ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విలాప గీతములు 2వ అధ్యాయము || Roman catholic Bible in Telugu

 1. ప్రభువాగ్రహము చెంది సియోను కుమారిని చీకటిలో ముంచెను. ఆయన యిస్రాయేలు వైభవమును నేలమీదికి విసరికొట్టెను. తాను కోపము చెందిన దినమున తన పాదపీఠమును గూడ జ్ఞాపకము చేసుకొనలేకపోయెను.

2. ప్రభువు నిర్దయతో యూదాలోని పల్లెలన్నిటిని నాశనము చేసెను. ఆగ్రహముతో యూదా కోటలను కూల్చివేసెను. ఆ రాజ్యమును, దాని పాలకులను , క్రిందపడద్రోసి అవమానమున ముంచెను.

3. ఆయన ప్రచండకోపముతో యిస్రాయేలు బలమును ధ్వంసము చేసెను. శత్రువు మన మీదికెత్తివచ్చినపుడు తన సహాయమును నిరాకరించెను. మనపై ఆగ్రహము చెందిన అగ్గివలెమండి సమస్తమును కాల్చివేసెను.

4. ఆయన శత్రువువలె విల్లువంచి మన మీదికి బాణములు గురిపెట్టెను. కంటికి ప్రమోదమును గూర్చు వాటినన్నింటిని వధించెను. సియోను కుమారిమీద తన కోపమును నిప్పువలె కురిపించెను.

5. ఆయన పగవానివలె యిస్రాయేలును నాశనము చేసెను. దాని ప్రాసాదములను కోటలను నేలమట్టము చేసెను. యూదా కుమారిని తీవ్ర శోకమున ముంచెను.

6. ఆయన తన నివాస గృహమును తోటలోని గుడిసెనువలె కూల్చివేసెను. భక్తసమాజము ప్రోగగు మందిరమును , ధ్వంసము చేసెను. సియోను ప్రజలు తమ ఉత్సవ దినములను, విశ్రాంతి దినములను విస్మరించునట్లు చేసెను. ఉగ్రకోపముతో రాజును, యాజకుని త్రోసివేసెను.

7. ప్రభువు తన బలిపీఠమును పరిత్యజించెను. తన దేవాలయమును అసహ్యించుకొనెను. శత్రువులు ఆ దేవాలయ గోడలను కూల్చివేయునట్లు చేసెను. ఉత్సవదినమున మనము ఆలయములో, హర్షనాదము చేసినట్లే, విరోధులు ఆ దేవాలయమున విజయనాదము చేసిరి.

8. ప్రభువు సియోను కుమారి ప్రాకారములు కూలిపోవలెనని సంకల్పించుకొనెను. "ఆయన వానిని కొలనూలుతో కొలిచి పూర్ణ వినాశనమునకు గురిచేసెను.  బురుజులును, గోడలును శోకించి నేలకొరిగినవి.

9. నగరద్వారములు కూలి నేలలో దిగబడినవి. వాని అడ్డుగడెలు విరిగిపోయినవి. రాజును, అధిపతులును ప్రవాసమునకు పోయిరి. ధర్మశాస్త్రమును బోధించువారు లేరాయెను. ప్రవక్తలు ప్రభువునుండి దర్శనములు బడయజాలరైరి.

10. సియోను వృద్దులు నేలపై చతికిలబడి మౌనము వహించిరి. గోనెతాల్చి తలపై బూడిద చల్లుకొనిరి. యోరుషలేము యువతులు తలలు నేలమీదికి వంచిరి.

11. ఏడ్చి ఏడ్చి నా కన్నులు మసకలు క్రమ్మినవి. నా అంతరాత్మ అంగలార్చుచున్నది. నా ప్రజల వినాశనమును గాంచి నేను శోకముతో క్రుంగిపోతిని. చిన్నపిల్లలు, పసికందులు పురవీధులలో సొమ్మసిల్లి పడిపోవుచున్నారు.

