ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 23వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. ఫిలిస్తీయులు కెయీలా నగరముమీద పడి కళ్ళములలోని ధాన్యము దోచుకొని పోవుచున్నారని దావీదు వినెను.

2. అతడు యావేతో సంప్రతించి “నన్ను ఫిలిస్తీయులను తునుమాడమందువా?” అని అడిగెను. ప్రభువు “పొమ్ము, ఫిలిస్తీయులను పట్టి పల్లార్చి కెయీలా పట్టణమును కాపాడుము" అని చెప్పెను.

3. కాని దావీదు అనుచరులు “మేము యూదా సీమలోనే భయముతో సంచరించుచున్నాము గదా! ఇక కెయీలా నగరమునకు పోయి ఫిలిస్తీయ సైన్యములను ఎదిరించినచో మన గతి ఏమగును?” అని పలికిరి.

4. కనుక దావీదు మరల యావేను సంప్రతించెను. ప్రభువు అతనితో “పొమ్ము, కెయీలా పట్టణమున ఫిలిస్తీయుల నెదుర్కొనుము. నేను వారిని నీవశము చేసితిని” అని చెప్పెను.

5. కనుక దావీదు అనుచరులతో పోయి కెయీలాకు వచ్చి ఫిలిస్తీయులను ఎదిరించి పోరాడెను. శత్రువులను ఊచముట్టుగ తునుమాడి వారి పశువులను తోలుకొనివచ్చెను. నాడు కెయీలా నివాసులు దావీదు వలన శత్రువుల బారి నుండి తప్పించుకొనిరి.

6. అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు సౌలుబారినపడక దావీదును ఆశ్రయించెను గదా! అతడు దైవచిత్తమును తెలిసికొను ఎఫోదు చేతపట్టుకుని కెయీలా నగరము చేరెను.

7. దావీదు కెయీలా పట్టణమునకు పోయెనని సౌలు వినెను. అతడు “ఇకనేమి! ప్రభువు దావీదును నా చేతికి అప్పగించెను. కవాటములతోను, అడ్డుగడల తోను మూయబడిన పట్టణమున ప్రవేశించి దావీదు బోనులో చిక్కుకొనెను” అని అనుకొనెను.

8. సౌలు తన జనులందరిని యుద్ధమునకు పిలిచెను. కెయీలా నగరమును ముట్టడించి దావీదును పరివారముతో పట్టుకొందమని చెప్పెను.

9. కాని దావీదు సౌలు తనకు కీడు తలపెట్టెనని పసికట్టి యాజకుడైన అబ్యాతారును పిలిచి ఎఫోదును తెమ్మనెను.

10. అతడు “యిస్రాయేలు ప్రభుడవైన యావే! సౌలు కెయీలాకు రానున్నాడనియు, నా కొరకు ఈ నగరమును నాశము చేయనున్నాడనియు రూఢిగా వింటిని.

11. ఈ మాట నిజమేనా? సౌలు ఇక్కడికి వచ్చునా? యిస్రాయేలు ప్రభుడవైన యావే! నీ సేవకునికి నిజము తెల్పుము” అని అడిగెను. ప్రభువు “అతడిచ్చటికి వచ్చును" అని పలికెను.

12. దావీదు మరల "కెయీలా పౌరులు నన్నును నా అనుచరులను సౌలునకు పట్టియిత్తురా?” అని అడిగెను. 'అవును!' అని ప్రభువు జవాబిచ్చెను.

13. వెంటనే దావీదు అతని అనుచరులును ఆరువందలమంది నగరము వీడి ఎచట తలదాచుకొనగలరో అచటకు పోయిరి. దావీదు పలాయితుడయ్యెనని విని సౌలు తన దాడి విరమించెను.

14. అటుల పారిపోయి దావీదు ఎడారులలో కొండచరియలలో వసించుచుండెను. సీఫు ఎడారిలోని కొండలలో కొంతకాలముండెను. సౌలు అను దినము దావీదును వెదకించెను గాని, ప్రభువు అతనిని సౌలు చేతికి చిక్కనీయలేదు.

