ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 3 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 3వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. ఓనియాసు ప్రధానయాజకుడుగా నుండిన కాలమున పవిత్రనగరమైన యెరూషలేము శాంతి సౌభాగ్యములకు ఆటపట్టుగానుండెను. అతడు దుష్క్రియలను సహింపనివాడు, భక్తుడు. కనుక ఎల్లరును నియమములను పాటించిరి.

2. వివిధ దేశములనేలు రాజులు కూడ దేవాలయమును గౌరవించి దానికి అమూల్యమైన బహుమతులు సమర్పించిరి.

3. ఆసియా రాజగు సెల్యూకసు తాను ప్రోగుచేసిన కప్పముల నుండే దేవాలయ బలులకు అగు వ్యయమును చెల్లించెడి వాడు.

4. అపుడు బిల్గా తెగకు చెందిన సీమోను దేవాలయాధికారిగా నియమింపబడెను. ఇతడు నగరములోని విపణి వీధిని గూర్చి ఓనియాసుతో వివాదము పెట్టుకొని ఓడిపోయెను.

5. ఆ రోజులలో తార్సిసు కుమారుడు అపోల్లోనియసు పెద్దసిరియాకు రాష్ట్రపాలకుడుగా ఉండెడివాడు.

6. సీమోను అతని యొద్దకు వెళ్ళి దేవాలయ కోశాగారము విస్తారమైన సంపదతో మూలుగుచున్నదని, బలులకగు వ్యయమునకు అంత సొమ్ము అక్కరలేదు, కనుక రాజు ఆ సొత్తును స్వాధీనము చేసికోవచ్చునని చెప్పెను.

7. అపోల్లోనియసు రాజును కలిసికొనినపుడు ఆ సంగతి తెలియజేసెను. రాజు ఆ సొత్తును తీసికొనివచ్చుటకు తన ప్రధానమంత్రి అయిన హెలియడారసును నియమించెను.

8. హెలియెడారసు వెంటనే ప్రయాణము కట్టెను. కాని అతడు పెద్ద సిరియా మరియు ఫినీష్యాలోని నగరములను దర్శింపబోవు వానివలె నటించెను.

9. ఆ ప్రధానమంత్రి యెరూషలేమునకు రాగా ప్రధానయాజకుడు, పౌరులు అతనిని హృదయపూర్వకముగా ఆహ్వానించిరి. అంతటతడు తాను వచ్చిన పనిని తెలియజేసి దేవాలయ కోశాగారమున విస్తారమైన నిధులున్న మాట నిజమేనా అని ప్రశ్నించెను.

10-11. ప్రధానయాజకుడు “అయ్యా! ఆ దుర్మార్గుడు సీమోను మీతో చెప్పిన మాటలు నిజము కాదు. దేవాలయ కోశాగారమున కొంతధనమున్న మాట నిజమే. కాని దానిలో కొంతభాగము వితంతువుల కొరకును, అనాథ శిశువుల కొరకును నిర్దేశింపబడినది. మరికొంత భాగము తోబియా కుమారుడు ప్రముఖుడు హిర్కేనసుకు చెందినది. మొత్తము సొమ్ము నాల్గువందల వీసెల వెండియు, రెండువందల వీసెల బంగారము ఉండును.

12. జగద్విఖ్యాతము పవిత్రమునైన ఈ దేవాలయమును నమ్మి ఇతరులిచట తమ సొమ్మును భద్రపరచుకొనిరి. అట్టి సొమ్మును అన్యులు కొనిపోవుట భావ్యము కాదు” అని చెప్పెను.

13. కాని హెలిమెడొరసు, రాజు ఆజ్ఞాపించినట్లుగా ఆ సొమ్మును రాజుకోశాగారమునకు తర లింపవలెనని పట్టుపట్టెను.

14. అతడు ముందుగనే ఒకరోజును నిర్ణయించి ఆ రోజున సొమ్మును లెక్కించుటకుగాను దేవాలయములోనికి వెళ్ళెను. ఆ సంగతి విని నగరమెల్లను గగ్గోలుపడెను.

