ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 25వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. సమూవేలు చనిపోయెను. యిస్రాయేలీయులందరు ప్రోగై అతని మరణమునకు శోకించిరి. రామాలో అతని ఇంటిలో అతని శవమును పాతిపెట్టిరి. అటుపిమ్మట దావీదు పారాను ఎడారికి వెడలి పోయెను.

2. మావోను సీమకు చెందిన కర్మేలునందు సంపన్నుడైన నరుడొకడు వసించుచుండెను. అతనికి మూడువేల గొఱ్ఱెలు, వేయిమేకలు కలవు. ఒకసారి అతడు కర్మెలు పట్టణమునందు గొఱ్ఱెలకు ఉన్ని కత్తిరించుచుండెను.

3. అతడు కాలేబు వంశీయుడు. పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగాయీలు. ఆమె తెలివితేటలుకలది, అందగత్తె. అతడు వట్టి మోటు వాడు, దుష్టుడు.

4. ఎడారియందు వసించుచున్న దావీదు, నాబాలు తనగొఱ్ఱెలకు ఉన్ని కత్తిరించుచుండెనని వినెను.

5. అతడు తన అనుచరులను పదిమందిని నాబాలు వద్దకు పంపుచు “మీరు కర్మేలు పట్టణమునకు పోయి నాబాలును దర్శించి నా పేర నమస్కారము చేయుడు.

6. అతనితో ఇట్లనుడు: నీకును, నీ బలగమునకును, నీ ఆస్తిపాస్తులకును శుభములు కలుగునుగాక!

7. నీవు గొఱ్ఱెలకు ఉన్ని కత్తిరించుచున్నావని వింటిని. ఇంతవరకు నీ కాపరులు మా చెంతనే మసలుచుండినను మేము వారిని బాధింపలేదు. వారు కర్మేలులో నున్నంతకాలము మందలనుండి ఒక్క జంతువును మాయము కాలేదు.

8. ఈ మాట నిజమోకాదో నీ జనముననే అడిగి తెలిసికోవచ్చును. నా సేవకులను చల్లనిచూపు చూడుము. నేడు శుభదినమున మేము వచ్చితిమికదా! కనుక నీ సేవకులకును, నీ కుమారుడు దావీదునకును నీ యిచ్చనుబట్టి ఇచ్చి పంపుము".

9-10. దావీదు సేవకులు నాబాలు వద్దకు వచ్చి తమ నాయకుని పలుకులు విన్నవింపగనే అతడు “దావీదనిన ఎవరికి గొప్ప? యిషాయి కుమారుడనిన ఎవరికి లావు? ఈ రోజులలో యజమానుల వద్ద నుండి పారిపోయిన సేవకులు చాలమంది కనిపించుచున్నారు.

11. నా రొట్టెలను, ద్రాక్షాసారాయమును, నా పనివారికొరకు కోసి ఉంచిన వేటమాంసమును తీసికొని ఊరు పేరు తెలియని ఈ దేశదిమ్మరులకు ఈయవలయును కాబోలు!" అనెను.

12. సేవకులు తిరిగిపోయి నాబాలు అనిన మాటలు తమ నాయకుడు దావీదునకు చెప్పిరి.

13. దావీదు ఎల్లరిని కత్తి చేపట్టుడని ఆజ్ఞాపించెను. పరిజనులందరు వారివారి కత్తు లను గైకొనిరి. దావీదు కూడ తన కత్తి పుచ్చుకొనెను. వారిలో రెండువందలమంది సామానులకు కావలి కాయుటకై అచ్చటనే ఉండిపోయిరి. నాలుగు వందల మంది దావీదును అనుసరించి వెళ్ళిరి.

14. అప్పుడు నాబాలు సేవకులలో ఒకడు అతని భార్యయైన అబీగాయీలుతో “అమ్మా! దావీదు ఎడారి నుండి మన యజమాని వద్దకు దూతలనంపెను. కాని ఆయన వారిమీద మండిపడెను.

15. ఈ జనులు చాల మంచివారు. మనలనెప్పుడు పీడించి యెరుగరు. మేము వారి దగ్గరి పొలములో మందలను మేపినంత కాలము ఒక్కజంతువుకూడ మాయమైపోలేదు.

16. అక్కడ మందలు తిరుగాడినంతకాలము రేయింబవలు వారే మాకు అండదండగానుండిరి.

