1. దావీదు తుదిమాటలివి: యాకోబు దేవునిచే అభిషిక్తుడై ఉచ్చదశ నందుకొని యిస్రాయేలు పాటలు పాడిన యిషాయి కుమారుడైన దావీదు పలికిన ప్రవచనములివి:
2. “యావే ఆత్మ నా మూలమున మాటలాడును. ప్రభువు మాట నా నాలుకపై నిలిచినది. యాకోబు దేవుడు, యిస్రాయేలు దుర్గమైన ప్రభువు నాతో ఇట్లనెను:
3-4. మనుష్యులను పాలించు ఒకడు పుట్టును. ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను, మబ్బులులేనినాడు ఉదయించిన సూర్యునివలెను, వర్షము కురిసి వెలిసినప్పటి నిర్మలమైనకాంతి లేబచ్చికను మిలమిల మెరయజేసినట్లే అతడు తన ప్రజను నీతితో పరిపాలించును, దైవభక్తితో యేలును.
5. ప్రభువు నా వంశమును దృఢముగా నిల్పును. యావే నాతో నిత్యనిబంధనము చేసికొనును. సమస్తము చక్కదిద్దబడినది. ప్రభువిక నాకు రక్షణమొసగి నా కోర్కెలు తీర్చును.
6-7. దేవుని విడనాడు భక్తిహీనులు ఎడారియందలి ముండ్లతుప్పలవలె మాయమగుదురు. వానినెవ్వడు చేతతాకడు, ఇనుప పనిముట్లతోనో, కొయ్యకోలతోనో పొడిచి, నిప్పున కాలురేగాని, వాని నెవ్వడును చేతముట్టడు”.
8. దావీదు వీరుల పేర్లివి. యోషెబ్బ - షెబెత్తు అను ప్రముఖుడగు తాక్మోనీయుడు. ఇతడు ముగ్గురు మొనగాండ్ర జట్టుకు నాయకుడు. అతడు గండ్రగొడ్డలి చేపట్టి ఎనిమిది వందలమందిని ఒక్క పెట్టున మట్టుపెట్టెను.
9. ఇతని తరువాత అహోహీయుడును దోదో కుమారుడగు ఎలియెజెరు ముగ్గురు మొనగాండ్రలో ఒకడు. ఫిలిస్తీయులు ప్రోగైవచ్చి పాస్ధామీము వద్ద యిస్రాయేలీయులను ఎదిరించి తరిమి కొట్టినపుడు అతడు దావీదుతో నుండెను.
10. కాని ఎలియెజెరు ఫిలిస్తీయుల నెదిరించెను. చేయి తిమ్మిరిగొని కత్తికి కరచుకొని పోవువరకును శత్రువులను నిశ్శేషముగా తునుమాడెను. ఆనాడు యావే యిస్రాయేలీయులకు విజయము ప్రసాదించెను. పోరు ముగిసిన పిదప యిస్రాయేలు ప్రజలు చచ్చిన వారి వస్త్రములూడ్చుటకు మాత్రము ఎలియెజెరు వెంటబోయిరి.
11. ఇతని తరువాత హరారీయుడును ఆగే కుమారుడైన షమ్మా ముగ్గురు మొనగాండ్రలో మూడవవాడు. ఫిలిస్తీయులు లేహీవద్ద మోహరించి ఉండిరి. అచట ఏపుగా పెరిగిన పప్పుధాన్యము చేను కలదు. యిస్రాయేలీయులు ఫిలిస్తీయులకు ఓడిపారి పోజొచ్చిరి.
12. కాని షమ్మా రొమ్ము విరుచుకొని పొలము నడుమ నిలబడి ఫిలిస్తీయులను అటనుండి తరిమికొట్టెను. నాడు యావే యిస్రాయేలీయులకు గొప్ప గెలుపు దయచేసెను.
13. ఫిలిస్తీయులు రేఫాయీము లోయలో దండు దిగిరి. దావీదు వీరులగు ముప్పదిమంది ఒక జట్టు. ఆ జట్టునుండి ముగ్గురు వీరులు పయనమైపోయి పంటకారున అదుల్లాము గుహలో తమ రాజును కలిసికొనిరి.
14. దావీదు అపుడు బొరియలో దాగియుండెను. ఫిలిస్తీయుల పటాలము బేత్లెహేమును చుట్టుముట్టియుండెను.
15. దావీదు “బెత్లెహేము ద్వారము చెంతనున్న బావినుండి ఎవరైన నాకు గుక్కెడు నీళ్ళు కొనివచ్చిన బాగుగానుండును” అనెను.
