ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 10 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 10వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. యూదా మక్కబీయుడును, అతని అనుచరులును ప్రభువు నాయకత్వమున దేవాలయమును, యెరూషలేము నగరమును స్వాధీనము చేసికొనిరి.

2. వారు అన్యజాతివారు సంతపట్టున నిర్మించిన పీఠములను కూలద్రోసిరి. ఇతర స్థలములలో కట్టబడిన దేవాలయములను గూడ పడగొట్టిరి.

3. దేవాలయమును శుద్ధి చేసి దానిలో క్రొత్తపీఠమును నిర్మించిరి. చెకుముకి రాళ్ళతో క్రొత్తగా నిప్పు వెలిగించి, రెండేండ్ల తరువాత మరల బలినర్పించిరి. సాంబ్రాణిపొగ వేసి దీపములు వెలిగించి సాన్నిధ్యపు రొట్టెలను సమర్పించిరి.

4. ఈ ఆరాధన ముగిసిన తరువాత ఎల్లరును బోరగిలబడి దేవునికి మ్రొక్కి తమను మరల ఇట్టి కడగండ్లపాలు చేయవలదని వేడుకొనిరి. ఒకవేళ తాము పాపముచేసినచో ప్రభువు తమను కరుణతో శిక్షింపవలలయునేగాని క్రూరులైన అన్యజాతివారికి అప్పగింపరాదని మనవిచేసికొనిరి.

5. కీస్లేవు నెల ఇరువదియైదవదినమున వారు దేవాలయమును శుద్ధిచేసిరి. పూర్వము అదియే దినమున అన్యజాతివారు దానిని అమంగళము చేసియుండిరి.

6. గుడారముల పండుగ వలె ఈ శుద్ధీకరణోత్సవము కూడ ఎనిమిది నాళ్ళు జరిగెను. వారు తాము కొలదినాళ్ళు క్రితమే గుడారముల పండుగ చేసికొంటిమనియు అప్పుడు వన్య మృగములవలె కొండలలో తిరిగి గుహలలో వసించితి మని జ్ఞప్తికి తెచ్చుకొనిరి.

7. కాని ఇప్పుడు పచ్చని ఖర్జూర పత్రములను, ఆకులు చుట్టిన కఱ్ఱలను చేపట్టి ఠీవిగా నడచుచు, తన మందిరమును విజయవంతముగా శుద్ధిచేయించిన ప్రభువును కీర్తించిరి.

8. ఆ ఉత్సవమును ప్రతియేడు చేసికోవలయునని ఎల్లరును కూడిన సభలో శాసనము చేయించిరి.

9. పైన చెప్పిన రీతిగ అంతియోకసు ఎపిఫానెసు కాలధర్మము చెందెను.

10. ఇక మీదట ఈ నాస్తికుని పుత్రుడు అంతియోకసు యూపతోరు గూర్చి చెప్పవలసియున్నది. అతని యుద్ధమువలన కలిగిన కీడును గూర్చియు సంగ్రహముగా వివరింపవలసియున్నది.

11. యూపతోరు రాజు కాగానే లీసియాసును తన రాజ్యమునకు మంత్రిని చేసెను.

12. అతనిని ప్టోలమీ మాక్రోనునకు బదులుగా పెద్దసిరియాకు పాలకునిగా గూడ నియమించెను. యూదులను న్యాయబుద్దితో పరిపాలించిన వారిలో ఈ మాక్రోను మొదటివాడు. అతడు యూదులకు కలిగిన అపకారములను తీర్చుటకు వారితో శాంతియుతమైన సఖ్యసంబంధములు పెంపొందించుకొనెను.

13. అందువలన రాజమిత్రులు యూపతోరు వద్దకు వెళ్ళి మాక్రోను రాజద్రోహి అని అతడిమీద నిందమోపిరి. మాక్రోను ఫిలోమేటరు రాజు తన ఆధీనమున ఉంచిన సైప్రసు ద్వీపమును వదలివేసెను. అంతియోకసు ఎపిఫానెసు మరుగు జొచ్చెను కనుక అందరు అతనిని ద్రోహియని నిందింపజొచ్చిరి. అతడు తాను చేపట్టిన పదవికి గౌరవము చేకూర్పజాలడయ్యెను. కడన విషము త్రాగి  చచ్చెను.

14. గోర్గియాసు ఇదూమియాకు రాష్ట్ర పాలకుడయ్యెను. అతడు కూలిబంటులను ప్రోగుజేసికొని మాటిమాటికి యూదులమీదికి దాడిచేసెడివాడు.

15. ఇదూమీయులు కూడ ముఖ్యమైన కోటలను తమ వశములో నుంచుకొని యూదయాను తిప్పలు పెట్టజూచిరి. వారు యెరూషలేమునుండి పారిపోయి వచ్చిన తిరుగుబాటుదారులగు యూదులకు ఆశ్రయమిచ్చిరి. ఎల్లయెడల యుద్ధములను రెచ్చగొట్టిరి.

16. కనుక యూదా మక్కబీయుడు అతని అనుచరులు ప్రార్ధనాపూర్వకముగా ప్రభువు సహాయము అర్ధించి బలముతో పోయి ఇదూమీయుల కోటల మీదపడి పోరాడిరి.

17. వారు ఆ కోటల ప్రాకారమును రక్షించు వారిని చిత్తుచేసిరి. తమకు చిక్కిన వారినెల్ల రెండువేల మంది వరకు వధించిరి.

18. శత్రువులలో తొమ్మిది వేలమంది రెండు బలమైన దుర్గములలో దాగుకొనిరి. వారు ముట్టడి కాలమునకు వలసిన వస్తుసంభారములను కూడ చేకూర్చుకొనియుండిరి.

