1. నేను ప్రభువు కోపదండనమునకు గురియై బాధలను చవిచూచితిని.
2. ఆయన నన్ను నెట్టుకొనిపోయి వెలుగు ఏ మాత్రము లేని చీకటిలో నడిపించెను
3. నామీద చేయిచేసికొని దినమెల్ల నన్ను కొట్టెను.
4. నా శరీరము, నా చర్మము కృశించిపోవునట్లు చేసి, నా ఎముకలను విరుగగొట్టెను.
5. దుఃఖమయమును, విషాదపూరితమునైన చెరలో నన్ను బంధించెను.
6. నన్ను నిర్బంధ పెట్టి, పూర్వమే గతించినవారు నివసించు చీకటిలో నేనును వసించునట్లు చేసెను.
7. ఆయన నా చుట్టు కంచెవేసెను. గొలుసులతో నేను బందీనైతిని, ఇక తప్పించుకోజాలను.
8. నేను సాయము కొరకు పెద్దగా అరచి గీ పెట్టినను, ఆయన నా ప్రార్ధననాలింపలేదు.
9. ఆయన రాతిగోడలతో నామార్గమును నిరోధించెను నా త్రోవకు అడ్డములు పెట్టెను.
10. ఎలుగుబంటివలె నా కొరకు పొంచియుండెను. సింగమువలె నా మీదికి దుమికెను.
11. నన్ను త్రోవనుండి ప్రక్కకు తరిమి ముక్కలు ముక్కలుగా చీల్చివేసి, అక్కడనే వదలివేసెను.
12. తన విల్లు వంచి, నా మీదికి బాణములెక్కుపెట్టెను.
13. తన అమ్ములపొదిలోని బాణములను నా శరీరమున గ్రుచ్చుకొనునట్లు రువ్వెను.
14. ప్రజలెల్లరును నన్ను చూచి నవ్వుచున్నారు. దినమెల్ల నన్నెగతాళి చేయుచున్నారు.
15. చేదు వస్తువులే నాకు అన్నపానీయములైనవి. మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను.
16. నన్ను బండల మీద పడవేసి నా పండ్లు రాలగొట్టెను. బూడిదలో నన్ను పొర్లించెను.
17. నేను శాంతి సంక్షేమములను విస్మరింపవలసి వచ్చినది.
18. నా సత్తువ క్షీణించిపోయినది. ప్రభువుమీద నమ్మకము తొలగిపోయినదనుకొంటిని.
19. నా దురావస్థను, నా వ్యాకులమును నేను త్రాగిన మాచిపత్రి చేదును జ్ఞాపకముంచుకొనుము.
20. నాకు నిత్యము ఆ తలపులే తట్టుచున్నవి నేను విషాదమున మునిగితిని.
21. కాని ఈ అంశమును తలంచుకొనగా నాకు మరల నమ్మకము కలుగుచున్నది.
22. ప్రభువు ప్రేమ గతింపలేదు. ఆయన కరుణ సమసిపోలేదు.
23. ప్రతి ఉదయమున ఆయన ఆ భాగ్యములు క్రొత్తగా దయచేయును. ఆయన నమ్మదగినతనము అంత గొప్పది.
24. ప్రభువు నాకు భాగధేయము కనుక నేను ఆయనను నమ్మెదను.
25. తనను నమ్మువారికి, తనను వెదుకువారికి ప్రభువు మేలుచేయును.
26. కావున మనము ప్రభువు రక్షణము కొరకు ఓపికతో వేచియుండుట మేలు.
27. మనము బాల్యమునుండే ఈ ఓపికను అలవరచుకొనుట మంచిది.
28. ప్రభువు మనలను కడగండ్లపాలు చేసినపుడు మనము ఏకాంతముగను, మౌనముగను కూర్చుండవలెను.
29. మనము దైవచిత్తమునకు పూర్తిగా లొంగవలెను. అపుడు ఆయన ఆదుకోలు లభించిన లభింపవచ్చును.
30. ఆయన మనలను చెంపలు వాయించి అవమానమున ముంచినను మనము సహింపవలయును.
31. ప్రభువు నరులను శాశ్వతముగా పరిత్యజింపడు.
32. ఆయన మనలను దుఃఖముపాలు చేసినప్పుడును, మహాప్రేమతో మనలను కరుణించును.
33. నరులను బాధించి దుఃఖపెట్టుటవలన ఆయనకు ప్రీతి కలుగదు.
