1. రాజునకు బంధువును, సంరక్షకుడును, మంత్రి లీసియాసు జరిగిన సంగతులనెల్ల తెలిసికొని ఆగ్రహముచెందెను.
2. అతడు ఎనుబదివేల కాలిబంటులను తన రౌతులనందరిని ప్రోగుజేసికొని యూదుల మీదికి దండెత్తివచ్చెను. యెరూషలేమును గ్రీకుల నగరముగా మార్చివేయవలెనని అతని తలంపు.
3. మరియు ఇతర ఆరాధన మందిరముల మీదవలె యెరూషలేము దేవాలయము మీదగూడ పన్ను విధింపవలెనని, ప్రధానయాజకుని పదవిని ఏటేట వేలము పెట్టి అమ్మవలెనని అతడు సంకల్పించుకొనెను.
4. అతడు వేలాదిగానున్న తన కాలిబంటులను, రౌతులను, తన ఎనుబది ఏనుగులనుచూచి పొంగిపోయెనేగాని దైవ బలమును లెక్కలోకి తీసికోడయ్యెను.
5. లీసియాసు యూదయా మీదికి దాడిచేసి యెరూషలేమునకు ఇరువది క్రోసుల దూరముననున్న బేత్సూరు దుర్గమును ముట్టడించి పీడింపజొచ్చెను.
6. యూదయా మరియు ప్రజలు లీసియాసు తమ దుర్గమును ముట్టడించుచున్నాడని విని కన్నీరు గార్చుచు, శోకించుచు దేవునికి మొర పెట్టుకొనిరి. దేవదూతను పంపి యిస్రాయేలీయులను కాపాడుమని ప్రభువును వేడుకొనిరి.
7. యుద్ధమునకు తలపడి ఆయుధములను చేపట్టినవారిలో యూదా మొదటి వాడు. అతడు తనవలెనే తన అనుచరులుగూడ ప్రాణములకు తెగించి యూదుల రక్షణ కొరకు పోరాడ కోరెను. కనుక అతని అనుచరులు ఉత్సాహముతో కదలి వచ్చిరి.
8. వారు యెరూషలేము దాటి కొంచెము దూరము వెళ్ళిరో లేదో ధవళవస్త్రములు తాల్చి సువర్ణాయుధములు ఝళిపించు అశ్వికుడొకడు వారికి ముందుగా పోవుచున్నట్లు కనిపించెను.
9. యూదా సైనికులు ప్రభువు తమపై కరుణ జూపినందుకుగాను ఆయనను స్తుతించిరి. ప్రభువు వారికి ధైర్యమును ప్రసాదించెను. కనుక వారు ఒక్కనరులనేగాక భయంకర క్రూరమృగములను, ఇనుప గోడలను గూడ పడగొట్టుటకు సమర్థులైరి.
10. వారు బారులుతీరి ముందునకు నడచిరి. ప్రభువు కరుణతో పంపిన దివ్యపురుషుడు వారితో వెళ్ళెను.
11. ఆ సైనికులు సింహమువలె శత్రుసైన్యము మీదికి దూకి పదునొకండు వేలమంది కాలిబంటులను, పదునారువందలమంది రౌతులను మట్టుబెట్టిరీ. శత్రు సైన్యమున మిగిలినవారు కాలికి బుద్ధిచెప్పిరి.
12. పారిపోయిన వారెల్లరికి గాయములు తగిలెను. వారు ఆయుధములనుగూడ కోల్పోయిరి. లీసియాసుగూడ పిరికివానివలె పారిపోయి ప్రాణములు దక్కించుకొనెను.
13. లీసియాసు ఆలోచనలేనివాడు కాదు. అతడు తన ఓటమినిగూర్చి పరిశీలించి చూచుకొని మహా బలసంపన్నుడైన ప్రభువు యూదుల తరఫున పోరాడి వారిని అజేయులను చేసి, గెలిపించెనని గ్రహించెను. కనుక అతడు యూదుల యొద్దకు దూతలనంపి,
14. న్యాయసమ్మతముగా సంధి కుదుర్చుకొందమని చెప్పించెను. రాజునకు కూడ యూదులతో స్నేహము కుదుర్తునని చెప్పించెను.
15. యూదా తన ప్రజలకు ఏది మేలో ఆలోచించి, చూచి లీసియాసు సూచించిన సంధికి అంగీకరించెను. యూదా యిస్రాయేలీయుల తరఫున లిఖితపూర్వకముగా లీసియాసునకు సమర్పించిన విన్నపములనెల్ల రాజు అంగీకరించెను.
16. లీసియాసు యూదులకు వ్రాసిన జాబు ఇది: “లీసియాను యూదులకు శుభము పలికి వ్రాయునది.
17. మీ ప్రతినిధులైన యోహాను, అబ్సాలోము మీరు పంపిన కమ్మ నాకు అందించిరి. ఆ లేఖలోని విన్నపములను అంగీకరింపుమని వారు నన్ను కోరిరి.
18. మీ విన్నపములలో రాజు స్వయముగా చూడవలసిన అంశములను అతని పరిశీలనకు పంపితిని. నాకు అధికారమున్నంతవరకు నేను అనుమతింప గలిగినవానిని రాజు అంగీకరించెను.
