ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 15 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 15వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. యూదా అతని అనుచరులు సమరియా మండలమున ఉన్నారని నికానోరు వినెను. అతడు తనకెట్టి అపాయము కలుగకుండునట్లు విశ్రాంతి దినమున వారిమీదికి దాడిచేయవలెనని సంకల్పించు కొనెను.

2. కాని నిర్బంధముగా నికానోరు సైన్యము వెంటబోవు యూదులు "అయ్యా! నీవిట్టి క్రూరమైన ఘోరకార్యమును తలపెట్టరాదు. సర్వసాక్షియైన ప్రభువు మహాపవిత్రమైన దానినిగా నిర్ణయించిన విశ్రాంతి దినమును నీవును గౌరవింపవలెను” అని అతనిని వేడుకొనిరి.

3. ఆ తుచ్చుడు “విశ్రాంతిదినమును పాటింపుడని ఆజ్ఞాపించిన దేవుడొకడు స్వర్గమున ఉన్నాడా?” అని వారిని వేళాకోళము చేసెను.

4. యూదులు సజీవుడును పరలోకాధిపతియునైన ప్రభువే విశ్రాంతిదినమును పాటింపవలసినదిగా కట్టడ చేసెనని అతడితో చెప్పిరి.

5. కాని అతడు “ఈ భూమికి అధిపతిని నేనే. ఇప్పుడు మీరు మీ ఆయుధములను చేపట్టి రాజు కోరినట్లు చేయుడని నేను ఆజ్ఞాపించు చున్నాను” అని పలికెను. అయినను నికానోరు తాను తలపెట్టిన కార్యమును సాధింపజాలడయ్యెను.

6. నికానోరుతానొక విజయస్తంభమును నిర్మింతుననియు, తాను యూదా సైన్యమునుండి దోచుకొని వచ్చిన ఆయుధములను దానిమీద వ్రేలాడ దీయింతుననియు పొగరుబోతు తనముతో ప్రగల్భములు పలికెను.

7. యూదా మాత్రము ప్రభువు తనకు తోడ్పడునన్న నమ్మకముతో ధైర్యముగా ఉండెను.

8. అతడు శత్రువులను చూచి భయపడవలదని తన అనుచరులను హెచ్చరించెను. పూర్వము ప్రభువు తమనెట్లు ఆదుకొనెనో జ్ఞప్తికి తెచ్చుకొని, ఇప్పుడును ఆ ప్రభువు సహాయము లభించునని నమ్ముడని చెప్పెను.

9. ధర్మ శాస్త్రమునుండియు ప్రవక్తల గ్రంథముల నుండియు కొన్ని భాగములను చదివి వినిపించి వారికి ధైర్యము కలిగించెను. వారంతకు పూర్వమే విజయవంతముగా నిర్వహించిన యుద్ధములను జ్ఞప్తికి తెచ్చి వారికి ఉత్సాహము పుట్టించెను.

10. ఆ రీతిగా అతడు తన అనుచరులను యుద్ధమునకు సిద్ధముచేసి వారికి ఆయా ఆజ్ఞలను జారీచేసెను. శత్రువులు తాము చేసికొన్న ఒడంబడికను పాటింపరు కనుక వారిని ఎంత మాత్రము నమ్మరాదనికూడ హెచ్చరించెను.

11. డాళ్ళను, బల్లెములను నమ్ముకొనుడను మాటల ద్వారాకాక, ప్రభువును నమ్ముకొనుడని ధైర్యము చెప్పుట ద్వారా యూదా తన అనుచరులను ఉత్తేజపరచెను. అతడు వారికి ఉత్సాహము పుట్టించుటకు గాను తాను నిజముగా కనిన ఒక కలను, లేదా దర్శనమును ఇట్లు వర్ణించి చెప్పెను.

12. యూదా కలలో పూర్వము ప్రధానయాజకుడుగా పనిచేసిన ఓనియాసును చూచెను. ఆ మహానుభావుడు వినయవంతుడు, మృదుస్వభావము కలవాడు, మంచివక్త, చిన్ననాటి నుండి ధర్మబద్ధముగా జీవించుటకు తర్ఫీదు పొందినవాడు. ఈ ఓనియాసు చేతులు చాచి యూద జాతి అంతటికొరకు ప్రార్థన చేయుచుండెను.

