ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 4 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 4వ అధ్యాయము || Telugu Catholic Bible

 


1. దేవాలయ నిధులను గూర్చి అపోల్లోనియసునకు వార్త తెలిపి యూదులకు తిప్పలు తెచ్చిన సీమోను ఓనియాసును నిందింపసాగెను. హెలియొడోరసును రెచ్చగొట్టి అన్ని ఇక్కట్లుపాలు గావించినది ప్రధాన యాజకుడేయని నిందలుమోపెను.

2. ఓనియాసు దేవాలయమునకు దానములు చేసెను. తోడి యూదులను రక్షించెను. ప్రజలు ధర్మశాస్త్ర నియమములనెల్ల నిష్ఠతో పాటింపవలెనని అభిలషించెను. అట్టి వానిని సీమోను ప్రభుత్వమునకు ద్రోహము తలపెట్టిన వానినిగా చిత్రించెను.

3-4. మెనెసైయసు కుమారుడును పెద్దసిరియా రాష్ట్రపాలకుడు అపోల్లోనియసు సీమోను చేయు దుష్కార్యములకు చేయూతనిచ్చు చుండెను. నానాటికి సీమోను ఓనియాసు మీద వైరము పెంచుకోసాగెను. అతని అనుచరులు చాలహత్యలకు గూడ పాల్పడిరి. ఓనియాసు పరిస్థితులు విషమించి నవని గ్రహించెను.

5. కనుక అతడు రాజును చూడ బోయెను. తోడి యూదులమీద నేరము మోపవలెనని కాదుగాని ప్రజలెల్లరి శ్రేయస్సును మనసులో పెట్టుకొని అతడు రాజును దర్శింపబోయెను.

6. రాజు జోక్యము చేసికొననిదే క్రమబద్ధమైన పరిపాలనము కొనసాగ దనియు, సీమోను బుద్ది తెచ్చుకొనడనియు అతడు తలంచెను.

7. తరువాత సెల్యూకసు రాజు చనిపోగా అంటియోకసు ఎపిఫానెసు రాజయ్యెను. ఓనియాసు తమ్ముడైన యాసోను మోసముతో ప్రధానయాజకు డయ్యెను.

8. అతడు రాజును దర్శించి మూడు వందల అరువది వీసెల వెండిని వెంటనే చెల్లింతున నియు, తరువాత ఇంకను ఎనుబది వీసెల వెండిని ముట్టచెప్పుదుననియు బాసచేసెను.

9. యెరూషలేమున వ్యాయామశాలను నిర్మించుటకును, యువకదళమును ఏర్పాటు చేయుటకును, యెరూషలేము పౌరులను అంటియోకసునకు మద్దతునిచ్చువారి బృందమున చేర్చుటకు తనకు అధికారమిచ్చినచో ఇంకను నూట యేబది వీసెల వెండిని చెల్లింతుననికూడ మాట ఇచ్చెను.

10. రాజు ఆ కార్యములనన్నిటికి అనుమతి నిచ్చెను. యాసోను ప్రధానయాజకుడైన వెంటనే గ్రీకుల ఆచార వ్యవహారములను పాటింపుడని యూదులను ప్రోత్సహించెను.

11. యోహాను పూర్వపు రాజులచే యూదులకు ఇప్పించిన రాయితీలనన్నిటిని అతడు రద్దు చేయించెను. ఈ యోహాను యూపోలియసు తండ్రి. యూపోలియసు తరువాత రోమునకు వెళ్ళి అచటి ప్రభుత్వముతో సఖ్య సంబంధములు కుదుర్చు కొనివచ్చెను. యాసోను యూదుల సంప్రదాయము లను కూడ రద్దుచేయించెను. ధర్మశాస్త్రమొల్లని క్రొత్త సంప్రదాయములను ప్రవేశపెట్టించెను.

12. అతడు దేవాలయమున్న కొండచెంతనే క్రీడాగారమును నిర్మించెను. యూదుల యువకులలో ఉత్తములైన వారిని గ్రీకు సంప్రదాయానుసారముగా క్రీడలలో పాల్గొనునట్లు చేసెను.

13. యాసోను పరమ దుర్మార్గుడు, దైవభక్తి లవలేశమును లేనివాడు. అక్రమముగా ప్రధానయాజకుడైనవాడు. అతడి ప్రోద్బలమువలన ప్రజలు మితిమీరి గ్రీకు సంప్రదాయములను పాటించిరి.

