ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు 27వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. రేపటి దినమునుగూర్చి ప్రగల్భములు పలుకవలదు. నేడేమి జరుగనున్నదో నీకు తెలియదు.

2. ఇతరులు నిన్ను పొగడవచ్చు. కాని నిన్ను నీవే పొగడుకోగూడదు. పరులు నిన్ను స్తుతింపవచ్చును. కాని ఆత్మస్తుతి పనికిరాదు.

3. రాయి బరువు, ఇసుక భారము. కాని మూర్ఖుని వలన కలుగు బాధ మరింత ఎక్కువ బరువు ఉండును.

4. కోపము, క్రూరత్వము వినాశప్రదమైనవి. కాని అసూయ వానికంటె ఘోరమైనది.

5. బయటికి కన్పింపనీయని ప్రేమకంటె బహిరంగముగా మందలించుట మెరుగు.

6. మిత్రుడు కొట్టి, గాయపరచినను పరవాలేదు. కాని శత్రువు ముద్దు పెట్టినను నమ్మకూడదు.

7. కడుపు నిండిన తరువాత తేనె కూడ సహింపదు. ఆకలిగా ఉన్నపుడు చేదు కూడ తీయగా ఉండును.

8. ఇంటినుండి ఎక్కడికైన వెళ్ళినవాడు గూటినుండి ఎగిరిపోయిన పక్షితో సమానము.

9. సుగంధ ద్రవ్యములు, పరిమళతైలము ముదము చేకూర్చును.  కాని ఆపదలు హృదయశాంతిని నాశనముచేయును.

10. నీ స్నేహితునిగాని, నీ తండ్రి స్నేహితునిగాని విస్మరింపవలదు. ఈ అపదలు వచ్చినపుడు నీ సోదరునివద్దకు పరుగెత్తవలదు. దూరమున ఉన్న సోదరునికంటె దగ్గరున్న మిత్రుడు మెరుగు.

11. నాయనా! నీవు విజ్ఞానము నార్జించినచో నా హృది సంతసించును. నన్ను విమర్శించువారికి ధైర్యముగా జవాబు చెప్పగలుగుదును.

12. జ్ఞాని ఆపదను ముందుగానే పసికట్టి దానినుండి తప్పుకొనును. కాని మూర్ఖుడు ఆపదలో కాలుబెట్టి, నాశనము తెచ్చుకొనును.

13. అన్యునికి హామీగా ఉన్నవాని బట్టలువిప్పి, ఆ అన్యుని తరపున కుదువ సొమ్ముగా ఉంచుకోవలెను.

14. ప్రాతఃకాలమున బిగ్గరగా పొరుగువానిని దీవించువాని దీవెన వానికి శాపముగా యెంచబడును.

15-16. గయ్యా ళి భార్య సణుగుడు,  వానరోజున ఎడతెగక చినుకులు పడినట్లుగా ఉండును. గాలిని ఆపుటగాని, చమురును గుప్పిట పట్టుటగాని ఎంత కష్టమో ఆమె నోరు మూయించుటయు అంత కష్టము.

17. ఇనుమునకు ఇనుముతో పదును పెట్టినట్లే నరుడు తోడినరుని పరిచయము వలన సునిశితుడగును.

18. అత్తిచెట్టును పెంచినవాడు దానిపండ్లను ఆరగించును. యజమానుని సేవించు 'బంటుకు ఘనత చేకూరును.

19. నీటిలో ముఖము ఎట్లు ప్రతిబింబించునో అట్లే ఒకని మనస్సు ఎదుటివాని మనస్సునకు కనబడును.

20. పాతాళలోకమునకు, నాశనమునకు తృప్తిలేదు. నరుని ఆశలకును అంతములేదు.

21. వెండి బంగారములను కుంపటిలో పరీక్షింతుము. నరుని పొగడ్త ద్వారా పరీక్షింతుము.

22. మూర్ఖుని రోటిలో పెట్టి దంచినను వాని మూర్ఖత్వము తొలగింపజాలము.

23-27. నీ గొఱ్ఱెల మందలను జాగ్రత్తగా చూచుకొనుము. నీ పశుల మందలను చక్కగా కాపాడుకొనుము. సంపదలు కలకాలము నిలువవు. రాజ్యములుకూడా శాశ్వతముగా కొనసాగవు. మొదట నీ పొలములోని గడ్డి కోసికొనుము. అది మరల పెరుగుచుండగా కొండ ప్రక్కనున్న గడ్డి కోసుకొనుము. గొఱ్ఱెల ఉన్నినుండి నీవు బట్టలు నేసికోవచ్చును. కొన్ని మేకలను అమ్మి పొలము కొనవచ్చును. మిగిలిన మేకల పాలు నీకును, .నీ కుటుంబమునకును, నీ పనికత్తెలకునుగూడ సరిపోవును.