ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 24వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. ప్రభువు మరల యిస్రాయేలీయుల పై కోపము తెచ్చుకొనెను. ఆయన దావీదును వారిపై పురికొల్పనెంచి అతనితో “పొమ్ము! యిస్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించుము అని ఆజ్ఞ ఇచ్చెను.”

2. కనుక రాజు యోవాబుతోను, అతనితో నున్న సైనికోద్యోగులతోను, “దాను నుండి బేర్షేబా వరకు గల యిస్రాయేలు తెగలన్నింటిని చుట్టివచ్చి జనాభా లెక్కలు తయారుచేయుడు. మన ప్రజలెందరో నేను తెలిసికోవలయును” అని వక్కాణించెను.

3. యోవాబు రాజుతో “ప్రజల సంఖ్య ఎంతయున్నను నీవు బ్రతికియుండగానే యావే మన జనమును నూరంతలుగా వృద్ధిచేయగ చూచి, కన్నులపండువుగ సంతసింతువుగాక! కాని నా రాజువగు మీకు ఈ కోరిక ఏల పుట్టెను?” అని అనెను.

4. అయినను రాజు యోవాబునకు అతని తోడి సైనికోద్యోగులకు ఆజ్ఞ ఇచ్చెను. కనుక వారు యిస్రాయేలీయులను లెక్కించుటకై వెడలిపోయిరి.

5. వారు యోర్దానునది దాటిపోయి అరో యేరున దిగి, లోయ మధ్యనున్న నగరమునుండి లెక్క మొదలిడి, గాదుమీదుగా యాసేరు మండలములకు వెడలిపోయిరి.

6. ఆ తరువాత గిలాదు వెళ్ళి అట నుండి హిత్తీయుల సీమలోని కాదేషుకు వెళ్ళిరి. అట నుండి కదలి దాను, సీవోను ప్రాంతములకు పోయిరి.

7. ఆ పిమ్మట తూరు దుర్గమును ముగించుకొని హివ్వీయులు, కనానీయులు వసించు నగరమును కూడ చుట్టి వచ్చి దక్షిణ దిక్కున ఉన్న బేర్షెబవద్ద గల యూదా పల్లెపట్టులతో లెక్క ముగించిరి.

8. ఈ రీతిగా దేశ మంతటిని లెక్కపెట్టి తొమ్మిదినెలల ఇరువది రోజులు గడచినపిదప తిరిగి యెరూషలేము చేరుకొనిరి.

9. యోవాబు జనాభాలెక్క రాజునకు సమర్పించెను. కత్తి చేపట్టి పోరు నెరపగల యోధులు యిస్రాయేలీయులందు ఎనిమిది లక్షలమంది, యూదీయులందు ఐదులక్షలమంది ఉండిరి.

10. కాని దావీదు ప్రజలను లెక్కపెట్టిన తరువాత అంతరాత్మ అతనిని బాధించెను. అతడు “ప్రభూ! నేను మహాపాపము కట్టుకొంటిని. నా అపరాధము మన్నింపుము. ఇట్టి తెలివిమాలినపని చేసితిని” అనెను.

11-12. కాని మరునాటి వేకువన దావీదు నిద్ర మేల్కొనగనే ప్రభువువాణి దావీదునకు దార్శనీకుడును, ప్రవక్తయునైన గాదుతో “నీవు దావీదు నొద్దకు వెళ్ళి ఇట్లనుము. నేను నీకు మూడుకార్యములు నిర్ణయించితిని. వానిలో నీ ఇష్టము వచ్చిన దానిని ఎన్నుకొనుము. దానిని మాత్రమే జరుపుదును” అని చెప్పెను.

13. కనుక గాదు దావీదునొద్దకు వెళ్ళి “ఈ దేశమున ఏడేండ్ల పాటు కరువువచ్చుటకు ఒప్పు కొందువా? శత్రువులు మూడునెలల పాటు నిన్ను తరుముచుండగా పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమున మూడుదినములు అంటురోగము అలముకొనుటకు ఒప్పుకొందువా? ఈ మూడింటిలో ఏది కావలయునో జాగ్రత్తగా ఆలోచించి చెప్పుము. నన్నిటకు పంపిన దేవునికి నేను తిరిగి బదులుచెప్పవలయును” అనెను.

