1. చేప కడుపులోనుండి యోనా తన దేవుడైన ప్రభువునకు ఇట్లు ప్రార్థన చేసెను:
2. "ప్రభూ! నా ఆపదలో నేను నీకు మొరపెట్టగా నీవు నా గోడు వింటివి. నేను పాతాళలోకమునుండి నీకు కేకలువేయగా, నీవు నా వేడుకోలును అంగీకరించితివి.
3. నీవు నన్ను కడలిలోనికి విసరివేసితివి. సముద్ర గర్భమున పడవేసితివి. ప్రవాహములు నన్ను చుట్టుముట్టెను. నీ మహాతరంగములు నా మీదికి పొర్లివచ్చెను.
4. నీవు నన్ను నీ సమక్షమునుండి బహిష్కరించితివనియు, నీ పవిత్రమందిరమును నేను మరల కంటితో చూడననియు, నేను తలంచితిని.
5. జలములు నా గొంతువరకు వచ్చి నన్ను ముంచివేసెను. సముద్రము నన్ను మ్రింగివేసెను. నాచు నా తలకు చుట్టుకొనెను.
6. నేను పర్వత మూలముల వరకు మునిగిపోతిని. నిత్యము తలుపులు మూసియుండెడి లోకము లోనికి వెళ్ళిపోయితిని. అయినను ప్రభూ! నీవు నన్ను పాతాళమునుండి సజీవునిగా బయటికి కొనివచ్చితివి.
7. ప్రభూ! నా ప్రాణములు ఎగిరిపోవుచుండగా నేను నిన్ను స్మరించుకొంటిని. నా మొర నీ పవిత్రమందిరమున నిన్ను చేరెను.
8. నిరర్థకములైన విగ్రహములను కొల్చువారు నీయెడల భక్తితో మెలగజాలరు.
9. కాని నేను నీ స్తుతులు పాడి నీకు బలిని అర్పింతును. నా మ్రొక్కుబడులు చెల్లించుకొందును. ప్రభువునుండియే రక్షణము లభించును”,
10. అంతట ప్రభువు చేపను ఆజ్ఞాపింపగా, అది యోనాను ఒడ్డున వెళ్ళగక్కెను.