14. యాజకులుగూడ ఆరాధనా కార్యక్రమమున ఆసక్తిని కోల్పోయిరి. వారు దేవాలయ సేవయందును, బలులర్పించుటయందును శ్రద్ధచూపరైరి. క్రీడాగారమున కుస్తీ పోటీలను, ఆటలను ప్రారంభింపగనే ధర్మశాస్త్ర నిషేధమునుగూడ లెక్కచేయక అచటికి పరుగెత్తెడివారు.

15. తమ పూర్వులు విలువతో చూచిన సంప్రదాయములను వారు లెక్కచేయరైరి. వారికి కావలసినది గ్రీకుల మన్నన మాత్రమే.

16. ఈ దుర్బుద్ధియే కడన వారిని నాశనము చేసెను. ఎవరి జీవితవిధానమును తాము మెచ్చుకొనిరో, ఎవరి ఆచారవ్యవహారములను తామనుకరింపచూచిరో, ఆ ప్రజలే వారి శత్రువులై వారిని నాశనము చేసిరి.

17. ప్రభువు విధులను విడనాడుట శ్రేయోదాయకము కాదని ఈ క్రింద వర్ణించిన సంఘటనలనుండి అర్థము చేసికోవచ్చును.

18. ఒక పర్యాయము తూరు పట్టణమున ఐదేండ్లకొక సారి జరుగు క్రీడలకు రాజుకూడ హాజరయ్యెను.

19. దుర్మార్గుడగు యాసోను, యెరూషలేమున రాజునకు మద్దతునిచ్చువారి బృందమునుండి కొందరు సభ్యులను పై క్రీడలకు ప్రతినిధులుగా పంపెను. వారు హెర్కులేసు దేవతకు బలినర్పించుటకు మూడు వందల వెండి నాణెములను తీసికొనిపోయిరి. కాని ఆ సొమ్మును కొనిపోయినవారుకూడ దానిని బలికి వినియోగించుట ఉచితముకాదని ఎంచిరి.

20. కనుక హెర్కులేసునకు బలినర్పించుటకు ఉద్దేశించిన సొమ్మును కడన యుద్ద నావల నిర్మాణమునకు వినియోగించిరి.

21. ఐగుప్తున ఫిలోమేటరు రాజు పట్టాభిషేకము జరుగుచుండగా అంటియోకసు మెనెస్తియసు కుమారుడు అపోల్లోనియసును ఆ ఉత్సవమునకు పంపెను. ఆ సందర్భమున అంటియోకసు, ఫిలోమేటరు తన రాజకీయ సూత్రములపట్ల ఇష్టము చూపుటలేదని గ్రహించెను. కనుక అతడు తన రాజ్యమును సురక్షితము చేసికోగోరి యొప్పాకును, అచటినుండి యెరూషలేమునకు వెళ్ళెను.

22. అచట యాసోను, పురప్రజలు అతనికి బ్రహ్మాండమైన స్వాగతమును ఏర్పాటుచేసిరి. వారు దివిటీలు పట్టుకొని నినాదములు చేయుచు రాజుకు ఎదురేగి అతనిని తోడ్కొనివచ్చిరి. అటుతరువాత అంటియోకసు తన సైన్యముతో యెరూషలేమునుండి ఫినిషియాకు వెడలిపోయెను.

23. మూడేండ్లు కడచిన తరువాత యాసోను రాజునొద్దకు మెనెలాసును పంపెను. ఇతడు పైని పేర్కొనిన సీమోను తమ్ముడు. రాజునొద్దకు ధనమును కొని పోవుటకును, కొన్ని ముఖ్యమైన రాజకీయ వ్యవహారములను గూర్చి రాజు నిర్ణయమును తెలిసికొనుటకును యాసోను అతనిని పంపెను.

24. కాని మెనెలాసు రాజును సందర్శించినపుడు తాను గొప్ప అధికారము కలవానివలె నటనచేసి అతని మన్ననను చూరగొనెను. అతడు పూర్వము ప్రధానయాజక పదవిని సంపాదించుటకు సమర్పించిన సొమ్ముకంటె మూడువందల వీసెల వెండిని అదనముగా రాజుకు చెల్లించి, ప్రదాన యాజకుడయ్యెను.

25. కడన రాజు తనను ప్రధాన యాజకునిగా నియమించిన పత్రమును తీసికొని యెరూషలేమునకు తిరిగివచ్చెను. కాని రాజాజ్ఞ ఒక్కటి తప్ప అతనికి ఆ పదవిని అలంకరించుటకు ఎట్టి అర్హతలేదు. అతడు క్రూరుడైన నియంతవంటివాడు. భీకరమైన వన్యమృగమువంటివాడు.

