ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 20వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. యిప్రాయేలీయులలో షెబ అను దుర్మార్గుడు ఒకడు కలడు. అతడు బెన్యామీనీయుడైన బిక్రి కుమారుడు. షెబ బాకానూది: “మనకు దావీదు సొత్తులో పాలులేదు, యిషాయి కుమారుని వారసులతో పొత్తులేదు. కావున యిస్రాయేలీయులారా! మన నివాసములకు వెడలిపోవుదము రండు!” అని కేకలిగెను.

2. ఆ మాటలాలించి యిస్రాయేలీయులు దావీదును విడనాడి షెబ వెంటబోయిరి. కాని యూదీయులు మాత్రము దావీదును వదలక యోర్దానునుండి యెరూషలేమువరకు అతని వెంట నంటిపోయిరి.

3. దావీదు యెరూషలేములోని తన పురము చేరుకొని ప్రాసాదమున ప్రవేశించెను. అతడు ఆ ప్రాసాదమును పరామర్శించుటకని వదలి పోయిన పదిమంది ఉంపుడుగత్తెలనొక ఇంటనుంచి వెచ్చము లిచ్చి పోషించెను. దావీదు వారిని మరల కన్నెత్తియైన చూడలేదు. కనుక వారు చనిపోవువరకు విధవలవలె జీవించిరి.

4. రాజు అమాసాతో “నీవు వెళ్ళి యూదీయులను మూడుదినములలో ప్రోగుచేసి కొనిరమ్ము! నీవు స్వయముగా వారితో రమ్ము" అని చెప్పెను.

5. అమాసా యూదీయులను గుంపుగూర్చుటకు వెడలిపోయెను. కాని అతడు దావీదు పెట్టిన గడువులోపల రాలేక పోయెను.

6. రాజు అభిషయితో “ఈ బిక్రి కుమారుడు షెబ మనలను అబ్షాలోముకంటె ఎక్కువగా ముప్పు తిప్పలు పెట్టును. కనుక నీవు రాజు సంరక్షకభటులను తీసికొనిపోయి షెబను వెన్నాడుము. అతడు సురక్షిత పట్టణములు ప్రవేశించెనేని ఇక మన చేతికి చిక్కడు” అని చెప్పెను.

7. కనుక యోవాబు వారును, కెరెతీయులును, పెలెతీయులును మరియు మహావీరులు యెరూషలేము నుండి అభీషయితో పయనమై బిక్రి కుమారుడు షెబను పట్టుకొన బోయిరి.

8. గిబ్యోను చెంతనున్న పెద్ద రాతిబండ దగ్గరకు రాగానే ఆమాసా వారికెదురుగా వచ్చెను. యోవాబు నిలువుచొక్కాయి ధరించి నడికట్టు కట్టుకొని యుండెను. ఆ నడికట్టు మీదినుండి ఒరలో కత్తి కట్టుకునియుండగా ఆ ఒర వదులై కత్తి నేలబడెను.

9. యోవాబు “తమ్ముడా అమాసా! క్షేమమేగదా!” అనుచు ముందటికి వచ్చి, ముద్దిడుకొను వానివలె కుడిచేతితో అతని గడ్డము పట్టుకొనెను.

10. అమాసా యోవాబు చేతనున్న కత్తిని గమనింపనేలేదు. యోవాబు ఆ కత్తితో అమాసాను కడుపున పొడువగా అతని ప్రేవులుజారి నేలపైబడెను. రెండవపోటుతో అవసరము లేకయే అమాసా అసువులు బాసెను. అంతట అభీషయి, యోవాబు బిక్రి కుమారుడు షెబను పట్టుకొనుటకై చెరచెర సాగిపోయిరి.

11. యోవాబు సైనికుడొకడు అమాసా చేరువ నిలిచి "యోవాబు, దావీదుల పక్షము అవలంబింపగోరువారు యోవాబును అనుసరించి వెళ్ళుడు" అని చెప్పుచుండెను.

