1. సైతాను యిస్రాయేలీయులను తిప్పలు పెట్టనెంచి జనాభా లెక్కలు తయారు చేయింపవలెనని దావీదును ప్రేరేపించెను.
2.కనుక దావీదు యోవాబుతో, అధిపతులతో “మీరు వెళ్ళి బేర్షెబ నుండి దానువరకు గల యిస్రాయేలీయులందరిని లెక్కపెట్టి మొత్తమెంత మంది ఉన్నారో నాకు తెలియజేయుడు” అనెను.
3. ఆ మాటలకు యోవాబు “యావే మన ప్రజలను నూరంతలుగా వృద్ధిచేయుగాక! ఈ జనులెల్లరును దేవర వారి దాసులేకదా! ఇప్పుడు ఈ లెక్కల వలన యిస్రాయేలీయులు అందరు నేరము కట్టుకొందురు. ప్రభువు ఇట్టి కార్యముచేయనేల?” అనెను.
4. కాని రాజు తన ఆజ్ఞను పాటింపుమని యోవాబును ఒత్తిడి చేసెను. కనుక అతడు దేశమంత తిరిగి జనాభా లెక్కలు సిద్ధము చేసికొనివచ్చెను.
5. అతడు యిస్రాయేలీయులలో యుద్ధము చేయగలవారు మొత్తము పదునొకండు లక్షలమంది అనియు, యూదా నివాసాలలో యుద్ధము చేయగలవారు మొత్తము నాలుగు లక్షలడెబ్బదివేలమంది అనియు రాజునకు విన్నవించెను.
6. యోవాబునకు రాజాజ్ఞ నచ్చలేదు కనుక అతడు లేవీయులను, బెన్యామీనీయులను లెక్కపెట్టలేదు.
7. రాజు చేసినపని ప్రభువునకు ప్రీతి కలిగింపలేదు. కనుక ఆయన యిస్రాయేలును శిక్షించెను.
8. దావీదు “ప్రభూ! ఈ జనాభా లెక్కల మూలమున నేను పెద్ద తప్పిదము చేసితిని, నేను చాల అవివేకముతో ప్రవర్తించితిని. నన్ను క్షమింపుము” అని వేడుకొనెను.
9-10. యావే దావీదునకు దీర్ఘదర్శి అయిన గాదుతో “నీవు వెళ్ళి రాజుతో నా మాటలుగా ఇట్లు చెప్పుము: నేను నీకు మూడు కార్యములు నిర్ణయించితిని. వానిలో నీవు ఎన్నుకొన్నదానిని చేసెదను” అనెను
11. గాదు దావీదువద్దకు వచ్చి ప్రభువు పలుకులను ఇట్లు ఎరిగించెను.
12. “మూడేండ్లపాటు కరువు లేదా మూడునెలలు నీవు శత్రువుల ఎదుట నిలువలేక నాశనమగుట లేదా మూడు దినములు ప్రభువు ఖడ్గము నిన్నువెన్నాడ అంటురోగము ఈ దేశమును పీడింపగా ప్రభువుదూత యిస్రాయేలీయులను నాశనము చేయుట ఈ మూడింటిలో ఏది కావలయునో కోరుకొనుము. ప్రభువునకు నన్నేమి జవాబు చెప్పుమందువో తెలియజేయుము” అనెను.
13. దావీదు “నేను ఇరుకున పడితిని. అయినను ప్రభువు దయాసముద్రుడు కనుక నరులచేతికి చిక్కుటకంటే ఆయన చేతికి చిక్కుట మేలు” అనెను.
14. అప్పుడు ప్రభువు యిస్రాయేలీయులను అంటురోగమువాత బడునట్లు చేసెను. దానివలన డెబ్బదివేలమంది చచ్చిరి.
15. ఆయన యెరూషలేమును నాశనము చేయుటకు తన దూతను పంపెను. కాని ఆ దూత నగరమును పాడుచేయబోవు చుండగా ప్రభువు జాలినొంది అతనితో “ఓయి! ఇక చాలు” అనెను. అప్పుడు దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమువద్ద సాక్షాత్కరించెను.
