ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 3వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. బాలుడైన సమూవేలు ఏలీ పర్యవేక్షణము క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే వాక్కు చాల అరుదుగా విన్పించెడిది. ప్రభువు సాధారణముగా సాక్షాత్కారమయ్యెడివాడు కాడు.

2. ఒకనాటి రాత్రి ఏలీ పరుండియుండెను. అతని కన్నులకు మసకలు క్రమ్మియుండుటచే చూపానదయ్యెను.

3. ప్రభువుముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సమూవేలు కూడ దైవమందసము ఉన్న యావే మందిరములో పండుకొని నిద్రించు చుండెను.

4-5. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలి యొద్దకు పరిగెత్తుకొని పోయి “నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో! వచ్చితిని” అనెను. ఏలీ “నేను నిన్ను పిలువలేదు. వెళ్ళిపడుకొమ్ము” అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను.

6. యావే సమూవేలును మరల పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి “నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో! వచ్చితిని” అనెను. ఏలి “నాయనా! నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకొమ్ము' అని అనెను.

7. సమూవేలునకు యావే గూర్చి ఇంకను తెలియదు. యావే వాక్కు అతనికి ఇంకను ప్రత్యక్షము కాలేదు.

8. ప్రభువు సమూవేలును మూడవ సారి కూడ పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి “నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో! వచ్చితిని" అనేను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను.

9. అతడు సమూవేలుతో “వెళ్ళి పడుకొమ్ము. నిన్నెవ్వరైన పిలిచినచో 'ప్రభూ! ఆనతి యిమ్ము. నీ దాసుడు ఆలించుచునే యున్నాడు' అని పలుకుము” అని చెప్పెను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను.

10. అంతట ప్రభువు ప్రత్యక్షమై నిలిచి వెనుకటి మాదిరిగా “సమూవేలూ!” అని పిలిచెను. అతడు “ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే యున్నాడు” అనెను.

11. యావే “యిస్రాయేలు జనులయెదుట నేనొక కార్యము చేసెదను. దానిని గూర్చి వినినవారి రెండు చెవులు గింగురుమనును.

12. ఆ దినమున, ఏలీ కుటుంబమునకు నేను చేసెదనన్న కార్యము చేసితీరెదను. నా పని పూర్తిచేసెదను.

13. నేను ఏలీ కుటుంబమును చాలకాలమువరకు శపించితినని తెలియజేయుము. తన కుమారులిద్దరును దేవుని నిందించుచున్నారని ఎరిగియు అతడు మందలింపడయ్యెను.

14. ఇదిగో! నేను శపథము చేసి చెప్పుచున్నాను వినుము. బలులుగాని, కానుకలుకాని ఏలీ తనయుల పాపములకు ఇక ప్రాయశ్చిత్తము చేయజాలవు” అని పలికెను.

15. సమూవేలు తెల్లవారువరకు పరుండెను. పిమ్మట దేవాలయ తలుపులు తెరచెను. అతడు ప్రభు దర్శనమును ఏలీకి ఎరిగింపవెరచెను.

16. ఏలీ “నాయనా” అని సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనెను.

17. ఏలీ “ఆయన నీతో ఏమి చెప్పెను? నా వద్ద ఏమియు దాచవలదు. ఆయన చెప్పిన మాటలలో ఏదియైన దాచెదవేని ప్రభువు నీకెంతటి కీడైన చేయునుగాక!” అనెను.

18. అంత సమూవేలు ఏలీకి అంతయు తెలియజెప్పెను. ఏలీ “సెలవిచ్చిన వాడు యావే. ఆయన చేయదలచుకొన్న కార్యము చేయునుగాక!” అనెను.

19. సమూవేలు పెరిగి పెద్దవాడయ్యెను. ప్రభువు అతనికి తోడుగానుండెను. కావున అతడు పలికిన పలుకొక్కటియు వ్యర్థముగాలేదు.

20. దాను నగరమునుండి బేర్షెబా వరకు గల యిస్రాయేలు ప్రజలందరు సమూవేలు యావే ప్రవక్త అయ్యెనని తెలిసికొనిరి.

21. షిలో వద్ద ప్రభువు సమూవేలుకు పలుమార్లు సాక్షాత్కరించెను. అచట అతనికి ప్రభుదర్శనము లభించుచుండెను.