ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోనా 4వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. ఇది అంతయు చూచి యోనా మిగుల మనస్సు నొచ్చుకొని ఆగ్రహము చెందెను.

2. అతడిట్లు ప్రార్థించెను: “ప్రభూ! నేను మా ఇంటి వద్దనున్నపుడే నీవిట్లు చేయుదువని చెప్పలేదా? కావుననే నేను తప్పించుకొని తర్షీషునకు వెళ్ళిపోయితిని. నీవు దయ, నెనరుగల దేవుడవు. సులభముగా కోపించువాడవు కావు. మిక్కిలి కరుణగలవాడవు. నీ మనసు మార్చుకొని జనులను శిక్షింపక వదలివేయుదువు.

3. ప్రభూ! ఇప్పుడు నీవు నా ప్రాణములు తీసికొనుము. నేను బ్రతికియుండుట కంటె చచ్చుటయే మేలు.”

4. అందుకు ప్రభువు అతనితో “నీవు ఇట్లు కోపించుట తగునా?” అని అనెను.

5. యోనా నగరమునుండి వెడలిపోయి తూర్పు ప్రక్కకు వెళ్ళి అచట కూర్చుండెను. అచట ఒక పందిరి వేసికొని దాని నీడలో కూర్చుండి నగరమునకు ఏమి జరుగునో చూతమని వేచియుండెను.

6. యోనా తలకు నీడనిచ్చి అతనికి ఉపశాంతిని దయచేయుటకు దేవుడైన ప్రభువు అతని చెంత ఒక సొరపాదు పెరుగునట్లు చేసెను. యోనా దానిని చూచి మిగుల సంతోషించెను.

7. కాని మరునాటి వేకువనే దేవుడు ఒక పురుగును ఏర్పరుపగా, అది ఆ పాదును తొలచగా అది చచ్చెను.

8. సూర్యుడుదయించిన పిదప దేవుడు తూర్పునుండి వేడిగాలి తోలించెను. సూర్య తాపమునకు తాళజాలక యోనా సొమ్మసిల్లి పడిపోవునట్లుండెను. అతడు ప్రాణములు విడువగోరెను. “నేను బ్రతుకుట కంటెచచ్చుటయే మేలు" అని పలికెను.

9. దేవుడు యోనాతో “నీవు ఆ సొరపాదు పోయినందుకు ఇంతగా కోపించుటతగునా?” అని అనెను. అతడు “నేను కోపించుట న్యాయమే, నేను చనిపోవునంతగా కోపింతును” అని బదులు చెప్పెను.

10. అప్పుడు ప్రభువు అతనితో “ఈ సొరపాదు ఒక రేయి పెరిగి ఒక రేయి చచ్చినది. నీవు దానికొరకు ఎట్టి కష్టమును చేయలేదు. దానిని పెంచనూలేదు. అయినను అది పోయినందులకు ఇంతగా చింతించు చున్నావే,

11. అయితే అభము శుభము తెలియని వారు లక్ష ఇరువది వేల కంటె ఎక్కువ మందియే ఉన్నారు. ఇంకను పెక్కుపశువులును కలవు, మరి నేను ఆ పెద్దనగరమైన నీనెవె మీద జాలి చూప వలదా?” అనెను.