ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సోలోమోను జ్ఞానగ్రంధము 4వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. సుగుణములతో కూడిన సంతానలేమియే మిన్నయైనది. ఎందుకన సుగుణముల యొక్క మననము అమరమైనది. అది దేవుని చేతను, మానవులచేతను ఘనముగా యెంచబడునది.

2. నీతి అనునది చూపట్టినపుడు ప్రజలెల్లరును దానిని అనుసరింప గోరుదురు. అది చూపట్టనపుడు ఎల్లరును దానికొరకు అఱ్ఱులు చాతురు. ఎల్లపుడును నరునికి నీతియే ఉత్తమ బహుమతి. నీతికిమించిన సద్గుణము లేదు.

3. వ్యభిచారమున పుట్టిన బిడ్డలెందరైన ఫలితము లేదు. వారు లోతుగా వేరు పాతుకొననందున స్థిరముగా నిలువజాలని చెట్టువంటి వారగుదురు. 

4. వ్రేళ్ళులేని చెట్టువలె వారు కొన్ని కొమ్మలు వేయుదురుగాని గాలికి అల్లల్లాడుదురు. పెనుగాలికి పెళ్ళున కూలిపోవుదురు.

5. వారి కొమ్మలు పెరగక మునుపే విరిగిపోవును. వారి ఫలములు సరిగా పక్వము కాలేదు కనుక తినుటకు పనికిరావు.

6. న్యాయనిర్ణయదినము వచ్చినపుడు వ్యభిచారమున పుట్టిన బిడ్డలు తమ తల్లిదండ్రుల తప్పును ఎత్తిపొడుతురు.

7. యవ్వనమున చనిపోయినను, పుణ్యపురుషునికి విశ్రాంతి లభించును.

8. దీర్ఘకాలము జీవించుట వలననే గౌరవము కలుగదు. పెక్కుఏండ్లు బ్రతుకుట వలననే జీవితము సార్థకము కాదు.

9. జ్ఞానార్జనమే తల నెరయుటకు గురుతు. నిర్మలజీవితమే వృద్ధత్వమునకు చిహ్నము.

10. ప్రభువునకు ప్రీతి కలిగించిన పుణ్యపురుషుడొకడు కలడు. ఆ ప్రభువు అతనిని ప్రేమించెను. మ న అతడు పాపాత్ముల నడుమ వసించుచుండగా ప్రభువతనిని పరమునకు కొనిపోయెను.

11. చెడుగు ఆ సజ్జనుని మనసును పాడుచేసెడిదే, దుష్టత్వము ఆ సత్పురుషుని హృదయమును చెరచెడిదే, కనుక ప్రభువతనిని ముందుగనే తీసుకొనిపోయెను.

12. చెడుగు నరులను మభ్యపెట్టి, వారు మంచిని గుర్తింపకుండునట్లు చేయును. వ్యామోహములు మంచివారి హృదయములను కూడ చెరచును.

13. కాని ఆ సజ్జనుడు స్వల్పకాలముననే సిద్ధినిపొంది దీర్ఘకాలము జీవించినవాడాయెను.

14. ప్రభువు ఆ సత్పురుషుని వలన ప్రీతిచెంది, అతడిని పాప ప్రపంచము నుండి సత్వరమే కొనిపోయెను. ప్రజలకు అతని మరణమును గూర్చి తెలిసినను, వారు విషయమును అర్ధము చేసికోలేదు, సత్యము వారి తలకెక్కలేదు.

15. ప్రభువు తన భక్తులకు కృపను, కరుణను దయచేయుననియు, వారిని కాచి కాపాడుననియు ప్రజలు గ్రహింపరైరి.

16. చనిపోయిన పుణ్యపురుషుడు బ్రతికియున్న దుర్మార్గుని ఖండించును. స్వల్పకాలములో సిద్ధిని పొందిన యువకుడు దీర్ఘకాలము జీవించు వృద్ధపాపిని పరిహాసము చేయును.

17. జ్ఞాని యవ్వనముననే చనిపోవుటను దుష్టులు చూతురు. కాని ప్రభువతనికి ఏమి ఉద్దేశించెనో వారు గ్రహించజాలరు. అతనికెట్టి భద్రత కలిగించెనో అర్థము చేసికోజాలరు

18. జ్ఞాని మరణమునుచూచి దుర్మార్గులు నవ్వుదురు. ప్రభువు మాత్రము వారిని గేలిచేయును. ఆ దుష్టులు చచ్చినపుడు వారిని గౌరవప్రదముగా పాతి పెట్టరు.మృతులుకూడ వారిని సదా చీదరించుకొందురు.

19. ప్రభువు వారిని క్రిందికి బడద్రోయగా వారి నోట మాటలురావు. వారు పునాదులు కదలిన భవనమువలె కూలి నాశనమగుదురు. నానా యాతనలకు గురియగుదురు. ఎల్లరును వారిని విస్మరింతురు.

20. తమ పాపములకు లెక్కనొప్పజెప్పవలసిన న్యాయనిర్ణయ దినమున ఆ దుర్మార్గులు గడగడవణకుదురు. వారి దుష్కార్యములే వారిని దోషులుగా నిరూపించును