలివితేటలతోను, వివేచనముతోను మెలగెడిదానవని మేమెల్లరము ఎరుగుదుము.

30. కానీ ప్రజలు దప్పిక బాధ తట్టుకోజాలక మమ్ము నిర్బంధము చేయగా మేమిట్టికార్యము చేయవలసి వచ్చెను. మేము చేసిన ప్రమాణమునకు తిరుగులేదు.

31. కాని నీవు దేవుని భయము కలదానవు. కనుక దేవునికి ప్రార్ధన చేయుము. వాన కురిపించి మన తొట్లను నింపుమని దేవునికి మనవి చేయుము. అప్పుడు మన బాధలన్ని తీరిపోవును.”

32. ఆ మాటలకు యూదితు “మీరు నా పలుకులు ఆలింపుడు. నేనొకకార్యము చేయనిశ్చయించుకొంటిని. మన ప్రజలు తరతరములదాక దానిని గుర్తుంచుకొందురు.

33. ఈ రాత్రి మీరు నగరద్వారము చెంత కావలియుండుడు. నేనును, నా దాసియు ఆ ద్వారము దాటి వెళ్ళిపోవుదుము. మీరు ఈ నగరమును శత్రువులకు అప్పగింతుమనిన దినమునకు ముందే ప్రభువు నా ద్వార మన ప్రజలను రక్షించును.

34. నేను చేయబోవు కార్యమేమిటో మీరు నన్ను ఇప్పుడు అడుగరాదు. ఆ పని ముగిసిన పిదపగాని నేను దానిని మీకెరిగింపను” అనెను.

35. ఉజీయా ఇతర పెద్దలు ఆమెతో “నీవు మా ఆశీస్సులందుకొని పొమ్ము. మన శత్రువులమీద పగతీర్చుకొను మార్గమును దేవుడు నీకు చూపునుగాక!” అనియనిరి.

36. ఇక వారు యూదితు కుటీరము వీడి తమతమ స్థానములకు వెడలిపోయిరి.