1. పెద్దనైన నేను నిజముగా ప్రేమించు నా ప్రియ గాయునకు:
2. నా ప్రియమిత్రుడా! నీకు సర్వదా శుభమగునుగాక! నీ ఆత్మనందు వర్ధిల్లుచున్నట్లే, శారీరకముగా సుఖముగ ఉందువుగాక అనియు ప్రార్థించుచున్నాను.
3. నీవు సత్యమున జీవించునట్లే నీ సత్య ప్రవర్తనను గూర్చి కూడ ఇచ్చట చేరిన కొందరు సోదరులు చెప్పగా విని అమితముగా సంతోషించితిని.
4. నా బిడ్డలు సత్యమును అనుసరించుచున్నారు అని వినుట కంటె నాకు ఆనందదాయకమగు విషయము వేరొకటి లేదు.
5. ప్రియ మిత్రుడా! సోదరులకు ముఖ్యముగా పరదేశులకును నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్లుగ చేయుచున్నావు.
6. వారు నీ ప్రేమను గూర్చి దైవ సంఘము ఎదుట సాక్ష్యము ఇచ్చిరి. దేవుని సేవకు తగినట్లుగ నీవు వారిని సాగనంపుట యుక్తము.
7. ఏలయన, అన్యులనుండి ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము వారు బయలుదేరిరి.
8. కనుక మనము సత్య వ్యాపకములో తోటి పనివారమగునట్లు వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము.
9. దైవ సంఘమునకు నేను ఒక చిన్న లేఖ వ్రాసితిని. కాని వారికి నాయకత్వము వహింపవలెనని ఉన్న, దియోత్రేఫె మా అధికారమును అంగీకరించుట లేదు.
10. కనుక నేను వచ్చినపుడు అతడు చేయు పనులను గూర్చియు, మమ్ము గూర్చి పలికెడు చెడు మాటలను గూర్చియు, సర్వమును విశదము చేసెదను. కాని అది చాలదన్నట్లు అతడు సోదరులను ఆహ్వానించుటకు నిరాకరించును. ఆహ్వానింపదలచిన వారిని కూడ ఆటంకపరచును. వారిని దైవ సంఘమునుండి వెడలగొట్టుటకు ప్రయత్నించును.
11. ప్రియమిత్రమా! చెడునుకాక మంచిని మాత్రమే అనుసరింపుము. మంచి చేయువాడు దేవునకు చెందినవాడు. చెడు చేయువాడు దేవుని చూడలేడు.
12. అందరు దెమేత్రిని గూర్చి మంచియే పలుకుచున్నారు. సత్యమే అతనిని గూర్చి సాక్ష్యము ఇచ్చినది. నేను కూడ అతనిని గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాను. నా సాక్ష్యము సత్యమని నీకు తెలియును.
13. నేను నీకు చెప్పవలసినది చాలా ఉన్నది. కాని, లేఖ ద్వారా తెలుపుటకు నాకు ఇష్టము లేదు.
14. నేను మిమ్ము త్వరలో కలిసికొనగలనని ఆశించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా సంభాషించెదను.
15. నీకు సమాధానము కలుగును గాక! నీ స్నేహితులు అందరును శుభాకాంక్షలు పంపుచున్నారు. మన స్నేహితులందరికిని నా శుభాకాంక్షలను అందజేయుము.