1. హెబ్రోనున అబ్నేరును చంపిరని వినగనే ఈష్బోషెతునకు గుండెచెదరెను. యిస్రాయేలీయులు కూడ ధైర్యము కోల్పోయిరి.
2. ఈష్బోషెతు కొలువున ఇరువురు ఉద్యోగులుండిరి. వారి పేర్లు రేకాబు, బానా. బెయేరోతు నివాసి, బెన్యామీనీయుడునగు రిమ్మోను వారి తండ్రి. (బెయేరోతు కూడ బెన్యామీను మండలమునకు చెందినదే.
3. బెయేరోతు పౌరులు గిత్తాయీమునకు పారిపోయి నేటివరకు అచ్చటనే పరదేశులుగా బ్రతుకుచున్నారు.)
4. సౌలు కుమారుడైన యోనాతానునకు కుంటి వాడైన కొడుకు ఒకడు కలడు. అతడు ఐదేండ్లవాడై యుండగా సౌలు యోనాతాను యుద్ధమున కూలిరని యెస్రెయేలు నుండి వార్తలు వచ్చెను. వెంటనే దాది అతనిని తీసికొని వడివడిగా పరుగిడుచుండగా వాడు పడి కుంటివాడయ్యెను. ఆ బాలుని పేరు మెఫీబోవెతు.
5. బెయేరోతు పౌరుడైన రిమ్మోను కుమారులు రేకాబు, బానా అనువారు ప్రయాణమై వచ్చి ఈష్బోషెతు ఇల్లు చేరిరి. అది మిట్టమధ్యాహ్నము. సూర్యుడు నిప్పులు చెరుగుచుండెను. ఎండవేడిమికి విశ్రాంతి గైకొనుచు ఈష్బోషెతు పడుకపై పరుండియుండెను.
6. ద్వారపాలిక గోధుమలు కడుగుచు కునుకుపాటున తూగుచుండెను.
7. రేకాలు, వాని తమ్ముడు బానా మెల్లమెల్లగా ఇల్లు సొచ్చి ఈష్బోషెతు పరుండియున్న పడుక గదిలో ప్రవేశించిరి. అతనిని వధించి తల నరికిరి. ఆ తల తీసికొని రాత్రియంతయు యోర్దాను లోయవెంట ప్రయాణము చేసిరి.
8. వారు హెబ్రోను చేరి ఈష్బోషెతు శిరస్సును దావీదునకు సమర్పించిరి. “నీ ప్రాణములు తీయుటకు సిద్ధపడిన సౌలు కుమా రుడు ఈష్బోషెతు శిరస్సిదిగో! నేడు ప్రభువు పక్షమున యావే సౌలుమీదను, అతని కుమారునిమీదను పగతీర్చుకొనెను” అనిరి.
9. కాని దావీదు ఆ అన్నదమ్ములను చూచి “నన్ను సకల ఆపదల నుండి కాపాడిన యావే జీవము తోడు!
10. మునుపొకడు సౌలు మరణవార్తలతో వచ్చి నాకు శుభవార్తలు కొనివచ్చితిననుకొనెను. కాని నేను సిక్లాగున వాని తలతీయించితిని. ఆ రీతిగా వాని శుభవార్తలకు సంభావన జరిగినది.
11. ఇక నేడు బందిపోటు దొంగలు నిర్దోషిని ఒకనిని, అతని ఇంటనే పండుకొన్న పడుకమీదనే వధించిరనిన నేను వారిని మాత్రము సంభావింపకుందునా? మీ దోషమునకు మీరే బాధ్యులు కనుక మీ అడపొడ కానరాకుండ చేసెదను” అనెను.
12. అంతట దావీదు ఆనతినీయగా సైనికులు ఆ మనుష్యుల మీదబడి వారిని తునుమాడిరి. వారి కాలుసేతులు తెగనరికి మొండెములను హెబ్రోను కొలనుచెంత వ్రేలాడగట్టిరి. ఈష్బోషెతు శిరస్సును మాత్రము హెబ్రోనునందు అబ్నేరు సమాధిలోనే పాతి పెట్టిరి.