ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తోబీతు 3వ అధ్యాయము || Telugu catholic bible online

 1. ఆ మాటలకు నేను సంతాపము చెంది నిట్టూర్పు విడిచితిని, ఏడ్చితిని. ఈ క్రింది శోకగీతమును జపించితిని:

2. "ప్రభూ! నీవు న్యాయవంతుడవు. నీ కార్యములన్నియు న్యాయసమ్మతములైనవి. నీవు నమ్మదగినవాడుగా మెలగుదువు. నీవు ఈ లోకమునకు న్యాయాధిపతివి.

3. నన్ను కరుణతో బ్రోవుము. నా పాపములకు నన్ను శిక్షింపకుము. తెలియక చేసిన తప్పిదములకుగాను నన్ను దండింపకుము. మా పితరుల పాపములకు నన్ను శిక్షింపకుము.

4. మేము నీ ఆజ్ఞలను మీరితిమి. నీకు ద్రోహముగా పాపము చేసితిమి. నీవు మమ్ము మా శత్రువుల చేతికి అప్పగింపగా వారు మమ్ము దోచుకొనిరి. మమ్ము బందీలుగా కొనిపోయి చంపివేసిరి. మేము ఏఏ జాతుల మధ్య చెల్లాచెదరైతిమో వారెల్లరును మమ్ము ఆడిపోసికొని, అవహేళన చేయునట్లు చేసితివి.

5. నీవు మా పితరులకు వారి పాపములకు తగిన శిక్షను, నాకు నా పాపములకు తగిన శిక్షను విధించితివి. మేము నీ ఆజ్ఞలను పాటింపలేదు. నీపట్ల చిత్తశుద్ధితో ప్రవర్తింపలేదు. కనుక మేము పొందిన శిక్ష సముచితమైనదే.

6. ఇప్పుడు నన్ను నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. నా ప్రాణములు తీసి నన్ను ఈ లోకమునుండి కొనిపొమ్ము. నా శరీరము మట్టిలో కలిసిపోవునుగాక! నేను కన్నుమూయుటయే మేలు. నేను పొందగూడని అవమానములు పొంది , విచారమనస్కుడనైతిని, ప్రభో! నీవు ఆజ్ఞ యిచ్చిన చాలును, నాకు చావు ప్రాప్తించి, ఈ వెతలన్ని తీరిపోవును. నేను శాశ్వతపదము చేరుకొందును. కనుక నీవు నా మనవిని త్రోసిపుచ్చకుము. ఇట్టి దైన్య జీవితము జీవించుటకంటె, ఇట్టి క్రూరావమానములు భరించుటకంటె, చచ్చుటమేలు.”

7. ఆరోజుననే మాదియా దేశమునందలి ఎక్బటానా నగరమున వసించుచున్న రగూవేలు పుత్రిక సారాను ఆమె తండ్రి పనికత్తె అవ మానించెను.

8. ఈ సారాకు ఏడుసార్లు పెండ్లియైనది. కాని అస్మోదియసు అను దుష్ట పిశాచము ప్రతిపర్యాయము సారా వరులు ఆమెను కూడకమునుపే వారిని చంపివేసెడిది. పనికత్తె సారాతో “నీ భర్తలను నీవే చంపివేయుచున్నావు. ఇప్పటికే నిన్ను ఏడుగురుకు కట్టబెట్టిరి. కాని వారిలో ఒక్కరివలనను నీకు పిల్లలు పుట్టలేదు.

9. నీ మగలు చచ్చిరి కనుక నీవు మమ్ము దండింతువాయేమి? నీవును పోయి ఆ చచ్చిన వరులతో కలియుము. అప్పుడు నీ సంతానమును కంటితో చూచు దుర్గతి మాకు పట్టదు” అనెను.