17. కనుక ఇప్పుడు చేయవలసినపని ఏదియో లెస్సగా విచారింపుము. దావీదు సేవకులు మన యజమానునకు, మన పరివారమునకు నిక్కముగా కీడుచేయ నిశ్చయించియున్నారు. యజమానుడు వట్టి పనికిమాలిన వాడు. అతనితో మాట్లాడినను లాభములేదు” అని పలికెను.

18. అబీగాయీలు త్వరత్వరగా రెండు వందల రొట్టెలను, రెండుతిత్తుల ద్రాక్షసారాయమును, ఐదు వేటలను కోసివండిన మాంసమును, ఐదు కుంచములు వేపుడు ధాన్యమును, నూరుగుత్తులు ఎండు ద్రాక్షపండ్లను, రెండువందల అత్తిపండ్ల మోదకములను సిద్ధముచేసి గాడిదలపై వేయించెను.

19. ఆమె సేవకులను పిలిచి “మీరు వీనితో ముందుసాగిపొండు, నేను మీ వెనుకవత్తును” అని చెప్పెను. కాని నాబాలునకు ఈ సంగతేమియును తెలియదు.

20. అబీగాయీలు గాడిదనెక్కి కొండమలుపునకు వచ్చెను. అంతలోనే దావీదు పరివారముతో వచ్చుచు ఆమెకు ఎదురుపడెను.

21. అతడు తనలోతాను “ఇంతకాలము ఎడారిలో నాబాలు మందలను కాపాడుట గొడ్డువోయినదికదా! వీని గొఱ్ఱెలకు నష్టమే మియు కలుగలేదు. ఈ ఉపకారమునకు బదులుగా వీడు అపకారము చేసెనుగదా!

22. కానిమ్ము ప్రొద్దు పొడుచునప్పటికి వాని పరివారమునందలి మగవాండ్రనందరిని మట్టుపెట్టనేని దేవుడు ఇంకను గొప్ప ఆపదను దావీదు శత్రువులకు కలుగజేయునుగాక!” అని అనుకొనుచుండెను.

23. అబీగాయీలు దావీదును చూడగనే వడివడిగా గాడిదను దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసెను.

24. ఆమె దావీదు కాళ్ళమీదపడి “ప్రభూ! ఈ అపరాధమునాది. ఈ దాసురాలికి మాట్లాడుటకు సెలవిమ్ము. ప్రభువు నాపలుకులు వినిపించు కొనినచాలు.

25. ఏలినవారు పనికిమాలిన ఈ నాబాలును పట్టించుకోనేల? అతని నడవడిగూడ ఆ పేరునకు తగినట్లే ఉన్నది. అతని పేరు నాబాలు '. కనుకనే ఆ మొరటుతనము. నా మట్టుకు నేను నీవు పంపించిన సేవకులను చూడలేదు సుమా!

26. రక్తపాతమునుండి, స్వయముగ శత్రువు మీదపడి పగ తీర్చుకొనుట అను దుష్కార్యము నుండి ప్రభువు నిన్ను కాపాడుగాక! యావే జీవము తోడు! నీ జీవము తోడు! నీ శత్రువులకు, నీకును కీడు తలపెట్టిన దుర్మార్గులకు, ఈ నాబాలుకు పట్టినగతియే పట్టునుగాక!

27. ఇవిగో! నీ దాసురాలు కొనివచ్చిన బహుమానములు! వీనిని నా యేలినవాడవగు నీ వెంటవచ్చిన పరివారమునకు ఇమ్ము.

28. ప్రభువు ఈ దాసురాలి అపరాధమును క్షమించునుగాక! నీవు యావే పక్షమున యుద్ధములు చేయుచున్నావు కనుక, యావే నీ వంశమును కలకాలము కుదురుకొనునట్లు చేయును. బ్రతికి ఉన్నంతకాలము నీకు ఏ ఆపద వాటిల్లదు.

29. ఎవ్వడైనను నిన్ను వెంటపడి నీ ప్రాణములు తీయనెంచిన యెడల నీ దేవుడైన యావే నీ ప్రాణములను జీవపు మూటలో చుట్టిపెట్టి సురక్షితముగా తనచెంత నుంచుకొనును. కాని నీ శత్రువుల ప్రాణమును ఒడిసెలనుండి రాతిని విసరినట్టుగా దూరముగా విసరివేయును.

