1. యాకోబు పెద్దకుమారుడుడైన రూబేను వంశజులు వీరు: రూబేనునకు జ్యేషాధికారము కలదు. కాని అతడు తన తండ్రి ఉంపుడుగత్తెను కూడి నందున ఆ అధికారమును కోల్పోయెను. యోసేపు కుమారులకు ఆ అధికారము సిద్ధించెను.
2. అయినను యూదా తెగ మిగిలిన తెగలకంటె బలసంపన్నమయ్యెను. అందరిని పరిపాలించు రాజు ఆ తెగనే జన్మించెను.
3. యాకోబు జ్యేష్ఠపుత్రుడు రూబేను తనయులు హానోకు, పల్లు, హెస్రోను, కర్మి.
4-6. యోవేలు వంశజులు క్రమముగా వీరు: షమయా, గోగు, షిమీ, మీకా, రెయాయా, బాలు, బేరా. అస్సిరియా రాజు తిగ్లత్ పిలేసరు రూబేను తెగనాయకుడైన బేరాను బందీగా కొనిపోయెను.
7. రూబేను తెగనందలి వివిధ కుటుంబములకు నాయకులు యెయీయేలు, జెకర్యా, బేల. ఈ బేల వంశకర్తలు క్రమముగా అసాసు, షెమ, యోవేలు,
8. రూబేను తెగవారు అరోయోరు మండలమున స్థిరపడిరి. అచటినుండి నెబో, బాల్మెయోను నగరముల వరకు వ్యాపించిరి.
9. వారికి గిలాదు మండలమున విస్తారమైన మందలు కలవు. కనుక వారు తూర్పుదిశ యందు యూఫ్రటీసునది తీరమువరకు వ్యాపించి యున్న ఎడారి వరకుగల భూమినంతటిని ఆక్రమించు కొనిరి.
10. సౌలురాజు పరిపాలనా కాలమున ఆ ప్రజలు హగ్రీయులతో యుద్ధముచేసి వారిని ఓడించిరి. గిలాదునకు తూర్పు వైపుననున్న హగ్రీయుల భూమినంత ఆక్రమించుకొనిరి.
11. గాదు తెగవారు రూబేను తెగవారికి ఉత్తరదిక్కున స్థిరపడిరి. వారు బాషాను మండలమున సలేఖానగరము వరకు వ్యాపించిరి.
12. యోవేలు ఆ ప్రజలలో ప్రధానమైన వంశమునకు నాయకుడు. షాఫాము రెండవ పెద్దవంశమునకు నాయకుడు. యానయి, షాఫాతు అనువారు ఇతర తెగలకు నాయకులు.
13. ఆ తెగయందలి ఇతరజనులు ఈ క్రింది ఏడువంశములకు చెందినవారు. మిఖాయేలు, మెషుల్లాము, షెబ, యోరయి, యాకాను, సీయ, ఏబేరు.
14. వీరి మూలపురుషుడు అబీహాయిలు. ఇతని వంశకర్తలు క్రమముగా హూరి, యరోవ, గిలాదు, మిఖాయేలు, యషీషయి, యహదో, బూసు.
15. గూనీ మనుమడును అబ్దీయేలు తనయుడైన అహీ వారికి నాయకుడు.
16. వారు గిలాదు, బాషాను మండలములందును, వాని పరిసరములందును, షారోను మండలములోని పచ్చిక మైదానములలోను నివసించిరి.
17. యూదా రాజైన యోతాము, యిస్రాయేలు రాజు యెరోబాము కాలమున వారు పలు తెగలుగా ఏర్పడిరి.
18. రూబేను గాదు తెగవారిలో మనష్షే అర్ధతెగ ప్రజలలో 44, 760 మంది యోధులు ఉండెడివారు. వారు కత్తులు, విల్లులు, డాళ్ళను వాడగలవారు.
19. వారు యేతూరు, నఫీషు, నోదాబు మండలములలో వసించు హగ్రీయులతో పోరాడిరి.
20. వారు ప్రభువును నమ్మి అతని సహాయమును అర్థించిరి. కనుక అతడు వారి వేడికోలు ఆలించెను. హగ్రీయులను వారి సహాయులను యిస్రాయేలీయుల వశము చేసెను.
21. యిస్రాయేలీయులు శత్రుప్రజల దేశము నుండి 50,000 ఒంటెలు, 250,000 గొఱ్ఱెలు, 2000 గాడిదలు తోలుకొనివచ్చిరి. లక్షమంది బందీ లను చెరపట్టిరి.
22. ఆ యుద్ధము దేవుడు సంకల్పించినది కనుక యిస్రాయేలీయులు చాలమంది హగ్రీయులను వధించిరి. తాము ప్రవాసమునకు కొనిపోబడువారకు వారు హగ్రీయుల మండలముననే వసించిరి.
23. మనష్షే అర్ధతెగవారు బాషాను మండలమున బాల్హేర్మోను, సెనీరు, హెర్మోను పర్వతము సమీపము వరకు స్థిరపడిరి. వారి ప్రజలు తామర తంపరగా వృద్ధిచెందిరి.
24. వారి తెగలకు నాయకులు ఏఫేరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహ్దీయేలు. వీరెల్లరు ఆయా వంశములకు నాయకులు, సుప్రసిద్ధులు, మహావీరులు.
25. కాని ఈ ప్రజలు తమ పితరుల దేవుని విస్మరించిరి. ప్రభువు నాశనము చేసిన స్థానిక జాతుల దైవములను కొలిచిరి.
26. కనుక యిస్రాయేలు ప్రభువు అస్సిరియా రాజైన పూలు లేక తిగ్లత్పిలేసరు అనునాతని కోపమును రెచ్చగొట్టెను. అతడు రూబేను, గాదు తెగలమీదికి మనష్షే అర్థతెగ వారిమీదికి దండెత్తి వచ్చి వారిని బంధీలనుగా కొనిపోయెను. హాలా, హాబోరు, హారా నగరములందు, గోసాను నదీతీరము నందు వారికి శాశ్వతనివాసములు కల్పించెను.