ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యూదితు 7వ అధ్యాయము || Telugu catholic bible online

1-2. మరునాడు హోలోఫెర్నెసు తన సొంత సైన్యమును, తనతో వచ్చిన అన్యజాతుల సైన్యములను సమావేశపరచెను. అది లక్ష డెబ్బదివేల కాలిబంటులతోను, పండ్రెండువేల రౌతులతోను కూడిన మహా సైన్యము. వీరుగాక సామానులు మోసికొనివచ్చు సామాన్య జనులునుగలరు. అతడా సైన్యములను బెతూలియా మీదికి దాడి చేయవలెననియు, కొండలలోని కనుమలను ఆక్రమించుకోవలెను అనియు, యిస్రాయేలీయులతో పోరు ప్రారంభింపవలెననియు ఆజ్ఞాపించెను.

3. కనుక ఆ సేనలు కదలిపోయి బెతూలియా చెంత గల లోయలోని నీటి బుగ్గలవద్ద గుడారములు పన్నెను. ఆ శిబిరము చాల పెద్దది కనుక దాని వెడల్పు దోతాను నుండి బెల్బాయీము వరకు వ్యాపించియుండెను. దాని పొడవు బెతూలియానుండి ఎస్ట్రలోను ఎదుటనున్న సియామోను వరకు విస్తరించియుండెను.

4. యిస్రాయేలీయులు ఆ మహా సైన్యమును చూచి భయపడిరి. “ఈ సైన్యము ఈ ప్రదేశమునంతటిని ఊడ్చివేయును. ఎత్తయిన శిఖరములు, లోయలు, కొండలన్నిటిని కలిపి నను వీరి బరువును భరింపజాలవు” అని అనుకొనిరి.

5. అట్లు భయపడినప్పటికీ వారెల్లరును తమ ఆయుధములను చేపట్టిరి. తమ బురుజులమీద సంజ్ఞా దీపములను వెలిగించి రేయెల్ల కావలికాసిరి.

6. రెండవనాడు హోలోఫెర్నెసు తన అశ్వబలమును బెతూలియా పౌరులెల్లరు చూచునట్లు ఆ నగరముచెంతకు కొనిపోయెను.

7. అతడు ఆ పట్టణమునకుపోవు దారులను ఆ నగరమునకు నీటిని సరఫరాచేయు జలధారలను పరిశీలించెను. ఆ నిటి ఊటల చెంత తన సైన్యములను కాపు పెట్టి తాను శిబిరమునకు తిరిగివచ్చెను.

8. అప్పుడు ఎదోము నాయకులు, మోవాబు దొరలు, సముద్ర ప్రాంతములవారి సైన్యాధిపతులు హోలోఫెర్నెసు చెంతకొచ్చి అతనితో,

9. "అయ్యా! నీవు మా మాట పాటింతువేని నీ సైన్యములకు ముప్పు తప్పును.

10. యిస్రాయేలీయులు తమ ఆయుధముల మీదకాక తాము వసించు పర్వతముల ఎత్తుమీద ఆధారపడి ఉందురు. ఈ కొండలను ఎక్కుట మనకు సాధ్యముకాదు.

11. కనుక తమరు వారిని ఈ కొండలలో నేరుగా ఎదిరింపరాదు. ఈ నియమమును పాటించిన మన సైన్యమున ఒక్కడును చావడు.

12. ఏలినవారును, మన సైనికులును విడిదిపట్టుననే ఉండవలెను. మన సైనికులు మాత్రము పర్వతపాదమున నున్న జలధారలను ఆక్రమించు కోవలెను.

13. బెతూలియా నగరవాసులకు నీటిని సరఫరా చేయునది ఈ బుగ్గలే. ఆ ప్రజలకు నీరు దొరకదేని దప్పికకు ఓర్వజాలక తమ నగరమును నీ వశము చేయుదురు. ఈ మధ్యలో మేము సైన్యములతో పోయి ఈ చుట్టుపట్లనున్న కొండలమీద డేరాలు పన్ని ఈ జనులు నగరము వీడిపోకుండునట్లు జాగ్రత్త పడెదము.

14. ఈ పట్టణములోని ప్రజలెల్లరు పురుషులు, స్త్రీలు, పిల్లలు ఆకలితో చత్తురు. మన కత్తికి బలికాకపూర్వమే వీరెల్లరు చచ్చి నగరవీధులలో కుప్ప లుగా పడియుందురు.

15. నిన్ను ఆశ్రయింపక, నీకు ఎదురు తిరిగినందుకుగాను వీరు ఈ రీతిగా తగిన శిక్షను అనుభవింతురు” అని చెప్పిరి.

16. హోలోఫెర్నెసుకును, అతని అధికారులకును ఈ పన్నాగము నచ్చెను. కనుక అతడు ఈ సలహా పాటింపనెంచెను.

17. వెంటనే మోవాబీయులు ఐదు వేలమంది, అస్సిరియా సైనికులు లోయలోనికి వెడలి పోయి పట్టణమునకు నీటిని సరఫరాచేయు జలధారలను ఆక్రమించిరి.

