ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోనా 3వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

1. ప్రభువువాణి రెండవమారు యోనాకు ప్రత్యక్షమై,

2. “నీవు ఆ పెద్ద నగరమైన నీనెవెకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము" అని చెప్పెను.

3. యోనా ప్రభువు ఆజ్ఞ శిరసావహించి నీనెవెకు వెళ్ళెను. ఆ పట్టణము చాల పెద్దది. దానిని దాటిపోవుటకు మూడునాళ్ళు పట్టును.

4. అతడు నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణముచేసి “నలువది దినములు ముగియగానే నీనెవె నాశనమగును” అని ప్రకటించెను.

5. నీనెవె పౌరులు దేవునిమాట నమ్మిరి. వారు ప్రజలెల్లరును ఉపవాసము చేయవలెనని ప్రకటించిరి. అధికులనుండి అల్పులవరకు అందరును గోనె ధరించిరి.

6. ఆ వార్త విని నీనెవె రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనెతాల్చి బూడిదపై కూర్చుండెను.

7. అతడు నీనెవె నగరమందంతట ఇట్లు చాటించెను: “ఇది రాజు, అతని అధికారులు జారీచేసినఆజ్ఞ. నరులు గాని, పశువులుగాని, ఎడ్లమందలు గాని, గొఱ్ఱెల మందలుగాని ఏమియు తినరాదు. ఎవరును ఏమియు తినరాదు, త్రాగరాదు.

8. నరులు, పశువులు కూడ గోనె తాల్పవలెను. ఎల్లరును నిండుమనస్సుతో మొరపెట్టవలెను. అందరును తమ దుష్టవర్తనము మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలెను.

9. ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకొని, జాలిచెంది తన కోపోగ్రతను ఉపసంహరించుకోవచ్చును. మనము చావు తప్పించుకోవచ్చును.”

10. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలిసికొనెను. వారిమీద జాలిచెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యెను.