16. దావీదు ప్రభువు దూత భూమ్యాకాశములకు మధ్య నిలచి కత్తిదూసి యెరూషలేమును నాశనము చేయుటకు సంసిద్ధమగుటను గమనించెను. వెంటనే గోనె తాల్చియున్న దావీదు, ప్రజానాయకులు సాష్టాంగపడిరి.
17. దావీదు “ప్రభూ! ప్రజలను లెక్కపెట్టుట అను చెడుపని చేయించినది నేను. గొఱ్ఱెలవంటి ఈ ప్రజలు ఏ పాపమును ఎరుగరు. కనుక నీవు నన్నును, నా కుటుంబమును శిక్షించి ఈ నీ జనులను వదలివేయుము” అని మనవి చేసెను.
18. అప్పుడు ప్రభువుదూత గాదుతో ఒర్నాను కళ్ళము నందు ప్రభువునకు ఒక బలిపీఠము నిర్మింపుమని దావీదుతో చెప్పుమనెను.
19. గాదు చెప్పినట్లే దావీదు ప్రభువు ఆజ్ఞకు బద్దుడై కళ్ళము చెంతకు పోయెను.
20. అప్పుడు ఒర్నాను తన నలుగురు కుమారులతో గోధుమలు నూర్చుచుండెను. వారు ప్రభువు దూతను చూచి భయపడి దాగుకొనిరి.
21. ఒర్నాను దావీదు రాజు తనయొద్దకు వచ్చుట చూచి కళ్ళమునుండి వెలుపలికొచ్చి శిరము నేలమోపి దండము పెట్టెను.
22. రాజతనితో “ఈ కళ్ళమును నాకు అమ్ముము. నేనిట ప్రభువునకు బలిపీఠము నిర్మింపవలయును. అప్పుడు గాని ఈ అంటురోగము సమసిపోదు. నేను దీనికి నిండువెలను ఇత్తును” అనెను.
23. ఒర్నాను “ప్రభువు ఈ స్థలముతో తమ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చును. ఇవిగో ఈ ఎద్దులను దహనబలిగా అర్పింపవచ్చును. గోధుమలను సూర్చు ఈ మ్రానును వంటచెరకుగా వాడుకోవచ్చును. ఈ గోధుమలను ధాన్యబలిగా అర్పింపవచ్చును. వీనినెల్ల నీకు ఇచ్చెదను, గైకొనుము” అని దావీదుతో అనెను.
24. దావీదు అతనితో “నేను నీకు పూర్తి వెల యిత్తును. నేనేమియు ఖర్చుపెట్టకుండ నీ వస్తువులను తీసికొని దేవునికి బలియర్పింతునని అనుకొంటివా?” అనెను.
25. కనుక దావీదు ఆ తావునకుగాను ఒర్నానునకు ఆరువందల తులముల బంగారము చెల్లించెను.
26. దావీదు అచట ఒక బలిపీఠము నిర్మించి దహనబలులు, సమాధానబలులు అర్పించెను. అతడు ప్రభువునకు ప్రార్థనచేయగా ప్రభువు ప్రత్యుత్తరముగా ఆకసమునుండి నిప్పు పంపి బలిపీఠముమీది బలులను దహించెను.
27. ప్రభువు ప్రభువుదూతతో ఇక నీ కత్తిని ఒరలో పెట్టుమని చెప్పెను.
28. దావీదు ప్రభువు తనమొర ఆలకించెనని గుర్తించి ఒర్నాను కళ్ళము నందు బలిపీఠముమీద బలులు అర్పించెను.
29. మోషే ప్రభువు కొరకు ఎడారిలో తయారుచేసిన గుడారము, దహనబలులు అర్పించు బలిపీఠము అంత వరకు గిబ్యోను క్షేత్రముననేయుండెను.
30. దావీదు ప్రభువుదూత కత్తిని జూచి భయపడి ప్రభువును సంప్రతించుటకు గిబ్యోనునకు వెళ్ళడయ్యెను.