ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 6వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. ప్రభుమందసము ఏడుమాసముల వరకు ఫిలిస్తీయుల దేశముననుండెను.

2. అప్పుడు ఫిలిస్తీయులు వారి యాజకులను, మాంత్రికులను పిలిపించి “ప్రభువు మందసమునేమి చేయుదము? దాని తావునకు దానిని పంపివేయవలెనన్న ఏఏ కానుకలతో పంపవలెను?” అని అడిగిరి.

3. వారు “ప్రభుమందసమును పంపివేయకోరెదరేని ఊరికే పంపరాదు. మీ అపరాధములకు ప్రాయశ్చిత్తముగా కానుకలు అర్పించుకొనుడు. అప్పుడు మీ వ్యాధి కుదురును. ప్రభువు ఇంతవరకు మిమ్మును పీడించి పిప్పిచేయుట ఏల మానలేదో కూడ తెలిసికొందురు” అనిరి.

4. ప్రజలు “అటులయిన ప్రాయశ్చిత్తముగా ఏమి కానుకలను అర్పింపవలయును?" అని మరల అడుగగా వారు "ఫిలిస్తీయుల దొరలు ఐదుగురు కదా! ఈ ఐదుగురిని ఉద్దేశించి ఐదు బంగారపు ఎలుకలు, ఐదు బంగారపు బొబ్బలు చేసి పంపుడు. మిమ్మును మీ పాలకులను పీడించు వ్యాధి ఒక్కటియే.

5. కావున మీకు లేచిన బొబ్బలకు, మీ నేలను పాడుచేసిన ఎలుకలకు గుర్తులుగా బొమ్మలు చేసిపంపుడు. వీనివలన యిస్రాయేలు దేవునికి మహిమ కలిగింతురు. అతడు మీ సమర్పణములను చూచి మిమ్మును, మీ వేల్పులను, మీ దేశమును పీడించుట మానివేయునేమో!

6. ఐగుప్తు ప్రజలవలె, ఫరోవలె మీరు గుండె బండ జేసికోనేల? నాడు ప్రభువు వారికి ఉపద్రవములు కలిగింపగా వారు యిస్రాయేలు ప్రజలను పోనీయలేదా?

7. కనుక వెంటనే క్రొత్తబండిని సిద్ధము చేయింపుడు. కాడి మోయని పాడి ఆవులను రెండింటిని బండికి పూన్పుడు. వానీ లేగలను తల్లులనుండి వేరుచేసి కొట్టమునకు తోలుకొనిపొండు.

8. ప్రభు మందసమునెత్తి బండిపై బెట్టుడు. అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా మీరు అర్పించు బంగారుబొమ్మలను ఒక పెట్టెలో పెట్టి మందసము ప్రక్కనుంచి బండి సాగదోలుడు.

9. మందసము ఏవైపు వెళ్ళునో పరికింపుడు. అది నేరుగా తన తావునకు పోవు బాట పట్టిపోయి బేత్ షేమేషు పట్టణము చేరుకొనెనేని మనకు ఈ విపత్తు తెచ్చిపెట్టిన వాడు ప్రభువేయని తేటతెల్లమగును. కాదేని అతడుగాక, మరియేదో శక్తి తలవని తలంపుగా మనలను పీడించెనని తెలిసిపోవును" అనిరి.

10. వారు చెప్పినట్లే ప్రజలు రెండు పాడి ఆవులను తోలుకొనివచ్చి బండికి కట్టి వాని దూడలను కొట్టమున కట్టివేసిరి.

11. ప్రభుమందసము బండి పైకెత్తి బంగారపు ఎలుకలు, బంగారు బొబ్బలు నుంచిన పెట్టెను మందసము చెంత నుంచిరి.

12. అంతట బండిని కదలింపగా గోవులు బేత్షె మేషు త్రోవబట్టి అంబాయని అరచుచు కుడికిగాని ఎడమకు గాని కదలక నేరుగా సాగిపోయెను. ఫిలిస్తీయుల దొరలును బేత్ షోమేషు పొలిమేరల వరకు శకటము వెంట నడచివెళ్ళిరి.

13. అప్పుడు బేత్ షెమేషు పౌరులు పొలములో గోధుమ పంట కోయుచుండిరి. మందసము కంట బడగనే వారు అమితానందము నొందిరి.

14. బేత్ షెమేషు పౌరుడైన యెహోషువ చేనిచెంతకు వచ్చి బండి ఆగిపోయెను. అచ్చటనొక పెద్దబండకలదు. పొలమునందలి వారు కొయ్యను నరికి గోవులను వధించి ప్రభువునకు దహనబలినర్పించిరి.

15. లేవీయులు ప్రభుమందసమును దానిచెంతనున్న బంగారుబొమ్మల పెట్టెను దింపి బండపై పెట్టిరి. ఆనాడు బేత్ షెమేషు పౌరులు ప్రభువునకు బలులను, దహనబలులను సమర్పించిరి.

16. ఫిలిస్తీయుల అధికారులు ఐదుగురును జరిగినదెల్ల కన్నులార చూచి జాగుచేయక నాడే ఎక్రోనునకు వెడలిపోయిరి.

17. అష్డోదు, గాజా, అష్కేలోను, గాతు, ఎక్రోను అను ఐదు ఫిలిస్తీయ పట్టణములకు అపరాధ ప్రాయశ్చిత్తముగా ఫిలిస్తీయులు ఐదు బంగారుబొబ్బలను సమర్పించుకొనిరి. 

18. ఐదుగురు ఫిలిస్తీయ అధికారుల అధీనమున ఉన్న రక్షితపట్టణములకు, అరక్షిత గ్రామములకు ఒక్కొక్కటి చొప్పున బంగారపు ఎలుకలను గూడ సమర్పించుకొనిరి. బేత్ షెమేషు పౌరుడైన యెహోషువ చేనిచెంత ప్రభుమందసము నుంచిన ఆ పెద్దబండ నేటికిని ఈ గాథకు సాక్ష్యముగా నిలిచియున్నది.

19. బేత్ షెమేషు పౌరులలో కొంతమంది మందసములోనికి చూడగా దేవుడు వారిలో డెబ్బదిమందిని చంపివేసెను. ప్రభువు అంతమంది ప్రాణములు తీసెను గనుక పురజనులు గోడుగోడున విలపించిరి.

20. అంతట బేత్ షెమేషు పౌరులు “పరమ పవిత్రుడైన ఈ యావే ప్రభువు ముందటెవడు నిలువ గలడు? మన యొద్దనుండి ఇక ఈ ప్రభువునెవరి చెంతకు పంపెదము” అని మథనపడిరి.

21. కనుక వారు కిర్యత్యారీము నగరమునకు దూతలనంపి “ఫిలిస్తీయులు మందసమును పంపిరి. దిగిరండు, దీనిని మీ నగరమునకు గొనిపొండు” అని వార్త పంపిరి.