16. ఆ మాటలాలించి ముగ్గురు వీరులు ఫిలిస్తీయుల దండులగుండ దారిచేసి కొనిపోయి బెత్లెహేము ద్వారము చెంతనున్న బావి నుండి నీళ్ళుతోడి తెచ్చి దావీదునకిచ్చిరి. కాని అతడా నీళ్ళు ముట్టుకొనక యావేకు ధారవో సెను.
17. “ప్రభూ! నేను ఈ నీళ్ళుముట్టుకొనిన ఒట్టు. ఈ వీరులు ప్రాణములకు తెగించి బేత్లెహేము పోయిరి. ఇది వారి నెత్తురుసుమా!” అనెను. కనుక అతడానీళ్ళు ముట్టు కోలేదు. ఆ ముగ్గురు వీరులు అంత సాహసము చూపిరి.
18. సెరూయా కుమారుడును యోవాబు తమ్ముడైన అబీషయి ముప్పదిమంది వీరుల జట్టుకు నాయకుడు. అతడు బల్లెముతో మూడు వందల మందిని పొడిచిచంపి ఆ ముప్పదిమందిలో పేరు మోసెను.
19. అతడు ఆ ముప్పదిమంది కంటె ప్రసిద్ధుడై వారికి మొనగాడయ్యెను. అయినను మొదటి ముగ్గురు మొనగాండ్రకు సమానుడు కాడయ్యెను.
20. యెహోయాదా కుమారుడు, కబ్సేలు నగరవాసియైన బెనాయా పెక్కు వీరకార్యములు చేసెను. మోవాబు పందెగాండ్రనిద్దరను మట్టుపెట్టెను. ఒకనాడు మంచు కురియుచుండగా పోయి గోతిలో నున్న సింగమును చావమోయెను.
21. అతడు ఆజాను బాహుడైన ఐగుప్తీయుని ఒకనిని హతమార్చెను. ఆ ఐగుప్తీయుడు ఈటె చేపట్టి వచ్చెను. బెనాయా చేతి కఱ్ఱతో పోయి ఐగుప్తీయుని మీదపడి అతని యీటె లాగుకొనెను. దానితోనే వానిని పొడిచిచంపెను.
22. యెహోయాదా పుత్రుడు బెనాయా ఇట్టి సాహస కార్యములతో ముప్పదిమంది వీరులలో గణనకెక్కెను.
23. అతడా ముప్పదిమంది వీరులకంటె ప్రసిద్ధుడయ్యెను గాని మొదటి ముగ్గురు మొనగాండ్ర వంటివాడు కాలేకపోయెను. దావీదు బెనాయాను తన అంగరక్షకు లకు నాయకుని చేసెను.
24-39. దావీదు వీరులు వీరు: యోవాబు తమ్ముడు అసాహేలు, బేత్లెహేమీయుడును దోదో కుమారుడైన ఎల్హానాను, హారోదువాడు షమ్మా, హారోదు వాడు ఎలీకా, పల్తీయుడు హేలేసు, తెకోవా వాసియు ఇక్కేషు కుమారుడైన ఈరా, అనతోతు వాడగు అబియేసేరు, హూషావాడగు మెబున్నాయి, ఆహోవాడగు సల్మోను, నెటోఫావాడగు మహరాయి, నెటోఫావాడగు బానా కుమారుడు హేలెబు, బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబయి కుమారుడు ఇత్తయి, పిరతోనువాడగు బెనాయా, గాషులోయకు చెందిన హిద్దాయి, అర్బాతీయుడు అబీయల్బోను, బహూరము వాడగు అస్మావేత్తు, షాల్లోనువాడగు ఎలియాబా, యాషేను కుమారులు, హారారునకు చెందిన షమ్మా కుమారుడు యోనాతాను, హారారునకు చెందిన షారారు కుమారుడు అహియాము, మాకాకు చెందిన అహస్బాయి కుమారుడు ఎలీఫేలేటు, గిలోకు చెందిన అహీతోఫెలు కుమారుడు యెలీయాము, కర్మేలు వాడగు హెస్రో, ఆరబు వాడగు పారాయి, సోబాకు చెందిన నాతాను కుమారుడు ఈగాలు, గాదీయుడగు బానీ, అమ్మోనీయుడగు సెలెకు, సెరూయా కుమారుడగు యోవాబు అంగరక్షకుడును, బేరోతీయుడగు నహరాయి, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారెబు, హిత్తీయుడగు ఊరియా. వీరందరు కలసి ముప్పది యేడుగురు.