19. అప్పుడు యూదా అత్యవసరముగా మరియొకచోటికి వెళ్ళవలసి వచ్చెను. కనుక అతడు సీమోనుని, యోసేపుని, జక్కయను, అతని అనుచరులను శత్రువులతో పోరాడుటకు నియమించెను. ముట్టడిని కొనసాగించుటకు ఈ నాయకుల సైన్యములు చాలును.

20. కాని సీమోను సైనికులు ధనాశతో డెబ్బదివేల వెండినాణెములు లంచముపుచ్చుకొని శత్రువులలో కొందరిని పారిపోనిచ్చిరి.

21. ఈ సంగతి విని యూదా సైనికాధికారుల నెల్ల ప్రోగుజేసెను. యుద్ధమున శత్రువులను పారిపోనిచ్చి, వారు తమమీద పోరాడుటకు అవకాశము కలిగించుట అనగా తమ పక్షము వారిని శత్రువులకు అమ్మివేయుటతో సమానమేయని పలికెను.

22. అటుపిమ్మట అతడు లంచము పుచ్చుకొన్నవారిని మట్టుపెట్టించి, శత్రు దుర్గములను రెండిటిని వశము చేసికొనెను.

23. యూదా ప్రతి యుద్ధమునను గెలుపొందెడివాడు. అతడు ఈ రెండు కోటలలో ఇరువది వేలకంటె ఎక్కువమందినే వధించెను.

24. తిమొతి పూర్వమొకసారి యూదులకు ఓడిపోయెను. కాని అతడు మరల ఆసియానుండి పెద్ద అశ్వదళమును ప్రోగుజేసికొనెను. చాలమంది కూలి బంటులను గూడ సేకరించుకొనెను. అతడు ఆయుధ బలముతో యూదయాను జయింపనెంచి దండు కదలి వచ్చెను.

25. తిమొతి రాకడగూర్చి విని యూదా, అతని అనుచరులు దేవునికి మొరపెట్టిరి. వారు గోనెపట్ట కట్టుకొని, తలమీద దుమ్ము చల్లుకొనిరి.

26. పీఠము మెట్లమీద బోరగిలబడి ప్రభువును తమకు సహాయము చేయుమని మనవిచేసిరి. ప్రభువు ధర్మశాస్త్రమున ప్రమాణము చేసినట్లే తమ శత్రువులకు శత్రువు కావలెనని వేడుకొనిరి.

27. యూదులు ఇటుల ప్రార్థనచేసి, ఆయుధములు తాల్చి యెరూషలేమునుండి చాలదూరము వరకు పయనము చేసిరి. రాత్రి శత్రువుల చేరువలోనే బసచేసిరి.

28. తెలతెలవారుచుండగా ఇరువైపుల దండులు పోరునకు తలపడెను. యూద సైన్యము తమ పరాక్రమముమీదను, దైవబలముమీదను ఆధారపడెను. శత్రుసైన్యము తమ సాహసముమీద ఆధారపడెను.

29. పోరు ముమ్మరముగా సాగునప్పుడు ఐదుగురు దివ్యపురుషులు బంగారు కళ్ళెములు తాల్చిన గుఱ్ఱములనెక్కి యూదులకు ముందుగా నడచుటను శత్రువులు చూచిరి.

30. వారిలో ఇద్దరు యూదాకిరు ప్రక్కల నిలిచి గాయపడకుండ అతనిని తమ ఆయుధములతో సంరక్షించిరి. శత్రువులమీద మాత్రము బాణములను పిడుగులను కురిపించిరి. కనుక విరోధులు కలవరము చెంది చిందరవందరగా పారిపోయిరి. యూదులు వారిమీదబడి వారిని చిత్రవధ చేసిరి.

31. రెండువేల ఐదువందలమంది కాలిబంటులను, ఆరువందలమంది అశ్వికులను వధించిరి.

32. తిమొతి పారిపోయి గేసేరు దుర్గమున దాగుకొనెను. అది మిక్కిలి బలమైనకోట. అతని సోదరుడైన కాయిరెయసు దానికి అధిపతి.

33. యూదా అతని అనుచరులు నాలుగునాళ్ళ పాటు పట్టుదలతో ఆ కోటను ముట్టడించిరి.

34. ఆ దుర్గ నివాసులు తాము అభేద్యమైన స్థానమున ఉన్నామని తలంచి, యూదులను, వారి దేవుని దుర్భాషలతో నిందించిరి.

35. ఈ దుర్భాషలకు ఆగ్రహముచెంది యూదా సైనికులలో ఇరువదిమంది యువకులు ఐదవనాటి వేకువన ధైర్యముతో కోట గోడనెక్కిరి. వారు మహారోషముతో కోటమీద కనిపించిన వారినెల్ల చిత్ర వధచేసిరి.

36. ఆ సమయముననే మరియొక బృందము కూడ కోటకు అవతలి ప్రక్కనున్న గోడలనెక్కి బురుజులను తగులబెట్టిరి. దూషణములు పలికిన వారిని మంటలో కాల్చివేసిరి. ఇంకొక బృందమువారు ద్వారములను పడగొట్టి పట్టణమును పట్టుకొనుటకుగాను తమ వారిని లోనికి పంపిరి. వారు ఆ నగరమును ఆక్రమించిరి.

37. తిమొతి ఒక తొట్టిలో దాగుకొనెను. యూదా సైనికులు అతనిని, అతని సోదరుడు కాయిరేయసును, అపోల్లోఫానెసును పట్టుకొని వధించిరి.

38. ఈ పోరాటమెల్ల ముగిసిన తరువాత వారు గీతములతోను, కృతజ్ఞతాస్తుతులతోను ప్రభువును కొనియాడిరి. అతడు మహాకృపతో యిస్రాయేలీయులకు విజయము దయ చేసెనుగదా!