ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు 31వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. మస్సారాజయిన లెమూవేలు సూక్తులివి. ఆ రాజు తల్లియే ఈ సూక్తులతనికి నేర్పించెను:

2. నాయనా! నీవు నా కడుపున పుట్టిన గారాల బిడ్డవు, నా నోముల పంటవు. నేను నీకేమి బోధింపగలను!

3. నీ బలసంపదను పూర్తిగా స్త్రీలకు అర్పించుకోవలదు. మగువలు రాజులను నాశనము చేయుదురు.

4. నాయనా! లెమూవేలూ! రాజులు ద్రాక్షారసమును సేవింపరాదు, మద్యపానాసక్తి అధిపతులకు తగదు.

5. వారు త్రాగియున్నపుడు ధర్మవిధులను విస్మరించి పేదసాదల హక్కులను భంగపరతురు.

6. మరణము ఆసన్నమైనవారికి, తీవ్రవేదనలో ఉన్నవారికి మాత్రమే మద్యము తగును.

7. వారు దానిని సేవించి తమ బాధలను, విషాదమును విస్మరింతురు.

8. నీవు నోరు లేనివారి పక్షమున మాట్లాడుము. నిస్సహాయుల కోపు తీసికొనుము.

9. అనాథల పక్షమున వాదించి వారికి న్యాయము కలుగునట్లుగా తీర్పు చెప్పుము. పేదసాదలను అక్కరలో ఉన్నవారినాదరించి వారి హక్కులను నిలబెట్టుము. .

10. యోగ్యురాలైన గృహిణి ఎచట దొరకును? ఆమె పగడములకంటెను విలువైనది.

11. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఆమె వలన అతనికి చాల లాభము కలుగును.

12. ఆమె జీవించినంత కాలము అతడికి మేలునేగాని కీడుచేయదు.

13. ఆ గృహిణి నిత్యము ఉన్నిని, నారను వడకును. నిరంతరము ఆసక్తితో పనిచేయును.

14. వాణిజ్య నౌకవలె దూరప్రాంతములనుండి భోజనపదార్థములను తెప్పించును.

15. వేకువనే నిద్రలేచి తన కుటుంబమునకు భోజనము సిద్ధము చేయును. పనికత్తెలకు పనులు ఒప్పగించును.

16. ఆమె ఒక పొలమును చూచి దానిని వెలకు కొనును. స్వార్జితముతోనే అందు ద్రాక్షలు నాటించును.

17. ఆ ఉవిద కష్టపడి పనిచేయును, ఆమె చేతులు మిగుల బలము కలవి.

18. ఆమె కృషికి సత్పలమబ్బును. రేయెల్ల ఆమె ఇంట దివ్వె వెలుగుచునే ఉండును.

19. ఆ గృహిణి తన నూలు తాను వడకుకొని, తన బట్టలు తాను నేసికొనును.

20. పేదసాదలకు దానధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును.

21. మంచు కురిసినను ఆమె వెరువదు. ఆమె ఇంటివారెల్ల వెచ్చని బట్టలు ధరింతురు.

22. ఆమె తన పరుపులు తాను తయారు చేసికొనును, తాను మేలైన ఎఱ్ఱని నారబట్టలు తాల్చును.

23. ఆమె పెనిమిటి సభలో పెద్ద మనుష్యులనడుమ కూర్చుండి ఎల్లరిమన్నన పొందును.

24. ఆమె నారబట్టలు, నడికట్టులు తయారుచేసి వర్తకులకు అమ్మును.

25. ఆ గృహిణి బలవంతురాలు. ఆమె ఎల్లరినుండి గౌరవమును బడయును. భవిష్యత్తును గూర్చి ఆందోళన చెందదు.

26. విజ్ఞాన వాక్యములు పలుకును. మృదువుగా మాట్లాడును.

27. సోమరితనమునకు ఎంతమాత్రము తావీయక, కుటుంబపరిస్థితులను మెలకువతో చక్కదిద్దుకొనును. పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.

28. ఆమె తనయులు ఆమెను ధన్య అని కొనియాడుదురు. పెనిమిటి ఆమెను మెచ్చుకొనును.

29. అతడు “యోగ్యురాండ్రయిన ఇల్లాండ్రు చాలమంది కలరు. వారెల్లరిలోను నీవు ఉత్తమురాలివి” అని పలుకును

30. తళుకు బెళుకులు నమ్మరానివి. అందము నిలుచునదికాదు. ప్రభువుపట్ల భయభక్తులుగల మహిళ మెచ్చుకోదగినది.

31. ఆ గృహిణి మంచి పనులకుగాను ఆమెను కీర్తింపవలయును. ఆమె కృషి పదిమందిలోను ప్రశంసలు పొందునుగాక!