1. ప్రభువిట్లనుచున్నాడు: ఆ కాలమున యూదా యెరూషలేములకు మరల సౌభాగ్యమును ఒసగుదును.
2. నేను జాతులన్నిటిని ప్రోగుచేసి యెహోషాఫాత్తులోయకు' కొనివత్తును. వారు నా సొంత ప్రజలకు చేసిన కీడునకుగాను నేను వారికచట తీర్పు తీర్తును. వారు యిస్రాయేలీయులను జాతులమధ్య చెల్లాచెదురుచేసి నాదేశమును తమలోతాము పంచుకొనిరి.
3. వారు బందీలైన నా ప్రజల కొరకు ఓట్లు వేసికొనిరి. వేశ్యలపొందు కొరకు బాలకులను అమ్మివేసిరి. మద్యమును కొని త్రాగుటకుగాను బాలికలను విక్రయించిరి.
4. తూరు, సీదోను, ఫిలిస్తీయా దేశములారా! మీతో నాకు పనియేమి? మీరు నాకు ప్రతీకారము చేయనెంచుచున్నారా? నేను చేసినదానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా?
5. మీరు నా వెండి బంగారములనుకొనిపోతిరి. అమూల్యమైన నా నిధులను మీ దేవళములలోనికి తీసికొని పోతిరి.
6. యూదా, యెరూషలేము జనులను వారి దేశమునుండి దూరముగా కొనిపోయి గ్రీకువారికి అమ్మివేసితిరి.
7. నేను మీరు అమ్మివేసిన తావులనుండి వారిని మరల కొనివత్తును. మీరు వారికి చేసిన కీడులనే నేను మీకును చేయుదును.
8. నేను మీ కుమారులను, కుమార్తెలను యూదావాసులకు అమ్మింతును. వారు వారిని దూరమున వసించు షెబా జాతికి అమ్మివేయు దురు. ఇది ప్రభుడనైన నా వాక్కు”.
9. అన్యజాతులకు ఇట్లు ప్రకటన చేయుడు: “మీరు యుద్ధమునకు సన్నద్దులు కండు. మీ యోధులను పిలువుడు. మీ సైనికులను ప్రోగుచేసికొని పోరునకు నడువుడు.
10. మీ నాగటి కర్రలతో కత్తులను చేసికొనుడు. మీ కొడవళ్ళతో ఈటెలను చేసికొనుడు. దుర్భలుడు కూడ “నేను యోధుడను' అనుకొనవలెను
11. ఇరుగుపొరుగు జాతుల ప్రజలారా! మీరు శీఘ్రమే రండు, లోయలో ప్రోగుకండు. ప్రభూ! ఆ ప్రజలమీద పడుటకు నీ సైన్యమును పంపుము.
12. జాతులు సిద్ధమై యెహోషాపాత్తు లోయకు రావలెను. ఇరుగుపొరుగు జాతుల జనులకు తీర్పుచెప్పుటకు ప్రభుడనైన నేను ధర్మపీఠమును అధిష్ఠింతును.
13. ఆ జనులు మిగుల దుష్టులు గాన, పండినపంటనువలె వారిని కొడవళ్ళతో కోసివేయుడు. గాటిలోని ద్రాక్షలవలె వారిని తొక్కివేయుడు. తొట్లు రసముతో నిండిపోవును.
14. యెహోషాఫాత్తు లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ప్రోగైరి. అచట తీర్పురోజు ఆసన్నమైనది.
15. సూర్యచంద్రులను చీకట్లు క్రమ్మును. తారలు కాంతిని కోల్పోవును.
16. ప్రభువు సియోనునుండి గర్జించుచున్నాడు. యెరూషలేమునుండి ఆయన కంఠధ్వని వినిపించుచున్నది. భూమ్యాకాశములు కంపించుచున్నవి. కాని ప్రభువు తన ప్రజలకు ఆశ్రయమగును. యిస్రాయేలీయులకు రక్షణదుర్గమగును.
17. యిస్రాయేలీయులారా! అపుడు మీరు నేను మీ దేవుడనని ప్రభుడనని గుర్తింతురు. నేను నా పవిత్ర నగరమైన సియోనున వసింతును. యెరూషలేము పవిత్ర నగరమగును. అన్యజాతులు దానిని జయింపజాలవు.
18. ఆ కాలము వచ్చినపుడు పర్వతములు ద్రాక్షతోటలతో నిండియుండును. కొండలు పశువులతో నిండియుండును. యూదానదులన్నియు నీటితో నిండియుండును. దేవుని మందిరమునుండి, ఒకయేరు పారి షిత్తీములోయను తడుపును.
19. ఐగుప్తు పాడువడును. ఎదోము ఎడారి అగును. ఆ దేశముల ప్రజలు యూదా మీదికి దాడిచేసి, నిర్దోషుల నెత్తురు నొలికించిరి.
20-21. నేను హతులైన వారి తరపున పగతీర్చుకొందును. దోషులను శిక్షింపకవదలను. కాని యూదాలో ప్రజలు సదా వసింతురు. యెరూషలేమున తరతరముల వరకు నరులు నివసింతురు. ప్రభుడనగు నేను సియోనున వాసము చేయుదును”.