ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య మొదటి గ్రంధము 24వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. అహరోను వంశజులు ఈ క్రింది వర్గములుగా విభజింపబడిరి; అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియెజెరు, ఈతామారు అను నలుగురు.

2. నాదాబు, అబీహు తండ్రికంటే ముందే గతించిరి. వారికి సంతానములేదు. కనుక వారి తరువాత ఎలియెజెరు, ఈతామారు యాజకులైరి.

3. దావీదు అహరోను వంశజులను వారివారి పనులనుబట్టి వర్గములుగా విభజించెను. ఎలియెజెరు వంశజుడైన సాదోకు, ఈతామారు వంశజుడైన అహీమెలెకు అతనికి ఈ కార్యమున తోడ్పడిరి.

4. ఎలియెజెరు వంశజులను పదునారువర్గములుగను, ఈతామారు వంశజులను ఎనిమిది వర్గములుగను విభజించిరి. ఎలియెజెరు వంశజులలో కుటుంబ అధిపతులైన పురుషులు ఎక్కువమంది ఉండిరి కనుక అటులచేసిరి.

5. ఇరుతెగల వారియందు దేవాలయాధికారులు, ఆధ్యాత్మిక అధికారులు ఉండిరి. కనుక చీట్లు వేసి వారికి పనులు నిర్ణయించిరి.

6. లేవీయులలో లేఖికుడుగా నున్న నెతనేలు కుమారుడును, లేఖకుడైన షెమయా వారివారి పేర్లను నమోదుచేసెను. రాజు, అతని అధికారులు, యాజకుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడు అహీమెలెకు, మరియు యాజకుల యొక్కయు, లేవీయులయొక్కయు కుటుంబ అధిపతులు ఈ నమోదునకు సాక్షులు. ఇరువంశముల వారి యాజకులకు అనగా ఎలియెజెరునకు చెందిన ప్రతి రెండువర్గముల తదుపరి ఈతామారునకు చెందిన ఒకవర్గము చొప్పున చీట్లు వేసి పనులు నిర్ణయించిరి.

7-18. చీట్లు వేసి ఈ క్రింది వరుస క్రమములో ఇరువదినాలుగు వర్గములవారికి పనులు నిర్ణయించిరి. వారు వరుసగా : మొదటిచీటి యెహోయారీబు, రెండవది యెదాయా, మూడవది హారిము, నాలుగవది సెయోరీము, ఐదవది మల్కీయా, ఆరవది మియామిను, ఏడవది హక్కోజు, ఎనిమిదవది అబీయా, తొమ్మిదవది యేషువ, పదవది షెకన్యా, పదకొండవది ఎల్యాషీబు, పన్నెండవది యాకీము, పదమూడవది హుప్పా, పదునాలుగవది యేషెబెవాబు, పదిహేనవది బిల్గా, పదునారవది ఇమ్మేరు, పదినేడవది హెసీరు, పదునెనిమిది హప్పిస్సేసు, పందొమ్మిదవది పెతహాయా, ఇరువదియవది యెహెజ్కేలు, ఇరువదియొకటవది యాకీను, ఇరువది రెండవది గామూలు, ఇరువది మూడవది దెలాయా, ఇరువదినాలుగవది మాస్యా అనువారలు నిర్ణయింపబడిరి.

19. పై వారినందరిని వారివారి పనులతో నమోదుచేసిరి. వారు దేవాలయమునకు పోయి యిస్రాయేలు దేవుడైన ప్రభువు పూర్వము వారి వంశ కర్త అహరోను ద్వారా ఆజ్ఞాపించిన పనులన్నియు చేయవలయును.

20. మిగిలియున్నవారు అనగా లేవీ వంశమునకు చెందిన ఇతర కుటుంబాధిపతుల పేర్లివి: అమ్రాము సంతతికి చెందిన షుబూవేలు, షుబూవేలు సంతతికి చెందిన యెహ్దియా.

21. రెహబ్యా కుమారులలో పెద్దవాడైన ఇష్షీయా.

22. ఇసాహారు సంతతికి చెందిన షెలోమితు, షెలోమితు సంతతికి చెందిన యాహాతు.

23. హెబ్రోను తనయులు వయసు క్రమమును బట్టి వీరు: యెరీయా, అమర్యా, యహానీయేలు, యెక్మెయాము.

24. ఉజ్జీయేలు సంతతికి చెందిన మీకా. మీకా సంతతికి చెందిన షామీరు.

25. మీకా సోదరుడైన ఇష్షీయా మరియు ఇష్షీయా సంతతికి చెందిన జెకర్యా.

26. మెరారి సంతతికి చెందిన మహ్లి, మూషి.

27. యహనీయా సంతతికి చెందిన బెనోయు, యహాసియా వలన మెరారికి కలిగిన కుమారులు: బెనోయి, షోహాము, సక్కూరు, ఇబ్రి.

28-29. మహ్లికి ఎలియెజెరు, కీషు అని ఇరువురు పుత్రులు కలిగిరి. ఎలియెజెరునకు కుమారులు లేదు. కాని కీషునకు యెరాహ్మేలు అను తనయుడు కలిగెను.

30. మూషికి ముగ్గురు కుమారులు కలిగిరి. వారు మహ్లి, ఎదేరు, యెరీమోతు అనువారు. లేవీయుల సంతతికి చెందిన కుటుంబములివి.

31. తమ బంధువులు, అహరోను వంశజులైన యాజకులవలెనె వీరుకూడ చీట్లు వేసికొని ఆయా కుటుంబాధిపతులకును, వారి కనిష్ఠ సోదరులకును రావలసిన పనులేవో నిర్ణయించుకొనిరి. రాజైన దావీదు, యాజకులగు సాదోకు, అహీమెలెకులు, యాజకుల యొక్కయు, లేవీయుల యొక్కయు కుటుంబ అధిపతులు ఈ చీట్లు వేయుటకు సాక్షులుగానుండిరి.