ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు 6వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. నాయనా! నీవు పొరుగువానికి హామీగా ఉన్నచో, తోడివానికి పూచీపడినచో

2. నీ నోటి మాటవలన నీవు చిక్కుబడి ఉందువు. నీ నోటి మాటవలన పట్టుబడెదవు.

3. నీవు పరుని చేతికి చిక్కితివి గనుక ఇట్లు చేయుము: శీఘ్రమే అతనివద్దకు పోయి నిన్ను మన్నింప వేడుకొనుము.

4. నీవు రెప్పవాల్చి నిద్రపోకూడదు. నీ కంటికి కునుకు రాకూడదు.

5. వేటగాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లుగా, బోయ చేతినుండి పక్షి తప్పించుకొనునట్లుగా, నీవును బోనునుండి తప్పించు కోవలయును.

6. సోమరీ! చీమలను చూడుము. వాని జీవితము చూచి బుద్దితెచ్చుకొనుము.

7. వానికి నాయకుడు లేడు, పర్యవేక్షకుడును లేడు, అధికారియు లేడు.

8. అయినను అవి వేసవిలో ఆహారము చేకూర్చుకొనును. కోతకాలమున ధాన్యమును సేకరించుకొనును.

9. సోమరీ! నీ వెంతకాలము పడుకొందువు? ఎప్పుడు నిద్ర మేల్కొందువు?

10. ఇంకను కొంచెము సేపు కన్నుమూసి, కొంచెము నిద్రించి, కొంచెము చేతులు ముడిచి, విశ్రాంతి తీసికోగోరెదవు కాబోలు!

11. కాని ఇంతలోనే దారిద్ర్యము దోపిడికారునివలె నీ మీదికి వచ్చును. పేదరికము ఆయుధ హస్తమువలె నీ మీదికెత్తివచ్చును.

12. కొరగాని దుర్మార్గుడు కల్లలాడుచు, తిరుగాడుచుండును.

13. అతడు కన్నుగీటి, కాలుకదపి, చేతులుత్రిప్పి నరులను వంచించును.

14. అతడు కపట హృదయుడు, కుట్రలు పన్నువాడు, జగడములు తెచ్చి పెట్టువాడు.

15. కావుననే అతడు తలవని తలంపుగా నాశనమగును అకస్మాత్తుగా, మరల కోలుకోని రీతిగా హతుడగును

16. ప్రభువు అసహ్యించుకొను కార్యములు ఆరు కలవు. ఏడింటిని అతడు ఏవగించుకొనును.

17. గర్వపు చూపు, అబద్దములాడు నాలుక, నిర్దోషులను చంపు చేతులు,

18. కుట్రలుపన్ను హృదయము, చెడును చేయుటకు పరుగిడు పాదములు,

19. సాక్ష్యమున మాటిమాటికి బొంకులాడుట, అన్నదమ్ములలో జగడములు పెంచుట.

20. కుమారా! నీ తండ్రి ఉపదేశమును ఆలింపుము. నీ తల్లి బోధను పాటింపుము.

21. వారి ఉపదేశమును నీ హృదయములో పదిలపరుచుకొనుము. నీ కంఠమున హారమువలె ధరింపుము.

22. అది నీవు పయనము చేయునపుడు నిన్ను నడిపించును. నీవు నిద్రించునపుడు నిన్ను కాపాడును. నీవు మేల్కొనినపుడు నీకు హితబోధ చేయును.

23. నీ తండ్రి ఉపదేశము నీకు దీపముగా, నీ తల్లి బోధ నీకు వెలుగుగా ఉండును. నీ తల్లిదండ్రుల శిక్షణార్థమైన గద్దింపులు జీవమార్గములు.

24. వారి దిద్దుబాటులు నిన్ను దుష్టురాలినుండి కాపాడును. పరుని ఆలి యిచ్చకపు మాటలనుండి నిన్ను రక్షించును.

25. పరకాంత సొగసునకు నీవు భ్రమయవలదు. ఆమె కంటిచూపునకు నీవు సమ్మోహితుడవు కావలదు.

26. వేశ్యకు కొద్దిపాటి సొమ్ము చెల్లించిన చాలును. కాని పరునిభార్యతోడి రంకు నీ విలువైన ప్రాణమును వేటాడును.

27. నిప్పులను రొమ్ముమీద పెట్టుకొన్నచో బట్టలు కాలకుండునా?

28. అగ్నిమీదనడచినచోపాదములు మాడకుండునా?

29. అన్యుని భార్యను కూడువాడును అంతియే. ఆమెను స్పృశించిన వానికి శిక్ష తప్పదు.

30. ఆకలిగొనినవాడు పొట్టకూటికొరకు దొంగిలించినచో జనులు అతనినంతగా దూషింపరు

31. పట్టుబడినచో అతడు ఏడురెట్లు నష్టపరిహారము చెల్లించి తనకున్నదంతయు అప్పగింపవలసినదే.

32. కాని పరుని సతితో వ్యభిచరించువానికి అసలు బుద్దిలేదు. అతడు తన చావును తానే కొనితెచ్చుకొనును.

33. అతనికి గాయములు, అవమానములు కలుగును. అతని అపకీర్తి తొలగింపబడదు.

34. అసూయకు గురియైన భర్త రౌద్రముతో మండిపడును కరుణమాని ప్రతీకారమునకు పూనుకొనును.

35. అతడు అపరాధపు సొమ్మును అంగీకరింపడు. ఎన్ని బహుమతులర్పించినను శాంతింపడు.