1. సమూవేలుకు పెద్ద ప్రాయము వచ్చెను. అందుచే అతడు తన ఇద్దరు కుమారులను యిస్రాయేలీయులకు తీర్పరులను చేసెను.
2. వారిలో పెద్దవాని పేరు యోవేలు, చిన్నవాని పేరు అబీయా. వారిద్దరు బేర్షెబాలో న్యాయాధిపతులైరి.
3. కాని ఈ కుమారు లకు తండ్రి గుణములు అబ్బలేదు. వారు కాసులకు దాసులై లంచములు పుచ్చుకొని ధర్మమును చెరచిరి.
4. అందుచే యిస్రాయేలు వృద్ధులందరు ప్రోగై సమూవేలును కలిసికొనుటకు రామాకు వచ్చిరి.
5. అతనితో "అయ్యా! నీవా, ప్రాయము చెల్లినవాడవు. నీ కుమారులందుమా, నీ అడుగుజాడలలో నడుచువారుకారు. ఇక మాకు న్యాయము తీర్చువారులేరు. కనుక అన్యజాతులకువలె మాకును ఒక రాజును నియమింపుము" అని విన్నవించుకొనిరి.
6. న్యాయము తీర్చుటకు రాజును నియమింపుమనిన పెద్దల వేడుకోలు సమూవేలునకు నచ్చలేదు. కనుక అతడు ప్రభువును ప్రార్థించెను.
7. యావే అతనితో “ఈ ప్రజలమాట వినుము. వారు నిన్ను నిరాకరించలేదు, వారిని యేలకుండ నన్నే నిరాకరించుచుండిరి.
8. ఐగుప్తునుండి వీరిని విడిపించుకొని వచ్చిన నాటినుండి ఈ జనులు నాకెట్టి అపచారము చేయుచుండిరో నేడు నీకును అట్టి అపచారమే చేసిరి. ఈ ప్రజలు నన్ను విడచి వేరు దేవరలను కొలిచిరి.
9. నీవు ఇపుడు మాత్రము వారి మాటలను వినుము. అయినను వారిని గట్టిగా హెచ్చరించి చూడుము. రాజును నియమించినచో అతడు ఏ తీరున పరిపాలనము చేయునో ధృడముగా తెలియజెప్పుము” అనెను.
10. ప్రభువు తనతో పలికిన పలుకులన్నియు రాజు కావలెనని అడుగుచున్న ప్రజలకు సమూవేలు తెలియబలికెను.
11. “మీరు కోరుకొనిన రాజు ఏ తీరున పరిపాలించునో వినుడు. అతడు మీ కుమారులను తీసికొని వెళ్ళి తన రథములను తోలుటకు, గుఱ్ఱములను కాపాడుటకు వినియోగించుకొనును. వారతని రథములముందు పరుగెత్తువారినిగా చేయును.
12. తన సైన్యములలో వేయిమందికో, ఏబదిమందికో వారిని అధిపతులుగా నియమించును. వారిచే తన పొలములు దున్నించి కోతకోయించుకొనును. యుద్ధములకును, రథములకును వలసిన పనిముట్లను చేయించుకొనును.
13. మీ కుమార్తెలను తీసికొని వెళ్ళి అత్తరులు పూయుటకును, వంటలు వండుటకును, రొట్టెలు కాల్చుటకును వాడుకొనును.
14. మీ పొలములో సారముగల చేలను, మీ ద్రాక్షతోటలను, ఓలివు తోపులను గైకొని తన ఉద్యోగులకు ఇచ్చివేయును.
15. మీరు పండించిన పంటలో, కాయించిన ద్రాక్ష పండ్లలో పదియవవంతు తీసికొని తన నౌకరులకు ఇచ్చివేయును.
16. మీ బానిసలను, మీ గాడిదలలో పశులలో తానెన్నుకొన్నవానిని తీసికొని సొంతపనులు చేయించుకొనును.
17. మీ మందలలో పదియవ భాగము పుచ్చుకొనును. ఇక మీరందరు అతని బానిసలగుదురు.
18. నేడు మీరెన్నుకొనిన రాజును తలంచుకొని ఒకనాడు పెద్దపెట్టున ఎడ్తురు. ఆనాడు ప్రభువు మీ మొర విన్పించుకోడు” అని చెప్పెను.
19. అయినను ప్రజలు సమూవేలు మాట పెడచెవిని పెట్టి మాకు రాజును నియమించి తీరవలయునని పట్టుబట్టిరి.
20. “ఇతర జాతులవలె మాకును రాజు కావలయును. మా రాజు మాకు న్యాయము చెప్పవలెను. మా యుద్ధములలో ముందు నడచి శత్రువులతో పోరాడవలయును” అని పలికిరి.
21. సమూవేలు ఈ మాటలన్నిటిని విన్నవానిని వినినట్లు యావేకు నివేదించెను.
22. “వారి యిచ్చ వచ్చినట్లే రాజును నియమింపుము” అని ప్రభువు సమూవేలునకు సెలవిచ్చెను. అంతట సమూవేలు "మీమీ పట్టణములకు తిరిగిపొండు” అని ఆనతిచ్చి ప్రజలను సాగనంపెను.