26. ఆ రీతిగా పూర్వము అన్నను మోసగించి ప్రధానయాజకుడైన యాసోను ఇప్పుడు మరియొకని మోసమునకు గురియై అమ్మోను దేశమునకు పారిపోయెను.

27. ఇచట మెనెలాసు ప్రధానయాజకుడుగా కొనసాగెనుగాని రాజునకు చెల్లింతునన్న సొమ్ము చెల్లింపడయ్యెను.

28. యెరూషలేము దుర్గమునకు అధిపతియైన సోస్ట్రాటసు అతనిని సొమ్ము చెల్లింపుమని పీడించెను. రాజునకు ముట్టవలసిన పైకము వసూలు చేయుట అతని పూచీ. కడన సొమ్ము విషయమై రాజు వారిని ఇద్దరిని తన సమక్షమునకు పిలిపించెను.

29. మెనెలాసు తన తమ్ముడు లూసిమాకసును తనకు బదులుగా ప్రధాన యాజకునిగా నియమించెను. సోస్ట్రాటసు సైప్రసు నుండి కూలికి వచ్చిన సైనికులకు నాయకుడైన క్రీటెసును తనకు బదులుగా దుర్గాధిపతిని చేసెను.

30. ఈ గొడవలు ఇట్లుండగా సిలిషియా దేశములోని తర్సూసు, మల్లూసు పట్టణములలో తిరుగుబాటు ప్రారంభమయ్యెను. ఎందుకనగా రాజు ఈ నగరములను తన ఉంపుడుకత్తెయైన అంతియోకిసునకు బహుమతిగానిచ్చెను.

31. కనుక రాజు తన ప్రధానోద్యోగులలో ఒకడైన అండ్రోనికసును దేశమునకు అధికారిగా నియమించి తాను త్వరత్వరగా ఆ నగరములను చూడబోయెను.

32. మెనెలాసు మంచి అదను లభించినదని ఎంచి తాను దేవాలయమునుండి అపహరించిన బంగారు పరికరములలో కొన్నిటిని అండ్రోనికసునకు బహుమతిగానిచ్చెను. మిగిలిన వానిని అతడు అంతకు పూర్వమే చేరువలోని పట్టణముల పౌరులకును తూర్పు నగర వాసులకును అమ్మివేసెను.

33. ఓనియాసు ఈ సంగతులెల్ల తెలిసికొనెను. అతడు స్వీయ రక్షణార్థము అంటియోకియా సమీపమున నున్న డాఫ్నే నగరములోని ఒక దేవళమున తలదాచు కొని, అచటినుండి మెనెలాసుపై నేరము తెచ్చెను.

34. అందుచేత మెనెలాసు ఓనియాసును హత్యచేయుమని అండ్రోనికసును రహస్యముగా పురికొల్పెను. అండ్రోనికసు ఓనియాసును కలిసికొనెను. తన కుడిచేతిని ఓనియాసు చేతులలో పెట్టి అతనికి ఎట్టి ఆపద కలుగదని బాస చేసెను. ఓనియాసు దేవాలయమును వీడుటకు వెనుకాడుచున్నా అండ్రోనికసు అతనికి నచ్చజెప్పి అతనిని మోసముతో దేవాలయము నుండి వెలుపలికి తోడ్కొని వచ్చెను. అట్లు ఆశ్రయ స్థానమునుండి వెలుపలికి రాగానే అండ్రోనికసు ఓనియాసును అధర్మముగా హత్య చేసెను.

35. యూదులును అన్యజాతి వారు గూడ అండ్రోనికసు చర్యను మిగుల గర్హించిరి.

36. రాజు సిలిషియా దేశమునుండి తిరిగి రాగానే అంటియోకియాలోని యూదులును, ఆ హత్యను అంగీకరింపని గ్రీకులును అతనివద్దకు పోయి ఓనియాసును అన్యాయముగా వధించుట గూర్చి పిర్యాదు చేసిరి.

37. అంతియోకసు ఓనియాసు హత్యను గూర్చి విని చాల విచారించెను. ఓనియాసు వివేకమును సంయమమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ రాజు దుఃఖముతో కన్నీరు కార్చెను.