12. అమాసా త్రోవనడుమ నెత్తుటి మడుగులో పడియుండెను. ఆ త్రోవవెంట వచ్చు యోధులందరను అచట ఆగి నిశ్చేష్టులై చూచుచుండిరి. అది గాంచి ఒక సైనికుడు అమాసా శవమును ప్రక్క పొలము లోనికి లాగివేసి దానిమీద ఒక వస్త్రము కప్పెను.

13. అటు పిమ్మట యోధులందరు బిక్రి కుమారుడైన షెబను పట్టుకొనుటకై నేరుగా యోవాబును అనుసరించి వెళ్ళిరి.

14. షెబ యిస్రాయేలు రాజ్యమంతట తిరిగి చివరకు ఆబేలుబెత్మాకా నగరము ప్రవేశించెను. బిక్రీయులు అతనిననుసరించి వెళ్ళిరి.

15. షెబ పట్టణమున ప్రవేశింపగనే అతనిని వెన్నాడివచ్చినవారు నగర ప్రాకారమెత్తు వరకు కట్టపోసి ప్రాకారమును కూలద్రోయదొడగిరి.

16. అపుడు వివేకవతియగు వనిత ఒకత్తే ప్రాకారముపై నుండి “అయ్యలారా! ఒక్క మాటవినుడు. యోవాబును ఇచ్చటికి పిలిపింపుడు. నేనాయనతో మాట్లాడవలయును” అని పలికెను.

17. యోవాబు ముందటికి వచ్చెను. ఆమె “యోవాబువు నీవేనా?” అని అడుగగా అతడు “అవును నేనే” అని చెప్పెను. ఆమె “ఈ దాసురాలి పలుకులాలింపుము” అనెను. అతడు “ఆలించుచునే యున్నాను చెప్పుము” అనెను.

18. “ 'యిస్రాయేలు పెద్దల ఆచారములు అడుగంటి పోయెనేని ఆబేలు, దాను పట్టణములను చూచి మరల నేర్చుకొనుడు' అని పూర్వమొక సామెత యుండెడిది.

19. యిస్రాయేలు దేశమున శాంతియుతులును యదార్దవంతులును వశించు పట్టణమిది. మీరీ పట్టణమును, ఈ మాతృనగరమును నాశనము చేయబోవుచున్నారు. నాయనలార! ప్రభువు సొత్తయిన ఈ పురమునే కూలద్రోయుదురా?” అని పలికెను.

20. యోవాబు “అమ్మా! ఇవి ఏటి మాటలు? ఈ నగరమును ఆక్రమించుకోవలయుననిగాని, నాశనము చేయవలయుననిగాని నాకు కోరికలేదు.

21. ఉన్న మాట వినుము. ఎఫ్రాయీము కొండకోనకు చెందిన బిక్రి కుమారుడగు షెబ మన రాజు దావీదుపై తిరుగుబాటు చేసెను. అతనినొక్కనిని మాకు పట్టి యిత్తురేని వెంటనే మీ నగరమును వీడి వెడలిపోయెదము” అనెను. ఆమె “దానికేమి, ఈ గోడమీద నుండి అతని తలను మీ కడకు విసరివేసెదము” అని చెప్పెను.

22. ఇట్లు చెప్పి ఆమె నగరములోనికి వెడలిపోయి తన తెలివితేటలతో పురజనులను ఒప్పించెను. వారు బిక్రి కుమారుడు షెబ తల నరికి గోడమీది నుండి యోవాబు ఎదుటకు విసరివేసిరి. వెంటనే యోవాబు బాకానూదెను. అతని అనుచరులు పోరు చాలించి తమ తమ గుడారములు చేరుకొనిరి. యోవాబు యెరూషలేమునకు వెడలిపోయెను.

23. యోవాబు దావీదు పటాలములన్నింటికిని నాయకుడు. యెహోయాదా పుత్రుడైన బెనాయా కెరెతీయులకును, పెలెతీయులకును నాయకుడు,

24. అదోరాము వెట్టిచారికి చేయు నిర్బంధ సైనికులకు అధిపతి. అహీలూదు కుమారుడు యెహోషాఫాత్తు లేఖకుడు.

25. షెవా కార్యదర్శి, సాదోకు, అబ్యాతారు యాజకులు.

26. యాయీరు నివాసి యీరా కూడ దావీదునకు యాజకుడు.