15. సౌలు తనను వెదకవచ్చుచుండెనని దావీదు తెలిసికొనెను. అప్పుడతడు పీపు ఎడారిలో హోరేషువద్ద నుండెను.

16. సౌలు కుమారుడగు యోనాతాను హోరేషు వద్ద దావీదును కలిసికొనెను. యావే పేర అతనిని ప్రోత్సహించెను.

17. యోనాతాను దావీదుతో “భయపడకుము. నీవు నా తండ్రి సౌలుచేతికి దొరకవు. నీవు యిస్రాయేలీయులకు రాజువగుదువు. నేను నీ క్రింద సహకారిని అగుదును. ఈ సంగతి నా తండ్రికి కూడ తెలియును” అని పలికెను.

18. వారిరువురు యావే యెదుట ఒడంబడిక చేసికొనిరి. పిమ్మట యోనాతాను తన ఇంటికి మరలిపోయెను. దావీదు హోరేషు వద్దనే వసించెను.

19. సీపు నివాసులు కొందరు గిబియా యందున్న సౌలు వద్దకు వచ్చి "దావీదు మా పొరుగుననే హోరేషు కొండబొరియలలో, యెషీమోనునకు దక్షిణముననున్న హకీలా తిప్పలలో దాగుకొనియున్నాడు.

20. ప్రభూ! నీ మనోభీష్టమంతటి చొప్పున వెడలిరమ్ము. అతనిని పట్టిచ్చుట మావిధి” అనిరి.

21. సౌలు వారితో “మీరు నాకు చాల ఉపకారము చేసితిరి. ప్రభువు మిమ్ము దీవించుగాక!

22. మీరు వెడలిపోయి ఇంకను ఒక కన్నువేసి యుండుడు. దావీదు ఎక్కడనున్నాడో, ఎవరి కంటబడెనో నిశ్చితముగా తెలిసికొనుడు. అతడు జిత్తులమారి అని వింటిని.

23. వాని రహస్య స్థావరములు అన్నిటిని జాగ్రత్తగా గాలించి నా యొద్దకు రండు. అపుడు నేను మీతో వత్తును. దావీదు ఎక్కడ నుండినను యూదాయంతటిలో గాలించియైనను నేను వానిని పట్టుకొందును” అని యనెను.

24. కనుక వారు సౌలు కంటే ముందుగా సీపు సీమకు వెడలిపోయిరి. దావీదు అనుచరులతో యెషీమోనునకు దక్షిణముననున్న మరుభూమిలోని మావోను ఎడారిలో మసలుచుండెను.

25. సౌలు పరివారముతో తనను పట్టుకొనుటకు వచ్చుచున్నాడని విని దావీదు మావోను ఎడారిలోని కొండలలో దూరెను.

26. సౌలు అతని అనుచరులును కొండకు ఈవలివైపున ప్రయాణము సాగింపగా, దావీదు అతని అనుచరులు కొండకావలివైపున పయనము చేయుచుండిరి. సౌలువలన భయముచే దావీదు వడివడిగా సాగిపోవుచుండెను. అతనిని ఎటులయిన పట్టుకోవలయునని సౌలు బలగముతో వేగముగ వెంటనంటి పోవుచుండెను.

27. ఇంతలోనే ఒక దూత సౌలు నొద్దకు వచ్చి “ఫిలిస్తీయులు దండెత్తివచ్చి మన దేశమును ఆక్రమించిరి. దేవరవారు వెంటనే మరలి రావలయును” అని చెప్పెను.

28. సౌలు దావీదును వెన్నాడుటమాని ఫిలిస్తీయుల నెదుర్కొనుటకై తిరిగిపోయెను. కనుకనే ఆ తావునకు “విభజన పర్వతము” అని పేరు వచ్చినది.

29. దావీదు అచ్చటినుండి ప్రయాణము సాగించి ఎంగెడీ కొండలలో వసించెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services