38. అతడు అండ్రోనికసు మీద మహాకోపము తెచ్చుకొని అతని రాజవస్త్రములను చించివేసెను. అండ్రోనికసు బట్టలు ఊడదీయించి అతనిని నగరము నడివీధులలో గుండ నడిపించెను, రాజాజ్ఞపై భటులు అతనిని పూర్వము తాను అపవిత్రమైన హస్తములతో ఓనియాసును హత్య చేసిన స్థలమునకే తీసికొని వచ్చిరి. ఆ తావుననే వారు ఆ హంతకుని గూడ మట్టుబెట్టిరి. ఆ రీతిగా ప్రభువు ఆ పాపికి తగినశిక్ష విధించెను.

39. లూసిమాకసు కూడ తన అన్న మెనెలాసు అనుమతితో దేవాలయమున అనేక మారులు దొంగతనముచేసి బంగారు పరికరములను అపహరించెను. ఈ సంగతి తెలిసికొని ప్రజలతని మీదికి గుంపులు గుంపులుగా వచ్చిరి.

40. రెచ్చిపోయిన ప్రజలు తనకెట్టి విపత్తు తెచ్చిపెట్టుదురోయని భయపడి లూసిమాకసు సాయుధులైన సైనికులను మూడువేల మందిని జనుల మీదికి పంపెను. ఆ సైన్యమునకు ఔరానసు నాయకుడు. అతడు ప్రాయము చెల్లినవాడు, మిగుల బుద్దిహీనుడు.

41. అప్పటికే దేవాలయ ప్రాంగ ణమున గుమిగూడియున్న యూదులు లూసిమాకసు తమ మీదికి దండును పంపెనని గ్రహించిరి. వారిలో కొందరు రాళ్ళను కొయ్య ముక్కలను ఏరుకొనిరి. మరికొందరు పీఠము ప్రక్కనున్న బూడిదను గుప్పిళ్ళతో తీసికొనిరి. కలవరపాటుతో ఆ వస్తువులన్నిటిని లూసిమాకసు మీదికిని, అతని సైనికుల మీదికిని విసరిరి.

42. ఆ గందరగోళమువలన లూసిమాకసు దండులో కొందరు చచ్చిరి కొందరు గాయపడిరి. కొందరు పారిపోయిరి. దేవాలయమున దొంగతనము చేసిన లూసిమాకసును గూడ ప్రజలు కోశాగారము చేరువలోనే వధించిరి.

43. పై సంఘటనకుగాను యూదులు మెనెలాసు మీద నేరము తెచ్చిరి.

44. అంతలో రాజు తూరు పట్టణమును దర్శింపరాగా యెరూషలేములోని పెద్దలు ముగ్గురు దూతలనచటికి పంపి మెనెలాసు నేరమును రుజువు చేయించిరి.

45. మెనెలాసు తనకు ఓటమి తప్పదని గ్రహించి గోరుమేనసు కుమారుడైన ప్టోలమీని ఆశ్రయించెను. అతనికి పెద్దమొత్తము లంచము చెల్లించి రాజుచే తనకనుకూలముగా తీర్పు చెప్పింపుమని ప్రార్థించెను.

46. ప్టోలమీ మనము వెలుపలికి వెళ్ళి కొంచెము స్వచ్ఛమైన గాలి పీల్చుకొని వత్తుమని నెపము పెట్టి రాజును కార్యాలయమునుండి బయటి వసారాలోనికి తీసికొనివచ్చెను. అచట అతడు మెనెలాసును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయింపుమని రాజును వేడుకొనెను.

47. కనుక రాజు పై తప్పుడు పనులకు కారకుడు మెనెలాసును విడుదల చేయించెను. అతడి మీద అభియోగము తెచ్చిన దురదృష్టవంతులు ముగ్గురికిని మరణశిక్ష విధించెను. మహాక్రూరులైన సిథియనులు సయితము వారిని నిర్దోషులుగా గణించియుండె డివారే!

48. ఆ మువ్వురు యెరూషలేము పక్షమునను, ఆ నగర పౌరుల పక్షమున, దొంగిలింపబడిన ఉపకరణముల పక్షమునను వాదించిరి. కాని వారు అన్యాయముగ, శీఘ్రముగ శిక్షను అనుభవించిరి.

49. తూరు పౌరులు ఈ తీర్పును అసహ్యించుకొనిరి. వారు చనిపోయిన దూతలను ఆదరపూర్వకముగా పాతిపెట్టి, వారియెడల తమకుగల గౌరవమును వ్యక్తము చేసిరి.

50. అధికారములో నున్నవారి ధనదాహము వలన మెనెలాసు ప్రధానయాజకుడుగా కొనసాగెను. అతని దుష్కార్యము రోజు రోజునకు పెరిగిపోగా తన వారికే తాను ప్రబల శత్రువుగా పరిణమించెను.