ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విలాప గీతములు 4వ అధ్యాయము || Roman catholic Bible in Telugu

 1. మన బంగారమునకు వన్నెతరిగెను. మన మేలిమిబంగారము, కాంతిని కోల్పోయెను. దేవాలయపు రాళ్ళను కొనిపోయి వీధులలో పడవేసిరి.

2. సియోను యువకులు మేలిమిబంగారము వంటివారు. కాని యిపుడు వారిని కుమ్మరి చేసిన మట్టికుండలతో సమానముగా నెంచిరి.

3. నక్కలు కూడ పిల్లలకు పాలిచ్చి పెంచును. కాని నా ప్రజలు ఎడారిలోని నిప్పుకోళ్ళవలె తమ పిల్లలపట్ల క్రూరముగా ప్రవర్తించిరి.

4. దప్పికవలన చంటిబిడ్డల నాలుకలు అంగిటికంటుకొని పోవుచున్నవి. పసిగందులు అన్నముకొరకు ఏడ్చుచున్నారు గాని ఎవరును తిండి పెట్టుటలేదు.

5. పూర్వము శ్రేష్ఠమైన భోజనములు ఆరగించినవారు ఇపుడు వీధులలో అలమటించుచున్నారు. పూర్వము రాజవస్త్రములు తొడిగినవారు ఇపుడు కూటి కొరకు చెత్తకుప్పలు గాలించుచున్నారు.

6. నా ప్రజలకు పడిన శిక్ష సొదొమ ప్రజల శిక్షను మించినది. దైవహస్తము సొదొమ ప్రజలను అకస్మాతుగా శిక్షించెను

7. పూర్వము మన రాజకుమారులు పాలకంటెను, మంచుకంటెను నిర్మలముగా ఉండిరి. వారి తనువులు కెంపులవలె అరుణ కాంతులొలికెను. నీలమణులవలె ప్రకాశించెను.

8. కాని ఇప్పుడు వారి మొగములు బొగ్గువలె నల్లబారెను. వీధులలో వారిని గుర్తించువారే లేరైరి. వారి చర్మము కొయ్యవలె ఎండిపోయి ఎముకలకంటుకొనెను.

9. ఆకలివలన చనిపోవు వారికంటె యుద్ధమున గతించిన వారే మెరుగు. ఆకటివాత బడినవారు తిండి దొరకక నవిసినవిసి చనిపోయిరి.

10. ప్రేమ హృదయులయిన స్త్రీలు తమ చేతులతోనే తమ శిశువులను ఉడుకబెట్టుకొనిరి. నా ప్రజలకు తిప్పలు వచ్చిన వేళ ఆ పసిగందులే వారికి ఆహారమైరి.

11. ప్రభువు మహోగ్రుడై తన ఆగ్రహమును కుమ్మరించెను. ఆయన సియోనునకు నిప్పుపెట్టగా, అది ఆ నగర పునాదులను కూడ కాల్చివేసెను.

12. లోకములోని జనులుకాని, అన్యజాతుల రాజులుకాని, శత్రువులు యెరూషలేము ద్వారములలో ప్రవేశింతురని అనుకొనలేదు.

13. ప్రవక్తల పాపమువలన, యాజకుల అపరాధమువలనను ఈ కార్యము జరిగెను. వారు నగరమున నిర్దోషుల రక్తము నొలికించిరి.

14. వారు నెత్తురు మరకలతో అపవిత్రులైరి గ్రుడ్డివారివలె పురవీధులలో తిరిగిరి. కావున ప్రజలు వారి బట్టలను కూడ ముట్టరయిరి

15. ప్రజలు వారిని చూచి, దూరముగా పొండు, మీరు అపవిత్రులైతిరి, దూరముగా పొండు మమ్ము ముట్టుకొనకుడు అని అరచిరి. వారు అన్యజాతులవద్దకు పోయిరి కాని ఆ ప్రజలు వారు మనలో వసింపరాదు అని స్వీకరింపలేదు.

16. ప్రభువు వారిని పట్టించుకోడయ్యెను ఆయన వారిని తరిమివేసెను. ఆయన మన యాజకులను కరుణింపలేదు. మన పెద్దలను దయచూడలేదు.

17. మనము నిరకముగా సహాయము కొరకెదురు చూచితిమి. మనలను రక్షింపలేని దేశమునుండి " గంపెడాశతో ఆశ్రయము కొరకు ఎదురుచూచితిమి.

18. శత్రువులు మన కొరకు కాచుకొనియుండిరి. కనుక మనము వీధులలో నడవజాలమైతిమి. మన రోజులు ముగిసెను. మన అంతము సమీపించెను.

19. మన విరోధులు గరుడపక్షి కంటే వేగముగా మన మీదికి దిగివచ్చిరి. ఆ వారు కొండలపై మనలను వెన్నాడిరి. ఎడారిలో మన కొరకు పొంచియుండిరి.

20. మనకు ప్రాణాధారమైన వానిని, ప్రభువు అభిషేకించిన వానిని, అన్యజాతులనుండి మనలను కాపాడునని ఆశించినవానిని, శత్రువులు పట్టుకొనిరి.

21. ఎదోము ఊజు ప్రజలారా! మీరు సంతసముతో పొంగిపొండు. మీరును వినాశపాత్రములోని రసమును త్రాగుదురు. తప్పద్రాగి దిగంబరులై తూలిపడుదురు.

22. సియోను ప్రజలు తమ పాపములకు పూర్ణశిక్షను అనుభవించిరి. ప్రభువు వారిని మరల ప్రవాసమునకు పంపడు. కాని ఎదోము జనులారా! ప్రభువు మిమ్ము దండించును ఆయన మీ దోషములను బట్టబయలు చేయును.