1. యిస్రాయేలీయులకు అధికారులుగానుండిన కుటుంబాధిపతుల, సైనికనాయకుల మరియు వారి సహాయుల జాబితా ఇది: సంవత్సరము పొడవున ప్రతినెల ఇరువదినాలుగువేలమంది చొప్పున అధికా రులుగా ఉండిరి. వారికొక నాయకుడు కూడ ఉండెను.
2-15. ఈ క్రింది వారు ఆయా నెలల అధికారులకు నాయకులుగా ఉండిరి. మొదటినెలకు సబ్దియేలు కుమారుడు యషోబాము నాయకుడు. అతడు యూదా తెగకు చెందిన పెరెసు వంశములోనివాడు. వానిభాగములో ఇరువదినాలుగు వేలమందియుండిరి. రెండవనెలకు అహోహి వంశజుడైన దోదయి నాయకుడు. అధికార నిర్వహణలో అతనికి మిక్లోతు సహాయుడుగా ఉండెను. వాని భాగములో ఇరువది నాలుగువేలమంది యుండిరి. మూడవనెలకు బెనాయా కుమారుడును, యాజకుడైన యెహోయాదా. అతడు ముప్పదిమంది పరాక్రమ వంతుల జట్టుకు నాయకుడు. అతని తరువాత అతని కుమారుడు అమిస్సాబాదు అధికారిఅయ్యెను. వాని భాగములో ఇరువది నాలుగువేలమంది యుండిరి. నాలుగవ నెలకు యోవాబు తమ్ముడు అసాహేలు. అతని తరువాత అతని కుమారుడు జెబద్యా అధికారి అయ్యెను. వాని భాగములో ఇరువదినాలుగు వేల మంది యుండిరి. ఐదవ నెలకు ఇసాహారు వంశజుడైన షాముహుతు. వాని భాగములో ఇరువదినాలుగు వేలమందియుండిరి. ఆరవ నెలకు తెకోవా నగరవాసియు, ఇక్కేషు కుమారుడైన ఈరా. వాని భాగములో ఇరువది నాలుగు వేలమంది యుండిరి. ఏడవనెలకు పెలోను నగరవాసియు, ఎఫ్రాయీమీయుడైన హెలెసు. వాని భాగములో ఇరువదినాలుగు వేలమందియుండిరి. ఎనిమిదవ నెలకు హూషా నగరవాసియైన సిబ్బెకాయి. అతడు సేరా వంశములోనివాడు. వాని భాగములో ఇరువదినాలుగు వేలమంది యుండిరి. తొమ్మిదవనెలకు బెన్యామీను మండలమునకు చెందిన అనాతోతు నగరవాసియైన అబీయెరు. వాని భాగములో ఇరువదినాలుగు వేలమంది యుండిరి. పదియవనెలకు నెటోఫా మండలవాసియు, సెరా వంశములోనివాడు మహరాయి. వాని భాగములో ఇరువదినాలుగు వేలమంది యుండిరి. పదునొకండవనెలకు ఎఫ్రాయీము మండలములోని పిరతోను నగరవాసియైన బెనాయా. వాని భాగములో ఇరువదినాలుగువేలమంది యుండిరి. పండ్రెండవనెలకు నెటోఫా మండలవాసియు, ఒత్నీయేలు వంశజుడైన హెల్దయి. వాని భాగములో ఇరువదినాలుగు వేలమంది యుండిరి.
16-22. యిస్రాయేలు తెగలకు పాలకులుగా నుండినవారి జాబితా ఇది: రూబేనునకు సిక్రి కుమారుడైన ఎలియెజెరు, షిమ్యోనునకు మాకా కుమారుడైన షెఫట్యా, లేవీకి కెమోవేలు కుమారుడైన హషబ్యా, అహరోనీయులకు సాదోకు, యూదాకు దావీదు సోదరుడైన ఎలీహు, యిస్సాఖారునకు మికాయేలు కుమారుడైన ఓమ్రీ, సెబూలూనుకు ఓబద్యా కుమారుడైన ఇష్మయా, నఫ్తాలికి అస్రియేలు కుమారుడైన యెరెమోతు, ఎఫ్రాయీమునకు అసస్యా కుమారుడైన హోషేయ, పడమటి మనష్షేకు పెదయా కుమారుడైన యోవేలు, గిలాదున తూర్పు మనష్షేకు జెకర్యా కుమారుడైన ఇద్ధో, బెన్యామీనునకు అబ్నేరు కుమారుడైన యసీఏలు, దానునకు యెరోహాము కుమారుడైన అసరేలు.
23. ప్రభువు యిస్రాయేలు ప్రజలను ఆకాశము నందలి చుక్కలవలె వ్యాప్తి చేయుదునని చెప్పెను. కావున దావీదు ఇరువదియేండ్లకంటే క్రింది వయస్సు వారి లెక్కలు సేకరింపలేదు.
24. సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు సేకరింప మొదలు పెట్టెనుగాని పూర్తిచేయలేదు. ఈ లెక్కల మూలమున దేవుడు యిస్రాయేలీయులను శిక్షించెను. కావున జనసంఖ్య మొత్తము ఇంతయని రాజు దస్తావేజులలో లిఖింపబడలేదు.
25-31. రాజు ఆస్తిపాస్తులకు అధికారులుగా నున్నవారి జాబితా ఇది: రాజు వస్తుసంభారములను భద్రపరచిన గదులకు అదియేలు కుమారుడైన అస్మావేతు. పట్టణములలోను, పల్లెలలోను, కోటలలోను వస్తుసంభారములను భద్రపరచిన గదులకు ఉజ్జీయా కుమారుడైన యెహోనాతాను. రాజు పొలములలో పనిచేయు కూలీలకు, కెలూబు కుమారుడైన ఎస్రి, ద్రాక్షతోటలకు రామా నగరవాసియైన షిమీ. ద్రాక్షసారాయమును పదిలపరచిన గదులకు షెఫాము నగరవాసియైన సాబ్ది. పడమటి కొండలలోయలలోని ఓలివు తోటలకు, మేడిచెట్లకు గేదేరు నగరవాసియైన బాల్హానాను. ఓలివునూనె కొట్లకు యోవాసు. షారోను మైదానములోని పశువులకు షారోను మండలవాసియైన షిట్రాయి. లోయలలోని పశువులకు అధ్లాయి కుమారుడైన షాఫాత్తు. ఒంటెలకు యిష్మాయేలీయుడైన ఓబీలు. ఆడుగాడిదలకు మెరోనోతు మండలవాసియైన యెహ్దియా . గొఱ్ఱెలు, మేకలు, పశువుల మందలకు హగ్రి జాతివాడైన యాసీసు.
32. దావీదు పినతండ్రియైన యోనాతాను నేర్పరియైన సలహాదారు, పండితుడు. అతడును, హక్మోని కుమారుడైన యెహీయేలును రాజకుమారుల విద్యాభ్యాసమునకు బాధ్యులు.
33. అహీతో ఫెలు రాజునకు సలహాదారు. ఆర్కీయుడైన హూషయి రాజు స్నేహితుడు.
34. బెనాయా కుమారుడైన యెహోయాదా, అబ్యాతారు అనువారు అహీతోఫెలు మరణానంతరము రాజునకు సలహాదారులైరి. యోవాబు సైన్యాధిపతి.