ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య మొదటి గ్రంధము 22వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. కనుక అతడు “దేవుడైన యావే నివాస స్థలము ఇచటయే ఉండవలయును. యిస్రాయేలీయులు ప్రభువునకు దహన బలులుర్పించు దహనబలిపీఠము ఇచ్చటనే ఉండవలయును” అని పలికెను.

2. దావీదు తన రాజ్యమునవసించు విదేశీయులను అందరిని ప్రోగుచేయించి వారిని పనికి నియమించెను. వారిలో కొందరు దేవుని మందిర నిర్మాణమునకుగాను పెద్ద పెద్ద రాళ్ళుచెక్కిరి.

3. తలుపులకు, ద్వారములకు చీలలు, బందులు చేయించుటకు అతడు ఇనుమును సమృద్ధిగా చేకూర్చెను. ఎవరును తూకము వేయ జాలనంతగా కంచునుగూడ ప్రోగుచేసెను.

4. తూరు, సీదోను ప్రజలతనికి దేవదారు మ్రానులనుగూడ పుష్కలముగా సరఫరా చేసిరి. కనుక అతడు వానిని గూడ సమృద్ధిగా ప్రోగుచేసెను.

5. దావీదు “నా కుమారుడు సొలోమోను నిర్మింపనున్న దేవాలయము వైభవముతో అలరారి జగద్విఖ్యాతి చెందవలయును. కాని అతడింకను చిన్నవాడు, అనుభవము లేనివాడు. కనుక నేను ముందుగనే మందిరనిర్మాణమునకు సన్నాహములు చేయుదును” అనుకొనెను. కావున అతడు చనిపోక ముందు దేవాలయ నిర్మాణమునకు విస్తారవస్తువులను ఆర్జించెను.

6. అతడు కుమారుని పిలిపించి యిస్రాయేలు దేవుడైన ప్రభువునకు మందిరము కట్టవలయునని ఆదేశించెను.

7. ఇంకను అతడు సొలోమోనుతో “కుమారా! నేను నా ప్రభువైన దేవునికి మందిరము కట్టవలయునని ఉవ్విళ్ళూరితిని.

8. కాని ప్రభువు నాతో 'నీవు ఘోరమైన యుద్ధములనుచేసి రక్తము అపారముగా నేలపై ఒలికించితివి. ఇంతగా రక్తపాతము కావించితివి కనుక నీవు నా నామమునకు దేవాలయము కట్టరాదు.

9. అయినను నీకొక కుమారుడు కలుగును. అతడు శాంతియుతముగా పరిపాలనము చేయును. శత్రువుల బారిదప్పి శాంతి సుఖములు అనుభవించును. ఆ కుమారుని యేలు బడిలో యిస్రాయేలీయులకు శాంతిభద్రతలు సిద్ధించును. కనుక అతనిని సొలోమోను' అని పిలుతురు. అతడే నాకు దేవాలయము నిర్మించును. అతడు నాకు కుమారుడుకాగా నేనతనికి తండ్రినగుదును. అతని రాజవంశము కలకాలము యిస్రాయేలును పరిపాలించును' అని చెప్పెను.

10-11. కనుక కుమారా! ప్రభువు నీకు అండగా నుండి తాను మాట ఇచ్చినట్లే, నీ ద్వారా దేవాలయమును కట్టించుగాక!

12. ఇంకను ప్రభువు నీకు వివేక విజ్ఞానములు ప్రసాదించి నీవు ఆయన ధర్మశాస్త్రము ప్రకారము ప్రజలను సక్రమముగా పరిపాలించునట్లు చేయునుగాక!

13. ప్రభువు మోషే ద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్రమును పాటింతువేని నీకు తప్పక విజయము సిద్దించును. నీవు మాత్రము దేనికిని భయపడక, దేనికిని జంకక, స్థిరచిత్తముతోను, ధైర్యముతోను మెలగుము.

14. నా మట్టుకు నేను ప్రయత్నముచేసి దేవాలయమునకు రెండు లక్షల మణుగుల బంగారమును, ఇరువదిలక్షల మణుగుల వెండిని సిద్ధము చేయించితిని. ఎవరు తూకము వేయజాలనంతగా ఇనుమును, కంచును ప్రోగుజేయించితిని. దేవదారు కలపను రాళ్ళనుగూడ చేకూర్చి పెట్టితిని. కాని ఈ రెండింటిని నీవింకను అధికముగా ప్రోగుజేయవలయును.

15-16. నీకు చాలమంది పనివారున్నారు. రాతిపనివారు, తాపీ పనివారు, వడ్రంగులపనివారు ఉన్నారు. వెండి, బంగారము, కంచు, ఇనుములతో పనిచేయువారున్నారు. కనుక నీవు పని ప్రారంభింపుము. ప్రభువు నీకు బాసటయైయుండును” అని పలికెను.

17. దావీదు యిస్రాయేలు నాయకులను అందరిని సొలోమోనునకు తోడ్పడవలయునని ఆజ్ఞా పించెను.

18. అతడు వారితో “మీ దేవుడైన ప్రభువు మీకు తోడుగానున్నాడుగదా!. అతడు మీకు అన్ని దిక్కులందు శాంతిని ప్రసాదించెనుగదా! ప్రభువు అనుగ్రహము వలన నేను ఇచటి స్థానిక జాతులనెల్ల జయించితిని. నేడు వారు దేవునియెదుటను, మీ యెదుటను లొంగియున్నారు.

19. కనుక మీరిపుడు పూర్ణహృదయముతో ప్రభువును సేవింపుడు. దేవాలయము కట్టుడు. అప్పుడు ప్రభువు మందసమును, ఆరాధన సామగ్రిని దానిలో భద్రపరుపవచ్చును” అని చెప్పెను.