15. అర్చకులు యాజకవస్త్రములు ధరించి పీఠము ముందు సాష్టాంగ పడిరి. వారెవరైన దేవాలయమున నిధులను భద్రపరచినచో వానిని కాపాడవలెనని నియమము చేసిన భగవంతునకు ఇప్పుడీ సొమ్మును రక్షింపుమని మనవి చేసిరి.

16. అప్పుడు ప్రధానయాజకుని వైపు చూచిన వారి మనసు కరిగిపోయెను. అతని ముఖము వివర్ణమయ్యెను. అతని మనసులోని బాధ ఎల్లరికిని అర్థమయ్యెను.

17. అతని దేహము భయముతో కంపించి పోయెను. ఆ కంపమతని హృదయములోని వ్యధను వ్యక్తము చేయుచుండెను.

18. ప్రజలెల్లరును తమ యిండ్లనుండి పరుగెత్తుకొనివచ్చి దేవాలయమును అమంగళము కానీయవలదని దేవునికి ప్రార్థన చేయ బూనిరి.

19. స్త్రీలు నడుముల మీద గోనెపట్ట కట్టుకొని వీధులలో ప్రోగైరి. తల్లిదండ్రులు ఇల్లు వదలి బయటికి వెళ్ళనీయని కన్యలు కొందరు నగరద్వారముల చెంతకు, కొందరు ప్రాకారముల చెంతకు పరుగెత్తిరి. కొందరు తమ ఇండ్లలోని కిటికీలగుండ వెలుపలికి తొంగిచూచిరి.

20. ఎల్లరును చేతులెత్తి దేవుని ప్రార్థించిరి.

21. ఆ రీతిగా పురజనులెల్లరును గుమిగూడి సాష్టాంగ పడి ప్రార్థన చేయుటను, ప్రధానయాజకుడు తీవ్రమైన మనోవ్యధకు గురియగుటను చూడగా ఎల్లరి హృదయములును ద్రవించిపోయెను.

22-23. ప్రజలెల్లరును దేవాలయమున దాచుకొన్న వారి సొమ్మును సురక్షితముగా కాపాడుమని సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేయుచుండగాహెలియెడొరసు కోశాగారములోని నిధులను తనిఖీ చేయబూనెను.

24. ఆ మంత్రి తన అంగరక్షకులతో దేవాలయ కోశాగారమునొద్దకు వచ్చెను. వెంటనే సర్వాత్మలకును, సర్వశక్తులకును అధిపతియైన మహాప్రభువు ఒక దివ్యదర్శనము కలిగింపగా మంత్రితో వెళ్ళ సాహసించిన వారందరును గగ్గోలుపడిరి. వారు ప్రభువు శక్తిని జూచి భయభ్రాంతులైరి.

25. ఆ దర్శనములో వారికొక గుఱ్ఱమును రౌతును కనిపించిరి. ఆ గుఱ్ఱమునకు అందముగా అలంకరింపబడిన కళ్ళెము కలదు. రౌతు బంగారు ఆయుధములను ధరించి భీకరముగానుండెను. ఆ గుఱ్ఱము భయంకరముగ హెలియొడోరసు మీదికి దుమికి, అతనిని తన ముందటి కాళ్ళగిట్టలతో తన్నెను.

26. అప్పుడు ఆ మంత్రి బలిష్ఠులును, సుందరాకారులు, మనోహర వస్త్రధారులైన ఇరువురు యువకులనుగూడ చూచెను. వారు మంత్రికి ఇరువైపుల నిలుచుండి చాలసేపు అతడిని కొరడాలతో మోదిరి.

27. వెంటనే హెలియొడొరసు కన్నులకు చీకట్లు క్రమ్మగా అతడు నేలమీదికి ఒరిగెను. అతని అనుచరులు అతనినొక డోలికపై పరుండబెట్టి వెలుపలికి కొనిపోయిరి.

