1. తోబియా దేవదూతతో పయనమయ్యెను. అతని కుక్కగూడ అతని వెంటపోయెను. వారు మునిమాపు వరకు నడక సాగించి టిగ్రీసు నదీతీరమున విడిదిచేసిరి.
2. తోబియా కాళ్ళు కడుగుకొనుటకు ఏటిలోనికి దిగెను. వెంటనే పెద్ద చేపయొకటి నీటిలోనుండి దుమికి వచ్చి అతని పాదమును పట్టుకోబోయెను. దానిని చూచి ఆ కుఱ్ఱడు పెద్దగా కేక పెట్టెను.
3. దేవదూత అతనితో “ఓయి! ఆ మత్స్యమును పట్టుకొనుము, జారిపోనీ యకుము” అనెను. తోబియా ఆ మీనమును పట్టుకొని ఒడ్డుకు లాగెను.
4. దేవదూత “చేప కడుపును చీల్చి దాని పిత్తమును, కాలేయమును, గుండెను తీసి నీ యొద్ద ఉంచుకొనుము. దాని ప్రేవులను మాత్రము అవతల పారవేయుము” అని చెప్పెను.
5. తోబియా దేవదూత చెప్పినట్లే చేసెను. అతడు చేపలో కొంతభాగ మును కాల్చి భుజించెను. మరి కొంతభాగమును ఉప్పులో ఊరవేసెను. తరువాత వారిరువురు ప్రయాణము సాగించి మాదియా దరిదాపులలోనికి వచ్చిరి.
6. ఆ యువకుడు దేవదూతను చూచి "నేస్తమా! అసరయా! చేపపిత్తము, కాలేయము, గుండెలతో ఏఏ రోగములను కుదుర్పవచ్చును?” అని అడిగెను.
7. అతడు చేపగుండెను, కాలేయమును కాల్చి పొగ వేసినచో నరులను పట్టిపీడించు భూతముగాని, పిశాచము గాని పారిపోవును. ఆ నరులకు మరల పిశాచబాధ సోకదు.
8. పిత్తమును తెల్లనిపొరలు కమ్మినవారి కన్నులకు లేపనముగా ఉపయోగింపవచ్చును. దానిని కంటిపొరలమీద పూసి వానిమీద ఊదిన చాలు, పొరలు తొలగిపోవును” అని చెప్పెను.
9. వారిరువురు మాదియా దేశమున ప్రవేశించి ఎక్బటానా నగరమును సమీపించిరి.
10. అప్పుడు దేవదూత తోబియాను పేరెత్తి పిలువగా అతడు “చెప్పుము నేను వినుచున్నాను” అనెను. దేవదూత “నేటి రాత్రి మనము నీ బంధువైన రగూవేలు ఇంట బస చేయవలెను. అతనికి సారా అను కుమార్తె కలదు. ఆమె తప్ప అతనికి ఇతర సంతానము లేదు.
11. ఆ కన్య నీకు దగ్గరిచుట్టము కనుక అందరికంటెగూడ అదనముగా నీకు ఆమెను పెండ్లియాడు హక్కు కలదు. ఆమె తండ్రి ఆస్తియును నీకే దక్కును.
12. ఆ యువతి తెలివి కలది, ధైర్యము కలది, చక్కనిది కూడ. సారా తండ్రి చాల మంచివాడు. ఈ రాత్రియే నేనతనితో సారా వివాహము గూర్చి మాట్లాడుదును. ఆమెను నీకు ప్రధానము చేయింతును. మనము రాగీసునుండి తిరిగివచ్చునపుడు నీవు ఆ బాలికను వివాహమాడ వచ్చును. రగూవేలు నీ వేడికోలును త్రోసిపుచ్చి కూతురును మరియొకరికి ఈయజాలడు. అట్లు చేసినచో మోషే ధర్మశాస్త్రము ప్రకారము అతడు చంపదగిన వాడగును. చుట్టరికముబట్టి తన కుమార్తెను పరిణయమాడుటకు నీకు ఎక్కువ అర్హతకలదని అతనికి తెలియును. కనుక ఇప్పుడు నీవు నా మాట వినుము. ఈ రాత్రియే మేము వివాహ విషయమును ముచ్చటించి సారాను నీకు ప్రధానము చేయింతుము. మనము రాగీసునుండి తిరిగివచ్చునపుడు ఆమెను మనతో ఇంటికి తీసికొనిపోవచ్చును” అనెను.
13. తోబియా రఫాయేలుతో “నేస్తమా! ఆ యువతిని ఇదివరకే వరుసగా ఏడుగురు వరులకిచ్చి పెండ్లి చేసిరి. వారిలో ప్రతివాడు మొదటి రేయినే శోభనపు గదిలోనే చచ్చెను. ఈ సంగతులెల్ల నాకు తెలియును.
14. ఆమెను పట్టియున్న భూతమే ఆ వరులను సంహరించెననియు వింటిని. ఆ భూతము సారా కెట్టి హానియు చేయదట. ఆమెను సమీపించు పురుషులను మాత్రము పట్టి చంపునట. నా మట్టుకు నాకు ఆ పిశాచమనిన భయముగా ఉన్నది. మా తండ్రికి నేనొక్కడనే కుమారుడను. చావవలెనను కోరిక నాకు లేదు. నేను చనిపోయినచో మా తల్లిదండ్రులు దిగులుతో సమాధి చేరుకొందురు. అప్పుడు వారిని పాతి పెట్టు దిక్కు కూడ ఉండదు” అనెను.
15. దేవదూత “ఓయి! నీవింతలోనే మీ తండ్రి ఉపదేశమును మరచితివా? అతడు నీవు మీతెగ నుండే వధువును ఎన్నుకోవలెనని చెప్పలేదా? కనుక ఇప్పుడు నా మాట వినుము. ఆ భూతమును తలచుకొని భయపడకుము. సారాను స్వీకరింపుము. ఈ రాత్రియే రగూవేలు ఆ యువతిని నీకు ప్రధానము చేయును.
16. నీవు ఆమెతో పడుక గదిలోనికి పోయినపుడు చేపగుండెను, కాలేయమును తీసికొని కాలుచున్న సాంబ్రాణి మీద వేయుము.
17. వెంటనే గది అంతట వాసన వ్యాపించును. ఆ వాసనకు భూతము పారిపోవును. అది మరల సారా చెంతకు రాదు. నీవు ఆ యువతిని కూడకముందే మీరిరువురు లేచి నిలుచుండి దేవుని ప్రార్థింపుడు. ఆకాశములోని దేవుడు మిమ్ము చల్లనిచూపు చూచి భూతముపీడనుండి కాపాడవలెనని మనవిచేయుడు. నీవేమాత్రము భయపడవలదు. సృష్ట్యాదినుండి సారా నీకు వధువుగా నిర్ణయింపబడినది. ఆమె నీ వెంట మీ ఇంటికి వచ్చును. మీకు బిడ్డలు కలుగుదురు. వారిని నీవు అనురాగముతో చూచుకొందువు. నా మాట నమ్ముము” అని పలికెను. తోబియా రఫాయేలు చెప్పిన మాటలు వినెను. తండ్రి వైపున సారా తనకు చుట్టమని గ్రహించెను. అతడు సారాను గాఢముగా ప్రేమించి తన హృదయమును ఆమెకు అర్పించెను.