1. ఫిలిస్తీయులు ప్రభుమందసమును కైవసము చేసికొని ఎబెనె సెరు నుండి అష్డోదునకు కొనితెచ్చిరి.
2. అచ్చట దాగోను దేవాలయమునకు కొనిపోయి దాగోను సమీపమున నుంచిరి.
3. అష్డోదు ప్రజలు మరునాడు వేకువనే నిద్ర మేల్కొని చూడగా, దాగోను ప్రభుమందసము నెదుట నేలపై బోరగిలబడిఉండెను. వారు దాగోనును లేవనెత్తి అతని స్థానమున నిలిపిరి.
4. మరుసటి రోజు ప్రజలు తెల్లవారకమునుపే నిద్రలేచిచూడగా, మరల దాగోను యావే మందసము నెదుట బోరగిలబడియుండెను. దాగోను తల, రెండు చేతులు నరికివేయబడి గడపచెంత యుండెను. మొండెము మాత్రమే దాగోను స్థానమున పడియుండెను.
5. ఈ కారణము చేతనే దాగోను యాజకులుగాని, అతని మందిరమున ప్రవేశించు భక్తులుగాని నేటికిని అష్డోదులోని దాసోను గుడి గడపతొక్కరు.
6. యావే అష్డోదును దాని పరిసరములయందలి ప్రజలను బొబ్బలతో పీడించి బాధ పెట్టెను.
7. అష్డోదు పౌరులు ఆ ఉపద్రవమునకు తట్టుకోలేక “యిస్రాయేలు దేవుని మందసము మనతో నుండరాదు. అతడు మనలను, మనము కొలుచు దాగోనును పీడించి పిప్పిచేయుచున్నాడు” అని అనుకొనిరి.
8. కనుక వారు ఫిలిస్తీయుల అధికారులను సమావేశపరచి యిప్రాయేలు దేవుని మందసమును ఏమి చేయుదమా అని ఆలోచన చేసిరి. చివరకు దానిని గాతునకు కొనిపోవలయునని కలియబలుకుకొని ఆ నగరమునకు చేర్చిరి.
9. కాని మందసము గాతును చేరగనే ప్రభువు ఆ పట్టణ ప్రజలను ఘోరముగా పీడించుటచే చాల మంది చచ్చిరి. పెద్దలనక, పిల్లలనక పురములోని జనులందరు రహస్యస్థానములలో బొబ్బలులేచి బాధపడజొచ్చిరి.
10. అందుచే గాతు ప్రజలు మందసమును ఎక్రోనునకు పంపివేసిరి. కానీ మందసము ఎక్రోను చేరగానే పురప్రజలందరు పెద్ద పెట్టున కేకలువేసి “మనలను, మన ప్రజలను చంపుటకు ఈ యిస్రాయేలు దేవుని మందసమును ఇచ్చటికి కొనితెచ్చిరి" అనిరి.
11. వారు ఫిలిస్తీయుల అధికారులను పిలిపించి “యిస్రాయేలు దేవుని మందసమును పంపివేయుడు. దాని తావునకు దానిని చేర్చుడు. మమ్మును మా ప్రజలను చావునుండి తప్పింపుడు” అని వేడుకొనిరి. ప్రభువు ఎక్రోను ప్రజలను మిక్కిలిగా పీడించుటచే నగరమంతట జనులు కుప్ప తెప్పలుగా పడిచచ్చిరి.
12. చావక బ్రతికినవారు పెడబొబ్బలు పెట్టి కెవ్వున ఏడ్చిరి. వారి అంగలార్పులు మిన్నుముట్టెను.