13. అటు తరువాత యూదా వయోవృద్ధుడై ఠీవితోను, అధికారయుతమైన తేజస్సుతో వెలుగు మరియొక వ్యక్తిని చూచెను.

14. ఓనియాసు యూదాకు అతనిని చూపించి “ఇతడు ప్రవక్తయైన యిర్మీయా. ఇతడు తన సోదరులైన యూదులను గాఢముగా ప్రేమించువాడు. మన ప్రజల కొరకును, పరిశుద్ధనగరము కొరకును అధికముగా ప్రార్థనచేయువాడు” అని చెప్పెను.

15-16. అంతట యిర్మీయా తన కుడిచేయి చాచి యూదాకు సువర్ణ ఖడ్గమును బహూకరించి “నీవు దేవుడు కానుకగా పంపిన ఈ పవిత్ర ఖడ్గమును స్వీకరించి దీనితో శత్రువులను తుద ముట్టింపుము" అని చెప్పెను.

17. యూదా నోటినుండి ఉర్రుతలూగించు ఈ పలుకులు వెలువడగనే అతని సైనికులకు శౌర్యము పుట్టెను. యువకులు కూడ పెద్దవారివలె పోరాడుటకు సంసిద్ధులైరి. యూదుల నగరము, మతము, దేవాలయము ప్రమాదమునకు గురికానున్నవికదా! కనుక వారి శిబిరమున కాలము వ్యర్ధపుచ్చక వెంటనే పోయి ధైర్యముగా శత్రువుల మీద పడవలెననియు, విరోధులతో బాహాబాహి పోరాడి అటోఇటో తేల్చుకోవలెననియు నిర్ణయించుకొనిరి.

18. వారు తమ ఆలు బిడ్డలకొరకును బంధువులకొరకును అంతగా విచారింపరైరి. వారి చింత అంతయు పరిశుద్దమందిరము గూర్చియే.

19. మైదానమున జరుగనున్న యుద్ధము ఏ రీతిగా ముగియునో అని యెరూషలేమున మిగలియున్నవారు బెంగపడజొచ్చిరి.

20. యుద్ధమున ఎవరు గెల్తురో చూతమని ఎల్లరును ఆతురతతో ఎదురు చూచుచుండిరి. విరోధి సైన్యము బారులుతీర మొదలు పెట్టెను. వారు తమ అశ్వదళమును తమ సైన్యమునకు ఇరువైపుల ఉంచిరి. ఏనుగులను కీలకమైన తావులలో ఉంచిరి.

21. యూదా విస్తారముగా ఉన్న శత్రుసైన్యములను, బహువిధములుగా ఉన్న వారి ఆయుధములను, భయంకరముగా ఉన్న వారి ఏనుగులను పరికించి చూచెను. అతడు ఆకాశము వైపు చేతులు చాచి అద్భుతములు చేయు దేవునికి మనవి చేసెను. ఆ ప్రభువు కేవలము సైనికబలము కలవారికి కాక, అర్హులైనవారికి విజయము దయచేయునని అతనికి తెలియును.

22. అతడు ఇట్లు ప్రార్థించెను: “ప్రభూ! హిజ్కియా యూదాను పరిపాలించిన కాలమున నీవు దేవదూతను పంపితివి. అతడు సన్హరీబు దండున లక్షయెనుబదియైదువేల మందిని సంహరించెను.

23. పరలోకాధిపతివైన ప్రభూ! ఇప్పుడు కూడ నీ దూతను పంపి మా శత్రువులు భయముతో కలవరపడునట్లు చేయుము.

24. ఈ ప్రజలు నిన్ను దూషించుచు, నీ వెన్నుకొనిన జనులను నాశనము చేయుటకు వచ్చిరి. కనుక నీ మహా సైన్యముతో వీరిని మట్టుబెట్టుము.” ఇట్లు జపించి అతడు తన వేడుకోలును ముగించెను.

25. నికానోరు సైన్యము బాకాల మ్రోతతోను, యుద్ద గీతములతోను ముందుకు వచ్చెను.

26. కాని యూదా, అతని అనుచరులు దేవునికి ప్రార్ధన చేయుచు పోరు మొదలుపెట్టిరి.