34. శత్రువులు దేశములోని బందీలను కాళ్ళక్రింద పడవేసి తొక్కినపుడు
35. మహోన్నతుని లెక్కచేయక నరులహక్కులను భంగపరచినపుడు,
36. న్యాయస్థానమున న్యాయమును చెరచినపుడు, ప్రభువు గమనించితీరును,
37. ప్రభువు అనుమతి లేనిదే ఎవరును ఏ కార్యములను జరుపజాలరు.
38. మహోన్నతుని ఆజ్ఞవలననే మంచిగాని, చెడుగాని జరుగును.
39. దేవుడు మన పాపములకు మనలను శిక్షించినపుడు, మనము ఫిర్యాదు చేయనేల?
40. మనము మన మార్గములను పరిశీలించి చూచుకొని ప్రభువువద్దకు తిరిగివత్తము.
41. ఆకాశమందున్న దేవునివైపు మనసు త్రిప్పి, చేతులెత్తి ఇట్లు ప్రార్థింతము.
42. మేము నీ మీద తిరుగబడితిమి, పాపము కట్టుకొంటిమి. నీవు మమ్ము క్షమింపవైతివి.
43. నీ కోపము నిన్ను మా నుండి మరుగుపరచెను. నీవు మమ్ము వెన్నాడి నిర్దయతో చంపివేసితివి.
44. నీవు ఆగ్రహమును మేఘమువలె కప్పుకొంటివి. మాప్రార్థనలు ఆ మబ్బులోనికి ప్రవేశింప జాలవయ్యెను.
45. నీవు మమ్ము లోకములోని ప్రజలకు చెత్తదిబ్బను చేసితివి.
46. మా శత్రువులు మమ్ము గేలిచేసి అవమానించిరి.
47. మేము భయాపాయములకు గురియైతిమి, వినాశమున చిక్కితిమి.
48. నా ప్రజల దుస్థితి చూడగా, నా నేత్రముల నుండి కన్నీరు ఏరులుగా పారుచున్నది.
49-50. ప్రభువు ఆకాశమునుండి క్రిందికి పారజూచి మనలను గమనించువరకును నా కన్నీళ్ళు ఏటివలె ఎడతెగక ప్రవహించుచునే ఉండును.
51. నగరములోని స్త్రీలకు పట్టిన దుర్గతిచూచి నా హృదయము వ్యధచెందుచున్నది.
52. శత్రువులు నన్ను నిష్కారణముగా ద్వేషించి, పక్షినివలె వేటాడిరి.
53. వారు నన్ను సజీవునిగా గోతిలో పడద్రోసి, దానిని బండతో కప్పివేసిరి.
54. నీళ్ళు నన్ను ముంచివేసెను. ఇక నాకు చావు తప్పదనుకొంటిని.
55. ప్రభూ! గోతి అడుగుననుండి నేను నీకు మొరపెట్టితిని.
56. నా మొర వినుమని నేను వేడుకొనగా నీవు నా ప్రార్థననాలించితివి.
57. నేను నీకు విన్నపము చేసినపుడు, నీవు నా చెంతకు వచ్చి, భయపడకుమని పలికి నాకు అభయమిచ్చితివి.
58. ప్రభూ! నీవు నాపక్షమున నిలిచి నన్నాదుకొంటివి. నా ప్రాణమును కాపాడితివి.
59. నీవు నాకు అనుకూలముగా తీర్పు చెప్పుము. నాకు జరిగిన అన్యాయము నీకు తెలియును.
60. నా శత్రువులు నన్ను ద్వేషించి, నా మీద కుట్రలు పన్నుటను నీవెరుగుదువు.
61. ప్రభూ! వారు నన్ను తిట్టుచుండగా నీవు వింటివి. వారి కుతంత్రములు నీకు తెలియును.
62. వారు దినమెల్ల నన్నుగూర్చి మాటలాడుచున్నారు నా మీద పన్నాగములు పన్నుచున్నారు.
63. వారు కూర్చుండుటను, లేచుటను చూడుము. నేను వారి గెలి పాటలకు భావమైతిని.
64. ప్రభూ! వారి చెయిదములకుగాను నీవు వారికి ప్రతీకారముచేయుము.
65. వారిని శపించి నిరాశపాలుచేయుము.
66. వారిని కోపముతో వెన్నాడుము. ఆకాశము క్రింద వారిని అడపొడ కానరాకుండ చేయుము.”