12. వారు తమ తల్లులను చూచి మాకు అన్నపానీయములేవి? అని అలమటించుచున్నారు. గాయపడిన వారివలె నగరవీధులలో కూలుచున్నారు. తల్లుల ఒడిలో ఒదిగి ప్రాణములు విడుచుచున్నారు.

13. యోరూషలేము కుమారీ! నేను నిన్ను ఎట్టి మాటలచే హెచ్చరించుదును? నిన్నెవరితో సమపోల్చగలను? సియోను కుమారీ! నేను నిన్నెట్లు ఓదారును? నీవలె వ్యధలు అనుభవించిన వారెవ్వరు? నీ వినాశనము సముద్రమువలె అనంతమైనది. నిన్ను ఉద్దరింపగల వారెవ్వరు?

14. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములను చూచిరి. నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్ధమైన ఉపదేశములను పొందినవారైరి. త్రోవతప్పించు దర్శనములను చూచినవారైరి.

15. నీ ప్రక్కగా పోవువారు నిన్ను చూచి నవ్వుచు చప్పట్లు కొట్టుదురు. యెరూషలేము కుమారీ! వారు నిన్ను గాంచి తలలూపి గేలిచేయుదురు. “సంపూర్ణ సౌందర్యరాశి, లోకమంతటికిని సంతోషదాయినియైన నగరమని పిలువబడునది ఇదియేనా? అని వినోదింతురు.

16. నీ శత్రువులు నీవైపు చూచి నోరు తెరచి వేళాకోళము చేయుదురు. పెదవులు విరచి పండ్లు కొరికి మనమీ నగరమును నాశనము చేసితిమి. ఆహా! ఈ రోజు కొరకే మనము వేచియుంటిమి. దానిని కంటితో చూచితిమి కదా! అని పలుకుదురు.

17. ప్రభువు తన సంకల్పము నెరవేర్చుకొనెను. పూర్వమే తాను నిర్ణయించిన కార్యమును నిర్వహించెను. నిర్ధయతో మనలను నాశనము చేసెను. శత్రువులు మనలను జయించి ఆనందముతో పొంగిపోవునట్లు చేసెను.

18. యెరూషలేము కుమారీ! నీ ప్రాకారములు ప్రభువునకు మొర పెట్టునుగాక! నీ కన్నీళ్ళు రేయింబవళ్ళు ఏరువలే ప్రవహించునుగాక! నీవు ఎడతెగక విశ్రాంతి నొందక బాష్పము లొలుకుదువుగాక!

19. నీవు రేయి ప్రతి జామున లేచి ప్రభువునకు మొరపెట్టుము. నీ హృదయమును విప్పి ప్రభువు ఎదుట మనవి చేయుము. ఆకలివలన వీధి మూలలో చనిపోవు నీ బిడ్డలకొరకు ఆయనను ప్రార్ధింపుము.

20. ప్రభూ చూడుము! నీవు ఎవరికైనను ఇన్ని శ్రమలు తెచ్చిపెట్టితివా? స్త్రీలు తాము కని, లాలించిన బిడ్డలనే తినవలెనా? యాజకులను, ప్రవక్తలను నీ దేవాలయములోనే వధింపవలెనా?

21. వృద్దులును, పిల్లలును వీధులలో చచ్చిపడిపోయిరి. యువతీయువకులు శత్రువుల కత్తికి బలియైరి. నీకు కోపము వచ్చిన రోజున నీవు వారిని నిర్దయతో చంపివేసితివి.

22. నీవు నలుదిక్కులనుండి శత్రువులను నా మీదికి రప్పించితివి. వారు ఉత్సవమునకు వచ్చినట్లుగా నా మీదికెత్తివచ్చిరి. నీవు కోపించిన దినమున ఎవడును తప్పించుకోలేదు, ఎవడును మిగులలేదు. నేను పెంచి పెద్దచేసిన పిల్లలనే - నా శత్రువులు హతమార్చిరి.