ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు 29వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. ఎన్నిసార్లు మందలించినను, హృదయము మార్చుకొననివాడు తలవని తలంపుగ, మరల కోలుకొనని రీతిగ నాశనమగును.

2. సత్పురుషులు పాలనము చేయునపుడు , ప్రజలు సంతసింతురు కాని దుష్టులు పాలించునపుడు జనులు మూలుగుదురు.

3. విజ్ఞాన ప్రియుడైన పుత్రుడు తండ్రిని సంతసింపజేయును వేశ్యలవెంట తిరుగువాడు సొమ్ము వ్యర్ధముచేయును

4. రాజు న్యాయము పాటించునేని రాజ్యము స్థిరపడును అతడు దోచుకొనువాడు అయ్యెనేని రాజ్యము గుల్ల అగును.

5. ప్రక్క వానిని పొగడువాడు, అతడి కాళ్ళకు వల పన్నుకొనును.

6. దుర్మార్గులు తాముతవ్విన గోతిలో తామేకూలుదురు నీతిమంతులు సంతోషముతో మనుదురు.

7. సత్పురుషుడు పేదవాని అక్కరలను గుర్తించును. కాని దుర్మార్గునకు ఆ పరిజ్ఞానము ఉండదు.

8. దుష్టులు పట్టణమంతట కలవరము పుట్టింతురు కాని జ్ఞానులు ప్రజల కోపమునణచి శాంతిని నెలకొల్పుదురు.

9. విజ్ఞుడు మూర్ఖుని మీద నేరము తెచ్చినచో గెలువజాలడు. మూర్ఖుడు అతనిని అపహసించి దూషించును.

10. నరహంతలు సత్పురుషుని ద్వేషింతురు. కాని సజ్జనులు అతనిని అభిమానింతురు.

11. మూర్ఖుడు తన కోపమును బయటికి చూపును. కాని విజ్ఞుడు శాంతముతో దానినణచుకొనును.

12. రాజు నీలివార్తలు వినువాడైనచో మంత్రులెల్లరు కొండెములు పలుకుదురు.

13. పేదవానికి, వానిని పీడించువానికిగూడ కనులకు వెలుగునిచ్చువాడు ప్రభువే.

14. పేదలకు న్యాయము జరిగించు భూపతి బహుకాలము పాలనము చేయును.

15. దండనము, మందలింపు బాలునికి బుద్దిగరపును. విచ్చలవిడిగా తిరుగు కుఱ్ఱడు తల్లికి అపకీర్తి తెచ్చును.

16. దుర్మార్గులు పాలించినపుడు పాపము విజృంభించును. కాని ధర్మాత్ములు ఆ దుష్టుల పతనమును కన్నులార చూతురు.

17. నీ కుమారుని చక్కదిద్దినచో నీకతడివలన సంతృప్తి కలుగును. అతనిని చూచి నీవు సంతసింతువు.

18. దైవోక్తి లేని తావును ప్రజలు హద్దుమీరి ప్రవర్తింతురు. దైవాజ్ఞలను పాటించు నరులు ధన్యులు

19. బానిస వట్టి మాటలకు లొంగడు. వాడు మన మాటను అర్థము చేసికొనినను దానిని పాటింపడు.

20. ఆలోచన లేక త్వరపడి మాట్లాడువానికంటె, పరమ మూర్ఖుడు మెరుగు.

21. బానిసను చిన్నప్పటినుండి గారాబముగా పెంచినచో తుదకు కుమారుడుగానెంచబడును.

22. కోపిష్టి తగవులు తెచ్చి పాపము పెంచును.

23. గర్వాత్ముడు మన్నుగరుచును. వినయాత్ముడు గౌరవమును బడయును.

24. దొంగతో పోవు తోడిదొంగ తనకుతానే శత్రువు, వాడు ఇతరుల శాపవచనములు ఆలకించియు నిజము చెప్పజాలడు.

25. లోకమునకు భయపడువాడు చేటు తెచ్చుకొనును. ప్రభువును నమ్మినవాడు సురక్షితముగా మనును.

26. అందరు రాజు మన్నన కోరుదురు. కాని న్యాయము జరిపించువాడు దేవుడు ఒక్కడే.

27. సత్పురుషులు దుష్టులను అసహ్యించుకొందురు. అట్లే దుష్టులును సత్పురుషులను చీదరించు కొందురు.