ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య మొదటి గ్రంధము 28వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. దావీదు యిస్రాయేలు అధికారులనందరిని యెరూషలేమున సమావేశపరచెను. తెగనాయకులును, రాజోద్యోగులును, ఆయా వంశనాయకులును, సైనికసహస్ర, శతాధిపతులును, రాజునకును, అతని కుమారులకును చెందిన ఆస్తిపాస్తులను, పశుగణములను సంరక్షించువారును, రాజప్రాసాదపాలకులును, వీరులును, ప్రముఖులును మొదలైన వారందరును హాజరైరి.

2. దావీదు వారిముందట నిలుచుండి ఇట్లు పలికెను: “సోదరులారా! నా ప్రజలారా! వినుడు. నేను మన ప్రభువునకు పాదపీఠమైన మందసమునకు శాశ్వతమైన మందిరమును నిర్మింపగోరి సన్నాహములు చేసితిని.

3. కాని ప్రభువు నాతో 'నీవు యుద్ధములుచేసి రక్తమొలికించితివి కనుక నీ చేతులతో నా నామమునకు మందిరము కట్టింపరాదు' అని చెప్పెను.

4. ప్రభువు మా కుటుంబమునుండి నన్నును, నా సంతతిని యిస్రాయేలునకు శాశ్వత పాలకులుగా ఎన్నుకొనెను.

5. ఆయన యూదా తెగలవారిని, వారిలోమా కుటుంబమువారిని నాయకులుగా ఎన్నుకొనెను. మా కుటుంబమునుండి నన్ను ఎన్నుకొని యిస్రాయేలీయులెల్లరికి రాజుగా చేసెను. అది ఆయన అనుగ్రహము. ఆయన నాకు చాలమంది తనయులను దయచేసెను. వారిలో సొలోమోనును ఎన్నుకొని యిస్రాయేలీయులపై తన రాజ్య సింహాసనమున కూర్చుని పరిపాలించుటకు అతనిని నియమించెను.

6. ప్రభువు నాతో 'నీ కుమారుడు సొలోమోను నాకు మందిరము కట్టించును. అతనిని నా కుమారునిగా ఎన్నుకొంటిని. నేనతనికి తండ్రినగుదును.

7. అతడు ఇప్పటివలెనే ఇకమీదట గూడ నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించెనేని నేనతని రాజ్యము శాశ్వతముగా నిలుచునట్లు చేయుదును” అని చెప్పెను.

8. “కనుక ఇప్పుడు నేను మన దేవుడైన ప్రభువు ఎదుట, ఆయన సమాజమున చేరిన ఈ యిస్రాయేలీయుల ఎదుటను మిమ్ము ఆజ్ఞాపించుచున్నాను. మీరు ప్రభువు ఆజ్ఞాపించిన విధులనెల్ల పాటింపుడు. అప్పుడు మీరు ఈ సారవంతమైన నేలను స్వాధీనము చేసికొని, దానిని తరతరములవరకు మీ సంతతికి భుక్తము చేయుదురు.

9. కుమారా! సొలోమోనూ! నీ మట్టుకు నీవు నీ తండ్రియొక్క దేవుడైన ప్రభువును అంగీకరింపుము. పూర్ణహృదయముతోను, పూర్ణమనస్సుతోను ఆయనను సేవింపుము. ఆయనకు నరుల హృదయములును వారి ఆలోచనలును బాగుగా తెలియును. నీవు ప్రభువును ఆశ్రయింతువేని ఆయన నిన్ను అంగీకరించును. కాని నీవు ప్రభువునుండి వైదొలగెదవేని ఆయన నిన్ను శాశ్వతముగా విడనాడును,

10. తనకు పవిత్రమైన మందిరమును కట్టించుటకు ప్రభువు నిన్నెన్నుకొనెను. కనుక నీవు దీక్షతో ఆ కార్యమునకు పూనుకొనుము.”

11. అంతట దావీదు దేవాలయ నిర్మాణ నమూనాను సొలోమోనునకు చూపించెను. మరియు సంబంధిత వస్తుసంభారములు ఉంచుగదులు, మీది గదులు, లోపలిగదులు, కరుణాపీఠమునుంచు గది మొదలైనవాని నమూనాలనుగూడ అతనికి చూపించెను.

12. ఇంకను అతడు తన మనసులో భావించుకొనిన దేవాలయ ప్రాంగణములు వాని చుట్టు గల గదులు, కానుకలను సంబంధిత వస్తుసంభారములను పదిలపరచుటకు వలయుగదులు మొదలైన వాని నమూనాలను గూడ సొలోమోనునకు చూపించెను.

13. యాజకులను, లేవీయులను బృందములుగా విభజించుట గూర్చియు, వారిచేత ఆరాధన కార్యక్రమములను కొనసాగింపవలసిన తీరునుగూర్చియు, ఆరాధనమున వాడబడు పాత్రలను పదిలపరచుట గూర్చియు వివరించెను.

14-16. ఆయాపాత్రలను, పలురకముల దీపములను, దీపస్తంభములను, వెండి ఉపకరణములను, దేవుని ఎదుటనుంచు రొట్టెలను పెట్టు బంగారు బల్లను తయారుచేయుటకు ఎంత వెండిని, ఎంత బంగారమును వినియోగింపవలయునో కూడ తెలియ జేసెను.

17. గరిటెలను, గిన్నెలను, కూజాలను చేయించుటకెంత మేలిమిబంగారము వాడవలయునో, పాత్రలు చేయించుటకు ఎంత వెండి కావలయునో చెప్పెను.

18. ధూపపీఠమును చేయించుటకు, మందసముమీదికి రెక్కలు చాచిన కెరూబుదూతల ప్రతిమలకు రథమును చేయించుటకు ఎంత మేలిమి బంగారము కావలయునో వివరించెను.

19. దేవాలయ నిర్మాణమునుగూర్చి ప్రభువే స్వయముగా తనకు తయారుచేసి ఇచ్చిన నమూనాయందు పై వివరములన్నియు కలవని సొలోమోనుతో చెప్పెను.

20. కడన దావీదు సొలోమోనుతో “నీవు ధైర్య స్టైర్యములు అలవరచుకొనుము. దేనికిని భయపడక దేవాలయ నిర్మాణమునకు పూనుకొనుము. నేను సేవించిన ప్రభువు నీకు బాసటయైయుండును. దేవాలయ నిర్మాణము పూర్తియగువరకును,

21. అతడు నిన్ను విడనాడక నీకు తోడైయుండును. యాజకులు, లేవీయులు దేవాలయమున చేయవలసిన పనులు ముందుగనే నిర్ణయింపబడినవి. ఆయా కళలలో ఆరితేరిన పనివారు నీకు తోడ్పడుటకు సిద్ధముగానున్నారు. ఎల్ల ప్రజలు, వారి నాయకులు నీ ఆజ్ఞలు మనసావాచా పాటించుటకు వేచి యున్నారు” అని చెప్పెను.