30-31. ప్రభువు నీకు వాగ్దానము చేసిన సత్కార్యములన్నిటిని నెరవేర్చినపిమ్మట, నిన్ను యిస్రాయేలీయులకు రాజుగా నియమించిన పిమ్మట నేడు శత్రువులపై పగతీర్చుకొని నిష్కారణముగా నెత్తురొలికించిన పాపము నీ హృదయమును బాధించి వేధింపకుండును గాక! ప్రభువు నిన్ను చల్లనిచూపున చూచిన పిమ్మట ఈ దాసురాలిని జ్ఞప్తికి తెచ్చుకొనుము" అని పలికెను.

32. దావీదు అబీగాయీలుతో “నేడు నిన్ను నా వద్దకు పంపిన యిస్రాయేలు దేవుడు యావే స్తుతింపబడునుగాక!

33. నీ తెలివితేటలు కొనియాడదగినవి. రక్తపాతమునుండి, శత్రువులపై పగ తీర్చుకొనుట అను దుష్కార్యము నుండి నేడు నన్ను కాపాడితివి కనుక నీవు ధన్యురాలవు.

34. యిస్రాయేలు దేవుడైన యావే మీద ఒట్టుపెట్టుకొని చెప్పుచున్నాను వినుము. నీకు కీడు చేయనీయకుండ ప్రభువే నాకు అడ్డుపడెను. నీవు శీఘ్రమేవచ్చి నన్నిట కలసికోనియెడల, రేపు ప్రొద్దు పొడుచునప్పటికి నాబాలు పరివారమున ఒక్క మగ పురుగుకూడ బ్రతికియుండెడివాడుకాడు సుమా!” అనెను.

35. అంతట దావీదు ఆమె కానుకలను గైకొని “ఇక ఏ దిగులులేకుండ నీ ఇంటికి మరలిపొమ్ము. నీ మొగము చూచి నీమాట పాటించితిని” అనెను.

36. అబీగాయీలు పతి యొద్దకు తిరిగిపోయెను. ఇంటివద్ద నాబాలు రాజవైభవముతో ఉత్సవముచేసి విందు నడపుచుండెను. అతడు హాయిగా త్రాగి మైమరచియుండుటచే మరునాటి ప్రొద్దుటివరకు ఆ ఇల్లాలు జరిగిన సుద్దులేమియు ఎత్తలేదు.

37. ఉదయము సారాయపుకైపు తగ్గగనే అబీగాయీలు జరిగినదంతయు పెనిమిటికి తెలియజేసెను. ఆ మాటలకు నాబాలు నిశ్చేష్టుడయ్యెను. అతనికి గుండెపగిలెను. కదలికలేని రాతిబొమ్మవలె బిగుసుకుపోయెను.

38. పది దినములు గడచిన తరువాత యావే నాబాలును శిక్షింపగా అతడు ప్రాణములు విడిచెను.

39. దావీదు నాబాలు చావు కబురువిని “నన్ను అవమానపరచినందులకు నాబాలునకు ఈ రీతిగా ప్రతీకారము చేసిన యావే స్తుతింపబడునుగాక! కీడు చేయనీయకుండ ప్రభువు నన్ను వారించెను. నాబాలు పాపము నాబాలునకే తగులునట్లు దేవుడు చేసెను” అనెను. 

40. అంతట దావీదు అబీగాయీలును పెండ్లి చేసికొనుటకై దూతలద్వారా వర్తమానమంపెను. వారు కర్మెలు నందున్న అబీగాయీలు వద్దకు వచ్చి "దావీదును పరిణయమాడుటకై నిన్నుతో డ్కొని పోవచ్చితిమి” అని విన్నవించిరి.

41. ఆమె వినయముతో లేచి నేలమీద సాగిలపడి “ఈ సేవకురాలు నా ప్రభువు పరిచారకుల పాదములు కడుగుటకుగూడ సిద్ధముగానే యున్నది” అనెను.

42. అంతట ఆమె వేగముగ పయనమై ఐదుగురు దాసీ కన్యలను వెంటనిడుకొని గాడిదపైనెక్కి దావీదు సేవకుల వెంటబోయెను. దావీదు ఆమెను పెండ్లియాడెను.

43. అంతకుముందే అతడు యెస్రేయేలు నగరవాసియైన అహీనోవమును గూడ పెండ్లి చేసుకొనియుండెను. ఆ ఇరువురు అతని భార్యలైరి.

44. ఇంతకుముందు సౌలు తన కుమార్తెయగు మీకాలును దావీదునకు అప్పగించెనుగదా! అతడు కుమార్తెను మరల గల్లీము నగరవాసియైన లాయీషు కుమారుడు ఫల్తీయేలునకిచ్చి పెండ్లి చేసెను.