1. బోవసు వెళ్ళి నగరద్వారము చెంత రచ్చబండ వద్ద కూర్చుండెను. అంతలో మునుపు బోవసు పేర్కొనిన ఎలీమెలెకు దగ్గరిబంధువు ఆ త్రోవన పోవు చుండెను. బోవసు అతనిని పిలిచి, ఇటువచ్చి కూర్చుండుమని చెప్పెను. అతడు వచ్చి రచ్చపట్టున కూర్చుండెను.
2. బోవసు నగరమునుండి పదిమంది పెద్దలను పిలిచి వారిని తన దాపున కూర్చుండబెట్టు కొనెను.
3. బోవసు ఆ దగ్గరిచుట్టముతో “నవోమి మోవాబునుండి తిరిగివచ్చినదికదా! ఆమె మన బంధువైన ఎలీమెలెకునకు చెందిన పొలమును అమ్మ గోరుచున్నది.
4. ఈ సంగతి నీకు ఎరిగింపవలయును అనుకొంటిని. నీకు వలయునేని ఈ పెద్దల సమక్షమున ఆ భూమిని సంపాదించుకొనుము. ఆ పొలమును విడిపింపవలసిన బాధ్యత మొదటనీది. అటు తరువాత నాది. నీకు అక్కరలేదేని ఆ మాట కూడ చెప్పుము” అనెను. అతడు "నేను విడిపించెదను” అని పలికెను.
5. బోవసు మరల “నీవు నవోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరుచునట్లు, చనిపోయినవాని భార్యయైన రూతు అను మోవాబీయురాలు యొద్దనుండి దానిని సంపాదించుకొనవలెను” అని అనెను.
6. ఆ మాటలకు ఆ దగ్గరి బంధువు “అటులయినచో నేను ఆ పొలమును విడిపింపలేను. క్రొత్తసంతానము వలన నా పిల్లలకు దక్కవలసిన ఆస్తి తగ్గిపోవును. కనుక నీవే ఆ భూమిని తీసికోవచ్చును” అని పలికెను.
7. వెనుకటి రోజులలో యిస్రాయేలీయులలో ఒక ఆచారము ఉండెడిది. పొలమును అమ్మునపుడుగాని, మారకము వేయునవుడుగాని బేరము ముగిసినదనుటకు గుర్తుగా వారిలో ఒకడు తన చెప్పు తీని అవతలివానికి ఇచ్చెడి వాడు.
8. కనుక దగ్గరిచుట్టము బోవసుతో నీవే ఆ భూమిని తీసికొమ్మని పలికి కాలి చెప్పు విడిచెను.
9. బోవసు అచట సమావేశమైన పెద్దలతోను మరి యితరులతోను “వినుడు, నేడు నేను ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతటిని నవోమి నుండి కొంటిననుటకు మీరే సాక్షులు.
10. మహ్లోను భార్యయు మోవాబీయురాలైన రూతును నేను పెండ్లి యాడుదును. ఆమెకు కలిగిన సంతానము ఎలీమెలెకు పొలమునకు వారసులగుదురు. ఈ రీతిగా గతించిన ఎలీమెలెకు కుటుంబము మన జనమందును, మన నగరమందును వర్ధిల్లును. మీరందరు దీనికి సాక్షులు” అనెను.
11. అచట ప్రోగైన పెద్దలు మరియు ఇతరులు “మేమందరము ఈ ఉదంతమునకు సాక్షులము. నీ ఇంట అడుగుపెట్టనున్న ఈ యిల్లాలు కూడ, పూర్వము యాకోబునకు పెక్కుమంది బిడ్డలను కనిన రాహేలు, లేయాలవలె ప్రభువు కృపవలన సంతానవతి అగును గాక! నీవు ఎఫ్రాతా తెగనందు సంపన్నుడవగుదువు గాక! బేత్లెహేమున సుప్రసిద్ధుడవగుదువుగాక!
12. ప్రభువు నీకును ఈ యువతికిని ప్రసాదించు సంతానము వలన పూర్వము యూదా తామారులు కనిన పెరెసు కుటుంబమువలె నీ కుటుంబమును కీర్తి కెక్కును గాక!” అని దీవించిరి.
13. అంతట బోవసు రూతును పెండ్లియాడెను. అతడు రూతును కూడగా ఆమె గర్భముతాల్చి బిడ్డను కనెను.
14. ఆ ఊరి స్త్రీలు నవోమితో “ప్రభువు స్తుతింపబడునుగాక! అతడు నీకొక మగకందును ప్రసాదించెను. ఈ బిడ్డడు యిస్రాయేలున సుప్రసిద్ధుడు అగును గాక!
15. నీ కోడలికి నీవన్న ప్రాణముకదా! ఆమె నీకు ఏడుగురు కుమారులకంటెను మిన్న. నేడు ఆమెకనిన ఈ శిశువువలన నీకు ఆనందము కలుగును. నీ ముసలితనమున ఇతడు నిన్ను ఆదుకొనును” అని పలికిరి.
16. నవోమి ఆ బిడ్డను రొమ్మునకు అదుముకొనెను. తానే ఆ శిశువునకు దాది అయ్యెను.
17. ఇరుగుపొరుగు స్త్రీలు ఆ శిశువునకు ఒబెదు అని పేరు పెట్టిరి. నవోమికి బిడ్డకలిగెనని ఊరంతయు చెప్పుకొనిరి. ఇతడే దావీదు తండ్రియైన యిషాయికి జనకుడు.
18-22. పెరెసునుండి దావీదువరకు గల వంశ వృక్షమిది: పెరెసు, హెస్రోను, రాము, అమ్మినాదాబు, నహస్సోను, సల్మోను, బోవసు, ఒబెదు, యిషాయి, దావీదు.