18. ఎదోమీయులు, అమ్మోనీయులు కొండలలోనికెళ్ళి దోతాను కెదురుగా శిబిరము పన్నిరి. వారు తమ సైనికులను కొందరిని మొక్కురు వాగు చెంతగల కూసి చేరువలోనున్న అక్రిబాకు పంపిరి. ఈ తావు బెతూలియాకు తూర్పు, దక్షిణ దిశలందు కలదు. మిగిలిన అస్సిరియా సైనికులులోయలోని మైదానముననే శిబిరము పన్ని ఆ ప్రాంతమంతట వ్యాపించిరి. అంతటి మహాసైన్యమునకు కావలసిన గుడారములు ఇతర పరికరములు చాలస్థలమును ఆక్రమించుకొనెను.

19. అపుడు యిస్రాయేలీయులు తమ దేవునికి మొరపెట్టిరి. శత్రువులు చుట్టుముట్టగా తప్పించుకొను మార్గము లేనందున మిగుల నిరుత్సాహము చెందిరి.

20. అస్సిరియా సైన్యము వారి కాలిబంటులతో, రథములతో, అశ్వములతోను బెతూలియాను ముప్పది నాలుగునాళ్ళ వరకు చుట్టుముట్టెను. అంతలో పట్టణ మున నీరు అయిపోయెను.

21. వారి నీటితొట్లు ఖాళీ అయ్యెను. మంచినీళ్ళను కొలిచి ఇచ్చిరి కనుక అవి ఏరోజున ఎవరికినీ సరిపోవయ్యెను.

22. వారి పసికందులు, స్త్రీలు, బాలబాలికలు నీరు చాలక కృశించి పోయిరి. సత్తువలేక వీధులలో,నగరద్వారముల చెంతను సొమ్మసిల్లి పడిపోయిరి.

23. పట్టణములోని ప్రజలెల్లరు-పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉజ్జీయాను పట్టణాధికారులను చుట్టు ముట్టి పెద్దగా అరచిరి. వారు నగర పెద్దలు వినుచుండగా ఇట్లనిరి:

24. “మీరు మాకు ఇట్టిపని చేసినందుకు దేవుడు మిమ్ము తప్పక శిక్షించును. మీరు అస్సిరియనులతో రాజీ కుదుర్చుకొనక మాకు కీడు తెచ్చిపెట్టిరి.

25. ఇప్పుడు మనకు సాయము చేయువారెవరు? దేవుడు మనలను వారి చేతికి అప్ప గించెను. మేమెల్లరము దప్పికచే చచ్చుచున్నాము. ఎక్కడివారము అక్కడే సొమ్మసిల్లి పడిపోవుచున్నాము.

26. మీరు వెంటనే శత్రువులను పిలిపింపుడు. హోలోఫెర్నెసును అతని సైన్యములను ఈ నగరము నాక్రమించుకొననిండు. దోచుకొననిండు.

27. ఈ బాధలను అనుభవించుట కంటె వారి చేతికి చిక్కుట మేలు.వారు మనలను బానిసలను చేయుదురు. అయినను మా బొందిలో ప్రాణములైననిల్చును. మన ఆడువారు, పిల్లలు ప్రాణములు కోల్పోవుటను మనము కన్నులార చూడనక్కరలేదు.

28. ఆకాశము, భూమి మరియు మన ప్రభువుకూడ మీకు వ్యతిరేకముగా సాక్ష్యమిచ్చుచు మీ ఈ చెయిదమును తప్పక ఖండించును. మన పితరులదేవుడైన ప్రభువు పితరుల పాపములకును, మన తప్పిదములకును మనలను ఈ రీతిగా శిక్షించుచున్నాడు. ఆ ప్రభువు నేడు మనలను ఈ ఆపదల నుండి కాపాడవలెనని మాత్రము మేమెల్ల రము ప్రార్ధించుచున్నాము.”

29. అంతట ఆ జనసమూహమంత పెద్దగా ఏడ్చుచు ప్రభువునకు మొరపెట్టెను.

30. అప్పుడు ఉజ్జీయా ప్రజలతో “సోదరులారా! మీరు కొంచెము తాళుడు. ఇంకను ఐదునాళ్ళు వేచియుందము. అప్పటికైనను ప్రభువు మనలను కరుణింపవచ్చును. ఆయన మనలను పూర్తిగా చేయివిడుచువాడు కాదు.

31. ఈ ఐదునాళ్ళ గడువులోను సహాయము లభింపదేని నేను మీరు కోరినట్లే చేయుదును” అని చెప్పెను.

32. తరువాత అతడు ప్రజలను పంపివేయగా మగవారు ప్రాకారములకు, బురుజులకు కావలికాయుటకు వెళ్ళిపోయిరి. స్త్రీలును, పిల్లలును ఇండ్లకుపోయిరి. నగరమంత నిరాశతో నిండి పోయెను. 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services