19. మీరు మా ప్రభుత్వమునెడల విశ్వాసపాత్రులుగా మెలగుదురేని, మీ మేలునకుగాను భవిష్యత్తులో నేను చేయవలసినదెల్ల చేయుదును.
20. మీ ప్రతినిధులును, నా ప్రతినిధులును కూడ మిమ్ము కలిసికొని ఆయా విషయములను మీతో చర్చించునట్లు ఏర్పాటు చేసితిని.
21. మీకు మేలు కలుగునుగాక! నూట నలుబది ఎనిమిదవ యేడు (క్రీ.పూ. 164) డియోస్కోరింతియసు నెల ఇరువది నాలుగవ తేదీ.”
22. రాజు వ్రాసిన జాబు ఇది: “అంతియోకసు రాజు తన సోదరుడైన లీసియాసునకు శుభములు పలికి వ్రాయునది.
23. మా తండ్రి మరణించి దేవతలలో కలిసి పోయెను. ఇకమీదట నా రాజ్యములోని ప్రజలెల్లరు వారివారి ఆచారవ్యవహారముల ప్రకారము జీవింప వచ్చును.
24. యూదులు మా తండ్రి కోరినట్లుగా గ్రీకుల ఆచారములను పాటించుటకు ఇష్టపడుట లేదనియు, తమ సంప్రదాయముల ప్రకారము తాము జీవింపగోరుచున్నారనియు నేను తెలిసికొంటిని. ఇంకను వారు తమ చట్టముల ప్రకారము తాము జీవించుటకు అనుమతి నిమ్మని నన్ను వేడుకొనిరి.
25. నా రాజ్యములోని యితర జాతులవలెనే ఈ యూదులెట్టి పీడనకు గురికాక నిశ్చింతగా జీవింపవలెనని నా కోరిక. కనుక నాశాసనమిది. ఇకమీదట యూదుల దేవాలయమును వారికి అప్పగింపవలెను. వారు తమ పూర్వుల సంప్రదాయముల ప్రకారము జీవింపవచ్చును.
26. నీవు నా నిర్ణయమును వారికి తెలియజేయుము. అప్పుడు వారు నా పరిపాలనావిధానమును అర్ధము చేసికొందురు. శాంతి సమాధానములతో మెలగుచు తమ కార్యములను తాము చూచుకొందురు.”
27. రాజు యూదులకు వ్రాసిన జాబు ఇది: “అంతియోకసు రాజు యూదుల మహాసభకును, వారి పౌరులకును శుభములు పలికి వ్రాయునది.
28. మీ కార్యములన్నియు జయప్రదముగా జరిగి పోవుచున్నవని తలంతును. నా మట్టుకు నేను క్షేమముగనే ఉన్నాను.
29. ప్రస్తుతము మీరు మీ ఇండ్లకు వెడలిపోయి మీ పనులను చూచుకోగోరుచున్నారని మెనెలాసు నాకు ఎరిగించెను.
30. కనుక మీలో క్సాంతికను నెల ముప్పదియవ తేదీకి ముందుగా ఇల్లు చేరుకొను వారెల్లరును ఎట్టి భయముకు గురికానక్కరలేదు.
31. యూదులైన మీరు పూర్వమువలెనే మీ భోజన నియమములను, ఆచార నియమములను పాటింపవచ్చును. తెలియక చేసిన నేరమునకు ఏ యూదుడు శిక్షను అనుభవింపనక్కరలేదు.
32. మీ భయములనెల్ల తొలగించుటకుగాను నేను మెనెలాసును మీ చెంతకు పంపుచున్నాను.
33. మీకు శుభము కలుగునుగాక! నూటనలుబది ఎనిమిదవయేడు' క్సాంతికసు మాసము పదిహేనవ తేది.”
34. రోము, పౌరులు కూడ యూదులకు జాబు పంపిరి: “రోము ప్రజల ప్రతినిధులైన క్వింటసు, మెమ్మియసు, టైటసు, మానియసు యూదులకు శుభములు పలికి వ్రాయునది.
35. రాజు సోదరుడు లీసియాసు మీకు ప్రసాదించిన ప్రత్యేక సదుపాయములకు మేము కూడ ఆమోదము తెలుపుచున్నాము.
36. మేము ఇప్పుడు అంతియోకియాకు వెళ్ళబోవుచున్నాము. లీసియాసు మిమ్ము గూర్చి రాజు పరిశీలనకు పంపిన అంశములు జాగ్రత్తగా పరిశీలించి చూడుడు. వానిలో మీకు ముఖ్యమని తోచిన సంగతులను మాకు వెంటనే తెలియజేయుడు. ఆ అంశములనుగూర్చి మేము రాజుకు మనవి చేయుదుము.
37. మీ అభీష్టమును తెలియజేయుచు వెంటనే యిచటికి దూతలనంపుడు. మీకు శుభము కలుగునుగాక!
38. నూటనలుదిది ఎనిమిదియవ సంవత్సరము క్సాంతికసు మాసము పదిహేనవ తేది.”