14-15. దావీదు “నాకేమి తోచని చిక్కుల లోబడితిని. కాని నరుని చేతికి చిక్కుటకంటె యావే చేతికి చిక్కుటమేలు. ప్రభువు మిక్కిలి దయాపరుడు” అని పలికి అంటురోగమునే ఎన్నుకొనెను. అది పంటకాలము. ప్రభువు నాటి ప్రొద్దుటినుండి నియమితకాలము ముగియువరకు అంటురోగము పంపెను. దాను నుండి బేర్షెబా వరకు డెబ్బదివేలమంది చచ్చిరి.

16. యావే దూత యెరూషలేము మీదబడి నగరమును నాశనము చేయబోవుచుండెను. కాని యావే పరితాపము చెంది నాశనముచేయు దూతతో “ఇక చాలు, నగరముమీదికి పోవలదు” అనెను. అప్పుడు దేవదూత యెబూసీయుడగు ఆరౌనా కళ్ళము చెంతనుండెను.

17. ఆ రీతిగా దేవదూత జనులను పీడించుట చూచి దావీదు యావేతో “పాపము చేసి అపరాధము కట్టుకొనినది నేను. ఈ ప్రజలు అన్నెము పున్నెము ఎరుగరు. వీరిని విడిచి పెట్టి నన్నును, నా కుటుంబ మును శిక్షింపుము" అని మనవి చేసికొనెను.

18. ఆ రోజు గాదు దావీదు నొద్దకు వచ్చి “యెబూసీయుడగు ఆరౌనా కళ్ళమున యావేకొక బలిపీఠము నిర్మింపుము" అని చెప్పెను.

19. గాదు చెప్పిన ప్రకారం దావీదు యావే ఆజ్ఞ పాటించుటకు వెడలిపోయెను.

20. అపుడు ఆరౌనా కళ్ళమున గోధుమలు తొక్కించుచుండెను. అతడు మీది నుండి చూడగా దావీదు అతని కొలువుకాండ్రు వచ్చుచుండిరి. కనుక ఆరౌనా రాజునకెదురేగి సాష్టాంగ నమస్కారము చేసెను.

21. అతడు “ప్రభువు ఈ దాసుని చెంతకు విచ్చేయనేల?” అనెను. దావీదు “ఈ కళ్ళపు నేలను కొని యావేకొక బలిపీఠము కట్టవలయును. అపుడు గాని ఈ అంటురోగము ఆగిపోదు” అనెను.

22. అతడు “ప్రభూ! ఈ పొలము గైకొనుము. నీకు యోగ్యమనిపించిన కానుకలతో యావేకు బలి అర్పింపుము. దహనబలికి ఎడ్లు ఇవిగో! కట్టెలు కావలయునేని కళ్ళమునూర్చు మ్రాను, ఎద్దులకాడి ఇవిగో!

23. వీనినన్నిటిని నీకు సమర్పించితిని. ప్రభువు నీవు సమర్పించు బలిని అంగీకరించుగాక!” అనెను.

24. కాని దావీదు “ఓయి! పొలమును వెల ఇచ్చియే పుచ్చుకొందును. నేను డబ్బు చెల్లింపలేని దహనబలిని యావేకు సమర్పించువాడను కాను సుమా!" అని పలికెను. అతడు ఆరౌనా పొలమునకు, ఎడ్లకు ఏబది వెండికాసులు చెల్లించెను.

25. దావీదు అచట యావే నామమున బలిపీఠము నిర్మించి దహనబలి, సమాధానబలి సమర్పించెను. యావే దేశము కొరకు చేయబడిన విన్నపములను ఆలకింపగ అంటురోగము యిస్రాయేలీయులను విడిచిపోయెను.