28. అతడొక్క క్షణము ముందు చాలమంది అనుచరులతోను అంగరక్షకులతోను కోశాగారము లోనికి వెళ్ళెను కదా! ఇప్పుడు నిస్సహాయుడై యుండగా అతనిని వెలుపలికి కొనిపోయిరి. అతని అనుచరులెల్లరును దేవుని మహాశక్తిని గుర్తించిరి.

29. ప్రభువు దర్శనమువలన హెలియొడోరసు మాటలు కోల్పోయి, అనారోగ్య స్థితిలో అట్లే పడియుండెను.

30. ప్రభువు అద్భుత రీతిన దేవాలయమును రక్షించెను. ఒక్క నిమిషమునకు ముందు భయము, కలవరపాటు నెలకొనియున్న తావున ప్రభువు ఇప్పుడు మహానందమును కలిగించెను. కనుక యూదులు ప్రభువును స్తుతించి, కీర్తించిరి.

31. హెలియొడొరసు మిత్రులు తమ నాయకునికొరకు ప్రార్థనము చేయుమని ఓనియాసును వేడుకొనిరి. మహోన్నతుడైన ప్రభువు మృత్యువు వాతబడనున్న తమ మంత్రిని కాపాడునట్లు మనవి చేయుమని త్వరత్వరగా బతిమాలిరి.

32. తాను పంపిన ప్రతినిధికి యూదులే ఇట్టి ఆపద తెచ్చి పెట్టిరని రాజు శంకించునేమోయని ఓనియాసు భయపడెను. కనుక అతడు హెలియొడోరసు ఆరోగ్యము కొరకు బలినర్పించెను.

33. అతడు ఆ రీతిగా బలి నర్పించుచుండగా పూర్వపు యువకులిద్దరును అవే దుస్తులతో మరల హెలియొడొరసునకు దర్శనమిచ్చి యిట్లనిరి: “ఓయి! నీవు ప్రధానయాజకుడైన ఓనియాసునకు కృతజ్ఞుడవైయుండుము. అతనిని చూచియే ప్రభువు నిన్ను కాపాడెను.

34. నిన్ను శిక్షించినవాడు పరలోకాధిపతియైన ప్రభువు. కనుక నీవు వెళ్ళి ఎల్లరికిని ఆయన వైభవమును చాటిచెప్పుము.” ఇటుల చెప్పి ఆ యువకులు అదృశ్యులైరి.

35. హెలియొడోరసు ప్రభువునకు బలినర్పించెను. తన ప్రాణమును కాపాడినందులకుగాను దేవునికి మ్రొక్కులు చెల్లించెను. ప్రధాన యాజకునివద్ద సెలవు తీసికొని సైన్యముతో రాజునొద్దకు తిరిగివచ్చెను.

36. అతడు దేవాదిదేవుడగు ప్రభువు చేసిన అద్భుత కార్యమును ఎల్లరికిని విదితము చేసెను.

37. అంతట రాజు యెరూషలేమునకు మరల మన ప్రతినిధినొకనిని పంపవలెనన్నచో ఎట్టివానిని పంపవలయునో చెప్పుమని అడుగగా హెలియొడోరసు ఇట్లనెను:

38. “నీ శత్రువుగాని నీ మీద కుట్రలు పన్నువాడుగాని ఎవడైన ఉన్నచో అతనిని యెరూషలేమునకు పంపుము. అతడు మరల తిరిగిరాడు. ఒకవేళ వచ్చెనేని బాగుగా కొరడా దెబ్బలు తినిగాని రాడు. ఏదో విచిత్రమైన దైవశక్తి అచట నెలకొని ఉన్నది.

39. స్వర్గలోకవాసియైన దేవుడు ఆ దేవాలయమును కాపాడుచున్నాడు. ఆ మందిరమునకు కీడును తలపెట్టినవారిని ఆయన అక్కడికక్కడే కూలద్రోయును.”

40. హెలియొడోరసు ఆగడము నుండి ప్రభువు దేవాలయ కోశాగారమును రక్షించిన తీరిట్టిది.