27. వారు చేతులతో పోరాడుచు ఎదలో దేవునికి మనవి చేయుచు శత్రువులను ముప్పదియైదువేలమందికంటె ఎక్కువగా వధించిరి. ప్రభువు తమకు తోడ్పడినందుకుగాను ఎంతయో పొంగిపోయిరి.

28. యూదులు యుద్ధము ముగించి విజయము చేపట్టి తిరిగివచ్చునప్పుడు నికానోరు ఆయుధములను ధరించి యుద్ధరంగమున చచ్చిపడియుండుట చూచిరి.

29. వెంటనే వారు గొల్లున కేకలువేసి మాతృభాషలో ప్రభువును స్తుతించి కొనియాడిరి.

30. యూదా ఎల్లవేళల తన శక్తికొలది యూదుల కొరకు పోరాడినవాడు. చిన్ననాటినుండియు అతనికి ఉన్న దేశభక్తి ఇప్పటికి ఇసుమంతైనా తరుగలేదు. అట్టివాడు నికానోరు తలను, కుడిచేతిని నరికి యెరూషలేమునకు కొనిరండని తన అనుచరులను ఆజ్ఞాపించెను.

31. వారు యెరూషలేము చేరిన తరువాత యూదా పౌరులందరిని పిలిపించెను. యాజకులను ప్రోగుచేసి పీఠముముందట నిల్చెను. కోటలోని వారిని కూడ రప్పించెను.

32. అతడు దుర్మార్గుడైన నికానోరు. శిరస్సును వారికి చూపించెను. పూర్వము ఆ దేవదూషకుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రమందిరము వైపు దర్పముతో చాచిన చేతినిగూడ వారికి చూపించెను.

33. అటుపిమ్మట యూదా, ఆ నాస్తికుని నాలుకను కోసి, దానిని ముక్కలు ముక్కలుగా చేసి పక్షులకు ఆహారముగా కావింతునని చెప్పెను. నికానోరు తలను, చేతిని దేవాలయమునకు ఎదురుగా వ్రేలాడదీయించి అతడి తెలివితక్కువతనమును ఎల్లరికిని వెల్లడి చేయింతునని పలికెను.

34. అపుడచటి వారెల్లరు ఆకసమువైపు చూచి ప్రభువును స్తుతించిరి. ఆయన తన శక్తిని ప్రదర్శించి అపవిత్రత నుండి దేవాలయమును కాపాడెనుగదా!

35. యూదా నికానోరు తలను దుర్గ ప్రాకారముమీద వ్రేలాడదీయించెను. ప్రభువు యూదులకు చేసిన సహాయమునకు ఆ తల చక్కని నిదర్శనమయ్యెను.

36. ఆ దినము ఉపేక్షింపదగినదియు కాదని మొర్దెకయి పేర ఉత్సవము జరుగు రోజునకు ముందు నాడు ఈ సంఘటనమును గూర్చి ఉత్సవము చేసికోవలెననియు ఎల్లరును ఏకగ్రీవముగా అంగీకరించిరి. అరమాయికు భాషలో అదారు పేరు గల పండ్రెండవ నెలలో పదమూడవ దినమున ఈ పండుగ జరుగవలెననియు, నిర్ణయించిరి.

37. నికానోరు ఉదంతము ఈ రీతిగా ముగిసెను. ఈ సంఘటనము జరిగినప్పటినుండియు యెరూషలేము యూదుల అధీనముననే ఉన్నది. నేను ఈ చరిత్రను ఇంతటితో ముగింతును.

38. ఈ చరిత్ర బాగుగాను, సూటిగాను వ్రాయబడినదగునేని, నేను కోరిన కోరిక నెరవేరినట్లే. కాని ఇది నాసిగా వ్రాయబడినదగునేని, నా శక్తి ఇంతేయని ఒప్పుకొందును.

39. వట్టి ద్రాక్షసారాయమునుకాని, వట్టి నీటినికాని త్రాగుట ఆరోగ్యకరము కాదు. కాని నీటితో కలిసిన ద్రాక్షసారాయము త్రాగుటకు రుచిగానుండి ఆనందము చేకూర్చును. ఆ రీతిగనే ఆయా సంఘటనలను నేర్పుతో అమర్చి చెప్పిన కథ చదువరులకు ప్రీతిని కలిగించును. ఇంతటితో ఈ చరిత్రను ముగింతును.