10. ఆ మాటలకు సారా విచారముతో వెక్కి వెక్కి ఏడ్చెను. ఉరిపెట్టుకొని చత్తుననుకొని మేడమీదకు ఎక్కిపోయి తండ్రిగది ప్రవేశించెను. కాని ఆమె మరల “నేనిట్లు చేసినచో ప్రజలు నా తండ్రిని నిందింపరా? వారు 'నీకొక్కతియే కుమార్తె. నీవామెను గారాబముగా పెంచుకొంటివి. కాని ఇప్పుడామె దిగులుతో ఉరి పెట్టుకొనినది” అని అనరా? నేను వృద్దుడైన నా తండ్రిని దుఃఖపెట్టి ఆ ముసలిప్రాణి విచారముతో మృత్యులోకము చేరుకొనునట్లు చేయుటేమి న్యాయము? కనుక నేను వివేకముతో ప్రవర్తించి ఈ ఆత్మహత్యాయత్నమును మానుకోవలెను. నన్ను తీసికొనిపొమ్మని మాత్రము ఆ ప్రభువును వేడికొందును. అప్పుడు ఈ అవమానములను భరింపనక్కరలేదు” అనుకొనెను.

11. అంతట ఆమె గవాక్షముచెంత నిలుచుండి చేతులెత్తి ప్రభువును ఈ రీతిగా ప్రార్ధించెను: “దయామయుడవైన ప్రభూ! నీకు స్తుతి కలుగునుగాక! నీ దివ్యనామము సదా కీర్తింపబడునుగాక! నీవు చేసిన ఈ సృష్టి అంతయు నిన్ను సన్నుతించునుగాక!

12. నేను నీ వైపు కన్నులెత్తి నిన్ను శరణువేడుచున్నాను.

13. నీవు ఒక్కమాట పలికి నా ప్రాణములను కొనిపొమ్ము. నేను ఈ అవమానములను ఇక భరింపజాలను.

14. ప్రభూ! నా కన్యత్వము ఇంతవరకును చెడలేదు. ఏ పురుషుడును నన్నింతవరకు ముట్టుకొనలేదు. ఈ సంగతి నీకు తెలియును.

15. నేను ఈ ప్రవాసదేశమున ఇంతవరకు ఎట్టి చెడ్డపేరు తెచ్చుకోలేదు, మా తండ్రికి అపకీర్తి తేలేదు. నేను మా తండ్రికి ఏకైకపుత్రికను. అతనికి మరియే వారసులును లేరు. నేను పెండ్లియాడుటకు మా తండ్రి తరపు చుట్టములు గూడ ఎవరును లేరు, ఇప్పటికే నా భర్తలు ఏడుగురు చచ్చిరి. ఇక నేను బ్రతికి ఏమి లాభము ? నా ప్రాణములను గొనిపోవుట నీకిష్టము కాదేని ప్రభూ! నన్ను ఆదరముతోనైన చూడుము. ఈ అవమానములను మాత్రము నేనిక భరింపజాలను.”

16. తోబీతు మరియు సారా చేసిన ఈ ప్రార్ధనలను దేవుడు ఆకాశమునుండి ఆలించెను.

17. అతడు వారికి తోడ్పడుటకు తన దూతయైన రఫాయేలును పంపెను. తోబీతు కన్నులలోని పొరలను తొలగించి అతనికి మరల చూపు దయచేయుటకును, సారా తోబియాలకు పెండ్లి కుదుర్చుటకును, ఆమె నుండి అస్మోదియసు అను దుష్టపిశాచమును పారద్రోలుటకును దేవుడు ఆ దూతను పంపెను. తోబియా సారాకు అయినవాడు కనుక ఆమెను పెండ్లియాడు హక్కు ఇతర వరులు అందరికంటెగూడ అదనముగా అతనికి కలదు. అచట తోబీతు ముంగిటినుండి ఇంటి లోనికి అడుగుపెట్టినపుడే ఇచట సారాకూడ మీది గది నుండి క్రిందికి దిగివచ్చెను.