1. ఆ రీతిగ ఏసరద్రోను పరిపాలనా కాలమున నేను మరల ఇల్లు చేరుకొంటిని. నా భార్య అన్నా, నా కుమారుడు తోబియాకూడ నాయొద్దకు తిరిగివచ్చిరి. ఏబదినాళ్ళకు వచ్చు పెంతెకొస్తు అనువారముల పండుగకు మేము మంచివిందు సిద్ధము చేసికొంటిమి. నేను భోజనము చేయనెంచితిని.
2. బల్లమీద చాల భోజన పదార్దములు కనిపించినవి. నేను, నా కుమారుడు తోబియాతో “నాయనా!నీవు బయటికి వెళ్ళి మనవలె ఈ పట్టణమున ప్రవాసమున జీవించుచున్న పేద యిస్రాయేలీయుని ఒకనిని తోడ్కొని రమ్ము. కాని అతడు దేవునిపట్ల భయభక్తులు చూపువాడై ఉండవలెను. అతనిని మనతో కలుపుకొని భుజింతము. నీవు వచ్చువరకు నేను వేచియుందును” అని చెప్పితిని.
3. తోబియా పేదవానిని వెదకి తీసికొనిరాబోయెను కాని అతడు కొంచెము సేపటిలోనే తిరిగివచ్చి 'నాయనా! నాయనా!” అని పిలిచెను. నేను ఏమి జరిగినదని అడిగితిని. అతడు “మన జాతివానినొకనిని ఇప్పుడే గొంతు పిసికి చంపి సంతవీధిలో పడవేసిరి” అని చెప్పెను.
4. నేను భోజనము ముట్టుకొనకుండ వెంటనే లేచి వెళ్ళితిని. సంతనుండి శవమును తీసికొనివచ్చి ఒక పాకలో ఉంచితిని. సాయంకాలమైన పిదప దానిని పాతి పెట్టవచ్చును అనుకొంటిని.
5-6. తరువాత ఇంటికివచ్చి స్నానముచేసి శుద్ధిని పొందితిని. పిమ్మట విచారముతో విందు ఆరగించితిని. అప్పుడు ఆమోసు ప్రవక్త బేతేలును గూర్చి, “నీ పండుగలు శోకదినములగును. నీ ఆనందగీతములు శోకగీతములగును” . అని పలికిన వాక్యము నాకు జ్ఞప్తికి వచ్చెను. నేను దిగులుతో ఏడ్చితిని.
7. ప్రొద్దుగ్రుంకిన తరువాత గోతిని త్రవ్వి శవమును పాతిపెట్టితిని.
8. ఇరుగు పొరుగువారు నన్ను పరిహాసము చేసి “నీకే మాత్రము భయములేదా? పూర్వము నీవిట్టి పనిని చేసినందుకు వారు నీ ప్రాణములు తీయగోరిరి కదా! నీవప్పుడు పారిపోయి ప్రాణములు రక్షించుకొంటివి. అదరు బెదరు లేక ఇప్పుడు మరల శవములను పాతిపెట్టుచున్నావా?" అనిరి.
9. ఆ రాత్రి నేను స్నానము చేసి శుద్ధినిపొంది మా ఇంటి ముంగిట గోడ ప్రక్కన పడుకొంటిని. వాతావరణము వేడిగానున్నందున మొగమును బట్టతో కప్పుకోనైతిని.
10. ఆ గోడమీద పిచ్చుకలు ఉన్నవి. కాని ఆ సంగతి నాకు తెలియదు. అవి తమ వేడి రెట్టను చివాలున నా కన్నులలో జారవిడిచెను. నా నేత్రములలో తెల్లని పొరలేర్పడెను. నేను వైద్యుని తరువాత వైద్యుని సందర్శించితిని. కాని వారి లేపనముల వలన నా కంటిపొరలు ఇంక ముదిరినవి. చివరికి చూపుపూర్తిగా మందగించినది. నేను నాలుగేండ్లపాటు గ్రుడ్డివాడుగా ఉంటిని. అహీకారు రెండేండ్ల వరకు నన్ను పోషించెను. తరువాత అతడు ఏలామునకు వెళ్ళిపోయెను.
11. నా భార్య సామాన్య స్త్రీలవలె కూలిపని చేయవలసివచ్చెను. ఆమె మగ్గముమీద నేతనేసెడిది.
12. ఆ నేసిన బట్టను తీసికొనిపోయినపుడు యజమానులు ఆమెకు కూలి ఇచ్చెడివారు. ఒక పర్యాయము ఐదవనెల ఏడవదినమున అన్నా ఒక బట్టను నేసి యజమానుల వద్దకు కొనిపోయెను. వారు ఆమెకు పూర్తివేతనము చెల్లించుట మాత్రమేగాక ఒక మేక పిల్లనుగూడ కానుకగా ఇచ్చిరి.
13. అది మా ఇంటికి రాగానే అరచుట మొదలుపెట్టెను. నేను నా భార్యను పిలిచి “ఈ మేకపిల్ల ఎక్కడిది? నీవు దానిని ఎవరి యొద్దనుండియైన దొంగిలించుకొని వచ్చితివా ఏమి? పోయి, వెంటనే దానిని దాని ఇంటివారికి అప్పగించి రమ్ము. దొంగసొమ్మును భుజించుట న్యాయము కాదు” అంటిని.
14. అన్నా “ఇది దొంగసొమ్ము కాదు. వేతనముతో పాటు దీనిని గూడ నాకు బహుమతిగా ఇచ్చిరి" అని చెప్పెను. కాని నేను ఆమె పలుకులు నమ్మనైతిని. ఆమె చేసినపనికి నేను మొగమెత్తుకోజాలనైతిని. కనుక ఆ మేకకూనను దాని యజమానులకు ఇచ్చిరమ్మని పట్టుపట్టితిని. కాని ఆమె కోపముతో “నీ దానధర్మము లన్నియు ఏమైనవి? నీ సత్కార్యములన్నియు ఏ గాలికి పోయినవి? ఆ పుణ్యమంతయు ఏ వరదన పోయినది? ఇప్పుడు నీ హృదయము నాకు అర్ధమైనదిలే” అని విరుచుకొనిపడెను.